భారత్‌కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక | Super El Nino Threat to India 180 Scientists says Extreme Weather | Sakshi
Sakshi News home page

భారత్‌కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక

Sep 20 2026 7:23 AM | Updated on Sep 20 2026 7:53 AM

Super El Nino Threat to India 180 Scientists says Extreme Weather

ఒకవైపు మండే ఎండలు.. మరోవైపు కరువు కాటకాలు.. ఇంకోవైపు అడవులను బుగ్గిపాలు చేసే కార్చిచ్చులు.. ముప్పు ముంచుకొచ్చేలోపే మేల్కోవాలి.. లేదంటే ప్రకృతి ప్రకోపం తీవ్ర మూల్యం చెల్లించేలా చేస్తుందా? భారత్‌పై ‘సూపర్‌ ఎల్‌నినో’ రూపంలో పొంచి ఉన్న ముప్పుపై 180 మందికి పైగా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. 2027 ఆరంభం వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్న ఈ వాతావరణ పరిణామం.. సముద్రాల నుంచి అడవుల వరకు, రైతుల నుంచి మత్స్యకారుల వరకు ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ ఎల్‌నినో ఏంటి? భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది?.. 

కాగా, రానున్న రోజుల్లో భారత్‌ను తీవ్ర వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టే అవకాశం ఉందని 180 మందికి పైగా శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు హెచ్చరించారు. రాబోయే నెలల్లో ‘సూపర్‌ ఎల్‌నినో’ తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో దేశంలోని సహజ పర్యావరణ వ్యవస్థలను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఇటీవల వెల్లడించిన అంచనాల ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు రాబోయే నెలల్లో ‘చాలా బలమైన ఎల్‌నినో’గా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

4 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు?
ఎల్‌నినో అంటే ఉష్ణమండల పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అసాధారణంగా వేడెక్కే వాతావరణ పరిస్థితి. ప్రస్తుతం పసిఫిక్‌ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్‌ పరిమితిని దాటి పెరుగుతున్నాయి. ఆగస్టులో ఈ అసాధారణ ఉష్ణోగ్రత 2.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు పేర్కొన్నారు. కొన్ని అంచనాల్లో ఇంకా 4 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు.

భారత్‌పై ఎలాంటి ప్రభావం?
ఇంత బలమైన ఎల్‌నినో ఏర్పడితే భారత్‌లో ప్రకృతి, వ్యవసాయం, జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో విస్తృతంగా పగడపు దిబ్బలు తెల్లబడటం (Coral Bleaching), అడవుల్లో అగ్నిప్రమాదాలు పెరగడం, పెద్ద వర్షారణ్య వృక్షాలు చనిపోవడం, కరువు పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం, తీవ్రమైన వడగాలులు, ఉష్ణోగ్రతలు పెరగడం, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులపై తీవ్ర ప్రభావం.. ఇలాంటి పరిణామాలు సంభవించే అవకాశముందని వారు హెచ్చరించారు.

కనిపించని మార్పులూ కీలకమే..
ఎల్‌నినో ప్రభావం కేవలం కరువు, వేడిగాలులు వంటి స్పష్టమైన పరిణామాలకే పరిమితం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్ల ఉత్పత్తి ఆలస్యం కావడం, జంతువుల ప్రవర్తనలో మార్పులు వంటి సూక్ష్మ పరిణామాలు కూడా పర్యావరణ వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.
అందుకే ఎల్‌నినో ప్రభావాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలించి, డేటాను సేకరించి, ప్రకృతిపై పడుతున్న ప్రభావాన్ని నమోదు చేయాలని 180 మందికి పైగా శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు తమ విజ్ఞప్తిలో కోరారు.

భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (IITM)కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ మాట్లాడుతూ.. ఎల్‌నినో సమయంలో చోటుచేసుకునే మార్పులను నమోదు చేయడంతో పాటు, ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న పర్యావరణ వ్యవస్థలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎల్‌నినో నుంచి నేర్చుకునే అంశాలు భవిష్యత్తులో మరింత వేడిగా, అస్థిరంగా మారే వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌కు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సౌదీతో మోగిన హెచ్చరిక సైరన్లు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement