సౌరవ్‌దాస్‌కు రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ షోకాజ్ నోటీస్
పుట్టిన ప్రాంతం వేర్వేరుగా ఉందని వెల్లడి
న్యూఢిల్లీ: షోకాజ్ నోటీస్‌కు స్పందించేదాకా పాస్‌పోర్ట్ ఉపయోగించడానికి వీల్లేదంటూ కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) కో–కన్వీనర్ సౌరవ్ దాస్‌కు షోకాజ్ నోటీస్ అందింది. చెన్నైలోని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్(ఆర్‌పీఓ) ఈ నోటీస్‌ను 23వ తేదీన సౌరవ్‌కు పంపించింది. పాస్‌పోర్ట్‌లో పేర్కొన్న పుట్టిన ప్రాంతం, ఇతర డాక్యుమెంట్లలో పేర్కొన ప్రాంతం వేర్వేరుగా ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో ఈ మేరకు సౌరవ్ నుంచి వివరణ కోరుతూ ఆయనకు షోకాజ్ నోటీస్ పంపినట్లు ఆర్‌పీఓ తెలిపింది. వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆయనకు సూచించింది.
కాక్రోచ్ ఉద్యమం విషయమై యూకేలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించేందుకు బయల్దేరిన తనను విమానాశ్రయంలో అధికారులు దురుద్దేశంతో అడ్డుకున్నారంటూ సౌరవ్ ‘ఎక్స్’లో వీడియో షేర్‌చేసిన మరుసటి రోజు భారత విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది. ‘‘పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తుదారుడు సంబంధిత ఫారమ్‌లో అన్ని వాస్తవిక అంశాలనే ప్రస్తావించాలి. సౌరవ్ విషయంలో పుట్టిన ప్రదేశం వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. అందుకే నోటీస్ ఇచ్చాం’’అని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌దీర్ జైశ్వాల్ చెప్పారు.


