ఒకే ఫ్రేమ్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్, షరీఫ్‌ | SCO Summit 2026 Modi Xi Putin Sharif Captured in One Frame in Bishkek | Sakshi
Sakshi News home page

ఒకే ఫ్రేమ్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్, షరీఫ్‌

Sep 1 2026 11:54 AM | Updated on Sep 1 2026 11:59 AM

SCO Summit 2026 Modi Xi Putin Sharif Captured in One Frame in Bishkek

బిష్కెక్‌: కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో మంగళవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఎస్‌సీఓ అధికారిక గ్రూప్ ఫొటోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. బిష్కెక్‌లోని ఇరిస్ ఓర్డో కాంగ్రెస్ హాల్‌లో జరిగిన సంప్రదాయ ‘ఫ్యామిలీ ఫొటోగ్రఫీ’ కార్యక్రమంలో నేతలందరూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. షీ జిన్‌పింగ్, పుతిన్‌లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆతిథ్య దేశ అధ్యక్షుడు సాదిర్ జాపరోవ్ నేతృత్వంలో రౌండ్‌టేబుల్ చర్చలు జరిగాయి. మోదీ, జిన్‌పింగ్, పుతిన్, షరీఫ్‌లతో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ తొకాయేవ్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్‌కత్ మిర్జియోయెవ్, తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మోన్‌లు హాజరయ్యారు.
 

సదస్సు నేపథ్యంలో సోమవారం ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ రంగాలపై సమీక్షించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు విజ్ఞప్తి చేసిన మోదీ.. ‘అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు పడాలి’ అని అన్నారు. పుతిన్ స్పందిస్తూ తాము ఆ దిశగానే సాగుతున్నామని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత రెండేళ్లలో వీరిద్దరి మధ్య ఇది తొలి భేటీ. ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగిన 10 దేశాల ఎస్‌సీఓ కూటమి.. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సహకారాన్ని బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement