20లో రూ.30 లక్షలే.. 26లో రూ.90 లక్షలు.. యువకుడి పశ్చాత్తాపం వైరల్! | Bengaluru Man Regrets Skipping ₹30 Lakh 1BHK Flat in 2020 | Sakshi
Sakshi News home page

20లో రూ.30 లక్షలే.. 26లో రూ.90 లక్షలు.. యువకుడి పశ్చాత్తాపం వైరల్!

Aug 17 2026 1:26 PM | Updated on Aug 17 2026 1:30 PM

Bengaluru Man Regrets Skipping ₹30 Lakh 1BHK Flat in 2020

బెంగళూరు: బెంగళూరు నగరంలో రియల్టీ రంగం ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి ఓ టెక్కీ ఉదంతం నిదర్శనంగా నిలిచింది. ఆరేళ్ల క్రితం తాను కొనుగోలు చేయలేకపోయిన ఓ చిన్న ఫ్లాట్ ధర ఇప్పుడు భారీగా పెరగడంతో ఓ వ్యక్తి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రెడ్ఇట్‌లో పంచుకున్న అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

2018 నుంచి 2020 మధ్యకాలంలో హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతానికి సమీపంలోని చూడసంద్ర ప్రాంతంలో సదరు వ్యక్తి నివసించారు. అప్పట్లో ఆ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండేవి. దీంతో ఆయన సహచరులు సైతం చూడసంద్ర పేరుతో ఎగతాళి చేసేవారు. అయితే తాను అద్దెకు ఉంటున్న 1బీహెచ్‌కే ఫ్లాట్ యజమాని బెంగళూరు వీడి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఆ ఇంటిని కేవలం రూ.30 లక్షల ధరకే విక్రయించడానికి ముందుకు వచ్చారు.

ఆ సమయానికి తనకు 26 ఏళ్లు మాత్రమే కావడంతో, ఆ ఫ్లాట్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టి తాను సొంతంగా ఒక కారు కొనుగోలు చేసినట్లు అతను వెల్లడించారు. ఇటీవల అదే ప్రాంతంలో తన స్నేహితుడి గృహప్రవేశ వేడుకకు వెళ్లిన ఆయనకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయి ఎన్నో బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. స్థానిక సరస్సుకు వందల మీటర్ల నడక మార్గం కూడా ఏర్పాటయింది.

ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ప్రస్తుత ఆస్తి ధరల గురించి ఆరా తీయగా.. తాను ఒకప్పుడు కొనాలనుకున్న అదే 1బీహెచ్‌కే ఫ్లాట్ ధర ప్రస్తుతం రూ.90 లక్షలకు చేరుకుందని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆస్తిపై వస్తున్న అద్దె ఆదాయం బాగుండటంతో పాటు భారీగా ధర పెరగడంతో ప్రస్తుత యజమానులు ఎవరూ ఆ ఫ్లాట్లను విక్రయించడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు. అప్పట్లో రియల్ ఎస్టేట్‌పై పెట్టిన పెట్టుబడి నిర్ణయాన్ని మార్చుకుని కారు కొనుగోలు చేయడం పెద్ద పొరపాటయిందని ఆయన వాపోయారు.

ఇది కూడా చదవండి: ఉజ్జయినిలో తొక్కిసలాట.. 13 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement