న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. పర్యావరణం, వాతావరణ మార్పులపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన ఆయన.. భారత్‌లో తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కార్బన్ ఉద్గారాలు భారత్ కంటే సుమారు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. ముఖ్యంగా సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పైగా పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో పునరుత్పాదక ఇంధనం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
పారిస్ వాతావరణ ఒప్పందంలో భారత్ చేసిన కట్టుబాట్లను నిర్ణీత గడువుకు ముందుగానే సాధించిందని ప్రధాని తెలిపారు. జీ20 దేశాల్లో ఈ లక్ష్యాలను ముందుగానే పూర్తి చేసిన దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యం, సౌర విద్యుత్ విస్తరణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి అంశాల్లో భారత్ సాధించిన పురోగతిని ఆయన ప్రస్తావించారు. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ’ పథకం ద్వారా ఇళ్లనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని మోదీ చెప్పారు. ఇప్పటివరకు 50 లక్షలకు పైగా ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ.80 వేల వరకు ప్రభుత్వ సహాయం అందుతున్నట్లు వివరించారు.
కుసుమ్ పథకం కింద సుమారు 30 లక్షల మంది రైతుల పొలాల్లో సౌర విద్యుత్ పంపులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. అలాగే ‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో ఎల్ఈడీ బల్బుల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ ఆదాతో పాటు ఉద్గారాల తగ్గింపునకు కూడా సహకారం అందిందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్ అంతర్జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని మోదీ తెలిపారు. వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. భారతదేశంలోని ప్రాచీన పర్యావరణ ఆలోచనలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, జల విద్యుత్ సామర్థ్యం కూడా గణనీయంగా విస్తరించిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘జెన్ జీ’లో స్లో లివింగ్ క్రేజ్ ఎందుకు పెరుగుతోంది?


