breaking news
Editorial
-
ఏఐ మనల్ని చింపాజీలను చేస్తుంది!
చాట్‌జీపీటీకి పోటీగా, 2023లో ‘ఎక్స్’ఏఐని స్థాపించిన ఎలాన్ మస్క్ తన ప్రధాన కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్లలో కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏఐ అభివృద్ధి, ఏఐ వినియోగాలలో అప్రమత్తంగా లేకపోతే... జీవపరిణామ క్రమంలో మనిషి తన తెలివి తేటల్లో చింపాజీలను మించిపోయినట్లే, కృత్రిమ మేధ పరిణామ కాలంలో ‘ఏఐ చింపాజీలు’ మనిషి మేధస్సును దాటి వెళ్లే ప్రమాదం ఉందని మస్క్ అంటున్నారు. ముఖ్యాంశాలు :2036 నాటికి డబ్బుతో పనుండదు!‘‘నేను ఇంకో ఊహ కూడా చెబుతున్నాను. 2036 నాటికి డబ్బుకు అసలు విలువ ఉండదు. లేదా, డబ్బు అవ సరం ఉండదు. మీకు డబ్బు ఎందుకు కావాలి? వస్తు వులు, సేవలు కొనడానికి. అంటే ఆహారం, ఇల్లు, రవాణా, వినోదం, వైద్యం కోసం. ఒకవేళ హ్యూమ నాయిడ్ రోబోలు (మనిషిలాంటి రోబోలు), ఏఐ కలిసి మనుషులు వాడేదాని కంటే చాలా ఎక్కువ వస్తువులను, సేవలను అందించగలిగితే, ఇక డబ్బుతో ఏం పని ఉంటుంది? మిషన్లే అన్నింటినీ దాదాపు రూపాయి ఖర్చు లేకుండా తయారు చేస్తున్నప్పుడు అవసరాల కొరత అనేది తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు వస్తు సేవలను పంపిణీ చేయటానికి డబ్బును ఒక సాధనంగా వాడే పద్ధతి పూర్తిగా పనికిరాకుండా పోతుంది. (ఉదా: 10 ఆపిల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 100 మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఆ 10 ఆపిల్స్ ఎవరు పొందుతారు? ఎవరి దగ్గర డబ్బు ఉంటే వారు. కానీ ఏఐ, రోబోల వల్ల 10,000 ఆపిల్స్ ఉత్పత్తి జరిగి అందరికీ, అవసరానికి సరిపడా ఉన్నప్పుడు డబ్బు లేనివాళ్లు కూడా వాటిని పొందగలుగుతారు.‘పరిమితి లేని’ ఆర్థిక వ్యవస్థ‘‘కేవలం డిజిటల్ రూపంలోనే కాకుండా రోబోల రూపంలో కూడా టెక్నాలజీ బయటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు, అంటే వందల మిలియన్ల హ్యూమనా యిడ్ రోబోలు పనిచేస్తున్నప్పుడు అవి సాఫ్ట్‌వేర్‌ను మార్చే తెలివితేటలు ప్రదర్శించి, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయటం ప్రారంభి స్తాయి. ఆర్థికశాస్త్రంలో ఉత్పత్తి అనేది ఎప్పుడూ మను షుల కష్టం, వారి పని సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ డిజిటల్ తెలివితేటలతో నడిచే కోట్లాది రోబోలు మనకు అందుబాటులోకి వస్తే, అది ఒక పరి మితి లేని ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుంది. మనం చూడ బోయే ఈ భారీ మార్పును పోల్చడానికి చరిత్రలో ఎటువంటి ఉదాహరణా లేదు. ఎందుకంటే పరిమితి లేని పనిశక్తిని తట్టుకునేలా మన పాత ఆర్థిక నమూనాలు తయారవ్వలేదు.ధరలు పూర్తిగా పడిపోతాయి!‘‘ప్రభుత్వాలు నేరుగా ప్రజలందరికీ ‘యూనివర్సల్ హై ఇన్కమ్’ (చాలా ఎక్కువ ఆదాయం) చెక్కులను ఇవ్వా లని నేను భావిస్తున్నాను. చాలామంది నన్ను అడుగు తుంటారు: ‘దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇష్టమొచ్చినట్లు నోట్లు ముద్రిస్తే తీవ్రమైన ద్రవ్యోల్బణం రాదా?’ అని. కానీ సాధారణంగా వస్తువులు తక్కువగా ఉండి, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడే ధరలు పెరుగుతాయి. కానీ ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. రోబోలు తయారుచేసే వస్తువుల ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఎంత భారీగా డబ్బులు ముద్రించినా, వస్తువుల ఉత్పత్తి అంతకంటే వేగంగా పెరుగుతుంది కాబట్టి ధరలు తగ్గడమే జరుగుతుంది.ఏఐతో ఊహకందని సమస్యలు‘‘మనకంటే ఎంతో తెలివైన డిజిటల్ సూపర్–ఇంటెలిజెన్స్‌ను నేను కానీ, లేదా ఏ మనిషి కానీ నియంత్రించగలరని అనుకోవడం మన భ్రమ అవుతుంది. పదేళ్లలో, కృత్రిమ మేధ (ఏఐ) మనుషులందరి ఉమ్మడి తెలివితేటలను దాటిపోతుంది. ప్రకృతిని ఒకసారి చూడండి. మనుషులకు, చింపాంజీలకు మధ్య ఉన్న తెలివితేటల తేడా కంటే, సూపర్–ఏఐకి, మనుషులకు మధ్య ఉన్న తేడా చాలా ఎక్కువై... చింపాంజీలే ప్రపంచాన్ని ఏలితే ఏలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మన ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఆ సూపర్–ఇంటెలి జెన్స్‌ను మనుషుల శ్రేయస్సుకు, పురోగతికి అనుకూలంగా పనిచేసేలా చూసుకోవడమే.రాజకీయాల్లో కాస్త హద్దు దాటాను! ‘‘నిజం చెప్పాలంటే నేను రాజకీయాల్లో కొంచెం ఎక్కువ జోక్యం చేసుకుని, కాస్త ముందుకు వెళ్లానని అనిపిస్తోంది. అధికారిక రాజకీయ పదవులు చేపట్టడం లేదా ‘డాడ్జ్’ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియె న్సీ)ని నిర్వహించడం కంటే, నేను స్పేస్ఎక్స్, టెస్లా, ఏఐ సంస్థలను అభివృద్ధి చేయటంపైనే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రభుత్వ పనులను సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా కాకుండా చూడడం, అవినీతి ఖర్చులను అరికట్టడమే నా ముఖ్యో ద్దేశం. కానీ రాజకీయ రంగం విషపూరితమైనది, అక్కడ నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అది చివరికి నా అసలు లక్ష్యం నుంచి నా దృష్టిని మళ్లించింది.- ఎడిటోరియల్ టీమ్ -
పాత ఒప్పందానికి పాతర
అనిశ్చిత ప్రపంచంలో మరో కొత్త రక్షణ ఒప్పందం ఉనికిలోకొచ్చింది. తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు గత శుక్రవారం ‘మక్కా రక్షణ ఒప్పందం’ పేరిట ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాయి. పూర్తి పాఠాన్ని బయటపెట్టలేదు గనుక దీని లోతుపాతులు తెలియవు. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ‘ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది అందరిపైనా జరిగిన దాడిగా పరిగణించాల’ని నిర్ణయించుకున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్ మాత్రం ‘ఈ ఒప్పందం కింద ఉమ్మడిగా రక్షణ పరిశ్రమ ప్రాజెక్టులు చేపట్టడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాలుపంచుకోవటం ఉంటాయ’ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఒప్పందం విషయంలో అమెరికాకు ఆగ్రహం కలుగుతుందని సౌదీ భావించినట్టుంది. అందుకే ‘ఈ మూడు దేశా లకూ ఇప్పటికే ఉన్న ఇతర రక్షణ ఒప్పందాలు దీనికి అడ్డురాబోవ’ని సౌదీ ఉపమంత్రి రేయాద్ క్రిమ్లీ వివరణనిచ్చారు. ఒప్పందంపై కొద్ది నెలలుగా సాగిన చర్చల్లో పాల్గొన్న ఈజిప్టు చివరన ముఖం చాటేసింది. ఇంతకూ ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో గతంలో కుదిరిన ‘మక్కా ఒప్పందం’ ఏమైంది?ఈ మూడు దేశాలకూ ఇరుగుపొరుగుతో వాటి వాటి సొంత ఘర్షణలున్నాయి. తమలో తమకున్న పొరపొచ్చాలు వీటికి అదనం. నాటోలో భాగస్వామిగా ఉన్న తుర్కియేకు ఎజియన్ సముద్రంలో మరో సభ్య దేశం గ్రీస్‌తో సరిహద్దు లడాయి వుంది. ఇజ్రాయెల్‌తో వైరం సరేసరి. పాకిస్తాన్ అయితే ఇటు మన దేశంతోపాటు అఫ్గానిస్తాన్‌తో కూడా కలహిస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడుల్ని సమర్థించటమేకాక... దాని అభీష్టం మేరకు ఇజ్రాయెల్‌తో అవగాహన కుదుర్చుకున్న చరిత్ర సౌదీది. పర్యవసానంగా ఇరాన్ నుంచీ, ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతుదార్లయిన హౌతీలనుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక 2018లో తుర్కియే గడ్డపై జర్నలిస్టు ఖషోగ్గిని కిరాయి హంతకులతో సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో రెండు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అమెరికా ప్రాపకంతో తెరవెనక సర్దుబాట్లు కుదిరినా తుర్కియే ఆగ్రహం చల్లారలేదు.ఇలా ఎవరికి వారు సక్రమంగా లేకుండా, ఎవరిపై దాడి జరిగినా అందరం ఏకమవు తామనటంలోని సహేతుకత ఏమిటో అర్థంకాదు. దేశంలో అమెరికా స్థావరాలుంటే భద్రతకు తిరుగులేదని ఇతర గల్ఫ్ దేశాలతోపాటు సౌదీ కూడా అమాయకంగా అనుకున్నది. అమెరికా వేరేవారిపై దాడి చేస్తే దాని అధునాతన రక్షణ వ్యవస్థవల్ల ఒక్క క్షిపణి కూడా తమ గడ్డపై పడబోదని నమ్మింది. అదంతా ఉత్త భ్రమగా తేలింది. ఇరాన్ వల్లకాడు కావటానికి తోడ్పడుతూ తమ జోలికి మాత్రం అది రాకూడదని కోరుకోవటం అత్యాశ అని అర్థమైంది. అందుకే రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని అందరినీ హడలెత్తించాలని ఆ దేశం నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. నిరుడు పాక్‌తో కుదిరిన రక్షణ ఒప్పందం తాజా యుద్ధంలో కొరగాకుండా పోయింది. ఇరాన్‌తో అంటకాగిన పాక్... కనీసం సౌదీపై అది చేసిన దాడుల్ని ఖండించటానికి కూడా సిద్ధపడలేదు. తీరు మారకపోతే ఈ త్రైపాక్షిక ఒప్పందానికీ అదే గతి పడుతుంది. ఇస్లామిక్ దేశాలు 2005లో ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. ఆ సంగతి ముగ్గురిలో ఎవరికైనా గుర్తుందా? పదేళ్లపాటు కొనసాగాల్సిన ఆ ఒప్పందాన్ని మరో పదేళ్లు పొడిగించారు కూడా. దాని అతీగతీ తెలియదు. 21వ శతాబ్దంలో ఇస్లాంకు ఎదురవుతున్న సవాళ్లపై జరిపిన సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఇస్లామిక్ ప్రపంచంలో సంయమనం, సౌభ్రాతృత్వం, మానవ హక్కులు, సుపరిపాలన, ఆర్థిక సహకారం, ఘర్షణల నివారణ, పేదరిక నిర్మూలన, ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతికతలు, మహిళల హక్కులు దాని ప్రధానాంశాలు. ఇందులో పాలస్తీనా కూడా ఉంది. వినడానికి భేషుగ్గా ఉంది. కానీ ఆచరణ? తాజా ఒప్పందంతో వాటన్నిటినీ పర్షియన్ గల్ఫ్‌లో నిండా ముంచినట్టేనా? ఇతరుల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ, వారినుంచి తమకేమీ కాకూడదని ఆశించటం వ్యర్థ ప్రయత్నమని ఈ దేశాలు గుర్తించాలి. ఇందుకు బదులు 2005 నాటి ఒప్పందం అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అప్పుడు మాత్రమే వాటికి కోరుకున్న శాంతి లభిస్తుంది. -
సోషల్ మీడియాపై రణభేరి!
సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రపంచ పరిణామాలన్నీ వెంటవెంటనే అందరికీ చేరుతున్నాయి. అవి భావవ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాదిమందికి గొంతునిస్తు న్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా, నిస్సహాయంగా వీక్షించినవారంతా నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కానీ మంచితోపాటే చెడు కూడా ఇందులో కలగలిసివుంది. వాటి కారణంగా అనవసర వదంతులు వ్యాపించి ఎందరో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశం వరకే తీసుకుంటే దొంగ లుగా ముద్రపడి కొన్నిచోట్ల, గోవుల్ని తరలిస్తున్నారని ఆరోపణలొచ్చి మరికొన్నిచోట్ల ఉన్మాద గుంపులు దాడులు చేసి హతమార్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. టీనేజర్లు, పిల్లల మనసుల్లో ఈ వేదికల దుష్ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. మానసిక ఒత్తిళ్లకూ, రుగ్మతలకూ అవి కారణమవుతున్నాయి. అమెరికా అప్పీళ్ల కోర్టులో మెటా, ఆల్ఫాబెట్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ తదితర సంస్థలపై సోమవారం 3,000కు పైగా పిటిషన్లు దాఖలు కావటాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. ‘పబ్లిక్ న్యూసెన్స్’ కింద దాదాపు 40 రాష్ట్రాలతోపాటు మున్సిపాలిటీలు, పాఠశాలలు, వ్యక్తులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి మొన్న మార్చిలోనే లాస్ ఏంజెలెస్‌కి చెందిన న్యాయస్థానం సామాజిక మాధ్యమ వేదికల్ని యువతకు హానికరమైన రీతిలో రూపొందించటాన్ని తప్పుబట్టింది. చిన్న వయసులో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లు తనను బానిసగా మార్చాయనీ, ఇందువల్ల తీవ్రంగా నష్టపోయాననీ ఆరోపిస్తూ కోర్టుకెక్కిన 20 యేళ్ల యువతికి 60 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆ న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యూమెక్సికోలో సైతం మెటాపై ఈ తరహా తీర్పే వెలువడింది. వేదికకు సంబంధించిన భద్రత విషయంలో వినియోగదారుల్ని అది తప్పుదోవ పట్టించిందని న్యాయస్థానం నిర్ధారించింది. 37.5 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని సంస్థను ఆదేశించింది. చాన్నాళ్లక్రితమే టీనేజర్లపైనా, పిల్లలపైనా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం ఎలా ఉన్నదో ప్రభుత్వాలు గుర్తించాయి. ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను టెక్ సంస్థలపైనే పెట్టింది. దీన్ని పాటించనట్టయితే దాదాపు 5 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా చెల్లించాలని చట్టం నిర్దేశించింది. బ్రిటన్, ఫ్రాన్స్ సైతం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) హానికర మైన పోస్టుల్ని తొలగించటంలో జాప్యం జరిగితే గ్లోబల్ టర్నోవర్‌లో 6 శాతం మొత్తాన్ని జరిమానా విధించే చట్టం తీసుకొచ్చింది.తెలిసో తెలియకో ఏదైనా వీడియో చూస్తే ఆ వెనువెంటనే అటువంటివే కుప్పలు తెప్పలుగా వచ్చిపడేలా ఆ మాధ్యమాలు అల్గారిథమ్‌లు రూపొందిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లల్ని వ్యామోహాల బారిన పడేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈ మాధ్యమాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము కేవలం ఒక వేదిక మాత్రమే కల్పిస్తున్నామనీ, అందులో వేరెవరో ఉంచే కంటెంట్‌కు తామెలా బాధ్యులమనీ ప్రశ్నిస్తున్నాయి. ఏటా వేలాదికోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే ఉద్దేశంతోనే ఈ సంస్థలు జుగుప్సాకర, హింసాత్మక అంశాలున్న వీడియోల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు భావప్రకటనా స్వేచ్ఛకు అనువైనవి. కానీ అవి దుర్వినియోగమైన పక్షంలో కఠినచర్యలుండాలి. మన దేశం ఈ విషయంలో వెనకబడే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, పాలకుల్ని కించపరిచేవిధంగానో పోస్టులున్నప్పుడే తక్షణ స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో ఆన్లైన్ చానెళ్లు నిర్వహిస్తున్న మహిళా పాత్రికేయులపై అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్టుచేసినందుకే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టుచేస్తున్న ప్రభుత్వం... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ, ఇతర నేతలనూ కించపరుస్తూ పోస్టులు పెట్టే టీడీపీ నేతలనూ, కార్యకర్తలనూ చూసీచూడనట్టు వదిలేస్తోంది. అందుకే అమెరికాలో మాదిరి మన దేశంలో కూడా మాధ్యమాల, ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని పెంచే చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి పెడధోరణులు ఆగుతాయి. -
జార్ఖండ్‌లో ‘జంతర్ మంతర్’
ఉన్నత చదువులకూ, ఉద్యోగాలకూ పోటీ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వాలు వాటిల్లో అవకతవకలు బయపడినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, విశ్వసనీయ సంస్థలతో దర్యాప్తు చేయించటానికి మొండికేయటం ఈమధ్య కనబడుతున్న వింత ధోరణి. సోమవారం జార్ఖండ్‌లోని రాంచీలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ‘అసెంబ్లీ ముట్టడి’ నిర్వహించినప్పుడు చానెళ్లలో కనబడిన దృశ్యాలు విస్తుగొలిపాయి. హఠాత్తుగా చూసినవారికి అది జంతర్ మంతరో, జార్ఖండో తెలియని స్థితి ఏర్పడింది. జార్ఖండ్‌లో జేఎంఎం నాయకత్వానగల పాలక కూటమిలో కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కానీ తమ డిమాండ్లు నెరవేరటం కోసం రాంచీలో యువత 16 రోజులుగా పోరాడాల్సి వస్తోంది. ఉద్యమకారుల డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. గత నెల 22న ఈ వ్యవహారంలో పదవి నుంచి తప్పుకొన్న జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) చైర్మన్ ఎల్. ఖియాంగ్టేను తాజాగా అరెస్టు చేశారు. కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించారు. కానీ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ అయిన సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది.నిరుద్యోగ యువతతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వాల స్పందనెలా ఉంటుందో జంతర్ మంతర్‌తోపాటు జార్ఖండ్ ఉద్యమం కూడా నిరూపించింది. సర్కారీ కొలువు లభించాలని యువతీయువకులు ఎంతగానో తపిస్తారు. అందుకోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి చదువుల్లో మునిగిపోతారు. శిక్షణ కోసం వేలకు వేలు వెచ్చిస్తారు. తీరా ప్రశ్నపత్రం లీకయిందంటే, అయోగ్యులు పైపైకి ఎగబాకారని తెలిస్తే... ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు చెప్పనలవికాని వేదనను అనుభవిస్తారు. వారి కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఒక పెద్ద కుంభకోణం బయటపడిన వెంటనే చిత్తశుద్ధిగల ప్రభుత్వమైతే సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయిస్తుంది. ఆ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్టు చేస్తుంది. పరీక్ష ఫలితాలను రద్దుచేస్తుంది. ఇందుకోసం యువత రోడ్డెక్కాల్సి వచ్చిందంటే పాలకులు సిగ్గుపడాలి. తప్పు జరిగిందని తెలిసినా జార్ఖండ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ను ఎందుకు తిరస్కరిస్తోంది? అదొక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై, వేలంపాటలపై సీబీఐతో దర్యాప్తు చేయించడానికి మొండికేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరసనలపై రౌడీ ఎమ్మెల్యేలతో దాడులు చేయిస్తోంది. ఈ వ్యవహారంలో విద్యామంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడటానికి జంకి, ప్రభుత్వాధికారుల్ని ముందుకు తోస్తున్నారు. మరోవైపు చర్చకు సిద్ధమని సవాళ్లు విసురుతున్నారు. సాక్షాత్తూ అభ్యర్థులే తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటే... ఇలా బీరాలు పోవడం ఆయన గారికి సిగ్గనిపించడం లేదు. కేంద్రంలో తమ కూటమి ఏలుబడే ఉన్నా, సీబీఐ దర్యాప్తు అనగానే ఏపీ సర్కారు నిలువెల్లా వణుకుతోంది. యువత ఉద్యమాల సందర్భంగా రాజకీయ పక్షాల ద్వంద్వవైఖరి తేటతెల్లం అయింది. జంతర్ మంతర్ ఆందోళనపై ముద్రలేసి, దాన్ని నీరుగార్చాలని చూసిన బీజేపీ చివరాఖరికి తన వైఖరిని మార్చుకుంది. కానీ జార్ఖండ్ ఆందోళనలో అది చురుగ్గా పాల్గొంటున్నది. ఢిల్లీ ఉద్యమంలో మౌనప్రేక్షకపాత్ర వహించి ఆఖరి దశలో మేల్కొన్న కాంగ్రెస్... జార్ఖండ్‌లో పాలక కూటమిలో ఉంటూ కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పలేకపోయింది. పైగా మీ డిమాండ్లేమిటో చెప్పండని పదిరోజులైనాక కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉద్యమకారుల్ని అడిగారు. ఏపీలో పాలక కూటమిలో ఉన్న బీజేపీ అక్కడి డీఎస్సీ నియా మకాల స్కామ్‌పై నోరెత్తదు. కానీ జార్ఖండ్‌లో మాత్రం నేనున్నానంటూ ముందు కొస్తుంది. ఇవన్నీ యువత గుర్తించరనుకోవటం ఆ పక్షాల తెలివితక్కువతనం. వెంటనే ప్రభుత్వాలు ఉన్నతస్థాయి దర్యాప్తునకు సిద్ధపడి లీకుల వెనకుండే మాఫియాలనూ, వారికి అండదండలందించే బడా నేతలనూ బయటకు లాగాలి. ఇతర వాగ్దానాల సంగ తలావుంచి కనీసం పరీక్షలైనా సక్రమంగా నిర్వహించలేకుంటే యువత క్షమించదు. -
అడాప్ట్ ఎ రైటర్
ఫ్యూచర్ సిటీలో కొత్త భూమిపూజ. అమరావతిలో అర్ధరాత్రిళ్లు లైట్ల వెలుతురు హడావిడి. పేపరు తెరిస్తే లక్షల కోట్ల పెట్టుబడుల హెడ్‌లైన్స్. పాలన అంటే నిర్మాణమూ లేదా కూల్చడమూ. కాని ఒక సమాజం ఎదిగిందనడానికి ఇటుకలూ కాంక్రీటు దిమ్మెలూ మెడెత్తి చూసే హార్మ్యాలూ తార్కాణాలు కాదు. ఒక గొప్ప కథ, నినాదం కాదగ్గ కవిత, జీవన దర్శనం చేయగల నవల, భాషను తోమి మెరిసేలా చేసే వచనం... ఇవీ నాగరికతకు ఆనవాళ్లు. మరి తెలుగులో అలాంటి ఆనవాళ్లుగా నిలిచే రచనలు ఎన్ని? ఏ కాలంలో అయినా అవి ఎందుకు కొన్ని? నిజమైన సృజనాత్మకతకు సెలవు రోజో, తీరిన సాయం సమయమో చాలదు. నాలుగు గదుల్లో కూచుని చేసే కృత్రిమ ఊహ పాఠకుడికి చీమిణ్ణి చూసిన ఏహ్యత కలిగిస్తుంది. ఆక్రమణకు గురయ్యే అభయారణ్యంలోని నెమలి క్రీంకారాన్ని వినిపించాలన్నా, సోలార్ పలకల దెబ్బకు దగా పడుతున్న పల్లె గుండెల నిట్టూర్పును చిత్రిక పట్టాలన్నా ఫీల్డ్కి వెళ్లాలి. చూడాలి. రోజుల తరబడి కలిసి బతకాలి. మనుషుల్ని తాకాలి. ఆ ఆలోచనల అస్థితిమితత్వంలో నుంచి వాక్యం పుట్టాలి. ఇవన్నీ చేయాలంటే రచయితకు పూర్తి సమయం అవసరం. కాని పొద్దున్నే బయోమెట్రిక్ పంచ్ కొట్టి, సాయంత్రపు ఖర్చుల బెంగతో ఉండే పొట్టకూటి ఉద్యోగైన రచయితకు ఆ తీరిక, ప్రశాంతత ఉండవు. ఆకలితో ఉన్న రచయిత రొట్టె గురించి రాస్తాడు సరే. కాని ఆదరువు ఉన్న రచయిత సమాజం మర్చిపోయిన ప్రశ్నలను, భయపడే నిజాలను, కలలు కనే భవిష్యత్తును రాస్తాడు. అలాంటి రచనలు రావాలన్నా, అలాంటి రచనల కోసం రచయితలు పూర్తి సమయం ఇవ్వాలన్నా సమాజం సరికొత్త తాత్త్విక భూమిక వైపు అడుగులు వేయాలి. అదే ‘రచయితను దత్తత తీసుకోవడం’. ‘అడాప్ట్ ఎ రైటర్’.ఈ ‘దత్తత’ కొత్తదేం కాదు. పూర్వం ‘రాజాశ్రయం’ ఉండేది. పోషకులు ఉండేవారు. నేటి ఆధునిక ప్రజాస్వామ్యంలో బాధ్యత గల కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద వ్యవస్థలు, సంపన్న కుటుంబాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో ఎప్పటి నుంచో ‘రైటర్–ఇన్– రెసిడెన్స్’ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రచయితలకు ఉచిత వసతితో పాటు భారీ స్టైపెండ్ ఇచ్చి నవలలు రాయడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాయి. నార్వే, స్వీడన్ తదితర దేశాలలో ప్రభుత్వాలే ప్రతిభావంతులైన రచయితలకు ‘గ్యారంటీడ్ మినిమం ఇన్ కమ్’ అందిస్తున్నాయి. మన దేశంలో కూడా ఒక కుటుంబం ఒక రచయితను దత్తత తీసుకోవచ్చు. ఒక సంస్థ ఒక సంవత్సరం చేయూత ఇవ్వవచ్చు. ఒక ప్రభుత్వం ‘ఆలోచించేవాడిని మేము గౌరవిస్తాం’ అనే స్పష్టమైన విధానాన్ని తేవచ్చు.అయితే ఇలాంటి ప్రతిపాదన వినగానే ఇటు సాహిత్య పరివారంలో, అటు లౌకిక ప్రపంచంలో కొందరి అవహేళనలు మొదలైపోతాయి. ‘కూర్చోబెట్టి మేపితే రచయితలు సోమరులుగా మారరా?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. దత్తత అనేది రచయితకు లభించే ఉచిత ‘విశ్రాంతి ప్యాకేజీ’ కాదు. అదొక పవిత్రమైన బాధ్యత. నిరూపించుకోవాల్సిన జవాబుదారీతనం. కేవలం దత్తత సొమ్మును అనుభవిస్తూ, ఒక్క పేజీ కూడా రాయకుండా కాలక్షేపం చేసే సోమరులకు దత్తతను రద్దు చేసే హక్కు సమాజానికి ఉంటుంది. ఇది విని ‘అబ్బే... వృథా’ అనేవారూ ఉంటారు. క్షణికానందాన్ని ఇచ్చే వినోదాలకు, ఆర్భాటపు డెస్టినేషన్ పెళ్లిళ్లకు, నాయకుల జన్మదినాలకు, ప్రభుత్వాల ప్రకటనలకు, సినిమాల్లో దిక్కుమాలిన గ్రాఫిక్స్‌కు కోట్లాది రూపాయలు వృథా అవుతున్న చోట రచయితలను రెండేళ్లో, ఐదేళ్లో అడాప్ట్ చేసుకొని ఇచ్చే వేల రూపాయల స్టైపెండ్ ఏ మూల? దాని గురించి మాట్లాడాల్సి రావడమే దురదృష్టం. ఒక రచయితను ఫుల్‌టైమ్ రచయితగా మార్చడానికై ఇచ్చే ఆర్థిక సౌలభ్యం దానం కాదు, భవిష్యత్తు మీద పెట్టుబడి. ఒక రచయిత బాగుంటే పది పుస్తకాలు వస్తాయి. ఆ పది పుస్తకాలు పది వేల మనసులను తాకుతాయి. ఆ పది వేల మనసులు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన సమాజాన్ని కడతాయి. ‘గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’ అన్నాడు దాశరథి. ధార్మికంగా చూసినా ఇది సరస్వతీ అర్చనే. రచయితను దత్తత తీసుకోండి. ఎందుకంటే రచయిత బతికితే సమాజంలో ఆలోచన బతికి ఉంటుంది. -
ప్రమాదంలో ఆదివాసీ భాషలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం ఆదివాసీల హక్కులు, అడవులు, జీవన విధానం గురించి మాట్లాడుతుంటాం. కానీ అత్యంత విలువైన వారి వారసత్వమైన మాతృభాష గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తాం. ఒక భాష కేవలం సంభాషణ సాధనం కాదు. అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జానపద విజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం, జీవన తత్వాన్ని మోసుకెళ్లే సజీవ సంపద. అందుకే ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో పాటు ఒక ప్రపంచ దృష్టికోణం కూడా శాశ్వతంగా కనుమరుగవుతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో నివసించే కోయల మాతృభాష అయిన ‘కోయతూర్’ నేడు సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ కోయతూర్లో మాట్లాడుతున్నప్పటికీ, కొత్త తరం విద్య, ఉపాధి, పట్టణీకరణ ప్రభావంతో తెలుగు, హిందీ లేదా ఆంగ్ల భాషల వైపు మొగ్గు చూపుతోంది. ఇంట్లోనే మాతృభాష వినిపించని పరిస్థితి ఏర్పడితే, ఆ భాషకు భవిష్యత్తు మరింత సంక్లిష్టమవుతుంది. ఇది కేవలం కోయ భాష సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అనేక ఆదివాసీ భాషలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యునెస్కో ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో భారతదేశానికి చెందిన అనేక భాషలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కుపియా, గదబ, కొలామి, నాయకి, తోటి భాషా రూపాలు, అలాగే అండమాన్ దీవులలోని గ్రేట్ అండమానీస్, ఓంజీ వంటివారి భాషలు కూడా మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతోంది.ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పట్టణాలకు వలసలు, మాతృభాషలో విద్య లేకపోవడం, ప్రభుత్వ వ్యవహారాల్లో స్థానిక భాషలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం ఆధిపత్య భాషలను ఎంచు కోవడం వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. భాషను కోల్పోవడం అనేది ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు; ప్రతి తరం కొద్దికొద్దిగా దూరమవుతూ చివ రకు ఆ భాష మాట్లాడేవారు లేకుండా పోతారు. ‘‘మాకు వీలై నంతలో భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్ప పూవుతో చాక్లెట్లు, లడ్డూలు చేస్తున్నాం. ఈ ఉత్పత్తులకు ‘పుంగార’ అనే పేరు పెట్టాము. పుంగార్ అంటే మా కోయ భాషలో పువ్వు అని అర్థం’’ అని చెప్పారు భద్రాచలంకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళ సమ్మక్క.ఆదివాసీ పిల్లలకు మంచి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంత అవసరమో, అంతే అవసరం వారిలో మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించడం. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ వాటిని నేర్చుకునే క్రమంలో వారి భాషను మరచిపోవడం మాత్రం ఒక సాంస్కృతిక నష్టంగా మిగిలిపోతుంది.ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాష ఆధారిత ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వారి భాషలో పాఠ్యపుస్తకాలు, నిఘంటువులు, డిజిటల్ కంటెంట్ రూపొందించడం, భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించడం, జానపద గేయాలు, కథలు, సామెతలను డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి చర్యలు చేపట్టాలి.2020లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దివ్య దేవరాజన్ అక్కడి గోండుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఒక ట్యూటర్ని నియమించుకొని గోండు భాషను నేర్చుకున్నారు. ఆదివాసీ గూడేల్లో వారి అరుగుల మీద కూర్చొని వారి భాషలోనే ఆమె మాట్లాడుతున్నప్పుడు వారంతా వారి కష్టాలన్నీ ధైర్యంగా చెప్పుకునేవారు. దివ్య లాంటి అధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. భాషను కాపాడటం అంటే ఒక భాషను మాత్రమే కాదు, ఒక జాతి చరిత్రను, ప్రకృతితో ముడిపడిన జీవన తత్వాన్ని, వేల ఏళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే. భాష బతికితేనే జాతి బతుకుతుంది.– శ్యాం మోహన్, ఆదివాసీ జీవనంపై అధ్యయనం చేస్తున్న జర్నలిస్ట్ (నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
‘డిజిటల్’ భారం సరికాదు!
ప్రారంభమై పదేళ్లు గడిచాక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సాగే డిజిటల్ లావాదేవీలకు వడ్డింపు మొదలుకాబోతోంది. లోక్‌సభలో గురువారం గందర గోళం నెలకొన్నప్పుడు, ఎలాంటి చర్చా లేకుండా ఇందుకు సంబంధించిన బిల్లుఆమోదం పొందిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. తక్షణమే వర్తించకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా యూపీఐ లావాదేవీలపై రుసుము వసూలు చేసేందుకు ఈ బిల్లు అధికారమిస్తోంది. ఫీజంటూ వసూలు చేస్తే రూ. 2,000కు మించిన లావాదేవీలపై, అది కూడా వార్షిక టర్నోవర్ కోటిన్నర మించే వ్యాపారులకే వర్తిస్తుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. విధించబోయే ఫీజు కూడా ఒక్కో లావాదేవీకి 0.25 శాతం లేదా 0.5 శాతం ఉండొచ్చన్నది మరో మాట. సాధారణ యూపీఐ వినియోగదారులు సాగించే లావాదేవీలన్నీ ఎప్పటిలా యధాతథంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని విశ్వసించలేం. ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉన్నప్పుడు ఆ చట్టానికి ముందూ మునుపూ సవరణలు రాబోవని చెప్పలేం. ఆ సంగతలావుంచి తమపై రుద్దే ఈ చార్జీల్ని వ్యాపారులు వినియోగదారుకే బదిలీ చేస్తారు. ఆ అవకాశం లేకుండా తగిన నియంత్రణలు విధిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగలదా?దేశంలో ఆర్థిక సంస్కరణల ఆగమనంతోపాటే పాలకులు కొత్త రాగం అందు కున్నారు. ప్రభుత్వాలు పాలించాలి తప్ప వ్యాపారం చేయడమేమిటన్నదే దాని సారాంశం. ఆ వంకన లక్షలాదిమంది సిబ్బంది పనిచేసే దిగ్గజ పబ్లిక్ రంగ సంస్థలు అనేకం కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు గర్వకారణంగా నిలిచి, ఆసియాలోనే అతిపెద్దదైన నిజాం షుగర్స్ కాస్తా ఆనాటి సీఎం చంద్రబాబు పుణ్యమా అని మూతబడింది. కోట్లాది రూపాయల విలువైన దాని ఆస్తుల్ని కారుచవగ్గా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. నిజాం షుగర్స్ మాదిరిగా మరెన్నో పబ్లిక్ రంగసంస్థలకు తాళాలుపడ్డాయి. వ్యాపారమంటే వదులుకున్నాయిగానీ... ప్రభుత్వాలకు వ్యాపార దృక్పథం పోలేదని యూపీఐ లావాదేవీలపై ఫీజు వసూలు ఆలోచన నిరూపిస్తోంది. యూపీఐ, రూపే వంటివి ఉచిత సేవలు అందించటంవల్ల తమవీసా, మాస్టర్‌కార్డ్ వగైరా ప్లాట్‌ఫాంలు ఎదగటంలేదన్న అమెరికా ఆక్రోశమే తాజా నిర్ణయానికి కారణమని కొందరి ఆరోపణ. బ్రెజిల్‌పై సైతం అమెరికా ఈ మాదిరి ఒత్తిడే తెచ్చినా అది అంగీకరించలేదని కూడా చెబుతున్నారు. వాటి నిజానిజాల సంగతలావుంచి, ప్రభుత్వం చెప్పే కారణాలు మాత్రం ఎప్పటినుంచో వింటున్నవే. యూపీఐ వ్యవస్థ నిర్వహణ తడిసిమోపెడు భారమవుతున్నదని బ్యాంకులూ, పేమెంట్ ప్రాసెసర్లూ గగ్గోలు పెడుతుండటంవల్ల ఇది తప్పడం లేదట! లావాదేవీల నిర్వహణ భారంలోకొంతమేర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దాంతోపాటు ఈ లావాదేవీలు పెరిగాకబ్యాంకులు తమ సిబ్బందిని తగ్గించుకోలేదా? ఆమేరకు వాటి ఖర్చు తగ్గలేదా? అదీగాక గత దశాబ్దకాలంలో బ్యాంకింగ్ సేవల చార్జీలు, కనీస మొత్తం ఖాతాలో లేదన్న కారణంతో వసూలు చేసే పెనాల్టీ, పరిమితికి మించిన లావాదేవీలపై చార్జీలు, ఎస్ఎంఎస్సందేశాలకని, డెబిట్ కార్డు నిర్వహణ వ్యయమని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ చాలకనా ఈ కొత్త ఆలోచనలు! ఈ పదేళ్లలో డిజిటల్ లావాదేవీలు అపారంగా పెరిగాయి. అయినా ఈ పెరుగుదల తగినంతగా లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వగైరాలు వినియోగిస్తున్నవారు వాటిని బ్యాంకింగ్ సేవలుగా చూడటం లేదు... ఆ యాప్‌లను పర్స్‌గా పరిగణించి లావాదేవీలు జరుపుకొంటున్నారు. అలవాటు చేసినట్టే చేసి,దాన్నుంచి కూడా ఆదాయం పొందాలనుకోవటం సరికాదు. ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగదారుల సంఖ్య 50 కోట్లని చెబుతున్నారు. అయితే ఒక వినియోగదారు సగటున చేసే లావాదేవీలు చూస్తే ప్రపంచ స్థాయికన్నా తక్కువే. అలాగే లావాదేవీల్లో 86 శాతం రూ.500, అంతకన్నా తక్కువ మొత్తాలేనని అంటారు. మొదట్లో ఉన్నంత వృద్ధి ఇటీవలి సంవత్సరాల్లో కనబడటం లేదని కూడా అంటున్నారు. ఇదంతా ఏం చెబుతోంది? ఎంతో వెసులుబాటుగా, ఉపయోగకరంగా ఉన్న ఈ లావాదేవీలు మరింత విస్తరించాల్సిన తరుణంలో వాటిని నిరుత్సాహపరిచేలా, జనం మళ్లీ నగదు వైపు మొగ్గేలా చేయటం వింతకాదా? ప్రభుత్వం ఆలోచించాలి. -
సంసిద్ధతే వృద్ధాప్యానికి దీర్ఘాయువు
మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) ‘ఏజ్ల్యాబ్’ డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ కాఫ్లిన్... వృద్ధాప్యం, దీర్ఘాయువు గురించి ఉన్న అపోహలను పటాపంచలు చేశారు. ఎవరి సహాయమూ లేకుండా స్వతంత్రంగా జీవించడమే అసలైన దీర్ఘాయువు అని అంటున్నారు. మీ దగ్గర ఎంతుందన్నది ముఖ్యం కాదు!వయస్సు పైబడుతున్నప్పుడు డబ్బు ఆదా చేయడం, ఆర్థిక ప్రణాళికలు వేసుకోవటం పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కానీ మనం ఉండే నివాస స్థలాన్ని బట్టి కూడా సగటు జీవితకాలంలో 9 నుండి 13 సంవత్సరాల తేడా వస్తుంది. నడవడానికి అనుకూలమైన రోడ్లు, నమ్మకమైన రవాణా సదుపాయాలు, తాజా ఆహారం, మంచి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటమే మీరు ఎంతకాలం, ఎంత ఆరోగ్యంగా జీవిస్తారో నిర్ణయిస్తాయి తప్ప మీ దగ్గర ఉన్న ‘పొదుపు మొత్తం’ కాదు. ఒకవేళ మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఏకాకిగా మార్చితే, మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ మీ శారీరక, మానసిక ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది.తరాలుగా మనకు నేర్పించలేదు!జీవితాన్ని నేను 8,000 రోజుల చొప్పున నాలుగు భాగాలుగా చూస్తాను. 0 నుండి 21 సంవత్సరాలు (నేర్చుకునే దశ); 21 నుండి 46 (కెరీర్, కుటుంబం); 46 నుండి 65 (మధ్యవయసులో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం); 65 నుండి 85 పైన (చివరి దశ). ఈ చివరి దశ అనేది పూర్తి అదనపు 8,000 రోజుల ఒక కొత్త అంకం. కేవలం విహారయాత్రలకు వెళ్లడం, లేదా ఖాళీ గదికి రంగులు వేసుకోవడం లాంటి చిన్న చిన్న పనులు మిమ్మల్ని రెండు దశాబ్దాల పాటు ఉత్సా హంగా ఉంచలేవు. జీవితంలో ఈ కొత్త అధ్యాయం కోసం మీకు ఒక పక్కా ప్రణాళిక అవసరం. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా ఎలా ఉండాలో నేర్పించ డానికి సమాజం తరతరాలుగా సమయాన్ని వెచ్చించింది. కానీ ఆ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో నేర్పించడానికి మాత్రం దాదాపు సున్నా సమయాన్ని కేటాయించింది.వేసవి రాత్రి ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే?ఫైనాన్షియల్ ప్లానర్లు మీరు వైద్య ఖర్చులను భరించ గలరా అని అడుగుతారు; కానీ నేను చాలా సరళంగా అనిపించే ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వేడి వేసవి రాత్రి మీకు ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే, మీరు దాన్ని ఎలా వెళ్లి తెచ్చుకుంటారు? ఉదాహరణకు 50 ఏళ్లు పైబడిన అమె రికన్లలో 70 శాతం కంటే ఎక్కువ మంది నగర శివారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లే శక్తిని పూర్తిగా కోల్పోవడమే. నిజమైన స్వేచ్ఛ అంటే కేవలం జీవించి ఉండటం కాదు; వేరొకరిని లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేకుండా, మీకు అనిపించిన వెంటనే చిన్న చిన్న ఆనందాలను పొంద గలిగే రవాణా సౌకర్యాలు ఉండటం. ఒక చిన్న ప్రయాణం కోసం మీరు కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చినా, లేదా బిజీగా ఉండే మీ పిల్లలపై పూర్తిగా ఆధారపడాల్సి వచ్చినా... మీరు ఇప్పటికే మీ స్వేచ్ఛను పోగొట్టుకున్నట్లే.ఒంటరి హాబీలతో విసుగెత్తిపోతుంది!రిటైర్మెంట్ తర్వాత గార్డెనింగ్ చేస్తాననీ లేదా గోల్ఫ్ ఆడతాననీ పరిచయస్తులు తరచూ నాతో చెబుతుంటారు. కానీ మానవ సంబంధాలు లేకుండా ఒంటరిగా కల్పించుకునే హాబీలు త్వరగా విసుగు తెప్పిస్తాయని కోవిడ్–19 లాక్డౌన్లు నిరూపించాయి. మీకు కేవలం ఆర్థిక ప్రణాళికలు ఉంటే సరిపోదు. ఒక మామూలు మంగళవారం ఉదయం 10:30 గంటలకు మిమ్మల్ని కలిసి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉండే మనుషులతో కూడిన ఒక యాక్టివ్ ‘సామాజిక పోర్ట్‌ఫోలియో’ కూడా మీకు అవసరం. మీరు ఉద్యోగానికి దూరమైనప్పుడు, ప్రతిరోజూ లభించే సాధారణ సామాజిక సంబంధా లను, ఒక దినచర్యను కోల్పోతారు. మీరు వేర్వేరు తరాల ప్రజలతో ఉద్దేశపూర్వకంగా సంబంధాలను పెంచుకోకపోతే; మీకు నలుగురితో సంభాషణలు, సామాజిక భాగస్వామ్యం లేకపోతే, అత్యంత అవస రమైన సమయంలోనే మీ సామాజిక ప్రపంచం కుంచించుకుపోయి ఉంటుంది.- ఎడిటోరియల్ టీమ్ -
హసీనా అప్పగింత సాధ్యమా?
రెండేళ్ల క్రితం ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థి ఉద్యమాన్ని అదుపుచేయటం అసాధ్యమని తేలాక హెలికాప్టర్లో అక్కడినుంచి నిష్క్రమించి భారత్‌లో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సరిగ్గా ఆ తేదీనే ఎంచుకుని తొలిసారి బుధవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే డిసెంబర్లో స్వదేశానికి వెళ్లబోతున్నానని గతంలో చెప్పిన మాటనే పునరుద్ఘాటించారు. తనను జైల్లో బంధిస్తారని తెలిసినా, ఉరికంబం తన కోసం ఎదురు చూస్తున్నదని అర్థమైనా తిరిగి వెళ్లటానికే ఆమె సంసిద్ధులవుతున్నారు. దేశానికి సారథ్యంవహించే నాయకత్వానికి పరిణతి లోపిస్తే కక్ష సాధింపులే సమర్థతగా అనిపిస్తాయి.సాధించిన స్వాతంత్య్రం అర్థరహితమవుతుంది. ఇది బంగ్లాదేశ్ ప్రస్తుత నాయకత్వానికి మాత్రమే కాదు... హసీనాతోసహా బంగ్లా మాజీ పాలకులందరికీ వర్తిస్తుంది. ఆ మాట కొస్తే పాకిస్తాన్ పరిస్థితి కూడా మొదటినుంచీ ఇంతే. అదృష్టవశాత్తూ మన దేశంలో స్వాతంత్య్రోద్యమ నాయకత్వం నుంచి తొలి తరం సారథులు రావటంవల్ల కావొచ్చు...ఆ బెడద లేదు. ఇక్కడ సైతం ఆ పోకడలు తలెత్తుతూనే ఉన్నా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో తనకెదురైన దుఃస్థితికి హసీనా తనను తానే నిందించుకోవాలి. ప్రజలు మెచ్చి అధికారం కట్టబెట్టాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. జీడీపీ పెరిగింది. అంతక్రితంతో పోలిస్తే ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. కానీ ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవటానికి ఆమె వేసిన ఎత్తుగడలు అవధులు మీరాయి. వస్తున్న మెజారిటీ చాలదనుకుని ఎన్నికల ఫలితాలు ఏమార్చారు. చివరకు మొత్తం ఎన్నికలే రిగ్గింగ్ చేసే స్థాయికి దిగజారారు. మతోన్మాద శక్తుల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకున్నా, సహేతుకమైన అసమ్మతికి సైతం ముద్రలేసి పబ్బం గడుపుకోవాలనుకున్నారు. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అధినేత బేగం ఖలీదా జియాను అవినీతి ఆరోపణలతో దీర్ఘకాలం చెరసాలపాలు చేశారు. ఖలీదా సైతం అంతే. తాను రాజ్యమేలిన మూడు దఫాలూ కక్షసాధింపు రాజకీయాల్లోనే మునిగితేలారు. ఆమె కుమారుడు, ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆ వారసత్వాన్నే కొనసాగించదల్చుకున్నట్టు కనబడుతోంది. హసీనా సర్కార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి లెక్కలే చెబుతున్నాయి. నిజమే కావొచ్చు. జరిగిన తప్పిదాలకు ఆమె బాధ్యత వహించాల్సిందే. కానీ న్యాయవ్యవస్థను మహ్మద్ యూనస్ సలహాదారుగా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. మతతత్వవాదులు రెచ్చిపోయి హసీనా ఏలుబడిలోని న్యాయమూర్తుల్ని వేధించి రాజీనామాలు చేయించారు. ఉన్నతాధికారుల్ని అరెస్టు చేశారు. హిందూ మైనారిటీల ఇళ్లపై దాడులకు దిగారు. ఇలాంటి వాతావరణంలో జరిగిన విచారణకు విశ్వసనీయత ఉంటుందా?హసీనాను అప్పగించటంలేదన్న ఆగ్రహం బంగ్లాకు ఉంది. ఇదేమీ అసహజం కాదు. కానీ అధికారంలోకొచ్చాక భారత్‌ను రెచ్చగొట్టేలా తారిఖ్ రెహ్మాన్ చర్యలుంటున్నాయి. జూన్‌లో చైనాలో నాలుగు రోజులు పర్యటించి, 17 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ‘2+2 డైలాగ్’ పేరిట విదేశాంగ విధానాన్నీ, భద్రతనూ నిర్ణీత వ్యవధిలో చర్చించుకుంటూ ఉండాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. అమెరికాతో ఆయన సాన్నిహిత్యం తెలియందేమీ కాదు. బంగ్లాలో అలజడుల వెనక అమెరికా పాత్ర జగద్విదితం. ఇదిగాక భారత్‌కు సన్నిహితమైతే విపక్షమైన జమాతే ఇస్లామీ బలపడుతుందేమోనన్న భయంతో రెహ్మాన్ మనవైపు కన్నెత్తి చూడటానికే సాహసించటం లేదు. ఇలాంటి స్థితిలో హసీనాను భారత్ అప్పగిస్తుందని ఆ దేశం అనుకోవటం హాస్యాస్పదం. అందరి మాదిరే మన దేశం ఎటూ స్వీయప్రయోజనాలు చూసుకుంటుంది. దౌత్యరంగంలో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. బంగ్లా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, ఇంటా బయటా భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే అత్యుత్సాహాన్ని ఆపుకుంటే ఏ సమస్య అయినా తప్పక పరిష్కారమవుతుంది. అంతకన్నా ముందు హసీనా కుమారుడు ఈ మీడియా సదస్సులో ఆరోపించినట్టు బంగ్లా మరో పాకిస్తాన్‌గా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెహ్మాన్కుంది. -
చందమామకు గాయం
అనుకున్నట్టే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడివడి అదుపుతప్పిన భాగం బుధవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 నిమిషాలకు చంద మామను ఢీకొట్టింది. రాకెట్‌లోని అడుగుభాగం లోగడే సురక్షితంగా భూమ్మీదకు తిరి గొచ్చింది. అయిదంతస్తుల నిడివుండే రెండో భాగం మాత్రం దారితప్పింది. వాస్తవానికి ఇది కూడా పునర్వినియోగానికి వీలుగా రూపొందిందే. కానీ సరైన సమయంలో నియంత్రించకపోవటంవల్ల అది కాస్తా దారితప్పి చంద్రుడి కక్ష్యలోకి పోయింది. అంతరిక్షంలో మేం సైతం ఉన్నామని చెప్పుకోవటానికి అనేక దేశాలు పోటీపడి అంతరిక్ష నౌకలనూ, ఉపగ్రహాలనూ భూ కక్ష్యలో ప్రవేశపెడుతున్నాయి. అందువల్ల వాతావరణ పరిస్థితులు మొదలుకొని శాస్త్ర, సాంకేతిక, సైనిక రంగాల్లో ప్రగతి సాధించగలుగుతున్నాయి. కానీ ఈ ప్రయోగాల క్రమంలో అనుకోకుండా సంభవించగల ప్రమాదాలేమిటో చెప్పటానికి అదుపు తప్పిన ఫాల్కన్ 9 రాకెట్ విడి భాగమే తార్కాణం. నిరుడు జనవరిలో జరిపిన ఈ ప్రయోగం ఇది మినహా అన్నివిధాలా విజయవంతమైంది. అది గత 18 నెలలుగా భూమితోపాటు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తికి లోనవుతూ, సౌరశక్తిని గ్రహిస్తూ సాగుతోంది. ఇది ఇలా క్రమేపీ వేగం పుంజుకుంటూ చంద్రుణ్ణి ఢీకొడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఢీకొడుతుందో, ఏమేరకు దాని ప్రభావం ఉంటుందో కూడా అంచనా వేశారు. జరిగింది ప్రమాదమే అయినా... దాని గమనం గురించి శాస్త్రవేత్తలు వేసిన లెక్కలన్నీ కచ్చితత్వంతో ఉన్నాయని తేలింది. వేలాది సంవత్సరాలపాటు భూకక్ష్య విశాలంగా, శూన్యంగా ఉండిపోయింది. 1957లో అప్పటి సోవియెట్ నుంచి తొలిసారి నాలుగు రేడియో ఏంటెన్నాలున్న ఒక లోహపు బంతి పెనువేగంతో దూసుకెళ్లి భూకక్ష్యను చేరింది. అది అంతరిక్ష యుగానికి పడిన మొట్టమొదటి అడుగు. భూమ్మీద ఏం జరుగుతున్నదో తెలుసుకోవటానికి విప్పారిన తొలి అంతరిక్ష నేత్రం. మరో నాలుగైదేళ్లలో గుప్పెడు ఉపగ్రహాలు చకచకా అటువైపు కదిలి వెళ్లాయి. 70వ దశకం చివరికల్లా అవి 14,000కు చేరుకున్నాయి. 90ల చివరికి మరిన్ని ఉపగ్రహాలు పయనమయ్యాయి. అప్పటికల్లా వాటి సంఖ్య దాదాపు 20,000. ఇప్పుడిక ప్రైవేటు రంగం కూడా అంతరిక్షంవైపు చూడటం మొదలుపెట్టింది. ఇంకేం... వాటి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. పైగా గతంలో ఒక స్కూల్ బస్ సైజుకు మించని ఉపగ్రహాలు పంపే సంప్రదాయం ఉండగా... స్పేస్ ఎక్స్ మెగా బహుళ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ఒరవడికి 2019లో శ్రీకారం చుట్టింది. తాజాగా 32,000 ఉపగ్రహాలు పెనువేగంతో సంచరిస్తున్నాయి. అదుపుతప్పి పడిపోయిన వాటిని మినహాయించగా తేలిన లెక్క ఇది. ఈ దశాబ్దం ముగిసేసరికి మొత్తం ఉపగ్రహాల సంఖ్య 60,000కు చేరుతుందని అంచనా. పాత ఉపగ్రహాల తాలూకు శకలాలు కావొచ్చు... విడివడిన రాకెట్ల తాలూకు తునకలు కావొచ్చు... ఉపగ్రహాల శకలాలు కావొచ్చు... పెను వేగంతో చక్కర్లు కొడుతున్నాయి. అవి దాదాపు 13 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఇది మనుషులకూ ముప్పు తెస్తుందని కొందరు నిపుణులంటున్న మాట.మాజీ అంతరిక్ష యాత్రికుడు స్టీవ్ రాబిన్సన్ పలుమార్లు అంతరిక్ష యాత్రలు చేశాడు. ప్రతిసారీ తమ నౌకను ఏదో ఒక శకలం ఢీకొడుతూనే ఉండేదని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. గత నవంబర్‌లో చైనా అంతరిక్ష నౌకను ఆ దేశానికే చెందిన మరో ఉపగ్రహం తాలూకు శకలం ఢీకొట్టడంతో అది కాస్తా పనికిరాకుండా పోయింది. వ్యోమ గాముల్ని వెనక్కు తీసుకురావడానికి మరో నౌక పంపాల్సివచ్చింది. ఇలాంటి ప్రమాదాలపై 1972లోనే అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. పరిహారం ఎలా నిర్ణయించాలన్నది కూడా ఉంది. కానీ నిర్దిష్టంగా ఫలానా శకలంవల్లే ప్రమాదం జరిగిందని గుర్తించటం కష్టం. అందుకే లక్ష్యం పూర్తయ్యాక భూవాతావరణంలో పునఃప్రవేశించినప్పుడు వాటంతటవే ముగిసిపోయే ‘డిజైన్ ఫర్ డిమైజ్’ విధానంలో ఉపగ్రహాలు రూపొందుతున్నాయి. వీటితోపాటు నిర్దేశిత సముద్ర ప్రాంతాల్లో సురక్షితంగా కూల్చి వేసేలా ఆన్‌బోర్డ్ చోదనవ్యవస్థలూ వినియోగిస్తున్నారు. ఏదేమైనా ప్రపంచ దేశాలన్నీ అంతరిక్ష వ్యర్థాలపై దృష్టి పెట్టడం మంచిది. వాటి తొలగింపునకు లక్ష్యం నిర్దేశించుకుని పరిపూర్తి చేసుకోవటం ఉత్తమం. -
‘సహజీవన’ హింస నేరమే!
