వాషింగ్టన్: హర్యానాకు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ (అసలు పేరు హిమాన్షు రిటోలియా)ను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అరెస్ట్ చేసింది. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా రిటోలి గ్రామానికి చెందిన 24 ఏళ్ల హిమాన్షు, టీనేజ్ వయసులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి 2020లో జువెనైల్ హోమ్ నుంచి పరారయ్యాడు.
ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో హత్యలు, హత్యాయత్నాలు, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అనేక తీవ్రమైన కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఇతనిపై, భారతీయ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు 2023 ఆగస్టులో ఇంటర్‌పోల్ 'రెడ్ నోటీస్' జారీ చేసింది. నీరజ్ బవానా గ్యాంగ్‌తో సంబంధాలున్న హిమాన్షు భౌ.. విదేశాల నుంచి తన నేర నెట్‌వర్క్‌ను నిర్వహిస్తూ, ఢిల్లీలోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్ హత్య, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసం బయట కాల్పులు, అయానగర్ హత్య వంటి హై-ప్రొఫైల్ కేసులకు కారణమయ్యాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ అరెస్టుతో పాటు మరో హర్యానా గ్యాంగ్‌స్టర్ నీరజ్ ఫరీద్‌పురియా కూడా లాస్ వెగాస్‌లో అరెస్టయినట్లు తెలుస్తున్నది.
ఇదీ చదవండి: వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్


