చండీగఢ్: చండీగఢ్‌లో ఓ భారీ ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం సాయంత్రం సెక్టార్-43లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినస్ (ఐఎస్‌బీటీ) సమీపంలో అనుమానాస్పద ఐఈడీ, పేలుడు పదార్థాలు, తుపాకీతో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన నిందితుల్లో ఇద్దరు తర్న్ తారన్‌కు చెందినవారు కాగా, మరొకరు అమృత్‌సర్‌కు చెందిన వ్యక్తి. సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లు, వైర్లు, పవర్ సోర్స్ సహా పేలుడు పరికరం (ఐఈడీ) తయారీకి ఉపయోగించే పలు ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సెక్టార్-36 పోలీస్ స్టేషన్‌లో ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, ఆర్మ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది సత్నామ్ సత్తా అలియాస్ నౌ షేరాతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఏదైనా భారీ ఉగ్ర కుట్రలో భాగంగానే వీరు ఈ పేలుడు పదార్థాలు సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారు పంజాబ్ లేదా చండీగఢ్ లేక మరేదైనా ప్రాంతంలో దాడికి ప్రణాళిక రచించారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఇంకా ఎవరైనా ఇందులో భాగస్వాములా అనే కోణాల్లో దర్యాప్తు అధికారులు నిందితులను విచారిస్తున్నారు.
కొద్ది నెలల క్రితమే సెక్టార్-37లోని పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు నాటు హ్యాండ్ గ్రెనేడ్ విసిరిన సంగతి తెలిసిందే. నగరంలో ఇటీవల ముఠా హింస, పట్టపగలు కాల్పులు, దోపిడీలు, హత్యలు పెరగడం.. పలు ముఠాలకు సరిహద్దు ఆవల సంబంధాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఘటనపై ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు


