న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా అధినేత, దోషి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తరచూ పెరోల్ మంజూరు కావడం, విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖలీద్ సుదీర్ఘకాలంగా జైలులోనే కొనసాగడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో 'సెలెక్టివ్ జస్టిస్' (ఎంపిక చేసిన న్యాయం) అమలు జరుగుతోందని ఆమె విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మహువా మోయిత్రా.. ‘మీరు పండితుడు (స్కాలర్) కాబట్టే లోపల ఉన్నారు. అదే అత్యాచార దోషి అయితే ఎప్పుడో బయటకు వచ్చేవారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2017లో అత్యాచారం కేసులో దోషిగా తేలిన రామ్ రహీమ్ సింగ్, పదేపదే పెరోల్‌పై బయటకు వస్తుండటంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించి మాజీ జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై కఠినమైన ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణ ఇంకా ప్రారంభం కాకుండానే ఆయన 2020 సెప్టెంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు సహా పలు న్యాయస్థానాల్లో ఆయన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఖలీద్, సహ నిందితుడు షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.
నేరం రుజువై జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి తరచూ ఉపశమనం లభిస్తుండగా, విచారణ ఎదుర్కొంటున్న స్కాలర్‌కు మాత్రం ఏళ్ల తరబడి బెయిల్ దక్కకపోవడంపై విపక్ష నేతలు, పౌరహక్కుల సంఘాలు న్యాయవ్యవస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహువా మోయిత్రా వ్యాఖ్యలపై నెట్టింట భిన్నమైన చర్చ నడుస్తుండగా, సంబంధిత వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం


