కోట్లాధికారి కావాలంటే..తాతల ఆస్తి లేదా ఏదైనా సైడ్ ఆదాయం ఉండాలని అనుకుంటారు. కాదు ఎంత సంపాదించినా..ఖర్చులు అదుపులో ఉండాలంటున్నాడు ఈ వ్యక్తి. డబ్బు పెరిగే కొద్ది జీవనశైలి నార్మల్‌గా ఉంటే..చాలు ఎవ్వరైనా ధనవంతులవ్వగలరు, దర్జాగా బతికేలా పదవీవిరణమను ప్లాన్ చేసుకోవచ్చని అంటున్నాడు. అదెలాగంటే..
ఈ అమూల్యమైన ఆర్థిక పాఠాలు చెబుతోంది. మాజీ ఐటీ ఉద్యోగి వివేక్ వామన్. విప్రో, పీడబ్ల్యూసీ వంటి సంస్థలలోఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 24 ఏళ్లు పనిచేసి కోట్లు కూడబెట్టాడు. అంతేగాదు 47 ఏళ్ల వయసులో అంటే రిటైర్మెంట్ ఏజ్ కంటే కాస్త చిన్న వయసులో పదవీ విరణమ చేశారు. ఆయన ఇటీవల '1% క్లబ్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నప్పడు ఈ విషయాలను వెల్లడించారు.
ఆయన పాడ్‌కాస్ట్ హోస్ట్ శ్రేయ హెగ్డేతో ప్రస్తుతం తన కుటుంబం మొత్తం నికర ఆస్తి విలువ(net worth) రూ. 15 కోట్లకు చేరిందని వెల్లడించారు. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ మొత్తం రూ. 20 కోట్లకు పైగా పెరిగింది. ఆయన ఇదంతా కేవలం 9 టు 5 జాబ్‌తోనే కూడబెట్టారు. పైగా ఆయనకు ఎలాంటి తాతముత్తాతల ఆస్తి, వ్యాపారం గానీ లేవన్నారు. తాను 2021లో ఆర్థిక స్వేచ్ఛను సాధించానని గ్రహించిన తర్వాత, తక్షణమే ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఆర్థిక సేవల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
అంత సొమ్ముని ఎలా కూడబెట్టారంటే..
2021లో వివేక్ వామన్ రూ. 15 కోట్ల నికర ఆస్తితో ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. అప్పుడు ఆయన వయసు కేవలం 47 ఏళ్లు మాత్రమే; అంటే భారతదేశంలో సాధారణ పదవీ విరమణ వయసు కంటే చాలా ముందే ఆయన రిటైర్ అయ్యారు. రిజైన్‌కు ముందుకు వరకు ఆయన జీతం రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్యలో ఉండేది. ఆయన తొలి జీతం మాత్రం రూ. 12 వేలు మాత్రమే. ఆయన పొదుపు ప్రారంభించడానికి ఏ జీతమూ తక్కువ కాదంటారు. తాను ఇంత మొత్తాన్ని నిలకడగా పెట్టుబడులు పెట్టడం వల్ల సంపాదించగలిగానన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి అంటే సరిగ్గా అలాగే ఉండాలన్నారు.
ఇది సాధ్యమేనా..
కేవలం జీతంతోనే ఒక వ్యక్తి త్వరగా పదవీ విరమణ చేసి సంపదను కూడబెట్టడం అనేది పెద్ద విషయం కాదని అంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసి..జీతం తీసుకునే ఉద్యోగి, వారి ఆదాయంతో సంబంధం లేకుండా, త్వరగా పెట్టుబడులు ప్రారంభించేలా క్రమశిక్షణతో ఉంటే సులభంగా ఆర్థిక స్వేచ్ఛను పొందగలరని అన్నారు. యువ ఉద్యోగులు తమ కెరీర్ మొత్తంలో నేర్చుకుంటూ ఉండాలని ఆయన సలహా ఇచ్చారు.
అలాగే జీవనశైలి ఖర్చులు తక్కువుగా ఉంచాలని సూచించారు. ఉద్యోగాలు ప్రారంభించినప్పుడే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ..ఆదాయాలను పెంచుకునే అవకాశానికి మార్గం సుగమం అవుతుంది. ఇక్కడ ఆదాయం పెరిగినా..ఖర్చులను అదే నిష్పత్తిలో ఉంచొద్దు. మూడోది లక్ష్య-ఆధారిత ఆర్థిక ప్రణాళికను రూపొందించడానికి ఒక మంచి సలహాదారుడితో కలిసి పనిచేయండి. చివరగా చక్రవడ్డీకి అంతరాయం కలిగించవద్దు. డబ్బును విలాసవంతమైన కొనుగోళ్లతో సమానం చేసినప్పటికీ.. ఆర్థిక స్వాతంత్ర్యం అంతకుమించి విలువైనదని అంటున్నారు వామన్.
అంతేగాదు సంపదను కూడబెట్టాక..డబ్బు మీకు ఇచ్చే అతిపెద్ద విలాసం మానసిక స్వేచ్ఛ, 'వద్దు' అని చెప్పగల సామర్థ్యం. ఇక్కడ డబ్బుని డబ్బుతో కాకుండా సమయంతో కొలవాలని ఆయన అన్నారు. డబ్బు అనంతమైనది. మీరు ఎంత సంపదను సృష్టించినా, మీ కంటే ధనవంతులు ఎప్పుడూ ఉంటారు. అయితే డబ్బుతో ఆనందాన్ని కొనలేము, కానీ సమయాన్ని కొనవచ్చు. మీ డబ్బుతో మీరు సమయాన్ని కొనగలిగితే, మీ జీవితంలో మీరు కోరుకునే ఆనందానికి మరింత చేరువవుతున్నట్లేనని అన్నారు.
(చదవండి: డీఎస్పీగా రైల్వే గేట్‌మ్యాన్..! 12 గంటలు పనిచేస్తూనే..)


