చెన్నై: హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించడం అంటే ఆ భాషకు వ్యతిరేకం కావడం కాదని తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తాము దేశం నుంచి విడిగా వ్యవహరించడం లేదని, రాష్ట్ర భాషా ప్రత్యేకతను కాపాడుకుంటున్నామని చెప్పారు. హిందీ నేర్చుకోవడానికీ దేశభక్తికీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాలు తమకు అనుగుణమైన భాషా విధానాలను అనుసరించేందుకు అవకాశం కల్పించడం దేశ సమైక్యతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమిని గుర్తించే అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తమిళనాడు తన వైఖరిని పునఃపరిశీలించాలని సూచించిన నేపథ్యంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు గడ్డపై హిందీ నేర్పించకూడదనే ధోరణి ఉండకూడదు అని జస్టిస్ బి.వి. నాగరత్న వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు మరో విద్యా అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొంటూ.. పాఠశాలల ఏర్పాటుకు భూమిని గుర్తించేందుకు తమిళనాడుకు మరో మూడు నెలల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో ఉదయనిధి రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తమిళనాడు రెండు భాషల విధానంతోనే విద్య, ఉపాధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. హిందీ తెలియకపోయినా తమిళులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇస్రోలోనూ పలువురు కీలక పదవుల్లో ఉన్నారని ఉదాహరించారు. తమిళనాడులో ఇప్పటికే పేద, వెనుకబడిన విద్యార్థులకు విద్య అందించే పాఠశాలలు ఉన్నందున నవోదయ విద్యాలయాల అవసరం లేదని ఉదయనిధి తెలిపారు. మూడు భాషల విధానం అమలయ్యే నవోదయ పాఠశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి వ్యతిరేక తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు రావాల్సిన రూ.3,548 కోట్లను మూడు భాషల విధానాన్ని అంగీకరించలేదనే కారణంతో కేంద్రం నిలిపివేసిందని ఉదయనిధి ఆరోపించారు. రాష్ట్రం రెండు భాషల విధానాన్ని కొనసాగిస్తున్నందుకు విద్యా నిధులను నిలిపివేయడం సరికాదని అన్నారు.
ఇదీ చదవండి: తమిళనాట ట్విస్ట్.. విజయ్‌కు కొత్త టెన్షన్!


