సింగర్‌ దారుణ హత్య.. యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు | Who Is Ankit Balyan The Singer Youtuber Case Sparks UP Law and Order | Sakshi
Sakshi News home page

సింగర్‌ దారుణ హత్య.. యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు

Aug 27 2026 7:53 AM | Updated on Aug 27 2026 7:57 AM

Who Is Ankit Balyan The Singer Youtuber Case Sparks UP Law and Order

ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశం.. మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్‌ అంకిత్‌ బల్యాన్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. షామ్లీ జిల్లాలోని కోత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో ప్రజలకు, ప్రముఖులకు రక్షణ కరువైందని యోగి సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. అంకిత్‌ బల్యాన్‌ జిమ్‌(33) నుంచి బయటకు వస్తుండగా బైకులపై వచ్చిన ఇద్దరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే కూలిపోగా.. దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంకిత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు షామ్లీ ఎస్పీ ఎం.పీ. సింగ్‌ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అంకిత్‌పై దుండగులు దాదాపు 18 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.

ఎవరీ బల్యాన్‌
ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోనూ అంకిత్‌ బల్యాన్‌ యూట్యూబ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన గాయకుడు. ఆయన ఛానల్‌కు 3.66 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. హర్యాన్వీ పాటలు, ప్రదర్శనలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వీడియోల్లో పాటలతో పాటు లగ్జరీ కార్లు, ఆయుధాల ప్రదర్శన హైలైట్‌ అయ్యేవి. ఇదిలా ఉండగా.. అంకిత్‌ బల్యాన్‌ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అఖిలేష్‌ ఆగ్రహం
అంకిత్‌ హత్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అయితే ఎస్సీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. ఈ ఘటన భయాందోళనలకు కారణమైందని పేర్కొన్నారు. అంకిత్‌ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని విలపించిన దృశ్యం హృదయ విదారకమని అన్నారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కక్షల కోణంలోనూ దర్యాప్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. 

మరోవైపు ఈ హత్యపై జాట్‌ వర్గంలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జాట్‌లు మొత్తం జనాభాలో సుమారు 2–3 శాతం వరకు ఉంటారని అంచనాలు ఉన్నాయి. అయితే పశ్చిమ యూపీలోని షామ్లీ, ముజఫర్‌నగర్‌, బాఘ్‌పత్‌, మీరట్‌ వంటి జిల్లాల్లో వీరి ప్రభావం గణనీయంగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో జాట్‌ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.

ఇప్పటికే యూపీలో శాంతి భద్రతల గురించి దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. గ్యాంగ్‌స్టర్ల ఎన్‌కౌంటర్ల గురించి యోగి ప్రభుత్వ తొలి కాలంలో సానుకూల చర్చ నడిచినా.. ప్రస్తుత టర్మ్‌లో మాత్రం కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. అమాయకులు బలైపోతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు.. అభివృద్ధి అంశం పూర్తిగా పక్కకు జరిగిపోయిందనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో.. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంకిత్‌ బల్యాన్‌ హత్య రాజకీయ చర్చకు దారి తీసింది. జాట్‌ సంఘాలు దీనిని పెద్ద అంశంగా తీసుకుని ఆందోళనలు చేస్తే యోగి సర్కార్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితే ఎదురు కావొచ్చు.

ఇదీ చదవండి: సీఎం కటింగ్‌ ఖరీదు 50రూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement