అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ | Lenin Movie Review Telugu And Rating | Sakshi
Sakshi News home page

Lenin Review: అఖిల్ హిట్ కొట్టాడా? 'లెనిన్' ఎలా ఉందంటే?

Jul 10 2026 12:53 PM | Updated on Jul 10 2026 1:53 PM

Lenin Movie Review Telugu And Rating

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్.. హీరోగా చాలా ప్రయత్నాలు చేశాడు గానీ సరైన హిట్ కొట్టలేకపోయాడు. 'ఏజెంట్' డిజాస్టర్ దెబ్బకు మూడేళ్ల గ్యాప్ తీసుకుని 'లెనిన్' సినిమా తీశాడు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్‌తో దీనిపై బజ్ క్రియేట్ అయింది. అలా ఇప్పుడు(జూలై 10) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉంది? అఖిల్ హిట్ కొట్టాడా లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అంటే 1976లో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు. ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్‌ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి అంతా అనుకున్నట్లే జరిగిందా లేదా? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
అఖిల్ 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ 11 ఏళ్లలో ఐదు సినిమాలు చేశాడు. వీటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓ మాదిరిగా ఆకట్టుకోగా, మిగిలినవన్నీ దారుణంగా ఫెయిలయ్యాయి. దీంతో అఖిల్ మూవీ వస్తుందంటే చాలు.. ఈసారైనా హిట్ కొడితే బాగుండు అని అభిమానులు అనుకుంటారు. మరి 'లెనిన్'తో సక్సెస్ అందుకున్నాడా అంటే అందుకున్నాడు!

'లెనిన్' గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే పక్కా కమర్షియల్ టెంప్లేట్‌లో సాగిన సినిమా. సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని షాకింగ్ ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరో పక్కన ఉండే పాత్రల్లో కాస్త పేరున్న నటీనటుల్ని పెట్టారంటే వీళ్లతో ఏదో ట్విస్ట్ ప్లాన్ చేశారని ముందు నుంచి అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ట్విస్టులు ఉంటాయి. కాకపోతే ఆయా పాత్రలు, సదరు ట్విస్టుల వెనుకున్న రీజన్స్ మరీ వావ్ అనిపించకపోయినా పర్లేదనిపిస్తాయి.

మూవీ మొదలైన తొలి గంట వరకు ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూసేసిన సీన్లు మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. జైలు నుంచి హీరో విడుదలవడం, ఓ వ్యక్తితో తన కథంతా చెప్పడం, కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. హీరో ఒరిజినల్ ఎంట్రీ, ఆపై పాట, హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఓ రెండు డ్యూయెట్స్.. ఇలా అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ఆ తర్వాత ట్విస్టులు మొదలవుతాయి. అక్కడి నుంచి మధ్యమధ్యలో కాస్త మూవీ డౌన్ అయినప్పటికీ చివరకు హీరో, విలన్‌ని చంపే సీన్‌తో సినిమా ముగుస్తుంది.

ఈ సినిమాని మహాభారతంలోని రిఫరెన్స్‌లు చూపించిన తీరు, వాటిని ఎలివేషన్స్ కోసం ఉపయోగించుకోవడం బాగానే ఉంది. లెనిన్ ఒక్కడినే మూవీ అంతా చూపించాలని కాకుండా వసంత్, జయంతి, భారతి, యతిరాజులు పాత్రలని కూడా కథక తగ్గట్లు ఉపయోగించుకున్న తీరు కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. 'కూతురు కనిపించకపోతే కూతుర్ని వెతకాలి గానీ మీరు పరువుని వెతుక్కున్నారు నాన్న', 'లెనిన్ నా గుండెల్లో ఉన్నాడు అయినా సరే నువ్వు నా గుండెల మీద పడుకుంటానంటే చెప్పు' లాంటి డైలాగ్స్ సరిగ్గా పడ్డాయి.

లెనిన్ అసలు జైలుకి ఎందుకు వెళ్లాడు? అనే పాయింట్ మాత్రం సరిగా ఎష్టాబ్లిష్ చేయలేదు. అప్పటివరకు తన చుట్టూరా మందితో బలంగా కనిపించిన విలన్.. హీరో వేసిన ఒక్క దెబ్బకే చనిపోవడం కూడా ఏదో కృతకంగా అనిపించింది. కనీసం ఇద్దరి మధ్య కాస్త ఫైట్ లాంటిది నడిపించకుండానే  చంపేయడం సింపుల్‌గా అనిపించింది. తల, కాలు నరికేయడం లాంటి సీన్స్ సున్నిత మనస్కులకు ఇబ్బంది పెట్టొచ్చు.

ఎవరెలా చేశారు?
ఇప్పటివరకు అఖిల్ యాక్టింగ్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. 'లెనిన్'తో వాటిని చాలావరకు అధిగమించాడని చెప్పొచ్చు. ఫైట్స్, ఎమోషన్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ సినిమాకే కీలకమైన భారతి పాత్రలో భాగ్యశ్రీ ఆకట్టుకుంది. కానీ ఫస్టాప్‌లో అఖిల్-భాగ్యశ్రీ పాత్రల మధ్య డ్రామా ఇంకాస్త బలంగా చూపించి ఉంటే చివరలో ఎమోషన్స్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది. మిగతా వాళ్లలో ఈశ్వరీరావు చేసిన జయంతి పాత్ర బాగుంది. వసంత్‌గా చేసిన ప్రమోద్, యతిరాజులుగా చేసిన శివాజీ కూడా తమ పాత్ర వరకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు ఓకే.

టెక్నికల్ విషయాలకొస్తే విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. కాకపోతే చాలావరకు సెట్స్ అని తెలిసిపోతోంది. ఇవి కాస్త నేచురల్‌గా ఉండాల్సింది. తమన్ గురించి తెలిసిందేగా. తనకు అలవాటైన రీతిలో డ్రమ్స్ వాయించాడు. పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునేలా ఉండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం చెవుల్ని హోరెత్తించింది. డైరెక్టర్ కమ్ రైటర్ మురళీ కిశోర్ అబ్బూరు ఈ మూవీతో కమర్షియల్‌గా ఏమేం చేయాలో అన్నీ చేశాడు. ఇక హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.

- చందు డొంకాన

 

 

(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement