గరుడతీర్థం.. | Funday Devotion And Inspirational Story Written By Sankhyayana | Sakshi
Sakshi News home page

గరుడతీర్థం..

Jul 12 2026 12:28 PM | Updated on Jul 12 2026 12:28 PM

Funday Devotion And Inspirational Story Written By Sankhyayana

భక్త విజయం

దిశేషుడి కొడుకు మణినాగుడు గరుత్మంతుడి భయం వల్ల కైలాసానికి వెళ్లి, పరమశివుని సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకోసాగాడు. కొన్నాళ్లకు పరమశివుడు అతడి భక్తిప్రపత్తులకు ప్రసన్నుడయ్యాడు. 
‘మణినాగా! నీ భక్తికి మెచ్చాను. వరమేమి కావాలో కోరుకో!’ అడిగాడు.
‘పరమేశ్వరా! గరుడుని వల్ల భయం కలగకుండా వరమివ్వు చాలు’ అన్నాడు మణినాగుడు.
‘తథాస్తు’ అంటూ వరం అనుగ్రహించాడు పరమశివుడు.

పరమశివుడి వరం కారణంగా భయం తొలగిన మణినాగుడు ఒకనాడు వ్యాహ్యాళిగా క్షీరసాగర తీరంలో స్వేచ్ఛగా సంచరించసాగాడు. 
ఇది చూసిన గరుడుడు అకస్మాత్తుగా వచ్చి, మణినాగుడిని ఎగరేసుకుపోయాడు. తన నివాసంలో అతడిని బంధించి ఉంచాడు.
కైలాసంలో పరమశివుడి సన్నిధిలో అందరూ కొలువుతీరి ఉన్నారు. 
‘పరమేశ్వరా! మన మణినాగుడు ఈరోజు ఎందుకో సభకు రాలేదు. అతడిని వైనతేయుడు భక్షించడమో, బంధించడమో చేసి ఉండవచ్చని సందేహంగా ఉంది’ అన్నాడు నందీశ్వరుడు.
నందీశ్వరుడి మాటలతో శివుడికి తాను మణినాగుడికి ఇచ్చిన వరం జ్ఞప్తికి వచ్చింది.
‘నందీశ్వరా! తక్షణమే నువ్వు క్షీరసాగరానికి వెళ్లు. శ్రీమహావిష్ణువును స్తుతించి, మణినాగుడిని విడిపించుకుని, నా వద్దకు తీసుకురా!’ అని ఆజ్ఞాపించాడు.

పరమశివుడి ఆనతితో నందీశ్వరుడు హుటాహుటిన క్షీరసాగరానికి చేరుకున్నాడు. శ్రీమహాలక్ష్మి పాదాలు ఒత్తుతుండగా, శేషశయ్యపై అర్ధనిమీలిత నయనాలతో పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును దర్శించుకుని, ఆయనను వేనోళ్ల స్తుతించాడు. మణినాగుడికి పరమశివుడు వరమిచ్చిన సంగతిని, అతడిని తనతో పాటు కైలాసానికి కొనితెమ్మని ఆనతినిచ్చిన సంగతిని విన్నవించుకున్నాడు. మణినాగుడిని గరుడుడు బంధించి ఉండవచ్చని, అందువల్ల అతడిని గరుడుని చెర నుంచి విడిపించాలని అభ్యర్థించాడు.
నందీశ్వరుడి మాటలను ఆలకించిన విష్ణువు వెంటనే గరుత్మంతుడిని పిలిపించాడు. గరుడుడు వెంటనే విష్ణుపాదాల ముందు వాలాడు.

‘వినతానందనా! మణినాగుడిని విడిచిపెట్టి, ఈ నందీశ్వరుడికి అప్పగించు’ అని ఆజ్ఞాపించాడు.
‘ప్రభూ! ఇది అన్యాయం. భృత్యులకు సంతోషకరమైన వస్తువులు ప్రభువు ఇవ్వడం లోకంలో ఉంది. నువ్వు ఏనాడూ నాకు ప్రీతిపాత్రమైన వస్తువులను ఇచ్చి ఉండలేదు సరికదా, నేను సంపాదించుకున్న వస్తువును ఇప్పడు ఇచ్చేయమంటున్నావు. నీకు వాహనాన్నై నిన్ను మోస్తూ ఉన్నాను. అందుకు నువ్వే నాకు ఏదైనా ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోగా, నేను సంపాదించుకున్న నాకిష్టమైన ఆహారాన్ని ఇచ్చేయమంటున్నావు. ఇదేమి న్యాయం? నేను మణినాగుడిని ఇవ్వలేను’ అని నిష్ఠురంగా పలికాడు గరుత్మంతుడు.
గరుడిని మాటలు విన్న శ్రీమహావిష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ, ‘వైనతేయా! నువ్వు నన్ను మోస్తూ ఉన్నందునే కృశించిపోయినట్లున్నావు. అయినా, నువ్వు బలశాలివి సుమీ! ఏదీ కాస్త నా చేతి వేలిని నీ తలమీద కాసేపు మోయి’ అంటూ గరుడుని శిరస్సు మీద వేలు ఉంచాడు.

గరుడుని తల అతడి ఉదరభాగం వరకు కుంగిపోయింది. గరుడు విలవిలలాడాడు. ‘దేవాదిదేవా! జగన్నాథా! పాహిమాం! పాహిమాం! నా అపరాధాన్ని మన్నించి, కాపాడు’ అని గగ్గోలు పెట్టాడు. ‘జగన్మాతా! నీవైనా దయతలచి నన్ను కాపాడు’ అని లక్ష్మీదేవిని ప్రార్థించాడు. 
‘నాథా! వైనతేయుడిని రక్షించండి’ అని అభ్యర్థించింది లక్ష్మీదేవి.
అప్పుడు శ్రీమహావిష్ణువు నందీశ్వరుడి వైపు చూసి, ‘నందీశ్వరా, మణినాగుడితో పాటు ఈ గరుత్మంతుడిని కూడా పరమేశ్వరుని సన్నిధికి తీసుకుపో! దయామయుడైన పరమేశ్వరుని కటాక్షంతో ఇతడి శరీరం యథాస్థితికి రాగలదు’ అని పలికాడు. నందీశ్వరుడు తనతో పాటు మణినాగుడిని, గరుత్మంతుడిని తీసుకుని కైలాసంలో పరమశివుని సన్నిధానానికి చేరుకున్నాడు. శ్రీమహావిష్ణువు సన్నిధానంలో జరిగినదంతా పరమశివుడికి విన్నవించాడు.

పరమశివుడు ప్రసన్నంగా గరుత్మంతుడిని చూసి, ‘వైనతేయా! దిగులు పడకు. పవిత్ర గౌతమీ తీరానికి వెళ్లి, గౌతమీ జలాల్లో స్నానమాచరించు. నీ పూర్వశరీరాన్ని, దారుఢ్యాన్ని పొందగలవు’ అని పలికాడు.
పరమశివుడి ఆనతిపై గౌతమీ జలాల్లో స్నానమాచరించాక గరుత్మంతుడికి పూర్వరూపం వచ్చింది. గరుత్మంతుడు స్నానమాచరించిన ఆ ప్రదేశమే గరుడ తీర్థంగా ప్రసిద్ధి పొందింది.
- సాంఖ్యాయన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement