ముంబై: పేదరికం అతడి పట్టుదలను ఓడించలేకపోయింది. తండ్రి కూలీ పనులు చేస్తుండగా.. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండేది. కుటుంబ ఆదాయం నెలకు రూ.15-20 వేలే. అమ్మకు వైద్యం చేయించేందుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మహారాష్ట్రకు చెందిన భూషణ్ ఠాక్రే.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-18’లో రూ.కోటి గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ముంబయికి వచ్చినప్పుడు అతడి జేబులో ఉన్నది కేవలం రూ.24 మాత్రమే. ఇప్పుడు ఒక్కరోజులోనే తన కుటుంబం 35 ఏళ్లలో సంపాదించే మొత్తాన్ని గెలుచుకున్నాడు.
మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన భూషణ్ 2016 నుంచి కేబీసీలో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నాడు. పలుమార్లు నిరాశ ఎదురైనా పట్టుదల వీడలేదు. చివరకు తన తెలివితేటలతో కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి కోటీశ్వరుడిగా నిలిచాడు. అయితే రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు.
కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఏడాదిన్నర క్రితం ఇంటిని వదిలి వచ్చాడు. భుసావల్‌లో ఉంటూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడంతో పాటు తల్లి వైద్య ఖర్చులు భరించాలని నిర్ణయించుకున్నాడు. కేబీసీలో గెలిచిన డబ్బును పెట్టుబడిగా పెట్టడంతో పాటు తల్లికి నగలు కొనాలని భావిస్తున్నాడు. మంచి కోచింగ్‌లో చేరి సివిల్స్ సాధించాలనేది అతడి మరో లక్ష్యం.
ఇక భూషణ్ కోటీశ్వరుడైన తర్వాత బంధువుల వైఖరిలోనూ మార్పు వచ్చింది. గతంలో ఫోన్లు ఎత్తని వారు.. తల్లి వైద్యం కోసం రూ.వెయ్యి కూడా సాయం చేయని వారు ఇప్పుడు అభినందనలు చెబుతున్నారు. భూషన్‌కు ఇంటి నుంచి కేబీసీ వేదిక వరకు అయిన ప్రయాణ ఖర్చులన్నింటినీ షో నిర్వాహకులే భరించడం విశేషం.
ఇదీ చదవండి: నేపాల్‌లో భూకంపం.. బిహార్, బెంగాల్‌లో ప్రకంపనలు!


