సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు న్యాయం చేయనున్నారు.శుక్రవారం కరూర్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి గత ఏడాది (2025 సెప్టెంబర్‌లో టీవీకే (TVK) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
హైకోర్టు భారీ ఊరట
ఈ మేరకు మదురై హైకోర్టు బెంచ్ అధికార టీవీకేకు భారీ ఊరటనిచ్చింది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే, ఈ నియామకాలు కేవలం తాత్కాలికం మాత్రమేనని, ఈ కేసు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ శక్తివేల్‌లతో కూడిన బెంచ్ ఈ దశలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని పేర్కొంది. అయితే లబ్ధిదారులు తమ మొదటి నెల జీతం అందుకోవడానికి ముందే ఈ పిటిషన్లపై విచారణ జరగాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC)ను కోర్టు స్వచ్ఛందంగా (suo motu) ఒక ప్రతివాదిగా చేర్చింది. అలాగే, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI)కి కూడా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పిటిషనర్ల అభ్యంతరాలను ప్రశ్నిస్తూ.. "ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే తప్పేంటి? బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అవసరం లేదా?" అని ప్రశ్నించారు. రాజకీయాంశాలను ప్రస్తావించినప్పుడు, "ఇది రాజకీయ వేదిక కాదు" అని హెచ్చరిస్తూ చట్టపరమైన వాదనలకే పరిమితం కావాలని కోర్టు సూచించింది.
పిటీషనర్ల వాదన
నామ్ తమీజర్ కట్చి (NTK) నాయకుడు ధీరన్ తిరుమురుగన్, మనితానేయ జననాయగ కట్చికి చెందిన సీని అహ్మద్‌లు ఈ నియామకాలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఇటువంటి నియామకాలు TNPSC, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియలను దాటవేస్తాయని, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌లో సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్నందున, బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. కుంభకోణం స్కూల్ అగ్నిప్రమాదం, ధర్మపురి బస్సు దహనం, తూత్తుకుడి స్టెర్లైట్ కాల్పుల వంటి గత ఘోరాల సమయంలో బాధితుల కుటుంబాలకు స్వయంచాలకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని వారు వాదించారు.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా కృష్ణరాయపురం పరిధిలోని మానవాసి గ్రామంలో 'ఎవర్‌వాన్ కొఠారి ఫుట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్' ఏర్పాటు చేయనున్న లెదర్-యేతర (నాన్-లెదర్) పాదరక్షల తయారీ కర్మాగారానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 13,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. అంతకుముందు, ఉదయం 11 గంటల ప్రాంతంలో కరూర్-సేలం హైవే పక్కన ఉన్న ఒక ప్రైవేట్ కళాశాల మైదానంలో జరిగే 'మక్కల్ సంతిప్పు' (ప్రజలతో భేటీ) కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. తొక్కిసలాట బాధిత కుటుంబాలను స్వయంగా కలుసు కుంటారు. దాదాపు 5వేల మంది కూర్చోవడానికి వీలుగా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గురువారం ఇంటెలిజెన్స్ , పోలీసులు వర్గాలతో సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి: 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
స్వాగతించిన బీజేపీ, కానీ
బాధితుల బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలనే టీవీకే ప్రభుత్వ నిర్ణయాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ గురువారం స్వాగతించారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న సమయంపై (టైమింగ్) ఆయన ముఖ్యమంత్రిని విమర్శించారు. ఘోరకలి జరిగిన రోజే విజయ్ కరూర్‌లోనే ఉండి 41 మంది బాధితుల కుటుంబాలను ఓదార్చాల్సింది అంటూ విమర్శించారు.
ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
కాగా వేలుసామిపురంలో విజయ్ నిర్వహించిన టీవీకే ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది మరణించారు. విజయ్ ఆలస్యంగా రావడం, సరైన వసతులు లేకపోవడమే దీనికి కారణమని పోలీసులు అప్పట్లో ఆరోపించారు.అప్పటి డీఎంకే ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు ప్రకటించిన రూ.10 లక్షల పరిహారంతో పాటు, విజయ్ ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అక్టోబర్ 2025లో చెన్నై సమీపంలోని ఒక హోటల్‌లో ఆయన బాధితుల కుటుంబాలను కూడా కలుసుకున్నారు.
ఇదీ చదవండి: 36 ఏళ్లలో 300 ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు పైసా బిల్ కట్టలేదు : కట్ చేస్తే


