తమిళనాడు రాజకీయాల్లో టీవీకే-కాంగ్రెస్ పొత్తు మరో కొత్త మలుపు తీసుకుంది. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ప్రధాని అభ్యర్థిత్వంపై మొదలైన చర్చ ఇప్పుడు కాంగ్రెస్ నేతల మధ్యే మాటల యుద్ధానికి దారితీసింది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పొత్తు భాగస్వాములు అంగీకరించాల్సిందేనని మాజీ టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై స్పష్టం చేయగా.. అసలు రాహుల్‌కు వ్యతిరేకంగా టీవీకే ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి కౌంటర్ ఇచ్చారు. దీంతో పొత్తులో అంతా సవ్యంగానే ఉందా? లేక ప్రధాని అభ్యర్థి అంశం అసలు పంచాయితీగా మారిందా? అన్న చర్చ మొదలైంది.
తమిళనాడులో టీవీకే-కాంగ్రెస్ పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2029 లోక్‌సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించాలని సెల్వపెరుంతగై వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అయితే.. పొత్తు భాగస్వాములు దాన్ని అంగీకరించాలని, అలా లేనప్పుడు అలాంటి పొత్తు అవసరం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ నేతను ప్రధాని అభ్యర్థిగా బహిరంగంగా, స్పష్టంగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు పెట్టుకోవడం సముచితమని పేర్కొన్నారు.
‘పొత్తులో ఎలాంటి సమస్య లేదు’
సెల్వపెరుంతగై వ్యాఖ్యలపై ప్రవీణ్ చక్రవర్తి స్పందిస్తూ.. పొత్తులో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. టీవీకే అధికారికంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో అన్ని భాగస్వామ్య పార్టీలు కలిసి చర్చించాయని, ముఖ్యమంత్రి విజయ్ కూడా సమావేశంలో ఉన్నారని తెలిపారు. అందరూ కలిసి మాట్లాడుకున్నారని, పొత్తు బలంగానే ఉందని పేర్కొన్నారు.
‘నవ్వుతూ మాట్లాడితే ఒప్పందమా?’
ప్రవీణ్ వ్యాఖ్యలకు సెల్వపెరుంతగై సోషల్ మీడియా వేదికగా మళ్లీ స్పందించారు. నాయకులు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని ప్రధాని అభ్యర్థిత్వంపై అంగీకారంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజయ్ లేదా టీవీకేలోని కీలక నేతల్లో ఎవరైనా రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని స్పష్టంగా చెప్పారా? అని నిలదీశారు. అలా చెప్పి హామీ ఇచ్చి ఉంటే తనకు తెలియజేయాలని కోరారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల టీవీకేకు చెందిన కొందరు నేతలు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులోని రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగమయ్యాయి. ప్రస్తుతం టీవీకే-కాంగ్రెస్ పొత్తులో అసలు పరీక్ష సీట్ల సర్దుబాటు కాదు.. ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం అనే చర్చ మొదలైంది.
అసలు చిక్కు టీవీకేకే..
ఈ వ్యవహారంలో టీవీకే ముందున్నది కీలకమైన ప్రశ్న. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్న సొంత నేతల వ్యాఖ్యలకు బ్రేక్ వేయాలా? లేక రాహుల్ గాంధీ పేరుపై కాంగ్రెస్ కోరుతున్న స్పష్టత ఇవ్వాలా? అన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. విజయ్ పేరుపై పట్టుబడితే కాంగ్రెస్‌తో పొత్తులో విభేదాలు మరింత బహిర్గతమయ్యే అవకాశం ఉంది. రాహుల్ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపితే విజయ్‌ను ప్రధాని ముఖంగా ముందుకు తెస్తున్న నేతలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు పొత్తు.. మరోవైపు ప్రధాని పీఠంపై ఆశలు.. ఈ రెండింటి మధ్య టీవీకే ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. విజయ్ మౌనం వీడి స్పష్టత ఇస్తారా? లేక ఈ పంచాయితీని కూటమి నేతలకే వదిలేస్తారా? అన్నది చూడాలి.
ఇదీ చదవండి: సీఎం రెండో పెళ్లిపై బిగ్ ట్విస్ట్..


