ప్రపంచపటంలో భారత్ స్థాయిని పెంచండి
ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌లకు ప్రధాని మోదీ పిలుపు
డిజిటల్ సాంకేతికతను వాడుకోవాలని సూచన
న్యూఢిల్లీ: మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని, సాంకేతికత, ఆవిష్కరణలతో కలగలిపి, ప్రపంచ పటంలో భారత్ స్థాయిని ఇనుమడింప జేయాలని ట్రెయినీ ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్)అధికారులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2025 బ్యాచ్‌లోని 50 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు సోమవారం సేవాతీర్థ్ లో ప్రధాని మోదీని కలిశారు.
యువ దౌత్యవేత్తలు దేశ గొప్ప నాగరికత, సాంకేతికత, ఆవిష్కరణలు, సమర్థవంతమైన సమాచార మార్పిడిని మిళితం చేస్తూ దేశ గౌరవాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ కొనసాగించే ఆర్థిక సంబంధాలకు ఉ్రత్పేరక ఏజెంట్లుగా వ్యవహరించాలని వారిని కోరారు. ‘మీరు పనిచేసే దేశాల్లో స్థానిక వర్గాలతో భారత్ సంబంధాలను లోతుగా పెంచేలా ప్రాథమిక స్థాయిలో అనుబంధాన్ని పెంపొందించుకోండి.
సంప్రదాయ దౌత్య పరిధికి మించి విస్తరించి, ప్రజల స్థాయిలో సంబంధాలను నెలకొల్పుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. భారతీయ మిషన్లు కేవలం ప్రభుత్వాలు, సంస్థలతోనే కాకుండా ప్రజలతో కూడా అర్థవంతమైన సంబంధాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ వారికి చెప్పారు. ‘భారతీయ మిషన్లలో డిజిటల్ సాంకేతికత వినియోగాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.
ప్రభుత్వ సేవలు, ఇతర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు సాంకేతికత ఉపయోగపడుతుంది. ప్రజలు ఏదైనా ఒక సంస్థతో సంప్రదింపులు జరిపేందుకు వెబ్‌సైట్ మొదటి ద్వారంగా ఉంటుంది’అని ప్రధాని పేర్కొన్నారు. మన నాగరికత, సాంస్కృతిక, భౌగోళిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా దేశాన్ని మరింత ఆకర్షణీయమైన ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ట్రెయినీలను ప్రధాని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో మనదేశంపై ఆసక్తిని పెంచేందుకు ‘భారత్‌ను తెలుసుకోండి’క్విజ్‌ను సది్వనియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్‌లను సాధనాలుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌లు తమ శిక్షణ, భారత్ దర్శన్ నుంచి పొందిన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.


