breaking news
Spiritual life
-
ఐరావతం సాయం
సుందరవనంలో ఐరావతం అనే ఒక ఏనుగు ఉండేది. అది అన్నింటికీ సాయం చేసేది. ఇలా ఉండగా, ఒకరోజు ఒక జింక పిల్ల ఆహారం కోసం బయలుదేరింది. దానికి ఎదురుగా ఆకస్మికంగా ఒక పెద్దపులి కనబడింది. వెంటనే అది ఆ పెద్దపులిని చూసి భయంతో ఆగిపోయింది. ఆ పులి భయానికి అది తప్పించుకోవడానికి దారి లేక అది తనకు చావు తప్పదని భావించి అక్కడ ఉన్న చోటనే కళ్ళు మూసుకొంది.ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన ఐరావతం అది చూసి, పరిగెత్తి వస్తున్న ఆ పులిని ఆగమని చెప్పింది. కానీ ఆ పెద్దపులి దాని మాటను పట్టించుకోకుండా ఆ జింక పైకి దూకాలని పరుగున వచ్చింది. వెంటనే ఆ ఐరావతం ఆ కళ్ళు మూసుకున్న ఆ జింకను తన తొండంతో ముందుకు ఒక్క తోపు తోసింది.ఆ జింక కొంత ముందుకు వెళ్లి నేలపై పడిపోయింది. ఆ పులి తన పరుగును అదుపులో పెట్టుకోలేక అడ్డుగా అక్కడ జింక లేకపోవడంతో దాని వెనుక ఉన్న గోతిలో అమాంతంగా పడిపోయింది. ఆ జింక కళ్ళు తెరిచి చూసి తన ప్రాణాలు దక్కాయని సంతోషించి తనకు సాయం చేసిన ఏనుగుకు ధన్యవాదాలు తెలిపి సంతోషంతో వెళ్ళిపోయింది ఆ గోతిలో పడిన పెద్దపులి ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నీవు అందరికీ సాయం చేస్తావే! మరి నన్ను కూడా కాపాడవా!’ అని అరిచింది.వెంటనే ఏనుగు ‘ఓ పులి రాజా! నేను ఆగమని చెబితే నీవు నా మాట వినలేదు. ఇక్కడ గొయ్యి ఉందని నాకు తెలిసే నేను నిన్ను ఆగమన్నాను. కానీ నీవు ఆగకుండా ఆ జింకపై దాడి చేయాలని చూశావు. అందుకే దాన్ని ముందుకు తోసి కాపాడాను. ఇప్పుడు నిన్ను కూడా కాపాడుతాను. నీవు భయపడకు’ అని కొన్ని కలప దుంగలను, ఆకులు అలములు తెచ్చి ఆ గోతిలో వేసి దానిని కూడా కాపాడింది. ఆ పులి కూడా ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయింది. తర్వాత ఆ ఏనుగు నడిచి పోతుండగా, దానికి ’కాపాడండీ! కాపాడండీ’ అని అరుపులు వినిపించాయి. ఆ ఏనుగు పరుగున వెళ్లి ఆ అరుపులు వచ్చిన వైపుకు వెళ్లింది.అక్కడ దానికి ఒక చిట్టి చిలుకను పట్టుకున్న ఒక నక్క కనిపించింది. ఆ చిట్టి చిలుక ఆ ఏనుగును చూసి, ‘ఓ ఐరావతమా! నన్ను ఈ నక్క నుండి కాపాడవా!’ అని దీనంగా అరచింది. ఆ ఏనుగు అది విని నక్కతో ఆ చిలుకను వదిలిపెట్టమని కోరింది. కానీ ఆ నక్క దాని మాటను వినలేదు. ‘ఓ ఐరావతమా! నేను దొరికిన ఆహారాన్ని వదలిపెట్టేంత మూర్ఖురాలిని కాదు. నీవు ఇక్కడి నుండి వెళ్లు’ అంది. అప్పుడు ఏనుగు ఒక కర్రను తన తొండంతో తీసి ఆ నక్క పైకి విసిరింది. ఆ నక్కకు ఆ కర్ర తాకి అది ‘కుయ్యో! మొర్రో!’ అని అరిచింది. వెంటనే దాని నోరు వదులై ఆ నోటిలోంచి ఊడిపడ్డ చిట్టి చిలుక రివ్వున ఎగురుకుంటూ ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. తనపై కర్రను విసరిన ఏనుగును చూడగానే నక్కకు చాలా కోపం వచ్చింది. అది ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నాకు ఆహారం లేకుండా చేస్తావా! నీ సంగతి మృగరాజు సింహానికి చెబుతాను’ అని సింహం వద్దకు వెళ్లి ఐరావతం తనపై కర్రతో దాడి చేసిందని ఫిర్యాదు చేసింది.సింహం నవ్వి ‘నీవు చిట్టి చిలుకను పట్టుకొన్నావన్న సంగతి చెప్పడం లేదెందుకు? నాకు ఒక కాకి అంతా చెప్పిందిలే! ఆ చిట్టి చిలుకను నీవు పట్టుకొంటావా! చిన్న పిల్లల్ని పట్టుకోవద్దని, వారికి హాని చేయవద్దని నేను నీకు చెప్పలేదా! నీకు తగినశాస్తి జరిగింది’ అని నక్కను మందలించింది. నక్క చేసేది లేక ఉస్సూరుమనుకొంటూ అక్కడి నుంచి కదిలింది. తర్వాత ఆ సింహం ఐరావతాన్ని పిలిపించి అది చేసిన సాయానికి మెచ్చి, దానిని జంతువుల ముందు ప్రశంసించి ఘనంగా సత్కరించింది. - సంగనభట్ల చిన్న రామకిష్టయ్య హిత వచనం..తనతో ఏ వైరం లేకుండా సుఖంగా ఉన్నవాడికి దుఃఖం కలిగించినవాడు జన్మజన్మాంతరాలలో దుఃఖం పొందుతాడు. ఇందులో సందేహం లేదు. -
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్‌లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్‌లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
సహనం ఒక వెలుగుబాట
ఉపకోసల కామలాయనుడు సత్యకామ జాబాలుని ఆశ్రమంలో శిష్యునిగా 12 సంవత్సరాల΄ాటు గురు శుశ్రూష చేస్తూ, యజ్ఞాగ్నులకు శ్రద్ధతో సేవచేసాడు. అతని వినయం, క్రమశిక్షణ, సేవాభావం అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు గురువుగారు ఇతర శిష్యులకు విద్యను బోధించి వారిని యింటికి పంపించేశారు.ఉపకోసలునికి మాత్రం బ్రహ్మవిద్య బోధించకుండా ప్రయాణమై వెళ్ళిపోయారు. గురుపత్నికి ఇది బాధ కలిగించి గురువుగారితో అంది ‘‘ఉపకోసలుడు ఎన్నో సంవత్సరాలు నిష్ఠగా సేవచేశాడు. అతనికి కూడా జ్ఞానం బోధించండి’’ అంది. కానీ గురువుగారు పట్టించుకోలేదు. ఉపకోసలునికి నిరాశ కలిగినా గురువుగారిపై కోపంగాని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడంగాని, తన సేవను ఆపడం గాని చేయలేదు. తన మనసును పవిత్రంగా ఉంచుకుంటూ ఉపవాసం చేశాడు. అతని భక్తికి, సహనానికి ముగ్ధులై ఆశ్రమంలోని 3 యజ్ఞాగ్నులు (గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని) అతనితో మాట్లాడి అతనికి బ్రహ్మ తత్వంలోని అనేక రహస్యాలు బోధించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాయి. (యజ్ఞాగ్నులు ఉపకోసలునితో మాట్లాడినట్టు చెప్పడం ఒక ప్రతీకాత్మక బోధన.)గురువు గారు తిరిగివచ్చిన తరువాత ఉపకోసలుని ముఖంలో అపూర్వమైన తేజస్సు చూసి ‘‘నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు బోధించారు’’ అని అడిగారు. ఉపకోసలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు గురువుగారు అగ్నులు బోధించిన జ్ఞానాన్ని సంపూర్ణం చేస్తూ బ్రహ్మస్వరూ΄ాన్ని పూర్తిగా ఉపదేశించాడు. ఉపకోసలుని సహనం ఫలించింది. గురుభక్తి వృథాకాలేదు. నిష్కామ సేవ మనసుని శుద్ధిచేసి జ్ఞాన΄ాత్రుని చేసింది. ఓర్పుతో, విశ్వాసంతో, నిష్ఠతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృథాకాదు. సమయమొచ్చినపుడు అది విజయాన్ని, జ్ఞానాన్ని, అంతరంగ వికాసాన్ని ప్రసాదిస్తుంది. బాహ్య దృష్టితో చూస్తే యజ్ఞాగ్నులు యజ్ఞకుండంలో వెలిగే అగ్నులు. అంతర్గతంగా అవి మనలోని జ్ఞానానికి, శ్రద్ధకు, భక్తికి, ఆత్మ జిజ్ఞాసకు ప్రతీకలు.– డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
ప్రత్యామ్నాయంలేని ప్రేమ యాత్రలు
దేవుని వరమైన మెస్సీయాను, ఆ మెస్సీయ అనబడే క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఊహించనైనా ఊహించలేము. ప్రేమకు ప్రతిరూపం అయినా ఆయన ప్రేమయాత్రలకు కూడా ప్రత్యామ్నాయాలు కనుగొనలేము. యేసు జీవితాన్ని ఆయన ప్రేమ సంబంధ పాదయాత్రలను వేరు చేసి ఎన్నడూ చూడలేము. తల్లిదండ్రులకు లోబడుతూ పెద్దలైన మనుష్యులు దయయందును, దేవుని దయయందును వర్ధిల్లిన బాల్యజీవితం యేసుది.బాలయేసు కార్టూన్ చిత్రాలలో ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకాశంలో విహరించక పిల్లలను నైతిక విలువలతో అలరించడమే కాక పెద్దల పర్యవేక్షణలో సత్ప్రవర్తనతో మెలిగేలా ్రపోత్సహించడం విశేషం. అన్ని భాషల్లోని నవలా నాయకులు లేదా సినిమా, టీవీ కథానాయకుల (ప్రోటోగనిస్ట్స్) పాత్రల సృష్టిలో, ఈనాటి నేటి ఏఐ ఆధారిత వీడియోల ముఖ్య ప్రధాన పాత్రలలో వాటి ఉన్నతమైన వైవిధ్య విధాన రూపకల్పనలలో, మరి ముఖ్యంగా ‘హీరోహోదా’ కోసం యేసు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన బోధలు, మాటలను పోరాటపటిమ స్ఫూర్తిని వాడుతూ డబ్బు చేసుకుంటున్న నిర్మాతలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి కొదువలేదు.వ్యక్తి పూజకు చోటిచ్చేలా సంతోషానందాలు ఇవే అనుకొనే భ్రమలలోనే అమాయక యువత చిక్కుకొని తమ విలువైన సమయం వెచ్చిస్తూ వినోదం కొనుక్కొనే వేళలలోనే ఇట్టి నయా ప్రేక్షకులను తెరనాయకులు థియేటర్లలో ఆకస్మికంగా వారిని దర్శించడం కంటె కూడా... బాధితులను, రోగులను, బీదలను, వృద్ధులను, నిరుపేద విద్యార్థులను ఆదుకొనేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరామర్శించటం ఆదరించడం నిజమైన నాయకుల సహజ స్వాభావిక దైవిక లక్షణంగా అది ఎంచదగ్గదే. మేలైన రీతులలో వారిని గుర్తించదగ్గదే. ఎక్కడో మారుమూల పల్లెలతో పాటుగానే, నిలువనీడ లేనివారై ΄÷ట్ట చేతపట్టుకొని వచ్చి నగరాలను నిర్మించే వలస కార్మిక శ్రమజీవులు ఎక్కడున్నా వారి గుడారాల చెంతనే వారిని పరామర్శిస్తూ వారికి న్యాయసంబంధ సేవలందించడం క్షేత్రస్థాయి పర్యటనే.నిజానికి బీదలు, రోగులు, ఖైదీలను దైవిక ప్రేమతో పరామర్శించి వారికి ధైర్యం నూరిపోస్తే ఇలా క్రియరూపాన ఆ గొప్పదైన ప్రేమను అంతటా కనబరిస్తే మీరు నన్నే ప్రేమించినట్టు అని యేసే స్వయంగా చెప్పడం విశేషం. గొప్ప గొప్ప నాయకులకే చెల్లును పాదయాత్రలు అంటూ అవి వారికే పరిమితం చేయక ఇలా ఎవరికి వారు అనుకోక వ్యక్తుల మేలు కోరి వ్యక్తిగతంగా దూర భారాలను లెక్కచేయక యేసును బట్టి యేసు ప్రేమతో యేసు మెప్పు పొందేలా ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు.భవిష్యద్దర్శనం వాస్తవంలోనే నిలబెట్టి గెలిపిస్తుంది. కలల్లో ఊహల్లో సంచరిస్తూ గాల్లోతేలియాడడం కాక నేలమీదనే హుందాగా నిలబడడం నాయకత్వం. నడక నాయకత్వ లక్షణం కూడానూ. సకాలంలో స్పందించేలా నేరుగా వచ్చి అతి దగ్గరగా సమస్యలను వాటి ప్రభావ విపత్తులను చూసేలా వాటి పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా కృషి చేసేలా ఇలా సామాన్య జనంబాట పడుతూ దీనజనుల పరామర్శకు, బాధితుల ఓదార్పుకు నాయకుడనేవాడు తన పాదాలను నమ్ముకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ఇలాంటి వీరే యేసువలె విజయ సృష్టికర్తలుగా, తిరుగులేని నాయకులుగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకోగలుగుతారు.– జేతమ్ -
ప్రకృతి గుండె చప్పుడు విందాం
మన్హా.. పదేళ్ల పసిపాప. ఆమెకు అడవి అంటే కేవలం చెట్లు కాదు, అది ఆమె ప్రాణ స్నేహితురాలు. తన చిన్నారి చేతులతో అల్లిన వెదురు బుట్టలో సేకరించిన విత్తనాలను తీసుకుని ఆమె అరణ్యంలోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ ఆమె రాకను గమనించిన పక్షులు, ఒకదానికొకటి వార్తను పంచుకుంటూ ఆమె చుట్టూ వందలాదిగా చేరేవి. అవి ఆమె భుజాల మీద, తల మీద వాలుతూ ఒక అపురూపమైన ఆత్మీయతను పంచేవి. మన్హా విత్తనాలను నేలపై చల్లుతుంటే, అవి ముత్యాలను ఏరుకున్నట్లు గింజలను ఏరుకుంటూ చేసే ఆ ‘కిలకిలలు’ ఆమె ప్రపంచానికి సంగీతం.కానీ ఆ రోజు, ఆమె అడుగుల చప్పుడు తప్ప అడవిలో మరే శబ్దమూ లేదు. ఆకాశం నీలి రంగును కోల్పోయి, ఏదో తెల్లని పొగమంచులాంటి దుమ్ముతో నిండిపోయింది. ఆమె పరుగు పరుగున తన అభిమాన రావి చెట్టు దగ్గరకు వెళ్లింది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వృక్షం, ఇప్పుడు ఒక అస్థిపంజరంలా కనిపిస్తోంది. దాని ఆకులన్నీ రాలిపోయి, ఆ కొమ్మలు ఆకాశం వైపు చూస్తూ, ‘నన్ను కాపాడండి’ అని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘నా స్నేహితులు ఏమయ్యారు? ఆ చిన్న పిచ్చుకమ్మ ఏది? నీలి రంగు రెక్కల పిట్ట ఏమైంది?’ అని మన్హా ఆ చెట్టును తాకుతూ వెక్కి వెక్కి ఏడ్చింది.అక్కడే ఒక బండరాయిపై కూర్చున్న వృద్ధ కాపరి, తన చిరిగిన కంబళిని సరిచేసుకుంటూ కన్నీరు నిండిన కళ్లతో అన్నాడు.. ‘అమ్మాయి.. అవి ఇక రావు. ఈ గాలిలో విషం ఉంది. మనం చేస్తున్న గనుల తవ్వకాలు, ఆ యంత్రాల కర్కశపు శబ్దాలు, పర్వతాలను పగులగొడుతున్న బాంబుల మోతలు.. ఆ సున్నితమైన జీవాలు భరించ లేకపోయాయి. చెట్టుప్రాణం పోయింది, పిట్ట రెక్క విరిగిపోయింది. మనిషి తన కడుపు నింపుకోవడానికి ఈ అడవి తల్లి కడుపును కోసేస్తున్నాడు’.మన్హాకు ఆ మాటలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె చేతిలోని విత్తనాలు నేలపై జారిపోయాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే అడవి, ఇప్పుడు ఒక ఎండిన ఎడారిలా ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది.ఈ చిత్రం కేవలం ఒక ఊరుకో, ఒక అడవికో పరిమితం కాదు. భూమికి ఒక వైపున, మంచు ఖండాలు కన్నీరులా కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. బంగారం, బొగ్గు, చమురు.. ఇవి మనిషికి సంపద కావచ్చు, కానీ ప్రకృతికి అవిప్రాణాధారాలు. మనిషి తన స్వార్థంతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంటే, భూమి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఊపిరి అందని నగరాలు, పంటల్లేని పొలాలు, అకాల వరదలు, అంతుచిక్కని వ్యాధులు.. ఇవన్నీ భూమి తల్లి పెడుతున్న కేకలు! కానీ.. ఈ విషాదంలోనూ ఒక చిన్న ఆశ మిగిలి ఉంది.మరుసటి రోజు కూడా మన్హా నిరాశ చెందలేదు. తన కళ్లను తుడుచుకుని, మళ్లీ బుట్ట నిండా విత్తనాలు నింపుకుని అడవికి వెళ్ళింది. పక్షులు లేవని ఆమెకు తెలుసు, కానీ అవి వస్తాయన్న నమ్మకం ఆమెది. అకస్మాత్తుగా, ఎండిపోయిన ఒక కొమ్మ చివర నుండి ఒక సన్నని గొంతు వినిపించింది. అది ఆమెకు బాగా తెలిసిన ఆ చిన్న పిచ్చుక! అది నీరసంగా ఉన్నా, మన్హా వైపు చూస్తూ రెక్కలు ఆడిస్తోంది.ఆ ఒక్క పక్షి మన్హాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది: ‘నువ్వు ఒక్క అడుగు ముందుకేసి ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టు, నేను మళ్లీప్రాణం పోసుకుంటాను.‘ మన్హా నాటుతున్న ఆ చిన్న విత్తనం రేపు ఒక మహావృక్షం కావాలి. మనందరిలోనూ ఆ మన్హా మేల్కొనాలి. లేదంటే, ప్రకృతి లేని ప్రపంచంలో మనిషి కూడా ఒక శిలాజంలా మిగిలి పోవాల్సి వస్తుంది.– ముహమ్మద్ ముజాహిద్ -
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా..
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
Travel: మంచు పర్వతాలలో మహానుభూతి..
మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి. అమర్నాథ్ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.జమ్మూ అండ్ కశ్మీర్లో ఉన్న అమర్నాథ్ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం.. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు... అనుభవంలో ఉంటుంది.సందర్శనీయ ప్రదేశాలుఅమర్నాథ్ యాత్రలో పహల్గామ్ రూట్ చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్ వారి దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్ చేస్తుంది.శేష్నాగ్ లేక్ దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది.యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్ లేక్ పై హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మొఘల్ గార్డెన్స్‌లో నడవడం, లోకల్ బజార్లో కశ్మీర్ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి.కశ్మీర్ క్యూజిన్ లో దమ్ ఆలూ, రాజ్మా చావల్, కావా టీ, కశ్మీరీ రోటీ లాంటి సింపుల్ డిషెస్ చల్లని వాతావరణంలో ఇంకా రుచిగా అనిపిస్తాయి. లోకల్ టీ స్టాల్స్ దగ్గర దొరికే గరం గరం చాయ్ అనేది జర్నీ మధ్య ఒక చిన్న బ్రేక్‌ని మెమొరబుల్ చేస్తుంది.ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఏప్రికాట్స్ టేస్ట్ చేస్తూ లోకల్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీ భోజనం అక్కడి వాతావరణం లాగే సింపుల్‌గా, ఆథెంటిక్‌గా ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరుకుతాయి. ఫ్లైట్‌లో హిమాలయాలపై ప్రయాణిస్తున్న సమయం నుంచే ఈ యాత్ర ఫీలింగ్ మొదలవుతుంది.శ్రీనగర్ చేరుకున్న తరువాత రోడ్డు మార్గంలో పహల్గామ్ లేదా బాల్టాల్ వరకు వెళ్లవచ్చు. ఈ రోడ్ ట్రిప్‌లో కశ్మీర్ వ్యాలీ అందాలు ప్రతీ విండో ఫ్రేమ్‌ని ఒక పోస్టుకార్డ్లా మార్చేస్తాయి.విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ లేదా ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రయాణం అనేది ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా సాగుతుంది.ఏం చూడాలి?ఉదయం మంచు శిఖరాలపై పడిన వెలుగు చూడటం ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. పర్వతాల మధ్య సాగే భక్తులు, గుర్రాల సవారి, చల్లని గాలిలో ఎగురుతున్న ప్రార్థనా ధ్వజాలుం ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్ లా అనిపిస్తాయి.డాల్ లేక్‌లో శిఖారా రైడ్, లోకల్ మార్కెట్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ కశ్మీర్లో కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ షాపులు.. ఇవన్నీ చూస్తూ గడిపిన సమయం కూడా మెమొరబుల్‌గా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలుఅమర్నాథ్ గుహాలయం హిమాలయాల మధ్య సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ప్రతీ సంవత్సరం కొన్ని వారాలు ΄ాటు మాత్రమే అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తారు.మంచుతో ఏర్పడే స్వయంభు శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు.పహల్గామ్, బాల్టాల్ అనే రెండు ప్రధాన యాత్రా మార్గాల ద్వారా గుహాలయానికి చేరుకోవచ్చు.జూలై, ఆగస్టు నెలల్లో హిమాలయాల అందాలు మరింత ఆకట్టుకుంటాయి.ఎక్కడ ఉండాలి?శ్రీనగర్‌లో హౌజ్‌బోట్స్, లేక్ వ్యూ హోటల్స్, బోటిక్ స్టేస్ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. ఉదయం డాల్ లేక్‌పై పడవల శబ్దంతో మేల్కొనడం ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది.పహల్గామ్లో కాటేజీలు, హోటల్స్, నేచర్ రిసార్ట్స్‌లో చల్లని గాలి, పచ్చని చెట్లు, పర్వతాల అందాలు రోజంతా మనసుని రిఫ్రెష్ చేస్తాయి. యాత్ర మార్గంలో ఉండే క్యాంపులు కూడా హిమాలయాల మధ్య ఒక యూనిక్ స్టే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల అమర్నాథ్ యాత్రను బడ్జెట్లో ప్లాన్ చేస్తే సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతుందిప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం మంచి హోటల్స్, ఫ్లైట్స్, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంతో కలిపి రూ.70,000 నుంచి రూ.1 లక్షా 10 వేల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే టోటల్ బడ్జెట్ కాస్త పెరగవచ్చు.శ్రీనగర్ హోటల్స్‌లో పర్ నైట్ రూ.2,000 నుంచి రూ.8,000 వరకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రీమియం లేక్ వ్యూ స్టేస్ కోసం రూ.10,000 వరకు కూడా ఖర్చు చేస్తారు.ఫుడ్ కోసం ప్రతీ రోజు సగటున రూ.700 నుంచి రూ.1,500 వరకు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా వివరాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులను స్వయంగా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
గరుడతీర్థం..
ఆదిశేషుడి కొడుకు మణినాగుడు గరుత్మంతుడి భయం వల్ల కైలాసానికి వెళ్లి, పరమశివుని సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకోసాగాడు. కొన్నాళ్లకు పరమశివుడు అతడి భక్తిప్రపత్తులకు ప్రసన్నుడయ్యాడు. ‘మణినాగా! నీ భక్తికి మెచ్చాను. వరమేమి కావాలో కోరుకో!’ అడిగాడు.‘పరమేశ్వరా! గరుడుని వల్ల భయం కలగకుండా వరమివ్వు చాలు’ అన్నాడు మణినాగుడు.‘తథాస్తు’ అంటూ వరం అనుగ్రహించాడు పరమశివుడు.పరమశివుడి వరం కారణంగా భయం తొలగిన మణినాగుడు ఒకనాడు వ్యాహ్యాళిగా క్షీరసాగర తీరంలో స్వేచ్ఛగా సంచరించసాగాడు. ఇది చూసిన గరుడుడు అకస్మాత్తుగా వచ్చి, మణినాగుడిని ఎగరేసుకుపోయాడు. తన నివాసంలో అతడిని బంధించి ఉంచాడు.కైలాసంలో పరమశివుడి సన్నిధిలో అందరూ కొలువుతీరి ఉన్నారు. ‘పరమేశ్వరా! మన మణినాగుడు ఈరోజు ఎందుకో సభకు రాలేదు. అతడిని వైనతేయుడు భక్షించడమో, బంధించడమో చేసి ఉండవచ్చని సందేహంగా ఉంది’ అన్నాడు నందీశ్వరుడు.నందీశ్వరుడి మాటలతో శివుడికి తాను మణినాగుడికి ఇచ్చిన వరం జ్ఞప్తికి వచ్చింది.‘నందీశ్వరా! తక్షణమే నువ్వు క్షీరసాగరానికి వెళ్లు. శ్రీమహావిష్ణువును స్తుతించి, మణినాగుడిని విడిపించుకుని, నా వద్దకు తీసుకురా!’ అని ఆజ్ఞాపించాడు.పరమశివుడి ఆనతితో నందీశ్వరుడు హుటాహుటిన క్షీరసాగరానికి చేరుకున్నాడు. శ్రీమహాలక్ష్మి పాదాలు ఒత్తుతుండగా, శేషశయ్యపై అర్ధనిమీలిత నయనాలతో పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును దర్శించుకుని, ఆయనను వేనోళ్ల స్తుతించాడు. మణినాగుడికి పరమశివుడు వరమిచ్చిన సంగతిని, అతడిని తనతో పాటు కైలాసానికి కొనితెమ్మని ఆనతినిచ్చిన సంగతిని విన్నవించుకున్నాడు. మణినాగుడిని గరుడుడు బంధించి ఉండవచ్చని, అందువల్ల అతడిని గరుడుని చెర నుంచి విడిపించాలని అభ్యర్థించాడు.నందీశ్వరుడి మాటలను ఆలకించిన విష్ణువు వెంటనే గరుత్మంతుడిని పిలిపించాడు. గరుడుడు వెంటనే విష్ణుపాదాల ముందు వాలాడు.‘వినతానందనా! మణినాగుడిని విడిచిపెట్టి, ఈ నందీశ్వరుడికి అప్పగించు’ అని ఆజ్ఞాపించాడు.‘ప్రభూ! ఇది అన్యాయం. భృత్యులకు సంతోషకరమైన వస్తువులు ప్రభువు ఇవ్వడం లోకంలో ఉంది. నువ్వు ఏనాడూ నాకు ప్రీతిపాత్రమైన వస్తువులను ఇచ్చి ఉండలేదు సరికదా, నేను సంపాదించుకున్న వస్తువును ఇప్పడు ఇచ్చేయమంటున్నావు. నీకు వాహనాన్నై నిన్ను మోస్తూ ఉన్నాను. అందుకు నువ్వే నాకు ఏదైనా ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోగా, నేను సంపాదించుకున్న నాకిష్టమైన ఆహారాన్ని ఇచ్చేయమంటున్నావు. ఇదేమి న్యాయం? నేను మణినాగుడిని ఇవ్వలేను’ అని నిష్ఠురంగా పలికాడు గరుత్మంతుడు.గరుడిని మాటలు విన్న శ్రీమహావిష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ, ‘వైనతేయా! నువ్వు నన్ను మోస్తూ ఉన్నందునే కృశించిపోయినట్లున్నావు. అయినా, నువ్వు బలశాలివి సుమీ! ఏదీ కాస్త నా చేతి వేలిని నీ తలమీద కాసేపు మోయి’ అంటూ గరుడుని శిరస్సు మీద వేలు ఉంచాడు.గరుడుని తల అతడి ఉదరభాగం వరకు కుంగిపోయింది. గరుడు విలవిలలాడాడు. ‘దేవాదిదేవా! జగన్నాథా! పాహిమాం! పాహిమాం! నా అపరాధాన్ని మన్నించి, కాపాడు’ అని గగ్గోలు పెట్టాడు. ‘జగన్మాతా! నీవైనా దయతలచి నన్ను కాపాడు’ అని లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ‘నాథా! వైనతేయుడిని రక్షించండి’ అని అభ్యర్థించింది లక్ష్మీదేవి.అప్పుడు శ్రీమహావిష్ణువు నందీశ్వరుడి వైపు చూసి, ‘నందీశ్వరా, మణినాగుడితో పాటు ఈ గరుత్మంతుడిని కూడా పరమేశ్వరుని సన్నిధికి తీసుకుపో! దయామయుడైన పరమేశ్వరుని కటాక్షంతో ఇతడి శరీరం యథాస్థితికి రాగలదు’ అని పలికాడు. నందీశ్వరుడు తనతో పాటు మణినాగుడిని, గరుత్మంతుడిని తీసుకుని కైలాసంలో పరమశివుని సన్నిధానానికి చేరుకున్నాడు. శ్రీమహావిష్ణువు సన్నిధానంలో జరిగినదంతా పరమశివుడికి విన్నవించాడు.పరమశివుడు ప్రసన్నంగా గరుత్మంతుడిని చూసి, ‘వైనతేయా! దిగులు పడకు. పవిత్ర గౌతమీ తీరానికి వెళ్లి, గౌతమీ జలాల్లో స్నానమాచరించు. నీ పూర్వశరీరాన్ని, దారుఢ్యాన్ని పొందగలవు’ అని పలికాడు.పరమశివుడి ఆనతిపై గౌతమీ జలాల్లో స్నానమాచరించాక గరుత్మంతుడికి పూర్వరూపం వచ్చింది. గరుత్మంతుడు స్నానమాచరించిన ఆ ప్రదేశమే గరుడ తీర్థంగా ప్రసిద్ధి పొందింది.- సాంఖ్యాయన -
ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో!
ఒకరోజు ద్వారకలో, ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో! మంచి పనులు చేసిన వారు ధన్యులు అని అందరూ అంటారు. కానీ మంచి పనులు చేసిన వారు ఎవరు? ఎక్కువ దానధర్మాలు చేసేవారా? గొప్ప యజ్ఞాలు చేసేవారా?’ అని అడిగాడు. కృష్ణుడు ఆ యువకుడిని ఒక దేవాలయం దగ్గరకు తీసుకెళ్లాడు. ఒక వృద్ధుడు మౌనంగా ఆలయ ప్రాంగణం శుభ్రం చేసుకుంటున్నాడు.కృష్ణుడు ఆ యువకుడితో ‘రా! అతనికి తెలియకుండా రోజంతా మనం ఇతనిని అను సరిద్దాం’ అన్నాడు. వృద్ధుడు తన ఆహారంలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్న కుక్కకు ఇచ్చాడు. దేవాలయా నికి వచ్చిన ఒక పేద వృద్ధురాలికి నీళ్ళు ఇచ్చి, తన చేతిలో ఉన్న కొన్ని నాణేలను కూడా ఇచ్చాడు. ఆలయ మార్గంలోని ముళ్ళను, రాళ్లను తొలగించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేముందు, ఇలా ప్రార్థించాడు: ‘కృష్ణా! ఈ రోజు నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే, దానిని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను.’ఇది చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ‘ప్రభో! ఇదేనా పుణ్యం? పెద్ద దానాలు లేవు, యజ్ఞాలు లేవు.’ కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు: ‘విజయం అనేది చేసిన పని వల్ల వచ్చే కీర్తిలో లేదు; అది ఆ పని చేసే హృదయపు నిర్మలత్వంలో ఉంది. ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని నిలబెట్టేవాడు పుణ్యపురుషుడు’.అప్పుడు ఆ యువకుడు మళ్ళీ అడిగాడు: ‘అయితే, ప్రభూ, సద్గుణ ఫలం ఏమిటి?’ అందుకు కృష్ణుడు ‘సద్గుణానికి గొప్ప ఫలం సంపదగానీ, కీర్తిగానీ కాదు. ప్రపంచమంతా అతణ్ణి విడిచి పెట్టినా, నన్ను చేరే మార్గం అతని హృదయంలో ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. అదే సద్గుణానికి నిజమైన ఫలం’ అన్నాడు. సద్గుణం స్వర్గానికి మార్గం కాదు; అది భగవంతుని హృదయాన్ని చేరే మార్గం!– యామిజాల జగదీశ్ -
సంతోషాన్ని ప్రకటించడానికి 'నవ్వు' చాలు..
నవ్వే ఆరోగ్యం అని, ఔషధం అనీ కొందరంటుంటే అందానికి చిహ్నం అని మరికొందరు అంటున్నారు.. నవ్వుల రేడు చార్లీ చార్లిన్ నవ్వలేని రోజు వృథా అంటాడు... శతకాల్లో నవ్వును గురించి పెద్దలు ఏం చెప్పారో తెలుసుకుందాం.సభల్లో, పెద్దల ముందు ఎవరిని చూసి నవ్వకూడదో సుమతీ శతకంలో బద్దెన చెప్పాడు...‘నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీతల్లిదండ్రి నాధులతోడన్నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ‘తాను చెప్తున్నది లోకనీతి అంటూ ఎవరితో అపహాస్యంగా నవ్వకూడదో ఒక జాబితా తయారు చేశాడు బద్దెన. ఏడు శతాబ్దాలు దాటినా బద్దెన చెప్పిన మాటలు ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనువర్తించేలా ఉంటాయి..వేమన ‘కల్మషం లేని నవ్వును, నిర్మలమైన మనస్సులేని నవ్వును నిజమైన నవ్వు కాద’ని తీర్పే ఇచ్చాడు.అదే తోవలో కపట నవ్వుని ప్రస్తావిస్తూ ఆ నవ్వు నవ్వే కాదని తేల్చేశాడు.‘మనసునందు మాలిన్యంబు మానకుండామాటలందు మైత్రి నాటింపనేలలోని కల్మషంబు లేకుండ నవ్వని నవ్వు నవ్వు గాదు నరులకెల్లవిశ్వదాభిరామ వినుర వేమ..’ అని అంటాడు.నిర్మలమైన మనసుకు నవ్వే అందం అంటాడు.‘తప్పులెన్నువారు తమ తమ తప్పులెరుగురు’ అన్నట్లు..‘తమకుగల్గు పెక్కు తప్పులునుండగా ఓగు నేరమంచు నోరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్టు విశ్వదాభిరామ వినుర వేమ ‘పద్యం లో ‘నగి’ అంటే నవ్వు గూర్చి ప్రస్తావన... చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.మరో సందర్భంలో వేమన ఏమని అంటున్నాడో చదవండి.‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వుదానహీను జూచి ధనము నవ్వుకదన భీతు జూచి కాలుండు నవ్వును ‘ఇందులో నవ్వు మాట వచ్చినా వేదాంతం గోచరిస్తుంది..ఈ రోజుల్లో భూమి కోసం హత్యలు చేస్తున్నారు... యాజమాన్యం మారుతుంది, భూమి మారదు, అందుకే నవ్వుతుందేమో.. దానం చేయమని, యుద్ధంలో పారిపోకుండా ఉండాలని యోగి భావన.భాస్కర శతకం ద్వారా ‘పరులను హేళన చేసేవాడు తానే నవ్వుల పాలవుతాడు’ చెప్పారు..సంతోషాన్ని ప్రకటించడానికి నవ్వు చాలు.. మనసారా నవ్వండి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
చదువులోనే కాదు.. జీవితాన్ని కూడా పరీక్షించాలి!
చదువులోనే పరీక్షలు కాదు. జీవితాన్ని కూడా పరీక్షించాలి. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అంటాడు పరీక్షింపబడని జీవితం వ్యర్థ జీవితమని. దీన్ని సమర్థించే సందర్భం కఠోపనిషత్తులో నచికేతుని సత్యాన్వేషణ ప్రయత్నంలో చూస్తాం. నచికేతుడు తన తండ్రి చేస్తున్న యజ్ఞయాగాదులలో ముసలి, నిరుపయోగ ఆవులను దానంగా ఇవ్వడం ఆశ్చర్యమనిపిస్తుంది. తన మదిలో ఇవే ప్రశ్నలు ‘‘ఇది సరియైనదేనా? నిజాయితీ లేని చర్యలకు విలువుంటుందా?’’ అని.తన మదిలో రగులుతున్న ప్రశ్నలకు సమాధానం తన తండ్రి నుంచి రాబట్టాలనుకుని తండ్రి నడుగుతాడు ‘‘తండ్రీ నువ్వు నన్ను ఎవరికి అర్పిస్తావు?’’ అని. పదే పదే అడుగుతున్న ఈ ప్రశ్నకి తండ్రి కోపోద్రిక్తుడై ‘‘నిన్ను యమునికి (మృత్యువుకి)సమర్పిస్తాను’’ అంటాడు. దాంతో నచికేతుడు యముని దగ్గరకు వెళ్ళి సంపద, ఆధిపత్యం, అమరత్వం కోరకుండా ‘‘మరణానంతరం ఏమవుతుంది? అసలు నిజమైన సత్యం ఏదీ...’’ అని అడుగుతాడు.యముడు నచికేతుని సంపదలు, రాజ్యం, భోగభాగ్యాలు కోరుకోమంటాడు. కానీ నచికేతుడు ఈ సంపదలు, సౌఖ్యాలు తాత్కాలికాలని...కాబట్టి ఎప్పటికీ చావులేని సత్యమే కావాలని పట్టుబడతాడు. అపుడు యముడు సంతసించి మోక్షసాధనమైన ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఇందులో గమనించాల్సింది సాధారణంగా మనుషులు అలవాట్లను, ఆచారాలను, కోరికలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. కానీ నచికేతుడు జీవితాన్ని ప్రశ్నించుకొని, పరీక్షించుకొని తప్పొప్పులు, శాశ్వత–అశాశ్వతాలు, అసలు జీవిత లక్ష్యం ఏమిటి? ఈ శరీర పతనానంతరం నేను ఎవరిని... లాంటి ప్రశ్నలతో పయనించడం వలన సత్యాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందగలిగాడు. సుఖభోగాలతో వెంటాడే జీవితం అసంపూర్ణం, స్వ పరిశీలన, అనుభవం మాత్రమే అర్థవంత జీవితానికి మూలం. ఇదే ఈ కథ మనకిచ్చే సందేశం. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
మార్గదర్శకమైన యాత్ర
ఒకడు మంచిగా ప్రవర్తించాలంటే, ఈ సమాజానికి ఉన్నత విధానాలలో మేలు చేయాలంటే, ఏదో ఒకచోట ఎక్కడో ఒక సందర్భంలో యేసును అనుకరించి అనుసరించక తప్పదు అనేంతగా యేసు జీవితాన్ని అసాధారణరీతిలో స్ఫూర్తివంతంగా సర్వమానవాళి ముందుపెట్టాడు ఆ మహాదేవుడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, నిరంతరం అనుక్షణం తండ్రియైన దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా జీవించినందు వల్లే యేసు జీవితం యావత్తూ అంగీకరించబడి మానవాళికి గొప్ప మార్గదర్శకంగా ఉందన టంలో ఎలాంటి సందేహం లేదు.యేసు ఒక్క ఆధ్యాత్మికరంగానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. అన్ని రంగాల వారికి యేసు ఒక గొప్ప అరుదైన స్ఫూర్తిదాయకం. ప్రజాసేవకు అంకితమై సమర్పణ జీవితంతో నిరంతరం ప్రజల గూర్చే ఆలోచిస్తూ ప్రజలకు మేలు చేయాలనే తెగింపుగల నాయకులకు, పోరాట యోధులకు యేసే గొప్ప దిక్సూచి. అబద్దపు వాగ్దానాలు చేయక, ఊసరవెల్లి వేషాలు వేయక, అసత్య ప్రచారాల జోలికిపోక నమ్మకమైన నీతివంతమైన రాజకీయాలు చేసే వారికి కూడా యేసే ఆదర్శం. రాజకీయ నాయకులు లేదా పార్టీలు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకుని విజయం సాధించితీరాలనే తపనతో అట్టి గురి కలిగి చేసే పాదయాత్రలను పర్యటనలను కూడా జైత్రయాత్రగా అభివర్ణిస్తారు.ఆధ్యాత్మిక నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, ఆరోగ్య పరిరక్షకులు, న్యాయవాదులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, దర్శకులు, జవానులు, కిసానులు, వ్యాపారవేత్తలు, భవిష్యద్దర్శకులు (విజనరీస్), వ్యక్తిత్వవికాస నిపుణులు, మార్గదర్శకులు, పరిశోధకులు, బోధకులు, జ్ఞానులు, వద్ధులు, చివరకు శత్రువులు ఇట్టి వారు ఎవరైనా ఎంతటి వారైనా యేసును, ఆయన జీవిత స్ఫూర్తిని ప్రత్యక్షంగా వెంటాడక తప్పదు. లేకుంటే వారికి మేలైన సారవంతమైన జీవితమే లేదు. వారి ఉనికే ప్రశ్నార్ధకం కూడా? తమకు తెలియకుండానే యేసును పరోక్షంగా అనుసరించేవారు ఎందరెందరో ఉన్నారనేది లెక్కేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే గొప్పదైన యేసు జైత్రయాత్ర సంబంధిత జయ జీవితం.– జేతమ్ -
మనల్ని మనం బేరీజు వేసుకుందాం!
జీవితం అంటే కేవలం సంపదను పోగుచేసుకోవడమేనా? మన వెనుక ఎన్ని భవనాలు, ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నది ముఖ్యం కాదు.. మనం వెళ్లేటప్పుడు మనతో పాటు ఏమున్నాయన్నదే అసలైన ప్రశ్న. భౌతికమైన ఆస్తులు మట్టిలో కలిసిపోవచ్చు, కానీ మనం చేసిన పరోపకారం, మనం పంచిన ప్రేమ మనల్ని అమరత్వం వైపు నడిపిస్తాయి.మార్పు మన నుంచే మొదలు కావాలిమనం చేసే చిన్నపాటి మంచి పని వల్ల ప్రపంచం మొత్తం మారుతుందా? అనే సందేహం రావచ్చు. సముద్ర తీరంలో ఒక వ్యక్తి వేల స్టార్ఫిష్లను కాపాడలేక పోయినా, తాను చేత్తో విసిరిన ఒక్కో ప్రాణి ప్రాణాన్ని కాపాడి తృప్తి చెందాడు. ‘దీని వల్ల పెద్ద మార్పు ఏమీ ఉండదు కదా?‘ అని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘కనీసం ఆ ఒక్కదాని జీవితంలోనైతే మార్పు వచ్చింది కదా!‘ అన్న సమాధానం అత్యంత శక్తిమంతమైనది.మనం చేసే ప్రతి చిరు సాయం, పక్కవారికి మనం అందించే చిరునవ్వు.. ఇవన్నీ అల్లాహ్ దృష్టిలో గొప్ప సత్కార్యాలే. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లు, ‘ఏ సత్కార్యాన్ని కూడా తక్కువ అంచనా వేయకండి.’ నిరంతరత అల్లాహ్‌కు అత్యంత ఇష్టమైనవి ఏమిటి? అంటే, భారీ పనులు కాదు.. మనం చేసే పనులలో నిరంతరత ఉండాలి. ‘కొద్దిగానైనా సరే నిరంతరం చేసే పనులు‘ భారంలా అనిపించవు, అవి మన ఆత్మకు శాంతిని కలిగిస్తాయి.మన ఆస్తిపాస్తులు మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టవచ్చు, కానీ మనం చేసిన సత్కార్యాలు మాత్రమే మనల్ని గమ్యం వైపు నడిపిస్తాయి. తీర్పు రోజున మన సంపద లెక్కలు అడగబడవు, మనం చేసిన పనుల ఫలితాలే మన స్వర్గానికి సోపానాలు అవుతాయి. కాబట్టి, ఆ ధనవంతుడిలా చివరలో బాధపడకుండా, ప్రతిరోజూ మన చేతనైనంత మంచిని చేద్దాం. మనకు అందిన ప్రతి అవకాశాన్ని ఒక సత్కార్యంగా మలుచుకుందాం. అణువంత మేలు కూడా వృథా పోదు. రేపటికోసం నేటి నుండే సత్కార్యాల బాటలో పయనిద్దాం.‘అనా ఫకీర్’ – ఆ వృద్ధుడి పశ్చాత్తాపంఒక ధనవంతుడు తన జీవితమంతా భవనాలు, బ్యాంకు బ్యాలెన్స్‌ల కోసమే వెచ్చించాడు. కానీ, మరణశయ్యపై ఉన్నప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. తన పిల్లలు ఆస్తి పత్రాలు చూపిస్తున్నా, అతను ‘అనా ఫకీర్‘ (నేను పేదవాడిని) అని రోదించాడు. ఎందుకంటే, అక్కడ సంపద కొరత లేదు, అతను దేవుడి దరికి చేరడానికి కావలసిన ‘సత్కార్యాల సంపద’ కొరత ఉంది. జీవితం చివరలో మనం మిగుల్చుకోవాల్సింది ఆస్తులు కాదు, పరలోకానికి అవసరమైన పుణ్యకార్యాలు అని ఆ వృద్ధుడి వేదన మనకు గుర్తుచేస్తోంది. ఖురాన్ చెబుతున్నట్లుగా: ‘కావున, ఎవడైతే అణువంత మేలు చేస్తాడో, వాడు దానిని (దాని ప్రతిఫలాన్ని) చూస్తాడు.‘ (99:7)– ముహమ్మద్ ముజాహిద్ -
అత్యంత విశిష్టమైన ఏకాదశి
హిందూ సంప్రదాయంలో ఏకాదశిది ఎంతో విశిష్ట స్థానం. వాటిలో జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుతోపాటు మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఉపవాసం, పూజలు, జపం, దానం వంటి ధార్మిక కార్యాలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు పేర్కొంటాయి.ఈ వ్రతం వేలాదిమందికి అన్నదానం చేసినంత ఫలాన్నిస్తుందని ప్రతీతి. తులసిని‘హరిప్రియ’గా పిలుస్తారు. అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్క. అందుకే తులసి లేకుండా విష్ణుపూజ అసంపూర్ణమని సంప్రదాయం చెబుతోంది. యోగిని ఏకాదశి రోజున తులసిని భక్తితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, సానుకూల వాతావరణం పెరుగుతాయని విశ్వాసం. -
యద్భావం తద్భవతి: మనసులో మంచి భావనలు ఉంటే అంతా..
‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడానికిగానీ, వాటినుండి విడుదల పొందడానికి కానీ; మన సు ఖానికిగానీ, దుఃఖానికి కానీ; అభ్యున్నతికిగానీ, పతనానికి కానీ – ఇలా దేనికైనా మన మనసు, అందులో ఎగిసిపడే ఆలోచనలే కారణాలని చెబుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరోజు తమ శిష్యులకు మనిషి మనసులోని కోరికలు, ఆశలు అతనిని ఎలా పతనం చేస్తాయో వివరించడానికి ఈ కథను చెప్పారు.ఒక వర్తకుడు వ్యా΄ార నిమిత్తం తన గ్రామం నుండి పట్టణానికి నడిచి వెడుతున్నాడు. ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటిలాగా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం దాకా నడిచేసరికి బాగా అలసిపోయాడు. మరొక నాలుగైదు గంటలు నడిస్తే కానీ గమ్యం చేరలేడు. కనుక ఎక్కడైనా తగిన చోటు దొరికితే కాసేపు ఆగి బడలిక తీర్చుకొందామనుకొన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ అరుగు కనిపించాయి. పరమానందంగా ఆ చెట్టు నీడన ఆ అరుగుపై కాళ్ళు చాచి పడుకొన్నాడు.చల్లగా వీస్తున్న గాలి అతని మార్గాయాసాన్ని కాస్త ఉపశమింపజేసింది. అప్పుడతనికి తన దాహం తెలిసింది. ‘తాగడానికి నీరు లభిస్తే ఎంత బాగుంటుందో’ అనుకొన్నాడు. వెంటనే అతని పక్కన ఒక ΄ాత్రలో చల్లని నీరు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోతూ అమృత తుల్యంగా ఉన్న ఆ నీటిని తాగి దాహం తీర్చుకొన్నాడు. దాహం తీరగానే అతని మనసు భోజనం పైకి మళ్ళింది. ‘బాగా ఆకలి వేస్తోంది. తినడానికి మంచి భోజనం లభిస్తే బాగుండు’ అని అనుకుంటూండగానే అతని ఎదుట పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడిన విందు భోజనం అరిటాకులో సిద్ధంగా కన్పించింది.ఎంతో సంబరంగా కడుపునిండా భోంచేశాడు. కాసేపు కునుకు తీస్తేగానీ భుక్తాయాసం తీరి నడక ముందుకు సాగదు. ఈ అరుగు పైన మెత్తటి పరుపు, తలగడ అమరితే బాగుండు అని మనసులో అనుకొన్నాడో లేదో తక్షణం అతని ఎదుట హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై పడుకొని ‘ఇప్పుడెవరైనా నా కాళ్ళు పడితే బ్రహ్మాండంగా నిద్ర పోవచ్చు’ అని అనుకొన్న మరుక్షణం ఇద్దరు అపురూపమైన అందగత్తెలు అతని కాళ్ళు పట్టడం మొదలు పెట్టారు. తాను ఏ చెట్టు నీడన కూర్చున్నాడో అది కల్పవృక్షమనీ, అతడు మనసులో ఏది కోరుకొన్నా దానిని వెంటనే ప్రసాదిస్తుందనీ అతనికి తెలియదు.ఇప్పుడు అతనికి ఒక అనుమానం మొదలైంది. ‘ఈ అడవిలో నేను గనుక గాఢంగా నిద్రపోతే, ఒంటరిగా, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఏ పెద్దపులో వచ్చి చూసిందంటే నా గతి ఏమౌతుందో’ అనుకొంటూండగానే ఎక్కణ్ణుంచో గాండ్రుమంటూ ఒక పెద్దపులి వచ్చి, అతనిపై భీకరంగా దాడిచేసి చంపేసింది. అంతటితో ఆతని కోరికలన్నీ అంతమైపోయాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు మన మనసులో మంచి భావనలు ఉంటే మనకు మంచే జరుగుతుంది. లేకపోతే మన గతి అథోగతే అన్నది శ్రీ రామకృష్ణులు ఈ కథ ద్వారా మనకు అందించిన సందేశం.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రినిర్వహణ : డి.వి.ఆర్ -
ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి..
మనం మాట్లాడే మాటల శబ్దాలు మనపైన, ప్రకృతిపైన ప్రభావం చూపుతాయి. అవే శబ్దాలు వేద మంత్రాలకు సంబంధించినవైతే మరింత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. అశుద్ధమైన మాటలు వినడం, చెడు దృశ్యాలు చూడటం వంటివి మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. ప్రియమైన మాటలు మాట్లాడితే సకల ప్రాణులూ ఆనందిస్తాయి. ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి. వినయ పూర్వక సత్య వచనాలు పలకడం ద్వారానే బంధువులు, స్నేహితులు దగ్గర అవుతారు. అలా మాట్లాడ గలిగే వారు సంఘంలో రాణిస్తారు.తైత్తిరీయారణ్యకం ‘మనో వాక్కాయ కర్మాణి శుధ్యన్తామ్’ అని చెప్పింది. అంటే మనస్సు, మాట, పనులను (త్రికరణములు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరుల మనసులు గాయపరుస్తూ, బాధించేలా మాట్లాడకూడదు. అలా చేయడం కూడా హింసే అన్నారు గాంధీజీ. మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి. ‘మధుర భాషణమున మర్యాదప్రాప్తించు’ అన్నారు పెద్దలు. మంచి మాట ఆభరణమే కాదు, దివ్యశక్తి కూడా! దానిని మనం మితంగా, జాగ్రత్తగా వినియోగించాలి. రఘువంశపు రాజులందరూ ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాస మహాకవి అన్నారు. అంటే సత్య సంరక్షణార్థం ఆ రాజులు మిత భాషిత్వాన్ని పాటించారని అర్థం.మనిషికి నాలుక ముందు పుట్టి తర్వాత దంతాలు ఏర్పడుతాయి. కానీ నాలుక కంటే వెనుక పుట్టిన దంతాలే ముందుగా ఎందుకు ఊడిపోతాయి అనే ప్రశ్నకు శ్రీ రామకృష్ణ పరమహంస చక్కని వివరణ ఇచ్చారు. ‘దంతాలు కఠినంగా ఉంటాయి. వాటికి వినయంతో కూడిన మెత్తదనం లేదు. నాలుక మృదువుగా అణకువతో ఉండి త్వరగా బయటకు కనపడదు. అందుకే రెండు పలు వరుసల మధ్య అది సురక్షితంగా ఉంటుంది’ అన్నారాయన. వినయంతో మిత భాషులైనవారు సురక్షితంగా ఉంటారు. కఠినాత్ములు, పరుష వాక్కు గల వారు త్వరగా రాలిపోతారని అర్థం చేసుకోవాలి.మన మాటల వలన జనించే శబ్దం చాలా శక్తిమంతమైనది. అవి వినేవారి మనస్సు పైన, దేహం పైనా అపరిమిత ప్రభావాన్ని చూపుతుంది. దుఃఖిస్తున్న వారి పట్ల దయతో సాంత్వన వచనాలు పలికితే వారి శోకం ఉపశమిస్తుంది. ఎవరి పట్లనైనా పరుష పదాలతో కఠినంగా మాట్లాడితే అవతలి వారు కోపోద్రిక్తులై పరిస్థితి విషమిస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు మధురంగా... హితంగా.. మితంగా మాట్లాడటమే మంచిదని పెద్దలు చెప్పారు.మాట్లాడ గలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి.– డాక్టర్ పాణ్యం వసుంధరనిర్వహణ డి.వి.ఆర్ -
ఆ విధంగా నా త్రివిధ సాధన..
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమైనాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు -
దశాశ్వమేధ ఘట్టం
దేవశిల్పి విశ్వకర్మ మనవడైన ప్రథముడికి భౌవనుడు అనే కొడుకు కలిగాడు. అతడు దినదినాభివృద్ధి చెంది సకల శాస్త్రాలను అభ్యసించి, సార్వభౌముడిగా ఎదిగాడు. భౌవనుడికి ఒకేసారి దశాశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం కలిగింది. అతడు తన ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని దర్శించుకుని, ‘ఏకకాలంలో దశాశ్వమేధ యాగాలు చేయాలని కోరికగా ఉంది. ఈ యాగాల నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో సెలవివ్వండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! పూర్వకాలం నుంచి రాజులందరూ ఏ ప్రదేశంలో అశ్వమేధ యాగాలు చేసేవారో, అదే ప్రదేశంలోనే నువ్వు కూడా యాగాలు నిర్వహించు’ అని చెప్పాడు కశ్యపుడు.కశ్యపుడి సూచనతో భౌవనుడు ఋత్విక్కులను ఏర్పాటు చేసుకుని, పూర్వీకులు యాగాలు నిర్వహించిన ప్రదేశంలోనే పది అశ్వమేధ యాగాలూ ఒకేసారి ప్రారంభించాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ యాగాలు సంపూర్ణం కాలేదు.యాగాలు సఫలం కాకపోవడంతో భౌవనుడు విచారించాడు. పురోహితులతో చర్చించి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలంలో యాగాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడ కూడా యాగాలకు అంతరాయాలు కలిగాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి.భౌవనుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నా దోషమో, మీ దోషమో, దేశ కాల దోషమో నాకు అర్థం కాకున్నది. నేను తలపెట్టిన యాగాలు ఎంతగా ప్రయత్నించినా సంపూర్ణం కాకున్నవి. దీనికి మార్గాంతరమేమిటో అంతుచిక్కకున్నది’ అని విచారంగా పలికాడు.కశ్యపుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత, ‘రాజా! పద’ అంటూ భౌవనుడిని తనతో పాటు బృహస్పతి అన్న అయిన సంవర్తకుడి దగ్గరకు తీసుకుపోయాడు. ‘మహాత్మా! మేము దశాశ్వమేధ యాగాలు తలపెట్టాము. యాగ నిర్వహణకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి. మేము తలపెట్టిన యాగ నిర్వహణకు తగిన ఉత్తమ ప్రదేశమేదో నువ్వే చెప్పాలి’ అని అడిగాడు కశ్యపుడు. సంవర్తకుడు కొద్దిసేపు ఆలోచించి, ‘మునివర్యా! మీరిద్దరూ నేరుగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి అడగండి. మీరు సంకల్పించిన యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలాన్ని ఆయనే చెప్పగలడు’ అని చెప్పి, వారిని సాదరంగా సాగనంపాడు. భౌవనుడిని వెంటపెట్టుకుని కశ్యపుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడిని దర్శించుకుని, వారిద్దరూ నమస్కరించారు. ‘బ్రహ్మదేవా! మా రాజైన ఈ భౌవనుడు దశాశ్వమేధ యాగాలను ఏకకాలంలో తలపెట్టాడు. ఇదివరకటి యత్నాలు విఫలం కావడంతో వ్యాకులం చెందుతున్నాడు. యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో నువ్వే సెలవివ్వాలి’ అడిగాడు కశ్యపుడు. ‘పవిత్ర గౌతమీతటాన యాగ నిర్వహణ కావించండి. అక్కడ నిర్వహించే ఏ యాగమైనా సంపూర్ణంగా ఫలిస్తుంది’ అని చెప్పి, భౌవనుడిని ఉద్దేశించి, ‘రాజా! నువ్వు ఇందుకు వేరే గురువును ఆశ్రయించవలసిన పనిలేదు. వేదపారంగతుడైన ఈ కశ్యపుడే గురుశ్రేష్ఠుడై యాగాన్ని పరిపూర్ణం చేయించగలడు’ అని చెప్పాడు.కశ్యపుడి ఆధ్వర్యంలో భౌవనుడు గౌతమీ తీరంలో దశాశ్వమేధం ప్రారంభించాడు. యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. యాగ పరిసమాప్తి సందర్భంగా భౌవనుడు భూదానానికి ఉద్యుక్తుడయ్యాడు.అదే సమయంలో అశరీరవాణి ‘ఓ రాజా! సమస్త భూమండలాన్నీ నువ్వు ఈ కశ్యప మహర్షికి దానం చేయాలని సంకల్పించుకున్నావు. నీ సత్సంకల్ప మాత్రానే భూమండలం సర్వసుభిక్షమైంది. నీ మనసులోనున్న భూదాన సంకల్పాన్ని విరమించుకుని, మహాఫలప్రదమైన అన్నదానం కావించు. నీకు శుభం కలుగుతుంది’ అని పలికింది. అశరీరవాణి పలుకులు విన్నప్పటికీ భౌవనుడు తన భూదాన సంకల్పం నుంచి వెనక్కు తగ్గలేదు. అప్పుడు భూదేవి స్వయంగా ప్రత్యక్షమై, ‘మహారాజా! మాటిమాటికి నన్ను దానం చేయడం తగదు. నీ సంకల్పం విడిచిపెట్టు’ అని చెప్పింది.భూదేవి స్వయంగా ప్రత్యక్షం కావడంతో భౌవనుడు చలించిపోయాడు. ‘తల్లీ! యాగ పరిసమాప్తి సందర్భంగా నేనిప్పుడు ఏ దానం చేయాలో నువ్వే చెప్పు’ అన్నాడు.‘పవిత్రమైన ఈ గౌతమీ తీరాన నవధాన్యాలు, గోవులు, ధన కనక వస్తు వాహనాలు వేటిని దానం చేసినా అక్షయఫలం లభిస్తుంది. ఇక్కడ అన్నదానం చేసినవారికి సమస్తదానాలూ చేసినంత ఫలం దక్కుతుంది.’ అని పలికింది. భౌవనుడు యాగస్థలంలో వేలాదిమందికి అన్నదానం చేశాడు. అతడి యాగస్థలి దశాశ్వమేధ తీర్థంగా ప్రసిద్ధి పొందింది. - సాంఖ్యాయనపురావిశేషం..ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని హీరాపూర్ గ్రామంలో అత్యంత అరుదైన పురాతన శాక్తేయ ఆలయం ఉంది. ఇది చతుష్షష్టి యోగినుల మందిరం. ఇందులో అధిష్ఠాన దేవత మహామాయ విగ్రహంతో పాటు అరవైనాలుగు మంది యోగినుల విగ్రహాలు ఉంటాయి. పైకప్పు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. దీనిని భౌమవంశానికి చెందిన రాణి హీరాదేవి క్రీస్తుశకం 864లో నిర్మించింది. పదహారో శతాబ్దిలో కాలాపహాడ్ అనే సేనాని జరిపిన దాడిలో ధ్వంసమైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో మిగిలింది. -
సహజ యోగంతోనే సహజ సౌందర్యం..
సంప్రదాయ కళలు, సంప్రదాయ ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు – ఇవి మన దేశంలో వేల కొద్దీ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. మనం వాటిని ఉపయోగించాలి. కానీ మనం పాశ్చాత్య దేశాలచే ఎంతగా ప్రభావితులమయ్యామంటే, మన సంస్కృతిని మర్చిపోయి, బయటి విషయాలను అనుసరిస్తున్నాము. దీని కారణంగా మనలో మనం ఆత్మ’ అని పిలిచే అతి ముఖ్యమైన విషయం అజ్ఞానంతో కప్పబడుతుంది. మన దేశంలో ఆత్మను అలంకరించే వేలకొద్దీ విషయాలు ఉన్నాయి, అవి ఆత్మను అణచివేయవు.మన కళ్ళు చాలా త్వరగా బాహ్యమైన విషయాలపై పడతాయి. కారణం మనం మనుషులం కాబట్టి, మన ధ్యాస బయట ఉంటుంది. కానీ మనల్ని మనం చూడటానికి ప్రయత్నించినప్పుడు, మనం నవ్వుతూ మన లోపల ఎంత అందంగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని ఆలోచిస్తాము! దానిని వదిలి మన ధ్యాస బయట ఎందుకు తిరుగుతుంది? ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆ స్థితిని సాధించలేదు, మనకు అది ఇంకా తెలియదు, అందుకే మనం అలా చేస్తున్నాము. అందుకే మనల్ని మనం ప్రేమించుకోలేక పోతున్నాము, మన ఆత్మను పాడుచేసే వాటిని మనం ఇష్టపడతాము, ఆ విషయం మనం గ్రహించలేము. మన జీవితంలో అలాంటివి చాలా ఉన్నాయి.సహజ యోగ ధ్యాన సాధన ద్వారా మానవుల లోపల కుండలినీ శక్తి జాగృతి చెందినప్పుడు, వారు భగవంతుని ఆశీస్సుల వలన ఆత్మ స్వరూపులుగా మారుతారు. ఆత్మికమైన శుభ లక్షణాలను పొందుతారు. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆత్మకు ఉండే సహజ శుభ లక్షణాలైన అమాయకత్వం, పవిత్రత, మాతృ ప్రేమ, సంతృప్తి, సృజనాత్మకత, ధైర్యం, అందరితో కలిసిపోయే స్వభావం, క్షమా గుణం వంటివి మన నిత్య జీవితంలో ఆచరించడం వలన మనం ఆత్మ సౌందర్యాన్ని పొందగలం.మీ లోపల ఉన్న ’ఆత్మ’ అనే వజ్రాన్ని బయటకు తీయండి. మీరే ఆ వజ్రం అని తెలుసుకోండి. ఆ వజ్రం మెరుపు మీరే. మీ లోపల ఉన్న ఆ వజ్రం పైకి వచ్చినప్పుడు, ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోతారు, ఆ ఆత్మ సౌందర్యాన్ని పొందడానికి ప్రయత్నించండి. స్త్రీలకు శాశ్వతమైన విలువను కలిగి ఉండే ఏదో ఒకటి ఉంది, దానిని వారు అభివృద్ధి చేసుకోవాలి. గొప్ప విషయం ఏమిటంటే స్త్రీ అందరినీ ప్రేమించగలదు, కానీ ఆమె స్వార్థపూరితంగా మారినప్పుడు, ఆమె ప్రేమలో అందం ఉండదు.పురుషులలో ఆజ్ఞాపించే స్ఫూర్తి వారి మాటల ద్వారా, వారి చైతన్యం ద్వారా, వారి వ్యక్తిగత విజయాల ద్వారా వస్తుంది; అయితే స్త్రీలకు ఈ లక్షణాలు వారి ప్రేమపూర్వక శక్తి ద్వారా, వారి సహనం ద్వారా, వారి దయగల ప్రవర్తన, క్షమ, కరుణ ద్వారా వస్తాయని గ్రహించి, వాటిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలి.విత్తనాలు స్వయంగా దేనినీ సృష్టించలేవు. పువ్వులు, పండ్లు, ఇతర వరాలను అందించేది భూమాత. అదేవిధంగా, బిడ్డను సృష్టించేది స్త్రీ, శిశువును పోషించేది, చివరికి రేపటి ΄ûరుడిని పెంచుతుంది. కాబట్టి మహిళలు మొత్తం మానవాళి నివసించే భవనంగా భూమి తల్లిని పరిగణించాలి. – డా.ప్రతాని రాకేశ్, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా) -
ఆత్మబోధ – జీవన మార్గం
భారతీయ తత్వశాస్త్రంలో అద్వైత వేదాంతం అత్యంత ప్రభావవంతమైనది. ఈ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ఆయన రచనల్లో అత్యంత లోతైన తాత్విక సందేశాన్ని అందించే కతి నిర్వాణషట్కం. కేవలం ఆరు శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం మనిషి అసలు స్వరూపం, జీవిత పరమార్థం గురించి అద్భుతమైన వివరణ ఇస్తుంది.మనిషి తనను తాను శరీరంగా, మనస్సుగా భావించడం వల్లే అన్ని బాధలు కలుగుతున్నాయని శంకరాచార్యులు బోధించారు. మనం ‘నేను’ అని సంబోధించినప్పుడు పేరు, వత్తి, హోదా వంటి తాత్కాలిక గుర్తింపులనే వాడుతుంటాం. కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులన్నిటినీ గమనిస్తూ ఉండే సాక్షియే ’ఆత్మ’. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ శాశ్వతమైన చైతన్యం. నేను మనస్సు, బుద్ధి, అహంకారం కాదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ప్రస్తుత కాలంలో అందం, ఆస్తి, హోదా వంటి బాహ్య ఆకర్షణలే జీవిత లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమని నిర్వాణషట్కం గుర్తుచేస్తుంది.శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ అవగాహన మనిషిలో వినయాన్ని పెంచి, బాహ్య ప్రపంచం పట్ల సమతుల్య దక్పథాన్ని కలిగిస్తుంది. మనిషి జీవితాన్ని ఎక్కువగా ఇష్టాయిష్టాలే ప్రభావితం చేస్తాయి. ఈ రాగద్వేషాల వల్లే అసంతృప్తి కలుగుతుంది. కానీ ఆత్మ స్వరూపం చిదానందం(చైతన్యం తో కూడిన ఆనందం). అది వీటికి అతీతమైనది. ఈ తాత్విక దృష్టి వల్ల ఇతరుల పట్ల అసూయ, ద్వేషం తగ్గి సమత్వ భావన పెరుగుతుంది. నేటి సమాజంలో పెరుగుతున్న విభేదాలను అరికట్టడానికి ఈ ఆలోచనా విధానం ఎంతో అవసరం. సాధారణంగా మనిషిని మరణభయం వేధిస్తుంటుంది. కానీ శరీరం నశించినా ఆత్మ నశించదనే సత్యం తెలిసినప్పుడు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది.అలాగే పాపపుణ్యాలకు, కర్మల ప్రభావానికి ఆత్మ అతీతమైనదని గ్రహించడం వల్ల గతాన్ని తలచుకుని బాధపడే మనసుకు విముక్తి లభిస్తుంది. నిర్వాణషట్కం కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక గొప్ప తాత్విక ప్రకటన. జాతి, మత, వర్గ విభజనలకు అతీతంగా అందరం ఒకే చైతన్యానికి ప్రతిరూపాలమనే సామాజిక çస్పృహను ఇది కలిగిస్తుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న మనిషికి తన అంతర్గత ప్రశాంతతను వెతుక్కునేందుకు ఇది ఒక దిక్సూచి. అహంకారాన్ని వీడి తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనిషికి నిజమైన విముక్తి సాధ్యమవుతుంది. – సత్యశ్రీ బాలాంత్రపు -
సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తున్నారా!
లోకమంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ. నిశ్శబ్దం అగాధంగా ఆవరించిన ఆ అర్ధరాత్రి సమయంలో, ఎప్పుడైనా అకస్మాత్తుగా మీ కళ్ళు తెరుచుకున్నాయా? చుట్టూ శూన్యం, గుండెపై ఏదో తెలియని భారం. రేపటి జీవన పోరాటం, మోయలేని బాధ్యతలు, తీరని ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చింతలు... ఒక్కసారిగా మదిని తొలిచేస్తూ, ఈ అనంత విశ్వం లో నేనొక్కడినే ఒంటరినైపోయానా అనే వేదన మిమ్మల్ని చుట్టుముడుతుంది.ఆ ఏకాంత క్షణంలో మీరు అస్సలు ఒంటరి కారు. ఆ నిశ్శబ్దం నిరాశ కాదు... అది విశ్వసృష్టికర్త నుండి మీకు అందిన పరమ పవిత్రమైన ఆహ్వానం! జగమంతా నిద్రిస్తున్న వేళ, ఆ రాజులకే రాజు మీకోసం అంతరంగ ఆత్మీయ సదస్సును సిద్ధం చేశాడు. మీ మనసులోని కల్లోలాన్ని తుడిచేసి, అనంతమైన ప్రశాంతతను అమృతంలా కురిపించడానికి ఆయన వేచి చూస్తున్నాడు. అయితే, దుప్పటి ముసుగులో తాత్కాలిక సుఖాన్ని పొందుతూ ఆ అమృత ఘడియలను జారవిడుచుకుంటారా, లేక ఆ పరమ ప్రభువును దర్శించుకోవడానికి మేల్కొంటారా? నిర్ణయం మీదే!శారీరక బద్ధకంపై ఆధ్యాత్మిక విజయంఎప్పుడైతే నిద్రను జయించి మీరు పరుపు వదులుతారో, అప్పుడే మీ అహంకారం నశిస్తుంది. ‘నా దేహ సుఖం కంటే, నా సృష్టికర్తను ఆరాధించడమే నా ప్రథమ కర్తవ్యం’ అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, ఆ చల్లని నేలపై మీ తలను వంచి, మీ అంతరంగ రహస్యాలను దేవునికి విన్నవించుకున్నప్పుడు లభించే పరమశాంతి ఈ సృష్టిలో మరెక్కడా దొరకదు.ఆరాధనలోని ఆ నిగూఢమైన ప్రేమే దాసుడిని దేవుడికి దగ్గర చేస్తుంది. రాత్రి చివరి మూడవ భాగంలో ప్రకృతిలో ఒక అద్భుతమైన దైవిక సువాసన పరిమళిస్తుంది. అది కారుణ్యపు తలుపులు తెరుచుకునే మహత్తర సమయం. ఆ అల్లాహ్ మొదటి ఆకాశానికి దిగివచ్చి... ‘నన్నుప్రార్థించే దాసులు ఎవరున్నారు, వారి మొర ఆలకించడానికి? నన్ను అడిగేవారు ఎవరున్నారు, వారి కోరికలు తీర్చడానికి? క్షమాపణ కోరేవారు ఎవరున్నారు, వారి ΄ా΄ాలను కడిగేయడానికి?’ అని మధురంగా పలికే దివ్యక్షణాలవి.ఈ సమయంలో ప్రకృతిలోని అదృశ్య శక్తులు, పుణ్య దైవదూతలు ఎంతో చైతన్యవంతంగా సంచరిస్తూ ఉంటారు. రాత్రివేళ విధుల్లో ఉండే దైవదూతలు, పగటివేళ బాధ్యతలు స్వీకరించే దైవదూతలు పరస్పరం కలుసుకునే సంధి కాలం ఈ తెల్లవారుజాము. మీరుప్రార్థనలో నిలబడినప్పుడు, ఆ దైవదూతలు మీ పేరును ధన్యుల జాబితాలో లిఖించి, ఆ వేడుకోలును నేరుగా ఆకాశాలకు తీసుకెళ్తారు. ఆ సర్వశక్తిమంతుడే మీకు రక్షణ కవచంగా మారినప్పుడు, లోకంలో ఎలాంటి తుఫానులు వచ్చినా మీ మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది.జీవితాన్ని మార్చే ‘బరకత్’ (దైవిక అనుగ్రహం)ఉదయాన్నే నిద్రలేవడం వల్ల జీవితంలోకి ‘బరకత్’ అనే దైవిక అనుగ్రహం ప్రవాహంలా వస్తుంది. ఇది మీ సమయాన్ని, శక్తినీ రెట్టింపు చేసే దైవ వరం. ప్రవక్త ముహమ్మద్ (స) తన అనుచరుల కోసం... ‘ఓ అల్లాహ్! నా జాతికి వారి తెల్లవారుజాము సమయాల్లో అమితమైన శుభాలను ప్రసాదించు’ అని మనసారాప్రార్థించారు. ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మీ కాలానికి ఒక అదృశ్యమైన దైవికహస్తం తోడవుతుంది. మీ పనులు సులువవుతాయి, హృదయం తేలికవుతుంది. ఇతరులు రోజంతా చేసే పనిని మీరు కేవలం కొన్ని గంటల్లోనే అలవోకగా పూర్తి చేయగలుగుతారు.షైతాను సంకెళ్ళను తెంచేయండిమనం నిద్రిస్తున్నప్పుడు షైతాను మన తల వెనుక మూడు బలమైన ముడులను వేస్తాడని ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నాయి. ఆ అదృశ్య సంకెళ్ళను తెంచడానికి ఒకే ఒక్క దివ్య ఔషధం1. మీరు నిద్ర లేచి అల్లాహ్‌ను స్మరించుకున్న క్షణంలో మొదటి ముడి విడిపోతుంది.2. ప్రార్థన కోసం పవిత్రమైన శుద్ధి (వజూ) చేసుకున్నప్పుడు రెండవ ముడి విడిపోతుంది.3. ప్రార్థన (నమాజ్) లో దేవుని ముందు నిలబడినప్పుడు మూడవ ముడి పూర్తిగా తెగిపోతుంది.ఈ ముడులను తెంచుకున్న దాసుడు ఆ ఉదయం ఉత్సాహపు కెరటంలా, పవిత్రమైన ఆనంద నిధిలా మేల్కొంటాడు. – ముహమ్మద్ ముజాహిద్ -
స్నేహమాధుర్యం..
స్నేహం గూర్చి ఎంతో గొప్పగా చెప్తారు.. సృష్టిలో తియ్యనిదని కొందరంటే, కొందరు మధురమైనదని అన్నారు. స్నేహబంధం విడదీయరాని బంధం అన్నారు...పురాణాల్లో రామ సుగ్రీవుల మైత్రి, కృష్ణుడు కుచేలుల మైత్రి, కృష్ణార్జునల మైత్రి చెప్పుకోదగ్గవి... స్వభావరీత్యా దుష్టులైన దుర్యోధనుడు, కర్ణుల మైత్రి అయినా మంచి ఉదాహరణ కాదు. ఇలాంటి వారి విషయంలో శతకనీతి మనకు ఎంతో మంచి మార్గం చూపిస్తుంది...సజ్జన సాంగత్యం గొప్పదంటాడు భర్తృహరి... ఏనుగు లక్ష్మణ కవి తాను చేసిన అనువాదంలో... ‘సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్పుగౌరవమొసంగు, జనులకు గలుష మడచుగీర్తి బ్రకటించు, చిత్తస్ఫూర్తిజేయుసాధుసంగంబు సకలార్థ సాధనంబు’సజ్జన సహవాసం వలన ఉపయోగాలు చెప్తున్నాడు కవి. సమస్త ప్రయోజనాలు సాధించబడతాయి. అంటే కాదు సకలార్ధ సాధకం అని సెలవిచ్చాడు. ఇదే బాణీని అందరూ కొనసాగించారని అనిపిస్తుంది.. వేమన ‘నీచగుణములెల్ల నిర్మూలమై పోవు, కొదువ లేదు సుజన గోష్టి వలన’ అని సుజన గోష్టి వలన నీచ గుణాలు తొలగిపోతాయంటాడు.‘కాని వానితోడగలసి మెలంగినహాని వచ్చు నెంతవానికైనకాకి గూడి హంస గష్టంబు పొందదా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు, వేమన. దుష్టుని స్నేహం గూర్చి వివరిస్తాడు, సుమతీ శతకంలో.‘ఉపమింప మొదట తియ్యనకపటం బెడనెడను జెఱకుకైవడినే పోనెపములు వెదకును గడపటగపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ‘ చెడు స్నేహానికి మంచి ఉదాహరణ చె΄్పారు ఇక్కడ.. చెడ్డవారితో స్నేహం మొదట్లో చెఱకు గడ తీపిలా ఉంటుంది. మధ్యలో రుచి తగ్గుతుంది, చివరికి పూర్తిగా చప్పగా ఉండి, ఏమి లేదనిపిస్తుంది. అటువంటి వాడికి తప్పులే కనిపిస్తాయి.‘ఎప్పుడు తప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడడది’ అని అంటాడు సుమతీ శతకంలో.‘కాదు సుమీ దుస్సంగతి’ అని హెచ్చరిక చేస్తాడు ఇదే శతకంలో.మరో పద్యంలో ‘కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు’ అని అన్నారు..‘కొంచెపునరు సంగతిచేనంచితముగ గీడు వచ్చునది’ అంటూ ఒక ఉపమానం చెప్తాడు.. నల్లి కుడితే మంచానికి దెబ్బలు తగులుతాయి..‘పాలను గలసిన జలమునుపాలవిధంబునె యుండు బరికింపంగాబాల చవి జెఱచు గావునబాలసుడగువాని పొందు వలదుర సుమతీ‘ పాలు కలిసిన నీళ్లు పాల లాగే ఉంటాయి, అలాగే దుర్జనుడు సజ్జనుడు ఉంటే సజ్జనుడు లాగా ఉంటాడు... అందుకు సజ్జనుడే జాగ్రత్త వహించాలి..‘లేమి కలిమి రెండు సమముగ జూచేడి పురుషుడే మిత్రుడెన్ని పొగడారయా’ అని వేమన అంటే ‘మంచి గుణము లేని వానితో మైత్రి చేసి తుది సుఖము బడయుదురా భాస్కరా’ అంటారు భాస్కర శతకంలో.చివరగా భర్తృహరి భాషలో ‘త్యజేత్ ధనం రక్షణార్థం, ధనం త్యజేత్ ఆపది ఆత్మర్థం పృథివీం త్యజేత్, మిత్రార్థే త్యజేత్ ఆత్మనఃకాపాడుకోవడానికి సంపద, ధనం, రాజ్యం అని వదులుకోవచ్చు,కాని మిత్రుడి కోసం నువ్వు నిన్నే వదులుకోవాలి.. అంత గొప్పది స్నేహం. – డా. కందాళ సత్య నారాయణ మూర్తి -
పాదయాత్రే జైత్రయాత్రగా...
జైత్రయాత్ర అనగా గెలుపు కోసం చేసే యాత్ర. యేసు తన జీవితకాల చివరి మూడున్నర సంవత్సరాల పాదయాత్రను జైత్రయాత్రగా చూడవచ్చు. నిజానికి యేసు పాదయాత్రే జైత్రయాత్ర. రెండూ ఒక్కటే. పాదయాత్ర సాధారణ రీతిలో జరుగకపోగా అసాధారణ రీతి లో జైత్రయాత్రగా మార్చబడి గొప్ప సంచలనాలకు కేంద్రం అయ్యింది. ఇక్కడ మాత్రం పాదయాత్రకు జైత్రయాత్ర పర్యాయపదం కాక అంతకు మించినది కావడం విశేషం. ఆనాటి యేసు జైత్రయాత్ర ఇచ్చే ప్రేరణ ఇంతా అంతా కాదు.జైత్ర అంటే జయించేది అని అర్థం. అది విజయానికి సంబంధించినది అని చెప్పవచ్చు. విజయ శీలుడు, విజయశీలమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యాత్ర అంటే క్షేత్రస్థాయి పర్యటన. శత్రువులపై దండెత్తి విజయం సాధించడానికి వెళ్ళే యాత్రే జైత్రయాత్ర. ఆత్మ సంబంధంగా చూస్తే, దైవవాక్కుల ఖడ్గంతో దూసుకెళుతూ శత్రువైన సాతానుపై యేసు దండెత్తిన విధానం కనువిందే కాక చరిత్రలో అదొక గొప్ప వాగ్యుద్ధం. యావత్ ప్రపంచానికి దీన్ని మించిన స్ఫూర్తి మరొకటి లేదు. ఒకరు ఏదైనా ఒక రంగంలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగే ప్రయాణాన్ని కూడా జైత్రయాత్ర అంటారు.కుష్ఠురోగియైన సీమోను ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు గొప్ప సువాసనతో నిండేలా ఒక స్త్రీ అత్యంత విలువగల బహు ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరు తీసికొనివచ్చి యేసు తలమీద అదిపోసి తనదైన ప్రేమను ఉన్నతంగా వ్యక్తం చేసింది. మరియొక స్త్రీ అత్తరు బుడ్డితో యేడ్చుచు వచ్చి కన్నీటితో యేసు పాదాలను తడిపి కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. గొప్ప జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు అసాధారణ బోధలకు బహుగా ఆశ్చర్యపోతూ, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది. ‘మేము ఎవరి దగ్గరకు వెళతాం? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు’ అంటూ పేతురు యేసును గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా పరిశీలనగా చూస్తే యేసుకు జైజైలు పలుకుటే.ప్రవచనం ప్రకారంగా కట్టబడియున్న ఒక గాడిద పిల్లను శిష్యులు విడిపించి తెచ్చిన వెంటనే యేసు గాడిదపిల్ల మీద కూర్చోగానే హోసన్నా నినాదాలు హోరెత్తాయి. ఖర్జూర మట్టలతో ఆయనకు స్వాగతం పలికారు. దారి ΄÷డుగున తమ బట్టలు, ఒలీవకొమ్మలతో పాటు వివిధ చెట్లకొమ్మలు తెచ్చిపరుస్తూ తమ సంతోషానందాలు వ్యక్తం చేసారు. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక! సర్వోన్నత స్థలములలో జయము అంటూ బహు జనసముహం మహా శబ్దంతో కేకలు వేశారు. మిన్నంటిన జయజయధ్వనులతో బేత్పగే, బేతనియ గ్రామాలు మార్మోగాయి.యెరూషలేము పట్టణపు యూదులే కాకుండా, పస్కా పండుగ చేయుటకు వివిధ దేశాల నుండి ముందుగానే వచ్చిన యూదులు కూడా మెస్సీయాను ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన్ను జేజేలతో కీర్తించారు. ఎలుగెత్తి చేస్తోన్న ఈ గొప్ప శబ్దాన్ని చూసి ఓర్వలేని వినలేని వినుటకు మనస్సులేని పరిసయ్యులు అభ్యంతరాలు చె΄్పారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు అంటూ యేసుకే ఫిర్యాదు చేశారు. వీరు ఊరకుండి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు పరిసయ్యులను హెచ్చరించాడు.ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను కొండగ్రామాల మీదుగా యేసు విజయయాత్ర ్రపారంభమై కిద్రోను లోయను దాటి దేవుని ఆలయం ఉన్న పవిత్ర నగరం యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేవరకు సాగింది. ఈయన ఎవరో అనుకుంటూ యెరూషలేము పట్టణమంతా ఒకసారిగా కలవరానికి గురైంది. యేసు జైత్రయాత్రలకు ముచ్చటపడిపోతూ ఇలా ఆరోజున ఆయనకు ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జైకొట్టినవారే. నాట్యమాడే అంతరంగాలతో క్రీస్తుకు జేజేలు పలికినవారు నాడు ఎందరెందరో. – జేతమ్ -
కోరికల తరంగాలు..
నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
మహోన్నత శిఖరాలు
వారికి వారే సాటి. వారిద్దరినీ క్రీస్తు ప్రధాన శిష్యులుగా చెప్పుకోవడం పరిపాటి. ఇద్దరూ ఇద్దరే! సౌవార్తిక సేవలో మహోన్నత శిఖరాలు! క్రీస్తు తన వారసులుగా ఎన్నుకున్న ప్రధాన వ్యక్తులు. ఒకరు క్రీస్తు మొదటి శిష్యుడు పేతురు. మరొకరు క్రీస్తుకు ప్రత్యేక శిష్యుడు పౌలు! ఇద్దరూ జైలు జీవితం అనుభవించారు. సంఘానికీ, వ్యక్తులు మారడానికీ పత్రికలు రాశారు.పేతురు సముద్ర తీర వాసి, ఒక జాలరి. పౌలు రోమన్ సామ్రాజ్య ఉద్యోగి, ఒక సైనికుడు. పేతురు ‘నన్ను వెంబడించు’ అని పిలువబడి సిలువ వరకు వెళ్ళాడు. పౌలు ‘నా నామం కోసం శ్రమపడాలి’ అని పిలువబడితల ఇచ్చాడు. ఒకరు క్రీస్తుచే యాదృచ్ఛికంగా ఆహ్వానితుడైనవాడు. మరొకరు క్రీస్తుచే అదృశ్యకంగా కొట్టబడి ప్రశ్నింప బడినవాడు. ఒకరు ఇజ్రాయేలీయ దేశ స్వస్థలీయుడు. మరొకరు ఇరాన్ దేశం నుంచి వచ్చి స్థిరపడినవాడు.ఒకరు నిరక్షర కుక్షి. మరొకరు విద్యా బుద్ధులు బాగా నేర్చినవాడు. ఒకరు పన్నెండు మంది శిష్యుల్లో జ్యేష్ఠుడు. మరొకరు సువార్త అందించ పంపబడ్డ అపోస్తులుడు. ఒకరు క్రీస్తుతోపాటు సుఖ దుఃఖాల్లో కలిసి తిరిగాడు. మరొకరు క్రీస్తును చూడలేదు. ఆయన గురించి విన్నాడు. ఒకరు క్రీస్తు స్థాపించిన సంఘానికి మూల రాయిలాంటి వాడు. మరొకరు ఆ మూలరాతిని కరిగించి సారం అందించిన వాడు. పేతురు రాసిన పత్రికలు రెండు. పౌలు రాసిన పత్రికలు పదమూడు. ఇద్దరూ యేసు కోసం ప్రాణం పెట్టి, హతసాక్షులుగా రోమ్‌లో చనిపోయినవారే. ఇద్దరూ క్రీస్తు సువార్తా ప్రకటనకు మూలస్తంభాల్లా నిలిచినవారే! – డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 29న పునీత పేతురు – పౌల్ మహోత్సవం) -
అహంకార శిల్పం..
ఒక రాజ్యంలో ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఎలాంటి శిలనైనా శిల్పంగా మార్చగల నైపుణ్యం అతడి సొంతం. ఉండేది. ‘నీ పనితనం చాలా గొప్పది, అందుకే ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కగలుగుతున్నావు. నీవు చెక్కుతున్న శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది’ అని అందరూ అతడిని ప్రశంసించేవారు. దాంతో ఆ శిల్పిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. మరింత గొప్పగా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు.ఆనోటా ఈనోటా పాకిన ఈ విషయం ఆ పెద్ద సామ్రాజ్యపు చక్రవర్తి వరకు వెళ్ళింది. ఆ చక్రవర్తి శ్రీ కృష్ణుడి భక్తుడు. ఆయన ఆ శిల్పిని పిలిపించి, ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు. శిల్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని చూసిన చక్రవర్తి పరమానందభరితుడయ్యాడు. ఆ దివ్య సౌందర్యానికి పులకరించిపోయాడు. ప్రజల సమక్షంలో శిల్పిని ధన కనక వస్తువాహనాలతో సన్మానించాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అతడికి ‘మహాశిల్పి’ అని బిరుదునిచ్చాడు.శిల్పి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మెల్లగా అహంకారంగా మారింది. అతడు ఇంటికి వెళ్ళి తండ్రితో, ‘నాకు మించిన శిల్పి ఈ భూలోకంలోనే లేడు’ అని విర్రవీగాడు. కొడుకు మాటలను ఆ శిల్పి తండ్రి పట్టించుకోలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ‘ప్రపంచమే నాకు నీరాజనాలు పడుతుంటే, తండ్రివైన నీవు నన్ను పొగడవేమిటి?’ అని శిల్పి తండ్రిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తండ్రి నవ్వి, ‘పిచ్చివాడా... ఈ సృష్టికర్త ముందర మనమెంత? ఈ కీర్తి, బిరుదులు ఇవన్నీ నీటి బుడగల్లాంటివి. ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే’ అన్నాడు. శిల్పి కోపంగా తండ్రి వైపు చూస్తూ,‘నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు అసూయ కలిగించినట్లుంది’ అని నిష్టూరమాడాడు.దానికి జవాబుగా తండ్రి ఒక పలక, బలపాన్ని శిల్పి చేతికిచ్చాడు. సృష్టికర్త సృష్టించినట్లుగా కాకుండా, మరో భిన్నమైన రూపంలో ఒక మానవ ఆకారాన్ని గీసి చూపించమన్నాడు. ‘అదెంత పని!’ అన్నట్లుగా శిల్పి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. శిల్పి మూడు రాత్రులు నిద్ర లేకుండా రకరకాలుగా ప్రయత్నించాడు.కాలు, చేయి, కన్ను, ముక్కు, చెవి... ఎలా మార్చినా మానవ శరీరం సంపూర్ణం కాలేదు సరి కదా, ఒకవేళ మరో విధంగా మార్చితే మానవ మనుగడే సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. ఏ అవయవాన్ని కూడా మరో రకంగా మార్చలేమని, వాటి స్థానాలను అంగుళం కూడా కదపలేమని గుర్తించాడు. చివరికి తల వెంట్రుకలను సైతం ఆ సృష్టికర్త ఎంతో నైపుణ్యంతో అమర్చాడని గ్రహించాడు. సృష్టికర్తకు మించిన మహాశిల్పి ఈ విశ్వంలోనే మరొకరు ఉండరని అతడికి స్పష్టమైంది. తన అహంకార ధోరణి తనకే అర్థం కావడంతో, ఆ శిల్పి పశ్చాత్తాపంతో తండ్రి ముందర తల దించుకున్నాడు. – ఆర్.సి. కృష్ణస్వామిరాజు -
పితృకార్యాలు.. ఎక్కడ చేస్తే మంచిది?
పితృదోషాలు.. వాటి పరిష్కారమార్గాల గురించి మనం ఇదివరకు చేసిన వీడియోల్లో చెప్పుకొన్నాం కదా..! జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక అడ్డంకులు.. వైవాహిక సమస్యలు, తీరని ఆర్థిక ఇబ్బందులకు కేవలం గ్రహగతులు మాత్రమే కాకుండా.. పితృదోషాలు కూడా కారణం కావొచ్చని చెప్పుకొన్నాం. అసంతృప్తిగా ఉండే పూర్వీకుల ఆత్మల శాపం.. ఆ వంశంపై పడుతుంది. అయితే.. ఆత్మలకు శాంతిని చేకూర్చి, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు కొన్ని పవిత్ర స్థలాలను మన పురాణాలు సూచించాయి. ఆ ప్రాంతాల్లో పిండప్రదానాలు చేస్తే.. పితృదేవతలు సంతృప్తి చెందుతారని వివరిస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..పితృదోషాలు, పితృశాపాల నుంచి విముక్తి ఎలా లభిస్తుందని చెబుతుంటారు? పూర్వీకులకు తర్పణాలు అర్పించడానికి ఏ క్షేత్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు? ఏ క్షేత్రంలో పిండప్రదానాలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు నేరుగా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు? ఏయే ఆలయాలను పితృ దోష నివారణకు అద్భుతమైనవిగా చెబుతారు? ఎక్కడ ‘మోక్ష దీపాన్ని’ వెలిగించడం ద్వారా పూర్వీకుల కోపం తొలగి.. కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుంది? వంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి.. -
బాహ్య సౌందర్యం.. ఆత్మ సౌందర్యం.. ఏది మిన్న?
చాలామంది సౌందర్యానికి ప్రతీక ఏమిటంటే ‘మోనాలిసా‘ అని చె΄్తారు. మోనాలిసా చిత్ర పటాన్ని తయారు చేసిన కళాకారుడు లియోనార్డో డావిన్సీ. అతను ఫ్రాన్స్‌కు చెందిన కళాకారుడు, శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి.అతను గీసిన మోనాలిసా చిత్రపటం, నిజానికి ఒక బిడ్డను కోల్పోయిన తల్లిది. ఆమె తన బిడ్డ చనిపోవడం వలన చాలా కాలం΄ాటు దుఃఖంతో బాధ పడుతుంది. ఒకరోజు తన బిడ్డ పోలికలున్న మరొకరి బిడ్డను చూసినప్పుడు, ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు ఉదయిస్తుంది. ఆ సమయంలో ఆమె ముఖంలో వెలిగిన చిరునవ్వును డావిన్సీ యథాతథంగా చిత్రించారు. ఎన్ని తరాలు గడిచినా ఇప్పటికీ, ఆమె ముఖంలో విరిసిన చిరునవ్వు సౌందర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది.నేటి ఆధునిక కాలంలో అందానికి ఉన్న నిర్వచనాల ప్రకారం మోనాలిసా పెద్ద అందగత్తె కాదు. అయినప్పటికీ కొన్ని తరాలుగా, ఆమె చిత్రపటం అందరినీ ఆకర్షిస్తూనే ఉంది. సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూనే ఉంది. దానికి కారణం ఏమిటి? ఆ చిత్రపటం నుండి వచ్చే చైతన్య తరంగాలు, వైబ్రేషన్స్, మానవులలో గల అంతరాత్మను స్పృశిస్తాయి. అది ఆత్మసౌందర్యాన్ని ప్రతిబింబించే చిత్రపటం.ఒక స్త్రీ ముఖంలో మాతృప్రేమ ప్రతిఫలిస్తున్నప్పుడు, ఆమె అత్యంత సుందరంగా కనిపిస్తుంది. మానవుల దృష్టిని అథోముఖంగా తీసుకొని వెళ్ళే భౌతికమైన శరీర ఆకర్షణ అంత ముఖ్యమైనది కాదు. మన శరీర ప్రతిభాగం నుండి చైతన్య తరంగాలు ప్రవహించేలా మనం ఉండాలి. మన శరీరంలో అన్ని భాగాలు శుభప్రదంగా ఉండాలి.మనం దేనినైనా తాకినట్లయితే, దాని నుండి చైతన్య తరంగాలు ప్రవహించడం ్ర΄ారంభించాలి. అటువంటి శరీర సౌందర్యం దైవికమైన సౌందర్యం. బాహ్య సౌందర్యం వెంట కృత్రిమమైన ఆకర్షణల వెంట పరుగెత్తడం మంచిది కాదు.మనం శ్రద్ధ వహించవలసిన విషయమేమిటంటే – మన శరీరం మన ప్రతి భాగంలో పవిత్రత ప్రవహించే విధంగా ఉందా? మనల్ని చూస్తే ప్రజలు పవిత్రమైన భావనలు పొందుతున్నారా లేదా అపవిత్రమైన భావనలు పొందుతున్నారా? వేల సంవత్సరాల నుండీ వారసత్వంగా పొందిన సంస్కృతీ సంప్రదాయాలు మన భారతీయుల దగ్గర ఉన్నాయి. ఆ సంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. – డా. ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా) -
మనమే క్షమించే ధోరణితో ఉంటే.. అదెంత గొప్ప గుణం!
మనం తప్పులు చేసి క్షమించమని దేవుణ్ణి మనసారా కోరుకుంటాం. ప్రతి మత విశ్వాసం ప్రకారం అలా కోరుకుంటే దేవుడు మనల్ని క్షమించి కరుణించుతాడని నమ్మకం... మానవ జీవితంలో మనం అలవరచుకోవలసిన గొప్ప అలవాటు.. క్షమించడం. ఆదిశంకరాచార్యులు వారు రాసిన ఎన్నో శ్లోకాల్లో పూజావిధానంలో జరిగే తప్పులను క్షమించమని అర్థిస్తాం. ఇంకా ‘కరచరణ కృతం వాక్కాయజం వా... సర్వమేతమస్వ’లో భావం అదే.. క్షమాప్రార్థనతోనే పూజ ముగుస్తుంది. ఇదంతా వేడుకోవడం.. కాని మనమే క్షమించే ధోరణితో ఉంటే, అదెంత గొప్ప గుణం! మన శతకాల్లో క్షమాగుణాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు..‘ఓర్పు లేని వాడు ఊరకే చిక్కునుక్షమయా ధరిత్రిగాదె క్షమయే భూషణము’ అంటాడు వేమన. క్షమాగుణమే ఆభరణం...సుమతీ శతకంలో క్షమాగుణం లేని వాడు పశువంటాడు, బద్దెన..‘క్షమ లేనివాడు పశువు, క్షమయే సర్వోత్తమ గుణము’భాస్కర శతకంలో ...‘క్షమ గలవాడే ధన్యుడు, క్షమ లేని వాడు దరిద్రుండు క్షమచే జయింపరానిది లేదు మూడు లోకములందు’.. మూడు లోకాల్లోను గెలవవచ్చు క్షమ అనే గుణంతో అన్నాడు.భర్తృహరి ‘క్షమా బలం అబలానాం’ అని సెలవిచ్చాడు.. దెబ్బ సహించటమే గొప్ప శక్తి...రామదాసుగా శాశ్వత కీర్తి గడించిన కంచెర్ల గోపన్న తాను రాసిన దాశర థీ శతకంలో ‘క్షమ లేని చదువు గుణహీన విద్యయు క్షమ లేని తపము వ్యర్థ తపంబు క్షమ లేని దానము కల్మష దానంబు క్షమ లేని మాన్యత కపట మాన్యత’..క్షమ లేనిదే విద్య, తపం, దానం, గౌరవం తగవని చెప్పాడు.కుమార శతకంలో ‘క్షమయే పరమధర్మము క్షమయే పరమ సుఖము క్షమయే పరమవిద్యయు క్షమయే పరమ గతి క్షమలేని యోగము, భోగము పనికిరాదు క్షమయే ముక్తికి మార్గము సుమ్ము కుమారా’ అని చెప్పారు.సారంగధర శతకంలో ఓర్పు ఉన్నవాడిదే గెలుపని, ఓర్పు ఉన్నవాడే యోగి అని అర్థం వచ్చే పద్యం ఉంది.నారాయణ శతకంలో ‘క్షమయే విష్ణురూపంబు క్షమయే పరబ్రహ్మము క్షమయే జగతికి ఆధారము క్షమయే నిజమైన భక్తి క్షమించేవాడు నరుడు మిగిలిన వారెల్ల పశువులు’...చూశారా... క్షమకి ఎంతప్రాముఖ్యత ఇచ్చేరో... మానవ సంబంధాలు బల పడాలంటే అందరం క్షమాగుణం అలవర్చుకోవాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
432 ఏళ్లుగా ఆగని అడుగులు..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు మారారు. రోజులు మారాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ.. 1594 నుంచి ఒక్క ఏడాది కూడా ఆగకుండా భాగ్యనగర గుండెల్లో నడిచే చరిత్ర ఇది. కుతుబ్ షాహీల వారసత్వం, నిజాం పాలనకు ముగింపు పలికినా చెక్కుచెదరని సంప్రదాయం బీబీ కా అలం. వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన అలంతో ఏనుగుపై సాగే ఈ ఊరేగింపు ఈ నెల 26న మరోసారి నగర వీధుల్లో పునరావృతం కానుంది. మొహర్రం సందర్భంగా ఈ ఏడాది కేరళ నుంచి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురావడం విశేషం.వజ్ర, వైఢూర్యాల వైభవం.. మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా కాలం చేసిన అనంతరం ఆమె చివరి స్నానంగా వినియోగించిన బల్లను ఆరో కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీ తల్లి హయత్ భక్షి బేగం కోరిక మేరకు తీసుకొచ్చి దాంతోనే తయారు చేసిన అలంను ఆమె జ్ఞాపకార్థం నగరంలో 1594లో ప్రతిíÙ్ఠంచారు. నిజాం పాలకులు బహుమతిగా ఇచి్చన వజ్రాలు, వైఢూర్యాలు, అరుదైన రత్నాలు అలం చుట్టూ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.ఏడాది పొడవునా దబీర్‌పురాలోని బీబీ కా అలావాలో పోలీసుల ఆర్మ్డ్ గార్డ్ రక్షణలో భద్రంగా ఉంచి, ఊరేగింపు రోజు మాత్రమే వీటిని బయటకు తీస్తారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో 432 ఏళ్లుగా ఊరేగింపు కొనసాగుతోంది. ఈ నెల 26న దబీర్‌పురా నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు సాగే ఊరేగింపునకు 2వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంప్రదాయం హైదరాబాద్ మత సామరస్యానికి, గంగా జమునా తెహజీబ్‌కు నిలువెత్తు నిదర్శనం. -
పరమ తండ్రి ప్రేమ
ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచనలు చేయక తప్పదు. విలువైన మూలాల వలన మూల΄ాఠములవలన ఇట్టి క్షేత్రస్థాయి వనరుల వలన సువాసనసారం ఎది ఉన్నా అది నేరుగా బయటపడి జీవితాలకు వంటబడుతుంది. పరిశోధనాత్మక ఆత్మ సంబంధ అభ్యాస జీవితానికి అన్వయించుకునేలా క్రీస్తు సందేశాలు ఎప్పుడూ ఘనంగానే ఉండుట అనేది గమనార్హం.‘నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను’ అంటాడు అద్వితీయ సత్యదేవుడు. ఆయన మనస్సు ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తువారి ఉన్నతమైన బోధ ఏమంటే ‘ఈ భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు’. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనేది వేరే అంశం. ధర్మశాస్త్రాన్ని మరింత లోతుగా పరిశోధించినా, యేసు అసాధారణ బోధల ప్రకారంగా చూసినా కూడా ఒకరు ఆత్మ సంబంధంగా తండ్రి హోదాను అనుభవించడం దేవునికి కోపం తెప్పించే విషయమే కాక, ఇదొక గొప్పదైన విశేషం కూడానూ.గ్రంథప్రకారంగా దేవుని మహిమను దొంగిలించడం ఘోరతప్పిదమే అని చెప్పక తప్పదు. మేము మీకు ఆత్మీయ తల్లిదండ్రులం అంటూ సువార్తికులు, బోధకులు, సంఘ పెద్దలు పిలిపించుకోవడం లేఖన విరుద్ధం. మీరంతా సహోదరులు అనునదే క్రీస్తు బోధ. మనమంతా క్రీస్తునందున్నా సహోదరీ సహోదరులం. దేవుని పిల్లలం అనేదే లేఖన సంబంధ సర్వసత్యం. ఎప్పుడూ యేసును రబ్బునీ అని పిలుచుకొనే మగ్దలేనే మరియకే సమాధి దగ్గర మొట్టమొదటగా యేసు పునరుత్థానుడిగా దర్శనమిస్తూ చెప్పిన మాట ఆశ్చర్యకరమే. ‘నా సహోదరులవద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కి΄ోవుచున్నానని వారితో చెప్పుమనెను’. యేసుక్రీస్తు వారి తండ్రి, సర్వమానవాళి తండ్రి ఒక్కరే. ఆయనే యెహోవా అనబడే తండ్రియైన దేవుడు.హెబ్రీగ్రంథ లేఖికుని వివరణలో ‘నీవు నాకు ఇచ్చిన పిల్లలు’ అని ఒకచోట క్రీస్తు అన్నట్టుగా వ్రాయబడింది గానీ తండ్రి అని ఆయన పిలిపించుకొన్న దాఖలాలు ఎక్కడనూ లేవు. క్రీస్తు అపొస్తలులు కూడా ‘అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే’ అన్నది చాలా సూటిగా సుస్పష్టంగా ఉన్నతంగా వివరిస్తూ దేవున్ని ఎంతగానో హెచ్చిస్తూ గొప్ప చేసారు. సంఘ సహకారం తీసికొని సంఘసమక్షంలో సంఘంతో కలిసి గ్రంథాన్ని పఠిస్తే యేసు తన తండ్రియైన దేవునికి ఎంతగా విధేయుడై లోబడ్డాడో అనేది తేటగా అర్థమవుతుంది.ఒక తండ్రికి ఎంతటి కఠినాత్ముడైనా, అవిధేయుడైనా కుమారుడు ఉన్నప్పటికీ అతనికి యేసు విధేయతా జీవిత విధానం గూర్చి బోధిస్తే మొదట ఆలోచనలోపడి ఇక మార్పు తప్పని పరిస్థితే అతనికి ఎదురవుతుంది. కుమారునిగా యేసు జీవితం అంతటి ఉన్నతమైనది. పరమందున్న తండ్రియైన ఆ దేవదేవునికి, ఇంట్లో ఉన్న నాన్నకు లోబడి జీవించడం మనకెప్పుడూ గౌరవం తెచ్చే సత్క్రియే అనుటలో ఎలాంటి సందేహం లేదు. – జేతమ్ -
అంతా ఆచార్యుడి నిర్ణయమే..!
‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
కాబాను కాపాడిన పక్షుల కథ!
చాలాకాలం క్రితం.. అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన కథ ఇది. అప్పట్లో యెమెన్ దేశాన్ని ‘అబ్రహ’ అనే ఒక క్రూరమైన రాజు పాలిస్తుండేవాడు. మక్కా నగరంలోని పవిత్ర ‘కాబా’ మందిరానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రావడం, అక్కడప్రార్థనలు చేయడం అబ్రహకు అస్సలు నచ్చలేదు. ప్రజలందరూ తన దేశానికే రావాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా, కోట్లు ఖర్చు పెట్టి తన రాజధానిలో ఒక పెద్ద, అందమైన చర్చిని కట్టించాడు. ‘ఇకపై ఎవరూ మక్కాకు వెళ్లకూడదు, అందరూ నా దగ్గరికే రావాలి‘ అని హుకుం జారీ చేశాడు. ఈ విషయం తెలిసి అరబ్బులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఒక అరబ్ వ్యక్తి, రాత్రికి రాత్రే అబ్రహ కట్టించిన చర్చిలోకి దూరి, అపవిత్రం చేశాడు. దీంతో అబ్రహకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నా చర్చిని అవమానిస్తారా? ఆ మక్కాలో ఉన్న కాబా మందిరాన్ని పునాదులతో సహా కూల్చేస్తా!’ అంటూ కరడుగట్టిన సైన్యంతో మక్కా వైపు బయలుదేరాడు.గజరాజుల సైన్యం.. వణికిపోయిన మక్కా!అబ్రహ సైన్యం మామూలు సైన్యం కాదు. శత్రువులను తొక్కి పారేయడానికి కొండల లాంటి భారీ ఏనుగులను ఆ సైన్యంలో చేర్చాడు. దారిలో అడ్డువచ్చిన చిన్న చిన్న తెగలను చీల్చిచెండాడుతూ అబ్రహ సైన్యం మక్కా సరిహద్దుల్లోకి చేరుకుంది. అక్కడ అమాయక ప్రజల ఆస్తులను, ఒంటెలను దోచుకుంది. అలా దోచబడిన వాటిలో మక్కా నాయకుడు, ప్రవక్త ముహమ్మద్ గారి తాతగారైన ‘అబ్దుల్ ముత్తలిబ్’కు చెందిన 200 ఒంటెలు కూడా ఉన్నాయి. యుద్ధం వద్దనుకుంటే కాబాను కూల్చడానికి అడ్డుపడొద్దని అబ్రహ సందేశం పంపాడు. దాంతో చర్చల కోసం అబ్దుల్ ముత్తలిబ్ నేరుగా అబ్రహ డేరాకు వెళ్లారు. ఆయన గంభీరమైన రూపాన్ని చూసి అబ్రహ ముచ్చటపడ్డాడు. ‘ఏం కావాలి?’ అని అడిగాడు.‘నీ సైన్యం నా 200 ఒంటెలను పట్టుకెళ్లింది, వాటిని నాకు ఇచ్చేయ్’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ ప్రశాంతంగా. అబ్రహ ఆశ్చర్యపోయాడు, నవ్వుతూ అవహేళన చేశాడు. ‘మిమ్మల్ని చూసి గొప్పవాడనుకున్నా! నేను మీ పవిత్రమైన కాబా మందిరాన్ని కూల్చేయడానికి వస్తుంటే, దాని గురించి అడగకుండా మీ ఒంటెల గురించి అడుగుతున్నారేంటి?’ అన్నాడు.దానికి అబ్దుల్ ముత్తలిబ్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఎంతో ధీమాగా.. ‘ఆ ఒంటెలకు యజమానిని నేను, అందుకే నా ఒంటెలను అడిగాను. కానీ, ఆ కాబా మందిరానికి ఒక యజమాని (అల్లాహ్) ఉన్నాడు. దానిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు!’ అని చెప్పారు. తిరిగి వచ్చిన అబ్దుల్ ముత్తలిబ్, ప్రజలందరినీ కాబా ఖాళీ చేసి,ప్రాణాలు కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న కొండలపైకి వెళ్ళిపోవాలని ఆదేశించారు.మోకాళ్లూనిన ఏనుగు.. ఆకాశంలో అద్భుతం!మరుసటి రోజు ఉదయం.. అబ్రహ సైన్యం కాబా వైపు అడుగులు వేయడంప్రారంభించింది. ‘మహమూద్’ అనే ఒక పెద్ద ఏనుగు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తోంది. కానీ, సరిగ్గా కాబా వైపు నడవమనేసరికి ఆ ఏనుగు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మోకాళ్లూని కూర్చుండిపోయింది! దానిని ఎంత కొట్టినా, పొడిచినా కదలలేదు. అదే విచిత్రంగా యెమెన్ వైపో, లేదా వేరే దిశల వైపో తిప్పితే మాత్రం పరిగెత్తింది. అబ్రహ సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. సముద్రం వైపు నుండి వేలాది పక్షుల సమూహాలు మక్కా వైపు రాసాగాయి. వాటిని అరబ్బీలో ‘అబాబీల్’ అంటారు. ఆ చిన్న చిన్న పక్షుల నోట్లో ఒక రాయి, రెండు కాళ్లలో రెండు రాళ్లు ఉన్నాయి. అవి మామూలు రాళ్లు కావు.. కాల్చిన మట్టి రాళ్లు (సిజ్జీల్).తిన్న గడ్డిపరకల్లా.. సర్వనాశనం!ఆ పక్షుల సైన్యం అబ్రహ సైన్యంపైకి రాగానే, తమ కాళ్లలో, నోట్లో ఉన్న రాళ్లను పైనుంచి తుపాకీ గుళ్లలా వర్షింపజేశాయి. ఆ చిన్న రాళ్లు ఏనుగుల మీద, సైనికుల మీద పడగానే.. శరీరాన్ని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి. రాజు అబ్రహతో సహా సైన్యమంతా కకావికలమైపోయింది.పవిత్ర ఖురాన్ లోని ‘సూరహ్ అల్–ఫీల్’ (105:5) లో దేవుడు చెప్పినట్లుగా.. ఆ భారీ సైన్యం అంతా ‘పశువులు నమిలి పారేసిన గడ్డిపరకల్లా, పొట్టులా’ మారిపోయింది. అహంకారంతో వచ్చిన అబ్రహ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునిప్రాణాలతో పారిపోతూ దారిలోనే అంతమయ్యాడు. కాబా మందిరం సురక్షితంగా నిలిచింది! – ముహమ్మద్ ముజాహిద్ -
ఆధ్యాత్మిక జ్వాల..
క్రీస్తు కంటే ముందు పుట్టి, ఈ నేలపై క్రీస్తు మార్గం సరాళం చేయడానికి శ్రమించినవాడు యోహాను. ఆనాటి ప్రజల్ని దేవునివైపు తిప్పుతూ, వస్తాడు నా దేవుడంటూ ప్రజలకు నీళ్ళతో బాప్తిస్మం ఇస్తూ, ఓ చైతన్య జ్వాలలా అరణ్య ప్రాంతాల్లో దైవ స్వరం వినిపించిన సంచార స్వరాల ప్రయోక్త, మహా భక్త బాప్తిస్మ యోహాను.‘స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు’– ఈ మాటలు మరియతో ఎలిజబెత్ అన్నది. అప్పటికి ఆమె ఆరు నెలల గర్భవతి. అన్నది ఎలిజబెత్. విన్నది మరియ. అక్కడ ఉన్నది వీరిద్దరే. కానీ ఆ మాటల్ని మరియతో పాటు ఇంకా మరో ఇద్దరు విన్నారు. ఒకరు ఎలిజబెత్తమ్మ గర్భంలోని బాప్తిస్మ యోహాను, మరొకరు మరియ గర్భంలోని యేసు.యేసు గురించి గర్భస్థ శిశువుగా విన్నాడు కాబట్టే, ఆయన ఔన్నత్యాన్ని ఘంటాపథంగా లోకానికి చాటగలుగు తున్నాడు యోహాను! లోకంలో జరిగే మంచీ చేడుల్ని చూచినవి చూచినట్టుగా ప్రజలకి వివరిస్తూ, రాచరికంలోని వైనా ఘాటుగా విమర్శించేస్తున్నాడు. ప్రజలంతా ఆయన్ను ఓ అడవిలో అన్నగా గుర్తిస్తే, రాచరికం మాత్రం ఓ తిరుగు బాటుదారునిగా గుర్తించింది.ఫిలిప్పు భార్య హేరోదియ. ఆమె తన భర్త ఫిలిప్పును వదిలేసి, అతని తమ్ముడు హేరోదు అంతిపస్ని పెళ్లి చేసుకుంది. అంతిపసు ప్రస్తుతం ఆ గలిలయ రాజు. ఓసారి తన ప్రసంగంలో ‘నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట న్యాయము కాదు’ అని రాజును బహిరంగంగా ఖండించాడు. అగ్గిమీద గుగ్గిలమైంది రాజు కాడు, హేరోదియ.హేరోదియకు ఓ కూతురు. పేరు సలోమి. ఆరితేరిన నర్తకి. ఓ రోజు ఆడింది పాడింది, ఆ రాజును మెప్పించింది. ఏమి కావాలో కోరుకోమన్నాడు రాజు. తల్లిచేసిన దుర్బోధలచే సలోమి యోహాను శిరస్సు కోరుకొంది. సరే అన్నాడు రాజు. మరుక్షణంలోనే పళ్ళెరాన యోహాను శిరస్సు! కానీ మరణంనుంచే గలిలయలో కొత్త విప్లవం ఆవిర్భవించింది. యోహాను స్ఫూర్తి ఖండఖండాలకు పాకింది. – డా‘‘ దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 24న బాప్తిస్మ యోహాను జన్మదినం) -
కోరికల పరుగు
ఈ అనంత విశ్వంలో మానవ జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణానికి ఇంధనం, వేగం, దిశ అన్నీ ఇచ్చేది ఒక్కటే ‘కోరిక’. పుట్టుకతో మొదలైన ఈ కోరికల పరుగు, మనిషి చివరి శ్వాస విడిచే వరకు సాగుతూనే ఉంటుంది. నది సముద్రంలో కలవాలని పరిగెత్తినట్లు, మనిషి కోరికల వెనుక పరిగెడుతుంటాడు. కానీ నదికి గమ్యం దొరుకుతుంది, మనిషి కోరికల పరుగుకు గమ్యం దొరకడం లేదు. ఆధ్యాత్మిక కోణంలో ఈ ‘కోరికల పరుగు’ వెనుక ఉన్న రహస్యాన్ని, దాని ప్రమాదాలను, దాన్ని అధిగమించే మార్గాన్ని విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన నిజాలు కనిపిస్తాయి. హిందూ తత్వశాస్త్రంలో కోరికను ‘తృష్ణ’ అంటారు. తృష్ణ అంటే కేవలం దాహం కాదు, ఎంత తాగినా తీరని విచిత్రమైన దాహం. ఒక కోరిక నెరవేరగానే, ఆ సంతోషం కొద్దిసేపట్లోనే ఆవిరైపోతుంది. ఆ స్థానంలో మరో కొత్తకోరిక మొలకెత్తుతుంది. సైకిల్ ఉన్నవాడు బైక్ కావాలంటాడు, బైక్ ఉన్నవాడు కారు కావాలంటాడు, కారు ఉన్నవాడు విమానం కావాలంటాడు. ఈ పరుగు వస్తువుల దగ్గరే ఆగిపోదు; కీర్తి, అధికారం, పదవుల వైపు విస్తరిస్తుంది. ఈ పరుగులో మనిషి ’వర్తమానాన్ని’ (జీవితాన్ని) పూర్తిగా కోల్పోతున్నాడు. మన జీవితాల్లో కూడా ‘ఈ ఒక్క కోరిక తీరితే నేను ప్రశాంతంగా ఉంటాను’ అని అనుకుంటాం. కానీ ఆ కోరిక తీరిన తర్వాత కూడా ప్రశాంతత దొరకదు. సుఖం అనేది వస్తువుల్లో లేదు, మన అంతరంగంలో ఉందనే సత్యాన్ని గ్రహించకుండా బాహ్య ప్రపంచంలో వెతకడమే ఈ మృగతృష్ణ. ప్రాపంచిక విషయాల వైపు పరిగెత్తే మనస్సును – సేవ, కరుణ, భక్తి, ఆత్మవిచారణ వైపు మళ్ళించడం. నది ప్రవాహాన్ని మళ్ళించి పంటలు పండించినట్లు, కోరికల శక్తిని ఆధ్యాత్మిక ప్రగతికి వాడుకోవచ్చు.కోరికల పరుగులో అలసిపోవడం కాదు, ఆ పరుగును ఆపి ‘నేను ఎటు పరిగెడుతున్నాను? ఎందుకు పరిగెడుతున్నాను?’ అని ఒక్క క్షణం ఆగి ఆలోచించడమే వివేకం. పరుగు ఆగిన చోటే ప్రశాంతత మొదలవుతుంది. ఆ ప్రశాంతతే పరమాత్మ స్థితి. మనస్సు అనే అశ్వాన్ని కోరికల వైపు కాకుండా, అంతిమ సత్యం వైపు నడిపించినప్పుడే ఈ జీవన ప్రయాణానికి సార్థకత లభిస్తుంది.కోరికలు ఉండటం సహజం, కానీ కోరికలే మనల్ని నడపడం ప్రమాదకరం. ఈ పరుగును అదుపు చేయడానికి ఆధ్యాత్మికత కొన్ని మార్గాలను చూపుతోంది.‘నాకు ఏది లభించిందో అది భగవత్ ప్రసాదం’ అనే భావన అలవడినప్పుడు పరుగు వేగం తగ్గుతుంది. కోరిక పుట్టినప్పుడు దాంతో పాటు పరిగెత్తకుండా, ‘నా మనస్సులో ఈ కోరిక పుట్టింది‘ అని ఒక మూడోవ్యక్తిలా గమనించడం ఒక్కటే పరిష్కారం.శ్రీ శంకరాచార్యులు భజగోవింద శ్లోకాల్లో కోరికల తీవ్రతను హెచ్చరించారు. అగ్నిలో నెయ్యి పోస్తే అగ్ని చల్లారదు, ఇంకా ఎక్కువ రగులుకుంటుంది. అలాగే, కోరికలను తీర్చుకుంటూ పోతే అవి శాంతించవు, మరింత బలీయంగా తయారవుతాయి. శరీరం ముసలిదైపోయినా, పళ్ళు రాలిపోయినా, చేతికి కర్ర వచ్చినా... మనస్సులో ఉన్న ఆశ/కోరిక మాత్రం ముసలిది కాదు, అది పరిగెడుతూనే ఉంటుంది.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
శతక నీతి: త్యాగం!
పిల్లల పెంపకంలో తల్లితండ్రులకు ఓపిక, సహనంతోబాటు ఎంతో త్యాగగుణం.. తాము పస్తులుండి పిల్లలను పెంచే తల్లిదండ్రుల సహజగుణం త్యాగమే.. దేశసేవలోప్రాణాలను ఫణంగా పెట్టి తెగించి త్యాగం చేసే సైనికుల త్యాగం నిస్వార్ధబుద్ధికి మరో ఉదాహరణ...వేమన త్యాగాన్ని ‘వివేకంతో కూడిన దానం’గా పరిగణిస్తాడు..‘తనకు గలదెల్ల ఇతరలకు దానమిచ్చుత్యాగియగు వాడు భువికి దైవమగును సుమ్ము’...అంటాడు.. తన దగ్గర ఉన్నదంతా దానం చేసే వ్యక్తి ‘దేవుడ’ట... దీన్ని బట్టి త్యాగం చేసే వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతమో ఆలోచించండి.. దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రతిష్టలూ ఆశించకూడదు. అందుకే గుప్తదానం అంటారు.. తనకున్న దానిలోంచి కొంత ఇవ్వడం దానం అయితే పూర్తిగా వదులుకోవడం త్యాగం అని అనవచ్చు.. తన ఆస్తిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పరులకోసం వదులుకోవడం త్యాగం అవుతుంది.సుమతీ శతకంలో...‘కష్టకాలమందు సహాయము చేయువాడుత్యాగియని బుధులు పొగుడుదురు కదరా సుమతీ’...అటుపక్క వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తిని త్యాగి అని కొనియాడారు. పరోక్షంగా ‘విత్తము గలవాడు వితరణి చేయక, పొదుపు చేసినచో పురుగుగ పుట్టును’ అని శపించాడు, బద్దెన సుమతీ శతకంలో. వైరాగ్యకోణంలో భోగాలను, సుఖాలు, సిరిసంపదలను త్యాగం చేసి.. అంటే వదులుకుని ఆత్మజ్ఞానం పొందండని భర్తృహరి సలహా.. ‘భోగేరోగభయం కులే చ్యుతిభయం.. సర్వం వస్తుభయాన్వితం’.. అన్నీ భయమే, అందుకే వదులుకోండి అని ఉవాచ.నారాయణ శతకంలో, కుమార గిరి శతకంలో, దాశరథి శతకంలో దేవుడు కోసం త్యాగం చేయమంటారు..ధనత్యాగం, భోగత్యాగం, కక్ష, గర్వం, కోరికలు మొ... త్యాగం చేయటం చాలా గొప్ప... పురాణాల్లో కర్ణుడు, దధీచి, శిబి, బలి హరిశ్చంద్రుడు మొదలగు వారు ఉంటే కలియుగంలో ఎందరో మాతృమూర్తులు, సైనికులు, మహానుభావులు... ధనం,ప్రాణం త్యాగం చేసిన వారున్నారు.. వారికి నివాళులతో... – డా. కందాళ సత్యనారాయణమూర్తి -
సువార్త: చెయ్యెత్తి జైకొట్టే జైత్రయాత్ర
బాప్తిస్మమను దేవుని సంకల్పాన్ని పరిసయ్యులు నిరాకరిస్తూ వచ్చారు. యేసు దానికి లోబడ్డాడు. ‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తూ ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’ అంటూ యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు ఉత్తరమిస్తూ అతని ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు. ఒడ్డుకు రాగానే ఆకాశం తెరువబడి దేవుని ఆత్మ పావురంవలె దిగి ఆయన మీదకు వచ్చాడు.‘ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనయందు నేను ఆనందించుచున్నాను’ అనే ఒక శబ్దము అది తండ్రియైన దేవుని స్వరము అనేలా ఆకాశము నుండి వచ్చింది. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ ప్రేరణ వలన అరణ్యమునకు త్రోసికొనిపోబడ్డాడు. నలుబది దినములు, రాత్రులు ఉపవాసం ఉంటూ అడవి మృగాల మధ్య గడిపాడు. యేసు ఆకలితో ఉన్న ఈ సమయాన అపవాది వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. యేసు ధీరుడిగా నిలబడి తలపడి ఆ శోధకుడను ఓడించాడు.చెయ్యెత్తి జైకొట్టాలనే యేసు జైత్రయాత్ర సరిగ్గా ఇక్కడనే మొదలైంది. యేసు శిశువుగా ఉన్నప్పుడే ఆయన జైత్రయాత్రను, అనేక ఒడిదుడుకులలో అంతటా అట్టి విజయాన్నే చూస్తామని కొందరు అంటారు గానీ ఇది దేవుని కాపుదల, సంరక్షణ. పండితులు, ధర్మశాస్త్రోపదేశకులు, దేవుని రాజ్యాంగ చట్టనిపుణులు వంటివారు బాలుడిగా ఉన్న యేసు ఆనాడు బోధకులను సైతం ఆలోచనల్లో పడవేసిన విధానం గుర్తు చేసుకుంటారు. ఇలా యేసు బాల్యంలోనే ఆయనదైన జైత్రయాత్ర ప్రారంభమైందనేవారు లేకపోలేదు.ఆ వివరాలలోకి వెళితే – తన తల్లి మరియతో బాలుడిగా ఉన్న బాలయేసు ‘నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా?’ అన్నాడు. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడు. ఆయన మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరములకు విస్మయమొందుచున్నారు.మరల మనం మొదటికి వస్తే, సాతాను అనే శోధకుడు ఆకలితో ఉన్న యేసు వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఆపై కడుపారా తిని నీ ఆకలి తీర్చుకో అంటూ శోధించాడు. యేసు అతనికి ధీటుగా జవాబిచ్చాడు. ‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును’ అన్నది ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉందని చె΄్పాడు.అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి దేవాలయ శిఖరం మీద ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు. దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు వచ్చి నీ పాదములు రాతికి తగులకుండ నిన్ను తమ చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడింది అంటూ అపవాది యేసువలె వాక్య వచనంతో మాట్లాడాడు. అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొకచోట వ్రాయబడిఉన్నదని అపవాదికి చె΄్పాడు.మరల అపవాది మిగుల ఎత్తయిన ఒక కొండ మీదకు ఆయనను తీసికొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటిని నీకు ఇచ్చెదను అంటూ ఆయనను మరీమరీ శోధించాడు. యేసు వానితో – సాతానా, ΄÷మ్ము ! ప్రభువైన నీ దేవునికి మ్రోక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. దీంతో అపవాది ఆయనను విడిచిపోయాడు.యేసు అంతటి ఆకలిలోను సాతాను శోధనలకు ఏమాత్రం లొంగలేదు. స్వకీయ మహిమను ఏనాడూ వెదకకుండా తన సొంత మాటలు, జ్ఞానంతో కాక, దేవుని వాక్యపుశక్తితో శత్రువైన సాతానును ధీటుగా ఎదుర్కొని ఎదిరించిన వైనం అమోఘం. ఇక్కడి నుండే యేసు జైత్రయాత్ర మొదలైందని చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ విజయయాత్ర సిలువ మరణం వరకు అప్రతిహతంగా కొనసాగింది. – జేతమ్ -
అంతఃశక్తి... అంతులేని బలం
జీవితం అనేది నిరంతరాయంగా సాగిపోయే ఒక ప్రవాహం. ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలడం సహజమే అయినా, నేటి ఆధునిక కాలంలో చాలామంది చిన్నపాటి కష్టాలకే నైరాశ్యంలో మునిగిపోతున్నారు. విజయాల కోసం, బాహ్య ప్రపంచంలో ఎవరో వస్తారని ఎదురుచూడటం కన్నా.. ప్రతి మనిషి తనలోని అపారమైన అంతర్గత శక్తులను గుర్తించడమే పరమార్థం.భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కాలం కలిసిరానప్పుడు బాహ్య పరిస్థితులను నిందించడం మాని, ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా మలచుకోవాలి. మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ, సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అవకాశాలుగా మార్చుకునే వివేకం లభిస్తుంది.ఈ అంతఃశక్తిని మేల్కొలిపి, జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మన మహర్షులు కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా చంచలమైన మనస్సు ప్రశాంతతను ΄÷ంది, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టత వస్తుంది. దీనితో పాటు సద్గ్రంథ పఠనం బుద్ధిని వికసింపజేసి జీవన సత్యాలను బోధిస్తే.. సత్సంగం (మంచి వ్యక్తుల సహవాసం) మనలో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.సముద్రంలో అలలు ఎంత సహజమో, జీవితంలో కష్టాలూ అంతే సహజం. ఎడారిలో సైతం వేళ్లను లోతుగా పాతుకుని జీవాన్ని వెతుక్కునే మొక్కలా.. మనిషి తన ఆత్మబలాన్ని నమ్ముకుని, ప్రతి కొత్త రోజును ఒక అవకాశంగా భావించి విజయపథంలో ముందుకు సాగాలి. – పసుపులేటి వెంకటేశ్వరరావు -
ముహర్రం నెల అల్లాహ్ మాసం..
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలుఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.జీవిత పాఠంఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.త్యాగాల స్మరణ...ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!– ముహమ్మద్ ముజాహిద్ -
ఆధ్యాత్మి కథ : శాశ్వతానంద్రప్రాప్తి..
దశరథ మహారాజు ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. కౌసల్యాదేవి పరిపూర్ణ దివ్యత్వంతో ఉట్టిపడుతున్న శ్రీరామునికి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఒక చెలికత్తె వెళ్లి దశరథ మహారాజుకు విన్నవించగా ఆయన పట్టలేని ఆనందంతో ఎంతో విలువైన ఒక రత్నాల హారాన్ని ఆమెకు కానుకగా అందించబోయాడు. అప్పుడా చెలికత్తె, ‘మహారాజా! నాకు ఇవేవీ వద్దు. నేను కోరుకునేది ఒకటి ఉంది. ఇప్పుడు జన్మించిన బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించే భాగ్యాన్ని నాకివ్వండి, చాలు’ అన్నది. సామాన్యురాలైన ఒక చెలికత్తె ఎంతటి ఉత్కృష్టమైన కోరిక కోరుకుందో! ఒక్కొక్కరి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైన పవిత్ర భావాలు వారిలో ఆవిర్భవిస్తుంటాయి.అరణ్యవాసానికి బయల్దేరిన సీతారామలక్ష్మణులు గంగానదిని దాటవలసి వచ్చింది. పడవ నడిపే గుహుడు, ‘ప్రభూ! నేను మిమ్మల్ని ఈ నది దాటిస్తాను. అందుకు ప్రతిఫలంగా నన్ను ఈ భవసాగరం దాటించాలి‘ అని రెండు చేతులు జోడించి అభ్యర్థించాడు. గుహుడు చదివిన చదువు ఏపాటిది! అతను కనబరచిన ఆధ్యాత్మిక పరిణతి ఎంత మహోన్నతమైనది!?ధ్రువుడు ఎలాగైనా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది తన తండ్రి తొడపై కూర్చోవాలన్న కోరికతో తపస్సు చేశాడు. విష్ణుమూర్తి సాక్షాత్కరించి ఏం కావాలని అడుగగా ఆ పసివాడు. ‘స్వామీ ఈ దట్టమైన అడవిలో నేను తపస్సు చేస్తున్న సంగతి తెలిసిన మీకు నా మనసులోని కోరిక తెలియదా?’ అంటాడు.‘మనసులో ఉన్నది మాటలో వ్యక్తం చేయనిదే పరమివ్వడానికి వీలుకాద’ని విష్ణుమూర్తి వివరించగా, ‘స్వామీ నేను గాజు పెంకుకోసం వెతుకుతూ వస్తే నాకు అమూల్యమైన పజ్రమే లభించింది. మీ దర్శన భాగ్యం పొందిన నాకు ఇక తాత్కాలిక సంతోషాన్నిచ్చే రాజ్యాలు, భోగభాగ్యాలు అక్కర్లేదు. శాశ్వతానందాన్నిచ్చే మీ సాయుజ్యమే కావాల’ని కోరాడు. రాజ్యసుఖాలతోపాటూ పరమపదాన్ని కూడా ధ్రువునికి అనుగ్రహించాడు శ్రీమన్నారాయణుడు.భక్త ధ్రువునివలె శాశ్వతానంద్రపాప్తిని కోరుకుందాం. గుహునివలె భవసాగరాన్ని దాటించవలసిందిగా స్వామిని ప్రార్థిద్దాం. ఆ చెలికత్తెలా దైవసన్నిధిని ఒక పెన్నిధిగా భావించుకుందాం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
ఆధ్యాత్మికతతో సమతుల్యత
యాంత్రిక జీవనంలో మనిషి డబ్బు, హోదా వెనుక పరుగెత్తుతూ తనను తాను మర్చిపోతున్నాడు. సౌకర్యాలు పెరిగినా సంతోషం తగ్గుతోంది. ఈ క్రమంలో మనకు సమతుల్యతను నేర్పేది ఆధ్యాత్మికత ఒక్కటే! ఆధ్యాత్మిక జీవనంపై చాలామందికి భిన్నాభిప్రాయాలు... అంతకుమించిన అపోహలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికత అంటే ఏమిటో... ఆధ్యాత్మిక జీవనం అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం...ఆధ్యాత్మికత అనేది కేవలం మతం లేదా పూజా కార్యక్రమాలకు పరిమితమైనది కాదు. ఇది ఒక వ్యక్తి తన అంతరాత్మను తెలుసుకోవడానికి, విశ్వ చైతన్యంతో అనుసంధానం కావడానికి చేసే నిరంతర ప్రయాణం. ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు మనల్ని మనం గమనించుకోవడం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోపతాపాలు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవడమే ప్రాథమిక చైతన్యం. ‘నేను కేవలం ఈ శరీరాన్ని మాత్రమే కాదు, అంతకు మించిన శక్తిన’ని గుర్తించడం ఇందులో ముఖ్యం (ఆత్మ వివేచన). లోకంలో తప్పులను వెతకడం మానేసి, తనలో తాను మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం. రోజులో కొంత సమయం మౌనంగా ఉంటూ, తన ఆలోచనలను గమనించుకుంటూ స్వీయ నియంత్రణ పాటించడం.ప్రస్తుత సమాజంలో మన జీవన విధానంలో అడుగడుగునా ఉద్వేగం, ఉద్రేకం, అనవసరమైన వేగం, వత్తిడి ఎక్కువయ్యాయి. ఓ పసిపిల్లకు నూటికి 98 మార్కులొస్తే వచ్చే సంతోషంకన్నా 2 మార్కులు పోయాయన్న బాధే ఎక్కువగా కనిపిస్తున్నది. చిన్న పార్శ్వం ఇది. ఒక పుస్తకంలో చదివి నేర్చుకునేది ఆధ్యాత్మికత కాదు, అనుభవపూర్వకంగా పొందాల్సింది. నిత్యం కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం, ప్రకృతిని గమనించడం, సాత్విక గుణాలను పెంపొందించుకోవడం ద్వారా ఎవరైనా ఈ మార్గంలో పయనించవచ్చు. అంతిమంగా, మనలోని దైవత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మిక శిఖరం.యువతరం ఆధ్యాత్మికతను ఒక పాతకాలపు ఆచారంగా కాకుండా, తమ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించే ఒక శక్తిమంతమైన సాధనంగా స్వీకరించాలి. ఇది వ్యక్తిగత వికాసానికి, మానసిక ప్రశాంతతకు సార్థకమైన జీవితానికి మార్గం చూపుతుంది. నిజమైన ఆధ్యాత్మికత అనేది బాహ్య వేషధారణలోనో, మంత్రతంత్రాల్లోనో లేదు. అది మనిషి ప్రవర్తనలో, ఆలోచనా విధానంలో ప్రతిబింబించే పరిణతి. మన హృదయం ఎంత విశాలమైతే, మనం అంత ఆధ్యాత్మికంగా ఉన్నామని అర్థం.కేవలం ధ్యానం చేయడమే ఆధ్యాత్మికత కాదు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, జంతువుల పట్ల, ప్రకృతి పట్ల దయ కలిగి ఉండటం నిజమైన ఆధ్యాత్మిక లక్షణం. విశ్వంలోని ప్రతి జీవిలోనూ ఆ దైవత్వాన్ని చూడటమే దీని పరమార్థం. క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధన చేసేవారిలో నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు నిండిన నేటి కాలంలో ఆధ్యాత్మికత ఒక మందులా పనిచేస్తుంది. ధ్యానం... ప్రార్థన మనస్సును నిలకడగా ఉంచుతాయి. ఉన్నదానితో తృప్తి చెందుతూ, లేనిదాని కోసం ఆరాటపడకుండా ప్రశాంతంగా ఉండటం అలవడుతుంది.ఆధ్యాత్మికత అలవడిన వ్యక్తికి చావు, పుట్టుకల పట్ల భయం ఉండదు. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించే పరిణతి వస్తుంది. అనవసరమైన వాదనలు, చర్చల కంటే మౌనంగా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. లోపల ప్రశాంతత ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలోని శబ్దాలు వారిని ఇబ్బంది పెట్టవు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వారు అసంతృప్తికి లోనుకాకుండా, ఆ సమయాన్ని ఆత్మ విమర్శకు వాడుకుంటారు. – తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
ముక్తి మార్గం... ఒక ఆధ్యాత్మిక ప్రయాణం
సాధారణంగా మనిషి తనను తాను శరీరం, పేరు, కులంతో గుర్తుంచుకుంటాడు. దీనివల్ల రాగద్వేషాలు, భయం, దుఃఖం కలుగుతాయి. ముక్తి అనేది కేవలం మరణానంతరం లభించేది కాదు, జీవించి ఉండగానే పొందే స్థితి (జీవన్ముక్తి). వైరాగ్యం– లౌకిక విషయాల పట్ల మోహం తగ్గించుకోవడం. ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవడం. ఇతరులకు హాని చేయకుండా జీవించడం. సరైన దిశానిర్దేశం చేసే గురువును ఆశ్రయించడం. ముక్తి అంటే ఎక్కడికో వెళ్లడం కాదు, మనలోని దైవత్వాన్ని మనం గుర్తించడం. మన ప్రవృత్తికి ఏ మార్గం సరిపోతుందో దానిని ఎంచుకుని సాగడమే ముక్తికి అసలైన బాట.ముక్తి లేదా మోక్షం అంటే పునర్జన్మ లేని స్థితిని పొందడం. దేహం ముసలిదవుతుంది, మనస్సు మారుతుంటుంది, కానీ వీటన్నింటినీ గమనిస్తున్న ‘సాక్షి’ ఒకరు ఉన్నారు. ఆ సాక్షి లేదా ఆ చైతన్యమే అసలైన దైవత్వం. దైవత్వానికి., మనకు మధ్య ఉన్న అతిపెద్ద అడ్డుగోడ ‘అహం’ ‘నేను చేస్తున్నాను’, ‘ఇది నాది’ అనే భావన తగ్గినప్పుడు, మనలోని అనంతమైన దైవశక్తి వెలుగులోకి వస్తుంది. సముద్రంలోని అల నేను సముద్రాన్ని కాదని భావిస్తే అది అహంకారం, తాను సముద్రంలో భాగమే అని గుర్తిస్తే అది జ్ఞానం. గంగా, యమునా వంటి నదులు వేర్వేరుగా ప్రవహించినా, సముద్రంలో కలిసిన తర్వాత అవి సముద్రమే అయిపోతాయి. అలాగే జీవులన్నీ వేర్వేరుగా కనిపించినా, వాటి మూలం ఆ పరమాత్మే. మట్టితో చేసిన కుండ, ప్రమిద, బొమ్మలు.. పేర్లు వేరైనా వాటన్నింటిలో ఉన్న అసలు వస్తువు మట్టే. అలాగే జగత్తులోని రూపాలు వేరైనా, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో మొదలై, దేహం అనిత్యమని, ఆత్మ శాశ్వతమని తెలుసుకోవడం. పరమాత్మపై పరిపూర్ణ మైన ప్రేమను, శరణాగతిని కలిగి ఉండటమే భక్తి మార్గం. కలియుగంలో ఇది అత్యంత సులభమైన మార్గంగా చెప్పబడింది. ‘దైవత్వాన్ని గుర్తించడం’ అనే మాట వినడానికి సరళంగా అనిపించినా, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. దీనిని సాకారం చేసుకోవడానికి మన గ్రంథాలు కొన్ని ఆచరణాత్మక మార్గాలను సూచించాయి. అదేమంటే... రమణ మహర్షి బోధించినట్లుగా ‘నేను ఎవరు?’ అనే విచారణ చేయడం. చెరువు నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే అందులో చంద్రుని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే దైవత్వం ప్రతిఫలిస్తుంది. షరతులు లేని ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా దైవానికి దగ్గరవ్వవచ్చు. ‘తత్వమసి‘ అంటే ‘దైవం నీవే’. తత్వమసి అనేది కేవలం చదవడానికి వాక్యం కాదు, అది ఒక అనుభూతి. ‘నేను పరిమితమైన వాడిని’ అనే అజ్ఞానం నుంచి ‘నేను అనంతమైన వాడిని’ అనే జ్ఞానం వైపు నడిపించే మహా మంత్రం ఇది. ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి జీవన్ముక్తుడు అవుతాడు.మనం దైవాన్ని గుడులలో, గోపురాలలో వెతుకుతాము, కానీ అసలైన దేవుడు మన హృదయస్థానంలో ఉంటాడు. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని, ఆలోచనలను గమనిస్తూ ఉంటే, ఆ నిశ్శబ్దంలోనే దైవత్వం అనుభవంలోకి వస్తుంది. బాహ్య ప్రపంచపు సందడిని తగ్గించి, అంతరంగంలోకి ప్రయాణించడమే దీనికి మార్గం. ‘అందరిలోనూ ఉన్నది ఒకే దైవం‘ అని గుర్తించడం. ఎదుటి వారిని చూసినప్పుడు వారి రూపం కంటే, వారిలో ఉన్న జీవాన్ని (దైవత్వాన్ని) గౌరవించడం నేర్చుకోవాలి. ‘అద్వైతం’ అంటే ఇదే. ఇది ఏదో ఒక రోజులో జరిగేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి, 5వేలకు పైగా శైవభక్తిగీతాలు
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.Zoom వెబినార్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్‌టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సూపర్ ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు Nikeelu Gunda తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ ప్రకటించింది. -
మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?
ఒక చెరుకు వ్యాపారి డబ్బు బాగా గడించాడు. వయసు మీద పడటంతో మనసు చిన్నగా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. గుడులూ గోపురాలూ తిరిగాడు. నదీ స్నానాలు చేశాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో అతడికి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది.అదేమిటంటే ‘ఏ సేవ మంచిది, మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?’ అని. సమాధానం కొరకు ప్రయత్నించాడు. సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. వారి ఊరికి చాలా దూరంగా ఉన్న గుట్టమీద ఒక సాధువు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందని బయలుదేరాడు. దారి సరిగా తెలియక అవస్థలు పడ్డాడు. అప్పటికే బాగా చీకటయ్యింది. వ్యాపారికి ఆ చీకట్లో నడవడం కష్టంగా తోచింది.దారిలో ఒక రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని వ్యాపారిని ప్రశ్నించాడు. తను వెళ్తున్న విషయం చెప్పాడు వ్యాపారి. ‘ఆ గుట్టపైకి వెళ్ళడానికి పగలే కష్టంగా ఉంటుంది. రాత్రయింది కాబట్టి మరింత కష్టం. అందులోనూ పురుగూపుట్రా ఉంటాయి. నేను మీకు తోడుగా వస్తాను’ అని చెప్పి లాంతరు పట్టుకుని బయలుదేరాడు. ఎలాగైతేనేం గుట్ట చేరారు. సాధువును కలిశారు. తను వచ్చిన విషయం చెప్పా వ్యాపారి.‘బాగా రాత్రయ్యింది. అలసిపోయి ఉన్నారు. ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి నిద్రపొండి, ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పాడు సాధువు. ఇద్దరూ అలాగేనని ఒప్పుకున్నారు. తెల్లారిందే లేదో గబగబా నిద్ర లేచిన రైతు పొలం పని ఉంది, నేను బయలుదేరుతాను’ అన్నాడు.వెంటనే వ్యాపారి ‘‘చీకట్లో ఉన్న నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు లాంతరుతో తోడు రాకుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాణ్ణి. మీరు చేసిన సహాయం నా జీవితకాలం మరచిపోను’’ అని చెప్పి పడీపడీ నమస్కరిస్తూ అతడిని సాగనంపాడు.చదవండి: సంక్షోభంలో స్థిరత్వంసాధువు చిరునవ్వు ముఖంతో వ్యాపారిని దగ్గరికి పిలిచి ‘ఒక్క రాత్రి, చీకటిలో ఉన్న నీకు లాంతరు సాయం చేశాడని అతడిని ప్రముఖ వ్యక్తిగా ఆదరిస్తున్నావు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి చీకటిలో ఉన్న నీకు ఆరని దీపంలాగా, నీ ఆలనాపాలనా చూసి, మంచి చెడ్డలు నేర్పించారు నీ అమ్మానాన్నలు. ఎన్నో కష్టాలకు ఓర్చి విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఇంతవాడిగా చేసిన అమ్మానాన్నలకి చేసే సేవకన్నా వేరే ఏ సేవా గొప్పదికాదు, వారికి కృతజ్ఞతగా ఉండటానికి మించింది ఏదీ లేదు’ అని హితవు చెప్పాడు.‘నిజమే, నిరంతరం తను కాలుతూ వెలుగునిచ్చే దీపంలాగా మన జీవితాలకు వెలుగునిచ్చే అమ్మా నాన్నలకు మించిన గొప్పవారు ఎవరు ఉంటారని’ తెలుసుకున్న వ్యాపారి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
కొత్తగా స్వాగతం చెబుదాం...