సహజీవన బంధాల్లో క్రూరత్వాన్ని ఎదుర్కొనే మహిళలకు ఊరటనిచ్చేలా గృహహింస చట్టం పరిధిని విస్తరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం వెలువరించిన తీర్పు మహిళలకు ఊరటనిస్తుంది. యుక్త వయసు వచ్చిన జంట పరస్పర అంగీకారంతో వివాహ వ్యవస్థ వెలుపల కూడా సహజీవనం సాగించవచ్చంటూ గతంలో న్యాయస్థానాలు పలు సందర్భాల్లో తెలిపాయి. అయినా ఇలాంటి బంధాలు తరచు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కొన్ని రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరు కేసుల్లో ఈ బంధాల్లోని నైతికతను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వివాహ బంధాల్లో ఉండే రక్షణలు సహజీవన బంధాల్లో ఉండబోవని హితోక్తులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వివాహ స్వభావం కలిగిన’ సహజీవన బంధంలో ఉండే భాగస్వామి నుంచి మహిళ హింసను ఎదుర్కొంటే ఐపీసీ సెక్షన్ 498ఏ(బీఎన్ఎస్ సెక్షన్లు 85, 86) కింద కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. పరస్పర అవగాహన ద్వారా ఒక జంట సహజీవనం చేస్తున్నప్పుడు ఆమెను హింసించే పరిస్థితులు తలెత్తినప్పుడు చట్టం ఆమెకు రక్షణగా నిలబడాలి. ఇప్పుడు తాజా తీర్పువల్ల అలాంటి మహిళలకు భద్రత ఉంటుంది. నాలుగు దశాబ్దాల క్రితం చట్టం ఇంత స్పష్టంగా లేదు. అసలు మన చట్టాల్లో సహజీవన సంబంధాలకు ఎప్పుడూ చోటులేదు. కానీ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం తొలిసారి ‘వివాహ స్వభావం’ కలిగిన సంబంధంలో ఉన్న మహిళ సమస్యలు ఎదుర్కొంటున్న పక్షంలో ఆమెను బాధిత పక్షంగా గుర్తించింది. ఆడ, మగ ఒకే ఇంట్లో కలిసివుంటూ జీవితభాగస్వాములన్న అభిప్రాయం సమాజంలో కలిగిస్తే, వారు పెళ్లీడుకొచ్చివుంటే, తగినంతకాలం శారీరక సంబంధంలో కొనసాగుతూవుంటే ఆ బంధాన్ని ‘వివాహ స్వభావం’గల బంధంగా గుర్తించవచ్చని సుప్రీంకోర్టు 2011లోనే ఒక కేసులో చెప్పింది. వారాంతాల్లో కలిసివున్నప్పుడు ఇది వర్తించబోదని తెలిపింది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పు పెళ్లికానంత మాత్రాన ఒక బంధంలో కొనసాగే పురుషుడు మహిళను హింసిస్తుంటే 498ఏ వర్తించబోదనటం సరికాదని వివరించింది. చట్టంలోని ‘భర్త’ అనే పదాన్ని మరీ సంకుచితంగా తీసుకుని యాంత్రికంగా వర్తింపజేసి బాధిత మహిళకు న్యాయం చేయకపోవటం సరికాదని ధర్మాసనం చెప్పడం గమనించదగింది. లాంఛనంగా పెళ్లి ధ్రువీకరణ పత్రం లేనంతమాత్రాన ఆ బంధంలోని వివాహ స్వభావాన్ని గుర్తించకపోవటం, అక్కడ జరిగే హింసను విస్మరించటం సమాజ పురోగతికి తోడ్పడబోదని కూడా తెలిపింది. ఇద్దరు వ్యక్తులు సహజీవన బంధంలోకి వెళ్లి, వారి మధ్య తలెత్తే విభేదాలు మహిళను హింసించటానికి దారితీస్తే దాన్ని నేరంగా పరిగణించకపోవటం ఎలా చూసినా సరికాదు. సహజీవనంలోవుండే మహిళకు గృహహింస చట్టంకింద ఉన్న రక్షణలు సరిపోతాయనీ, అందువల్ల 498ఏ పరిధిని విస్తరించటం అనవసరమనీ ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వాదించినా ధర్మాసనం దీన్ని దృష్టిలో ఉంచుకునే తోసిపుచ్చింది. గృహహింస చట్టం కేవలం మనోవర్తి, పరిహారం, ఇంట్లో కొనసాగే హక్కువంటి సివిల్ ఉపశమనాలు మాత్రమే ఇస్తున్నదని... ఆ నేరానికి తగిన శిక్ష ఉండొద్దా అని న్యాయమూర్తులు ప్రశ్నించటం గమనార్హం. ప్రస్తుత కేసులో మహిళ తాను వివాహానికి సిద్ధపడే ఈ సహజీవన బంధంలోకి ప్రవేశించాననీ, కానీ అప్పటికే అతగాడికి పెళ్లయిన విషయాన్ని దాచాడనీ తెలిపింది. సుప్రీంకోర్టు ఈ కేసులోని నిజానిజాల్లోకి పోకుండానే మహిâ¶ క్రూరత్వాన్ని చవిచూస్తుంటే 498ఏ వర్తించితీరాలని తెలిపింది.చట్టాలు చేసే సందర్భాల్లో పార్లమెంటు అవగాహనకు రాని విషయాలు, అప్పటికి అలాంటి పరిస్థితులు లేని సందర్భాలు అనంతర కాలంలో తలెత్తవచ్చు. అంతమాత్రాన సమాజంలో వచ్చిన మార్పుల్ని పరిగణనలోకి తీసుకోకుండా యాంత్రికంగా అన్వయించటంతో సరిపెడితే బాధితులకు ఎప్పటికీ న్యాయం దక్కదు. అయితే సహజీవనానికి సంబంధించి నిర్దిష్టమైన చట్టం లేకపోవటం వల్ల ఇలాంటి బంధాల్లో ఏర్పడే సమస్యల విషయంలో వచ్చే కేసుల్ని న్యాయస్థానాలు పదే పదే విచారించి తేల్చవలసి వస్తున్నది. కనుక వర్తమాన సామాజిక స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ మాదిరి చట్టం అవసరాన్ని ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
‘వలస భూతం’ ఎవరి సృష్టి?
యూరప్‌ను వలస భూతం ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఆ బెడద గురించి అత్యవసరంగా చర్చించేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) మంగళవారం సమావేశం కాబోతోంది. గతవారం స్పెయిన్ అధీనంలోని స్యూటా నగరానికి ఒక్కసారిగా పొరుగునున్న మొరాకో నుంచి శరణార్థులు వెల్లువెత్తడంతో ఆ దేశం దిక్కుతోచని స్థితికి చేరింది. 60,000 మంది వచ్చిపడితే అదుపు చేయటమెలాగో స్పెయిన్‌కు అర్థం కాలేదు. స్పెయిన్ దళాల కాల్పుల్లో 72 మంది శరణార్థులు మరణించారు. ప్రస్తుతానికి ఇది ఉపశమించిందని స్పెయిన్ చెబుతున్నా స్వదేశంలోని మితవాదపక్షంతోపాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి చెందిన అతి మితవాద పక్షం స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ను తప్పుబడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్పెయిన్‌ని నిందిస్తున్నారు. వలసలపై ఆఫ్రికా ఖండ దేశాలను తప్పుబట్టి ప్రయోజనం లేదు. అక్కడి ఆర్థిక వ్యవస్థలు అంతంతమాత్రం కావటం వాస్తవం. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవటమూ నిజమే. శతాబ్దాల తరబడి అక్కడి సంపదనంతా కొల్లగొట్టిన యూరప్ దేశాలే ఈ దుఃస్థితికి కారణం. అందుకు సిగ్గుపడకపోగా... తాము కష్టపడి సంపద పోగేస్తుంటే ఈ వలసలు తలనొప్పిగా మారాయని వాపోతున్నాయి. కానీ శరణార్థులవి పొట్టకూటి తిప్పలు మాత్రమే. వారు యూరప్ దేశాల్ని దోచుకుతినడానికి రావడంలేదు. నిరుడంతా జెన్ జీ ఉద్యమం మొరాకోను ఊపిరాడనీయకుండా చేసింది. అక్కడ నిరుద్యోగం మాత్రమే సమస్య కాదు. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నవారికి సైతం 12 గంటలు శ్రమించినా దక్కేది స్వల్పం. పెరుగుతున్న ధరలకూ, వచ్చే వేతనానికీ మధ్య అగాథాన్ని పూడ్చలేక అర్ధాకలితో బతకడం అక్కడివారికి నిత్య నరకం. అసలు ఆఫ్రికా ఖండంలోని స్యూటా, మెలిల్లా నగరాలతో మధ్యధరా సముద్రం ఆవలనున్న స్పెయిన్‌కు ఏం సంబంధం? అవి భౌగోళికంగా మొరాకోకు చేర్చివుంటాయి. స్పెయిన్ భూభాగంనుంచి జిబ్రాల్టర్ జలసంధి గుండా వెళ్తే స్యూటా 14 కిలోమీటర్ల దూరం. మెలిల్లా నగరమైతే ఏకంగా 150 కిలోమీటర్ల ఆవల ఉంటుంది. ఎప్పుడో 1497లో మెలిల్లానూ, 1668లో స్యూటానూ స్పెయిన్ ఆక్రమించుకుంది. 1956లో మొరాకో స్వాతంత్య్రం పొందినప్పుడు న్యాయంగా అయితే ఆ రెండింటినీ స్పెయిన్ అప్పగించితీరాలి. కానీ ఆధునిక మొరాకో ఏర్పడటానికి వందల సంవత్సరాలక్రితం తమ చేతికొచ్చాయి గనుక, దీన్ని ఆక్రమణగా చూడొద్దని స్పెయిన్ తర్కానికి దిగింది.ఐక్యరాజ్యసమితి 2014లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వలస సంస్థ (ఐఓఎం) కనబడకుండాపోయిన శరణార్థుల డేటా సేకరిస్తోంది. మధ్యధరా సముద్రం దాటూతూ ఇంతవరకూ 33,220 మంది అదృశ్యమయ్యారని ఆ డేటా చెబుతోంది. కానీ ఇది సమగ్రం కాదని ఆ సంస్థే అంటోంది. వాస్తవానికి మధ్యధరా సముద్ర దక్షిణ తీరానికి చేరేముందు అత్యంత కంటకప్రాయమైన సహారా ఎడారిలోనే అనేకులు తనువులు చాలిస్తారు. సముద్రాన్ని దాటే క్రమంలో సంభవించే మరణాలతో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువని ఐఓఎం అంటున్నది. కాలినడకన మూడు రోజులు పట్టే ఆ మార్గంలో మృత్యు ఇసుక తుపాన్లు విరుచుకుపడకపోతే, స్మగ్లర్లు కాల్చిచంపకపోతే మధ్యధరా తీరానికి శరణార్థులు చేరుకోగలుగుతారు. ఆ తర్వాత సైతం రాకాసి అలలనుంచీ, సరిహద్దు దళాలనుంచీ ప్రాణగండమే. ఒక డేటా ప్రకారం 2024 నాటికి శరణార్థులు 30 కోట్ల 40 లక్షలు. వీరందరికీ ఒక దేశాన్ని సృష్టిస్తే అది భారత్, చైనా, అమెరికాల తర్వాత అతి పెద్ద జనాభాగల దేశమవుతుంది. ప్రపంచబ్యాంకు లెక్కలు తిరగేస్తే వీరు తమ కుటుంబాలకు పంపే సొమ్ము 2024 నాటికి 90,500 కోట్ల డాలర్లు! 2014లో అమెరికా, చైనా, జపాన్ల ఉమ్మడి విదేశీ పెట్టుబడులకన్నా అధికం. కనుక శరణార్థుల్ని శత్రువులుగా... ‘దరిద్రగొట్టు’ ఆఫ్రికా దేశాలవల్ల కలిగే అనర్థంగా ఈయూ పరిగణించటం మానుకోవాలి. నిత్యం మృత్యుగీతం వినిపించే ఉక్రెయిన్ యుద్ధం కోసం పారబోసే కోట్లాది డాలర్లలో కొంత శాతమైనా ఆఫ్రికా దేశాల ఆర్థిక ప్రగతికి వెచ్చించగలిగితే అవి ఊపిరిపీల్చుకోవటంతో పాటు తమ గత పాపాలు శాపాలై వెంటాడకుండా ఉంటాయని గుర్తించాలి. ఈయూ అత్యవసర సమావేశం చర్చించాల్సింది దీనిపై! -
కలత పక్షులు
మనిషికీ, పక్షికీ, ఆమాటకొస్తే అన్ని ఇతర జీవులకూ మధ్య పరిమాణంలో, రూపంలో, శక్తియుక్తుల్లో పైకి కనిపించే తేడాలే తప్ప మనుగడతో ముడిపడిన మౌలికమైన తేడాలు లేవు. పక్షులనే తీసుకుంటే, మనిషి గుడిసె కట్టుకుంటే అవి గూడు కట్టుకుంటాయి; మనిషిలానే ఆహారాన్ని వెతుక్కుంటాయి, సంతానాన్ని కంటాయి, కంటికి రెప్పలా వాటిని కాపాడుకోవాలనుకుంటాయి. ఇతరేతర మైన తేడాలకు అతీతంగా ప్రతిజీవీ తన అస్తిత్వాన్ని నిలుపుకోడానికీ, తన పరంపరను కొనసాగించుకోడానికీ ప్రకృతి సమదృష్టితో చేసిన ఏర్పాటు అది. అందుకు ఏ జీవికి ఎంత తెలివి కావాలో అంత తెలివీ ప్రకృతి వాటికిచ్చింది. ఇందులో జీవవైవిధ్యమే తప్ప ఎక్కువ తక్కువలు లేవు. ఉదాహరణకు, మనిషి పక్షిలా ఎగరలేడు, కండబలంలో పెద్ద పులితో, సింహంతో పోటీ పడలేడు; అలాగే, మనిషి చేయగలిన పనులను అనేకమైన ఇతర జీవులూ చేయలేవు. కానీ, తెలివి వికటించిన మనిషి వివేకపు హద్దులు దాటి తనకు ఉనికినిచ్చిన ప్రకృతినే సవాలు చేస్తున్నాడు; ప్రకృతి ప్రణాళికలోనే వేలుపెడుతున్నాడు; తన స్థాయి మరచిప్రకృతిపైనే పైచేయిని చాటుతున్నాడు! దాని పర్యవసానాలు తన మనుగడకే ముప్పు తెస్తాయనే స్పృహ లేకుండా తన తెలివికి తనే తలకొరివి పెట్టుకుంటున్నాడు! ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదకొండు వేల వలస పక్షుల రకాల్లో సగం అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. మన దేశంలో స్థానికంగా ఉన్న ఇతర పక్షుల కన్నా, ఆర్కిటిక్ వంటి సుదూర ప్రాంతాలనుంచి ఎగిరొచ్చే వలస పక్షులుమరింత త్వరితగతిన క్షీణిస్తున్నాయి. దశాబ్దాలుగా పర్యావరణానికి జరుగుతున్న హానినలా ఉంచి, వలస పక్షుల గురించి తగిన అవగాహన లేమినీ, ఇతర కారణాలనూ ఈ అధ్యయనం దండగుచ్చింది. వలస పక్షులు ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణలో; క్రిమికీటక జనాభా నియంత్రణలో; విత్తనాలు వెదజల్లీ, పరాగ సంపర్కం ద్వారా మొక్కల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణ భిన్నత్వం ఉన్న వేర్వేరు ఖండాలలో సైతం ఆహార వ్యవస్థ దెబ్బతినకుండా సాయపడుతున్నాయి. అటువంటిది, సొంత మనుగడకే ముప్పు ముంచుకొస్తున్న పరిస్థితిలో వలస పక్షులు కలత పక్షులవుతున్నాయి. ప్రమాద స్థాయిని అంచనా వేయడానికి మనం దూరదూరాలకు ఎగిరి వెళ్ళనవసరం లేదు. మన నట్టింట ఉన్న కొల్లేరు సరసువైపు దృష్టి సారిస్తే చాలు. వలస పక్షుల శీతకాలపు విడిదిగా, మత్స్యసంపద నిండిన మంచినీటి కొలనుగా ప్రపంచ ప్రసిద్ధినొందిన కొల్లేటి సరస్సుపై ఉత్తరాసియా, సైబీరియా, తూర్పు యూరప్లనుంచి కొంగలు, బాతులు, నేల నెమళ్ళు పెద్దసంఖ్యలో వచ్చి వాలతాయి. క్రమంగా సరస్సు పరిధిలో చేపలు, రొయ్యల చెరువులు విస్తరించడం, రసాయనిక వ్యర్థాలు కలిసి నీరు కలుషితం కావడం, పూడిక పేరుకు పోవడం, ప్రకృతిసిద్ధమైన ఇతర కారణాలూ నీటి నాణ్యతనూ, పరిమాణాన్ని దెబ్బతీసి మత్స్యసంపదను హరించడంతో అతిథి పక్షులకు ఆహారమూ, ఆశ్రయమూ కరువవు తున్నాయి. వాటి సంఖ్యపై అది దుష్ప్రభావం చూపుతోంది. చెట్టూ చేమనే కాక, పక్షీ పామునూ కూడా పూజించి సహజీవనం చేసిన చరిత్ర మనిషిది. రెక్కబలమే ఇంధనంగా దిక్కులు ముడివేస్తూ వేలమైళ్ళ దూరాన్ని అవలీలగా తరించే పక్షిని తనకన్నా మిన్నగా గౌరవించిన ఘనతా అతనిది. వేటగాడు క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని చంపి ఆడపక్షికి కలిగించిన శోకమే శ్లోకమై ఆదికావ్యమైన రామాయణమైంది. సీతనెత్తుకెడుతున్న రావణునితో పోరాడి గాయపడి, తనకా సమా చారమందించి కన్నుమూసిన జటాయువుపట్ల కృతజ్ఞతతో రాముడే స్వయంగా దానికి అంత్యక్రియలు జరిపిన అపురూప ఘట్టమూ రామాయణంలో ఉంది. భారతీయ వాఙ్మయంలో పక్షి భాగం కాని ఇతిహాస కావ్యాలే లేవు. భారతీయ దేవీదేవతల చేతుల్నే కాదు, గ్రీకు సహా ఇతర దేవతల హస్తాలనూ అలంకరించిన మహద్వైభవం పక్షిది. అటువంటిది, ప్రకృతిమార్గం విడిచి పెడమార్గం పట్టిన మనిషి, ఒకప్పటి తన ముంజేతి ముద్దులపక్షి మనుగడకే ముప్పుగా మారడం దారుణం. అలా తన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకునే దిశగా పడుతున్న అడుగును ఎప్పటికి వెనక్కి తీసుకుంటాడో! సకల జీవులతో ఒకప్పటి తన చెలిమినీ, కూరిమినీ ఎప్పటికి పునరుద్ధించుకుంటాడో!! -
ఏఐ కంటే 'హెచ్ఐ ఎందుకు ప్రత్యేకం'?
మీరు కేవలం ఒక కాలేజీ నుంచి పట్టా పొందడం కాదు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్యమంలో భాగమై బయటకు అడుగుపెడుతున్నారు. ఇప్పుడు నేను ఈ రోజుల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన రెండు అక్షరాలు పలకబోతున్నాను: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). 2026లో అత్యంత వివాదాస్పదమైన అంశం జాతి, లింగం లేదా వలస పాలన కాదు. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అవుతుందని ఎవరు ఊహించారు? కానీ నేను నిజానికి ఏఐ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను మాట్లాడాలనుకుంటున్నది హెచ్ఐ (హ్యుమన్ ఇంటెలిజెన్స్– మానవ మేధస్సు) గురించి. కృత్రిమ మేధ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. దాని శక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఏఐ శక్తి ఎంత పెరిగినా, మనుషులు అవసరం లేనివారిగా మారిపోరు.మనిషి మాత్రమే చేయగలిగేది?ప్రతి తరం ప్రపంచాన్ని మార్చేసే కొత్త సాంకేతిక విప్లవా లను చూసింది. ముద్రణ యంత్రం వచ్చింది. ఆవిరి యంత్రం వచ్చింది. విద్యుత్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తే... మరోవైపు భయాన్ని కూడా కలిగించింది. ఇప్పుడు వాటన్నింటికంటే పెద్ద మార్పును తీసుకొస్తున్న సాంకేతికతగా ఏఐ మన ముందుకు వచ్చింది. ఇది వ్యాసాలు రాయగలదు. సంగీతాన్ని సృష్టించగలదు. వ్యాధు లను గుర్తించగలదు. క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించ గలదు. వీడియోలను రూపొందించగలదు. మనుషుల్లా మాట్లాడగలదు. అందుకే చాలామంది ఒక ప్రశ్న అడుగు తున్నారు: ‘ఇక మనుషులకు మిగిలేది ఏమిటి?’ కానీ బహుశా ఇది తప్పు ప్రశ్న కావచ్చు. అసలు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే... ఏఐ రావడం వల్ల మనుషుల ప్రత్యేకత ఏమిటో మనకు ఏం అర్థమవుతోంది? మనిషిగా ఉండటం అంటే ఏమిటి? మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి? అనే విషయాన్నిమరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు లభించింది. మనుషులు మాత్రమే చేయగలిగే, యంత్రాలు ఎప్పటికీ చేయలేనివి ఏమిటి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మన భవిష్యత్తుకు ఎంతో విలువైనది. ముందుగా మనిషి మెదడు గురించి ఆలోచించండి. అది నిజంగా ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. మనిషి మెదడు బరువు సుమారు ఒకటిన్నర కిలోలే. అది పనిచేయడానికి కేవలం ఇరవై వాట్ల శక్తి సరిపోతుంది. అయితే ప్రపంచంలోని అత్యాధునిక ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వాలంటే, కోట్లాది వాట్ల విద్యుత్‌ను వినియోగించే భారీ డేటా సెంటర్లు అవసరం. ఆ విద్యుత్‌తో మొత్తం ఒక నగరాన్నే నడప వచ్చు. అదే సమయంలో మీ తలలో ఉన్న మెదడు ఒక ల్యాప్‌టాప్ ఛార్జర్ కంటే తక్కువ శక్తితో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు మసక వెలుతురులో కూడా ఒక ముఖాన్ని వెంటనే గుర్తుపట్టగలడు. గొంతులోని భావాన్ని అర్థం చేసుకోగలడు. వ్యంగ్యం, సందిగ్ధత, ఆప్యాయత, సిగ్గు, ప్రేమ, హాస్యం, బాధ వంటి భావాలను మనం చాలా సహజంగా అర్థం చేసుకుంటాం. ఒక గదిలోకి వెళ్లగానే అక్కడి వాతావరణాన్ని గ్రహిస్తాం. నిశ్శబ్దంలో కూడా ఉద్రిక్తతను గుర్తిస్తాం. చిరునవ్వు లోని కృత్రిమతను కూడా కనిపెట్టగలుగుతాం. యంత్రాలు విశ్లే షణలో గొప్పవే. కానీ మనుషులు కేవలం విశ్లేషణ చేసే జీవులు కాదు. మనం ఇతర మనుషులతో కలిసి జీవించే సామాజిక జీవులం. ఒక యంత్రం బాధతో కూడిన కవిత రాయగలదు. కానీ అది అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకోలేదు. ప్రేమలేఖ రాయగలదు. కానీ ప్రేమలో పడలేదు. భయం గురించి వివరించగలదు. కానీ అర్ధరాత్రి మేల్కొని తన జీవితాన్ని వృథా చేసుకున్నానేమో అని ఆందోళన చెందలేదు. ఇదే మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అసంపూర్ణతే అందంజపాన్ లో ‘వాబి–సాబి’ అనే గొప్ప తత్వం ఉంది. అది అసంపూర్ణతను కీర్తిస్తుంది. అక్కడ చేతితో తయారైన మట్టి పాత్రలు కొద్దిగా వంకరగా ఉండొచ్చు. రంగు సమానంగా లేకపోవచ్చు. అయినా వాటికే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందు కంటే, వాటిలో ఒక మనిషి స్పర్శ కనిపిస్తుంది. కొన్నిసార్లు విరిగిపోయిన పాత్రలను బంగారు మిశ్రమంతో అతికిస్తారు. దానిని ‘కింట్సుగి‘ అంటారు. ఆ పగుళ్లను దాచిపెట్టరు. వాటినే అందంగా చూపిస్తారు.ఎందుకంటే, ఆ పగుళ్లు కూడా ఆ పాత్ర జీవితంలో ఒక భాగమే. మనిషి జీవితమూ అంతే. మన గాయాలు, మన వైఫల్యాలు, వాటి నుంచి కోలుకున్న తీరు... ఇవే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. యంత్రాలు వేలాది దుస్తు లను ఒకే విధంగా తయారు చేయగలవు. అయినా ప్రపంచంలో అత్యంత ఖరీదైన దుస్తులు ఇప్పటికీ చేతితో కుట్టినవే. ఎందుకంటే, వాటిలో యంత్రాల పరిపూర్ణత కాదు, మనిషి నైపుణ్యం కనిపిస్తుంది. మనుషులు ఎప్పుడూ పరిపూర్ణతనే వెతకరు. చాలాసార్లు నిజాయితీని వెతుకుతారు. ఆత్మను వెతుకుతారు. ఏఐ యుగంలో అసలు ప్రమాదం యంత్రాలు మనుషుల్లా మారడంలో లేదు. మనుషులే యంత్రాల్లా మారాలని ప్రయ త్నించడంలో ఉంది. ఇప్పటికే మనం దానిని చూస్తున్నాం. ప్రతి విషయాన్నీ ‘ఆప్టిమైజ్‘ చేయాలని ప్రయత్నిస్తున్నాం. నిద్ర, ఉత్పాదకత, పరిచయాలు, పనితీరు. ప్రతి దాన్నీ సంఖ్యలతో కొలవాలనుకుంటున్నాం. విద్యార్థులు తమ జీవితాన్ని ఒక పరి పూర్ణ బయోడేటాగా మార్చుకోవాలని ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగులు అలసట తెలియని అల్గారిథమ్‌లతో తమను తాము పోల్చుకుంటూ భయపడుతున్నారు. కానీ మానవ జీవితం పరిపూర్ణత వల్ల కాదు. మానవత్వం వల్ల గొప్పదవుతుంది. మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసే వారు ఎప్పుడూ అత్యంత సమర్థులే కావాల్సిన అవసరం లేదు. వారు అత్యంత మానవత్వం కలిగినవారు. మీపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ఒక ఉపాధ్యాయుడు, బాధలో మీతో పాటుగంటల తరబడి కూర్చున్న ఒక స్నేహితుడు, మీ కోసం ఎన్నో సంవత్సరాలు త్యాగాలు చేసిన తల్లిదండ్రులు, ప్రాణాలకు ముప్పు వచ్చినా తన ఆశయాన్ని వదలని ఒక సామాజిక కార్యకర్త... ఇలాంటి వారే మన జీవితాలను మార్చుతారు. ఏఐతో లోపం లేని ఒక అద్భుతమైన సంగీతాన్ని రూపొందించవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంగీత కృతుల్లో ఒకటైన తొమ్మిదో సింఫనీని బీథోవెన్ దాదాపు పూర్తిగా చెవిటి వాడైన తర్వాత స్వరపరిచాడు. ఆ సంగీతాన్ని విన్నప్పుడు మనల్ని కదిలించేది కేవలం స్వరాల అందం కాదు. తాను ఎప్పటికీ వినలేని సంగీతాన్ని సృష్టించాలనే ఒక మనిషి సంకల్పం, అతని బాధ, అతని పట్టుదల. అందుకే మానవ మేధస్సు ఎంతో విలువైనది. దానిలో చైతన్యం ఉంది. భావో ద్వేగాలు ఉన్నాయి. జీవిత అనుభవాలు ఉన్నాయి. మానవత్వమే ముఖ్యంఏఐ వైద్యం, విజ్ఞానం, విద్య, రవాణా, పరిశ్రమలు దాదాపు ప్రతి రంగాన్నీ మార్చబోతోంది. కొన్ని ఉద్యోగాలు మారిపోతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. పూర్తి పరిశ్రమలే రూపాంతరం చెందుతాయి. కానీ ఈ మార్పులన్నింటి మధ్య కూడా, మనుషులు కోరుకునేది మాత్రం మనుషులనే. తమ పిల్లలకు బోధించడానికి, అనారోగ్యంలో ధైర్యం చెప్పడానికి, సంక్షోభ సమయంలో నాయకత్వం వహించడానికి, మనిషి జీవితాన్ని ప్రతిబింబించే కళను సృష్టించడానికి... ఇంకా ముఖ్యంగా... ఒకరికి ఒకరు విలువైన వారిగా ఉండడానికి మనుషులే అవసరం. మానవ జీవితం సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.నా కోరిక ఒక్కటే. మీరు ఏఐతో పోటీ పడకండి. దాని బలాలను అనుకరించకండి. దానికి బదులుగా మరింత మంచి మనుషులుగా మారండి. నైపుణ్యాన్ని మాత్రమే కాదు, వివేకాన్ని పెంచుకోండి. సమాజంతో కలిసి జీవించడం నేర్చుకోండి. నమ్మకాన్ని సంపాదించడం నేర్చుకోండి. క్షమించడం నేర్చుకోండి. మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే... చివరికి మనం అత్యంత విలువైనదిగా భావించేది, లోపాలు లేని తెలివితేటలను కాదు. లోపాలున్నా ప్రేమించగల మానవత్వాన్ని. అవును... వ్యాధులను నయం చేయడానికి, విజ్ఞానాన్ని విస్తరించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఉత్పాదక తను పెంచడానికి... ఇప్పటివరకు అసాధ్యంగా భావించిన సమ స్యలను పరిష్కరించడానికి... ఏఐని తప్పకుండా ఉపయోగించండి. అదే సమయంలో... మనిషి మెదడు ఎంత అద్భుతమో ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఏఐని ఉపయోగించండి. -
మళ్లీ కావేరీ వివాదం
ఎంతో సున్నితమైన నదీజలాల సమస్యను ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా వదిలేయటంవల్ల అది కాస్తా మరింత జటిలమవుతోంది. రాష్ట్రాలమధ్యా, రాష్ట్రాల్లో ప్రాంతాలమధ్యా తరచు తలెత్తుతున్న జలవివాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఎప్పటిలాగే కర్ణాటక, తమిళనాడుల మధ్య తాజాగా కావేరీ నదీజలాల పంపకం విషయంలో చిచ్చు రేగింది. రోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) కర్ణాటకకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు తాజా వివాదానికి మూలం. ఈ విషయంలో ఏం చేయాలన్న అంశంపై ఈ ఆదివారం కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ సమస్యపై అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించింది. కన్నడ సంఘాలు వచ్చే 13న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో చర్చించేందుకు తమ రాష్ట్రానికి సోమవారం రావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ను ‘ప్రస్తుత పరిస్థితుల రీత్యా’ వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభ్యర్థించారు.రాజ్యాంగంలోని 262వ అధికరణం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు రాజుకున్నప్పుడూ, ఫిర్యాదులొచ్చినప్పుడూ వాటి పరిష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చింది. దీని ఆధారంగానే కేంద్రం 1956లో నదీజలాల వివాదాల చట్టాన్ని, నదీజలాల బోర్డు చట్టాన్ని తీసుకొచ్చింది. బోర్డు అయితే ఏర్పాటు కాలేదుగానీ... నదీ వివాదాల చట్టంకింద అయిదు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. చిత్రమేమంటే ప్రజా ప్రభు త్వాలు లేని కాలంలోనే... అంటే బ్రిటిష్ వలసపాలకుల హయాంలోనే నదీజలాల ఒప్పందాలు కుదిరాయి. 1924లో అప్పటి మైసూర్ సంస్థానం, మద్రాస్ ప్రెసిడెన్సీలమధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మైసూర్ కృష్ణరాజ సాగర్ డ్యామ్‌నూ, మద్రాస్ మెట్టూర్ డ్యామ్‌నూ నిర్మించుకోవటానికి అవగాహన కుదిరింది. అప్పట్లో కావేరీ జలాల్లో దాదాపు 75 శాతం వాటా మద్రాస్ ప్రెసిడెన్సీకే కేటాయించారు. ఈ ఒప్పందం కాలపరిమితి యాభైయ్యేళ్ల అనంతరం 1974లో ముగిసిపోగా అప్పటికే కర్ణాటకలో నదీజలాల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే భావన బలంగా నాటుకుంది. ఎగువభాగంలో ఉండటం కారణంగా కర్ణాటక తమ నీటి అవసరాలకు తగ్గట్టు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టింది. వర్షాలు సమృద్ధిగా పడినంతకాలం నదీ జలాల వివాదాలు వచ్చే అవకాశం లేదు. రుతుపవనాలు విఫలమై వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, కరవు కాటేసినా ఘర్షణలు బయల్దేరతాయి. కావేరీ బేసిన్‌లోని ఆనకట్టలు నిండనప్పుడు తాము బెంగళూరు నగరానికీ, రైతులకూ అవసరమైన నీరు వినియోగించుకోవటంలో తప్పేమిటన్నది కర్ణాటక ప్రశ్న. ఇటు తమవైపు పంటలన్నీ ఎండిపోతున్నాయనీ, న్యాయంగా తమ వాటా నీరు విడుదల చేయాలనీ తమిళనాడు అంటున్నది. అసలే ఈ ఏడాది ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో వర్షాలు సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వివాదాలు తలెత్తుతాయి. పుదుచ్చేరి కూడా ఈ కావేరీ జలాల వివాదంలో ఉంటుంది. పడమటి కనుమల్లో పుట్టి గోవా దగ్గర అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి విషయంలోనూ కర్ణాటక, గోవాల మధ్య ఇలాంటి వివాదాలే తలెత్తుతుంటాయి. ప్రపంచ పునరుత్పాదక జలవనరుల్లో మన దేశం వాటా కేవలం 4 శాతం మాత్రమే. కనుక నీటి కోసం పోటీ తప్పదు. సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలిక పరిష్కారంతో ప్రయత్నించి, గండం గడించిందనుకోవటం తప్ప శాశ్వత పరిష్కార దిశగా ఎవరూ ఆలోచించటం లేదు. ఘర్షణ పడే రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దా మనుకోవటం లేదు. విపక్షాలనుంచి ఒత్తిళ్లు తప్పవు మరి. నదుల్లో నీరు నిండుకున్న ప్పుడు నీరందక పంటలు ఎండిపోతాయి. దృఢంగా పోరాడి ఆ నష్టాన్ని తగ్గించుకోవటంపైనే వివాదం తలెత్తిన రాష్ట్రాల రైతులు దృష్టి పెడతారు. కావేరీ వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారమయ్యే దిశగా రెండు రాష్ట్రాలూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఇప్పుడిప్పుడే వరుణుడు కరుణిస్తున్న దాఖలా కనబడుతోంది. కనుక ఈ వివాదం త్వరలో సమసిపోతుందని ఆశించాలి. -
ఈసారి ‘ఆల్ఫా’ వంతు!
జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ తరం సృష్టించిన పెను సంచలనం గురించి అందరూ ఇంకా చర్చించుకుంటుండగానే... తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆల్ఫా తరం కూడా తరగతి గదుల్లోంచి బయటికొచ్చింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్లతో పాటు మహారాష్ట్రలో సైతం పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీలవంటి కనీస సదుపాయాలు కల్పించాలనీ, అన్ని పాఠ్యాంశాలకూ టీచర్లను నియమించా లనీ కోరుతూ సాగుతున్న ధర్నాల వెనక కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సాధించిన విజయాల స్ఫూర్తి ఉన్నదని తెలుస్తూనే ఉంది. పాలకుల్ని నిలదీసిన జెన్ జీ తరాన్ని చూసి అసహ్యించుకున్న ఎంపీ కంగనా రనౌత్ లాంటివారు ఈ ఆల్ఫా తరానికి ఎలాంటి శాపనార్థాలు పెడతారో చూడాల్సివుంది. బిహార్‌లోని గయ జిల్లాలో విద్యార్థులు అతి పెద్ద ధర్నా నిర్వహించడమే కాదు... తమ డిమాండ్లు తెలుసుకోవటానికొచ్చిన ప్రభుత్వా ధికారిని వెనక్కిపంపారు. తాము జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)తో తప్ప మాట్లాడబోమని చెప్పటంతో ఆయనే రావాల్సివచ్చింది. అన్నిచోట్లా ఒకే రకమైన సమస్యలు. అందరిదీ ఒకే రకమైన కథ. చదువు చుట్టూ ఇన్ని సమస్యలుండగా ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమో పాలకులు చెప్పాలి. దేశంలో ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా అస్తవ్యస్థంగా ఉంది. ఎక్కడ చూసినా శిథిలాలను తలపించే బడులు, అరకొర సదుపా యాలు వెక్కిరిస్తుంటాయి. సరిపడా ఉపాధ్యాయులుండరు. యాదృచ్ఛికంగానే కావొచ్చు గానీ... రాజ్యసభలో గురువారం పాఠశాల విద్య గురించి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు దిగ్భ్రమ గొలుపుతుంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,00,843 అని ఆ శాఖ సహాయమంత్రి చెప్పారు. అందులో 16,357 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే జార్ఖండ్(9,827), మహారాష్ట్ర(9,269), కర్ణాటక(8,042), ఉత్తరప్రదేశ్(7,874) తదనంతర స్థానాల్లో ఉన్నాయి. అలాగని మిగిలిన స్కూళ్లు బాగున్నాయని కాదు. రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో కేవలం చరిత్ర, హిందీ పాఠ్యాంశాలకు మాత్రమే టీచర్లున్నారు. మరో పాఠశాలలో 1,2,3 తరగతులకు అసలు టీచర్లే లేరు. తక్షణం టీచర్ల నియామకం జరగకుంటే పాఠశాలకు తాళాలేసి, రహదారి దిగ్బంధిస్తామని పిల్లలు హెచ్చరించారు. చివరకు అప్పటికప్పుడు నలుగుర్ని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. మరో ముగ్గుర్ని పది రోజుల్లో నియమిస్తామనటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో లిఖితపూర్వక హామీ దొరికేవరకూ ఇంటర్ విద్యార్థులు ధర్నా కొనసాగించారు. సెకండరీ విద్యలో 2023–24లో ఆడపిల్లల్లో 12.6 శాతంగా ఉన్న డ్రాపౌట్లు 2025–26కు 8 శాతానికి తగ్గాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదిక చెబుతోంది. కానీ ఇప్పటికీ 8 శాతంమంది పిల్లలు ఆ స్థాయికొచ్చాక చదువులు మానుకుంటున్నారంటే ఆవేదన కలుగుతుంది. దీన్ని అంకెల్లోకి మారిస్తే లక్షల్లో ఉంటుంది. ఇది మన అధ్వాన్న స్థితికి అద్దం పడుతుంది. పేదరికం మొదలుకొని పాఠశాలలో సదుపాయాల లేమి వరకూ ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిని సరిచేయటానికి పూనుకొనే వరకూ ఇలాంటి పిల్లలు చదువులకు దూరంకాక తప్పదని పాలకులు గుర్తించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల వ్యథ మరో రకం. అక్కడ గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11,700 కోట్లు వ్యయం చేసి ‘నాడు–నేడు’ కింద 38,059 పాఠశాలల రూపురేఖల్ని మార్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల్ని తలదన్నేలా 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,000 స్మార్ట్ టీవీలు అమర్చి తరగతి గదుల్ని డిజిటల్ లెర్నింగ్ స్పేస్‌లుగా మార్చింది. పిల్లలకు దాదాపు ఆరు లక్షల ట్యాబ్ల్ని అందించి పాఠాల్ని సులభంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఉత్తరాదిన వినబడుతున్న డిమాండ్లతోపాటు మరెన్నో నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అందులో చాలా భాగం అటకెక్కాయి. గుక్కెడు మంచినీళ్లు, పరిశుభ్రమైన పరిసరాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం కరువయ్యాయి. గతంలో సకల సదుపాయాలతో వర్ధిల్లిన బడులన్నీ ఇప్పుడు బావురుమంటున్నాయి. అనేకం మూతబడ్డాయి. అందుకే ఉత్తరాది పిల్లల స్ఫూర్తితో రేపో మాపో ఏపీ ఆల్ఫా తరం కూడా తిరగబడినా ఆశ్చర్యం లేదు. -
ప్రకృతి చేస్తున్న హెచ్చరిక
వర్తమానంలో లాభార్జన కోసం భవిష్యత్తును బలిపెట్టే నయా ఉదారవాద విధానాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచులకు తీసుకెళ్తున్నాయి. దశాబ్దాలుగా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాల్లో చోటుచేసుకుంటున్న కార్చిచ్చుల్ని పట్టించుకుని పర్యావరణ అనుకూల విధానాలు పాటించని ఫలితంగా ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 37 కోట్ల ఎకరాల్లోని అడవులు, పొదలు తగలబడ్డాయని ఒక అంచనా. ఇలా కార్చిచ్చులో చిక్కుకున్న ప్రాంతం మంగోలియా దేశ విస్తీర్ణానికి సమానమని చెబుతున్నారు.స్పెయిన్, ఫ్రాన్స్ అటవీప్రాంతాల్లో, కెనడా, రష్యాల్లో గత వారం రోజు లుగా వ్యాపిస్తున్న మంటల వల్ల ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్ కార్చిచ్చులైతే ఊహించశక్యం కానంత స్థాయిలో ఉన్నాయి. వాటిని అదుపు చేయగలిగా మని ఆ రెండు దేశాలూ చెబుతున్నా జనంలో భయాందోళనలు ఉపశమించలేదు. నైరుతి ఫ్రాన్స్‌లో పారిస్‌కు నాలుగు రెట్లు పెద్దదైన విస్తీర్ణంలోని అడవి తగలబడటంవల్లగిరోండ్ ప్రాంతంలోని జనావాసాలనుంచి రెండున్నర లక్షలమంది పౌరుల్ని ఆదరా బాదరాగా తరలించాల్సివచ్చింది.ముఖ్యంగా బోర్డావ్ నగరంవైపు ఆ మంటలు వ్యాపిస్తున్న తీరు జనాన్ని హడలెత్తించింది. అటు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ లక్షమందిని తరలించారు. దాని శివారు ప్రాంతాల్లో పలు జనావాసాలు తగలబడిపోయాయి. ఆ రెండూ యుద్ధ రంగాన్ని తలపింపజేస్తున్నాయని మీడియా కథనం. జరగాల్సిన నష్టం జరిగాక మంటల్ని ఏదోమేరకు అదుపు చేయటం సాధ్యమే. కానీ వాటివల్ల వ్యాపించే పొగవల్ల గాలి నాణ్యత దెబ్బతింటుంది. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడిన సూక్ష్మ ధూళి కణాలు పీల్చేగాలిలో వ్యాపించి ఊపిరి తిత్తులు, గుండెసంబంధ వ్యాధులతో ప్రజారోగ్యం క్షీణిస్తుంది. అరుదైన వృక్షసంపద, జీవవైవిధ్యం బుగ్గిపాలవుతుంది. దాని కారణంగా వడగాడ్పులు చెలరేగి జనంఅల్లాడిపోతారు. ఈ ఖండాల్లో ఏటా కార్చిచ్చులవల్ల 3,40,000 అకాల మరణాలుసంభ విస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. 2023లో ప్రపంచ కర్బన ఉద్గారాల్లో కెనడా కార్చిచ్చుల వాటా 23 శాతమని అంచనా వేశారు. యూరప్ ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతున్నదని యూరోపియన్ యూనియన్(ఈయూ) పర్యవేక్షణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఫ్రాన్స్ కార్చిచ్చువల్ల ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాల్లోని పలు ప్రాంతాల్లో పొగ, ధూళితో కూడిన నీటియావిరి వ్యాపించి, అది మేఘాలుగా మారి, ప్రమాదకరమైన పెనుగాలులు, పిడుగుపాట్లు సంభవించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.సాధారణంగా ఇలాంటి కార్చిచ్చులు మానవతప్పిదాలతోనే మొదలవుతాయి. కానీ వాతావరణ మార్పుల పర్యవసానంగా అవి వేగంగా విస్తరిస్తాయి. ఈ విషయంలో శాస్త్రవేత్తలు స్థూలంగా అంగీకారానికొచ్చినా, తమ నమూనాలు అందుకోలేనంత స్థాయిలో ఇవి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ తీవ్రతను పసిగట్టడానికి కొత్త ఉపకరణాలు అవసరం కావొచ్చన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు స్పెయిన్, ఫ్రాన్సుల్లో మంటలు వ్యాపించిన అడవుల్లో పిక్నిక్లు, క్యాంప్ ఫైర్లు ఎక్కువ. అజాగ్రత్తగా ఉండే మనుషులవల్ల నిప్పు రాజుకోవటం, గాలిలో తేమ శాతం తక్కువుండే రాత్రివేళ మోడువారిన చెట్లు, ఎండుటాకులు అంటుకుని మంటలు వేగంగా వ్యాపించడం రివాజు. గత కొన్నేళ్లుగా ఈ కార్చిచ్చులవల్ల ఉత్పత్తయ్యే వేడి, పొగ ఆధారంగా పైరోక్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షరహిత పెనుగాలులతో కూడిన తుపానులు ఏర్పడుతున్నాయి. తీవ్రమైన ఆ వేడిగాలుల కారణంగా ఎక్కడెక్కడో పడే పిడుగులు మరిన్ని అగ్నిప్రమాదాలకూ, కార్చిచ్చులకూ దారితీస్తున్నాయి. విషపూరిత పొగ, బొగ్గు రేణువులతో ఉండే ఈ మేఘాలు అణు విస్ఫోటంలో వచ్చే పొగ మాదిరే దీర్ఘకాలం వాతావరణంలో అలుముకుని సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. 2019–20లో ఆస్ట్రేలియా ఇలాంటి వాతావరణాన్ని చవిచూసింది. దానికి ‘బ్లాక్ సమ్మర్’ అని పేరుపెట్టారు. ఇకనైనా వాతావరణంతో ఆటలాడటం ప్రమాదకరమని ప్రభుత్వాలు గుర్తించాలి. గుప్పెడు కార్పొరేట్ సంస్థల లాభార్జన కోసం వాతావరణాన్ని బలిపెడితే ఊహకందని ఉత్పాతాలు కాటేస్తాయి. పర్యావరణం ధ్వంసమై మానవాళి మనుగడే పెను ప్రమాదంలో పడుతుంది. తాజా పరిణామాలు చేస్తున్న హెచ్చరిక ఇదే. -
నిరసనలకు ‘సుప్రీం’ ఛత్రం!
ఉద్యమించటం, నిరసనలు వ్యక్తం చేయటం నేరమన్న అభిప్రాయం వ్యవస్థల్లో నరనరానా వ్యాపించింది. ఒక బ్యానర్తోనో, ఒక జెండాతోనో, నిర్దిష్టమైన ఎజెండాతోనో జనం రోడ్లపైకి రాగానే లాఠీలు పైకి లేవడం, బాష్పవాయు గోళాలు వర్షించడం... ఉద్యమకారుల్ని ఈడ్చుకెళ్లడం, పిడిగుద్దులు, బూటుకాళ్లతో తన్నడాలు రివాజయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమంలోనైతే పెల్లెట్లనుంచి ఏకే–47 బుల్లెట్ల వరకూ కనబడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం శాంతియుత నిరసనలపట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ మార్గదర్శ కాలు జారీచేస్తామనటం స్వాగతించదగింది. నిరసనలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కనీ, వాటిని నిరాకరించటం సరికాదనీ వ్యాఖ్యానించింది. పాలకులూ, వారిని సమర్థించే కొన్ని వర్గాలూ ఈ సంగతి మరిచి చాన్నాళ్లయింది. ఉద్యమాలూ, నిరసనలను ఏవగించుకునే జాతీయ మీడియా చానెళ్లకు కూడా కొదవలేదు. దగ్గర వాటర్ బాటిళ్లు తప్ప మరేం లేని 15, 16 ఏళ్ల పిల్లల్ని... అందునా ఆడపిల్లల్ని గూండాలుగా అభివర్ణించే స్థాయికి అవి దిగజారాయి. ఆడపిల్లల ఛాతీపై చేతులువేసి నెట్టడం, చెంపదెబ్బలు కొట్టడం, లాఠీలతో మోదటం ఏ రకంగా సమర్థనీయం? వారు కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదే! విధి నిర్వహణలోవున్న పాత్రికేయుల్నీ, పక్కన నిలబడి చూస్తున్నవారినీ కూడా తలలు పగలగొట్టారు. పెల్లెట్లతో గాయపరిచారు. ఇలా అతిగా ప్రవర్తించిన సిబ్బంది మాస్క్‌లు, స్వెట్టర్లు ధరించి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసులో వెలువరించిన తీర్పులో చట్టబద్ధమైన విధి నిర్వహణలో ఉండే ప్రతి పోలీసు అధికారి తప్పనిసరిగా తమ గుర్తింపు తెలిసేలా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అటుపై అది సీఆర్పీసీలో 41–బి సెక్షన్‌గా, ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్–36గా చేరింది. బలప్రయోగం చేయటానికి రాజ్యానికున్న అధికారం తాలూకు బాధ్యతను నిర్దిష్టంగా గుర్తించదగిన వ్యక్తికి ఆపాదించగలిగేలా ఉండాలన్న రాజ్యాంగపరమైన హామీ ఇది.పెద్దయెత్తున జనం పాల్గొనే ఆందోళనల్లో నేరగాళ్లు చొరబడే అవకాశాలు లేకపోలేదు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశాలు తోసిపుచ్చలేం. అలాంటివారిని గుర్తించి అదుపు చేయటానికే సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బంది ఉంటారు. అంతకన్నా ముందు నిరసన జరిగే ప్రాంతాన్ని నిరంతరం నిఘా కళ్లు చూస్తుంటాయి. అలాంటపుడు ఊరేగింపు జరపాలని సీజేపీ నిర్ణయించిన రోజు వేకువజామున జంతర్‌మంతర్‌లో పెద్ద పెద్ద రాళ్లతో కూడిన ట్రక్కు, అప్పటికే పూర్తిగా ధ్వంసమైన వాహనం ఎలా చేరాయి? అప్రమత్తంగా ఉన్న కార్యకర్తలు వెనువెంటనే వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్పుడైనా చర్యలుంటే పోలీసులపై జరిగాయంటున్న దాడులకు ఆస్కారం ఉండేది కాదు. కానీ అటుతర్వాత విచక్షణారహితంగా ఉద్యమకారుల్ని కొట్టారు. తలలకు గాయాలై నెత్తురోడుతున్నవారు అనేకమంది వీడియోల్లో కనబడ్డారు. కొందరికి చేతులు విరిగాయి. లాఠీచార్జి చేసేటపుడు మోకాలు దాటి పై భాగంలో కొట్టడం చట్టవిరుద్ధం.ఈ నెల 25న బిహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో ఉద్యమకారులతో ఘర్షణ చోటుచేసుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్ ఏకే–47తో కాల్పులు జరుపుతూ కెమెరాలకు చిక్కాడు. 15 యేళ్ల బాలుడితోసహా ముగ్గురు గాయపడ్డారని అంటున్నా పోలీసులు మాత్రం ఆ కాల్పులవల్ల ఎవరూ గాయపడలేదంటున్నారు. నిరాయుధ పౌరులపై మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఉపయోగించరాదన్న ప్రాథమిక పరిజ్ఞానం కూడా అతగాడికి లేదని అర్థమవుతుంది. అతన్ని సస్పెండ్ చేశారు సరేగానీ... కనీస అవగాహన లేనివారికి ఇటువంటి ప్రమాదకర ఆయుధాలు ఎలా ఇచ్చారన్నది తేల్చాలి. మొన్న శుక్రవారం విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల ‘చలో లోక్‌భవన్’లో సైతం ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఏపీలో అమలయ్యేది రెడ్ బుక్ రాజ్యాంగం కనుక విద్యార్థి సంఘాల కండువాలేసుకుని మరీ పోలీసులు దాడిచేశారు. యువకుల్ని బూటుకాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. రోడ్డుపై పడేసి కొట్టారు. ఇలా ఆటవిక ప్రవృత్తి మితిమీరుతున్న దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం శుభ పరిణామం. -
నెగ్గాల్సిన ఇతర పరీక్షలు
యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్ మంతర్ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్ పేపర్ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్ విడుదలనాడే స్పోర్ట్స్ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. నందన్ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్ లీక్ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. -
దుర్భిక్ష పర్వం
ఈ ఏడాది వానలు ముఖం చాటేస్తున్నాయి. రైతుల కళ్లల్లో దిగులు మబ్బులు కనిపిస్తున్నాయే గాని, ఎక్కడా చినుకుల సవ్వడి వినిపించడం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుంటే, చాలినన్ని తిండి గింజలు పండక కరవు కాటకాలు తప్పవు. అనావృష్టి తెచ్చిపెట్టే కరవు కాటకాలు సామాన్యుల బతుకులను దుర్భరం చేస్తాయి. ప్రధానంగా మనది వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయాన్నే నమ్ముకుని, దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న కర్షక జనాభా వర్షాభావం వల్ల కష్టాల్లో పడితే, యావత్ దేశానికే కష్టాలు తప్పవు. వర్షాల కోసం క్రమం తప్పక యజ్ఞయాగాదులు చేసే సంస్కృతి మనది. వర్ష ప్రాధాన్యం పట్ల ఎరుక కలిగిన జాతి మనది. ‘అనావృష్టి మతీత్యైవ మహతీ వర్షసంతతిః/ భూతానాం సంక్షయం చక్రే దుర్భిక్ష పరిపీడితమ్’ అని విష్ణుపురాణం చెబుతోంది. అనావృష్టి వల్ల పంటలు పండక దుర్భిక్షంతో మనుషులే కాదు, సమస్త ప్రాణులూ సంక్షోభానికి, నాశనానికి లోనవుతాయి. కరవు కాటకాలు మన దేశానికి కొత్త కాదు. వానలు లేక, నేల నెర్రెలు పడిన దుర్భర దుర్భిక్ష వర్ణనలు మన పురాణ సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు చాలానే ఉన్నాయి. ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు!’ అంటూ ‘పెన్నేటి పాట’ రాసిన విద్వాన్ విశ్వం ఒకనాటి రాయలసీమ కరవు దృశ్యాన్ని హృదయ విదారకంగా చిత్రించారు. కరవు కాటకాలను ముందుగా తెలుసుకునే సాంకేతికత ఇదివరకు ఉండేది కాదు. అందువల్ల దుర్భిక్షాన్ని దైవఘటనగానే పరిగణించేవారు. ఇటీవలి కాలంలో సాంకేతిక పెరిగింది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితు లను; అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులను ముందు గానే గ్రహించి, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయగలుగుతున్నారు.పాలకులు బాధ్యతనెరిగిన వారైతే, వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకుని కార్యాచరణను ప్రారంభిస్తారు. పాలకులు బాధ్యతను మరచి, హాలికులను వారి కర్మానికి వారిని విడిచిపెడితే, దుర్భిక్ష పర్యవసానాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఈసారి ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వేసవిలోనే హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు ఒకవైపు రైతులలో గుబులు పెంచుతుంటే, మరోవైపు చీకటి వ్యాపారులలో, రాజకీయ దళారులలో, అవినీతిలో మునిగితేలే అధికార గణాల్లో సంబరాన్ని పెంచుతున్నాయి. కరవును కూడా సొమ్ముచేసుకోగల సమర్థులు మనకు కొత్త కాదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని గురించే పాత్రికేయుడు సాయినాథ్ ‘ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్’ పుస్తకాన్ని ముప్పయ్యేళ్ల కిందటే రాశారు.‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నేలను నమ్ముకున్న రైతు కలలోనైనా కరవు కాటకాలను కోరుకోడు. రోజువారీ పనులు చేసుకుంటూ అన్నం తిని బతికే సామాన్య ప్రజలు కూడా కరవు కాటకాలను కోరుకోరు. ప్రతి సంక్షోభాన్నీ స్వీయ సంక్షేమ అవకాశంగా మార్చుకొనే దౌర్భాగ్యులే దుర్భిక్షాన్ని కోరుకుంటారు. ‘వార్ధుషికః వణిగ్బంధుః యే చ ప్రభూతమన్న సంగ్రహం/ కృత్వా దుర్భిక్షం వాంఛంతి తే పి వార్ధుషికా’ అని ప్రాచీన సుభాషిత శ్లోకం చెబుతుంది. వర్తకులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి, జనాలను పీడించే వడ్డీ వ్యాపారులు దేశంలో కరవు కాటకాలు రావాలని కోరుకుంటారని ఈ శ్లోక సారాంశం. ఇప్పటి కాలంలో వడ్డీ వ్యాపారులకు జతగా కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, రాజకీయ దళారులు, లంచగొండి అధికారులు కూడా జనాలకు దాపురించారు.వీళ్లందరూ కరవులో అధికమాసం లాంటివారు.ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ కారణంగా భారత్ సహా ఎనభై ఎనిమిది దేశాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడనున్నాయి. ఇది కేవలం ప్రకృతి పరిణామం మాత్రమే కాదు, ఇంగితం లేని పాలకుల చర్యలకు పర్యవసానం కూడా! భూతాపం పెరుగుదలపై పర్యావరణవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నా, కొందరు దేశా«ధినేతలు యుద్ధ విధ్వంసాల్లో మునిగితేలుతున్నారు. ఇంకొందరు అభివృద్ధి పేరుతో అడవుల నరికివేతకు ఊత మిస్తున్నారు. ఈకాలం దుర్భిక్షం బాధ్యతెరుగని పాలకుల స్వార్థఫలం. -
‘సంపూర్ణ క్రాంతి’ సైరన్!
‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్ రివోల్యూషన్) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్ ఉద్యమం గట్టి సవాల్నే విసిరింది. ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్’ల పార్లమెంట్ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్ల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్‌ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.ఆన్లైన్లో మొదలైన కాక్రోచ్ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్ అందిపుచ్చుకున్నది.అనంతరం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్‌దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్ల పుట్టుకకు దారితీసేది!దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. కాక్రోచ్ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్ వాంగ్‌చుక్, ఒక సెటైర్‌ను వైల్డ్ ఫైర్‌గా మార్చగలిగిన అభిజిత్ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్ వ్యాన్ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్ కెనాన్లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మహోగ్రంగా బ్రహ్మపుత్ర!
దేశంలో అనేక ప్రాంతాలు వాన జాడలేక ఇబ్బంది పడుతుంటే అస్సాం ఎప్పట్లానే వరద నీటిలో తేలియాడుతోంది. బ్రహ్మపుత్ర నది మహోగ్రరూపం దాల్చి విరుచుకుపడటంతో జనావాసాల్లోకి వరద నీరు ప్రవేశించి 9 లక్షలమందికిపైగా జనం ఇళ్లూ వాకిళ్లూ వదిలి పోవాల్సివచ్చింది. ఇంతవరకూ 47 మంది మరణించగా, దాదాపు 25,000 హెక్టార్ల పంట నీట మునిగింది. మొత్తంగా 11 జిల్లాలు వరదలతో దెబ్బతినగా, శివసాగర్, జోర్హాట్, దిబ్రూగఢ్, చారైదేవ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హిమాలయా ల్లోని కైలాసశిఖరిలో పుట్టి, ప్రపంచంలోని అతి ఎత్తయిన ప్రాంతంలో పెను వేగంతో ప్రవహిస్తూ అటు తర్వాత అస్సాం మైదాన ప్రాంతాలకు ఆ నది చేరుతుంది. అక్కడ వేగం తగ్గినా అప్పటికే అది ఒండ్రుమట్టినీ, బురదనూ పోగేసుకొస్తుంది. ప్రపంచంలోని ఏ నదితో పోల్చినా అది తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురద పరిమాణం చాలా ఎక్కువ. ఇదంతా నదీ ప్రవాహ క్రమంలో ఎక్కడికక్కడ మేటలేస్తూ వస్తుంది. కాలం గడిచేకొద్దీ ప్రవాహమార్గం ఇరుకై ఆ నది దారి మార్చుకోవటం మొదలుపెడుతుంది. అందుకే బ్రహ్మపుత్రను స్థానికులు వలస నది అంటారు. ఎగువ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు ఒక్కసారిగా విరుచుకుపడటం పర్యవసానంగా కుంభవృష్టి, మంచు పర్వతాలు కరిగి పోవటం, భారీ వర్షాలు పడటం అస్సాంకు రివాజు. ఈసారి మేఘాలయ తదితరప్రాంతాల్లో పడిన భారీవర్షాలు వరదలకు కారణమయ్యాయి. బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతం దేశాలూ, రాష్ట్రాలూ దాటి విస్తరించివుంది. ఇది ప్రకృతి శాపమని, ఇందులో మనిషి నిమిత్తమాత్రుడని చెప్పే మాటల్లో నిజం లేదు. వేరే దేశాల సంగతి వదిలి, కనీసం నదీపరివాహ రాష్ట్రాలన్నీ కలసికట్టుగా దృష్టి పెడితే బ్రహ్మపుత్ర కలగజేసే నష్టాన్ని పరిమిత స్థాయికి కుదించవచ్చు. ఇందుకు భిన్నంగా దాన్ని కేవలం ఒక రాష్ట్రానికి చెందిన సమస్యగా పరిగణించటమే చివరికి కష్టనష్టాలన్నీ అస్సాం భరించాల్సివస్తోంది. వరదల్ని కట్టడిచేసేందుకు కరకట్టల నిర్మాణమే సరైందని ఆరాష్ట్రం అనుకుంటోంది. దశాబ్దాలుగా వాటిపైనే కేంద్రీకరిస్తోంది. కానీ నదీ గమనం మారినప్పుడల్లా ఈ కరకట్టలు నిరుపయోగమవుతున్నాయి. పూడికతీత ప్రధాన సమస్యగా మారుతున్నప్పుడు బురద నియంత్రణ విషయంలో ఏం చేయాలన్నప్రశ్న రావాలి. అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ చెప్పినట్టు ఇది కనీవినీ ఎరుగని ఉత్పాతం. ఆ రాష్ట్రానికి ఏటా వరదలు రివాజే అయినా, ఈసారి ముంచెత్తినంత వరద యాభైయ్యేళ్లలో ఎప్పుడూ లేదు. కానీ సహాయ చర్యలు ఏమంత సజావుగా లేవు. వరద ప్రభావం అధికంగా గల శివసాగర్ జిల్లా మొత్తానికి కేవలం 5 బోట్లు మాత్రమే కేటాయించారు. అధికార యంత్రాంగంనుంచి ముందస్తు హెచ్చరికలు లేకపోవటంవల్ల పశువుల్ని రక్షించుకోవటమైనా, తాము సురక్షిత ప్రాంతాలకు తరలడమైనా జనానికి కష్టమై పోయింది. చుట్టూ సముద్రాన్ని తలపించేలా నీరుంటే, అనేకులు పైకప్పులెక్కి నిస్సహా యంగా చూస్తూ ఉండాల్సివచ్చింది. ఆహారం, నీరు అందించటంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారన్నది స్థానికుల ఆరోపణ. మొత్తం 872 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగి దీవుల్ని తలపిస్తున్నాయంటే ఈ తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తుంది. అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం వంటివి అత్యంత కీలకమైన ప్రాథమిక రక్షణ కవచాలుగా తోడ్పడతాయి. కేవలం అవి మాత్రమే సంపూర్ణంగా నియంత్రిస్తాయను కోవటం సరైంది కాకపోయినా, నదీ పరివాహ ప్రాంతంలో ఉండే పర్వత శిఖరాల్లో దట్టమైన అడవులుంటే చెట్ల వేళ్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచటంవల్ల కొండచరియలు విరగటం, వర్షపు నీటితోపాటు మట్టి కొట్టుకుపోవటం తగ్గుతుంది. హిమాలయాలు భూకంప ప్రభావిత జోన్లో ఉండటంవల్ల ఆ ప్రాంతంలోని కొండలు అత్యంత బలహీనమైన నాణ్యత కలిగిన మట్టి, రాళ్లతో నిండి ఉంటాయి. నదీ తీరం పొడవునా వెదురు, గడ్డి జాతుల మొక్కల పెంపకంవల్ల కోతను అరికట్టడం సాధ్యమవుతుంది. ఎన్ని చేసినా తాత్కాలిక ఉపశమనానికీ, నష్టాన్ని నియంత్రించటానికీ మాత్రమే అవి తోడ్పడ తాయి. మనం చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. దాన్ని విస్మరించి చేసే ఏ చర్య అయినా మెరుగైన ఫలితాన్నివ్వలేదు. -
సౌదీలో ‘అణు’కుంపటి
అందరి సలహాలూ బేఖాతరు చేసి ఇరాన్‌పై యుద్ధ భేరి మోగించి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు మరో ప్రమాదకర క్రీడకు సిద్ధపడ్డారు. సౌదీ అరేబియాతో తమకు ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందంటూ అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. తన నిర్ణయం పర్యవసానాలూ, పరిణామాల గురించి పూర్తిగా తెలిసే ట్రంప్ ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఇది పశ్చిమాసియా అమరికను సంపూర్ణంగా మార్చే... ఇప్పటికే సాగుతున్న ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం. 30 యేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ప్రమాణాలను సాధించటంతోపాటు ప్రాంతీయ భద్రతకూ, అమెరికా భద్రతకూ కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది. రాగలకాలంలో దేశానికి ఇది వందలకోట్ల వాణిజ్యాన్ని తీసుకొస్తుందనీ... దేశ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరటానికి దోహదపడుతుందనీ కూడా చెప్పుకుంటోంది. ఒకపక్క తన చర్యల ద్వారా అణ్వాయుధ తయారీకి దోహదపడుతూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధమే ధ్యేయమని చెప్పటం ఉత్త వంచన. ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ తొలి ఏలుబడిలో మన దేశంతో అమెరికా కుదుర్చుకున్న ‘123’ ఒప్పందమే కదా అనిపిస్తుంది. అగ్రరాజ్యాలతోపాటు మనతోసహా పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదనంగా సౌదీ దగ్గర ఉంటే నష్టమేమిటన్న సందేహాలు కూడా కలుగుతాయి. పైగా ఇది పౌర అణు ఒప్పందమే అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే ఇందులో లొసుగులు బయటపడతాయి. సౌదీ అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించుకోవటానికే ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాదన. ప్రకృతిలో లభించే యురేనియంలోని రెండు ఐసోటోపుల్లో ఒకటైన యూ– 235 మాత్రమే అణు విచ్ఛేదనానికీ, గొలుసు చర్య జరిగి అపారమైన శక్తి విడుదలకూ తోడ్పడు తుంది. యురేనియంను 3 నుంచి 5 శాతంవరకూ శుద్ధి చేస్తే అణు విద్యుత్ ఉత్పాదన సాధ్యమవుతుంది. శుద్ధి 90 శాతానికి చేరితే అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. అయితే విద్యుదుత్పాదన తర్వాత వాడేసిన ఇంధనంతో ప్లూటోనియం తయారీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిరోధించేందుకే ‘గోల్డ్ స్టాండర్డ్’ పేరుతో అమెరికా కఠినమైన షరతు విధిస్తోంది. దాన్నుంచి సౌదీకి మినహాయింపు ఇవ్వటం పైనే అందరికీ ఆందోళన. ఆ షరతు ఉంటుందని తాజాగా అమెరికా ఇస్తున్న వివరణ నమ్మశక్యంగా లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇరాన్ సంతకం చేసినా, అణుబాంబు తయారీకి వ్యతిరేకంగా అక్కడ ఫత్వా అమల్లో ఉన్నా ఆ దేశం అణు బాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకూ, ఇజ్రాయెల్‌కూ ఉన్నాయి. తరచు ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడటానికి కారణం అదే. ‘ఇరాన్ ఆ పని చేస్తే... మేం సైతం ఆ బాటలోనే వెళ్తాం’ అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా పదే పదే చెబుతున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వటమంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారడానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం... శత్రుదేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం’ అనే నైజం అత్యంత ప్రమాదకరమైనది. ‘మనిషి అణుబాంబును కనిపెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ ఎలుకా ఎలుకలబోను తయారుచేసుకోదు’ అని ఐన్‌స్టీన్ చేసిన వ్యాఖ్య ఆంతర్యం స్పష్టమే. ఇది స్వీయ హననానికి దారితీసే తెలివిమాలిన చర్య. భవిష్యత్తులో అణుశక్తి దేశంగా మారాక సౌదీ, అమెరికా చెప్పుచేతల్లో ఉండదు. తాము చేస్తే తప్పేమిటని ఇరాన్ సైతం ఆ బాట పడుతుంది. చిన్న నిప్పురవ్వ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడే భగ్గున మండిస్తుంటే ఇక అణ్వాయుధాలుంటే చెప్పేదేముంది? ఇప్పటికే ఇజ్రాయెల్ స్వీయరక్షణకంటూ అమెరికా దానికి అణ్వాయుధాలు సరఫరా చేసింది. దాని రక్షణ పేరుచెప్పే తరచు ఇరాన్‌పై దాడులు చేస్తోంది. నిజానికి స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవిస్తే ఇజ్రాయెల్‌కు ఇలాంటి రక్షణల అవసరమే ఉండదు. దాన్ని సాకారం చేయకుండా ఈ ప్రాంతాన్ని అణ్వస్త్రాల మయం చేయటం క్షమించరాని నేరం. -
బ్రిటన్‌కు బర్న్‌హామ్ సారథ్యం
బ్రెగ్జిట్ కాలంనుంచీ అస్థిరతకు ఆనవాలుగా మారిన బ్రిటన్‌లో కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకొచ్చిన రెండేళ్లలోనే కీర్ స్టార్మర్ ప్రధాని పదవినుంచి వైదొలగక తప్పలేదు. ‘విదేశీ’ ప్రధానిగా అపకీర్తిపాలైన స్టార్మర్తో పోలిస్తే బర్న్‌హామ్‌కు విదేశాంగ విధానం విషయంలో అనుభవం లేదు. ఆసక్తి కూడా తక్కువే. నెలక్రితం ప్రధాని పదవికి గట్టి అభ్యర్థిగా తొలిసారి పేరు వినబడే నాటికి యూరప్ ఖండంలోనే చాలామందికి ఆయన తెలియదు. కీలక పరిశ్రమలపై ప్రభుత్వాధిపత్యం ఉండాలనీ, నగరాలకూ, ప్రాంతీయ ప్రభుత్వాలకూ అధికారాల వికేంద్రీకరణ జరగాలనీ కోరుకునే రాజకీయ నాయకుడిగా ఆయన దేశంలో అందరికీ తెలుసు. ఉత్తర ఇంగ్లండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్‌కు మేయర్‌గా పనిచేసి బర్న్‌హామ్ సాధించిన విజయాలతో ఆయనకు ‘కింగ్ ఆఫ్ నార్త్’గా పేరొచ్చింది. ఆ విజయాల్లో అంతక్రితం ప్రైవేటు రంగానికి పోయిన బస్సు రవాణా విభాగాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావటం వంటివి ఉన్నాయి. గ్రేటర్ మాంచెస్టర్‌కు మేయర్‌గా 2017లో వెళ్లటానికి ముందు ఆయన లేబర్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. చాలా యూరప్ దేశాల మాదిరే పలు సంవత్సరాలుగా అధిక ధరలతో, అరకొర ఆర్థిక వృద్ధితో బ్రిటన్ ఇబ్బంది పడుతోంది. అక్రమ వలసలు మొదలుకొని సక్రమంగా పనిచేయని ప్రభుత్వ సంస్థలవరకూ అనేక సమస్యలున్నాయి. ఈ కారణంగా జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఫ్రాన్స్‌లో మెరిన్ లీ పెన్, జర్మనీలో అలైస్ వీడెల్ వంటి మితవాదపక్ష నాయకుల మాదిరే బ్రిటన్‌లో సైతం దీన్ని తమకనుకూలంగా మార్చు కోవటానికి ప్రయత్నించే జాతీయవాద శక్తులు లేకపోలేదు. 2016లో బ్రెగ్జిట్ మొదలైన దగ్గర్నుంచి దేశాన్ని అస్థిరత పీడిస్తున్న నేపథ్యంలో ఉదారవాద పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. బ్రెగ్జిట్ అనుకూల యూకే ఇండిపెండెన్స్ పార్టీ(యూకేఐపీ) అధినేత నైజెల్ ఫరాజ్ కొత్తగా రిఫామ్ యూకే పార్టీ పేరుతో రంగంలో ఉన్నారు. ఒక దాత నుంచి 50 లక్షల పౌండ్ల విరాళాన్ని తీసుకుని దాన్ని వెల్లడించ లేదన్న ఆరోపణ ఆయనపై రాకపోయి ఉంటే ఈపాటికే ఆయనపై ప్రజల్లో అభిమానం పెరిగేది.అందువల్లే ప్రధాని అయిన వెంటనే బర్న్‌హామ్ ఆర్థిక సుస్థిరత గురించి మాట్లాడారు. దీన్ని సాధించటానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామన్నారు. అందుకు ముందుగా అవసరమైనది రాజకీయ సుస్థిరత గనుక ఆ విషయంలో ఆయనేం చేస్తారో చూడాల్సి ఉంది. స్టార్మర్ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసి, తన శాఖకు ఆర్థిక మంత్రి తగిన కేటాయింపులు చేయలేదని అలిగిన జాన్ హేలీకి బర్న్‌హామ్ ఆర్థిక శాఖ అప్పగించారు. బస్సు చార్జీలకు పరిమితి విధించటం, అద్దెలపై మారటోరియం, ఇంధన బిల్లుల తగ్గింపు వంటివి అమలు చేస్తామంటూ ఇప్పటికే బర్న్‌హామ్ చెప్పిన నేపథ్యంలో ఆర్థిక శాఖ రాబడి మరింత పడిపోతుంది. ఈ నేపథ్యంలో రక్షణ కేటాయింపులు పెంచటం సంగతలా ఉంచి ఇతరత్రా రంగాలకు హేలీ ఎలాంటి కేటాయింపులు చేస్తారన్నది ప్రశ్నార్థకం. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ వ్యయాన్ని ఇంకా పెంచాలని చూస్తే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారంక్రితం ఐఎంఎఫ్ హెచ్చరించింది.తన విధానం ‘వ్యాపార అనుకూల సోషలిజం’ అని బర్న్‌హామ్ ప్రవచించారు గానీ... ఆచరణలో అదంత సులభం కాదు. వందరోజుల్లో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల పెంపు, వ్యాపార వృద్ధి వంటి అంశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటానన్న ఆయన హామీ నెరవేర్చటానికి హేలీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యయం పెరగటం కోసం అధికాదాయం ఉన్నవారు తాము చెల్లించే పన్ను స్వల్పంగా పెంచటానికి సహకరించాలని ఇప్పటికే బర్న్‌హామ్ కోరారు. అలా పెంచితే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ల పెంపు, వేతన సవరణ వంటి హామీలు నెరవేర్చవచ్చని ఆయన భావన. అయితే లేబర్ పార్టీవల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ రెండేళ్ల ఏలుబడికే సర్వత్రా అసంతృప్తి నెలకొన్న స్థితిలో పార్టీకి అనుకూలత తీసుకురావటం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఈ విషయంలో ఏ మేరకు బర్న్‌హామ్ విజయం సాధిస్తారో, లేబర్‌ను ఎంతవరకూ గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది. -
నిరసన స్వరాలు వింటారా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం ఢిల్లీ ఆకాశంలో నిరసన మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. రాజవీధులన్నీ వేలాది యువగళాలతో హోరెత్తాయి. పన్నెండేళ్ల బాలిక మొదలుకొని అనేకమంది యువతీయువకులు పోలీసుల లాఠీచార్జిలో గాయపడి నెత్తురోడుతున్న, విలపిస్తూ నిలదీస్తున్న దృశ్యాలు చానెళ్లలో వీక్షించటం చాలామందికి కష్టంగా తోచింది. ఈ దశాబ్ద కాలంలో దేశ రాజధాని ఎన్నడూ చూడని దృశ్యాలివి. నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై గత నెల జూన్ 6 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేస్తున్న ఆందోళననూ, మూడు వారాలుగా కొనసాగుతున్న నిరశనలనూ మౌనంగా వీక్షిస్తూ ఉండిపోయిన ప్రభుత్వానికి సోమవారం నాటి ‘చలో సంసద్’ కళ్లు తెరిపించి ఉండాలి. అందుకే కావొచ్చు... కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఉద్యమ కార్యకర్తలను చర్చలకు పిలిచారు. అక్కడేమైంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందన్న సంగతలా ఉంచితే ముందు వినడం పాలకులు చేయాల్సిన పని. పదిహేనేళ్ల క్రితం అన్నా హజారే నిరశన మొదలెట్టినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదట్లో పట్టించుకోకున్నా, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో ప్రతినిధి బృందాన్ని పంపింది. దాన్ని సంపూర్ణంగా సమర్థించి, క్రియాశీలంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఆ ఉద్యమానికి ఊపూ ఉత్సాహాన్నీ తీసుకొచ్చింది బీజేపీయే. అందుమూలంగా ఇతోధికంగా లాభపడింది కూడా. కానీ అదే పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు నిర్లిప్తంగా ఉండి పోవటం, సమస్యను ఇంత సంక్లిష్టం చేసుకోవటం దిగ్భ్రాంతికరం. ఈ ఆందోళనలో గాయపడిన వారిలో వందమంది వరకూ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్సకు చేరగా వారిలో తలలు పగిలినవారూ, కాళ్లూ చేతులూ విరిగినవారూ అనేకులున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అటు 118 మంది పోలీసులు గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పాలకులుగా ఎవరుండాలో ఎన్నికలు చెబితే... వారి పాలన ఎలావుందో నిరసనలు చెబుతాయి. అసమ్మతి అనేది దేశభక్తికి అత్యున్నత రూపం అంటాడు అమెరికా రాజనీతి శాస్త్ర ఆచార్యుడు హోవార్డ్ జిన్. ప్రజాస్వామ్యంలో విభేదించేందుకూ, అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకూ చోటివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం విపక్షాల బాధ్యత కూడా. కానీ విషాదమేమంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమైంది. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరోజు ధర్నా చేయటం మినహా చేసిందేమీ లేదు. అన్నా హజారే ఉద్యమ సమయంలో జరిగిందేమిటో గుర్తున్నా తాను చేయాల్సిందేమిటో ఆ పార్టీకి తెలిసేది. ఆ సంగతి ఆలస్యంగా గ్రహించి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ ఎవరూ లేకపోవడం గమనించదగ్గది. నిరశనలో ఉన్న సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు అరెస్టుచేసి ఆస్పత్రిలో చేర్చారు. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కేను ప్రదర్శన ప్రారంభంలోనే పోలీసులు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. కానీ దాదాపు 50,000 మంది వరకూ ఉన్న ఆందోళనకారులు గుంపులుగా విడిపోయి పార్లమెంటువైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం, చాలావరకూ సఫలీకృతం కావటం చిన్న విషయం కాదు. పటేల్ చౌక్, జన్‌పథ్ గేటు మెట్రో స్టేషన్ల వద్ద, అశోకా రోడ్, కన్నాట్‌ప్లేస్ సర్కిల్ వద్ద బైఠాయింపులు, మరో అయిదుచోట్ల వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగించటం సమస్య తీవ్రతను వెల్లడిస్తుంది. హింసకూ, దౌర్జన్యానికీ దిగినవారిని నియంత్రించటాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక్కరిని చేసి ఏడెనమండుగురు పోలీసులు లాఠీలతో మోదటం, ఆడపిల్లలని కూడా చూడకుండా హింసించటం సబబేనా? ‘మీ ఇంట్లో పిల్లలు లేరా? ఇంత దారుణంగా కొడతారా?’ అని ఒక బాలిక ప్రశ్నించటం, తన దుస్తులు చించారని మరొకామె ఆరో పించటం ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచదు. పరీక్షపత్రాలు లీకవటం, కష్టపడి చదివేవారు దగాపడటం తొలిసారి కాదు. ఏళ్లతరబడి ఇలా జరగటంవల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇకనైనా విద్యార్థుల అభీష్టాన్ని వినటం, సానుకూలంగా స్పందించటం ప్రభుత్వ బాధ్యత. లేకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. -
స్పానియార్డ్స్ జయకేతనం
ఆటపై అంకితభావం... అవతలి జట్టుపై గెలవటానికి పక్కా వ్యూహం... తిరుగులేని క్రమశిక్షణ... అన్నిటికీ మించి జట్టు మొత్తం ఒక వ్యవస్థగా పనిచేయటం సోమవారం వేకువజామున న్యూజెర్సీ వేదికగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సాకర్ ప్రపంచ కప్ సంరంభంలో మొదట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేని స్పెయిన్ జట్టు అందరినీ అధిగమించి విశ్వవిజేతగా నిలిచింది. క్రీడాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇలాంటి ఘట్టాలు సాకర్ చరిత్రలో బహుశా అరుదుగా నమోదైవుంటాయి. అలాగని స్పెయిన్ తక్కువేం కాదు. అది తొలిసారిగా 2010లో దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్ సాధించింది. అంతక్రితం సాకర్ యూరో కప్‌ను మూడుసార్లు – 1964, 2008, 2012లలో గెలుచుకుంది. ఒకరకంగా 2008 నుంచి 2012 వరకూ అది ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిందని చెప్పాలి. కానీ అనంతరకాలంలో దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరింది. మొదట్లో స్పెయిన్‌కు విజయపరంపర అందించిన ‘టికి–టాకా’ వ్యూహం (ఆటగాళ్లు బంతిని పాస్‌లు ఇచ్చుకుంటూ తమమధ్యే ఉంచుకోవటం), గోల్ పోస్ట్ వైపు వెళ్లే చొరవ తగ్గటానికి దారితీసింది. ప్రత్యర్థులు సులభంగా అంచనావేసే స్థితి ఏర్పడింది. దిగ్గజా లనదగ్గ జావి, ఇనియెస్టా, కార్లెస్, సెర్గియో రామోస్ వంటి ఆటగాళ్లు వరసగా నిష్క్రమించినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయటంలో బోర్డు విఫలమైంది. కొత్తగా వచ్చినవారికి అంతర్జాతీయ టోర్నీల ఒత్తిడిని తట్టుకునే అనుభవం లేకపోయింది. అయితే కాలం మారింది. లామిన్ యామాల్ వంటి యువ సంచలనం, ఫెర్రాన్ టోరెస్ వంటి సమర్థుడు చరిత్ర తిరగరాశారు. అటు అర్జెంటీనా అసామాన్యమైనది. నిన్న మొన్నటివరకూ దానివైపు తలెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు సాహసించనంతటి అరివీరభయంకర జట్టు. మారడోనా, మెస్సీ వంటి సార్వకాలిక మహా దిగ్గజాలను ప్రపంచానికందించిన ఆ దేశం ఎప్పుడూ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగానే ఉంది. 1978, 1986, 2022లలో అర్జెంటీనా ఆటగాళ్లు మహాద్భుతాలను ప్రదర్శించి దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. దక్షిణమెరికా ఖండంలో అత్యున్నత టోర్నమెంటు అయిన ‘కోపా అమెరికా’లో ఏకంగా 16 సార్లు ఆ టైటిల్‌ను గెలిచిన చరిత్ర అర్జెంటీనా ఆటగాళ్లది. మెస్సీది అద్భుతమైన నైపుణ్యం. చెప్పాలంటే అతనిది భావోద్వేగంతో ముడిపడివుండే మాయాజాలం. అది ఇన్నాళ్లూ రాణించింది. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి రావటం కూడా అసాధ్యమనిపించే రీతిలో పనిచేసింది. కానీ భారమంతా మెస్సీపైనే పడటం ఆ జట్టుకు పెద్ద మైనస్ అయికూర్చుంది. అవతల స్పెయిన్ ఆటగాళ్లు ఉక్కు క్రమశిక్షణతో, అంకితభావంతో ఆడి మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించిన తీరు అర్జెంటీనాను కోలుకోలేని దెబ్బతీసింది. ఒలింపిక్స్ అయినా, సాకర్ వంటివైనా ప్రపంచ దేశాలమధ్య సద్భావనను పెంపొందించే సందర్భాలు. నిన్న మొన్నటివరకూ కలహాలతో చెలరేగిపోయిన దేశాల ఆటగాళ్లు ఆ యుద్ధంరేపిన గాయాలు మరిచి పరస్పరం చేతులు కలపడం గుర్తుంచుకోదగిన క్షణాలవుతాయి. ఈసారి ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా ప్రపంచ దేశాలను అష్ట కష్టాలు పెడుతూ పగబట్టినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. ఆఖరికి సాకర్ సాగుతున్న దశలో కూడా అది ఇరాన్‌పై క్షిపణిదాడులతో చెలరేగిపోయింది. ఆ చీడను ఇరాన్ ఆటగాళ్లకూ పులిమింది. ప్రాక్టీసింగ్ మ్యాచ్‌లు ఇక్కడ కుదరదంటూ విమానాశ్రయంనుంచే వెనక్కి పంపింది. చివరకు వారు మెక్సికోలో బసచేసి, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆట ముగిసీ ముగియగానే మెక్సికో వెళ్లటానికి విమానాశ్రయానికి తరలించేది. అన్ని అవమానాలనూ దిగమింగుకుంటూనే అమెరికా క్రీడాభిమానులుసహా ప్రపంచమంత టినీ ఇరాన్ జట్టు అలరించింది. మొత్తానికి అమెరికా అగ్రరాజ్య దురహంకారానికి కొత్తగా వచ్చిచేరిన జాత్యహంకారం ఈ సాకర్‌లో కొన్ని చేదు అనుభవాలు మిగిల్చింది. పట్టనట్టున్న ఫిఫా దానికి లొంగి స్వీయ ప్రతిష్ఠను కోల్పోయింది. మైదానంలో రిఫరీదే తుది నిర్ణయంకాగా, ట్రంప్ జోక్యంతో దాన్ని మార్చటం ఫిఫా బలహీనతకు చిహ్నం. మొత్తానికి ఫుట్‌బాల్ అందం దాని దిగ్గజాలు ప్రదర్శించే క్రీడా నైపుణ్యంలో ఉంటుంది. భిన్నమైన ఆట శైలులుగల మెస్సీ, రొనాల్డో, ఎర్లింగ్ హాలండ్ వంటివారు అభిమానులకు శాశ్వతంగా మిగిలే ఆనందకర క్షణాలను అందించారు. -
యవ్వన వ్యామోహం
‘పాడు జీవితము యవ్వనం మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యో నీదు పరుగు లెచ్చటకోయి’ – ఆరుద్ర ఏనాడో ఒక డబ్బింగ్ సినిమా కోసం రాసిన పాట ఇది. జీవితం, యవ్వనం మూడునాళ్ల ముచ్చటనే మాట చెప్పినది ఆరుద్ర మాత్రమే కాదు, ఆయన కంటే ముందు ఆదిశంకరుడు మొదలుకొని ఎందరెందరో ఆధ్యాత్మికవేత్తలు దాదాపు ఇదే సంగతిని పదే పదే చెప్పారు. జీవితమే క్షణభంగురం అనుకుంటే, అందులో యవ్వనం ఉండేది ఎన్నాళ్లని! క్షణభంగుర సిద్ధాంతాన్ని ఎవరు ఎన్నివిధాలుగా చెప్పినా మనిషికి యవ్వన వ్యామోహం, చిరకాల జీవనేచ్ఛ తీరేవి కావు.‘భోగా న భుక్తా వయమేవ భుక్తాః/ తపోన తప్తం వయమేవ తప్తః/ ‘కాలో న యాతో వయమేవ యాతాః/ తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణాః’ అన్నాడు భర్తృహరి. ఈ శ్లోకానికి అర్థమేమిటంటే, భోగాలను మనం అనుభవించలేదు, భోగాలే మనల్ని అనుభ వించాయి. మనం తపస్సు చేయలేదు, తాపత్రయాలతో మనమే తపించిపోయాం. కాలం గడిచిపోలేదు, మనమే గడిచిపోయాం. కోరికలు నశించలేదు, మనమే నశించిపోయాం. శాస్త్ర పురాణేతిహాసాలు ఎన్ని చెప్పినా, మనిషి స్వభావం మారదు. జరామరణాలు ప్రకృతి సహజాలు అని తెలిసినా, దీర్ఘ యవ్వనాన్ని, చిరంజీవిత్వాన్ని కోరుకోవడం మానవ సహజం. అత్యధికులు జీవించి ఉన్నంత కాలం యవ్వనాన్ని పొడిగించుకోవడా నికి పడరాని పాట్లు పడుతూనే ఉంటారు. చివరకు ఏమీ చేయలేక ప్రకృతిధర్మానికి తల ఒగ్గి కాలధర్మం చెందుతుంటారు. అరుదుగా కొందరు మాత్రం ప్రకృతికి ఎదురెళ్లి మరీ జరామరణాలను జయించడానికి ప్రయత్నిస్తారు.మానవుల్లో తరగని యవ్వన వ్యామోహానికి పురాణాల్లోని యయాతి ఉదంతం ఒక ఉదాహరణ. యయాతి అసురగురుడైన శుక్రాచార్యుడి కుమార్తె దేవయానిని పెళ్లాడాడు. తర్వాత రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్టను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తన కూతురికి అన్యాయం తలపెట్టాడని కోపించిన శుక్రుడు– యయాతిని శపించాడు. శుక్రాచార్యుడి శాపఫలితంగా యయాతికి అకాల వార్ధక్యం కలిగింది. అప్పటికి యవ్వన భోగాలపై కాంక్ష నశించని యయాతి తన వార్ధక్యాన్ని తీసుకుని, తమ యవ్వనాన్ని తనకు ఇవ్వమని కొడుకులను కోరాడు. దేవయాని కొడుకులిద్దరూ అందుకు నిరాకరించారు. శర్మిష్ఠ ముగ్గురు కొడుకుల్లో ఒకడైన పూరుడు మాత్రమే తండ్రి కోరిక మేరకు అతడికి తన యవ్వనాన్ని ఇచ్చి, అతడి వార్ధక్యాన్ని తాను స్వీకరించాడు. కొడుకు ద్వారా యవ్వనాన్ని పొందిన యయాతి వెయ్యేళ్లు రాజ్యపాలన చేశాడు. పురాణాల్లో పునర్యవ్వన గాథలు మరికొన్ని కూడా ఉన్నాయి. పురాణాల్లో సప్త చిరంజీవులు కూడా ఉన్నారు. వాస్తవ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చిరంజీవులు కాలేదు. అంతేకాదు, నిత్యయవ్వనులు కూడా ఎక్కడా కనిపించరు. ఆకాశంలో ఎగరగలిగే విమానాల వంటి పురాణ కల్పనలు అధునాతన కాలంలో వాస్తవరూపం దాల్చడాన్ని మనం ఇప్పటికే చూశాం. వార్ధక్యాన్ని ఇంతవరకు ప్రకృతి సహజ పరిణామంగానే భావిస్తూ వస్తున్నాం. కాని, కొందరు వైద్య పరిశోధకులు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తిస్తున్నారు. వ్యాధిని గుర్తించాక, దాన్ని నయం చేసే మార్గాన్ని కూడా శాస్త్రవేత్తలు ఏదో రీతిలో ఎప్పుడో ఒకప్పుడు కనుగొంటారు కదా! అందుకే, ఆ దిశగా ప్రయోగాలు సాగిస్తున్నారు.ఈ పరిస్థితుల్లోనే అమెరికన్ సంపన్నుడు బ్రయాన్ జాన్సన్ కొన్నేళ్లుగా జరామరణాలపై యుద్ధం సాగిస్తూ వార్తలకెక్కాడు. ఇతగాడిని కలియుగ యయాతిగా చెప్పుకోవచ్చు. నిత్య యవ్వన ప్రయోగాల్లో భాగంగా పద్దెనిమిదేళ్ల యువకుడైన తన కొడుకు రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం సహా బ్రయాన్ చేయని ప్రయోగాలు లేవు. ప్రయోగాలన్నాక ఒక్కోసారి వికటించడం సహజం. బ్రయాన్ ప్రయోగాలు కూడా వికటించాయి. ఇప్పుడతడు ‘ఆటో ఇమ్యూన్ అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్’ అనే నయం చేయలేని వ్యాధి బారినపడ్డాడు. వైద్యులు అతడి వ్యాధిని గుర్తించిన వెంటనే, ‘నా కడుపు నన్నే తినేస్తోంది’ అని బ్రయాన్ ప్రకటించాడు. అయినా సరే, తాను దీనిని ఎలాగైనా ఎదుర్కొని జయిస్తానని కూడా ప్రకటించాడు. ఈ కలియుగ యయాతి కథ ఏమవుతుందో చూడాలి! -
ఓవర్ టు ఢిల్లీ!
