భారత్‌కు టారిఫ్‌ ముప్పు!  | India, China To Face Up To 100percent Tariffs on Russia Sanctions Bill | Sakshi
Sakshi News home page

భారత్‌కు టారిఫ్‌ ముప్పు! 

Sep 20 2026 5:55 AM | Updated on Sep 20 2026 5:55 AM

India, China To Face Up To 100percent Tariffs on Russia Sanctions Bill

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్‌ సంతకం

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకునే దేశాలపై 100% సుంకాలు విధించే అవకాశం

వాషింగ్టన్‌:  రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసి  చట్టంగా మార్చారు. ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం లభించింది. తద్వారా భారత్, చైనాలకు అమెరికా సుంకాల ముప్పు పొంచి ఉన్నట్లే.

 ‘లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2026’ అనే ఈ బిల్లును రిపబ్లికన్ల మద్దతుతో అమెరికా ప్రతినిధుల సభ 262–159 ఓట్ల తేడాతో ఆమోదించిన సంగతి తెలిసిందే. చట్టసభలో బిల్లు ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత ట్రంప్‌ దీనిపై సంతకం చేశారు. 
→ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులను తగ్గించడమే ఈ కొత్త చట్టం అసలు లక్ష్యం.  

→ ఇది రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన సంస్థలు, మాస్కో సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న విదేశీ సంస్థలపై గురిపెట్టింది.  

→ రష్యాకు చెందిన చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం అధ్యక్షుడికి కల్పిస్తుంది. 

→ హౌస్‌ వేస్‌ అండ్‌ మీన్స్‌ కమిటీ ప్రకారం ఈ చట్టం రష్యన్‌ ఉత్పత్తులపై 500 శాతం వరకు సుంకాలు విధించడానికి వీలు విధిస్తుంది.  రష్యా చమురు, గ్యాస్‌ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు.  

→ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపైనా  ఆంక్షలు విధించడానికి ఆస్కారం ఉంది.  

→ 100% వరకు సుంకాలు విధించడానికి అర్హమైన దేశాలుగా చైనా, భారత్, యూఏఈ, టర్కీ, సింగపూర్, అజర్‌బైజాన్, కజకిస్తాన్, హంగేరీ, కిర్గిజిస్తాన్, స్లోవేకియా పేర్లను స్పష్టంగా పేర్కొనాలని బిల్లులో ఒక సవరణ ద్వారా ప్రతిపాదించారు. ఈ బిల్లు భారత్‌పై 100% సుంకాలు విధించాలని నేరుగా చెప్పలేదు.  

→ అధ్యక్షుడు ట్రంప్‌ తన అధికారాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంటే భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించవచ్చు.  

→ బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల ఎగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్‌ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 10 శాతం సుంకం వసూలు చేస్తోంది. ఒకవేళ ట్రంప్‌ 100 శాతం సుంకం విధిస్తే అది ఇప్పుడున్న 10 శాతం సుంకానికి అదనం అవుతుంది.  
→ అమెరికా సుంకం రేట్లను ప్రకటించిన తర్వాతే భారతీయ ఎగుమతులపై కొత్త సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పగలమని నిపుణులు అంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement