న్యూఢిల్లీ: తమిళనాడలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై జరుగుతున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడ గడ్డపై హిందీ బోధించకూడదనే ధోరణి కుదరదని, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జవహర్ నవోదయ పాఠశాలల ఏర్పాటుకు ప్రతి జిల్లాలో భూమిని కేటాయించాలంటూ డిసెంబర్ 15, 2025న ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగర్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో నడిచే నవోదయ పాఠశాలల ఏర్పాటును రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు ముప్పుగా భావించవద్దని సూచించింది. మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. తమిళనాడ నేలపై హిందీ నేర్పించబడదు అనడం సరికాదు" అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చల ద్వారా ఈ భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాలని కోర్టు హితవు పలికింది.
నవోదయ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలన్న డిసెంబర్ 2025 నాటి ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అయితే, ఈ ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు నెలల సమయం మంజూరు చేసింది.తమిళనాడులో అమల్లో ఉన్న ద్విభాషా విధానానికి, నవోదయ పాఠశాలలు పాటించే త్రిభాషా విధానానికి (హిందీతో కలిపి) మధ్య ఉన్న వివాదంపై విచారణ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తమ రాష్ట్ర విద్యా విధానానికి, రాజ్యాంగ అధికారాలకు విరుద్ధంగా కేంద్రం హిందీని రుద్దాలని చూస్తోందని తెలిపారు. తమిళం రెండవ భాషగా ఉండాలనే అంశాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు ఈ అంశంపై చర్చలు జరపాలని సూచించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.


