పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలు సియా గోయల్, క్రైమ్ జరగడానికి కొన్ని నెలల ముందే మరో నిందితుడు, తన ప్రియుడు చేతన్ చౌదరిని రహస్యంగా వివాహం చేసుకుందని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు నాలుగు నెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వారి మొబైల్ ఫోన్ల నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌లను పరిశీలించినప్పుడు ఈ విషయం బయట పడింది. అలాగే జూన్ 14నే కేతన్‌ను చంపడానికి ప్రయత్నించినా చివరి నిమిషంలో సియా ధైర్యం సరిపోకపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సియా, చేతన్‌కు ఒక మెసేజ్ పంపుతూ.. ఒంటరిగా ఈ పని చేయడానికి తనకు ధైర్యం చాలడం లేదని, ఇద్దరం కలిసి కేతన్‌ను కొండపై నుండి కిందకు నెట్టేద్దామని, కాబట్టి తనతో పాటు రావాలని కోరినట్లు దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు
నిందితుల గత ఆరేడు నెలల కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ సంభాషణలు మరియు ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విశ్లేషించారు. ఈ డిజిటల్ ఆధారాలు క్రైమ్ ప్లానింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను అందించాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అలాగే కుటుంబాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సియా, చేతన్ తమ పెళ్లిని రహస్యంగా ఉంచినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. వారి రహస్య వివాహం తర్వాతే కేతన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా సియా, ప్రియుడి సహాయంతో, తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను జూన్ 18న లోనావాలా సమీపంలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోలీసులు సియా, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా?


