ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మజ్‌గావ్ పరిధిలో వినాయక విగ్రహాన్ని తీసుకువస్తున్న క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గణపతి మండలి డిప్యూటీ సెక్రటరీ వివేక్ రాణే వివరాల ప్రకారం గణేశుడి ఆగమన శోభాయాత్రను నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మండపం నుంచి సుమారు 30 నుంచి 40 మీటర్ల దూరంలో ఉన్న ఒక భవనం పైనుంచి కొందరు శోభాయాత్రపై గుడ్లు విసిరారు. విగ్రహంపై గుడ్లు పడ్డాయన్న వార్త వ్యాపించడంతో వెంటనే హిందూ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆ భవనం ఎదుట గుమిగూడారు. ఈ చర్య అత్యంత అభ్యంతరకరమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అనుమానిత భవనం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముంబైలో 10,000కు పైగా గణేశ మండపాలు
మహారాష్ట్రలో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ముంబయిలో సుమారు 10,600 పబ్లిక్ గణేశ్ మండళ్లు ఉండగా, దాదాపు 2,500 మండళ్లు 10 రోజుల ఉత్సవాలకు ఇప్పటికే అనుమతులు పొందాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28 లక్షల గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు అంచనా.
పండల్ అనుమతుల కోసం ముంబయిలో ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా బీఎంసీతో పాటు స్థానిక పోలీసు, ట్రాఫిక్ విభాగాల నుంచి ఎన్‌వోసీలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. దరఖాస్తులకు సెప్టెంబర్ 13 వరకు గడువు ఉంది. ఈసారి పలు పందిళ్లో ఆకర్షణీయమైన థీమ్‌లను తీర్చిదిద్దుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘సిల్క్యారా’లో మళ్లీ ప్రమాదం.. 2023ను గుర్తుకు తెస్తూ..


