పుతిన్‌తో మోదీ భేటీ... యుద్ధంపై కీలక వ్యాఖ్యలు | pm narendra modi meets vladimir putin | Sakshi
Sakshi News home page

పుతిన్‌తో మోదీ భేటీ... యుద్ధంపై కీలక వ్యాఖ్యలు

Aug 31 2026 8:21 PM | Updated on Aug 31 2026 9:06 PM

pm narendra modi meets vladimir putin

బిష్కెక్‌: ప్రస్తుత కాలంలో యుద్ధం వల్ల ముందుకు వెళ్లలేమని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని యుద్ధం నుండి బయిటపడి యుద్ధానికి ముగింపు పలికే దిశగా మందుకు సాగాలని కోరారు.  భారత్ ఎల్లప్పుడూ శాంతికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.  ఈ రోజు(సోమవారం) కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధం ఇంకా ఉద్రిక్తంగానే సాగుతుంది. ఈ నేపథ్యంలో  మోదీ,పుతిన్‌ మధ్య కీలక భేటీ జరిగింది. పుతిన్‌తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ, “మనం అంతులేని యుద్ధం నుంచి బయటపడి, యుద్ధానికి ముగింపు పలికే దిశగా ముందుకు సాగాలి. ఇది మానవాళి సంక్షేమానికి ఎంతో అవసరం. అన్ని సమస్యలకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలి. ఇదే మానవాళి ఆకాంక్ష, ఇదే భారతదేశ సందేశం” అని అన్నారు.

భారత్‌ శాంతి సంప్రదాయాన్ని కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. “గాంధీ పుట్టిన నేల, బుద్ధుని నేల — ఈ రెండు నేలలు ఒకే సందేశాన్ని పంచుకుంటాయి. ఆ సందేశం శాంతి మార్గం” అని ఆయన అన్నారు. అంటే మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుల బోధనలు రెండూ కూడా హింసకు బదులుగా శాంతి, సామరస్యం, సమస్యలకు శాంతియుత పరిష్కారం వైపు నడిపిస్తాయని పుతిన్‌కు పరోక్షంగా సూచించారు. భారత్ శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తుందని కూడా మోదీ స్పష్టం చేశారు.

యుద్ధమనేది మానవాళిని ప్రతిరోజూ వెనక్కి నెడుతుంది. అదే సమయంలో శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది” అని ఆయన పేర్కొన్నారు. కాగా గతేడాది పుతిన్‌ భారత పర్యటన తర్వాత  మోదీ, పుతిన్‌లు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం ఇదే.  ఈ సందర్భంగా సమావేశానికి ముందు ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

తాజా సమావేశంలో మోదీ పుతిన్‌ను భారత్‌లో జరగనున్న BRICS సదస్సుకు కూడా ఆహ్వానించారు. భారత్ కొన్ని రోజుల్లో BRICS సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందని, పుతిన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలకడానికి భారతీయులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement