నిరాటంకంగా ఇంధనం, ఎరువులు  | Russia assured India of uninterrupted supply of energy and fertilisers | Sakshi
Sakshi News home page

నిరాటంకంగా ఇంధనం, ఎరువులు 

Aug 25 2026 4:49 AM | Updated on Aug 25 2026 4:49 AM

Russia assured India of uninterrupted supply of energy and fertilisers

భారత్‌కు రష్యా భరోసా 

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీలో పుతిన్‌ వాగ్దానం

మాస్కో: చిరకాల మిత్రదేశమైన భారత్‌కు నిరాటంకంగా ఇంధనం, ఎరువులను సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్‌ జలసంధి దిగ్బంధం కారణంగా ఇంధనం, ఎరువుల సరఫరాల్లో అవరోధాలను ఎదుర్కొంటున్న భారత్‌కు తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పుతిన్‌ భారత్‌కు భరోసా ఇచ్చారు. 

వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఇండో–రష్యా అంతర్‌ ప్రభుత్వ కమిషన్‌(ఐఆర్‌ఐజీసీ) సమావేశంలో పాల్గొనేందుకు రష్యాకు విచ్చేసిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సోమవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ‘‘భారత రైతన్నల కోసం, భారతీయ వ్యవసాయ రంగం కోసం శక్తిమేరకు మేం సాయపడతాం. ఇకమీదటా మా సహాయసహకారాలు కొనసాగుతాయి’’అని జైశంకర్‌కు పుతిన్‌ హామీ ఇచ్చినట్లు రష్యా ప్రభుత్వరంగ టాస్‌ వార్తాసంస్థ పేర్కొంది. 

ఈ భేటీలో పుతిన్‌తోపాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ సైతం పాల్గొన్నారు. అంతకుముందు జైశంకర్‌ సహసారథి హోదాలో ఐఆర్‌ఐజీసీ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌      (డీపీఎం) డెనిస్‌ మంటురోవ్‌తో కలిసి సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది 12–13 తేదీల్లో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్‌ ఢిల్లీలో పర్యటించనున్న వేళ జైశంకర్‌ రష్యాలో పర్యటిస్తుండటంతో ఈ కీలక సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

మోదీజీ ఎదురుచూపులు.. 
పుతిన్‌తో భేటీలో మోదీ తరఫున జైశంకర్‌ శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు సంభాషించారు. ‘‘షాంఘై సహకార సంఘం భేటీలో మీతో చర్చించేందుకు ప్రధాని మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ భేటీలోనే మిమ్మల్ని బ్రిక్స్‌ సదస్సుకు ఆహ్వానించాలని మోదీ సిద్ధపడుతున్నారు. వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, పౌర అణు ఇంధనంసహా పలు రంగాల్లో మన ఇరుదేశాల పరస్పర సహకారం కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఐఆర్‌ఐజీసీ భేటీ అద్భుతంగా సాగింది’’అని పుతిన్‌తో జైశంకర్‌ చెప్పారు.  

4 రెట్లు పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం 
27వ ఐఆర్‌ఐజీసీ సమావేశంలో జైశంకర్‌ ప్రసంగించారు. ‘‘భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 2021–22లో 13 బిలియన్‌ డాలర్లు ఉండగా 2025–26లో అది ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 60 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతోపాటు ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు పెరిగి వాణిజ్యలోటు 6.6 బిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 

ఈ ప్రతికూల ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్నస్తాం. రష్యా విపణిలోకి భారతీయ ఉత్పత్తులకు మరింత అవకాశాలు దక్కేలా చేయడం, టారిఫ్‌ల తొలగింపు, వ్యాపార సంస్థల మధ్య మరింత బలమైన వ్యాపార సంబంధాలతో ఈ వాణిజ్యలోటుకు భారత్‌ చెక్‌ పెట్టాలనుకుంటోంది. తద్వారా 2030 ఏడాదికల్లా మా వాటా వాణిజ్యాన్ని 100 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’అని జైశంకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement