పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద గత నెలలో హత్యకు గురైన ఈ కేసుపై వేగంగా విచారణ, త్వరితగతిన ట్రయల్ జరిపించాలని కోరుతూ కేతన్ తండ్రి, విశాల్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, కేసుత్వరగా ముందుకు సాగేలా సహాయం చేయాలని కోరారు. కేతన్ అకాల మరణాన్ని తట్టుకోలేక, తాత గుండెపోటుతో మరణించిన తరువాత ఈ పరిణామం జరిగింది.
బుధవారం రాష్ట్రపతి సెక్రటరీకి పంపిన ఒక భావోద్వేగ ఈమెయిల్‌లో, కేతన్ మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను విశాల్ అగర్వాల్ పంచుకున్నారు. తన మనవడి మరణాన్ని తట్టుకోలేక కేవలం 20 రోజుల తర్వాత తన తండ్రి కూడా కన్నుమూయడంతో ఈ వేదనను తట్టుకోవడం తమవల్ల కావడంలేదని పేర్కొన్నట్లు ఐఏఎన్ఎస్ రిపోర్ట్ చేసింది. తానొక వ్యాపారవేత్తగానో, ప్రభావితవ్యక్తిగానో కాదు, ఎంతో బాధతో, ఆశతో ఇది రాస్తున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక తండ్రిగా కొడుకుకు న్యాయం కోసం అర్ధిస్తున్నానంటూ వేడుకున్నారు. కేవలం 20 రోజుల్లోనే అటు కొడుకును, ఇటు తండ్రిని ఇద్దరినీ కోల్పోయి తన కుటుంబం చిన్నాభిన్నమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేతన్ తాతయ్య అతడిని ఎంతగానో ప్రేమించేవారని, మనవడి మరణంతో ఆయన గుండె పగిలిపోయిందని అన్నారు. కేతన్ ఇక లేడని తెలిసి, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, బీపీ పడిపోవడంతో గుండెపోటుతో చనిపోయారన్నారు. ఇది తమ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చిందంటూ తమ మానసిక ప్రభావాన్ని,కేతన్ మరణం తర్వాత తమ జీవితాలు పూర్తిగా విషాదంగా మారిపోయాని విశాల్ అన్నారు. దారుణంగా హత్యకు గురైన కేతన్‌కు న్యాయం జరిగేది ఎపుడు? ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకొనేదాకా ఇదే ప్రశ్న తమమెదళ్లను తొలిచేస్తోందని పేర్కొన్నారు. తక్షణమే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేలా చూడాలని, దోషులుగా తేలిన వారికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చూడాలని విశాల్ అధికారులను కోరారు. తమ కుటుంబానికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ అవసరంలేదు కానీ, అనవసర జాప్యం లేకుండా న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నా మన్నారు. లేదంటే తమలాంటి కుటుంబాలు బాధతో మరింత కుంగిపోతాయన్నారు.
నా కొడుకును వెనక్కి తేలేం కానీ,
కేతన్‌ను మళ్లీ వెనక్కి తీసుకురాలేం, కానీ దోషులు మాత్రం శిక్ష నుండి తప్పించుకోకూడదన్నారు. వారికి కఠినమైన శిక్ష పడినపుడు మాత్రమే తమకు మనశ్శాంతి దక్కడంతోపాటు, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు తప్పవనే సందేశం సమాజంలో వెళుతుందని, దయచేసి తన కొడుకు కేసును కూడా మరో కేసులా మరుగున పడవేయవద్దని మార్చొద్దని, దీని వెనుక సర్వస్వం కోల్పోయిన ఒక కుటుంబం ఉంది అంటూ ఆవేదనతో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
కాగా పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జూన్ 18న కేతన్ అగర్వాల్ (26) ఒక లోయలో పడి మరణించాడు. మొదట ఇది ట్రెక్కింగ్ ప్రమాదంగా భావించినప్పటికీ, విచారణలో ఇది హత్య కేసుగా మారింది. కేతన్ నిశ్చితార్థం చేసుకున్న సియా గోయల్, ఆమె, ప్రియుడిగా భావిస్తున్న చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి ఈ హత్యకు ప్లాన్ చేశారని, అతడిని లోయలోకి తోసేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి, హత్య , నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: 36 ఏళ్లలో 300 ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు పైసా బిల్ కట్టలేదు : కట్ చేస్తే


