తమిళనాడు: కడలూర్ జిల్లా తిరువందియపురంలో ప్రసిద్ధ దేవనాథస్వామి ఆలయం ఉంది. ఆవణి మాస ముహూర్త దినమైన ఆదివారం ఆలయంలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. మొత్తం 84 జంటలు ఇక్కడ ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ఓ వివాహం ప్రత్యేకంగా నిలిచింది.
కడలూర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ సంజన తన కుటుంబ సభ్యుల అంగీకారంతో తన ప్రియుడు నాగరాజ్‌ను వివాహం చేసుకుంది. సంజన నర్తకిగా కొనసాగుతుండగా.. నాగరాజ్ దేవనాథస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆవణి మాస ముహూర్త దినం కావడంతో ఆలయంలో వివాహానికి అనుకూలమైన రోజు అని భావించిన వీరు.. పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఒకవైపు ఆలయంలో 84 వివాహాలు జరుగుతుండగా.. సంజన, నాగరాజ్ వివాహం అక్కడికి వచ్చిన భక్తులు, ఇతరుల దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవడం, ఆలయ పూజారిగా పనిచేస్తున్న నాగరాజ్ ట్రాన్స్‌జెండర్ అయిన సంజనను వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రేమ, పరస్పర అవగాహనతో జీవిత భాగస్వాములుగా మారిన ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.


