ఇజ్రాయెల్‌కు డబుల్ టెన్షన్‌.. నెతన్యాహును చుట్టుముట్టిన సంక్షోభం! | Double Trouble for Israel Netanyahu Cornered by Political Crisis and Iran | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు డబుల్ టెన్షన్‌.. నెతన్యాహును చుట్టుముట్టిన సంక్షోభం!

Nov 23 2026 7:29 AM | Updated on Nov 23 2026 7:29 AM

Double Trouble for Israel Netanyahu Cornered by Political Crisis and Iran

టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో రాజకీయ పరిణామాలు, సైనిక ఉద్రిక్తతలు ఒకేసారి వేడెక్కుతున్నాయి. ఒకవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్‌తో చర్చలు కొలిక్కి రావడం లేదు. మరోవైపు ఇరాన్‌పై సైనిక దాడికి దిగితే ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని సొంత సైనిక నిఘా అధికారులే ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నెతన్యాహు ప్రభుత్వం దేశీయంగా రాజకీయ సవాళ్లను, అంతర్జాతీయంగా యుద్ధ పరిణామాలను ఒకేసారి ఎదుర్కొంటోంది.

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ, గాడి ఐసెన్‌కోట్‌కు చెందిన యషార్ పార్టీ మధ్య ఆదివారం నాలుగు గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. చర్చలు మరోసారి కొనసాగించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఐసెన్‌కోట్‌కు చెందిన కూటమికి పార్లమెంట్‌లో 48 స్థానాలే ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 మంది సభ్యుల మద్దతు అవసరం. డిసెంబర్ 6లోగా మెజారిటీ నిరూపించాల్సిన పరిస్థితి ఉంది. అవసరమైతే మరో రెండు వారాల గడువు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానమంత్రి పదవిని ఇద్దరూ నిర్ణీత కాలం చొప్పున పంచుకునే రొటేషన్ విధానాన్ని ఆయన సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరబోనని ఐసెన్‌కోట్ ఇప్పటికే స్పష్టం చేశారు. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ కూడా నెతన్యాహు లేదా ఆయన కూటమితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇరాన్‌పై దాడి చేస్తే..
రాజకీయ చర్చలు ఇలా కొనసాగుతుండగానే ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించి ఇజ్రాయెల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దాడి చేస్తే అది విస్తృత ప్రాంతీయ యుద్ధానికి దారితీయవచ్చని ఇజ్రాయెల్ సైనిక నిఘా అధికారులు నెతన్యాహును హెచ్చరించినట్లు పలు కథనాలు వెల్లడించాయి. గత వారం నెతన్యాహు, ఉన్నత స్థాయి రక్షణ అధికారుల మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఈ హెచ్చరికలు చేసినట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ పేర్కొంది. ఇరాన్‌పై దాడి జరిగితే లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లోనూ యుద్ధ పరిస్థితులు తలెత్తవచ్చని సైనిక నిఘా విభాగం అంచనా వేసినట్లు సమాచారం. అయితే నెతన్యాహు, మొస్సాద్ చీఫ్ రోమన్ గోఫ్మన్ మాత్రం సైనిక చర్య మూడు నుంచి ఐదు రోజుల్లో ముగిసే పరిమిత ఆపరేషన్‌గా ఉండవచ్చని భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి?
ఇరాన్‌పై వీలైనంత త్వరగా దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి తెస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, సైనిక చర్య విషయంలో ఆయనకు సందేహాలు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇప్పటికే సాధ్యమయ్యే సైనిక ఆపరేషన్‌కు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి ఆమోదించినట్లు పలు కథనాలు నివేదించాయి. ట్రంప్ అనుమతి కోసం ఇరు దేశాల సైనిక వర్గాలు ఎదురుచూస్తున్నట్లు గుర్తుతెలియని సీనియర్ ఇజ్రాయెల్ సైనిక అధికారి వెల్లడించినట్టు సమాచారం. అంటే నెతన్యాహు ముందు ఇప్పుడు రెండు కీలక ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి.. ఇరాన్‌పై దాడికి వెళ్లి ప్రాంతీయ యుద్ధ ప్రమాదాన్ని ఎదుర్కోవాలా? రెండోది.. దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం ప్రత్యర్థులతో అధికారాన్ని పంచుకోవాలా?. ఈ రెండు పరిణామాలు ఇజ్రాయెల్ భవిష్యత్ రాజకీయాలు, పశ్చిమాసియా భద్రతపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి. 

ఇదీ చదవండి: చిప్‌ల స్మగ్లింగ్‌ సూత్రధారి లీ మింగ్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement