కర్తార్‌పూర్‌ తెరవాలా? కేంద్రం నిర్ణయానికే హైకోర్టు మొగ్గు! | Delhi HC rejects plea against Kartarpur Corridor closure | Sakshi
Sakshi News home page

కర్తార్‌పూర్‌ తెరవాలా? కేంద్రం నిర్ణయానికే హైకోర్టు మొగ్గు!

Nov 26 2026 7:38 AM | Updated on Nov 26 2026 7:38 AM

Delhi HC rejects plea against Kartarpur Corridor closure

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను సందర్శించేందుకు భారత సిక్కు యాత్రికులకు అందుబాటులో ఉన్న కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ పునఃప్రారంభంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మార్గాన్ని తిరిగి తెరవాలంటూ దాఖలైన పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నిరాకరించింది. పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న భద్రతాపరమైన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 7, 2025 నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో గురునానక్‌ దేవ్‌తో అనుబంధమున్న పవిత్ర గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను సందర్శించాలనుకునే సిక్కు భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కారిడార్‌ను దీర్ఘకాలంగా మూసివేయడంపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ పారదర్శిత పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. జాతీయ భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా నియంత్రిత పద్ధతిలో లేదా దశలవారీగా కారిడార్‌ను తిరిగి ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.

ఈ పిటిషన్‌ను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నితిన్‌ వాసుదేవ్‌ సాంబ్రే, జస్టిస్‌ సంజయ్‌ శర్మలతో కూడిన ధర్మాసనం.. కారిడార్‌ మూసివేత కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని పేర్కొంది. పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయంలో అసాధారణ రిట్‌ అధికారాల ద్వారా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రం అధికారుల వద్ద పెండింగ్‌లో ఉందని, దానిని పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, 2027 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ-శిరోమణి అకాలీదళ్‌ పొత్తును ప్రకటిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రతాపరమైన ఆందోళనలు పూర్తిగా తొలగిన వెంటనే కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగానే ఈ మార్గాన్ని మూసివేసినట్లు చెప్పారు. జాతీయ భద్రత అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టరాదని పేర్కొన్నారు. అయితే, కారిడార్‌ పునఃప్రారంభానికి నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. 

ఇదీ చదవండి: Egypt: ఘోర అగ్నిప్రమాదం.. 31 మంది సజీవదహనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement