నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్‌ | India Sends 10-Tonne Relief Aid To Flood-Hit Nepal As PM Modi Assures Full Support, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Nepal Flash Floods: నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్‌

Aug 27 2026 8:56 AM | Updated on Aug 27 2026 12:35 PM

India Rushes 10 Tonnes of Relief Supplies to Flood Hit Nepal

న్యూఢిల్లీ: టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ బాసటగా నిలిచింది. 10 టన్నుల మానవతా సాయం, అత్యవసర ఔషధాలతో కూడిన మొదటి విడత సహాయక సామగ్రిని భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో నేపాల్‌కు తరలించింది. ఈ విపత్తులో 95 మంది మరణించగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పరిస్థితి తీవ్రతపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్‌లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
 

ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఇరు దేశాల బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత్ తరఫున 10 టన్నుల విపత్తు సహాయక సామగ్రి, మందులను పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్ నుంచి రాత్రి సుమారు 8:35 గంటలకు బయల్దేరిన ఐఏఎఫ్ ‘సి-130జె’ (C-130J) విమానం ఖాట్మండుకు చేరుకుంది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ దీపాలు, అత్యవసర మందులు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సహాయక చర్యల కోసం సి-17, సి-130 రవాణా విమానాలతో పాటు రెస్క్యూ ఆపరేషన్లకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు భారత వైమానిక దళం తెలియజేసింది.

ఇది కూడా చదవండి: ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement