దత్తబోధ
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.
గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.
ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.
ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి


