హిందీ భాష విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమి కేటాయించబోమని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్ స్పష్టం చేశారు. అలాగే తమిళనాడు రెండు భాషల విధానానికే కట్టుబడి ఉంటుందని తెలిపారు.
నవోదయ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలవుతుండటం, అందులో హిందీ ఉండటంపై తమిళనాడు విజయ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కచ్చితంగా భూములు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు గత ఆదేశాలను సమీక్షించాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి చురకలు అంటించింది.
అయితే హిందీకి తాము వ్యతిరేకం కాదని, తమిళానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ విధానమని మంత్రి రాజ్‌మోహన్ అంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తుది తీర్పు కాదని, కేసు ఇంకా విచారణలోనే ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం.
నవోదయ పాఠశాలల కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న వెనక్కి తీసుకోలేదు. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు హిందీపై తన ‘మైండ్‌సెట్’ మార్చుకోవాలని, రాష్ట్రంలో హిందీ బోధించకూడదనే వైఖరి ఉండకూడదని వ్యాఖ్యానించింది.
ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు అవసరం లేదని, ఇప్పటికే మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నవోదయ పాఠశాలలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అదే సమయంలో హిందీకి తాము వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
దీంతో తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. రాజకీయంగా పరస్పరం విభేదిస్తున్నప్పటికీ భాషా విధానం విషయంలో ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: బెంగాల్‌లో బీజేపీ సర్కార్.. మరీ ఇంత ఘోరమా?