కాలం అనేది అందరినీ శాసించే శక్తి. మనం కాలాన్ని ఆపలేము, కానీ కాలంతో పాటు మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ‘సమయపాలన, కర్తవ్య నిర్వహణ’ ద్వారా మాత్రమే మనిషి ఈ కాల చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించగలడు.ఆధ్యాత్మిక కోణంలో ‘క్యాలెండర్’ అనేది కేవలం తేదీలు, వారాల పట్టిక మాత్రమే కాదు, అది మన జీవిత ప్రయాణానికి కాల చక్రానికి ఒక దిక్సూచి వంటిది. అనేక సంస్కృతులలో కాలాన్ని దైవంగా భావిస్తారు (’కాలాయ తస్మై నమః’). క్యాలెండర్ మనకు కేటాయించబడిన పరిమిత సమయాన్ని గుర్తుచేస్తూ, ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకోవాలని బోధిస్తుంది. క్యాలెండర్లు (పంచాంగాలు) సూర్యచంద్రుల గమనాన్ని బట్టి రూపొందించబడతాయి. ఇవి మనం ప్రకృతితో, విశ్వంతో ఎలా మమేకమై ఉన్నామో తెలియజేస్తాయి. గ్రహాల గమనం మన మనస్సుపై, శరీరంపై చూపే ప్రభావాన్ని ఇవి సూచిస్తాయి. ధ్యానం, ప్రార్థన లేదా పండుగలకు క్యాలెండర్ ఒక క్రమబద్ధమైన రూపాన్ని ఇస్తుంది. ఒక నిర్దిష్టమైన దినాన ఒక ఆధ్యాత్మిక కార్యాన్ని చేయడం వల్ల మనలో క్రమశిక్షణ, సంకల్ప బలం పెరుగుతాయి.క్యాలెండర్‌లోని ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అవి చెడుపై మంచి సాధించిన విజయాన్ని లేదా మనలోని అంతర్గత మార్పును సూచిస్తాయి. క్యాలెండర్ ఈ సందర్భాలను గుర్తు చేస్తూ మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తుంది. క్యాలెండర్ గడిచిన, రాబోయే రోజులను (భవిష్యత్తు) చూపిస్తున్నప్పటికీ, అది మనకు ఇచ్చే గొప్ప పాఠం ‘ఈ రోజు’ ప్రాముఖ్యత. ఆధ్యాత్మికంగా, ఈ క్షణంలో జీవించడమే పరమార్థం.క్లుప్తంగా చెప్పాలంటే, క్యాలెండర్ అనేది కాల గమనాన్ని గమనిస్తూ, ఆ కాలంలో మన ఆత్మ ఎదుగుదలకు మనం చేసే ప్రయత్నాలను నమోదు చేసే ఒక సాధనం. గడిచిన ఏడాదిలో మనం చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలను నెమరువేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. మనలోని అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) ఎంతవరకు నియంత్రించాలో ఆలోచించి, కొత్త నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన ప్రారంభం.గడిచిన కాలంలో మనకు అండగా నిలిచిన వారికి, మనల్ని నడిపించిన ఆ దైవానికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఆధ్యాత్మిక ఉన్నతికి మొదటి మెట్టు. కృతజ్ఞత కలిగిన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.కొత్త సంవత్సరంలో కేవలం భౌతికమైన లక్ష్యాలే (డబ్బు, ఉద్యోగం) కాకుండా, ‘నేను ప్రశాంతంగా ఉంటాను‘, ‘నేను ఇతరులకు సహాయం చేస్తాను‘, ‘నేను ప్రతిరోజూ ధ్యానం చేస్తాను‘ వంటి ఆధ్యాత్మిక సంకల్పాలు తీసుకోవడం ముఖ్యం.కాలం అనంతమైనది. గతం ముగిసిప్పాయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. ఈ కొత్త ఏడాదిలో ప్రతి క్షణాన్ని దైవ ప్రసాదంగా భావించి, పూర్తి అవగాహనతో జీవించడమే గొప్ప ఆధ్యాత్మిక సాధన. మన కోసం మనం జీవించడం సహజం, కానీ ఇతరుల కోసం జీవించడం దైవత్వం. ఈ కొత్త సంవత్సరంలో సాటి మనుషులకు, ప్రకృతికి మనవంతు సహాయం చేయడం వల్ల ఆత్మ తృప్తి లభిస్తుంది.‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నట్లుగా, మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని, జ్ఞానమనే వెలుగు వైపు అడుగులు వేయడమే కొత్త సంవత్సరం ఇచ్చే అసలైన సందేశం. మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయడం. మనం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపినప్పుడు, తెలియకుండానే మనలో ఒక లోతైన సంతృప్తి, దైవత్వం చోటు చేసుకుంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... నూతన సంవత్సరానికి స్వాగతం చెబుదాం. – రామలక్మీ సదానందమ్ -
కర్మ యోగం... కర్తవ్య పాలన
భారతీయ జీవన దర్శనం ప్రకారం ఈ జగత్తంతా దైవమయం. మనం చేసే ప్రతి కర్మను ఆ పరమాత్మకు అర్పించే ‘నైవేద్యం’గా భావించాలి. ఉపనిషత్తులు బోధించిన సూత్రం ప్రకారం, కర్మలను చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఉండటమే జీవన ముక్తి. అహంకారాన్ని వీడి, ‘నేను కర్తను కాదు, కేవలం ఒక నిమిత్త మాత్రుడను’ అనే భావనతో పని చేసినప్పుడు ఆ కర్మకు పుణ్యపాపాలు అంటవు.ఆర్ష ధర్మం ప్రతిపాదించిన అద్భుత జీవన వేదాంతం కర్మయోగం. లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. అయితే, ఆ కర్మను బంధనంగా మార్చుకోవాలా లేక మోక్ష మార్గంగా మలచుకోవాలా అన్నదే ఇక్కడి అసలైన ప్రశ్న. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందించిన ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే దివ్య శ్లోకం మానవాళికి ఒక శాశ్వత దిక్సూచి. పని చేయడంపైనే నీకు అధికారం ఉంది గానీ, ఫలితంపై లేదని చెప్పడం వెనుక లోతైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంది. ఫలితంపై అతిగా ఆశ పెంచుకున్నప్పుడు మనిషిలో ఆందోళన, భయం, అసహనం ప్రవేశిస్తాయి. అదేపనిని దైవ కార్యంగా భావించి చేసినప్పుడు ఆ కర్మ ‘యోగం’గా మారుతుంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో అనుసరించదగిన పరమ సత్యం.కర్మయోగం అంటే పలాయనవాదం కాదు, అది సంపూర్ణమైన క్రియాశీలత. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు కేవలం ఆ ప్రతిమ ఎంత ధరకు అమ్ముడవుతుందనే ఆలోచనతో ఉంటే, ఆ శిల్పంలో జీవం ఉట్టిపడదు. అదే శిల్పి తన నైపుణ్యాన్ని పరమాత్మకు అర్పిస్తున్నాననే భావనతో చెక్కితే, ఆ పనిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంది. అలాగే ఒక వైద్యుడు కేవలం ధనం కోసమే చికిత్స చేస్తే అది వ్యాపారం అవుతుంది. అదే వైద్యుడు రోగిలో దైవాన్ని చూస్తూ, తన విజ్ఞానాన్ని ప్రాణదానానికి అంకితం చేస్తే అది పవిత్ర యజ్ఞమవుతుంది. ఫలితం భగవంతుడి నిర్ణయమని నమ్మి, తన శక్తినంతా చికిత్సపైనే కేంద్రీకరించినప్పుడు ఆ వైద్యుడికి మానసిక ఒత్తిడి ఉండదు. ఈ నిష్కామ బుద్ధి మనిషిని నిరంతరం ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అగ్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లు, మనిషి తన స్వధర్మాన్ని నిష్కామంగా ఆచరించాలి.ఈ మార్గంలో అత్యంత ముఖ్యమైనది ‘ఫలత్యాగం’. అంటే ఫలితాన్ని వదిలేయడం కాదు, ఫలితం వల్ల కలిగే హర్ష విచారాలకు అతీతంగా ఉండటం. విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఉండే స్థితి కర్మయోగికి మాత్రమే సాధ్యం.యోగశాస్త్రం బోధించిన ఈ నిష్కామ కర్మ సిద్ధాంతం వ్యక్తిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. చేసే పనిలో దైవత్వాన్ని వెతుక్కున్నప్పుడు ఒత్తిడి మాయమై శాంతి ప్రవహిస్తుంది. ప్రతి క్షణం మన కర్మను ఒక ఆరాధనగా మలుచుకుంటే, ఈ ప్రపంచమే ఒక వైకుంఠమవుతుంది. స్వార్థపు చీకటిని తొలగించి, సేవా భావం అనే జ్యోతిని వెలిగించుకుందాం. సర్వం ఈశ్వరార్పణమస్తు! నిప్పు నిప్పును కాల్చదు గానీ, దానిపై పడిన వస్తువును కాలుస్తుంది. అలాగే, అహంకారంతో చేసే కర్మలు బంధాలను సృష్టిస్తే, నిరహంకారంతో చేసే కర్మలు మనసును నిర్మలం చేస్తాయి. సూర్యుడు ప్రతిరోజూ లోకానికి వెలుగును ఇస్తాడు, తనే వెలుగునిస్తున్నాననే అహంకారం ఆయనకు ఉండదు. అటువంటి నిస్వార్థ గుణమే మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. నిత్య జీవిత సవాళ్లను సాకులు చెప్పకుండా ఎదుర్కోవడం, బాధ్యతలను భారం కాకుండా గౌరవంగా భావించడం కర్మయోగపు అంతరార్థం. ఈ జ్ఞానమే మనల్ని నిరంతరం కర్మపథంలో నడిపిస్తూ, అంతిమంగా ఆత్మానందానికి చేరువ చేస్తుంది.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
పూనకాలు నిజమేనా?
నాకో సందేహం ఉంది డాక్టరు గారూ... గత 6 నెలలనుంచి మా ఇంటి పక్కన ఉండే ఆవిడకి దేవత పూనుతోంది. ఆ సమయంలో ఆమెకి అమ్మవారు పూని భవిష్యత్తు చెప్పడం, అలాగే ఇతరుల సమస్యలకి సమాధానం / పరిష్కారాలు చెబుతుంది. వారంలో 3 రోజులు ఇలా జరుగుతుంది. దాంతో మా ్ర΄ాంతం అంతా ఒక జాతరలా తయారైంది. ఆమెను అడిగితే తనకి ఏమీ గుర్తులేదు అని చెప్తుంది. వారంలో మిగిలిన రోజులు మామూలుగానే ఉంటుంది. భర్త తాగుబోతు, పిల్లలు ఏమీ పనిచేయరు. ఈమే కూలి పని చేసి వాళ్ళని పోషించాలి. భర్త తాగివచ్చి ప్రతిరోజు హింసించేవాడు. ఎప్పటినుంచి ఆమెకు పూనడం మొదలైందో, అప్పటినుండి అతను తాగడం మానేసి పనికి వెళ్తున్నాడు. పిల్లలు ఆమె మాట వింటున్నారు. భక్తులు ఇచ్చే కానుకలతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగైంది. అసలు పూనకాలనేవి నిజంగా ఉంటాయా? లేక ఆవిడ కావాలనే ఇలా చేస్తోందా? చాలా సందర్భాలలో పూనకాల గురించి విన్నాను కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే. దయచేసి నా సందేహాలకు సమాధానం చెప్పగలరు. – తిరుపతి, వరంగల్ ఎవరైనా ఒక వ్యక్తి విపరీతమైన ఒత్తిడికి, దీర్ఘకాలంగా అణిచివేతకు గురైనపుడు, లేదా మనసులో ఏదైనా తీరని కోర్కెలు, ఆలోచనలు ఉన్నప్పుడు. వారికి తెలియకుండానే ఇలా ఒక వేరే వ్యక్తిలా లేదా దేవత పూనినట్లు ప్రవర్తించే అవకాశం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘డిసోసియేటివ్ ట్రాన్స్‘ లేదా ΄పొసెషన్ స్టేట్‘ అంటారు. ఇలాంటి స్థితిలో ఆ వ్యక్తులు ఎలాంటి భయాలూ, ఒత్తిళ్లూ లేకుండా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. ఆత్మన్యూనతా భావం ఉండే వారిలో కూడా, ఈ ‘΄పొసెషన్ స్టేట్’ ఎక్కువగా కనబడుతుంది. అయితే కొంతమంది తమ స్వార్థం లేదా లాభాపేక్ష కోసం, ఇలా పూనకం వచ్చినట్లు నటించొచ్చు, అయితే వాటిని ’ట్రాన్స్ స్టేట్’ కింద పరిగణించలేము. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలుమన సమాజంలో ఇలా దేవుడు ఆవహించిన వారిని ప్రత్యేకంగా గౌరవిస్తారు. హారతులు ఇవ్వడం, కొబ్బరి కాయలు కొట్టడం, దండలు వేయడం వంటి వాటితో వారిని ప్రత్యేకంగా కూడా చూస్తారు. దీనివల్ల ఆ వ్యక్తికి కొంతయినా ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అణిచివేతకు గురయిన వాళ్ళలో ఒక పవర్ వచ్చిన భావన కూడా కలుగుతుంది. ఎక్కువగా స్త్రీలు ఇలాంటి ఇబ్బందులకు గురవుతారు, ఓర్పు, సహనం వంటి వాటిని కూడా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము. రోజు తాగి వచ్చి కొట్టే ఆమె భర్త ఇప్పుడు ఆమెలోని దేవతకి, భక్తితోను, భయంతోనూ గౌరవిస్తూ మారాడు. పిల్లలు మారి తన మాట వింటున్నారు. నిజానికి ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి, సమాజంలో, కుటుంబంలో ఆమెకు గౌరవం స్థానం కల్పిస్తే వారిలో వచ్చే అనేక మానసిక సమస్యలను నివారించవచ్చు: మీ పక్కింటావిడకి దేవత రావడం వల్ల ఏదైనా ఇబ్బందిగా అన్పించినా, లేదా తన ఇష్టానికి వ్యతిరేకంగా పూనకం వచ్చినా వారు పరీక్షించి డిప్రెషన్ లేదా ఇతర మానసిక సమస్యలు ఏదైనా ఉండి ఆమెకి సహాయం కావాలని అన్పించినా వెంటనే సైకియాట్రిస్ట్‌ని కలిస్తే కౌన్సెలింగ్, తగిన చికిత్స అందిస్తారు. ఆల్ ది బెస్ట్డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు) -
అంతర్గత సంపదే నిజమైనది
ఇంటా బయట ఆందోళనకరమైన జీవన విధానం. నిత్యం ఒత్తిడి, భావోద్వేగ సంఘర్షణలు. అయితే... ధ్యానం ద్వారా వాటిని సమతుల్యం చేసుకునే శక్తి మనకు ఉంది. ధ్యానం ఆత్మ సముద్ధరణకు ఉపయోగపడే అత్యున్నతమైన సాధనం. ఇంటిలో, సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే ముందు మనలో ప్రశాంతత కలగాలి అని వివరించారు బ్రహ్మకుమారీస్ రాజయోగిని కులదీప్ దీది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘సంత్ సమాగమమ్’ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.‘నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి పోటీ, మితిమీరిన సాంకేతికత, భావోద్వేగ సంఘర్షణల కారణంగా మనశ్శాంతిని కోల్పోతున్నాం. ధ్యానం శక్తిమంతమైన, సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది. సహనాన్నిప్రోత్సహించి సామరస్యాన్ని పెంపొదిస్తుంది. మానసికంగా ఇది మనసును ప్రశాంత పరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. మానసిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ విషయాలు అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. యువతలో వేగవంతమైన భావోద్వేగాలు..నేటి యువత భావోద్వేగాలకు చాలా ఎక్కువగా గురవుతోంది. వేగవంతమైన భావోద్వేగాలు, విచ్ఛిన్నమైన సంబంధాలు, ప్రేమ గురించి విరుద్ధమైన ఆలోచనలతో వారి జీవితమే కాకుండా వారి ద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోంది. మనం వారికి ఏం చెప్పగలం అంటే.. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణ లేదా భావోద్వేగం కాదు. అది అర్థం చేసుకోవడం, గౌరవించడం, అవసరమైనప్పుడు కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. లోలోపల ఖాళీగా అనిపిస్తే బయట ప్రేమ కోసం వెతకద్దు. ప్రేమ స్వీయ అవగాహనతో ్ర΄ారంభమవుతుంది. జీవితం కేవలం ఆనందం కోసం కాదు ప్రయోజనం కోసం అని గ్రహించాలి.గృహిణులు ఇంట్లో శాంతిని నిలబెట్టాలంటే... ‘నేను ప్రశాంతమైన ఆత్మను’ అనేది ముందుగా గుర్తుంచుకోవాలి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం లేదా ధ్యానంతో రోజును ప్రారంభించాలి. కుటుంబ సభ్యులను కేవలం పాత్రలుగా కాకుండా ఆత్మలుగా చూడండి. ఇది సహనాన్ని, మంచి అవగాహనను తెస్తుంది. వంట చేసేటప్పుడు మీ ఆలోచనలను స్వచ్ఛంగా, ఉన్నతంగా ఉంచుకోండి. ఎటువంటి లక్షణాలు ఉన్న భోజనం తింటారో అటువంటి ఆలోచనలే వస్తాయి. జీవితం అలాగే తయారవుతుంది. గృహిణి ప్రశాంతంగా ఉన్నప్పుడు, మొత్తం కుటుంబం సురక్షితంగా, ప్రేమగా, సంతోషంగా ఉంటుంది. మనిషి జీవితం ధ్యేయం...‘నేను ఎవరు?’ నాది ఏది, సత్యత ఏంటీ.. అనేది గ్రహించాలి. రోజువారీ జీవితంలో శాంతి, ప్రేమ, స్వచ్ఛత వంటి అసలు లక్షణాలను వ్యక్తపరచాలి. మనం కేవలం శరీరాలు కాదు. మనం ఆత్మలం. ప్రతి ఆత్మ తన ప్రత్యేక΄ాత్రను ΄ోషించడానికి, ప్రపంచానికి ఏదైనా మంచిని అందించడానికి ఇక్కడ ఉంది. మనం విలువలు, ఆధ్యాత్మిక అవగాహనతో జీవించినప్పుడు మనం లోపల నండి సంతృప్తి చెందుతాం. ధ్యానం మనకు పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి, మన ఉన్నత ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ‘నేను ప్రతిరోజూ మెరుగవుతున్నానా?’ అని తమని తాము ప్రశ్నించుకోగలిగితే, మీరు సరైన మార్గంలో ఉన్నారనేదానికి అదే సంకేతం. వెలితిగా ఉండటానికి పరిష్కారం..బాహ్య, భౌతిక విజయం వాస్తవానికి అంతర్గత శూన్యతను పూరించదు. నిజమైన సంతృప్తి అంతర్గత శాంతి, ప్రేమ నుండి వస్తుంది. మన ఆత్మ పరమ సంబంధం కోరుకుంటుంది. మనం స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఇతరులకు సేవ చేసినప్పుడు మనం అర్థవంతంగా, సంతృప్తిగా భావించడం ప్రారంభిస్తాం. నిశ్శబ్దం, సరళత, ఆధ్యాత్మికత మన హృదయాన్ని నింపుతాయి. ఇవేవీ బాహ్య విజయాల ద్వారా అందవు. ఆధ్యాత్మికత తోడవ్వాలి. అంతర్గత సంపద ఉంటే వెలితి అనేదే ఉండదు’’ అని తెలిపారు ఈ రాజయోగిని.నేను ఆత్మను అనే భావనతో అవగాహన... ‘నేను ఒక ఆత్మను’ అనే అవగాహన మనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. భావోద్వేగపరంగా తక్షణమే స్పందించే బదులు, అవగాహనతో ప్రతిస్పందిస్తాం. ఇతరులను వారి రూ΄ాలతో, పనులతో కాకుండా ఆత్మలుగా చూడటం ప్రారంభించినప్పుడు మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ అవగాహన సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. పిల్లలపై తల్లిదండ్రుల దృష్టికోణం... తల్లిదండ్రులు పిల్లలను ఆస్తిగా కాకుండా వారి స్వంత ప్రయాణంతో కూడిన వ్యక్తిగత ఆత్మలుగా చూడాలి. ప్రతి బిడ్డ ప్రత్యేకమైనవాడే. ఇతరులనుండి ప్రేరణ కలిగించవచ్చు. కాని ఇతరులతో ΄ోల్చకూడదు. ప్రేమ అంటే ప్రతి కోరికనూ నెరవేర్చడం కాదు. అలా చేస్తే వారి కోరిక తీరక΄ోతే మారాం చేయడమో, మొండిగా అవ్వటమో చేస్తారు. సమయం చూసి వారితో ప్రేమతో మాట్లాడాలి. కఠినంగా కాకుండా ప్రశాంతంగా, స్పష్టతతో మాట్లాడండి. పిల్లలు సురక్షితంగా, ప్రేమతో ఉన్నప్పుడు బాగా వింటారు. అంతర్గత బలం వారికి ప్రేమ, సరైన మార్గదర్శకత్వం రెండింటినీ ఇవ్వడానికి సహాయ పడుతుంది– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎవరు చెప్పారన్నది కాదు... స్థితప్రజ్ఞత ముఖ్యం!
ఒకరోజు ఒకతను ఒక ముని దగ్గరకు వెళ్లాడు. ఆయనకు నమస్కరించి ‘జ్ఞానం అంటే ఏమిటి? నేను కలిసిన కొందరు ఒక్కోలా చెప్పారు... మరి మీరేమంటారో తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు. ‘జ్ఞానం అంటే సుఖాన్ని పొందినప్పుడు పట్టరాని ఆనందంతో ఉన్న చోటుని మరచిపోవడం కాదు... బాధలో అలసిసొలసి డీలా పడిపోవడం కాదు. కష్టమో సుఖమో దేనికైనా స్థిరంగా ఉండటం ముఖ్యం’ అన్నారు ముని. ‘మీరు దీనిని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు?’ అని అడిగా డతను. అంతట ఆ ముని ‘నేను ఈ నిజాన్ని గాడిద నుండి నేర్చు కున్నాను’ అన్నారు. ‘ఏమిటి మీరు చెప్తున్నది? అది ఎలా సాధ్యం?’ అని అడిగాడు మునిని. ఒక గాడిద ఆ దారిన పోతోంది. ముని దాని వంక చూడమన్నారు. ‘ఈ గాడిద వీపు మీద ప్రతి ఉదయం మురికి బట్టల మూటలు పెట్టి తోలుకుంటూ పోతాడు దాని యజమాని. నదిలో మురికి బట్టలన్నింటినీ ఉతికి సాయంత్రం శుభ్రమైన బట్టల మూటలను గాడిద వీపు మీద ఉంచి ఇంటిబాట పడతాడు. మనం ఆ గాడిదలా ఉండాలి. ఉదయం పోతున్నప్పుడు మురికి బట్టల మూటలని అదేమీ బాధపడలేదు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టల మూటలని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవదు. దేన్ని చూసీ అది చలించలేదు. ఆ స్థిరమైన జ్ఞానాన్ని దాని నుంచి నేర్చుకున్నాను’.అలాంటి స్థితి పరిపక్వతతోనే సాధ్యం. సుఖమైనా, కష్టమైనా స్థితప్రజ్ఞత ముఖ్యం. ఎవరు బోధిస్తారనేది ముఖ్యం కాదు. గురువు ఎవరైనా కావచ్చు, కానీ మనం ఏమి నేర్చుకుంటున్నామనేదే ముఖ్యం.– యామిజాల జగదీశ్ -
సగమైన సముద్రం
తుంగభద్ర నది ప్రవహిస్తోంది. దూరంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అష్టోత్తరం వీనుల విందుగా వినిపిస్తూ ఉంది. నది ఒడ్డున కూర్చుని ఉన్న గురువుతో శిష్యుడు ‘‘స్వార్థం అంటే ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘స్వార్థం అంటే తన గురించి మాత్రమే శ్రద్ధ వహించడం. ఇతరులను పట్టించుకోకుండా తన ప్రయోజనం, ఆనందం లేదా సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించడం’’ అని బదులిచ్చాడు గురువు. ‘‘దాని పర్యవసానాలు ఏమిటి?’’ అని మళ్ళీ ప్రశ్నించాడు శిష్యుడు. ‘‘స్వార్థం ఎంత పనైనా చేయిస్తుంది. దానికి అంతమనేది లేదు. నీకు అర్థమయ్యే రీతిలో ఒక ΄కతకథ చెబుతాను విను.‘‘ఒక పెద్ద సామ్రాజ్యంలోని రాజ్యాలలో వర్షాలు లేక తీవ్రమైన కరువు ఏర్పడింది. ఏమి చేయాలో తెలియని చక్రవర్తి ఆస్థాన పండితులను పిలిచి చర్చించాడు. తపస్సు చేసి దైవానుగ్రహం పొందటమే శరణ్యమని వారు సలహా ఇచ్చారు. రాజ్యాల శ్రేయస్సు కోసం అడవులకెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించాడు. చక్రవర్తి తపస్సుకి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఇదీ చదవండి: Today recipes : బ్రెడ్‌తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?తన సామ్రాజ్యంలో మంచివానలు కురవాలని, నీటికరువు ఉండకూడదని కోరాడు చక్రవర్తి. ఎందుకైనా మంచిదని తన సామ్రాజ్యానికి ఆనుకుని ఉన్న సముద్రాన్ని కూడా మంచినీళ్ళుగా మార్చివేయమని అడిగాడు. ‘‘ఆలోచించే అడుగుతున్నావా?’’ అని దేవుడు రాజును ప్రశ్నించాడు.‘‘వృథాగా ఉన్న సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా మారితే మా సామ్రాజ్యంలోని ప్రజలు తరతరాలు నీటి ఎద్దడి లేకుండా సుఖపడతారు కదా. చరిత్రలో నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా’’ అని దేవుణ్ణి ఒప్పించాడు.చదవండి: ‘మై లవ్..’గర్ల్‌ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో‘‘సరే, నీ ఇష్టం’’ అని చక్రవర్తి కోరినట్లే చేశాడు దేవుడు. వెంటనే మంచి వర్షాలు కురిశాయి. పరమానంద భరితుడయ్యాడు చక్రవర్తి. కొన్నాళ్ళు గడిచాయి. ఉప్పునీళ్ళ సముద్రం మంచి నీళ్ళుగా మారాక పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చక్రవర్తి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. సముద్రం సగమై ఉంది. ఆశ్చర్యపోయాడు. అలలు సైతం నీరసంగా పడి లేస్తున్నాయి. చక్రవర్తి గుండె తరుక్కుపోయింది. కారణమేమిటని తన సిబ్బందిని అడిగాడు. ఏ రాజ్యానికి ఆ రాజ్యం రాజులు అవసరం ఉన్నా లేకున్నా సముద్రం నీళ్ళని తమ రాజ్యాల వైపుకు మళ్ళించుకున్నారని చెప్పారు. ‘సముద్రాన్ని కూడా సగం చేసింది కదా మనిషి స్వార్థం’ అని తల పట్టుకున్నాడు చక్రవర్తి. ఇంకొన్నాళ్ళు గడిస్తే సముద్రం పూర్తిగా మాయమై పర్యావరణ సమస్య వస్తుందని గుర్తించాడు. వెంటనే తపస్సు ప్రారంభించడంతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చేసిన తప్పునకు క్షమాపణలు కోరి సముద్రాన్ని ఉప్పునీళ్ళగా మార్చమని ప్రాధేయపడ్డాడు’’ అని స్వార్థం గురించి వివరించాడు గురువు. స్వార్థం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుందని అర్థం చేసుకున్నాడు శిష్యుడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
ఆధ్యాత్మికానుభూతులకు ఆలవాలం నైమిశారణ్యం; ఎలా వెళ్లాలి?
మనం పురాణ కథలలో సూతుడు నైమిశారణ్యం గురించి వింటూనే ఉంటాం. అలాగే ‘సూతుడు, శౌనకాది మునులతో ఈ విధంగా చె΄్పాడు’ అనే ఉపోద్ఘాతం కూడా తెలిసిందే. ఇంతకీ ఈ నైమిశారణ్యం ఎక్కడ ఉంది, దానికి ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏమిటి చూద్దాం. ఆధ్యాత్మికానుభూతులకు ఆలవాలం నైమిశారణ్యం.నైమిశారణ్యంసుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదతో ప్రశాంతంగా ఆధ్యాత్మకానుభూతులను ప్రోది చేసే ఈ దివ్యధామం ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో ఉంది. మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పు కోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో సూత, శౌనకాది మునులు నివసించిన ఈ దివ్య ధామం మహా ఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ దివ్య ధామం ఆ మునుల తపశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది. అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని క్షేత్రాలలోకెల్లా ఉత్తమ క్షేత్రమంటారు. స్థానికులు ఈ దివ్యక్షేత్రాన్ని స్థానికులు నీమ్ సార్‌గా, నీమ్ చార్‌గా వ్యవహరిస్తుంటారు. స్థల పురాణం...ఒకసారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలిప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆప్రాంతంలో తాము త΄ోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చె΄్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించినప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటిగుండం ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. అందుకే ఈ పవిత్ర తీర్థానికి చక్ర తీర్థమని పేరు. చక్రాకారంలో వున్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య సోమవారం రెండూ కలిసిన సోమవతీ అమావాస్య పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లే ఈ క్షేత్రం అనుక్షణం భగవంతుని నామ స్మరణతో మారుమోగుతూ, ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది. దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో వుంది.ఇక్కడ ఏమేమి చూడవచ్చునంటే..? నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్ ఆలయం వుంది. ఇక్కడ భూతేశ్వరనాథ్ స్వామికి ముఖం వుండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రంతో, త్రిశూల చిహ్నంతో అభిముఖంగా వున్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజిల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో వున్న వినాయకుడ్ని విక్రమాదిత్యుడు ప్రతిష్టించినట్టుగా చెబుతారు. ముందు ఈ వినాయకుడికి ప్రణామాలు చేసిన అనంతరమే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు. నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం అతి పురాతనమైంది. అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ది, సూతుడు తపమాచరిం చిన తపస్థలి సూతగద్దిలు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మి కానురక్తిని పెంచేవిగా వున్నాయి. అలాగే వాలి, సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో బాలాజీ మందిరం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరి అర్చన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలోసైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది. భక్తులు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన మహిమాన్విత పుణ్య స్థలం ఇది.ఎలా వెళ్లాలంటే?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి నైమిశారణ్యానికి రైళ్లు, విమానాలు ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి నైమిశారణ్యానికి 1482 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి లక్నోకి రైళ్లు, విమానాలు ఉన్నాయి. లక్నో చేరితే అక్కడినుంచి రైలు లేదా బస్సులు, ట్యాక్సీలలో నైమిశారణ్యానికి చేరుకోవచ్చు.భోజన, వసతి సదుపాయాలు: నైమిశారణ్యంలో శృంగేరీ శారదాపీఠం వారి ధర్మసత్రాలలో భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి. ఇదిగాక అనేక ధర్మసత్రాలున్నాయి. స్తోమతను బట్టి సామాన్యమైన హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు అందుబాటులో ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆత్మచైతన్యానికే ధ్యానం
దైవం అనేది బయట వెదికే విషయమే కాదు. సమాజంలోని నియమాలతో, నమ్మకాలతో పద్ధతులతో దానికి సంబంధమే లేదు. ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్న ఆధ్యాత్మికత అంతా సమాజానికి చూపించుకోవడానికి, నలుగురిలో మంచి అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు. నిజానికి ఆధ్యాత్మిక ప్రయాణం నీలోనికి నీవుచేసే ప్రయాణం. గర్భగుడిలోనికి ఒక్కరినే అనుమతించడంలోని అంతరార్థం ఇదే. సత్యాన్ని తెలుసుకోవడానికి బయటి వ్యక్తులు, మధ్యవర్తుల ప్రమేయమే అవసరం లేదు. సత్యం ఒకరు చెబితే అర్థమయ్యే విషయం కాదు. నీకు నీవుగానే సత్యాన్ని తెలుసుకోవాలి. నీ నమ్మకాల నుండి, అహం నుండి పూర్తిగా బయట పడాలి. నేను శరీరం కాదు. వీటికి సాక్షిగా ఉన్న దివ్య చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. ఆత్మ చైతన్యవంతమవ్వడమే ధ్యానం.విజ్ఞాన భైరవ తంత్రంలో శివుడు పార్వతికి 112 ధ్యానపద్ధతులను బోధిస్తాడు. మనం వాటిని పాటిస్తే దైవత్వాన్ని పొందుతామేమోగాని ఆరాధించడం వల్ల కాదు. శివుడు, బుద్ధుడు మొదలైన వారందరూ తాము దైవమని తెలుసుకొని ద్రష్టలైనారు. వారు తమలోని దైవత్వాన్ని తెలుసుకుని ఆ మార్గాన్ని మనకు బోధించారు. కానీ మనం ఆ మార్గాలను అనుసరించకుండా కేవలం వారిని ఆరాధించటం చేస్తున్నాము. దేవుడు భౌతికం కానేకాదు. శుద్ధచైతన్య స్థితిలోనే దైవగుణాలు ఉంటాయి. అది చావు పుట్టుకలు లేని స్థితి. తనను తాను తెలుసుకున్నవాడేస్వామి. నీ నిజస్థితిలో కేంద్రీకృతమై ఉంటే నీవే స్వామి. ఈ నిజమైన అర్ధాలు తెలియకపోవడం వల్లనే కొందరు గడ్డాలు పెంచి విచిత్ర వేషాలతో గురువులుగా, స్వాములుగా చలామణి ఔతున్నారు. అసలు దైవత్వానికి భౌతిక వేషధారణతో సంబంధమే లేదు. సంసారాన్ని భౌతికంగా వదలవలసిన అవసరం అస్సలు లేదు. సామాన్య జీవితంలో ఉంటూ,రోజువారీ పనులు చేస్తూనే నీ ఆత్మలో నీవు కేంద్రీకృతమై సాక్షిగా ఉండడానికి రూపంతో పనిఏముంది? భాషతో, మాయలతో, అద్భుతాలతో మతంతో దైవత్వాన్ని ముడిపెట్టినంతవరకు ఎన్నటికీ దైవత్వాన్ని చేరలేవు. వీటన్నింటికీ అంటని స్వచ్ఛమైన చైతన్యస్థితే దైవత్వమని తెలుసుకో. సాక్షీభూతుడవై ఉండు. ఆ స్థితిని చేరుకున్నారు కనుకే కృష్ణుడిని, బుద్ధుడిని, క్రీస్తును దేవుళ్ళన్నారు. నీలోని కల్మషాలను తొలగించుకొని స్వచ్ఛమైన చైతన్యంగా మిగిలిపో. అధ్యాత్మిక ప్రయాణాన్ని ఒంటరిగానే చేయాలి. మధ్యవర్తులెవ్వరూ నీకు సహాయం చేయలేరు. యాంత్రికమైన పద్ధతులను పాటిస్తూ, గుడ్డి నమ్మకాలతో ఉంటే మనస్సు ఉచ్చులో చిక్కుకుపోతావు కానీ ఆత్మవైపు వెళ్ళలేవు. ఆత్మ చైతన్యాన్ని మాత్రం పొందలేవు.దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నంతమాత్రాన దేవునికి దగ్గర ఉన్నట్టు కాదు. నమ్మకాలకు అతీతమైన స్థితే దైవత్వం. మనస్సుకు అతీతమైన స్థితే దైవత్వం. అందుకు మార్గమే ధ్యానం.దేవుడు ఒక మనిషి కాదు. దైవత్వం ఒక స్థితి, నీ నిజస్థితి. తనను తాను తెలుసుకున్నవాడే దేవుడు. నీ నిజస్థితిని తెలుసుకుంటే నీవే దైవం. – స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
బౌద్ధ వాణి : మీకూ నాకూ అదే తేడా..!
బుద్ధుడిని చూడడం కోసం ఓరోజు అనేక మంది వచ్చారు. ఆ సమయంలో బుద్ధుడు ఓ చెట్టు కింద ఉన్న అరుగుమీద కూర్చుని ఉన్నారు. బుద్ధుడు చేతిలో ఓ పట్టు రుమాలు ఉండటం చూసి అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం వేసింది. విలాసాలకూ ఖరీదైన వస్త్రాలకూ ఆమడదూరంలో ఉండే బుద్ధుడి దగ్గర పట్టు రుమాలు ఉండటమేమిటని అందరూ చెవులు కొరుక్కున్నారు. అక్కడ మౌనం ఆవరించిన తర్వాత బుద్ధుడు తన చేతిలో ఉన్న రుమాలుని చూపిస్తూ ఏమిటది అని ఆడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలు అని చెప్పారు. అనంతరం బుద్ధుడు ఆ రుమాలులో అయిదు ముళ్ళు వేసి చూపిస్తూ ఇప్పుడిదేమిటీ అని అడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలని చెప్పారు. అప్పుడు బుద్ధుడు ‘అదే మీకూ నాకూ తేడా. ఆ తేడా వల్లే మీరక్కడా నేనిక్కడా ఉన్నాను‘ అంటూ తన మాటలు కొనసాగింంచారు. ‘అయిదు ముళ్ళు ఏంటంటే హింసకు పాల్పడకపోవడం, చైతన్యం కలిగి ఉండటం, అత్యాశకు దూరంగా ఉండటం, ఏం జరిగినా అబద్ధం చెప్పకపోవడం, నిజాయితీతో కూడిన సత్పవ్రర్తన కలిగి ఉండటం‘ అని చెప్పారు. ఈ అయిదూ అనుసరించగలిగితే ఎవరితోనూ ఏ గొడవలూ రావని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ అయిదు పురోగతికీ, మానసిక ప్రశాంతతకూ ఎంతో అవసరం. అందుకోసమే బుద్ధుడు అయిదు ముడులు వేసారు. కానీ ఆ ముళ్ళ విషయం ఆలోచించని వాళ్ళందరూ ఆ రుమాలు పట్టుదనే చెప్పారు తప్ప వాళ్ళెవరికీ బుద్ధుడెందుకు ముళ్ళు వేసారన్నది ఆలోచించలేదు. చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా! -
ఐఏఎస్ కల నుంచి సాధ్వీ గౌరీ గిరి దాకా...
ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం అది. నిక్కీ అని ముద్దుగా పిలుచుకునే చెల్లెలు ప్రాచీతో కలిసి ఆడుకోవడమంటే 13 ఏళ్ల అక్క రాఖీ సింగ్‌కు మహా ఇష్టం. పాఠశాలలోనూ చక్కని చదువరి. పెద్దయ్యాక ప్రజాసేవ చేయాలనేది ఆమె కల. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆమె ఆశయం. స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్కాలేజీలో 9వ తరగతి చదువుతూ స్కూళ్లో పాఠ్యాంశాలతోపాటు రామయణ, భాగవతాది ఇతిహాసాలపైనా అనర్గళంగా మాట్లాడేది. హిందూ మతంపై అచంచల విశ్వాసం ఉన్న రాఖీసింగ్ దుర్గాదేవిని బాగా పూజించేది. దేవీ శరన్నవరాత్రుల కాలంలో చెప్పుల్లేకుండానే నడిచిందని స్కూల్ యాజమాన్యంలోని అధికారి పీసీ శర్మ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని దౌలీ పట్టణం ఈమె స్వస్థలం. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి చూపే రాఖీ హఠాత్తుగా తాను సన్యాసినిగా మారతానని చెప్పినా తల్లిదండ్రుల్లో ఎలాంటి కలవరపాటు లేదు. ఆధ్యాత్మిక భావాలున్న తమ పెద్దకూతురు నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దీంతో జనవరి 19వ తేదీన జునా అఖాడాలో చేరి సాధ్వీగా మారేందుకు రాఖీ సిద్ధమైంది. ఆమెను పిండదాన్ క్రతువు తర్వాత గౌరీ గిరిగా పేరు మార్చి అఖాడాలో చేర్చుకుంటామని అఖాడా పెద్ద మహంత్ కౌషాల్ గిరి చెప్పారు. మలుపు తిప్పిన మహాకుంభమేళా తండ్రి సందీప్ సింగ్ ధాకరా, తల్లి రీమా సింగ్‌లతో కలిసి గత ఏడాది డిసెంబర్లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లింది. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రాపంచిక సుఖాలకు దూరంగా నిరాడంబరంగా గడుపుతున్న సాధువుల జీవనశైలిని చూసి ఆకర్షితురాలైంది. ఐఏఎస్ అధికారిగా ప్రజల కష్టాలను తీర్చే బదులు ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రజల మానసిక సమస్యలు తీర్చడం ముఖ్యమని భావించింది. బాహ్య ప్రపంచ కష్టాల కడలిని ఈదలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను తన ఆధ్యాత్మిక బోధనలతో సాంత్వన చేకూరుస్తానని, సాధ్విగా తన వంతు సాయం చేస్తానని రాఖీసింగ్ చెప్పింది. డిసెంబర్ 26వ తేదీన తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వాళ్లు అందుకు అంగీకరించి సెక్టార్20 ప్రాంతంలోని మహంత్ కౌషాల్ గిరి ఆశ్రమంలో చేరి్పంచారు. కన్యాదానం నుంచి సాధ్వి దాకా 13 ఏళ్ల రాఖీ నడవడికను స్వయంగా గమనించిన అఖాడా పెద్దలు ఆమెను సన్యాసినిగా స్వీకరించేందుకు అంగీకరించారు. గురుగ్రామ్ నుంచి మహంత్ రాగా ఆయన సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ జనవరి ఆరో తేదీన తల్లిదండ్రులు ఆశ్రమానికి రాఖీని కన్యాదానం చేశారు. ఆరోజున అఖాడాలు ఆమెకు గౌరి అని నామకరణం చేశారు. కూతురు సన్యాసినిగా మారుతుండటంపై తల్లి రీమా స్పందించారు. ‘‘మా కుటుంబం గత నాలుగేళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలోనే పయనిస్తోంది. మహంత్ మేముండే ప్రాంతంలో భాగవతం విశేషాలను అందరికీ విడమరిచి చెప్పేవారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లినప్పుడు రాఖీ తన మనసులోని మాట చెప్పింది. అది ఆమె నిర్ణయం కాకపోవచ్చు. భగవత్ సంకల్పం అనుకుంటా. ఆశ్రమంలో ఎందుకు చేర్పించారని బంధువుల నుంచి ఎన్నో ప్రశ్నలు. అయినా తల్లిగా నా బిడ్డ అక్కడ ఎలా ఉండగలదు? ఏం తింటుంది? అనే భయం నాకూ ఉంది. కానీ ఆమె నిర్ణయం దైవేచ్ఛ కాబట్టి మేం కూడా అడ్డుచెప్పలేదు’’అని తల్లి రీమా అన్నారు. సుదీర్ఘంగా క్రతువు సనాతన ధర్మ ప్రకారం సాధ్విగా మారితే ఆ అమ్మాయి కేశసంరక్షణపై ధ్యాస పెట్టకూడదు. జుట్టంతా ఉండలు కట్టినా పట్టించుకోవద్దు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించాలి. సాధ్వి గా మారే రోజున ఐదుగురు సాధువులు ఇచ్చిన ఐదు పవిత్ర పత్తిదారాలను స్వీకరించాలి. సన్యాసుల అన్నపానాలు, దీక్షా నియమాలను పాటించాలి. ప్రేమ, రాగద్వేషాలు, కామామోహాలను త్యజించాలి. మహాకుంభమేళాలో నాలుగో పవిత్ర పుణ్యస్నానాల రోజున అంటే జనవరి 19వ తేదీన పిండదాన్ క్రతువులో భాగంగా గౌరీని వేదమంత్రోచ్ఛారణల మధ్య గంగానదిలో 108 సార్లు ఓం నమఃశివాయ అని చదివిస్తూ ముంచుతారు. తర్వాత గంగాదేవికి హారతి ఇచ్చాక గౌరీ గిరిగా కొత్త పేరుతో పిలుస్తారు. ఇటీవల మరికొందరూ.. ఇటీవలికాలంలో భారత్‌లో ఎంతోమంది సాధారణ జీవితానికి స్వస్తిపలికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించారు. ఇందులో టీనేజర్లూ ఉన్నారు. సూరత్‌లో వందల కోట్ల ఆస్తులున్న వజ్రాల వ్యాపారి గారాలపట్టి, 8 ఏళ్ల దేవాన్షీ సంఘ్వీ సైతం సన్యాసినిగా మారింది. జైన్ సాధ్విగా కొత్త జీవితాన్ని ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ఘటన ఇంకోటి గుజరాత్‌లోనే జరిగింది. హిమ్మత్‌నగర్‌లో నిర్మాణరంగంలో వ్యాపారం చేస్తూ రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టిన భవేశ్ భాయ్ భండారీ దంపతులు సన్యాసులుగా మారారు. అంతకుముందే అంటే 2022లోనే వీళ్ల టీనేజీ కుమారుడు, కుమార్తె సన్యాసులుగా మారడంతో వీళ్ల బాటలనే తల్లిదండ్రులు పయనించడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.ఎవరీ రాఖీ సింగ్ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది. ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్‌తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి..
దేశంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతీఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ఒక యోగి ఆత్మకథ’ అని చెబుతుంటారు. ఈ పుస్తకం ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. పరమహంస యోగానంద తన జీవిత అనుభవాలను ‘ఒక యోగి ఆత్మకథ’ రూపంలో వెలువరించారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ పరమహంస యోగానంద మార్గదర్శిగా నిలిచారు. ఈరోజు(జనవరి 5) ఆ మహనీయుని జన్మదినం. అందుకే ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలను ఒకసారి స్మరించుకుందాం.యోగాకున్న ప్రాముఖ్యతను ప్రపంచమంతటికీ తెలియజేయడంలో పరమహంస యోగానంద(Paramahansa Yogananda) కీలక పాత్ర పోషించారు. పాశ్చాత్య దేశాల్లో ఆయనను ‘ఫాదర్ ఆఫ్ యోగా’ అని పిలుస్తారు. పరమహంస యోగానంద అందించిన ‘క్రియాయోగం’ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మిక బోధనలకు ఏకరూపత కల్పించడం, శాస్త్రీయ ధ్యాన పద్ధతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం పరమహంస యోగానంద ఎనలేని కృషి చేశారు.పరమహంస యోగానంద ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1893, జనవరి 5న జన్మించారు. అతని తండ్రి భగవతి చరణ్ ఘోష్ గోరఖ్‌పూర్ రైల్వేలో అధికారి. పరమహంస యోగానంద అసలు పేరు ముకుంద లాల్ ఘోష్. అనంతర కాలంలో పరమహంస యోగానంద అనే పేరుతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1920లో తొలిసారిగా పరమహంస యోగానంద భారత ప్రతినిధిగా బోస్టన్‌లో జరిగిన మతపరమైన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. అదే ఏడాది యోగానంద భారత్‌లో తత్వశాస్త్రం, ధ్యాన శాస్త్రంపై బోధనలను వ్యాప్తి చేయడానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్(Self-Realization Fellowship)ను స్థాపించారు. 1925లో లాస్ ఏంజిల్స్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరమహంస యోగానంద శిష్యులుగా మారారు.1917లో ఆయన ఆదర్శ జీవన్ విద్యాలయ(Adarsh Jeevan Vidyalaya)ను స్థాపించారు. ఈ పాఠశాలలో ఆధునిక విద్యా పద్ధతుల ద్వారా యోగా శిక్షణ, ఆధ్యాత్మిక ఆదర్శాలను అందించారు. పరమహంస యోగానంద ఆధ్యాత్మిక రంగంలో అందించిన సేవలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం 1977, 2017లలో రెండు తపాలా బిళ్ళలను విడుదల చేసింది. పరమహంస యోగానంద 1952 మార్చి 7న లాస్ ఏంజెల్స్‌లో మహాసమాధిలో ప్రవేశించారు. ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ.. -
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్‌లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
తాత్వికత: ఎంతో చిన్నది జీవితం
ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు. ‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ప్రేమించు... జీవించు...
ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది.. మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు. అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.– దాసరి దుర్గాప్రసాద్ -
ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చెప్పుకొనేదే.. నగరంలో ఉరుకులు పరుగుల జీవితం.. మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనలకు గురవుతూ.. మత్తుపానీయాలకు బానిసలు అవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే ఒత్తిడి నుంచి బయటపడేందుకు పలు కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండే రిసార్టులకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ.. నగరంలోని, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.ఎందుకిలా..? సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్టులు, సబి్మషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లతో రోజును భారంగా గడుపుతుంటారు. నెలాఖరు రాగానే లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు మరింత కామన్. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాటు చేసుకుని, అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు దిగిపోతుంటుంది. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునేంత ప్రశాంతత దొరకట్లేదని ఆధ్యాతి్మక చింతన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.చిన్న వయసులోనే..వారాంతాల్లో నగరంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ, యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరాలకు కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుని చిన్న వయసులోనే వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చుని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త ఒరవడిని చూపుకొంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయల్దేరుతున్నారు.ఆ రోజులే బాగున్నాయి.. చాలీచాలని డబ్బులతో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్‌లో తిరిగిన రోజులే బాగున్నాయి. అప్పుడు ఉద్యో గం వస్తే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఏదో పోగొట్టుకున్న వెలితి ఉంది. సవాలక్ష సమస్యలు చుట్టు ముడుతున్నట్లు ఉంది. ప్రశాంతత అనే మాటే కరువైంది. నెలాఖరు రాగానే లోన్లు.. ఈఎంఐల వెంట పరిగెత్తాల్సి వస్తోంది. డబ్బులు అన్నీ ఇవ్వదనే విషయం అవగతమవుతోంది. అందుకే భక్తి మార్గం ప్రశాంతతను ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి వారం ఏదైనా గుడికి వెళ్లి ఒంటరిగా కాసేపు గడుపుతాను. – నల్లం నవీన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్మనసుకు ప్రశాంతత నాకు ఆధ్యాతి్మక భావన ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు చేపట్టడం అలవాటు. పెళ్లయిన తర్వాత ఉద్యోగం, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. వారంలో శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. పిల్లలు, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్తుంటాం. తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, ఈ మధ్య స్వర్ణగిరి వెళ్లాం. – నిహారికారెడ్డి, మియాపూర్ -
ఆట కదరా శివా!
పాండిచ్చేరి పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా అరుణాచలం బస్సు ఎక్కాడు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని రాజగోపురం వద్ద నిలబడి వినాయకుణ్ణి ప్రార్థించి నడక ప్రారంభించాడు. అష్టలింగాలను చూస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని అతడి ఆలోచన.నడుస్తూ నడుస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన ఓ ఆధ్యాత్మిక వేత్త పరిచయం అయ్యాడు. ‘‘అలజడి లేని జీవితాన్ని గడ΄ాలంటే ఏమి చేయాలి?’’ అని ఆసక్తిగా ఆ ఆధ్యాత్మికవేత్తను అడిగాడు యువకుడు. ఆధ్యాత్మిక వేత్త చిరునవ్వు ముఖంతో ‘‘ఇద్దరూ ఆడగలిగి, ఇద్దరూ గెలవగలిగే ఆట ఆడాలి’’ అని బదులిచ్చాడు. అర్థం కాని ముఖం పెట్టాడు ఆ యువకుడు. ఆధ్యాత్మికవేత్త యువకుడి హావభావాలు పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ‘ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ, ఇద్దరూ ఎలా గెలుస్తారు?’ అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు. వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మిక వేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా ‘‘మీరు చెప్పింది ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆలోచించు. నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని యాభై మంది ఆడినా... అందరూ గెలుస్తారు. అంతేకాదు... అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను’’ అంటూ ఆధ్యాత్మిక వేత్త వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందూ వెనుకా చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. చేసేదేం లేక ఆధ్యాత్మికవేత్తను వెదుక్కుంటూ వెళ్ళాడు.ఎలాగైతేనేమి ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసపోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి‘‘మీరు సమాధానం చెప్పక΄ోతే నా తల బద్దలై ΄ోయేలా ఉంది’’అని దిగులుగా ముఖం పెట్టాడు. యువకుడి భుజం తడుతూ ఆ ఆధ్యాత్మికవేత్త ‘‘విచిత్రం ఏమిటంటే... వందమంది ఆ ఆట ఆడినా, వందమందీ గెలుస్తారు. అదేమిటంటే... ఎదుటివారిని ప్రేమించే ఆట. అక్కడ అందరూ విజేతలే. ఓటమి పాలయ్యేవారు ఎవ్వరూ ఉండరు’’ అని సమాధానమిచ్చి అక్కడినుంచి మెరుపు వేగంతో వెళ్ళి΄ోయాడు.‘‘నిజమే. జీవితమనేది ఒక ఆటలాంటిది. ప్రేమ విత్తనాలు వెదజల్లే ఆట ఆడటం ప్రారంభిస్తే జీవితం పూల తోట అవుతుంది. దానికి వయస్సు, భాష, లింగం, ్ర΄ాంతం, కులం, మతం అనే హద్దులు ఉండవు ’’ అనుకుంటూ ఆ యువకుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
భక్తుని వేదన..
సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
దేహం.. గాలిలో కదిలే దీపం!
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే ‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి దుఃఖం దూరమై, ముక్తి దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జనరంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆపై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు..దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సందోహము స్వప్నకాలమున దోచెడి సందడి రాజ్యభోగ సన్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీయైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయుసంచలిత దీపిక’ అనే మాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం. విన్నవెంటనే మనసుకు తోచే అర్థం. ఇక రెండవది – మానవ శరీరంలో ఊపిరి అనే వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే దీపం వంటిది ఈ దేహం. ఊపిరి ప్రసరణం ఆగిపోగానే అదీ ఆగిపోతుంది, ఆరి పోతుంది అనే విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి సొగసును కూర్చేవే!‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి అంతా కలలో జరిగేదిగానే భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజాలికుడు వెదజల్లే ధనం వంటిది సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం. – భట్టు వెంకటరావు -
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
దొంగల దోపిడి..
ఓ లక్ష్మీనృసింహ స్వామీ! నాకు చేయూతనివ్వవయ్యా! మమ దేహి కరావలంబమ్!నాకు కనిపించడం మానేసింది. అంధత్వం ఏర్పడింది. ఎదురుగా మంచీ, చెడూ కనిపిస్తుంటే కూడా ఏది ఏదో పోల్చుకోలేకుండా ఉన్నాను. ఇది పాపం, ఇది పుణ్యం అని గుర్తించలేకపోతున్నాను. ఎటు పోతున్నానో, ఎటు పోవాలో, ఏమి కాబోతున్నదో ఏమీ పాలు పోవడం లేదు. ఇది నేత్రవ్యాధి కాదు. బుద్ధి వైకల్యం. నేను వివేకాన్ని కోల్పోయాను. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు!మహాబలవంతులైన చోరులు నా మీద దాడి చేసి, అమూల్యమైన నా వివేక ధనాన్ని దొంగిలించుకెళ్లారు. ఆ దొంగలకు ‘ఇంద్రియాలు’ అని నామధేయం. నేను ఏమరుపాటుగా ఉండగా, వాళ్ళు నన్ను ఇట్టే లొంగదీసుకుని, భోగలాలసత అనే ఇనుప గొలుసులతో కట్టివేసి, నా వివేకాన్ని ఊచముట్టుగా దోచేశారు. దాంతో నేను అవివేకిగా, మూర్ఖుడిగా, పాప పుణ్యాల గ్రహింపు లేకుండా, నాకు ఏది మేలో నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను.నాకు మిగిలిందల్లా ఇంద్రియ భోగాల మీద మితిలేని, మతిలేని వ్యామోహం. ఆ మోహాంధకారం నా జీవితాన్ని చీకటి కూపం చేసేసింది. అది ఏ గోతిలోకి లాక్కెళితే అందులో పడిపోతున్నానే తప్ప, నాకు క్షేమకరమైన మార్గాన్ని స్వయంగా ఎంచుకోగల శక్తిని, దొంగలు దోచారు. నా బుద్ధి పని చేయడం మానేసింది. విచక్షణా జ్ఞాననేత్రం మూసుకుపోయింది. నాకు చేయూత ఇచ్చి, ఈ అంధకారంలో నుంచి బయటపడే మార్గం చూపు స్వామీ!"అంధస్య, మే, హృత వివేక మహా ధనస్యచోరైః మహా బలిభిః ఇంద్రియ నామధేౖయెఃమోహాంధకార కుహరే విని పాతితస్యలక్ష్మీనృసింహ, మమ దేహి కరావలంబమ్!"– ఎం. మారుతి శాస్త్రి -
భగవత్ప్రసాదం! ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’..
ఈ విశ్వంలో ఆలోచనలు, భావనలను మనిషి మాత్రమే మాటల ద్వారా తెలుపగలడు. ఏ ఇతర జీవికీ మాట్లాడే శక్తి లేదు. మాట్లాడటం అనేది భగవంతుడు మానవునికి అనుగ్రహించిన వరప్రసాదం. మానవుడు తన జీవితాన్ని సంతోషమయం లేక దుఃఖమయం కావించుకోవడం అనేది దేవుడు ఇచ్చిన వరప్రసాదాన్ని ఉపయోగించుకొనే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మాటను సరిగా, విచక్షణతో ఉపయోగించుకొన్న మానవుడు... తాను ఆనందంగా ఉండడమే కాక ఇతరులను కూడా సంతోషపరచగలడు.దీనికి భిన్నంగా విచక్షణారహితమైన, అస్తవ్యస్తమైన మాటలు మాట్లాడుట వల్ల సమస్యలు వస్తాయి. ఫలితంగా మనిషి జీవితం దుఃఖమయం అవుతుంది. ఈ కారణం వల్లనే ‘మాట్లాడడానికి ముందు ఆలోచించు’ అని పెద్దలు చెప్పారు. మనం సర్వకాల, సర్వావస్థలయందు తియ్యగా, ఇంపుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మనం మాట్లాడే పద్ధతి ఇతరులను కోపోద్రిక్తులను చేయకుండా జాగ్రత్త పడాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. నియమాలను ఉల్లంఘించకుండా ఉండడమే వినయం. ఈ పద్ధతి భగవద్గీతలో ‘వాజ్మయ తపస్సు’అని తెలుపబడినది.మనం చేయు భౌతికపరమైన పనులన్నీ ఆలోచనలపైననే ఆధారపడి ఉంటాయి. ఆలోచించడం, మంచి– చెడులను తెలుసుకొనడం బుద్ధికి సంబంధించిన పని. బుద్ధిబలాన్ని ఉపయోగించి ‘ఏది ఉచితం, ఏది ఉచితంకాదు’ అని మనం తెలుసుకో గలుగుతున్నాం. మనం చేసే పనిని బట్టి మన ఆలోచన వ్యక్తమవుతుంది.ఉదాహరణకు ఒక వక్త ముందు మైక్ ఏర్పాటు చేసినా... ఆ వక్త ఆలోచన మాటల రూపంలో బయటికి రానంత వరకూ మైక్ మనకు వినిపింపచేయలేదు. అలాగే క్రియ అనేది దానంతట అది మంచి కాదు లేక చెడు కాదు. దీని (చర్య) మంచి, చెడులు దీనికి మూలాధారమైన ఆలోచనలోనే ఉంటాయి. అందువల్లనే మనం చేసే పని మంచిగానూ, గౌరవప్రదంగానూ ఉండాలి. మంచి ఆలోచనలకే తావునిచ్చి, వాటిని వృద్ధి చేసుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఆధ్యాత్మిక శక్తితో...
ఇవ్వాళ ప్రభుత్వాలూ, సంఘసేవకులూ మహిళా సాధికారత గురించి ఎంతగానో మాట్లాడుతున్నారు. కానీ, దాదాపు 140 సంవత్సరాల క్రితమే శ్రీ రామకృష్ణ పరమహంస స్త్రీ జనోద్ధరణపై దృష్టి పెట్టారు. సాక్షాత్తూ భార్యలోనే కాళీ మాతను దర్శించగలిగిన పరమహంస స్త్రీ జనోద్ధరణకు తన శిష్యులను ప్రోత్సహించారు.ఒకరోజు గౌరీమా అనే భక్తురాలు పువ్వులు సేకరిస్తుండగా గురుదేవులు ఒక నీటికుండతో అక్కడకు వచ్చి ఒక చేత్తో చెట్టుకొమ్మను పట్టుకొని మరో చేత్తో చెట్టుకు నీరు పోస్తూ ‘గౌరీ, నేను నీరు పోస్తూ ఉంటే నువ్వు మట్టిని కలుపు’ అన్నాడు. అప్పుడామే ‘ఇక్కడ బంక మట్టి లేదు. ఎలా మట్టిని కలప గలన’ని పలికింది.ఆ మాట విని గురుదేవులు ‘నేను ఏ అర్థంలో చెప్పానూ, నువ్వు ఏ రకంగా అర్థం చేసుకొన్నావూ? ఈ దేశంలో స్త్రీల పరిస్థితి శోచనీయంగానూ, బాధాకరంగానూ ఉంది. వారికోసం నువ్వు పాటుపడాలి’ అన్నారు. అంటే... తాను దేశ స్త్రీల అభివృద్ధికి నడుం బిగించి కృషి ఆరంభిస్తే, గురుదేవులు అందుకు తగిన తోడ్పాటు అందిస్తారన్నమాట అనుకున్నారు గౌరీమా. అప్పుడామె ‘కొద్ది మంది బాలికలను నాకు ఇవ్వండి. వారిని హిమాలయాలకు తోడ్కొని వెళ్ళి వారిని సౌశీల్యవంతులుగా తీర్చి దిద్దుతాను’ అంది. గురుదేవులు తన తలను అడ్డంగా ఊపుతూ, ‘కాదు, కాదు, నువ్వు నగరంలోనే ఉంటూ పని చేయాలి. నువ్వు అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనలు చాలు. ఆధ్యాత్మిక శక్తితో నువ్వు స్త్రీలను సేవించాలి’ అన్నారు.గురుదేవుల ఆదేశాన్ని శిరసావహించిన గౌరీమా కలకత్తాలో బాలికల నిమిత్తం ఒక పాఠశాలను స్థాపించి భారతీయ స్త్రీలను విద్యావంతులను గావించడంలోనూ, తద్వారా వారిని ఉద్ధరించడంలోనూ ఎంతో కృషి చేసింది. (పుటలు 248, 249 – శ్రీ రామకృష్ణ లీలామృతం). రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు కూడా మహిళా ఉద్ధరణకు ఎంతగానో కృషి చేయడం గమనార్హం. – రాచమడుగు శ్రీనివాసులు -
ఆచరణ ముఖ్యం..!
ఒక రోజు బోధివనానికి వచ్చిన ఓ నడివయస్కుడు బోధిసత్త్వుని పాదపద్మాలను తాకి నమస్కరించాడు. చిరునవ్వుతో అతని వివరాలు అడిగాడాయన. ‘దేవా నా పేరు అభినందనుడు. నేను పేదవాడిని. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. లౌకిక పాశాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాను. మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే నాకు జ్ఞానమార్గం చూపాలి’ అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.బోధిసత్త్వుడు ‘అభినందనా, ఈ చెట్లకున్న ఆకులను చూడు. అవన్నీ ఎందుకు కదులుతున్నాయో తెలుసా... గాలి వచ్చి ఢీకొనడంతో కదులుతున్నాయి. పాశమనే గాలి వచ్చి ఢీకొన్నప్పుడల్లా మనిషి ఆకులా ఇలా ఊగుతాడు. మొదట నీ మనసులో ఉన్న లౌకిక పాశాలను తెంచుకో. అప్పుడే నీవు జ్ఞానమార్గంలో నడవగలవు. అది నీ వల్ల సాధ్యమేనా? అన్నాడు. సాధ్యమే అన్నాడు అభినందనుడు. అయితే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండన్నాడు బోధిసత్త్వుడు.అభినందనుడు అక్కడే ఉండిపోయాడు. కొద్ది రోజులు సన్యాసి జీవితం చక్కగానే గడిపాడు. క్రమంగా అతడు మళ్లీ లౌకిక బంధనాల్లోకి జారుకోవడాన్ని బోధిసత్త్వుడు గమనించాడు.ఒక రోజు అభినందనుని పిలిచి రెండు పాత్రలు తీసుకున్నాడు. ఓ పాత్రలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మరొకటి ఖాళీ పాత్ర. పదార్థాలు ఉన్న పాత్రను నీటిలో వదిలేశాడు. అది లోపలికి మునిగిపోయింది. ఖాళీ పాత్రను నీటిలో వేశాడు. అది తేలియాడుతూ కనిపించింది. ‘బరువైన పాత్ర కనిపించకుండా పోయింది. ఖాళీ పాత్ర తేలుతోంది. ఖాళీ పాత్ర ఉంది చూశావూ, అది జ్ఞానపాత్ర. బరువైన పాత్ర ఉంది చూశావూ, అది బంధనాల పాత్ర.నేను సన్యాసినవుతాననీ, జ్ఞానినవుతాననీ చెప్పడం సులభం. కానీ ఆచరణ కొచ్చేటప్పటికి అది చాలా కష్టం. అది అంత సులభమైన విషయం కాదు. ఆశనూ, లౌకిక పాశాలనూ వదులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమై ఉండాలి’ అన్నాడు బోధిసత్త్వుడు. అప్పటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు అభినందనుడు. – యామిజాల జగదీశ్ -
దైవానుభవానికి మార్గం..
దైవత్వం ఒక అనుభవం. దీనిని హృదయంలో ప్రతిబింబింప జేసుకోవాలి. అద్దం కదులుతూ ఉన్నా లేదా దానిని పొగ కప్పివేసినా లేదా వస్తువుల నుండి చాలా దూరంగా ఉన్నా... అద్దం దేనినీ సరిగా ప్రతిబింబింప చేయలేదు. మనస్సు (అద్దం) నిశ్చలంగా (కదలకుండా) ఉండడమే ఏకాగ్రత. అద్దాన్ని కప్పి ఉంచే పొగ (అహం)ను తొలగించాలి. అదే ‘దైవ సాక్షాత్కారం’.జ్ఞానానికి రెండు స్థాయులు ఉన్నాయి. ఒకటి కిందిస్థాయి, మరొకటి పైస్థాయి. ఇంద్రియాలను ఉపయోగించుకొని, హేతుబద్ధంగా విచారించి తెలుసుకొనేది కిందిస్థాయి జ్ఞానం. చాలామంది కిందిస్థాయి జ్ఞానంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. దైవానికి సంబంధించిన జ్ఞానమే పైస్థాయికి చెందింది. ఇది సాధారణమైన జ్ఞానాన్ని మించింది. అంటే సర్వోత్కృష్టమైన దన్నమాట. కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన జ్ఞానాన్ని సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారు.మానవ జన్మ ఉన్నత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందటమే. మనిషి తన జన్మకు కారణం ఏమిటో మరచిపోయి ‘కామ– కర్మ– అవిద్య’ అనే చక్రంలో చిక్కుకున్నాడు. స్వార్థబుద్ధిని పోనీయక, సొంతలాభం కోసం ఇతరులకు నష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటివారికి ఎన్నటికీ విమోచన ఉండదు. కాబట్టి ఆత్మ వివేక మార్గంలో నడచి, భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతరుల దోషాలనూ, తన చుట్టూ గల వాతావరణంలోని లోపాలను ఎంచుట మనిషికి గల సాధారణ లక్షణం. ఈ విధంగా తప్పులను ఎంచుటం వలన ఏ ప్రయోజనమూ లేదు. వాస్తవంగా ఈ లక్షణ ం మనిషి మానసిక ప్రశాంతతను భంగపరుస్తుంది. ఇందువలన సమతాస్థితిని పొందలేడు.ఆధ్యాత్మిక మార్గం అనుసరించదలచిన భక్తుడు చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది. ఇతరుల దోషాలను ఎంచటం మానివేసి, ఎవరికి వారు తమను తాము సరిచేసుకొని అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నించాలి. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్న లోకంలో తరచుగా వినబడుతూ ఉంటుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కోరకమైన సమాధానాన్ని ఇస్తుంటారు. ఈ ప్రపంచం మాయ అనుకున్న వారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతామని అంటారు. శూన్యవాదులు మనం శూన్యం (ఏమీ లేని వస్తువు) నుంచి వచ్చాము కనుక శూన్యంలోకే పోతామని అభి్రపాయపడతారు. భౌతికవాదులు మాత్రం కోరుకున్న భౌతిక పదార్థాన్ని పొందడమే లక్ష్యం అంటారు. కొందరు ఆధ్యాత్మిక వేత్తలు మనం భగవంతుని నుంచి వచ్చాము కనుక అతనిలోనే కలిసిపోతామని చెప్తుంటారు. అభ్యుదయవాదులు కొందరున్నారు. వారు ఐహిక సుఖమే పరమ లక్ష్యం అంటారు. మతవాదులున్నారు, వారు పరలోకంలో సుఖపడడమే తమ లక్ష్యం అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మానవ లక్ష్యాన్ని పేర్కొంటారు.అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. కనుక ఇతరప్రాణుల కంటే మానవుడు శ్రేష్ఠుడు. అంతేకాదు, ఇతరప్రాణులకు లేని లక్ష్యం మానవునికి ఉంది. నాల్గు పురుషార్థాలలో అర్థ కామాలను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళున్నారు. నిజానికి మానవుడు ధనాన్ని సంపాదించి, సుఖపడరాదని ఏ ధర్మ గ్రంథమూ చెప్పదు. అయితే ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, ధార్మిక ప్రవృత్తిలోనే కోరికలను తీర్చుకోవాలని, శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. అందుకే పురుషార్థాలలో మొదట ధర్మాన్నే పేర్కొన్నారు.తనకే కాక, తోటిప్రాణులకు ఏది హితకరమైందో, ఆ కర్మకే ధర్మమని పేరు. ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని స్వార్థం అంటారు. ఆచారం వ్యక్తిగతమైంది కావచ్చు కాని, ధర్మం సర్వనిష్టమైంది. అందరికీ ఆమోద యోగ్యమైంది. అందుకే పురుషార్థాలను సాధించాలనుకున్న వ్యక్తి మొదట ధర్మపరుడు కావాలి. ధర్మాన్ని దారిబత్తెంగా చేసుకుని ప్రయాణించే వారికి ధన్యప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతాయి. అంతేకాదు, ఆ రెండింటికీ మించి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. అందువల్ల మానవుని లక్ష్యం కేవలం ధనార్జనతోపాటు సుఖ్రపాప్తి మాత్రమే కాదు, మోక్షం సాధించడమే పరమ లక్ష్యమని తెలుస్తుంది.మోక్షం అంటే విడుదల. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. అదే మానవుని పరమ లక్ష్యం. బంధనాల్లో చిక్కుకోవడానికి కేవలం కర్మలు చేస్తే చాలు. కాని వాటి నుంచి బయట పడటానికి ధార్మికుడు కావాలి. ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీర తత్వంతోపాటు, ఈ శరీరంలో బంధింపబడిన తానెవరో తెలుసుకోవాలి. అంతేకాదు, మోక్ష ప్రదాతను గుర్తించాలి. శరీరం ఉంది. తాను ఉన్నాడు. శరీరం బంధనం. దాన్ని విడిచిపెడితే మోక్షం. కానీ ఎట్లా విడిచిపెట్టాలి? అందుకు చేయవలసిన పనేమిటి? తెలిస్తే గాని పరమ లక్ష్యాన్ని అందుకోలేం. – ఆచార్య మసన చెన్నప్ప -
ఇవాళ హనుమాన్ జయంతినా? హనుమాన్ విజయోత్సవమా?
హనుమాన్ జయంతి ఎప్పుడనేది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కువగా వైశాఖ మాసంలో దశమి రోజు జరుపుకుంటే, ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇంతకీ ఏది కరెక్ట్?. అదీగాక చాలామంది ఈ రోజును హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని బట్టి చూస్తే హనుమాన్ జయంతి చైత్రమాసంలోనా? వైశాఖంలోనా ? అంటే..! పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుంచి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమినే ఎందుకు.. హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్రింది శ్లోకంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. విజయోత్సవంగా చెప్పడానికి రీజన్.. చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం-గుర్రాలు మాట వినవు!
ధర్మాచరణకు ప్రధానమైన ప్రతికూల పరిస్థితులు రెండు–అర్థము, కామము. ఇవి ధర్మాచరణకు నిరంతరం పరీక్ష పెడుతుంటాయి. అర్థము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, భోగ సంబంధమైన సమస్త వస్తువుల రాశిని అర్థము అనవచ్చు. తనకు సుఖాన్నిచ్చే మంచం, కుర్చీ, ప్రయాణించే వాహనం ఏదయినా కావచ్చు. కామము అంటే – కోర్కె వేరు, అవసరం వేరు. రెండింటికీ మధ్య సున్నితమైన భేదం ఉంది. అవసరం తీరకపోతే పాపం అడ్డు వస్తున్నదని గుర్తు. దానిని తీసేయగలిగిన శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. పాపం పోవడానికి యజ్ఞ యాగాదులు చేస్తారు. సంతానం కోసం అశ్వమేథం.. వంటివి. మనం ఒక కోరిక కోరుకుంటున్నాం. అది అవసరం కూడా. దానికి భగవంతుడిని ఆశ్రయించడం తప్పు కానేకాదు. భగవంతుడు ఏమంటాడంటే... నాలుగు రకాల భక్తులు నన్ను ఎప్పుడూ ఆశ్రయించి ఉంటారు. చాలా ఆర్తి కలిగినవాళ్ళు, అసలు భగవంతుడెవరని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు. మంచి పనులు చేయడానికి ధనసహాయం కోరుకుంటున్న వాళ్ళు. తత్త్వతః పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకుని స్తోత్రం చేసేవాళ్ళు. చివరి తరగతి భక్తులగురించి శంకరాచార్యులవారు ఏమంటారంటే... సముద్ర కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో తత్త్వాన్ని అవగతం చేసుకుని జ్ఞాని భగవంతుడిని స్తోత్రం చేయడం అలా ఉంటుంది–అని. ఎక్కడో కోటానుకోట్లలో ఒక్కరే కారణజన్ములుంటారు. వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వారికి అర్థకామముల మీద ఎటువంటి తపనా ఉండదు. ఒకవేళ ఏదయినా మనసులో ఏర్పడినా, ధర్మాన్ని రక్షించడానికి ఇలా చేద్దామన్న ఆలోచనే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఏకాకిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. దేనినీ కోరుకోడు. అతడు జీవన్ముక్తుడు. కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారా !!! ఉండరు. ధర్మానికి పెద్ద పరీక్ష అర్థము. ఒక కోరిక తీర్చుకోవడానికి పరుగులు తీయడం.. చివరకు తీర్చుకుంటాడు. అది తీరి΄ోయింది కనుక మళ్లీ ఆ కోరిక పుట్టదు– అని చెప్పలేం. మామిడిపండు తినాలని ఆరాటపడి, చివరకు అది దొరికి తిన్న తరువాత.. అది అక్కడితో ఆగదు. అదే పండు మళ్ళీ మళ్లీ కావాలనిపించవచ్చు, ఏ పండయినా సరే అని మళ్ళీ పరుగులు మొదలు కావచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నేతి ΄ాత్ర పట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ప్రజ్వరిల్లే అగ్ని మీద నెయ్యి చల్లితే, అది ఆరదు, మరింత విజృంభిస్తుంది. కోరికలూ అంతే. అవి ఉపశమించే అవకాశం ఉండదు. మరి అర్థకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. అవి ఉండితీరతాయి. ఎవరికయినా భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవడానికి అవసరమయిన సాధనసంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరికా ఉంటుంది. దానికి సనాతన ధర్మం ఒక చక్కటి పరిష్కారం చూపింది. అర్థకామములను ధర్మంతో ముడిపెట్టింది. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన అర్థము.. ఇవి మోక్షానికి కారణమవుతాయి తప్ప బంధాలకు, కోరికలు అపరిమితంగా ప్రజ్వరిల్లడానికి కారణం కావు. అప్పుడు మనిషి జీవితం, కుటుంబ జీవనం, సామాజిక వ్యవస్థ అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. చెలియలికట్ట దాటే సాహసం చేయవు. -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
ఆ రోజే రాఖీ పండుగ ఎందుకు? భద్రకాలం అంటే..?
ప్రతి ఏడాది రాఖీ పండుగ చక్కగా జరుపుకునేవాళ్లం. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ తలెత్తింది. అసలు ఏ రోజు ఈ పండుగ జరుపుకోవాలనేది ఒకటే గందరగోళం. కొందరూ ఆ రోజుని మరొకరు వేరొకటి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకి గందరగోళం వచ్చిందో, ఎప్పుడూ రాఖీ కట్టాలో తదితర విషయాలు చూద్దాం!. ఈ నెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా.. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.10 నిమిషాల వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి. ఇంతకీ భద్రకాలం అంటే..?? భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర(శూర్పణఖ). ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు. ఇక పోతే మనం సౌరమానం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. సూర్యోదయం మొదలైన తర్వాత ఉన్న తిథినే ప్రధానంగా తీసుకుంటాం. బుధవారం ఉదయం చతుర్ధశి తిథి ఉంది. ఉదయం 10.30 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి వస్తుంది. అందువల్ల బుధవారం చేసుకోము. గురువారం ఉదయం 9.45 నిమిషాల వరకు ఉండటంతో ఇక ఆరోజునే రాఖీపండుగ పరిగణించి జరుపుకుంటున్నాం. రక్ష కోసం కడుతున్నాం కాబట్టి అన్నా చెల్లెళ్ల ఇరువురికి మంచి జరిగేలా మంచి టైంలోనే కట్టుకుందా. మంచి సత్సంబంధాలనే కొనసాగిద్దాం. (చదవండి: రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?) -
శుభమే జరిగేట్టు శ్రద్ధ వహిద్దాం!
ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏమిటి? ఏం ఉన్నా, ఏం లేకపోయినా ఒక వ్యక్తికి ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి? ఎలాంటి వ్యక్తి ఐనా, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఐనా పొందాల్సింది ఏమిటి? ఎవరి ఆశలు వారివి. ఎవరి ఆకాంక్షలు వారివి. ఎవరి ఆశయాలు వారివి. మన అందరికీ అందాల్సిన వాటిల్లో ఏది అగ్రగణ్యమైంది? ఏది మనల్ని ఎప్పటికీ వీడిపోకుండా ఉండాలి? శుభం... శుభం... శుభం... ‘అథాతో బ్రహ్మ జిజ్ఞాస‘ అని బ్రహ్మ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం తెలియజెప్పింది. అంటే శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అని అర్థం. ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మం గురించిన జిజ్ఞాస ఎందుకు అంటే అది శుభం కాబట్టి. లౌకిక జీవనానికైనా, ఆధ్యాత్మిక జీవనానికైనా శుభమే మనిషికి లక్ష్యం; ఆ లక్ష్యానికి మనిషి లక్షణం. లక్ష్య, లక్షణ సమన్వితం జరగాలి. అంటే మనిషికి శుభం సమన్వితం అవ్వాలి. క్షేమం, మంగళం, మేలు, సౌఖ్యం ఇవి అన్నీ శుభం ఔతాయి. శుభం మనకు నిండుగా ఉండాలి. మనకు శుభం కలగడానికి, మనం శుభంతో మెలగడానికి మనకు మనమే ఆధారం. కనుక మనంత మనమై శుభం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనం శుభం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి; మన ప్రయత్నాలకు ఫలితంగా మనం శుభాన్ని పొందుతూ ఉండాలి. శుభాలు ప్రభవించాలని ఎప్పుడైనా అకాంక్షించవచ్చు; ప్రభవించిన శుభాలు విభవాన్నివ్వాలని ఎవరైనా ఆశించవచ్చు. కానీ ఇంత వరకూ ఆ పని సరిగ్గా జరగలేదు. ఎవరూ ఆ పనిని సరిగ్గా చేసేందుకు ముందుకు రాలేదు. మనం శుభం కోసం పని చెయ్యాలి. మన కోసం శుభం పంట పండాలి. ఇకపైనైనా మనం శుభం కోసం పని చేద్దాం; ఇక అంతా శుభమయం కావడానికి మనల్ని మనం సరిచేసుకుందాం. ఆశపడి, ఆకాంక్షించి, ఆశించి మనం శుభాన్ని సాధించుకుందాం. కుత్సతం, మత్సరం, దాష్టీకం, దుర్మార్గం, ద్రోహం, వైరం, అసూయ, అక్కసు, బద్ధకం, నీరసం, అభిప్రాయాలు, మనో భావాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, అపార్థాలు, అవిద్య, మూర్ఖత్వం, దుశ్చింతన, బుద్ధిమాంద్యం ఇవన్నీ శుభాన్ని మనకు లేకుండా చేశాయి. వీటిని మనం వెనువెంటనే వదిలించేసుకోవాలి. మన చెడు నడతను మనం మార్చుకోవాలి; మనం మనస్తత్త్వంలో మానవత్వాన్ని చేర్చుకోవాలి; మనం మస్తిష్కంలో మంచితనాన్ని కూర్చుకోవాలి. శుభం కోసం మనం ఇకపై సవ్యంగా ఉండాలి. మనమే కాదు, మన పెద్దలు చేసిన తప్పులూ మనకు శుభాన్ని లేకుండా చేస్తున్నాయి; అవి మన సమాజంలో అశుభాన్ని రగిలిస్తున్నాయి; ఎప్పుడో ఎవరో చేసిన కుట్రలు ఇప్పటికీ శుభాన్ని రానివ్వకుండా ఇలాతలాన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ఈ స్థితిని సరిదిద్దుకుందాం; రానున్న ఆపదల్ని తొలగించుకుందాం; శుభాన్ని ఆవాహన చేసుకుని అందుకుందాం. ‘శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు తెలియజెప్పాక ‘సుఖ విశిష్టాభిధానాదేవ చ’ అని మరో బ్రహ్మసూత్రం మనకు ఉండాల్సిన తెలివిడిని ఇస్తూ ఉంది. విశిష్టమైన సుఖం ఇస్తుందని నిశ్చయంగా చెప్పబడినందువల్లే అది బ్రహ్మం అని ఆ సూత్రానికి అర్థం. సుఖం లేదా శుభం విశిష్టమైంది అన్న సత్యాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఆ విశిష్టమైన శుభాన్ని మనం పొందుతున్నామా? ఈ ప్రశ్నను మనకు మనమే వేసుకుని సరైన జవాబుగా మనం శుభాన్ని పొందాలి; పొందుదాం. సర్వత్రా శుభం నెలకొనాలి;సర్వులకూ శుభం వెల్లివిరియాలి.శుభం భూయాత్. ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు వీటివల్ల శుభం కలుగుతుంది, జరుగుతుంది అని మనం మన మనసు, మెదడులతో తెలుసుకోవాలి. మన ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల వల్ల శుభం మాత్రమే జరిగేట్టు మనం శ్రద్ధ వహించాలి. శుభం కోసం మనం పూనుకోవాలి; శుభంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవాలి – రోచిష్మాన్ -
మలినాల నుంచి విముక్తి చెందాలి.. అప్పుడే ధర్మ సాధన
మనోశుద్ధి అంటే చిత్తశుద్ధి. చిత్తం ఈ మలినాల నుండి విముక్తి చెందడం. అలా విముక్తి చెందిన చిత్తంలో తిరిగి మరలా అమానవీయ విషయాలు మొలకెత్తవు. సమూలంగా నిర్మూలించబడతాయి. ఒకసారి బుద్ధుడు తన భిక్షువులతో కలసి ఒక విశాలమైన పొలంలోంచి నడిచిపోతున్నాడు. ఆ పొలం అంతకుముందే తగలబడి ఉంది. పంటను తీశాక రైతులు చెత్తనంతా తగలబెట్టారు. కానీ... ఆ తర్వాత వర్షం పడింది. ఆ తగలబడిన మసిలోంచి పచ్చని గడ్డి పిలకలు నవనవలాడుతూ పైకి లేస్తున్నాయి. బుద్ధుడు వాటి వంక చూస్తూ ముందుకు నడిచాడు. ఆ పొలం దాటి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. ఆ కట్ట మీద మొదలు పైకి నరికిన పెద్ద తుమ్మచెట్టు మోడు కనిపించింది. ఆ తర్వాత రకరకాల చెట్ల మోడులు కనిపించాయి. వాటి మద్య నరికేసిన తాటిచెట్లు మోడులూ కనిపించాయి. బుద్ధుడూ, భిక్షువులూ ఆ మోళ్ళను గమనిస్తూనే ముందుకు నడిచి వెళ్ళారు. వారు కొంత దూరం పోయాక నదీ తీరంలో పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అప్పటికే ఎండ ఎక్కుతూ ఉంది. కొంత సేపు సేద తీరడానికి ఆ చెట్టు కింద ఆగారు. భిక్షువులు కొన్ని సందేహాలు అడిగారు. వాటికి సమాధానమిచ్చాడు. ఆ తరువాత ఆయన ప్రబోధం ‘చిత్త మలినాలు’ మీదికి మళ్ళింది. ఆ విషయం చెప్తూ స్వచ్ఛ జలం గురించి చెప్పాడు. బుద్ధునికి నిత్య జీవితంలో తమకు అనుభవమయ్యే అంశాల్ని జోడించి, తేలికగా అర్థం అయ్యేలా చెప్పటం అలవాటు. దానితో అప్పటి వరకూ తాము నడచి వచ్చిన దారిలోని సంఘటనలు తీసుకున్నాడు. ‘‘భిక్షువులారా! చూశారుగా! మనం నడచి వచ్చిన పొలాన్ని తగులబెట్టారు. అయినా ఆ తరువాత దానిలోని గడ్డి, తుంగ పరకలూ మొలకెత్తాయి. అలాగే... గట్టు మీది ఎన్నో చెట్లు మొదలంటూ నరికినా, మరలా పిలకలు వేశాయి. చివురులు తొడిగాయి. ఐతే ఒకే ఒక జాతి వృక్షాలు మాత్రం నరికివేశాక అవి ఎలాంటి చివురులు తొడగలేవు. అవి ఏమిటో గమనించారా?’’ అని అడిగాడు. ఒక భిక్షువు వినమ్రంగా ‘భగవాన్! తాటిచెట్లు’ అన్నాడు. బుద్ధుడు చిరుమందహాసంతో –‘‘అవును భిక్షూ! నీ పరిశీలన సరైనదే! మన మనస్సులో రాగద్వేషాలూ, కోరికలూ, మోహాలు అనే అకుశలాలు అన్నీ అలాగే నరికివేయబడాలి. అవి మరలా మొలకెత్తకూడదు. చివురులు తొడక్కూడదు. తాటిచెట్టును కొట్టి వేశాక, ఎలా చివురులు వేయదో, పిలకలు తొడగదో మన మనో క్షేత్రంలో అకుశలాల్ని, కోర్కెల్ని (తృష్ణల్ని) అలాగే తొలగించుకోవాలి. మొదలంటూ నరికిన తాటిచెట్టులా తృష్ణల్ని తెగతెంచుకోవాలి. అదే తృష్ణాక్షయం. అలాంటి చిత్తమే నిర్మల చిత్తం. స్వచ్ఛమైన నీటిలాంటి చిత్తం. మన ధర్మ సాధనంతా అలాంటి నిర్మల చిత్తం కోసమే!’’ అన్నాడు. ఆ గంభీర ధర్మోపదేశం వారి హృదయాల్ని తాకింది. వారి మనో ఫలకంపై మొదలు నరికిన తాటిచెట్టు ప్రత్యక్షం అయింది. అప్రయత్నంగా అందరూ కనురెప్పలు మెల్లగా మూశారు. ఏకాగ్రతలోకి జారుకున్నారు. ధ్యాన నిమగ్నులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
హద్దులు దాటితే ప్రమాదం.. చెడ్డ ఆలోచనలు మనసులోకి రానీయకూడదు
పూర్వం కురు రాజ్యాన్ని ఇంద్రప్రస్థ నగరం రాజధానిగా ధనంజయ కౌరవ్యుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థాన పురోహితుడు, మంత్రి సుచీరతుడు అనే పండితుడు. ఒకరోజున వారిద్దరూ కూర్చొని పరిపాలన విషయాలు చర్చించుకుంటూ ఉండగా ‘ధర్మయజ్ఞం’ అనే విషయం చర్చకు వచ్చింది. ‘‘అశ్వమేధం, రాజసూయం, పుత్రకామేష్టి మొదలైన యాగాలు తెలుసు. ధర్మ యాగం ఎలా చేయాలి అచార్యా!’’ అని అడిగాడు రాజు. ‘‘మహారాజా! నాకూ పూర్తిగా తెలియదు. మన రాజ్యంలో భగీరథీ తీరంలో విదుర పండితుడు ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు. వెళ్ళి వివరంగా తెలుసుకు వస్తాను. శెలవియ్యండి’’ అని అడిగి మరునాడు బయలుదేరి వెళ్ళి విదుర పండితుణ్ణి కలుసుకున్నాడు. విదురుడు తన మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నల తర్వాత తాను వచ్చిన విషయం చెప్పాడు సుచీరతుడు.అంతలో ఎందరో శిష్యులు ఆయన సందర్శన కోసం వచ్చారు. దానితో ....‘‘మిత్రమా! నేను ఈ సమయంలో ధర్మయాగం గురించి చెప్పలేను. అదిగో.. అక్కడ అడవి సమీపంలో నా పెద్ద కుమారుడు భద్రకారుని ఆశ్రమం ఉంది. అతనూ పండితుడే. వెళ్ళి భద్రకారుణ్ణి అడుగు’’ అని చెప్పి పంపాడు సుచీరతుడు ఆయన వద్దకు వెళ్లి తాను వచ్చిన విషయాన్ని వివరించగా... ‘‘మహాశయా! మీ ప్రశ్నకు సమాధానం చెప్పే యోగ్యత నాకు లేదు. ఇంకా రెండు యోజనాల దూరం ముందుకు వెళ్ళు. అక్కడ నదీతీరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. అది నా పెద్ద తమ్ముడు సంజయునిది. అతడు ప్రాజ్ఞుడు. నీకు అతను సమాధానం చెప్తాడు’’ అని సగౌరవంగా సాగనంపాడు భద్రకారుడు. సుచీరతుడు వెళ్ళే సమయానికి సంజయుడు అక్కడ లేడు. తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. వచ్చాక, సుచీరతునికి తగు సత్కారాలు చేశాడు. ఆ విషయం తెలుసుకుని– ‘‘సుచీరతా! నేను కూడా దీనికి సమాధానం చెప్పలేను. నిజం చెప్పాలంటే అందుకు తగను. సదాచార భ్రష్టుణ్ణి. ఇందుకు తగినవాడు మా అందరికంటే చిన్నవాడు మా తమ్ముడు సంభవుడు. అతని ఆశ్రమం ఈ పక్కనే ఉంది. వెళ్ళు’’ అని మర్యాద పూర్వకంగా చెప్పాడు. సుచీరతుడు మరునాటి వేకువనే లేచి సంభవుని దగ్గరకు వెళ్ళాడు. విషయం అంతా చెప్పాడు. ఉదయం స్నానాదికాలు పూర్తయ్యాక వారిద్దరూ ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ‘‘సుచీరతా! ధర్మయాగం చేసేవారు ఐదు విషయాలు పాటించాలి. అందులో మొదటిది; ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి. తరువాత చేయవచ్చులే అని బద్ధకించకూడదు. నిర్లక్ష్యం తగదు. ఈ రెండు లక్షణాల్ని సమయపాలన అనే యజ్ఞగుండంలో కాల్చి బూడిద చెయ్యాలి. ఇక రెండోది; ఎవ్వరు ఏది చెప్పినా జాగ్రత్తగా వినాలి. విన్న ప్రతిదాన్ని ఆచరించకూడదు. బాగా ఆలోచించి సరైన వాటిని మాత్రమే ఆచరించాలి. మూడోది; ఏ విషయంలోనూ హద్దు దాటకూడదు. ప్రకృతిలో ఒక్కో శక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. సమాజంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. అర్హత ఉంటుంది. ప్రతి వారు తమ తమ హద్దులు తెలుసుకోవాలి. ఈ హద్దులు అమానవీయ, అకుశల విషయాల్లో లింగ భేదాల్లో కాదు. మన సామాజిక నైతిక నడవడికలో తండ్రికి, తల్లికి, తనయులకీ, గురువులకీ ఒక్కొక్కరికి ఒక్కో హద్దులుంటాయి. వారి వారి హద్దుల్లో వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. నైతిక హద్దులు దాటడం చాలా ప్రమాదం. అలాగే అధర్మ కార్యాలు చేయకూడదు. మనం చేసే పనులు మనకూ, పరులకూ హితాన్ని, సుఖాన్ని ఇవ్వాలి. ఇలా అందరికీ సుఖాన్నిచ్చేవే ధర్మకార్యాలు. అధర్మ కార్యాలు చేసేవారు రేవు కాని చోట నదిలో స్నానానికి దిగిన వారితో సమానం. అది వారికే ప్రమాదం. ఇక ఐదో విషయం; చెడు తలపులు మానాలి. చెడు చేష్టలే కాదు. చెడ్డ ఆలోచనల్ని మన మనసులోకే రానీయకూడదు. ఒకవేళ వచ్చినా యజ్ఞ జ్వాలలో మండించే సమిధల్లా వాటిని కాల్చి బూడిద చెయ్యాలి. సుచీరతా! ఈ ఐదూ పాటిస్తే అదే ధర్మయాగం. ఈ యాగం చేసినవారు శుక్ల పక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెంది, పున్నమి చంద్రునిలా శోభిల్లుతారు’’ అని చెప్పాడు. సుచీరతుడు ఇంద్రప్రస్థం చేరి ధనంజయు కౌరవ్యునికి ఈ విషయాలు చెప్పాడు. తన రాజ్యంలో ప్రజలందరూ– ‘ధర్మయాగం’ చేయవలసిందిగా రాజు చాటింపు వేయించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?
సత్యాన్వేషణలో రాజ్యాన్ని భార్యా బిడ్డల్నీ త్యజించిన సిద్ధార్థుడి గురించి చదువుకున్నాం. ప్రజలకోసం వేల ఎకరాల సొంత ఆస్తిని వదులుకున్న కమ్యూనిస్టు నేతల గురించి విన్నాం. ఇపుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా మారే అవకాశాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న బౌద్ధ సన్యాసి గురించి తెలుసుకుందాం. ఆయనే బుద్ధిస్ట్ మాంక్ వెన్ అజాన్ సిరిపన్యో. బిలియనీర్ ఆనంద కృష్ణన్ ఏకైక కుమారుడు. సిరిపన్యో గురించి తెలుసుకునేముందు అతని తండ్రి ఆనంద కృష్ణన్ గురించి తెలుసుకోవాలి. రూ. 40,000 కోట్ల సంపద మలేషియా-తమిళ వ్యాపారవేత్త బిజినెస్టైకూన్. తత్పరానందం ఆనంద కృష్ణన్‌ను ఏకే అని కూడా పిలుస్తారు. టెలికాం, మీడియా, ఉపగ్రహాల్లో వ్యాపారం, అయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్ లాంటి వాప్యారాల్లో ఆరితేరిన దిగ్గజం. దీంతోపాటు కృష్ణన్‌కి కలిపి కనీసం 9 కంపెనీల్లో వాటాలున్నాయి. ఈ భారీ సంపద మలేషియా టాప్ బిలియనీర్లలో మూడోవాడిగా ఆనంద్ కృష్ణన్‌ను నిలిపింది. అంతేకాదు ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పాన్సర్ చేసిన భారతీయ ఫోన్ కంపెనీఎయిర్సెల్ యజమాని. సిరిపన్యోతోపాటు, కృష్ణన్‌కి ఇద్దరు కుమార్తెలున్నారు. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) 18 ఏళ్లకే సన్యాసం మలేషియాలో విద్య, కళలు, క్రీడలు తదితర విషయాల్లో భూరి విరాళాలిచ్చిన గొప్ప పరోపకారి. ఆనంద కృష్ణన్ కూడా బౌద్ధుడే కావడం గమనార్హం. బహుశా ఈ నేపథ్యమే ఆయన కుమారుడు సిరిపన్యో కేవలం 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసిగా మారడానికి దారి తీసి ఉంటుంది. సరదా కోసం సన్యాసం స్వీకరించిన అతను చివరికి శాశ్వత సన్యాసిగా మారిపోయినట్టు తెలుస్తోంది. అలా తండ్రినుంచి వచ్చిన కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకొని ఆధ్యాత్మిక శాంతికోసం దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవించడం ప్రముఖంగా నిలుస్తోంది. సిరిపన్యో తల్లి థాయ్ రాజ కుటుంబానికి చెందిన వారట. యూకేలో తన 2 సోదరీమణులతో పెరిగిన సిరిపన్యో ఇంగ్లీష్, తమిళం, థాయ్ పాటు దాదాపు 8 భాషలు మాట్లాడ గలడని ప్రతీతి. అతని కదలికలు, వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. కానీ ఒకసారి ఇటలీలో తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణన్‌ను కలవడానికి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తుండగా గుర్తించినట్టు చెబుతారు. "నా సంపదతో నా స్వంత కొడుకును పోషించే స్తోమత కూడా లేదు" అని తన కుమారుడు సన్యాసిగా మారిపోయిన వైనాన్ని గుర్తించిన కృష్ణన్ వ్యాఖ్యానిచారట. -
పేరు మార్చేసరికి ‘కృష్ణంరాజు’కు ఏ పని చేసినా కలిసొచ్చేది కాదట..
కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). ►మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. ►దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. -
స్ఫూర్తి సుధ
ప్రాథమికం, భౌతికం – అదే, ‘ప్రస్థాన’, ఆధ్యాత్మికం! యోగాలలో మొదటిది – కర్మయోగమే, సుమా! కాదంటే మిగిలేది – కాలక్షేప, కథనాలే! భూమి వున్నది, సాగుకే – కర్మకే, జీవితం! గ్రహించి వాస్తవాన్ని – ప్రారంభించు, ప్రాథమికాన్ని! ‘‘క్రమం లేని బ్రతుకు – వక్రమార్గాన్ని వెతుకును భక్తిలేని భయం – పిరికితనాన్ని పెంచును భయం లేని భక్తి – మూర్ఖపు మొరటుతనంను ఉంచును భక్తులకే కాదు – వ్యక్తులకు కూడా కావాలి భయం, భక్తి – శిక్షణ మనస్సుతో...’’ – శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి -
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే..
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే, మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం, ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ. ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది. అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది. మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించసాగింది. అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పు సీసా మూత తీయడం జరిగింది. వెంటనే, ‘బతికేనురా జీవుడా’ అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది. కానీ, సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది. ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంటబడింది. వెంటనే ఆ చీమ ‘ఏం మిత్రమా అలా అయిపోయేవు? క్షేమమేనా?’ అని అడిగింది. ‘ఏం క్షేమం? అంతా క్షామమే’ అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది. చిత్రం. ఆ మొదటి చీమ అతి మధురమైన పంచదారనే ‘వెగటుగా ఉంది’ అంది. రెండవ చీమకు ఆశ్చర్యమేసింది. కారణం అంతు బట్టలేదు. ఎందుకైనా మంచిదని మొదటి చీమ నోరు తెరిచి అందులో ఉన్న ఉప్పు కణాలను తీసేసింది. అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు. అలాగే మనిషిలో పంచవికారాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం. – బ్రహ్మాకుమార్ రాజేష్ -
దయాగుణమే మానవత్వం
భాగవతం అష్టమ స్కంధంలో పోతన గారు ఓ మాటంటారు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటగట్టుకొని పోవం జాలిరే? భూమిపై బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!’’...ఈ భూమిని కోట్లమంది రాజులు పాలించారు, వీరిలో ఎంతమంది మనకు జ్ఞాపకం ఉన్నారు ? ఉండరు. ఎవడు సాటివారి ఆపదలను తీర్చడానికి ముందుకు వచ్చాడో, కష్టాల్లో ఉన్నవారిని గురించి ఆలోచించాడో వాడు చిరస్థాయిగా మిగిలిపోతాడు. వాడి కీర్తి మిగిలి పోతుంది. వాడు చూపిన దయ వాడికి చుట్టమై వాడిని వాడి పిల్లల్న్లి, పిల్లల పిల్లల్ని కూడా కాపాడుతూ పోతుంటుంది. రంతిదేవోఖ్యానం అని ఒక ఉపాఖ్యానం...తినడానికి ఏమీ లేక 47 రోజులు రంతిదేవుడు పస్తులున్నాడు. 48వ రోజున కాస్త అన్నం, పాయసం, నెయ్యి, కాసిని మంచినీళ్ళు దొరికాయి. వాటిని తినబోతుండగా ... డొక్కలు ఎండిపోయిన కొందరు వచ్చి చేయి చాపితే ఆహార పదార్థాలన్నీ వారికిచ్చేసాడు. నీళ్ళుతాగి ఉపశమనం పొందుదామని అనుకుంటూ నీళ్ళ చెంబెత్తుకుని తాగబోతున్న క్షణంలో... ‘కళ్ళు తిరుగుతున్నాయ్, నిలవలేక పోతున్నా, గొంతెండుకుపోతున్నది’ అన్న ఆర్తనాదం వినిపించింది. ‘నీళ్ళు కూడా తాగనివ్వరా..’’ అని ఆయన విసుక్కోలేదు. ...‘‘అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రావన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్ గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మేలున్నదె? నాకు దిక్కు పురుషోత్తము? డొక్క?డె చుమ్ము పుల్కసా!’’ అంటూ వెళ్ళి ఉన్న ఆ కొన్ని నీళ్ళు దాహార్తికిచ్చేసాడు. మనిషి హృదయం రాయిలా ఉందనుకోండి. చిక్కిన లేడిపిల్లతో పులి ఎలా చెలగాటమాడుతుందో అలా కష్టంలో ఉన్నవాళ్ళని చూసి కరగకపోగా దానికి హాస్యం ఆడడం అలవాటవుతుంది. వాడు కష్టంలో ఉన్నాడుగా.. ఎదురుతిరిగి ఏమీ అనలేడుగా... అందుకని వాళ్ళని పరిహాసాలాడడం, చిన్నబుచ్చుకునేటట్లు చేయడం... ఇది మంచి లక్షణం కాదు.. ముఖ్యంగా పిల్లలు ఇటువంటి లక్షణాలను అలవర్చుకోకూడదు. మనిషి మనిషిగా బతకడానికి మూడు విషయాలు నేర్చుకోమంటారు.. 1. ఇతరులు సంతోషపడుతుంటే చూసి మనం కూడా సంతోషించాలి.. వాడు సంతోషపడడం చూసి నువ్వు ఏడ్వడం మొదలుపెడితే... పాడయిపోయేది నువ్వే. 2. వాడు కష్టంలో ఉన్నట్లు తెలిసింది.. అది నీ కష్టమనే అనుకొని గబగబా వెళ్ళి వాడికి ఉపకారం చేయడానికి ప్రయత్నించడం నేర్చుకో. 3. నీ వల్ల మరొకరు కన్నీళ్ళు పెట్టుకునే ఘడియ నీ జీవితంలో ఎప్పుడూ రాకుండా చూడు. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకడం అంటే అది. దయాగుణం ఉంటే మనసు రాయిలా ఉండదు వెన్నలా కరుగుతుంది. అలాకాక ఉపకారం చేయాల్సిన సమయం లో అది చేయకపోగా చులకనగా చూడడం, నిందలు వేయడం అన్న ధోరణి ఉందంటే... పశువుల్లో లెక్కవేస్తారు తప్ప మనిషిగా లెక్కగట్టరు. ‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టం అవుతుందని చెప్పింది ఇందుకే. అది సర్వవేళలా నిన్ను కాపాడే చుట్టమవుతుంది. వార్తల్లో చూస్తుంటాం... ప్రమాదవశాత్తూ ఎవడో రోడ్డుమీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే... వెళ్ళి వారి ప్రాణరక్షణకు ప్రయత్నించకుండా... సెల్ఫోన్లో చిత్రిస్తున్న వారి గురించి చదువుతుంటే... అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నదని తెలుసుకుంటుంటే... బాధనిపిస్తుంది... పిల్లల్లో ఈ సంస్కారం ఉండడం సభ్యసమాజానికి మంచిది కాదు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ధర్మబద్ధమైన జీవనం
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు. ‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, అనరాని మాటలన్నాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.. ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను’ అన్నారు ప్రశాంతంగా.. ‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..? కాని ఎలా సాధ్యం? ఆ వ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు అతనే నిరాశతో.. ‘అలా అనకు.. నిరాశ తిరస్కారం (కుఫ్ర్) తో సమానం.. ఇన్షా అల్లాహ్ నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ‘నిజమే.. ఆశ లేకపోతే మనిషి బతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడంలేదు.’ ‘నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్. నీ పైకం ఇప్పించే పూచీనాది’ అన్నారు బహెలూల్ ధీమాగా.. ‘సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ‘రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆవ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు’ అన్నారు బహెలూల్. సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పోయాడు. తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, తన దగ్గర ఉన్న సంచిలో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉన్నాయని, కాస్త ఈ సంచి దగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోసపోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతని తో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞత లు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తన దారిన తను వెళ్ళిపోయారు. కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పిచూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమైన జీవనం ప్రారంభించాడు. మోసపోయినప్పుడు నిరాశ పడకూడదు. తెలిసిన వాళ్లు, తెలివైన వాళ్లను ఆశ్రయించాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అదీ మనకు దగ్గరి చుట్టమే...
‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టంబౌ... అన్నారు. దయ చుట్టమెలా అవుతుంది? మనలో దయ అనే గుణం ఉంటే... అది చుట్టంతో సమానంగా, అంతకంటే ఎక్కువగా, ఆపద్బంధువులా కాపాడుతూనే ఉంటుంది. ఒకానొకప్పుడు ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు. పొలం పక్కన పెద్ద సేద్యపు బావి ఉంది. చెరువులు, దొరువుల్లాగానే కొన్ని ప్రాంతాల్లో పెద్ద సేద్యపు బావులకింద సాగుపనులు నడుస్తుంటాయి. ఉన్నట్లుండి బావిలో దభేల్మని పెద్ద చప్పుడయింది. ఎవరో పడిపోయినట్లున్నారు... రక్షించండి, రక్షించండి.. అని అరుస్తున్నారు. చేతిలో పని వదిలేసి ఆ రైతు ఒక్క ఉదుటున వెళ్ళి చూస్తే... ఎవరో పిల్లవాడు మెల్లిమెల్లిగా నీటిలోకి మునిగిపోతున్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా నూతిలోకి దూకి ఆ పిల్లవాణ్ణి పైకి తెచ్చి, సపర్యలు చేసి లోపలికి మింగిన నీళ్ళన్నీ కక్కించాడు. కొద్దిగా తేరుకున్న తరువాత తనింటికి తీసుకెళ్ళాడు. ఆ రైతుకూ ఓ కొడుకున్నాడు. ఇంట్లో ఈ అబ్బాయిని అప్పగించి వాడు కోలుకోవడానికి ఆ రాత్రికి తనవద్దనే ఉంచుకున్నాడు. తెల్లవారింది. ఆ పిల్లవాడి వివరాలు తెలుసుకుని వాడింటికి తీసుకెళ్ళి అప్పగిద్దామని అనుకుంటుండగానే... ఇంటి ముందు పెద్ద పడవంత కారొచ్చి ఆగింది. అందులోనుంచి ఓ ధనవంతుడు ఆదుర్దాగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు.‘‘అయ్యా! మీరు కాపాడిన అబ్బాయి నా కుమారుడే. నిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆ నూతిలో పడిపోయాడట. అది తెలియక నిన్నటినుంచీ వెతికిస్తున్నా. ఇప్పుడే తెలిసింది. నూతిలో మీరు దూకి రక్షించారట కదా. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు. ఐశ్వర్యానికి కొదువలేదు. కానీ వాడికి ఏమయినా అయితే నేను తట్టుకోలేను. వాడినే కాదు, మమ్మల్ని కూడా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేం.. అయినా కృతజ్ఞత గా...’’ అంటూ డబ్బున్న ఓ ఇనప్పెట్టెను రైతు ముందుంచాడు. దానికి రైతు ‘‘ఆపదలో ఉన్న వారిని కాపాడడం, దయతో వ్యవహరించడం నా సహజ లక్షణం. నా కొడుకు ప్రమాదంలో ఉంటే కాపాడుకోనా... క్షమించండి. నా బాధ్యతకొద్దీ కాపాడినదానికి నేను డబ్బు తీసుకోను... సంతోషంగా మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి’’ అని అంటూండగానే రైతు కొడుకు లోపలినుంచి వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరని ధనవంతుడు అడిగాడు. ‘‘అయ్యా, నా కుమారుడేనండీ, కొంతవరకు చదువుకొన్నాడు.. ఇక ఆ పై చదివించే శక్తి లేక చేతికింద పెట్టుకుని పొలం పనులకు తీసుకెడుతున్నా..’’ అని పరిచయం చేసాడు. ‘‘మీరు నా కొడుకును బతికించారు. డబ్బిస్తే వద్దంటున్నారు... కానీ మీరు చేసిన సాయానికి మా తృప్తికోసం మీకు అభ్యంతరం లేకపోతే మీ వాడిని నాతోపంపండి. మా అబ్బాయిలాగే చూసుకుంటూనే చదివిస్తా. ఈ ఉపకారం చేయండి’’ అనడంతో రైతు దానికి అంగీకరించి తన కొడుకును కూడా వారి వెంట పంపాడు. ఆ ధనవంతుడి కొడుకే పెద్దయిన తరువాత బ్రిటన్ ప్రధానిగా చేసిన విన్స్టన్ చర్చిల్. ఆయనకొకసారి ప్రాణాంతక జ్వరం వచ్చింది. ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. అప్పడు ఒక్క ఇంజక్షన్ తో ఆయన కోలుకున్నాడు. ఆ ఇంజక్షన్ పెన్సిలిన్. దానిని కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరో కాదు.. ఆ రైతు కొడుకే. అదీ దయ చుట్టం కావడమంటే... -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మోహం తీరని ద్రోహం
భార్యాబిడ్డల వ్యామోహం కుటుంబ పోషణకు మాత్రమే కొనసాగాలి. పోషకుడు తామరాకుపై నీటిబిందువు వలె నిమిత్తమాత్రుడుగా మెలగాలి. నదీప్రవాహం తగ్గినప్పుడు అందులోని కట్టెలు కంపపుల్లలు ఒకచోట చేరుతాయి. ప్రవాహం ఉధృతమైన వెంటనే విడిపోయి దూరంగా పయనిస్తాయి. దానితో సమానమే సంసారంలో ఉండే సభ్యుల సమాగమం. అజ్ఞానానికి గురయినవాడు వాస్తవాన్ని తెలుసుకోలేడు. అవాస్తవాన్ని వాస్తవంగా నమ్ముకొంటాడు. తాను నమ్ముకొన్న దానిని ధర్మమార్గంగా భ్రమిస్తాడు. అందుకు నిదర్శనంగా కాంతపై కనకంపై ధనంపై పదవిపై భార్యాబిడ్డలపై అధికమైన ఆపేక్ష కలిగి వర్తిస్తాడు. దానినే మోహం లేక వ్యామోహం అంటారు. మోహం మనిషి కంటికి కనబడకుండా కష్టాలుపెట్టే ఆరుగుణాల్లో నాల్గవది గా పేర్కొనబడింది. ఉర్విలోసర్వానికి సాక్షిగా ఉంటూసర్వాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే చైతన్యస్వరూపుడు (పరమాత్ముడు) నిత్యుడు సత్యమైనవాడు అనడం వాస్తవం. పరమాత్మ కంటికి కనబడని ఆనందమయుడు అవనిలో ఆకర్షణీయమైన వస్తుజాలమంతా అవాస్తవం. క్షణభంగురం,అందుకే వ్యక్తి ఆలోచించడం మాట్లాడటం వినడం, కనడం, చేయడం అనేప్రక్రియలు వాస్తవాన్ని ప్రతిబింబింపజేసే పద్ధతిలో పయనించాలి. అవాస్తవం, అన్యాయం, అక్రమం, అధర్మం, అనే సర్పాల కోరలకు బలికాకుండా జాగ్రత్త వహించాలి. పరస్త్రీ మానధనాన్ని చెరచడం, పరధనాపహరణం రెండూ ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చే దుర్మార్గపు చర్యలైన వ్యామోహాలు. అవి భయకరమైన పరధర్మానికి ప్రతీకలు. శాస్త్రధర్మానికి విరుద్ధాలు. అధికార వ్యామోహం, భార్యాబిడ్డల భ్రాంతి శాస్త్రమర్యాదకు సంబంధమైన స్వధర్మానికి అనుగుణంగా ఆచరిస్తే వ్యక్తిసౌఖ్యానికి, సమసమాజ క్షేమానికి, ప్రపంచమంతా నిండి ఉండే పరమేశ్వరుని కరుణకు పాత్రులుగా మనవచ్చు. అధికారం జనధిక్కారం కాకుండా ఉంటూ పరిపాలన రామరాజ్యాన్ని తలపించేదిగా రాణించాలి. అప్పడది స్వధర్మాచరణకు సాక్ష్యంగా నిలుస్తుంది. భార్యాబిడ్డల వ్యామోహం కుటుంబ పోషణకు మాత్రమే కొనసాగాలి. పోషకుడు తామరాకుపై నీటిబిందువు వలె నిమిత్తమాత్రుడుగా మెలగాలి. నదీప్రవాహం తగ్గినప్పుడు అందులోని కట్టెలు కంపపుల్లలు ఒకచోట చేరుతాయి. ప్రవాహం ఉధృతమైన వెంటనే విడిపోయి దూరంగా పయనిస్తాయి. దానితో సమానమే సంసారంలో ఉండే సభ్యుల సమాగమం. పరస్త్రీ వ్యామోహంతో పాడయిపోయిన వారిలో సైంధపుడొకడు. పాండవులు తమ నివాసంలో లేనప్పుడు, ద్రౌపది ఒంటరిగా ఉండటం చూసి మానభంగం చేయదలచి రథంపై ఎక్కించుకుని తీసుకెళ్లడాన్ని తెలిసికొన్న పాండవులు వచ్చి వానికి తగిన ప్రాయశ్చిత్తం పెట్టడమేకాక తలగొరిగించి పంపారు. పరుల ఆస్తిపై వ్యామోహం కలిగిన దుర్యోధనుడు న్యాయబద్ధంగా పాండవులకు ఇవ్వవలసిన రాజ్యభాగాన్ని ఇవ్వకుండా యుద్ధం చేసి తానేగాక తన వంశనాశానికి కారణమయ్యాడు. మోహానికి వలపు అనే పదాన్ని పర్యాయపదంగా చెబుతారు. ధర్మబద్ధమైన పవిత్ర దాంపత్య బంధమైన గంగా శంతనుల వలపు తో దేవవ్రతుడు (భీష్ముడు) జన్మించాడు. అతడు మహావీరుడుగా మాట తప్పని వాడి గా మనటమే గాక విఘ్ణవును సహస్ర నామాలలø స్తుతించే జ్ఞానిగా తన గొప్పతనాన్ని చిరస్థాయిగా నిలుపుకొన్నాడు. మంచిచెడుల మధ్యలో మనిషి జీవించడం తప్పనందున పాలను మాత్రమే స్వీరించి నీటిని వదలే హంస వలె మంచిగా మనాలి. – విద్వాన్ వల్లూరు చిన్నయ్య -
మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు
"సత్యం, పవిత్రత, నిస్వార్థం-ఈ సుగుణాలున్న వాడిని అణగద్రొక్కగల సామర్ధ్యం ముల్లో కాలలో ఎవరికీ లేదు. ఇలాంటి సుగుణ సంపన్నుడు విశ్వమంతా ఏకమైనా ఒంటరిగా ఎదిరించగలుగుతాడు" అని అంటారు స్వామి వివేకానంద. సువర్ణమయం పృథివీం చిన్నంతి పురుషాస్త్రయః । శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమ్ ॥ ఈ భూతలాన్ని సువర్ణమయం చేయగలగే వారు- శూరులు, జ్ఞానులు, సేవాతత్పరులు. ఈ మూడు తరహాల వారినే 'మహాత్ములు' అంటారు. ధర్మనిరతిలో సాటిలేని రాముడు 'ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు' గా వాసి కెక్కాడు. సత్యనిష్ఠలో మేటి అయిన హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు' గా వినుతికెక్కాడు. దానగుణంలో తిరుగులేని కర్ణుడు 'దానకర్ణుడు' ఖ్యాతిగాంచాడు. ఇలా శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, కర్ణుడు తమ తమ దివ్యగుణాలతోనే అజరామరమైన కీర్తిప్రతిష్ఠలను ఆర్జించారు. అలాగే గంగాదేవి శంతన మహారాజు పుత్రుడు దేవవ్రతుడు తన భీషణ ప్రతిజ్ఞతో 'భీష్ముని' గా ప్రసిద్ధి చెందాడు రాజవంశంలో భోగమయ జీవితాన్ని అనుభవించాల్సిన భీష్ముడు అఖండ బ్రహ్మ చర్య దీక్షతో యోగమయ జీవితాన్ని గడిపి బ్రహ్మనిష్ఠుడయ్యాడు. త్యాగనిరతి, ఇంద్రియ నిగ్రహ శక్తి, ధర్మనిబద్దతల సంగమ క్షేత్రమే ఆయన పవిత్ర జీవనం. ఇలాంటి పావనమూర్తి చరించిన ఈ భారతభూమి బంగారుభూమే! మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు. శౌర్యం, సేవాతత్పరత, సత్యనిష్ఠ, పవిత్రత,ఈగుణాలు పుష్టిగావున్నాయి భీష్మునిలో. తండ్రిన సంతోషపరచడమే తనయుని ధర్మమని తలచిన దేవవ్రతుడు తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించడానికి, ఆమె తండ్రి దాశరాజును ఒప్పించడానికి వెళ్ళాడు. అప్పుడు దాశరాజు 'నా కుమార్తెకు పుట్టిన బిడ్డకే పట్టాభిషేకం చేయాలి' అని షరతు పెట్టాడు. అప్పుడు దేవవ్రతుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు."ఇక్కడ సమావేశమై ఉన్న ప్రభువు లందరూ వినండి! నేను తండ్రిగారి ప్రయోజనం కోసం స్థిరమైన ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేమంటే ఈమెకు పుట్టిన కుమారుడే రాజ్యాధిపతి అవడానికి అర్హుడు" అని పెద్దల ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. కాని దాశరాజు ఈ ప్రతిజ్ఞతో సంతోషపడలేదు. ఇలాగన్నాడు. "అది సరే!కాని నీకు పుట్టిన కుమారుడు రాజ్యాన్ని ఆశించకుండా ఉంటాడని ఏమిటి నమ్మకం?"అప్పుడు చిత్తస్తైర్యంగా బ్రహ్మచర్య వ్రతాన్ని చేబడుతున్నాను అని మరో శబధం చేసాడు శంతనుని కుమారుడు. భీష్ముడు అస్త్రశస్త్ర విద్యలో అసమాన ప్రతిభావంతుడు. తన తమ్ముల కొరకు కన్యలు తేవాలని కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్ళి అక్కడ ఎందరో రాజులను పరాజితులను చేశాడు. గురువైన పరశురాముడంతటి మహాశూరుడ్ని యుద్ధంలో ఓడించాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించాడు. భీష్మునలో రాజ్యకాంక్ష , భోగలాలస ఏమాత్రం లేదు. స్వార్థరహితుడు.కుమారుని సత్యనిష్ఠకు సంతసించి శంతనుడు కుమారునకు ఇచ్ఛామరణ వరాన్ని ప్రసాదినచాడు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాల్లో సుప్రతిష్టుడైన కురు వృద్ధుడిని శ్రీకృష్ణుడు "జన్మములిట్టివి యెందుకల్గునే" అని ప్రశంసించాడు. -గుమ్మా ప్రసాద రావు భిలాయి -
అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా?..
అంతఃపురంలో ఆడవాళ్ళే మిగిలారు. విరటుడు సైన్యంతో సుశర్మను ఎదుర్కొనాడానికి వెళ్ళాడు. మారువేషాలలో ఉన్న పాండవులు నలుగురూ వెళ్ళారు. ఇంతలో దూత వచ్చి ఉత్తరదిశను పెద్ద సైన్యం మన గోవులను మళ్లించుకు వెళ్ళిం దని ఉత్తరకుమారుడికి చెప్పాడు. నా వద్ద సారథిలేడు, ఉంటే నేను వారిని ఓడించి గోవులను తీసుకు వస్తానని ఉత్తరకుమారుడు బిరాలు పలికేడు. అప్పుడు సైరంద్రి బృహన్న లను తీసుకు వెళ్ళమంటుంది. మరో గత్యం తరం లేక ఉత్తరకుమారుడు వెళ్తాడు. అక్కడ సైన్యాన్నిచూసి భయపడి బృహన్నల వారి స్తున్నా పారిపోతాడు. బృహన్నల ఉత్తరడుని అడ్డగించి నేను అర్జునుడిని. నీవు రథం నడుపు నేను యుద్ధం చేస్తానంటాడు. ఉత్తరుడు నమ్మడు. ఆ మాటలు విన్న ఉత్తర కుమారుడు సంభ్రమాశ్చర్యాలతోసందేహంగా "బృహన్నలా! అర్జునికి పది పేర్లున్నాయి. వాటిని వివరిస్తే నేను నిన్ను నమ్ముతాను " అన్నాడు. బృహన్నల చిరు నవ్వుతో ఉత్తరుని చూసి నాకు అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహ నుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి " అన్నాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక " బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను " అన్నాడు. అర్జునుడు ఇలా అన్నాడు. "కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించితిని కనుక ధనుంజయుడ నయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడి నయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాసిస్తుంటుంది కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, బీభత్సమైన పనులు చెయ్యను కనుక బీభత్సుడి నయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తర కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వన దహనంలో అగ్ని దేవునికి సాయపడి నందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భయపడ వలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం " అన్నాడు. అర్జునుడి ఈ పది నామాలే ఉన్నాయా లేక ఇంకమైనా పేర్లు ఉన్నాయా? ఉన్పాయనే చెప్పవచ్చు. భగవద్గీతలో ఉన్న అర్జునుడి ఇతర నామాలు ఇవి. అనఘుడు, అనసూయుడు, కపిధ్వజుడు, కురుప్రవీరుడు, కురునందనుడు, కురుశ్రేష్ఠుడు కూరుసత్తముడు, కౌంతేయుడు, గుడాకేశుడు దేహభృయాం వరుడు, పరంతపుడు, పురుషవర్ధనుడు, భరతర్షభుడు , భరత శ్రేష్ఠుడు, భరతసత్తముడు, మహాబాహుడు. అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా! ఇక్కడ మరో విషయం తెలుసుకోవలసినది ఉంది. పిడుగులు పడేటప్పుడు అర్జునుని దశ నామాలను తలచుకుంటే ఆ పిడుగు మనదరిదాపుల్లో పడదు, మనకు ప్రాణభయం ఉండదంటారు పెద్దలు. -గుమ్మా నిత్యకళ్యాణమ్మ -
శశికళ ఆధ్యాత్మిక పర్యటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేసిన శశికళ ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గుచూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్యటన చేయాల్సిన ఆమె ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్ష ముగించుకుని జనవరి 27న జైలు నుంచి విడుదలైన శశికళ గతంలో నిర్ణయించుకున్న ప్రకారం క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి ఉంది. చేజారిపోయిన అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి రావడం ఆమె లక్ష్యాలుగా ఉండేవి. అయితే అన్నాడీఎంకే–బీజేపీ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో శశికళ ప్రస్తావన బెడిసికొట్టడంతో పరిస్థితి మారిపోయింది. బీజేపీలోని ఒక కీలకవ్యక్తి, కుటుంబసభ్యుని సూచనల మేరకు రాజకీయాల నుంచి ఆమె తాత్కాలికంగా వైదొలిగారు. ఈనెల 11వ తేదీ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నై టీనగర్‌లోని అగస్తీశ్వరాలయంలో పూజలు జరపనున్నారు. 15వ తేదీ నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు దిగుతారు. -
దేవుడే దిక్కు.. నిత్యపూజలు, ప్రార్థనలు
సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి ముందుగానే విముక్తి పొందాలని శశికళ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. ససేమిరా అని కర్ణాటక జైళ్లశాఖ చెప్పేసింది. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరిలోని శశికళ విడుదలపై ఆసక్తి నెలకొంది. జయలలిత హయాంలోనే అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆ తరువాత పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్న చందంగా సీఎం కావాల్సింది జైలుపక్షిగా మారిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అనుభవిస్తున్న నాలుగేళ్ల జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంతో పూర్తయి విడుదల కావాల్సి ఉంది. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) ముందస్తు విడుదలపై ముందుకూ, వెనక్కి... కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి నెలరోజుల జైలు జీవితానికి మూడు సెలవు రోజుల చొప్పున మొత్తం 129 రోజుల సెలవులను బేరీజు వేసుకుని నవంబరులోనే విడుదల చేయాలని శశికళ తరఫున్యాయవాది గతంలో బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఇక అప్పటి నుంచి శశికళ ముందుస్తు విడుదల వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు విడుదల అడ్డంకిగా ఉండిన రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించి ఆశగా ఎదురుచూడడం ప్రారంభించారు. (శశికళ ఆశలు అడియాశలు..!) నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు. అవినీతినిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయిన కొందరిని సత్ప్రవర్తన పరిధిలో చేర్చిన కర్ణాటక ప్రభుత్వం ముందుగానే విడుదల చేసిన దాఖలాలు ఉన్నందున శశికళను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లింపు, కోర్టు ఆమోదం పూర్తయినందున సత్ప్రవర్తన కింద ముందే విడుదల చేయాలని కోరుతూ జైళ్లశాఖకు ఈనెల 17న శశికళ న్యాయవాదులు మరోసారి వినతిపత్రం సమర్పించారు. శశికళ చెన్నై జైల్లో ఉన్న రోజులు, పెరోల్ రోజులు, సెలవు దినాలు పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ వినతిని జైళ్లశాఖ నిరాకరించడంతో శశికళకు మళ్లీ నిరాశే మిగిలింది. చదవండి: (పవన్ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు) దైవ పూజల్లో నిమగ్నం.. ముందస్తు విడుదల వ్యవహారం మూడడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనకలా మారడంతో శశికళ దైవపూజల్లో గడుపుతున్నారు. జైల్లోని తనగదిలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు పెట్టుకుని రోజుకు నాలుగు గంటలపాటు పూజలు చేస్తున్నారు. తలపెట్టిన కార్యాలు నెరవేరాలని పార్థసారథి స్వామికి పదేపదే ప్రార్థనలు చేస్తున్నారు. జయలలితలా ఆంజనేయస్వామిని సైతం ప్రత్యేకంగా ఆరాధించడం ప్రారంభించారు. మాంసాహారం మానివేసి పూర్తిగా శాఖాహారాన్ని అలవాటు చేసుకున్నారు. ఆరునెలలుగా ఎవ్వరికీ ములాఖత్ ఇవ్వలేదు. శశికళ న్యాయవాదులు బెంగళూరులోనే తిష్టవేసి ముందస్తు విడుదలపై కృషి చేస్తున్నారు. -
నేను నేనే...
ఓ సాధువు తన శిష్యుడిని పిలిచి ‘‘ఓ రోజంతా నువ్వు రాజుగారి కోటలో ఉండి పాఠం నేర్చుకురా’’ అని ఆదేశించారు.‘‘ఆశ్రమంలో నేర్చుకోని పాఠాన్ని రాజుగారి కోటలో ఏం నేర్చుకుంటాను’’ అని మనసులో అనుకున్నా గురువుగారి ఆజ్ఞగా శిష్యుడు సరేనని రాజుగారి కోటకు వెళ్ళాడు. ఆ శిష్యుడు రాజుగారి ఆస్థానానికి వెళ్ళి గురువుగారి మాట చెప్పాడు. అలాగా అని రాజుగారు ఆ యువకుడికి ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా సకల మర్యాదలతో చూసుకున్నాడు. రాజుగారి కోటలో ఎటు చూసినా ఆటాపాటలే. విలాసాలకు ఏ మాత్రం లోటు లేకుండా ఉంది. కానీ ఇవేవీ అతనికి నచ్చలేదు. ఒంటి మీద జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది అతనికి. అయినా మనసుని నియంత్రించుకుని పగలంతా కోటలో గడిపాడు. రాత్రి కాగానే నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే రాజు ఆ యువకుడిని పిలిచి దగ్గర్లోనే ఉన్న కోనేటిలో స్నానం చేసి వద్దాం అన్నాడు. యువకుడు, రాజు ఇద్దరూ వెళ్ళారు. అప్పుడు ఉన్నట్లుండి రాజుగారి కోటలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చూపించాడు రాజు. ఆ యువకుడు స్నానం మానేసి కోట వైపు వెంటనే పరుగెత్తాడు. అక్కడ ఉంచేసిన తన కౌపీనం తగలబడిపోకుండా ఉండేందుకు పరుగెత్తాడు. కౌపీనం తీసుకుని యువకుడు కోనేటి వద్దకు చేరుకున్నాడు. అప్పటికీ రాజుగారు అక్కడే నింపాదిగా స్నానం చేస్తూ కనిపించారు. కోట ఓ పక్క అగ్నిప్రమాదంలో చిక్కుకోగా ఈ రాజు ఏ మాత్రం దిగులుపడకుండా ఇలా జలకాలాడుతున్నాడేమిటి చెప్మా అనుకున్నాడు మనసులో ఆ యువకుడు. కానీ తాను మాత్రం తన కౌపీనం కోసం ఇలా పరుగులు తీసానేమిటీ అని సిగ్గుతో తలదించుకున్నాడు. రాజుగారికి నమస్కరించి ‘‘ఏ విధంగా మీరిలా నిశ్చలంగా ఉండగలిగారు’’ అని యువకుడు అడిగాడు. అప్పుడు రాజు చెప్పాడు ... ‘‘ఈ కోట నాదనే తలపు ఉండి ఉంటే నేనూ పరుగెత్తే వాడిని, అది ఒట్టి కోటే. నేను నేనే. అంతే తప్ప కోట నాదెలా అవుతుంది. నేను చనిపోయిన తర్వాత కూడా ఆ కోట అక్కడే ఉంటుంది. కౌపీనం నీదని, కోట నాదని నువ్వు అనుకున్నావు కనుకే పరుగెత్తుకుని వెళ్ళి నీ కౌపీనాన్ని మాత్రం తెచ్చుకున్నావు... కోట సంగతి వదిలేశావు. కానీ నేనలా అనుకోలేదు. కనుకే పరుగెత్తలేదు. మనిషి తన మనసు ఇష్టాయిష్టాలకు దాసోహమవుతున్నాడు. ఇష్టాయిష్టాలను వదులుకున్నవాడే ఇందులోంచి విముక్తి పొందుతాడు’’ అని రాజు చెప్పేసరికి తననెందుకు ఓ రోజు కోటలో ఉండి పాఠం నేర్చుకోమన్నాడో గ్రహించాడు ఆ యువకుడు. – యామిజాల జగదీశ్ -
ధర్మ సందేహం
నాకు రుద్ర నమకం, చమకం వంటివి రావు. రోజూ ఓ వెండి శివలింగాన్ని పూజిస్తుంటాను. అయితే రుద్రంతో తప్ప శివుని పూజించకూడదని, అసలు శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోరాదని కొందరంటున్నారు. నిజమేనా? – పిచ్చిక జ్ఞాన సుబ్రహ్మణ్యం, కాకినాడ మీరు విన్నవి సరైనవి కావు. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకుని పూజించడం ఐశ్వర్యకరం. రుద్ర నమకాదులతో అభిషేకించడం, పూజించడం మంచిది. అలాగని రుద్రనమకాదులతోనే పూజించాలన్న నిబంధన ఏమీ లేదు. శివనామాలు చెప్పుకుంటూ అభిషేకించవచ్చు. అష్టోత్తర శతనామాలతోనూ అభిషేకించవచ్చు. ఏదీ రానప్పుడు ‘శివాయ నమః అనో, నమఃశివాయ అనో పూజించడం కూడా సత్ఫలితాలనే ఇస్తుంది. బోళాశంకరుడు, భక్తవశంకరుడు, భక్త సులభుడు అయిన శివుడు అభిషేక ప్రియుడు. తన భక్తులు తనను నోరారా నమశ్శివాయ అని పూజిస్తే చాలు... ప్రసన్నుడవుతాడు. నిత్యం ఇంట్లో శివార్చన జరగడం మంచిదే. శివపూజ అందరూ చేయవచ్చు. అయితే బాణలింగం, స్ఫటికలింగం, సాలగ్రామం వంటి వాటికే ఎక్కువ నియమాలు, విధులూ ఉన్నాయి. అవి యోగ్యులైన గురువుల సాయంతోనే స్వీకరించాలి. అవి లేకున్నా వెండి లింగాన్ని అర్చించడం మంచిదే. – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ♦ప్రశ్నోత్తర భారతం.. లక్క ఇంటి కథ 1. ఎవరు యువరాజు అయ్యారు? 2. పాండవులను చూసిన దుర్యోధనుడు ఏ విధంగా ఉన్నాడు? 3. దుర్యోధనుడు ఏమని ఆలోచన చేశాడు? 4. తన దురాలోచన గురించి ఎవరెవరిని సంప్రదించాడు? 5. శకుని ముఖ్యమంత్రి ఎవరు? 6. కణికుడు ఏం చేస్తాడు? – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ జవాబులు: 1. ధర్మరాజు యువరాజు అయ్యాడు. సార్వభౌముని గౌరవం పొందాడు. పాండవులు పరాక్రమవంతులు అయ్యారు. 2. దుర్యోధనుడు సహించలేకపోయాడు. అతనిలో అశాంతి ప్రవేశించింది. నిదుర పట్టలేదు. 3. పాండవులను హతమార్చాలనుకున్నాడు. అందుకోసం పన్నాగాలను గురించి ఆలోచించాడు. 4. శకుని. కర్ణుడు మొదలైన వారిని సంప్రదించాడు. 5. కణికుడు 6. దుర్యోధనుడికి రాజకీయ ఉపాయాలను బోధిస్తాడు. ♦అమృత సూక్తులు ►కొంచెం తెలిసి ఉండి కూడా అన్నీ తెలిసినట్లు నటించడం నీచుల లక్షణం ►సంతోషం మంచి నుంచి కలుగుతుంది. చెడు నుంచి కలిగేది పైకి సంతోషంగా అనిపించినను అనంతరం అదిదుఃఖంగానే మారుతుంది. ►ప్రేమ వల్ల కోపాన్ని, మంచి వల్ల చెడును, ధర్మం చేత లోభాన్ని, విచారణ చేత మోహాన్ని, సత్యం చేత అబద్ధాన్నీ జయించాలి. ►సజ్జన సహవాసమే ఎల్లప్పుడూ చేయవలెను. ఒకవేళ సజ్జన సహవాసం లభించని యెడల ఎటువంటి సహవాసమూ చేయకుండుట మేలు. ►స్వల్పమైన ముత్యాల కోసం మనిషి ఎటువంటి కష్టానికైనా ఓర్చి ప్రాణహానికైనా తెగించి ఘోరమైన సముద్రంలో మునిగి వాటిని పొందుతాడు. కాని అనంతమైన, అనల్పమైన భగవదనుగ్రహం కోసం ఏ కష్టాలూ పడనవసరం లేదు. కేవలం భక్తిశ్రద్ధలు, సాటి మనుషుల యెడల ప్రేమ, పరోపకార గుణం కలిగి ఉంటే చాలు. -
స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం. ఆధ్యాత్మికం అంటే ? శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటే ? భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం. భగవంతుడు అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా ? పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు. భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది. పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు ఏది సత్యం ? భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రశ్న భక్తులకు మీ సందేశం ? మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’ అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
కారుణ్యం కురిసే కాలం
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక అంశాల్లో ‘హజ్జ్’ కూడా ఒకటి. వెసులుబాటున్న ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్‌హజ్జ్ మాసంలో నిర్వహించబడుతుంది. అందుకే ఈ మాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ మాసంలోని మొదటి పదిరోజులు చాలా ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడు రోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో రమజాన్ మాసానికి, రమజాన్‌లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేకత ఉందో, అదేవిధంగా జిల్‌హజ్జ్ మాసంలోని మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు. ఈ మొదటి దశకంలో అల్లాహ్ కారుణ్యం వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యతను కలిగి అల్లాహ్ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈదశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరమైనవికావు. అంటే, జిల్‌హజ్జ్ మాసం తొలి తొమ్మిది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు అల్లాహ్‌కు మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే అధిక ప్రీతికరం. ఈ రోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ఇందులోని ప్రతి రాత్రి ఆచరించే నఫిల్‌లు షబేఖద్ర్‌లో ఆచరించే నఫిల్లతో సమానం. నిజానికి ఇవి హజ్జ్ కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్ప అందరూ హజ్ చేయలేరు. కాని అల్లాహ్ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం పొందగలిగే అవకాశాన్ని అందరికి ప్రసాదించాడు. జిల్ హజ్జ్ మాసం ప్రారంభమవుతూనే, తమతమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళ వద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్ ఖుర్బానీలోని రహస్యం. హజ్జ్ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్ హజ్జ్ మాసం పదవతేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు. మక్కా వెళ్ళలేక పోయిన యావత్ ప్రపంచంలోని ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్’ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం చేయకూడదు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరిస్తూ వారితో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా జిల్ హజ్ మాసం మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన ఆయన కారుణ్యాన్ని పొందడానికి కృషిచేయాలి. మక్కా వెళ్ళి హజ్జ్ ఆచరించే స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్ అజ్హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే అల్లాహ్ తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. కనుక హజ్జ్ పరమార్థాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హృదయ నివేదన
దేవుడికి నివేదించడానికి భౌతికమైన మార్గాలు చాలా ఉన్నాయి. కాని ఆత్మికమైన మార్గం హృదయ సంభాషణే అంటారు శ్రీలేఖ. మన మనసుతో మౌనంగా దేవునితో చేసే ప్రతి సంభాషణ ఆయన వరకూ చేరుతుందని నమ్ముతారు ఆమె.లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం సమంగా గడపడమే తన మార్గం అంటారు శ్రీలేఖ. ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్ తప్పనిసరి అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను. అలా మా అబ్బాయి ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఫస్ట్ టైమ్ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. నేటి తెలుగు సినీపరిశ్రమలో ఒకే ఒక్క మహిళా సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ. మధురమైన∙సంగీతం, పాటలతో తెలుగువారికి ఆమె సుపరిచితురాలు అయ్యారు. పన్నెండేళ్ల వయసులోనే ‘తాజ్‌మహల్’ సినిమాకు సంగీత దర్శకత్వం అందించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. బాలీవుడ్‌లోనూ తన బాణీలతో అలరించారు. సాయంసంధ్య వేళ హైదరాబాద్ మణికొండలోని ఎమ్.ఎమ్.శ్రీలేఖ ఇంటి ముందున్నాం. లోపలి నుంచి ‘మహీం మూలాధారే కమపి మణిపూరే..’ కమ్మని స్వరంలో అమ్మవారి సౌందర్యలహరి వినిపిస్తోంది. అడుగుపెడితే హాల్లో ఏడాది వయసున్న పిల్లవాడిని ఒళ్లోకూర్చోబెట్టుకొని పాడుతున్నారు ఎమ్.ఎమ్.శ్రీలేఖ. ‘మా అబ్బాయి మహిమాన్.. ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి శ్లోకాలు పాడితే చాలు అల్లరి మానేసి కామ్‌గా వింటూ వుంటాడు’ అంటూ నవ్వారు. ఆ సంగీత దర్శకురాలితో భక్తి సంగీతం మీదుగా ‘నేను– నా దైవం’ ఫీచర్‌కు ఇంటర్వ్యూ మొదలైంది. మీకు సినిమా పాటలే అనుకున్నాం. భక్తి గీతాలు కూడా కంఠతా వచ్చన్నమాట.. అదేమిటి అలా అంటారు. సినిమా వాళ్లకు భక్తి పాటలు కూడా వస్తాయి. నేనైతే చిన్నప్పటినుంచీ వీటిని వింటూ పెరిగాను. చాలా భక్తి గీతాలు అలవోకగా వంటపట్టేశాయి. నాకు ఒకప్పటి జోలపాట ఇప్పుడు మా అబ్బాయికి లాలిపాట. మీ హాల్లో చాలా దేవతా పటాలు కనిపిస్తున్నాయి.... మా ఇంట్లో ఈ పటాలకు ఎప్పుడూ అలంకరణ ఉంటుంది. పూమాలలను చూశారుగా. మా వారు (పుట్టా వీరవరప్రసాద్) పూజలు చేస్తుంటారు. నేను ఆయనతో పాటు పాల్గొంటుంటాను. అందరి దేవుళ్లకు నేను అభిమానినే. ఎవ్వరినీ తక్కువ చేయను. కానీ, మూకాంబికా అమ్మవారిని మా ఇంట్లో అందరూ భక్తిగా కొలుస్తుంటారు. మూకాంబిక ఆలయం ఉన్నది కర్ణాటకలో.. మీరెలా ఆ అమ్మవారి భక్తులయ్యారు? నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని రాయచూర్‌కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో. అప్పట్లో కరెంట్, వైద్య సదుపాయం లేని ఊరు అది. మా కుటుంబం అక్కడే వ్యవసాయం చేస్తుండేది. అర్థరాత్రి నేను పుట్టిందే పూజ గదిలోనట. ఇప్పుడు ఈ హాల్‌కి రెండింతలు ఉంటుంది ఊళ్లో ఆ పూజగది. అంత పెద్ద పూజగదిలో మా పెదనాన్న శివశక్తిదత్త (ఎమ్.ఎమ్.కీరవాణి తండ్రి) వేసిన దేవతామూర్తుల చిత్రపటాలు ఎన్నో ఉండేవి. పుట్టాక గంటవరకు నేను ఏడ్వలేదట. పెద్దవాళ్లు భయపడి మూకాంబికా అమ్మవారికి నమస్కరించుకొని ఆమె కుంకుమ నా నుదుటన పెట్టాక నాలో కదలిక వచ్చి, ఏడ్చానట. అలా నా పుట్టుక గురించి తెలుసుకున్నప్పుడు ఒక అలౌకికమైన శక్తి ఏదో నా చుట్టూ ఉందని అర్థమైంది. అమ్మా నాన్నలకు ఒక్కత్తే కూతుర్నని మా నాన్నగారు (బోసు), అమ్మ (విజయలక్ష్మి భరణి) నన్ను భక్తికి దగ్గరగా ఉండేలా పెంచారు. మంగళ, శుక్రవారాలు మౌనవ్రతంలో ఉండేదాన్ని. పౌర్ణమి, అమావాస్యలైతే నాచేత నిష్టగా, కఠిన నియమాలు పాటింపజేసేవారు నాన్నగారు. నేను వేసుకునే డ్రెస్ కలర్‌ని బట్టి ఆ రోజు ఏ వారమో తెలిసిపోయేది. పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు ఉప్పుకారాలు లేకుండా తులసి ఆకులతో పెంచారంటే నమ్ముతారా! ఒక సన్యాసిని ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని. ఇంతటి కఠిన నియమాలా! .. ఉల్లంఘించాలనిపించలేదా? నాన్నగారు ఏదో కారణం లేకుండా ఇలా చేయరు అనుకునేదాన్ని. కాకపోతే లోపల ఓ సంఘర్షణ ఉండేది. ఎందుకుచేయాలి ఇవన్నీ అని. కానీ ఎప్పుడూ అడగలేదు. కీరవాణి అన్నయ్య, మా పెదనాన్న, చిన్నాన్న... మా ఇంట్లో ఆయనకు ఎవరూ ఎదురుచెప్పేవారు కాదు. ఆయన ఎంత చెబితే అంత. ఆయన ద్వారానే ధ్యానం, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ అలవడ్డాయి. స్ప్రిచ్యువల్ పవర్ గురించి కూడా ఆయన ద్వారానే నాకు తెలిసింది. పాజిటివ్‌గా ఉంటే అంతా మంచే వస్తుందనే నమ్మకం ఏర్పడింది. దేవుడు ఉన్నాడని మీరెలా నమ్ముతారు? దైవం మానుష రూపేణా అనేది నేను నూరు శాతం నమ్ముతాను. ఏదైనా చిన్న అవకాశం వచ్చినా అది మనిషి ద్వారానే రావాలి. మనం దారి తప్పినప్పుడు ఒక మనిషి దారి చూపిస్తాడు. దేవుడే ఆ మనిషిని పంపుతాడు. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరో అన్నం పెడతాడు. దైవమే ఆ మనిషిని ఏర్పాటు చేసి ఉంటాడు. నాకు దాసరి నారాయణరావుగారి ద్వారా మొదటి అవకాశం వచ్చింది. ఆ అవకాశమే దేవుడు. పన్నెండేళ్ల వయసులో నేనేంటి... ఆ పాటలేంటి? ఆ ప్రేమ పాటలకు బాణీలేంటి? దేవుణ్ణి మనిషిలా చూడాలి... మనిషిని దేవుడిలా చూడాలి. అప్పుడు అందరూ మనకు ఆప్తులై జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కళ కూడా దైవమే అంటారా? దేవుని ఉనికే కళ. నాకు ఆ కళ ఇచ్చి తన ఉనికిని తెలియచేశాడు దేవుడు. దాన్ని పట్టుకొని ఈ జీవితాన్ని నెగ్గుకొస్తున్నాను. ఇప్పటికీ కీ బోర్డు దగ్గర కూర్చున్నానంటే ఏదో అలౌకికమైన శక్తి నన్ను ఆవరిస్తున్నట్టుగా ఉంది. అలవోకగా బాణీలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు దైవానికి సంబంధించి ఎలాంటి నియమాల పాటిస్తున్నారు? ఏదైనా చిన్న సమస్య వచ్చినా చాలు క్షణం క్షణం సినిమాలో శ్రీదేవిలా ‘దేవుడా దేవుడా దేవుడా..’ అని మొక్కేసుకుంట. కాని ఫలానా దేవుడికే మొక్కాలి అనే నియమం కూడా లేదు. నేను జీసస్నూ నమ్ముతాను. మా నాన్నగారు 300 వరకు జీసస్ పాటలు రాశారు. కొన్నింటికి నేనూ బాణీలు కట్టాను. తిరుమలకు వెళతాను. అలాగే కడప దర్గాకు వెళతాను. దైవాన్ని నమ్మడానికి కులం, మతం తేడాలే లేవు. దైవం అనేది ఒక సుప్రీం పవర్. అన్నింటికీ అతీతమైనది. మీ నాన్నగారిలాగ మీరూ మీ అబ్బాయికి ఆధ్యాత్మికతను చేరువ చేస్తున్నారా? కొన్ని లక్షణాలు జన్మతః వచ్చేస్తుంటాయి. అందులో ఆధ్యాత్మిక శక్తి కూడా ఒకటి. మా అబ్బాయిని ‘అమ్మ ఏది’ అంటే చాలు మూకాంబికా అమ్మవారి ఫోటో చూపిస్తాడు. ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్ తప్పనిసరి అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను. అలా వాడు ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఫస్ట్ టైమ్ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. దేవుడిని ఎలా ఫీల్ అవుతుంటారు? మనం తెలిసో, తప్పకనో.. తప్పులు చేస్తూనే ఉంటాం. అది అవసరమో, అనవసరమో, అహంకారమో కూడా తెలియదు. జీవనశైలిలో ఇవన్నీ భాగమే. పడుకునే ముందు చేసే ధ్యానంలో నా వల్ల ఈ రోజు ఎవరైనా హర్ట్ అయి ఉంటే వారికి సారీ అని చెప్పుకుంటాను. టెలీపతి ద్వారా మన మనసులోని భావం వారికి చేరుతుందని నా నమ్మకం. అలాగే దేవుడికి కూడా నా మనసులోని భావం చేరుతుందని నా నమ్మకం. అందుకే చాలా విషయాలు ఆయనకు చెప్పుకుంటూ ఉంటాను. జీవితంలో అన్నీ ఉండాలి. బంధువులు, మిత్రులు, పని. అయితే, దేని కోసం దేన్నీ వదులుకోకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. వచ్చిన పని గొప్పగా చేయాలి. మంచి మంచి పాటలకు సంగీతం అందించాలి. ఇదే దైవాన్ని కోరుకునేది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఐఐటీ విద్యార్థిని అదృశ్యం
హిమాలయాలకు వెళ్తున్నట్టు ఉత్తరం చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నత ఉద్యోగాలకు బాటవేసే ఐఐటీ చదువును ఆపివేసి ఆధ్యాత్మిక జీవనం వైపు పయనమైందో విద్యార్థిని. ‘ఆధ్యాత్మిక జీవనం తన మనస్సును లాగుతోంది, హిమాలయాలకు వెళ్తున్నా’ అంటూ ఉత్తరం రాసిపెట్టి మరీ అదృశ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష (20) మద్రాసు అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్లో ఉంటోంది. ప్రత్యూష రెండ్రోజులుగా కనిపించడం లేదు. ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్‌కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తనిఖీలు నిర్వహించగా తెలుగు, ఇంగ్లిషులో రాసిన ఉత్తరం దొరికింది. ‘ఆధ్యాత్మిక జీవనంపై రోజురోజుకూ నాకు ఆసక్తి పెరుగుతోంది, ఈ కారణంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అన్వేషిస్తూ హిమాలయాలకు వెళుతున్నా. నాకోసం వెతకవద్దు, తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని ఇవ్వండి’ అంటూ ఉత్తరంలో రాసింది. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రత్యూష హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిందని, అయితే ఆమె స్వస్థలానికి చేరుకోలేదని తెలియడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని మంగళవారం రాత్రి మద్రాసు ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది.


