రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ
51,000 మంది యువతకు నియామక పత్రాలు
న్యూఢిల్లీ: దేశంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం బహుముఖంగా కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకోసం విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు) కుదుర్చుకున్నామని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రెండు కోట్ల మంది యువతకు లబ్ధి చేకూర్చడానికి రూ.లక్ష కోట్ల విలువైన ఉపాధి ప్రోత్సాహక కార్యక్రమాన్ని తీసుకొచి్చనట్లు వెల్లడించారు. శనివారం 20వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో నూతనంగా ఎంపికైన యువతకు వర్చువల్ విధానంలో 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. భారతీయ యువత ప్రతిభ, నైపుణ్యాలు ప్రపంచం మొత్తానికీ విశ్వాసాన్ని కలిగించాయని పేర్కొన్నారు. భారతీయ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ యువశక్తిపై ప్రపంచానికి గొప్ప అంచనాలు ఉన్నాయని స్పష్టంచేశారు. 40 ఎఫ్‌టీఏలపై మనదేశం సంతకాలు చేసిందని, ఇవి మన యువతకు కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తున్నాయని వివరించారు. ఈ ఒప్పందాలు మన పారిశ్రామికవేత్తలకు కొత్త భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేస్తాయని, కొత్త మార్కెట్లకు దారులు తెరుస్తాయని, మన యువతకు కెరీర్ పరంగా కొత్త అవకాశాలను సృష్టిస్తాయని తెలియజేశారు.


