అది మలబద్ధకమేనా? పిల్లలు ఎందుకు ఆపుకుంటారు ? | Health tips: Constipation in children Symptoms And causes | Sakshi
Sakshi News home page

అది మలబద్ధకమేనా? పిల్లలు ఎందుకు ఆపుకుంటారు ?

Aug 23 2026 5:25 PM | Updated on Aug 23 2026 5:25 PM

Health tips: Constipation in children Symptoms And causes

మా ఐదేళ్ల బాబుకు రోజూ మలవిసర్జన కావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళతాడు. మలవిసర్జనకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ, నొప్పిగా ఉందని ఏడుస్తాడు. ఇంట్లో వాళ్లు పిల్లాడు మొండిగా చేస్తున్నాడంటున్నారు. ఇంకొందరు ఇది మలబద్ధకమే అంటున్నారు. ఏం చేయాలి? 
– లక్ష్మి, గుంటూరు

మీ సందేహం చాలా సహజం. పిల్లలకు మలవిసర్జన సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు ముందుగా ఆందోళన పడేది ఇదే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజూ మలవిసర్జన రాకపోవడం ఒక్కటే మలబద్ధకం కాదు. కొంతమంది పిల్లలకు రోజూ రావచ్చు; మరికొందరికి రెండు రోజులకు ఒకసారి రావచ్చు. 

మలం మెత్తగా ఉండి, పిల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంటే పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ మలం చాలా గట్టిగా ఉండటం, మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి రావడం, బాగా ఒత్తిడి చేయాల్సి రావడం, మలం పూర్తిగా బయటకు రాకపోవడం, పిల్లలు కావాలనే మలవిసర్జన ఆపుకోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం మలబద్ధకం గురించి ఆలోచించాలి.

పిల్లలుఎందుకు ఆపుకుంటారు?
ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తప్పుగా అర్థం చేసుకుంటారు. పిల్లాడు కావాలనే మలవిసర్జన ఆపుకుంటున్నాడని, మొండితనం చేస్తున్నాడని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అసలు కారణం నొప్పి భయం. ఒకసారి మలం చాలా గట్టిగా వచ్చి నొప్పి కలిగితే, మళ్లీ విసర్జన చేస్తే అదే నొప్పి వస్తుందని పిల్లలు భయపడతారు. అందుకే మలవిసర్జన వచ్చినా ఆపుకుంటాడు. 

అలా ఆపుకోవడంతో మలం మరింత గట్టిగా మారుతుంది. తర్వాత విసర్జన చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. దీంతో మళ్లీ ఆపుకుంటాడు. ఇలా నొప్పి, భయం, విసర్జన ఆపుకోవడం ఒక చక్రంలా మారుతుంది. అందుకే పిల్లలను తిట్టడం లేదా బలవంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టడం సమస్యను మరింత పెంచవచ్చు. ముందుగా పిల్లవాడు ఎందుకు మలవిసర్జన ఆపుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి.

పండ్లు పెడితే తగ్గిపోతుందా?
పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. కానీ కేవలం పండ్లు పెట్టడంతోనే సమస్య వెంటనే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోకండి. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పీచు పదార్థాలు ఉండేలా చూడాలి. అలాగే పిల్లలకు సరిపడా నీరు అందాలి. రోజూ కొంతసేపు ఆడుకోవడం, నడవడం వంటి శారీరక కదలికలు కూడా అవసరం.

పాలు ఇస్తే బలంగా పెరుగుతారా?
పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమే. కానీ అవసరానికి మించి పాలు మాత్రమే ఇస్తూ, ఇతర ఆహారాన్ని తగ్గించడం మంచిది కాదు. అలా చేస్తే పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వాలి.

అలవాటు కూడా ముఖ్యమే?
ముఖ్యంగా ఉదయం అల్పాహారం తర్వాత పిల్లలను కొంతసేపు ప్రశాంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టే అలవాటు చేయవచ్చు. తొందరపెట్టకుండా, భయపెట్టకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. మరుగుదొడ్డిపై కూర్చున్నప్పుడు పిల్లల కాళ్లు వేలాడకుండా కింద చిన్న పీట ఉంచితే మంచిది. కాళ్లకు సరైన ఆధారం ఉండటం వల్ల మలం సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది.

మలవిసర్జన చేయకపోతే తిట్టాలా? 
అసలు వద్దు. మలబద్ధకంలో పిల్లలను తిట్టడం, అవమానించడం, బలవంతం చేయడం వల్ల వాళ్లలో మలవిసర్జన చేయడంపై భయం మరింత పెరగవచ్చు. బదులుగా పిల్లలను ప్రోత్సహించాలి. విసర్జన చేయడానికి ప్రయత్నించినా ప్రశంసించాలి. సమస్య గురించి పిల్లలతో ఓపికగా మాట్లాడాలి.

మందులు ఇవ్వొచ్చా?
అవసర మైనప్పుడు వైద్యుల సూచనతో మందులు ఇవ్వవచ్చు. ముఖ్యంగా మలం చాలా గట్టిగా ఉండి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా సమస్య పదేపదే వస్తున్నప్పుడు వైద్యుడు తగిన చికిత్స సూచించవచ్చు. అయితే ఇంట్లో పెద్దలకు ఉపయోగించిన మందులను పిల్లలకు స్వయంగా ఇవ్వకండి. అలాగే ఎవరో చెప్పారని మలబద్ధకం మందులు మొదలుపెట్టి, సమస్య తగ్గగానే మీకు మీరే ఆపేయడం కూడా మంచిది కాదు. పిల్లల వయసు, బరువు, సమస్య తీవ్రతను బట్టి చికిత్స మారుతుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
పుట్టినప్పటి నుంచే తీవ్రమైన మలబద్ధకం ఉండటం, పుట్టిన తర్వాత మొదటి రెండు రోజుల్లో మలం రాకపోవడం, పొట్ట ఎక్కువగా ఉబ్బడం, తీవ్రమైన పొట్ట నొప్పి, పదేపదే వాంతులు, మలంలో రక్తం కనిపించడం, బరువు సరిగా పెరగకపోవడం, జ్వరం, పిల్ల చాలా నీరసంగా కనిపించడం లేదా ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలతో సమస్య తగ్గకుండా పదేపదే వస్తుండటం వంటి లక్షణాలు ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.

చివరగా ఒక మాట... పిల్లవాడు విసర్జన ఆపుకుంటున్నాడంటే ముందుగా అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోండి. చాలాసార్లు దాని వెనుక మొండితనం కాదు. నొప్పి, ఆ నొప్పిపై భయం ఉంటాయి. ఆ భయాన్ని అర్థం చేసుకోండి. మలబద్ధకాన్ని చిన్న సమస్యగా కాకుండా.. పిల్లల మాట వినండి, కారణాన్ని అర్థం చేసుకోండి, సరైన సమయంలో పరిష్కరించండి.
- డా. కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌, పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement