రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే | Maithili Thakur Visits Lalbaugcha Raja in Rolls Royce Cullinan | Sakshi
Sakshi News home page

రూ.13 కోట్ల కారులో వచ్చిన 26 ఏళ్ల మహిళా ఎమ్మెల్యే

Sep 19 2026 8:02 PM | Updated on Sep 19 2026 8:04 PM

 Maithili Thakur Visits Lalbaugcha Raja in Rolls Royce Cullinan
  • లాల్‌బాగ్చా రాజా దర్శనానికి రోల్స్ రాయిస్‌లో వచ్చిన మైథిలీ

పట్నా: బిహార్ ఎమ్మెల్యే, ప్రముఖ గాయని మైథిలీ ఠాకూర్ (26) ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా మండపాన్ని సందర్శించారు. గణేశుడిని దర్శించుకున్న ఆమె.. నీలిరంగు రోల్స్ రాయిస్ కలినన్‌లో మండపానికి రావడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె రాకకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

చౌఫర్ నడిపిస్తున్న ఈ విలాసవంతమైన కారులో వెనుక సీట్లో మైథిలీ ఠాకూర్ కూర్చున్నారు. లాల్‌బాగ్చా రాజా మండపం చుట్టూ భారీగా భక్తులు ఉండటంతో కారు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఈ సమయంలో ఆమె అక్కడున్న వారితో మాట్లాడటం, ఫొటోలకు పోజులివ్వడం కనిపించింది. మండపం ప్రధాన ద్వారం వద్దకు చేరుకునే సమయంలో కూడా ఆమె ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు.

అయితే ఈ రోల్స్ రాయిస్ కారు మైథిలీ ఠాకూర్‌దేనా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. వాహన నంబర్ ప్లేట్ ప్రకారం అది ముంబై సమీపంలోని వాషి ఆర్టీఓలో నమోదైన వాహనంగా తెలుస్తోంది. ఆమెకు సొంతంగా ఈ కారు ఉందా? అద్దెకు తీసుకున్నారా? లేదా ప్రత్యేక ఏర్పాటులో భాగంగా ఆమె కోసం వాహనాన్ని సమకూర్చారా? అనే దానిపై అధికారిక సమాచారం లేదు.

దర్శనం సందర్భంగా మైథిలీ ఠాకూర్ గణేశుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థనలు చేశారు. అనంతరం లాల్‌బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండల్‌ ప్రతినిధులు ఆమెను సత్కరించారు. మండపానికి వచ్చిన సమయంలో అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.

మైథిలీ ఠాకూర్ వచ్చిన రోల్స్ రాయిస్ కలినన్ ప్రపంచంలోని ఖరీదైన విలాసవంతమైన ఎస్‌యూవీల్లో ఒకటిగా పేరుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.10.50 కోట్లుగా ఉంది. ముంబైలో పన్నులు, బీమా, ఇతర ఛార్జీలు, వేరియంట్‌ను బట్టి ఆన్‌రోడ్ ధర సుమారు రూ.13.11 కోట్ల నుంచి రూ.15.30 కోట్ల వరకు ఉండొచ్చు. ఇందులో కలినన్ సిరీస్ 2, బ్లాక్ బ్యాడ్జ్ సిరీస్ 2 వేరియంట్లు ఉన్నాయి.

లాల్‌బాగ్చా రాజా దర్శనానికి ఒక రోజు ముందు మైథిలీ ఠాకూర్ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం యాంటీలియాలో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలకు కూడా హాజరయ్యారు. అక్కడ ఈషా అంబానీ ఆమె గానాన్ని ప్రశంసిస్తూ, తమ పిల్లలు ఆమె పాటలను తరచూ వింటారని చెప్పినట్లు మైథిలీ షేర్‌ చేసిన వీడియోలో కనిపించింది. మైథిలీ ఠాకూర్ లాల్‌బాగ్చా రాజా దర్శనం, ఆమె విలాసవంతమైన కారులో వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా కొనసాగుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement