తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్‌లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’
భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్‌స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.
VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.
Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.
(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026
తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్
ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్‌ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్‌లో అజిత్‌కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్‌కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.
పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటన
ఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: విజయ్‌పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్


