నేటితో ఆఖరు.. గ్యాస్‌, రేషన్‌, చేయూతకు ఈ-కేవైసీ చేశారా? | Gas And Ration E-kyc Today Last Date In Telangana | Sakshi
Sakshi News home page

నేటితో ఆఖరు.. గ్యాస్‌, రేషన్‌, చేయూతకు ఈ-కేవైసీ చేశారా?

Aug 31 2026 9:35 AM | Updated on Aug 31 2026 9:35 AM

Gas And Ration E-kyc Today Last Date In Telangana

సాక్షి, సిటీబ్యూరో: వంటగ్యాస్, రేషన్‌ పొందేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఈ-కేవైసీ, మూడు నెలల రేషన్‌ ఒకేసారి డ్రా, చేయూత పింఛన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు సోమవారంతో గడువు ముగియనుంది. మహా నగరంలో వేలాది పేద కుటుంబాలు ఇంకా ఈ ప్రక్రియలను పూర్తి చేయలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. గడువు తేదీ దాటిపోతే రేషన్‌ బియ్యం, గ్యాస్‌ సిలిండర్‌ నిలిచిపోతాయోనని లబ్ధిదారులు పరేషాన్‌ అవుతున్నారు. కొన్ని రోజులుగా రేషన్‌ షాపులు, మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ప్రక్రియ మాత్రం వందశాతం పూర్తి కాని పరిస్థితి నెలకొంది.

మొరాయిస్తున్న సర్వర్లు..  
ఒకేసారి ఆన్‌లైన్‌ ద్వారా ఈ-కేవైసీ వివరాలను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరుగుతోంది. మీ–సేవ కేంద్రాలు, రేషన్, ఇంటర్నెట్‌ కేఫ్‌లలో ‘సర్వర్‌ డౌన్‌’ అనే సమాధానమే వస్తోంది. వేలిముద్రలు (బయోమెట్రిక్‌) పడకపోవడం, ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింక్‌ కాకపోవడం, కంటిపాప (ఐరిస్‌) స్కాన్‌ సరిగా జరగకపోవడం వంటి సాంకేతిక లోపాలు పెరుగుతున్నాయి. గంటల తరబడి వరుసలో వేచి చూసిన తర్వాత ఒక్కసారిగా నెట్‌వర్క్‌ నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.  

మూడు నెలల సరుకులకు స్టాక్‌ కొరత 
ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఒకేసారి రేషన్‌ బియ్యం పంపిణికి స్టాక్‌ కొరత వెంటాడుతోంది. వచి్చన స్టాక్‌ వచ్చినట్లే ఖాళీ అవుతుండటంతో దుకాణాలు మూతపడుతున్నాయి. స్టాక్‌ ఉన్నప్పుడు బియ్యాన్ని డ్రా చేసుకోవడానికి రేషన్‌ షాపుల వద్ద ఊహించని రీతిలో జనం పోటెత్తుతున్నారు. ఒకవైపు ఈ-కేవైసీ నమోదు పూర్తి చేయాల్సిన ఒత్తిడి, మరోవైపు కడుపు నింపే బియ్యం కోటా తీసుకోవాలనే తొందర రెంటి మధ్య పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో లబ్ధిదారు వేలిముద్ర నమోదు చేయడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది.  

చేయూత తిప్పలు 
కొత్త చేయూత సామాజిక పింఛన్ల కోసం ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ సమస్యగా మారింది. అప్‌లోడింగ్‌ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నారు. ఆధార్‌ కార్డులలో పేరు, వయసు, చిరునామా సరిపోలకపోవడంతో అర్హులైన పేదలకు కూడా పోర్టల్‌ అంగీకరించడం లేదు. క్షేత్రస్థాయిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–కేవైసీ, చేయూత నమోదు, రేషన్‌ డ్రా గడువు పెంచాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement