Photo Credit: Twitter
హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీస్ చేరడంలో విఫలం కావడంపై దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ స్పందించాడు. ప్రపంచకప్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేయడంపై శ్రీజేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీని రిహార్సల్‌గా పరిగణించకూడదని, వైఫల్యాలపై ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.
సోమవారం ఆమ్‌స్టెల్వీన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు అర్జెంటీనా చేతిలో 3-5 తేడాతో ఓడిపోవడంతో సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో ఒత్తిడికి తలొగ్గిన అమ్మాయిలు గోల్ రహిత డ్రాతో సరిపెట్టుకొని సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలోనే 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత కాంస్య పతక జట్టులో సభ్యుడైన శ్రీజేష్ పేలవ ప్రదర్శనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ‘నాదొక్కటే ప్రశ్న. మనం మంచి హాకీ ఆడేందుకు ఒక జట్టును నిర్మిస్తున్నామా లేక ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లపై గెలవగల సామర్థ్యం ఉన్న జట్టును నిర్మిస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి. ప్రపంచకప్ అనేది రిహార్సల్ కాదన్న విషయం గుర్తుంచుకోండి. ఇకనైనా వైఫల్యాలను దాచిపెట్టడం ఆపేయండి. ప్రపంచ కప్ ఎలాంటి రిహార్సల్ కాదు.
ఈ వైఫల్యాన్ని వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడలతో ముడిపెడుతున్నారు. ప్రపంచ కప్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది?.. ఆసియా క్రీడలు వస్తున్నాయి. అక్కడ పతకం గెలిస్తే.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ గురించి కలలు కనొచ్చు. ప్రపంచ కప్‌లో జరిగిన ప్రతిదీ కప్పిపుచ్చడానికి అది సరిపోతుందేమో!’ అంటూ శ్రీజేష్ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు.
‘ప్రపంచకప్‌కు కొద్దిరోజుల ముందు మహిళల ప్రధాన కోచ్ సెలవులో వెళ్లినప్పటికీ సలీమా టిటే నేతృత్వంలోని మహిళల జట్టు మాత్రం ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణించారు. కానీ ఇక్కడ జవాబుదారీతనం లోపించింది. తుది దశ సన్నాహాల్లో చీఫ్ కోచ్ దూరంగా ఉంటే జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఎలా ఆశించగలం?. ఓడిన ప్రతిసారీ ‘ఇది నేర్చుకునే దశ’ అంటూ సమర్థించుకోవడం పద్ధతే కాదు.’ అని శ్రీజేష్ చెప్పుకొచ్చాడు.