భారతదేశ చరిత్ర ఇప్పుడొక ప్రమాదకరమైన మలుపును తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నదనే హెచ్చరికలు వినబడు తున్నాయి. ఆ మలుపు తీసుకుంటే ప్రజాస్వామిక అధ్యాయానికి ముగింపు పలికినట్టేనని, రాజ్యాంగబద్ధ పాలనకు తిలోదకాలు వదిలినట్టేనని కొందరు మేధావులు గళం విప్పుతున్నారు.వందలాది సంవత్సరాల భారతీయ వైవిధ్య సహజీవనం ధ్వంస మౌతుందనీ, బహుళత్వ సౌందర్యం భగ్నమవుతుందనీ, భిన్న త్వంలో ఏకత్వ సందర్శనకు బదులు బలవంతపు ఏకీకరణ ప్రత్యక్షమవుతుందనీ కొన్ని వైతాళిక స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొంతుకలకు సంప్రదాయ మీడియా మైకులు పెద్దగా సమకూరడం లేదు. ఫలితంగా ‘ఆవాజ్’ దద్దరిల్లడం లేదు. కానీ, మూగబోవడం కూడా లేదు. అటువంటి వేనవేల స్వరాల్లోని ఒక భా‘స్వరం’ పేరు సోనమ్ వాంగ్‌చుక్.లదాఖ్ పర్వత ప్రాంతీయుడైన సోనమ్ ఒక ఇంజినీర్. స్వయంగా పాఠశాలలు స్థాపించి, విద్యారంగ సంస్కరణలకు నడుం కట్టినవాడు. సమాజానికి ఉపయుక్తమయ్యే వైజ్ఞానిక ఆవిష్కరణలు చేసినవాడు. తన ఆవిష్కరణలకు పేటెంట్ కోర కుండా సమాజానికి అంకితం చేసి ప్రజాస్వామిక ప్రియత్వాన్ని చాటుకున్నవాడు. లదాఖ్ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు పోరాట రూపమైనవాడు. ఈ నేపథ్యాన్ని గమనించినప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ తాజా నిరాహారదీక్ష వెనుక వేరే రాజకీయ ప్రయోజ నాలున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలు ఎంత అసంగతమైనవో అర్థమవుతుంది. భారతదేశంలో విద్యారంగం నానా టికీ సంక్షోభంలో కూరుకుపోతున్నదనే అభిప్రాయం రాజకీయ పరమైనది కాదు. విజ్ఞులైన దేశ ప్రజలందరూ ఆందోళన చెందు తున్న ఒక చేదు నిజం. పోటీ పరీక్షల వ్యవస్థ స్కామ్‌ల పుట్టగా మారిందన్నది కూడా అంతే నిజం.ఒకటా, రెండా? ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పన్నెండేళ్లలో పోటీ పరీక్షల అవకతవకలకు సంబంధించి 158 ఉదంతాలు రికార్డయ్యాయి. అంతకు ముందు యూపీఏ హయాంలోనూ ఈ దరిద్రం లేకపోలేదు. 2005 నుంచి 2014 వరకు అరవైకి పైగా అవకతవకల కేసులు నమోద య్యాయి. కోట్లాదిమంది యువతీ యువకుల భవిష్యత్తుతో ఆడుకున్న దురంతాలివి. టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాదిమంది యువతీయువకుల కలలను ఏపీ సర్కార్ నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఎలా భగ్నం చేసిందో ఇటీవల బైటపడింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడటం వల్ల దాదాపు ఇరవైమంది తెలివైన విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది.విద్యారంగ సంస్కరణలపై ఎలుగెత్తుతున్న సోనమ్ వాంగ్ చుక్ సహజంగానే ఈ ఆందోళనలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకొని ఉంటారు. జంతర్‌మంతర్‌లో ఆయన నిరాహార దీక్షకు కూర్చొని మూడు వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. నీట్ పరీక్షల వైఫల్యంతో పాటు సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఆందో ళనకారుల ప్రధాన డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్‌తో సోనమ్‌కు గానీ, ఆందోళనకారులకు గానీ వ్యక్తిగత వైరమేమీలేదు. కానీ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన ఘటనపై జవాబుదారీతనాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజమే కదా, ప్రజాసమస్యలకు బాధ్యత వహించకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? పరీక్షల వ్యవహారంపై జవాబుదారీతనానికీ, బాధ్యత వహించడానికీ కేంద్ర సర్కార్ మొండిగా నిరాకరించింది. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఇరవై ఒకటో రోజున హైకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామంటూ పోలీసులు బల వంతంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో జవాబుదారీ తనం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజాస్వామికవాతావరణం కూడా క్రమంగా కనుమరుగవుతున్నది. పౌరహక్కులకు న్యాయ స్థానాల నుంచి కూడా పూర్తి రక్షణ లభించడం లేదు. లాఠీ రాజ్యం అమల్లోకి వచ్చింది. ఆధిపత్య భావజాలం అన్నిరంగాలను, అన్ని వ్యవస్థలను పట్టి కుదిపేస్తున్నది. భిన్నాభి ప్రాయాలు, ఆలోచనలపై బుల్డోజర్లు నడుస్తున్నాయి. ఆధిపత్య భావజాలాన్ని ఆధారసహితంగా హేతుబద్ధంగా ఎదుర్కొనేగొంతుకలపైకి బండబూతులతో వందమంది దండెత్తుతున్నారు. సోషల్ మీడియాలోకి ఫాసిజం చొరబడింది. ప్రధాన స్రవంతి మీడియా సర్కార్ల పెంపుడు మీడియాగా మారిపోయింది. వాంగ్‌చుక్ దీక్ష సందర్భంలో మన జాతీయ మీడియా ప్రభుభక్తినే చాటుకున్నది. పదిహేనేళ్ల కిందట జంతర్‌మంతర్‌లో జరిగిన అన్నా హజారే దీక్షను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. జాతీయ దినపత్రికలన్నీ రోజుల తరబడి జంతర్‌మంతర్‌ను పతాక శీర్షికల్లో నిలబెట్టాయి. టీవీ ఛానెళ్లు రాత్రింబవళ్లూ కెమెరా లను అక్కడే పాతేసి కార్యక్రమాలు నడిపాయి. ఇప్పుడువాంగ్చుక్ దీక్షకు మాత్రం మొహం చాటేశాయి. ఆనాటి కవ రేజీలో పదోవంతు కూడా దక్కలేదు. ‘త్రీ ఇడియట్స్’ అనే సూపర్ హిట్ సినిమాకు వాంగ్‌చుక్ జీవితమే ఆదర్శమని ప్రచారం జరగడంతో ఆయన ఇమేజ్ పెరుగుతుందని గ్రహించి డ్యామేజీ కంట్రోల్‌కు జాతీయ చానెళ్లు ప్రయత్నించాయి. అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించి సినిమాకు ముందు వాంగ్‌చుక్ ఎవరో తమకు తెలియదని చెప్పించారు. అమీర్ ఖాన్ చెప్పింది పచ్చి అబద్ధమని రుజువు కావడానికి కొన్ని గంటలు కూడా పట్టలేదు. ఈ ఎపిసోడ్‌తో మరోసారి రుజువైన అంశం మన దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదని, అది సర్కారీ పెద్దలకు పెంపుడు జీవిగా మారిపోయిందని! దేశ రాజకీయ చరిత్రలో అయోధ్య రామమందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిందే కదా? భారతీయ జనతా పార్టీని అధికార పీఠానికి చేరువ చేసిన ఆలయమిది. అటువంటి ఆల యానికి ఇంటిదొంగలే కన్నం వేస్తే మీడియాలో ఎంత రచ్చ జరిగి ఉండాలి! కానీ, అదో చిన్న వార్తే అయిపోయింది. ఆంధ్రాలో అధికార పార్టీ నాయకుడు ఒక మహిళను నడివీధిలో చితకబాదితే పెంపుడు మీడియాలో ఆ వార్తకు చోటు దక్కలేదు. పోలీస్ లాకప్ చిత్రహింసలకు వరసగా ప్రాణాలు పోతున్న ఘటనలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. కేరళలో పోలీసు కస్టడీలో ఉన్న రాజన్ మరణిస్తే యావత్ భారతదేశం అట్టుడికి పోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మణిపూర్ అనే రాష్ట్రం ఈ దేశంలోనే ఉన్నదనే సంగతిని కూడా నేటి జాతీయ మీడియా మరిచిపోయినట్టుంది. ఒక మతాన్ని టార్గెట్ చేసి 250కి పైగా ప్రార్థనాలయాలను నేలమట్టం చేస్తే, మనుషుల్ని సజీవ దహనం చేస్తే, ఊచకోత కోస్తే రెండు వర్గాల ఘర్షణలు గానే అప్రధానంగా రిపోర్టయ్యాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్లపై ఆంధ్ర సర్కార్ దమన నీతిని ప్రదర్శిస్తున్నది. విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు చేస్తు న్నారు. లాకప్‌లలో చిత్రహింసలు పెడుతున్నారు. పౌర హక్కు లకు సంబంధించిన ఇటువంటి వార్తలకు మీడియాలో చోటు దొరకడం లేదు. బెంగాల్, బిహార్లలో కూడా ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశ చరిత్ర ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నదని కొందరు మేధావులు ఆందోళన చెందడం, జంతర్‌మంతర్‌లో వాంగ్‌చుక్ ఆందోళన, ప్రభుత్వాలు స్వయంగా పౌరహక్కుల హననానికి పూనుకోవడం, ఫోర్త్ ఎస్టేట్ పెంపుడు మీడియాగా మారిపోవడం – వేర్వేరు విషయాలు కాదు. దేశ రాజకీయ వ్యవస్థ గమనానికి సంబంధించిన సూచికలు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణి, మీడియా నిష్క్రియాపరత్వం ఈ గమనాన్ని సుగమం చేసే బాటలు. అధికార పీఠంపై ఉన్న బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ఎజెండా ఈ గమనానికి చోదకశక్తిగా దేశంలోని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఎంతటి అసమర్థ స్థితిలో ఉన్నప్పటికీ అధికార రథం ఎంచుకొన్న గమనం నిరాటంకం మాత్రం కాదని జంతర్‌మంతర్ చెబుతున్నది. బలంగానో, బలహీనంగానో ప్రతిఘటన ఉండి తీరుతుందని చెబుతున్నది.భారత రాజ్యాంగం పుట్టినప్పుడే వ్యతిరేకించిన ఆరెస్సెస్‌కు ఇప్పుడు అవకాశం దొరికింది కనుక దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఆ సంస్థ వ్యతిరేకులు శంకి స్తున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమా వేశాల్లో ఆ దిశగా కొన్ని అడుగులు పడే అవకాశమున్నదని వారు భావిస్తున్నారు. ప్రధానమైన ముందడుగు ఇప్పటికే ‘సర్’ కార్య క్రమంతో మొదలైంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కాస్త సమగ్ర తొలగింపు కార్యక్రమంగా మారిందనే విమర్శలు కొత్తవి కావు. ఈ విమర్శలకు ఆధారాలు కూడా ఉన్నాయి. పది రాష్ట్రాల్లో పూర్తయిన ‘సర్’లో ఐదున్నర కోట్ల ఓట్లను తొలగించారు. ఇందులో సింహభాగం ఒక వర్గం వారేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని ఆధారాలు సమర్పించి అప్పీల్ చేసుకుంటే ఓటుహక్కును పునరుద్ధరిస్తా మని హామీ ఇచ్చారు. బెంగాల్లో 27 లక్షల మంది తాము స్థానిక పౌరులమనే ఆధారాలు సమర్పిస్తే వారిలో కొన్ని వందల కేసులనే ఇప్పటిదాకా పరిష్కరించారట. ఈ లెక్కన మిగిలిన వారికి ఎన్ని దశాబ్దాల తర్వాత మోక్షం కలగాలి?బిహార్‌లో తొలగించిన 60 లక్షల ఓట్లలో ఐదువందలమందిని ‘విదేశీయులు’గా తేల్చారట. అందులో 350 మంది బిహారీలను పెళ్లి చేసుకున్న నేపాలీ అమ్మాయిలు. నేపాల్‌లో ఉండే మధేశీ తెగ ప్రజలు బిహార్‌లో సరిహద్దు ప్రాంతంలో కూడా ఉంటారు. ఈ మధేశీ ప్రజల పెళ్లి సంబంధాలు కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇన్ని వందల ఏళ్ల చరిత్రను ఎప్పటికి తవ్వితీస్తారో చూడాలి! ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ‘సర్’ కార్యక్రమం నడుస్తున్నది.హైదరాబాద్‌లో 30 శాతం ఓటర్లు ఇప్పటికీ మ్యాపింగ్ కాలేదట. అయ్యే అవకాశం కూడా లేదు. నిరక్షరాస్యులు, బతుకుదెరువు కోసం వలసపోయే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఎక్కువసంఖ్యలో ఈ కార్యక్రమం వల్ల ఓట్లు కోల్పోయే పరిస్థితి కనిపిస్తు న్నది. ఈ వర్గాల ఓట్లు తగ్గితే నష్టమెవరికో, లాభమెవరికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘టార్గెటెడ్’ ఓటర్ల తొలగింపునకు అవసరమయ్యే సాకులు కూడా ఈ కార్యక్రమంలో దండిగానే ఉన్నాయి. 2002 జాబి తాతో సరిపోలకపోయినా, అందులో అచ్చుతప్పులు గమనించినా ఓటు హక్కును తృణీకరించవచ్చు. అప్పీల్ చేసుకుంటే ఎప్పటికి న్యాయం జరుగుతుందో చెప్పలేము. ‘సర్’ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన వారికి బెంగాల్, బిహార్లలోసంక్షేమ పథకాల వర్తింపును కూడా నిలిపేశారనీ వార్తలు వస్తు న్నాయి. ఇప్పటికే ఆధార్, పాస్‌పోర్ట్‌తో సహా ఏ కార్డూ పౌర సత్వానికి సూచిక కాదని అధికారులు చెబుతున్నారు. సరికొత్త ఓటర్ ఐడీ మాత్రమే పౌరసత్వానికి రుజువని చెబితే పరిస్థితి ఏమిటి? అలా జరగదని సుప్రీంకోర్టు చెబుతున్నది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాన్ని ఎన్నికల సంఘం గానీ, ప్రభుత్వం గానీ పాటించింది? పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ఉన్న భావప్రకటనా హక్కు, సమావేశ స్వేచ్ఛ... వంటి ఆరు హక్కులు వర్తిస్తాయి. ఈ పౌర హక్కులు న్నప్పుడే అక్రమ నిర్భాంధాలకు గురి చేస్తున్న రాజ్యంలో అవి లేనివారి పరిస్థితి ఏమిటి?రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని రాజకీయ బిల్లులు కూడా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో రెండు ప్రమాదకరమైన బిల్లులు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అధికార పదవుల్లో ఉన్నవారు 30 రోజులపాటు జైలుకెళ్లి వస్తే పదవిని కోల్పోతారనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో న్యాయమూ లేదు, నైతికతా లేదు, రాజ్యాంగ బద్ధతా లేదు. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను వేధించి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఉద్దేశించింది మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులో ప్రధానిని కూడా చేర్చిన ప్పటికీ, ఏ దర్యాప్తు సంస్థ ప్రధానమంత్రిని అరెస్టు చేస్తుంది? కేవలం ముఖ్యమంత్రులపైకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉంటుంది? దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినంత మాత్రాన, అభియోగాన్ని న్యాయస్థానంలో రుజువు కాకుండా పదవి కోల్పోవడమేమిటి? ఇది ప్రతిపక్షాల మీద చట్టబద్ధమైన దాడి. అలాగే ‘ఒక దేశం ఒక ఎన్నిక’ కూడా రాజ్యాంగ ఫెడరల్ స్వభావం మీద ప్రత్యక్ష దాడిగానే న్యాయ నిపుణులు భావి స్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే సవరణ చట్టాలు చెల్లుబాటు కావని గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. ఈ రెండు బిల్లులూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవే. అయినా ఇవి చట్టరూపం దాలిస్తే... వీటికి తోడుగా ‘సర్’ కోటాలో కొన్ని కోట్లమంది ఓటు హక్కు కోల్పోతే... సమానత్వం, లౌకికత్వం, స్వాతంత్య్రం పునాదుల మీద నిర్మితమైన రాజ్యాంగబద్ధ పాలనకు ప్రమాదం దాపురించినట్టే. పారాహుషార్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ దూసిన వీసా కత్తి!
మితవాద రాజకీయం ఊరకే ఉండదు. నిరంతరం కొత్త శత్రువుల్ని వెదుక్కుంటుంది. తన చర్యల పర్యవసానంగా పుట్టుకొచ్చే సంక్షోభాలనుంచి జనం దృష్టి మరల్చడానికి నానా తంటాలూ పడుతుంది. ఆ రాజకీయంలోనే పుట్టి, దాన్ని మరింత దిగజార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో దఫా వచ్చాక వలసలపై కత్తిగట్టారు. అమెరికాలో చదువుకోవటానికొచ్చినవారు గరిష్ఠంగా నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదంటూ తాజాగా తీసుకురావాలనుకుంటున్న నిబంధన ఆ పరంపరలో భాగమే. ఇతరేతర వీసాల సంగతి సరేసరి. ప్రపంచ దేశాల్లోని వారందరికీ ఉన్నత చదువుల గమ్యస్థానం అమెరికాయే. అక్కడ చదువుకుంటే సాఫ్ట్వేర్, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో మెరుగైన జీతాలతో కొలువులొస్తాయన్న నమ్మకమే అందుకు కారణం. అయితే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల విద్యార్థులకు మాత్రమే కాదు... అక్కడి విద్యాలయాలు, టెక్ రంగ సంస్థలకు కూడా సమస్యలొస్తాయి. విద్యాలయాల వేల కోట్ల ఆదాయం పడిపోతే, టెక్రంగ సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే స్థానికులతో పోలిస్తే విదేశాలనుంచి వచ్చే విద్యార్థులు చదువుల్లో, తెలివితేటల్లో చాలా ముందంజలో ఉంటారు. డిగ్రీ చదువులకొచ్చేవరకూ స్వదేశీయులకు అంతా ఉచితమే అయినా, అటుపై తడిసిమోపెడవుతుంది. వారితో పోలిస్తే నిజానికి విదేశీ విద్యార్థులు రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. ఆ మొత్తంతోనే స్థానికులకు స్కాలర్‌షిప్‌లిస్తారు. వారినుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తారు. స్థానికులు హ్యూమనిటీస్, ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, లా తదితర కోర్సుల్లో ఆసక్తి కనబరుస్తారు. సాంకేతిక రంగంలో దూసుకెళ్లే అమెరికాకు ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంలో నిపుణులు అవసరం. విదేశీయులు కఠినమైన వడపోత తర్వాత ఆ కోర్సులు చదవడానికి వెళ్లినవారు గనుక ఆ కోర్సులను సులభంగా ఆకళింపు చేసుకుంటారు. స్టెమ్ కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిలో 70 శాతం సీట్లు విదేశీయులకే లభించటం ఇందుకే. స్థానికుల్ని వారితో పోటీపడేలా తీర్చిదిద్దటానికి తాము చేయాల్సిందేమిటన్న దృష్టి ట్రంప్‌కుగానీ, ఆయన ముందున్న పాలకులకుగానీ లేదు. తగినంతమంది సాంకేతిక నిపుణులు స్థానికంగా లభ్యంకాకపోవటంవల్లనే అమెరికా దిగ్గజ టెక్ సంస్థలు విదేశాలనుంచి వచ్చేవారిని ఎంపిక చేసుకోవాల్సివస్తున్నది. అలా భర్తీ చేసుకోనట్టయితే ఇన్నోవేషన్ రంగంలో ఆ దేశం వెనకబడిపోతుంది. అదిగాక విదేశీ విద్యార్థులు చెల్లించే వేలాది కోట్ల డాలర్ల ఫీజులు, టెక్ సంస్థల విస్తరణ, లాభార్జనల వల్ల మరిన్ని వేలకోట్ల డాలర్లు పన్నుల రూపంలో ఖజానాకు సమకూరుతాయి. ఇతరత్రా సంస్థల సంగతలావుంచి మన భారత సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ పన్ను రూపంలోనే నిరుడు 867 కోట్ల డాలర్లు (రూ. 73,000 కోట్లకు పైగా) చెల్లించాయి. మొత్తంగా అన్ని సంస్థలూ 13,008 కోట్ల డాలర్లకు పైగా (రూ. 10,99,166 కోటు్ౖలపైగా) చెల్లించాయి. ఇవిగాక జీఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఉద్యోగులు చెల్లించే టీడీఎస్‌లు అదనం. ఇంతగా లాభపడుతూ బాధిత దేశంగా శోకించటం అమెరికాకే చెల్లింది. వీసా వ్యవస్థ దశాబ్దాలుగా దుర్వినియోగమవుతున్నదనీ, దేశ భద్రత ప్రమాదంలో పడిందనీ గొంతుచించుకుంటున్న అమెరికా తాను ఎడాపెడా వర్ధమాన, వెనకబడిన దేశాలనుంచి దశాబ్దాలుగా కొల్లగొడుతున్న సంపద గురించి మాట్లాడదు. ఇందులో ఆ దేశాల పాలకుల తప్పు కూడా ఉంది. మన దేశం సంగతే తీసుకుంటే 2047 కల్లా ‘వికసిత్ భారత్’ తీసుకొస్తామంటారు. కానీ అమెరికా మాదిరిగా కనీసం డిగ్రీవరకూ ఉచిత విద్య, నామమాత్రపు ఫీజులతో ఆపై విద్య అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేయరు. జీడీపీలో కనీసం 6 శాతం విద్యకు వ్యయం చేయాలన్న లక్ష్యం పాటించరు. హైస్కూల్ విద్యవరకూ శ్రద్ధ పెడుతున్నట్టు కనబడుతూ ఆపై చదువుల్ని కార్పొరేట్లకు వదిలేశారు. వేలాదిమంది ప్రొఫెసర్ల కొరతతో విశ్వవిద్యాలయాలు దయనీయ స్థితిలో పడినా పట్టదు. కొలువుల సంగతి సరేసరి. ఇలాంటి స్థితిలో ట్రంప్ బెదిరిస్తే, పరిమితులు విధిస్తే నిస్సహాయంగా మిగలటం తప్ప మన యువత చేయగలిగేది ఏముంది? -
ఆంక్షలను ధిక్కరించిన ఉక్కు సంకల్పం
భారతదేశ అణు ప్రయాణం, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక నిర్ణయాలు, చారిత్రక సవాళ్ల గురించి అభిజిత్ చావ్డా ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి.) వెనుక ఉన్న వివక్ష, పోఖ్రాన్ పరీక్షల ద్వారా భారత్ సాధించిన విజయం వంటి అంశాలను ప్రస్తావించారు:మొండితనం కాదు, మనుగడ నిర్ణయం‘‘అగ్ర దేశాలు 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఖరారు చేసినప్పుడు, వారు ఒక స్పష్టమైన గీత గీశారు. ‘మా దగ్గర 1967 కంటే ముందే అణ్వాయు ధాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని ఉంచుకుంటాం, కానీ మిగతా వాళ్లు ఎవరూ వాటిని తయారు చేసుకో కూడదు’ అని! నా దృష్టిలో ఇది ఆయుధాలను నియంత్రించే ఒప్పందం కాదు. కేవలం కొన్ని దేశాలకే ప్రాధాన్యం ఇచ్చే ఒక వివక్షతో కూడిన రాజకీయం. మన పొరుగు దేశాలు శత్రువులుగా మారుతున్న సమయంలో, ఇండియా తనను తాను రక్షించుకునే సార్వ భౌమ హక్కును వదులుకుంటూ ఈ ఒప్పందంపై సంతకం చేయాలని వారు ఆశించారు. ఇండియా ఎన్పీటీపై సంతకం చేయకపోవడం మొండితనం కాదు, అది మనుగడ కోసం తీసుకున్న స్పష్టమైన నిర్ణయం.భాభా ‘మరణం’ వెనుక అమెరికా!‘‘1966లో డాక్టర్ హోమీ భాభా మరణం చుట్టూ ఉన్న చీకటి కోణాలను, ఆయన అద్భుతమైన ఆలోచనలను అర్థం చేసుకోకుండా ఇండియా అణు ప్రయాణాన్ని మనం తెలుసుకోలేం. ఆ కాలపు చారిత్రక పరిణామా లను బట్టి చూస్తే, ఆల్ప్స్ పర్వతాలపై జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 101 ప్రమాదంలో భాభా మరణించడం ఒక ప్రమాదం కాదని నేను గట్టిగా నమ్ముతాను. అది ఇండియా అణు సామర్థ్యాలను సాధించడానికి ఎంత దగ్గరగా ఉందో చూసి భయపడిన విదేశీ నిఘా సంస్థలు – ముఖ్యంగా సి.ఐ.ఎ. – పన్నిన ఒక కుట్ర. మనం 18 నెలల్లోనే అణు పరికరాన్ని తయారు చేయ గలమని భాభా బహిరంగంగానే ప్రకటించారు. ఆయనను నిర్మూలించడం ద్వారా, విదేశీ శక్తులు మన అణు పురోగతిని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టాయి.ఆచితూచిన పేరు ‘స్మైలింగ్ బుద్ధ’‘‘మనం 1974లో పోఖ్రాన్–1 పరీక్షను నిర్వహించి నప్పుడు, దానికి ‘శాంతియుత అణు విస్ఫోటం’ (పి.ఎన్.ఇ.–పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్) అని పేరు పెట్టి, ‘స్మైలింగ్ బుద్ధ’ అనే రహస్య కోడ్‌ను ఉప యోగించాం. ఈ పేరు పెట్టడం ఆనాటి మన రాజకీయ నాయకత్వంలో ఉన్న తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లను, లోతైన సంకోచాన్ని తెలియజేస్తుంది.ముఖ్యంగా 1971 భారత్–పాక్ యుద్ధంలో పాక్‌కు అను కూలంగా భారత్‌పై ఒత్తిడి తేవటానికి అమెరికా తన ఏడవ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) బంగాళాఖాతంలో మోహరించిన తర్వాత, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకున్నాం. కానీ మనం ఒక అణు దేశ మని బహిరంగంగా ప్రకటించుకునే ధైర్యాన్ని అప్పట్లో ప్రదర్శించలేకపోయాం. ఈ ‘వ్యూహాత్మక అస్పష్టత’ (ఎటూ తేల్చని విధానం) అనే పాలసీ వల్ల 24 ఏళ్లపాటు దౌత్యపరమైన సందిగ్ధతలోనే ఉండిపోయాం. ఆఖరికి 1998లో వాజ్‌పేయి నాయకత్వంలో జరిగిన పోఖ్రాన్ –2 పరీక్షలు మాత్రమే, ఇండియా ఒక అణు దేశం అనే నిజాన్ని ప్రపంచానికి స్పష్టం చేశాయి.‘కల్పక్కం’ మన సత్తాను చాటింది!‘‘కొరతగా ఉన్న యురేనియంకు బదులుగా, మన దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలపై ఆధార పడిన మన ‘మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమం’ భారతీయ శాస్త్రవేత్తల స్వయం సమృద్ధికి ఒక గొప్ప నిద ర్శనం. 1974 అణు పరీక్షల తర్వాత పాశ్చాత్య దేశాలు మనపై కఠినమైన ఆంక్షలు విధించినప్పుడు, మన అణు రియాక్టర్లకు ఇంధనం అందకుండా చేసి, మనల్ని లొంగి పోయేలా చేయవచ్చని వారు భావించారు. కానీ వారి అహంకారం పూర్తిగా తిరగబడింది. కల్పక్కం వంటి కేంద్రాల్లోని మన శాస్త్రవేత్తలు ఒంటరిగానే కొత్త ఆవిష్క రణలు చేశారు. మరెవరూ ప్రాధాన్యం ఇవ్వని ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు’, ‘థోరియం వినియోగ చక్రాల’పై పట్టు సాధించారు. ప్రపంచ దేశాలు మనల్ని ఒంటరిని చేసినప్పటికీ, ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే సాంకేతికతను తన సొంత శక్తితో ఎలా నిర్మించు కోగలదో నిరూపించిన గొప్ప విజయ చిహ్నం అది.- ఎడిటోరియల్ టీమ్ -
ఉపేక్షించడం సరికాదు!
సమస్యలనూ, సంక్షోభాలనూ ఉపేక్షిస్తేనో, నిర్లక్ష్యం చేస్తేనో ముగిసిపోవు. మాయంకావు. వాటిని పట్టించుకుని, పరిష్కరించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గత నెల 6న మొదలుకొని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో విద్యారంగ సమస్యలపై ఆందోళన చేస్తోంది. గత 19 రోజులుగా విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నదనీ, మరో రెండురోజులు దీక్ష కొనసాగితే ఆయన ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నదనీ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం వాంగ్చుక్ను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయిస్తూ, ఆ నివేదికల్నిబట్టి వైద్యపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని గురువారం కేంద్రానికి సూచించింది. ఉద్యమకారులు ఒక్కరోజు నిరసనకు అనుమతి తీసుకుని అక్కడినుంచి కదలక పోవటం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అంశమే. అలాగని ఆ నిరసనపై పాలకులు కన్నెర్ర చేయలేదు. ఈ సంయమనాన్ని మెచ్చుకోవాల్సిందే. బహుశా సామాజిక మాధ్యమాల్లో సీజేపీ స్వల్పకాలంలోనే అనూహ్యంగా రెండుకోట్ల మందికిమించి మద్దతును సాధించటం ఇందుకొక కారణం కావొచ్చు. సరిగ్గా ఈ కారణంతోనే సీజేపీ దీర్ఘకాలిక ఆందోళనకు సిద్ధపడింది. అయితే నిరశనలతో వచ్చే సమస్యేమంటే... ఒక స్థాయికెళ్లాక జరగరానిది జరిగితే ఉద్యమం కాస్తా చేయిదాటే ప్రమాదం ఏర్పడుతుంది. ‘జాతీయ మీడియా’ ఈ ఉద్యమానికి ప్రాధాన్యం ఇవ్వనంతమాత్రాన ఇలాంటివి జరగబోవని చెప్పలేం. అందువల్లే ప్రతిష్ఠకు పోకుండా ప్రభుత్వం చర్చకు ఆహ్వానిస్తే పరిష్కారం సంగతి తర్వాత... ముందు తమ స్వరాన్ని విన్నారన్న సంకేతం వెళ్తుంది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసినప్పుడు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, మారిన పరిస్థితుల్లో ఏ సమస్యనైనా ప్రజాస్వామ్య పరిధిలో శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చనీ నక్సలైట్లకు అనేకులు హితవు పలికారు. ఇప్పుడు సీజేపీ ఉద్యమాన్ని ఉపేక్షించటంవల్ల వారిలో ఏ కొందరైనా తమ అభిప్రాయం తప్పన్న భావన కొచ్చే అవకాశం ఉండదా? ఉద్యమాలు వెల్లడించే సమస్యల తీవ్రతను గ్రహించటం పాలకులు చేయాల్సిన పని. ఇటు ఉద్యమకారులు కూడా ప్రభుత్వానికీ, ప్రజలకూ సమస్య తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించమని కోరడం తప్ప అందుకోసం తీవ్ర చర్యలకు పాల్పడటం సరికాదని గుర్తించాల్సివుంది. నెలన్నర నుంచి సాగుతున్న ఈ ఉద్యమంలో కొందరికి ఇప్పటికే ఈ అవగాహన ఏర్పడి ఉండొచ్చు. తనను నిరాహారదీక్ష విరమించుకోమంటున్నవారి కోసం వాంగ్‌చుక్ విడుదల చేసిన సందేశంలో ఒకచోట... ‘నేను దీక్ష విరమిస్తే ప్రభుత్వాలకు జవాబుదారీతనం అవసరం లేదన్న అభిప్రాయం కలగదా?’ అని ప్రశ్నించారు. జరిగిందేమిటో, విరమణ ఎందుకవసరమైందో ప్రజలు గ్రహించలేరనుకోవటం సరికాదు.ఢిల్లీ హైకోర్టు చెప్పినట్టు ఏ పౌరుడి ప్రాణమైనా విలువైనదే. కానీ వాంగ్‌చుక్ లాంటి అంకితభావంగల సామాజిక ఉద్యమకారులూ, భిన్నంగా ఆలోచించి సృజనాత్మక ఆవిష్కరణలు చేయగలిగినవారూ ఈ దేశానికి చాలా అవసరం. లద్దాఖ్ వంటి కఠినమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతానికి అనువైన వైవిధ్యభరిత ఆవిష్కరణలు చేసి ఆయన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు. శీతాకాలంలో నీరు వృథా పోతూ, సాగు కాలంలో నీటి ఎద్దడివుండే ఆ ప్రాంతంలో ఆ సమస్యకు తన మేధస్సుతో శాశ్వత పరిష్కారం చూపారు. సౌరశక్తి ఆధారిత మట్టి ఇళ్ల ఆలోచన కూడా ఆయనదే. సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో విధులు నిర్వహించే జవాన్లకోసం రూపొందించిన సౌరశక్తి టెంట్లు అపూర్వం. తన తండ్రి, జమ్మూ–కశ్మీర్ మాజీ మంత్రి అయిన సోనమ్ వాంగ్యాల్ ఒరవడిలో ఆయన ఉద్యమిస్తున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రప్రతిపత్తి, దాన్ని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజకీయ రక్షణ కల్పించడంవంటి డిమాండ్లతో ఈ మూడేళ్లలో పలుమార్లు ఆయన నిరశనలు చేశారు. శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అదే రీతిలో ముగియాలని, పట్టుదలకు పోకుండా చర్చలకు ఉపక్రమించాలని అనేకమంది కోరుకుంటున్నారు. అటు సోనమ్ వాంగ్‌చుక్, ఇటు ప్రభుత్వం వినాలి. -
కల్లోల పశ్చిమాసియా!
అమెరికా–ఇరాన్‌ల మధ్య గతవారం రోజులుగా అడపాదడపా సాగుతున్న దాడులు మంగళవారానికల్లా మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పటికే అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులు ఇద్దరు భారతీయ నావికుల ప్రాణాలు తీశాయి. దక్షిణ ఇరాన్‌పై అమెరికా సాగించిన దాడుల్లో 30 మంది పౌరులు, ఏడుగురు సైనికులు మరణించటం, దాదాపు 260 మంది గాయపడటం గమనిస్తే గతానికి మించి ఈసారి పౌర ప్రాంతాలను అమెరికా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తుంది. అంతేకాదు... అరుదుగా చేసే పగటిపూట దాడులు కూడా మొదలెట్టింది. ఇరాన్ సైతం అమెరికా మిత్ర దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. గత నెల 17న ఇరు దేశాలమధ్యా కుదిరిన శాంతి ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదని అమెరికన్ కాంగ్రెస్‌లోని పాలక, విపక్ష నేతలు గ్రహించారు. యుద్ధం ఎప్పుడో అయిపోయిందని బొంకటం మొదలుకొని కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పడం వరకూ ట్రంప్ ఒక పథకం ప్రకారం నడిపించారు. తన అధికారాలకు పరిమితులు విధిస్తూ యుద్ధ అధికారాల చట్టంకింద సెనేట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ చేసిన రెండు తీర్మానాలతో బెంబేలెత్తిన ట్రంప్ మొదట యుద్ధం ఎప్పుడో ఆగిందని అబద్ధమాడారు. మరికొన్ని రోజులు గడిచాక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, శాంతి ఒప్పందం దిశగా ఇది తొలి అడుగ న్నారు. తీరా ఇప్పుడు మళ్లీ యుద్ధ భేరి మోగించారు. నిజానికి అమెరికా దాడులు ఆపింది ఎప్పుడూ లేదు. ఏదో వంకతో ఇరాన్‌పై కొనసాగిస్తూనే ఉంది. కేవలం కొంత వ్యవధి గడిచింది గనుకే యుద్ధం మొదలైనట్టు అధికారికంగా కాంగ్రెస్‌కు వర్తమానం పంపారు. పర్యవసానంగా 60 రోజులపాటు మళ్లీ యుద్ధం సాగించవచ్చన్నది ఆయన వ్యూహం. ఇది చెల్లుబాటు కాదనీ, ఈ విషయంలో ట్రంప్ ఇష్టారాజ్యం సాగనివ్వబోమనీ ఇరు పార్టీల ప్రతినిధులూ చెబుతున్నది ఆచరణలో ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. గ్యాస్ ధరలు అపరిమితంగా పెరగటం, ఇతరేతర సరుకులు సైతం అందుబాటులో లేకపోవటంతో జనం బెంబే లెత్తుతుండగా మరిన్ని దాడులతో ఇరాన్ దారి కొస్తుందని ట్రంప్ కలగంటున్నారు. ఇరాన్‌తో లడాయి మొదలయ్యాక గ్యాస్ కోసం అమెరికా ఇంతవరకూ 5,640 కోట్ల డాలర్లు అదనంగా వెచ్చించిందని డెమాక్రాట్ల ఆధ్వర్యంలోని ఉమ్మడి ఆర్థిక కమిటీ అంచనా వేసింది. తాజా పరిణామాలతో వార్షిక రక్షణ విధాన బిల్లు ప్రవేశించకుండా సెనేట్‌లో 50–46 ఓట్ల తేడాతో నిరోధించటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారనే చెప్పాలి. సొంత పార్టీకి చెందినవారే అడ్డం తిరగటంతో బిల్లు సభాప్రవేశానికి అవసర మైన 60 ఓట్లు లభించలేదు. హార్మూజ్ జలసంధి విషయంలో ఏం చేయాలో ట్రంప్‌కు పాలుబోవడం లేదని ఆయన పరస్పర విరుద్ధ ప్రకటనలే చెబుతున్నాయి. ఇకపై హార్మూజ్‌లో నౌకల రాక పోకలు సక్రమంగా జరిగేలా చూడటం తమ బాధ్యతనీ, అందుకు 20 శాతం సుంకం వసూలు చేస్తామనీ ప్రకటించి 24 గంటలు గడవకుండా మాట మార్చారు. దేశదేశాల అధినేతలూ అమెరికాలో వందలకోట్ల డాలర్లు పెట్టుబడి పెడతామనటంతో నిర్ణయం మారిందట! అమెరికా, దాని మిత్రపక్షాలూ ఎప్పటిలాగే స్వేచ్ఛాయుత హార్మూజ్ కొన సాగాలని కోరుతూ రాగా, ఇప్పుడు అందుకు విరుద్ధమైన ప్రకటన రిపబ్లికన్లను సైతం దిగ్భ్రమపరిచింది. అంతర్జాతీయ జలరవాణా మార్గంపై ఏ దేశమైనా ఎలా పెత్తనం చేస్తుందన్న వారి ప్రశ్నకు ట్రంప్ దగ్గర జవాబు లేదు. సాధారణ సమయాల్లో హార్మూజ్‌ను రోజుకు 130 రవాణా నౌకలు దాటేవి. అవికాస్తా సోమవారానికి 10కి పడిపోయాయి. తాజా దాడుల తర్వాత అది పూర్తిగా స్తంభించి పోయింది. యుద్ధాలు, అస్థిరత చమురు కార్పొరేషన్లకు అసాధారణ లాభాలు తెస్తాయి. కానీ చమురు, సహజవాయు దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు ఆర్థికంగా కుంగి పోతాయి. పర్యావరణ పరిరక్షణ కోసమైనా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిద్దామని ఇన్ని దశాబ్దాలుగా ఏ దేశమూ చిత్తశుద్ధితో అనుకోలేదు. ఎక్కడో ఒకచోట తలెత్తే సంక్షోభానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించే ప్రస్తుత విధానం మంచిదో, ప్రత్యామ్నాయ వనరుల ఆసరాతో ఉన్నంతలో మెరుగ్గా మనుగడ సాగించటం ఉత్తమమో ప్రపంచ దేశాలన్నీ తేల్చుకోవటం తప్ప వేరే మార్గం లేదు. -
ఈసీ కొత్త మెలిక!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటికే దాదాపు అయిదున్నర కోట్లమంది ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి రికార్డు సృష్టించిన ఎన్నికల సంఘం(ఈసీ)... కొత్త రికార్డులు నెలకొల్పాలని తహతహలాడుతున్నట్టు కన బడుతోంది. 2002 నాటి ఓటర్ల జాబితాలో గల తమ తల్లిదండ్రుల వివరాలు పొందుపరి స్తేనే కొత్తగా 18 యేళ్లు నిండినవారూ, ఓటుహక్కు పొందదల్చుకున్న ఇతరులూ అర్హులవు తారని విధించిన తాజా నిబంధన ప్రకంపనలు రేపుతోంది. బిహార్‌తో మొదలెట్టి ఇంత వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ‘సర్’లో లేని నిబంధన ఇప్పుడు కొత్తగా అందరి నెత్తినా పడేసింది. 2002 నాటికే తల్లిదండ్రులు మరణించివున్నా... అప్పట్లో సమయానికి ఇంట్లో లేకపోవటంవల్లనో, పనిపాటల కోసం వేరే ప్రాంతంలో ఉండటంవల్లనో వారి ఓటు హక్కు గల్లంతైవుంటే అలాంటి వాళ్ల పరిస్థితేమిటో చెప్పాలన్న స్పృహ కూడా దానికి లేకుండా పోయింది. అలాంటివాళ్లు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చనటం తప్ప మరేమీ వివరణ లేదు! తీరా ఇస్తే ఈ నిబంధన సాకుతో తిరస్కరించటం తప్ప ఒరిగేదేముంటుంది? ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన పాలకుల పుణ్యమా అని ఈ దేశంలో ఇతర చీడలతో పాటు నిరక్షరాస్యత కూడా నిక్షేపంగా ఉంది. 2011 నాటి లెక్కల ప్రకారం అక్షరాస్యత 74.04 శాతం. ఇప్పుడు జాతీయ సగటు 81 శాతమని అంటున్నారు. సంతకం పెట్టగలి గినపాటి జ్ఞానం వచ్చినవారిని అక్షరాస్యులుగా లెక్కేయటంవల్ల ఈమాత్రం కనబడుతోంది. తేలిగ్గా దేన్నయినా చదవగలిగేవారెందరో చెప్పలేం. అలాంటివారు ఇరవైయ్యేళ్ల క్రితం తమ ఓటు ఎక్కడుందో గుర్తుపెట్టుకుని పాత చిట్టాలు వెతకగలరా? ఒకవేళ గుర్తున్నా 2008 పునర్విభజనలో చాలా నియోజకవర్గాల పేర్లు, వాటి పరిధిలోని ఊళ్లు మారాయి గనుక వాస్తవంగా తమ ఓటు ఏ పరిధిలోకి పోయిందో తెలుసుకోలేరు. పైగా ఇది సాగు సీజన్. నాట్లు, యూరియా కొనుగోలు, ఇతరేతర పనుల కోసం రైతులు ఇప్పటికే తిప్పలు పడుతున్నారు. వారి పిల్లలు సైతం ఆ పనులు పంచుకుంటే తప్ప ఒక కొలిక్కి రాదు. జనాన్ని బాధించటానికి ఇంతకన్నా మంచి అదును ఈసీకి దొరకలేనట్టుంది!ఈసీ తీసుకొచ్చిన ఈ ‘సర్’ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెప్పివుండొచ్చు. అందులో చోటు దొరకనివారు ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చన్న వెసులుబాటు కల్పించి వుండొచ్చు. కానీ అది నిగ్గుతేలేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. బెంగాల్ సంగతే తీసుకుంటే జాబితాల్లో గల్లంతైనవారు లక్షల్లో ఉండగా... ట్రిబ్యునళ్లు తేల్చిన కేసులు మూడు, నాలుగు వేలు మించలేదు. ఇలాగైతే అంతా తేలేసరికి కనీసం పాతికేళ్లు పడుతుందని న్యాయ నిపుణులు లెక్కేస్తున్నారు. ‘సర్’లో చోటు దొరక్కపోతే పింఛన్లు మొదలు కొని గ్యాస్ సిలెండర్ల సబ్సిడీ వరకూ సమస్తం ఆపేయటం కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. రేపో మాపో మీరు ఈ దేశ పౌరులు కాదు... ఇక్కడ ఉండటానికి అనర్హులని చెప్పినా ఆశ్చర్యం లేదు. పోనీ ఈసీ ‘స్వచ్ఛమైన’ జాబితాను రూపొందించగలుగుతోందా? పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు చెబుతున్నదాన్నిబట్టి చూస్తే యూపీలో కొన్ని చిరునామాల్లో వందలమంది ఓటర్లు నమోదైవున్నారు. ఇలాంటి ఆరోపణలకు ఈసీ వివరణ ఇచ్చిన దాఖలా లేదు. అసలు అలాంటి బాధ్యత ఉన్నట్టు కూడా అది గుర్తించే స్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల టీడీపీ కార్యాలయాల్లో, ఆ పార్టీ నేతల ఇళ్లలో ‘సర్’ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి... ఎవరికి ఇవ్వకూడదన్న నిర్ణయాలు జరుగుతున్నా యని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీడియాలో ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. అయినా ఈసీ ఉలకదు, పలకదు. సంబంధిత బీఎల్ఓలపై చర్యలుండవు. ఈ తంతు గమనిస్తే ఇది ‘తీసివేతల ఈసీ’గా కనబడుతోంది. గతంలో ఓటర్ల జాబితా సవరణలో కొత్తగా ఇన్ని లక్షలమంది జమ అయ్యారని... అందులో మొదటిసారి ఓటుహక్కు వచ్చినవారు ఇంతమంది అని ఈసీ గర్వంగా చెప్పుకునేది. ఇప్పుడు తీసివేతలే గర్వకారణంగా మారింది. ప్రపంచంలోనే అన్నీ డిజిటల్ చేశామని గొప్పగా చెప్పుకునే దేశంలో కాగితాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే స్థితి కల్పించిన ఘనత ఈసీది. మొత్తానికి ఆ సంస్థ మస్తిష్కంలో రేపటి రోజున ఎలాంటి ఆలోచనలు పుడతాయో, ఏం అమల్లోకొస్తుందో అని జనం భయపడే రోజులొచ్చాయి. -
ఆ నేరగాడు చిక్కినట్టేనా!
ఎనిమిదేళ్లుగా ఎన్నికల రుతువులో రాజకీయ పక్షాలు పరస్పరం బురద చల్లుకోవడానికి పనికొచ్చే అంశంగా మిగిలిపోయిన మహదేవ్ యాప్ స్కాంలో ఎట్టకేలకు సూత్రధారుల్లో ఒకడైన సౌరభ్ చంద్రశేఖర్ ఒమన్ పోలీసులకు ఇటీవల చిక్కడం కీలక పరిణామం. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో అమాయక పౌరులనుంచి రూ. 6,000 కోట్లు అపహరించిన ఈ యాప్ మన ఆర్థికవ్యవస్థ బలహీనతకు ఆనవాలు. ఈ సొమ్మంతా బ్యాంకుల ద్వారానే నేరగాళ్లకు చేరడం చిన్న విషయం కాదు. పలు రాజకీయ పక్షాల నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, ఉన్నతాధికారుల ప్రమేయంతోనే ఆ యాప్ వేల కోట్లు కొల్లగొట్టిందని జనం చెప్పుకోవటమే తప్ప అందుకు సాక్ష్యాధారాలు లేవు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు అనేకచోట్ల దాడులు చేశాయి. కొంతమందిని అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్ అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బాఘెల్‌కు రూ. 508 కోట్లు ఇచ్చానంటూ 2023 నవంబర్‌లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కేసులో అరెస్టయిన ఆసిమ్ దాస్ అనే వ్యక్తి అంగీకరించాడని ఈడీ ప్రకటించినా... రాజకీయ దుమారం రేగటం మినహా జరిగిందేమీ లేదు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతలు తమ వంతుగా బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు. తనతో బలవంతంగా ఆ మాట చెప్పించారని ఆ నిందితుడు కోర్టుముందు వాంగ్మూలం ఇవ్వడంతో అది కాస్తా చల్లారింది. ఈలోగా ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకొచ్చింది. పూర్వాశ్రమంలో ఒక జ్యూస్ సెంటర్ యజమాని అయిన సౌరభ్ చంద్రశేఖర్ ఎవరి ప్రమేయమూ లేకుండా ఎదిగాడంటే ఎవరూ నమ్మరు.మహదేవ్ యాప్ కొల్లగొట్టిన మొత్తం రూ. 6,000 కోట్లు అంటున్నా అంతకు మించి ఉండొచ్చు కూడా. ప్రపంచమంతా అబ్బురంగా మాట్లాడుకునే బూర్జ్ ఖలీఫాలో అత గాడికి పలు ఫ్లాట్లు ఉన్నాయని చెబుతారు. ఇవిగాక వేరే దేశాల్లో విలాసవంతమైన భవంతులు, హోటళ్లు, వందల కోట్లలో నడిచే ఇతర వ్యాపారాలు సరేసరి. చదువుసంధ్యలు పెద్దగాలేని, మూడు పదులు కూడా దాటని సౌరభ్ స్వల్పకాలంలోనే ఇంత కొల్లగొట్ట డానికి ఊతమిచ్చింది మనుషుల్లోని దురాశ, వ్యవస్థల నిరాసక్తత. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారన్న ఆసక్తి, రేసు గుర్రాల్లో ఏది విజేతగా నిలుస్తుందనే అంచనాలు మహదేవ్ యాప్‌కి పెద్ద మేత. మ్యాచ్ ఫిక్సింగ్‌లు సరేసరి. అరెస్టులూ, పరస్పర ఆరోపణలతో ఇంత దుమారం రేగినా... 2023లో ఆ యాప్‌ను నిషేధించినా, మొన్న ఏప్రిల్‌లో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త డొమైన్లతో ఆ యాప్ రెండు చేతులా కోట్ల రూపాయలు దండుకుంది. బుకీల ద్వారా పాలకపక్షంగా రాబోతున్న దెవరో, రెండో స్థానంలో ఉండబోయే పక్షానికి ఎన్ని స్థానాలొస్తాయో కాకరేపడం, బెట్టింగ్‌లు జోరందుకోవటం, సొమ్ములు కొల్లగొట్టడం, దక్షిణాఫ్రికా, కెన్యా, బ్యాంకాక్,హాంకాంగ్లనుంచి దీన్నంతా చక్కబెట్టడం ఈ దొంగల నిర్వహణాశైలి. సౌరభ్ పెళ్లికే రూ. 200 కోట్లు ఖర్చయిందనీ, బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు ప్రదర్శనలిచ్చారనీ సీబీఐ ఆరాలో తేలింది. ఇప్పుడు సౌరభ్‌ను పట్టుకున్న ఒమన్‌తో మన దేశానికి నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. కానీ ఇక్కడికి రప్పించాలంటే అతనిపై ఉన్న కేసులు, సాక్ష్యాధారాలు, కోర్టు రికార్డులు సమర్పించాలి. ఒప్పందం పరిధిలోకి అవి వస్తాయో రావో అక్కడి న్యాయ స్థానాలు తేల్చాలి. రెండేళ్ల క్రితం యూఏఈలో అరెస్టయినా ఆ దేశంతో నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవటంతో విడుదలయ్యాడు. సౌరభ్ సహచరుడు రవి ఉప్పల్ ఆచూకీ లేకుండాపోయాడు. అతగాడు వనౌటులో ఉన్నాడని మన నిఘా సంస్థలు అంచనా వేస్తున్నా, నిర్ధారణగా తేల్చలేకపోయాయి. జూదం దగ్గర మొదలైన దర్యాప్తు... హవాలా రాకెట్, నకిలీ కంపెనీలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు, స్థిరాస్తులు వగైరాలన్నీ బయటపడ్డాక దాని విస్తృతి పెరిగింది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ల ఆచూకీ రాబట్టడంలో, ఇక్కడికి రప్పించడంలో వ్యవస్థలు విఫలం కావటంవల్ల ఇలాంటివారు మరింత మంది పుట్టుకొస్తున్నారు. సౌరభ్‌ను సత్వరం తీసుకు రాగలిగితేనే నేరగాళ్లలో భయం ఏర్పడుతుంది. అతగాడే కాదు... రకరకాల పేర్లతో పలు రాష్ట్రాల్లో అనేకానేక సంస్థలు వెలుస్తున్నాయి. జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్టవేయడం తక్షణ కర్తవ్యం. -
ఉమ్మడి పౌర ప్రవర్తన
‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ, పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ; ఎంత తొందరలే హరి పూజకు, పొద్దుపొడవకముందె పూలిమ్మనీ’– అంటూ ఆశ్చర్యపోతారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఓ సినీగీతంలో! నిజమే, పూలిమ్మని రెమ్మరెమ్మనూ ఎవరు శాసించారు, ఏ చట్టం కొట్టి చెప్పింది? సృష్టిలోని సకలజీవులూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉమ్మడిగా సుఖజీవనం సాగించడానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లలో ఒకటి కదా అది! పట్టిచూస్తే తప్ప అర్థం కాని, మన అవగాహనకు అందని ప్రకృతి విశాల ప్రణాళికలో అది భాగం కదా! బుర్రలేదనుకునే పక్షీ, పశువూ, చెట్టూ, పుట్టా, రాయీ, రప్పా సైతం ప్రాకృతిక న్యాయంలో భాగమైనప్పుడు బుర్ర ఉందనుకునే మనిషి ఎందుకు కాడు?! సంస్కృతీ, నాగరికతా మార్గంలో వేల సంవత్సరాల ప్రస్థానం తర్వాత, ఇప్పటికైనా అయ్యాడా? అందులో ప్రకృతి ప్రణాళికకు పెడగా పడిన అడుగులెన్ని!జీవం మనిషిగా ఎదిగిన మొదట్లో చట్టాలు లేవు; మనుగడలో భాగంగా సాటి మనిషితో జతకట్టాడు, గుంపుగా ఎదిగాడు, అనేక గుంపులతో కలసి సామరస్యంగా సహజీవనం చేసే స్థాయికి చేరాడు. తన అస్తిత్వంలో ఎక్కువకాలం అలిఖిత శాసనాలే మనిషిని నడిపించాయి; మంచీ, మర్యాదా మప్పాయి; నీతీ, రీతీ నేర్పాయి; సభ్యత, శుభ్రత అలవరచాయి. అయినా ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. అవినీతి, అసభ్యత, అక్రమాల అధఃపాతాళపు లోతులు చూస్తూనే ఉన్నాడు. ప్రకృతిమార్గం నుంచి తప్పుకుని సృష్టికి ప్రతిసృష్టి చేసే ప్రావీణ్యం విర్రవీగడమే అందుకు కారణమా?! మానవ జనావాసాలు గుంపు దశనుంచి నగరాలుగా ఎదిగే క్రమంలో లిఖిత శాసనాలు వచ్చాయి. అయిదువేల సంవత్సరాల క్రితం ప్రాచీన సుమేరు నాగరికతా కాలంలో తెచ్చిన ‘ఉర్–నమ్ము’ అనే శిక్షాస్మృతిని తొలి స్మృతిగా చెబుతారు. ఆ తర్వాత క్రీ.పూ. 1750లో, బాబిలోనియా పాలకుడు హమ్మురాబి పేరిట శిక్షాస్మృతి వచ్చింది. ఆ తర్వాత క్రీ.పూ. 451లో ‘లా ఆఫ్ ట్వెల్వ్ టేబుల్స్’ పేరిట రోమన్ చట్టాలు వచ్చాయి. వాటిని క్రోడీకరిస్తూ క్రీ.శ. 529లో జెస్టీనియన్ శిక్షాస్మృతిని తెచ్చారు. ఆధునిక పౌరచట్టాలనూ, వ్యవస్థలనూ అదే ప్రభావితం చేసిందంటారు. మన దగ్గర క్రీ.పూ. 400లో అర్థశాస్త్రం, ఆ తర్వాత మనుçస్మృతితో సహా వివిధ స్మృతులు వచ్చి మానవ ప్రవర్తనను కట్టడి చేయడానికి ప్రయత్నించాయి. కులమతవర్గ భేదాలను దాటుకుంటూ ప్రజాస్వామ్యం దిశగా అడుగువేస్తున్న వర్తమానంలో ఈ ప్రాచీన స్మృతులు మంచి–చెడుల కలబోతగా కనిపించ డంలో ఆశ్చర్యం లేదు. క్రీస్తుశక ప్రారంభంలో మౌర్యచక్రవర్తి అశోకుడు ‘ధర్మస్తంభా’ల పేరిట దేశమంతటా స్థాపించిన లిఖిత శిలాస్తంభాలు జంతుబలుల నిషేధంతో సహా ఆయా విధినిషేధాలను శాసిస్తూనే; సత్కార్యాలను, దయను, దాతృత్వాన్ని, సత్యనిష్ఠను, పరిశుద్ధతను బోధించాయి; క్రౌర్యాన్ని, కోపాన్ని, గర్వాన్ని విడిచిపెట్టమనీ; అన్ని మతా లను, పంథాలను గౌరవించమనీ చెప్పాయి. మనిషి ప్రవర్తనను చట్టాలూ, శిక్షలతోనే కాదు; తగిన హితబోధతో మానసిక పరివర్తన ద్వారా కూడా కట్టడి చేసే ప్రయత్నం ముందునుంచీ జమిలిగా సాగింది. ప్రభుత్వాలు చట్టాలు, శిక్షలతో చేయబోయిందే – వేదాలూ, కావ్యేతిహాసాలు సహా ప్రపంచ వాఙ్మయమంతా హితబోధతో చేయబోయింది. అందుకే ప్రత్యేకించి కావ్యాలను కాంతాసమ్మితాలన్నారు. ‘భగవంతుడు ఆకలిచావును విధించలేదు, తిండి ఉన్నవాడు కూడా చావక తప్పదు; తనకున్నదాన్ని ఇతరులతో పంచుకునేవాడు ఎప్పటికీ అణ గారడు; దాతృత్వం లేనివాడు ఒంటరి అయిపోతా’డంటుంది ఋగ్వేదం. దయ, ధర్మం లేని కొంప కొంపే కాదంటుంది. విజ్ఞతా, వినయాలే తప్ప అహంకారం, ధిక్కారం పని చేయవని మహాభారతంలోని యక్షప్రశ్నల ఘట్టం చెబుతుంది. ఒక యక్షుడికి చెందిన చెరువులో నీళ్ళు తాగబోయి, అతని ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నిరాకరించి, ధిక్కరించి తన నలుగురు సోదరులూ స్పృహ కోల్పోయినప్పుడు ధర్మరాజు వినమ్రంగా జవాబు చెప్పి సోదరులను బతికించుకుంటాడు. కనుక చట్టాలకూ, హితబోధకూ మధ్య సమతూకం తప్పనిసరి. ఏది ఎక్కువైనా సత్ప్రవర్తన గల్లంతవుతుంది. చట్టాలే సర్వస్వ మనుకుంటే వాటి ఉల్లంఘనా సర్వసామాన్యమవుతుంది. ఉమ్మడి పౌరస్మృతులతో పాటు హితమార్గంలో ఉమ్మడి పౌర ప్రవర్తనను తీర్చిదిద్దడమూ అంతే అవసరం. -
అనిశ్చితిలో వెలుగురేఖ
‘బలవంతుడ నాకేమని...’ అనుకుంటే దశాబ్దాల తరబడి అమెరికా నిర్మించుకుంటూ వస్తున్న పునాదులు కదిలిపోతాయని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంకా జ్ఞానో దయం కాలేదు. నాటో శిఖరాగ్ర సదస్సుకు పోయి ఈసారి కాస్తంత స్నేహపూర్వకంగా మాట్లాడినా అటువైపునుంచి మునుపటి సాన్నిహిత్యం లేదని తుర్కియేలో ముగిసిన ఆ సదస్సు తీరుతెన్నులు చెబుతున్నాయి. అమెరికాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్న మన దేశం సైతం ఆయన తరచు చేసే ప్రకటనల కారణంగా ఇబ్బంది పడుతోంది. హఠాత్తుగా ‘ఇండో–పసిఫిక్’ పేరు మారాక లోలోన అసంతృప్తి సరేసరి. ఈ నేపథ్యంలో ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరిని తేటతెల్లం చేసేలా, మన చొరవను మరింత పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీ ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల పర్యటన ఈ నెల 6న మొదలైంది. ఇప్పటికే ఇండొనేసియా, ఆస్ట్రేలియా పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ శుక్రవారం న్యూజిలాండ్ చేరుకున్నారు. అమెరికా, చైనాలతో... వాటి వైఖరులతో సంబంధం లేకుండా భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో భిన్న దేశాల సహకారం అవసరమని మన దేశం భావించబట్టే ఈ పర్యటన ఖరారైంది. ఈ మూడూ సాగరప్రాంత దేశాలు. ఎప్పుడో 1992లోనే రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’ విధానానికి కొనసాగింపుగా మన దేశం ‘మహాసాగర్’ దార్శనికతను ప్రతిపాదించింది. పరస్పర సంపూర్ణ అభివృద్ధికి ప్రాంతాలవారీ భద్రత, సమగ్రవృద్ధి అవసరమన్నదిదాని సారాంశం. సాధారణ ఆర్థిక సంబంధాలు మొదలుకొని భారీ రక్షణ, ఇంధన భాగస్వామ్యం వరకూ అనేకం దీని పరిధిలోకొస్తాయి. ఆస్ట్రేలియాతో గురువారం కుదిరిన పౌర అణుశక్తి ఒప్పందం చరిత్రాత్మకమైనది. ఇదిగాక ఆధునిక సాంకేతికతలూ, రక్షణ, భద్రత సహకారం, సరఫరా గొలుసు మెరుగు పరచటం తదితరాలకు సంబంధించి మరో 18 ఒప్పందాలు కుదిరాయి. పారిస్ఒప్పందం కింద స్వచ్ఛ ఇంధన లక్ష్యం సాధనకు మన అణు రియాక్టర్లకు నిరంతరాయంగా యురేనియం అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.7 గిగావాట్ల అణు విద్యుత్‌ను 2047కల్లా 100 గిగావాట్లకు పెంచాలని భారత్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రపంచ యురేనియం నిక్షేపాల్లో 28 శాతంగల ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదరటం కీలక పరిణామం. ప్రపంచ పరిణామాల కారణంగా హఠాత్తుగా నిలిచిపోతున్న ఇంధన సరఫరా తీరును సరిదిద్దటానికి ఎల్ఎన్జీ, బొగ్గు, డీజిల్వంటి సంప్రదాయ ఇంధన వనరుల విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఏనాటి నుంచో సాన్నిహిత్యంగల ఇండొనేసియాతో మరిన్ని రంగాల్లో సహకారానికి ఈ నెల 6నుంచి 8వరకూ వరసగా మూడురోజులపాటు కొనసాగిన పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి. మన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల్ని కొనుగోలు చేయటానికి ఇండొనేసియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాలూ కలిసి ఇండొనేసియాలోని ఆచే, అండమాన్, నికోబార్ దీవుల్లో నౌకాశ్రయాలను నిర్మించటానికి కూడా అధినేతలిద్దరూ అంగీకరించారు. అలాగే హిందూసముద్రం మొదలుకొని పసిఫిక్ మహాసముద్రంవరకూ పరస్పర సహకారంతో సముద్రజలాల్లో భద్రతను పెంచటానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియాలతో ఉన్న సహకారానికి ఇండొనేసియా కూడా తోడుకావటం వల్ల ఇండో–పసిఫిక్‌లో పటిష్టమైన సమన్వయం ఏర్పడుతుంది. చైనాతో అంటకాగటానికిట్రంప్ ప్రయత్నిస్తున్న దశలో ఇది కీలక పరిణామం. నిరుడు మన దేశంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పర్యటించినప్పుడు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మొన్న ఏప్రిల్‌లో రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. దీన్ని మున్ముందు మరింత విస్తృతపర్చుకోవటానికి ఇప్పటికే ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. కూటముల్లో చేరే విషయంలో న్యూజిలాండ్‌కు పెద్దగా ఆసక్తి లేదు. అయితే ప్రాంతీయ భద్రతను పెంపొందించుకోవటానికి భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. మొత్తానికి మోదీ మూడు దేశాల పర్యటన ఇండో–పసిఫిక్‌లో భారత్ పలుకుబడిని మరింత పెంచుతుంది. -
సంక్షోభం ఒక క్రూరమైన గురువు
ఆర్థిక సంక్షోభాల నుండి లభించే జీవిత పాఠాలు, వ్యాపార ప్రయోగాల ద్వారా మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం, ఆటోమేషన్ యుగంలో నైపుణ్యాల ప్రాముఖ్యం గురించి కునాల్ షా ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఇందులోని ముఖ్యాంశాలు:నిన్నటి కష్టమే నేటి మన నమ్మకం‘‘మా కుటుంబ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు, మాకు అండగా నిలిచిన రక్షణ వలయాన్ని పూర్తిగా కోల్పోయాం. అప్పటినుండి బతకటం కోసమే కష్టపడ్డాను. పిల్లలకు ట్యూషన్లు చెప్పాను, ఒక సైబర్ కేఫ్ నడిపాను, పాటల సీడీలు అమ్మాను. మన విద్యావ్యవస్థ కేవలం రూల్స్ పాటించే మంచి ఉద్యోగులుగా తయారు చేయ డానికే శిక్షణ ఇస్తుంది కానీ బతకటానికి కావలసిన ప్రాథ మిక మెళకువలను నేర్పదు. నా 16వ ఏటనే ఈ ప్రపంచాన్ని ‘సప్లయ్ అండ్ డిమాండ్’ కోణంలో చూడటం వల్ల... ‘స్టార్టప్’ అనే పదాన్ని వినటానికి చాలా ముందే, మార్కెట్లో ఉన్న లోపాలను, అవకాశాలను ఎలా గుర్తించాలో నేర్చుకున్నాను. సంక్షోభం ఒక క్రూరమైన గురువు, కానీ అది మిమ్మల్ని ఇతరుల కన్నా ఎక్కువ దృఢంగా మార్చి, ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది.మార్కెట్‌కు మేధస్సు ఎందుకు?‘‘నన్ను నేను, అనుకోకుండా వ్యాపారవేత్తగా మారిన ఒక తత్వశాస్త్ర విద్యార్థిగా భావిస్తాను. మనుషులు ఏ పనినైనా ఎందుకు చేస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలనే విపరీతమైన ఆరాటం నాలో ఉంది. కేవలం పుస్తకాలు చదవడం, సిద్ధాంతాలను పోగుచేసు కోవడం అనేది మేధోపరమైన అతిశయం మాత్రమే అవుతుంది. నా దృష్టిలో, ఒక కంపెనీని నిర్మించడం అత్యున్నత ప్రయోగశాల. మానవ ప్రవర్తన గురించి నాకో సిద్ధాంతం తోచినప్పుడు, నేను దాని గురించి కేవలం ఒక వ్యాసం రాసి వదిలేయను. ‘ఫ్రీచార్జ్’ లేదా ‘క్రెడ్’ లాంటి ఒక ప్రాడక్ట్‌ను నిర్మిస్తాను. లక్షల కొద్దీ ప్రజలు దానిని ఉపయోగిస్తే, మానవ స్వభావంపై నాకున్న అవగాహన సరైనదని అర్థం. వారు ఉపయోగించకపోతే, నేను తప్పు అని అర్థం. మన ఐడియాలకు ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నిజమైన స్కోరును ఇచ్చే ఏకైక రంగం వ్యాపారం మాత్రమే.మిమ్మల్ని కాపాడేది మీ నైపుణ్యమే!‘‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనం ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ లేబర్ చౌకగా దొరుకుతుంది కాబట్టి, కేవలం మనుషులకు ఏదో ఒక పని కల్పించడం కోసమే కృత్రిమ లోపాలను/ అవసరాలను సృష్టించాం. లిఫ్ట్‌లో కేవలం బటన్ నొక్క డమే పనిగా ఉన్న మనుషులు కనిపిస్తారు. ఒక స్మార్ట్ కెమెరా చేయగలిగే సెక్యూరిటీ చెకింగ్ పనిని ముగ్గురు వ్యక్తులు చేస్తుంటారు. పెట్టుబడిదారీ విధానం, ఆటోమే షన్ దూసుకుపోతున్న కొద్దీ, ఇలాంటి అనవసరమైన ఉద్యోగాలు రాత్రికి రాత్రే తుడిచి పెట్టుకుపోతాయి. సామర్థ్యం లేకుండా ఉద్యోగాలను మీరు ఎప్పటికీ కాపాడుతూ కూర్చోలేరు. ఇంటర్నెట్కు, ఏఐకి మీ సెంటి మెంట్లతో పని లేదు. వాటికి మీ నైపుణ్యం కావాలి.సంకుచిత ఆలోచన సంపదనివ్వదు!‘‘చాలామంది ‘కొరత మానసిక స్థితి’లో ఉంటారు. వారు ఎవరినైనా కలిసినప్పుడు, ‘ఈ వ్యక్తి నుండి నేను ఏం ఆశించవచ్చు?’ అని ఆలోచిస్తూ గదిలోకి అడుగు పెడతారు. ఆర్థికంగా వెనుకబడే ఉండటానికి ఇది వేగ వంతమైన మార్గం. నాకు తెలిసిన సంపన్నులు ‘సమృద్ధి ఆలోచనా విధానం’తో పని చేస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ విజయపథంలో నడిపించాలనే తపన వారిలో బలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యవస్థకు సంబంధించిన మొత్తం లాభాల పరిధిని పెంచడం పైనే మీరు దృష్టి పెడితే, అందులో మీ వాటా సహజంగానే చాలా పెద్దదవుతుంది.- ఎడిటోరియల్ టీమ్ -
భారత్‌కు ‘క్లీన్ చిట్’
మూడేళ్లుగా భారత్‌ను వెన్నాడుతున్న ఒక నీలాపనింద తొలగిపోయింది. కెనడాలో ‘గుర్తు తెలియని వ్యక్తుల’ చేతుల్లో హత్యకు గురైన ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ ఉదంతంలో మన ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం లేదని నిగ్గుదేలినట్టు బుధవారం అమెరికా, కెనడా ప్రకటించాయి. భారత అధికారుల కనుసన్నల్లోనే నిజ్జార్ హత్య జరిగిందంటూ కెనడా పార్లమెంటులో 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దాంతోపాటు ఇరుదేశాలూ దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించు కున్నాయి. ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని మన ప్రభుత్వం కొట్టిపారేసింది. చివరకు అదే రుజువైంది. కెనడాలో సిక్కు ఓట్లు పొందటం కోసం ఖలిస్తానీవాదుల్ని సంతోషపరచటానికే ట్రూడో భారత్‌పై ఆరోపణ చేశారని అప్పట్లో మన ప్రభుత్వం విమర్శించింది. అయితే భారత్ కేంద్రంగా ఖండాంతరాల్లో మూడు నేరస్త ముఠాలు పనిచేస్తున్నాయని, ఇవి తమ దేశంలోనూ, కెనడాలోనూ, యూరప్‌లోనూ హత్యలకూ, బెదిరింపులకూ, మాదకద్రవ్యాల వ్యాప్తికీ కారణమవుతున్నాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించటం మన పోలీసు, నిఘా వ్యవస్థల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ నేరాల సూత్రధారుల్లో ఒకడైన లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. మరొక వ్యక్తి జగ్గూ భగవాన్‌పురియా అస్సాం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ జైళ్లనుంచే చెరో ముఠాకూ నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ కార్యకలాపాలు నడుపుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరో వ్యక్తి రవిందర్‌సింగ్ ధండ్సా కెనడాలోనూ... బిష్ణోయ్ ముఠాలోని సతీందర్సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అమెరికాలోనూ తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో గోల్డీ బ్రార్‌ను పట్టిస్తే 50,000 డాలర్లిస్తామని ఎఫ్‌బీఐ చెప్పడం గమనించదగ్గది. మొత్తంగా 37 మంది నిందితుల్లో 24 మందిని అమెరికా, కెనడా, యూరప్‌లు ఉమ్మడిగా సాగించిన ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’లో అరెస్టు చేశారు. వీరంతా అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రపంచీకరణ తర్వాత ఇతరత్రా అభివృద్ధి మాటేమోగానీ... నేర ముఠాల కార్యకలా పాలు ఊహాతీతంగా విస్తరించాయి. ఖండాంతరాలకు వ్యాపించాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ఏలుబడిలో నక్సలైట్లను అరికట్టే పేరిట నయీం చేసిన అకృత్యా లకు అంతులేదు. అతగాడు తెలంగాణ ఉద్యమకారులనూ, మేధావులనూ బెదిరించటంతో ఊరుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరమై ఎదిగిన బెల్లి లలిత అనే యువ గాయని ప్రాణాలు తీశాడు. అనేకమందిని కిడ్నాప్ చేశాడు. వందల ఎకరాల భూముల్ని కబ్జా చేశాడు. కొన్నాళ్ళు జైలు నుంచే కార్యకలాపాలు నడిపాడు. పంజాబ్‌లో పరిస్థితి భిన్నమైనది. అక్కడ హరితవిప్లవ కాలం నుంచీ పోగుపడిన సంపదకు ప్రపంచీకరణ అనంతర పరిణామాలు తోడుకావటంతో అక్రమ వసూళ్ల దందా, సామాజిక మాధ్య మాల్లో ప్రముఖులుగా మారి, విదేశాల్లో సైతం ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగిన గ్రామీణ యువ కళాకారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవటం పెరిగింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకుల్ని సంపాదించి, విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన యువ వాగ్గేయకారుడు సిద్ధూ మూసేవాలను గోల్డీ బ్రార్ ముఠా కాల్చిచంపింది. బిష్ణోయ్ అభీష్టానికి భిన్నంగా ఒక కబడ్డీ జట్టును ప్రోత్సహించటం ఈ హత్యకు కారణం! ఇప్పుడు జైళ్లలోవున్న లారెన్స్, భగవాన్పురియాలతోపాటు ఒక పంజాబీ అమెరికన్ కుటుంబాన్ని హత్య కేసులో ఇరికిస్తామని బెదిరించి, 4 లక్షల డాలర్లు (3.81 కోట్లు) డిమాండ్ చేసిన పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ గురిందర్ సింగ్ నాగ్రాను కూడా అప్పగించాలని అమెరికా కోరుతోంది. భగవాన్‌పురియా ముఠా చేసే పలు నేరాలకు గురిందర్ సహకరిస్తున్నాడన్నది ఎఫ్‌బీఐ ఆరోపణ. ఇవిగాక అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉద్యమకారుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడన్న అభియోగాలతో ఎన్నారై నిఖిల్ గుప్తా అమెరికా జైల్లో ఉన్నాడు. వికాస్ యాదవ్ అనే భారతీయ అధికారి ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరి గిందని అమెరికా ఆరోపించింది. దేశాన్ని అప్రదిష్టపాలుచేసే ఇలాంటి వారిపట్ల కఠినంగా ఉండాలి. వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి. ఎల్లకాలమూ చట్టానికి దొరక్కుండా తప్పించుకోవటం సాధ్యంకాదని తాజా పరిణామాలు తెలియ జెబుతున్నాయి. -
మళ్లీ మొదటికి...!
అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన అరవై రోజుల అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ఇరవై రోజులకే ముక్కలైంది. శాంతి సాధన దిశగా తొలి అడుగు పడిందని అందరూ సంతోషించి ఎంతో కాలం కాకుండానే అది ముగిసిపోయింది. తుర్కియేలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సంగతి ప్రకటించారు. ఈ రాత్రికి భీకరదాడులుంటాయని కూడా హెచ్చరించారు. నిలకడ తక్కువ... నోటి దురుసు ఎక్కువవున్న ట్రంప్ ఎంఓయూపై సంతకాలైన క్షణంనుంచి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కిందపడినట్టు ప్రపంచమంతటికీ తెలిసినా తనదే పైచేయి అని చెప్పడానికి తాపత్రయపడ్డారు. ఎంఓయూ తర్వాత ఇలా జరగటం ఇది మూడో సారి. ఈ దాడులకు దీటుగా బదులిచ్చినట్టు, అమెరికా మిత్ర దేశాల్లోని దాని స్థావరాలపై క్షిపణులు ప్రయోగించినట్టు ఇరాన్ చెబుతోంది. ఒప్పందం కుదిరిందన్న మాటేగానీ... పశ్చిమాసియా అంతటా ఒక విధమైన ఉద్రిక్తత, అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నాయి. హార్మూజ్ జలసంధినుంచి నౌకలు సురక్షితంగా బయటపడటం అనునిత్యం వార్తే అయింది. శాంతి అనేది వీరోచిత శ్రమనూ, త్యాగాన్నీ కోరుతుందని ఆధ్యాత్మికవేత్త థామస్ మెర్టన్ అంటాడు. పరస్పర అవగాహనతో తప్ప బలప్రయోగంతో శాంతి అసాధ్యమన్నది విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాట. వీరత్వమూ, త్యాగమూ ట్రంప్‌కు ఏమాత్రం సరిపడని పదాలు. బలప్రయోగంతోనే శాంతి సాధ్యమన్నది ఆయన కుండే మూఢవిశ్వాసం. గత నెల జూన్ 17న కుదిరిన ఆ ఒప్పందం ఈ స్వల్పకాలం బతికివుందంటేనే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే సంతకం చేసింది అమెరికానే అయినా, ఆ దేశాన్ని శాసించేది ఇజ్రాయెల్. ఆ రోజే శాపనార్థాలు పెట్టిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ... మధ్యమధ్యలో లెబనాన్‌పై ఏదో వంకన దాడులు సాగిస్తూనే వచ్చారు. నాటో శిఖరాగ్ర సదస్సుకు అంకారా వచ్చిన సందర్భంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇచ్చిన విందుకు హాజరై వెళ్లాక హఠాత్తుగా ట్రంప్ ఈ దాడుల ప్రకటన చేయగానే సభ్య దేశాలు నివ్వెరపోయాయి. హార్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఇలా చేయాల్సివచ్చిందనీ, ముడి చమురు విక్రయించడానికి ఇరాన్కిచ్చిన లైసెన్సు రద్దయిందనీ ఆయన చెప్పాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని అందరికీ అర్థమైంది. శాంతి కోసం నాటో దేశాలు చేసిందేమీ లేదు గానీ... అది కుదిరితే లబ్ధిపొందడానికి మాత్రం పాకులాడాయి. వేరే దేశాల పర్యటనల మధ్యన యుద్ధానికి దిగమని అధ్యక్షుడు ఆదేశించటం అరుదు. 2011లో బ్రెజిల్ పర్యటనలో ఉండగా అప్పటి అధ్యక్షుడు ఒబామా లిబియాపై దాడులకు ఆదేశించారు. ఆయుధాలపై నాటో దేశాలు ఖర్చుపెట్టాల్సిందేనని పట్టుబడుతున్న ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవటానికి అవి నానా తంటాలూ పడుతున్నాయి. అందులో సింహభాగం అమెరికన్ ఆయుధాలకే వెచ్చిస్తున్నామని చెబితే విని సంతోషపడతారని ఊహించాయి. కానీ ఇరాన్‌పై దాడులు మొదలైనాక సహకరించమని కోరితే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ నిరాకరించాయన్న కోపం ఆయనకు పోలేదు. ఆ సంగతి ఎర్డోగాన్ చెవిన వేయడంతోపాటు, తుర్కియే కోసమే నాటోలో కొనసాగుతున్నామని కూడా చెప్పారు. కాసేపటికే తాజా దాడుల సంగతి ప్రకటించారు. అవగాహన ఒప్పందం వాలకం చూస్తేనే ఎవరికీ విశ్వాసం కలగలేదు. దానివల్ల ఒరిగిందల్లా హార్మూజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు నిలిపేయటం, ముడి చమురు అమ్ముకోవటానికి అమెరికా ఇరాన్‌ను అనుమతించటం. హార్మూజ్‌లో సుంకాల వసూలు, స్తంభించిన ఇరాన్ ఆస్తుల బదలాయింపు, ఇరాన్ అణు కార్యక్రమం నిలిపేయటం వంటివన్నీ తదుపరి చర్చలకు వాయిదాపడ్డాయి. ఇరాన్ బలంగా కోరుకునే అంశాలన్నీ ఎంఓయూలో ప్రస్తావనకు రాకపోవటంతో మొదట్లోనే చాలామంది పెదవి విరిచారు. ఈ యుద్ధంతో అన్ని దేశాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. తాజా దాడుల తర్వాత స్టాక్ మార్కెట్లు కళ్లు తేలేస్తున్నాయి. ముడిచమురు ధర 5 శాతం పెరిగింది. ఇరాన్ మత నాయకుడు ఖమేనీ అంత్యక్రియల పర్వం పూర్తయ్యేవరకూ కూడా ట్రంప్ ఆగలేక పోయారు. తన హామీని తానే ఉల్లంఘించారు. ఎన్నిసార్లు భంగపడుతున్నా ట్రంప్‌కు తత్వం బోధపడక పోవటం విచారకరం. అగ్రరాజ్యాధినేతగా బాధ్యతాయుత ప్రవర్తన అవసరమని ఆయన గ్రహించేదెన్నడో? -
మళ్లీ వరదకష్టాల్లో ముంబై
ఎప్పటి మాదిరే ముంబై మహానగరం భారీ వర్షాలతో తడిసి ముద్దయింది. గత ఆరు రోజుల కుంభవృష్టితో 13 మంది మరణించారు. జనావాసాలు వరద నీట మునగడం, చెట్లు కూలడం, రోడ్ల ఆచూకీ తెలియకుండా పోవటం, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి వాహనదారులు దిక్కుతోచని స్థితికి చేరటం, రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవటం, విద్యాసంస్థలన్నీ మూతపడటం, పరీక్షలు వాయిదాలు పడటం... ఇవన్నీ దాదాపు ప్రతియేటా ముంబై ప్రజలకు రివాజుగా మారాయి. ఒక పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం బృహన్ముంబై కార్పొరేషన్(బీఎంసీ)ని అనవసరంగా నిందించవద్దని బొంబాయి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. భూదురాక్రమణలకు పాల్పడటం, పేవ్మెంట్లు ఆక్రమించటం, చెత్తను ఎక్కడికక్కడ మురికి కాల్వల్లోకి తోసేయటం వంటి ధోరణులే సమస్యల్ని సృష్టిస్తున్నాయని తెలిపింది. అది నిజమే కావొచ్చుగానీ... అలాంటి ధోరణులను అరికట్టే బాధ్యత కూడా బీఎంసీదే. ఆ విషయంలో అది విఫలం కావటంవల్లనే ప్రతియేటా సమస్యలు తప్పడంలేదు. వానాకాలం వచ్చిందంటే ముంబైలో పెనుగాలులు, కుంభవృష్టి ఏకకాలంలో విరుచుకుపడుతుంటాయి. భౌగోళికంగా ముంబై ఉన్న స్థానం అటువంటిది గనుక ఇది అనివార్యమైన పరిస్థితి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందేమిటన్న అంశంపై సమగ్ర దృష్టి సారిస్తే పరిష్కారం లభించకపోదు. ప్రభుత్వాలు ఆ పని చేయవు. బీఎంసీ ఒత్తిడి తీసుకురాదు. ముంబై ఒకప్పుడు ఏడు దీవుల సమాహారం. వాటిమధ్య 1784 నుంచి 1845 వరకూ మట్టి నింపుతూ పోవటం వల్ల ఇప్పుడున్న భౌగోళిక రూపం వచ్చింది. సముద్ర మట్టానికి ఈ నగరం కేవలం 14 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొన్నిచోట్ల ఒకటి, రెండు మీటర్లకు మించి లేదు. ముంబై వరదనీటì కోసం నాలుగు నదులున్నాయి. నాలాలున్నాయి. వీటి ద్వారా నీరంతా సముద్రంలో కలుస్తుంది. కానీ వర్షాల తీవ్రత వుండి, సముద్రపు పోటు అధికంగా ఉంటే ఇవి అక్కరకు రావు. భూ మాఫియాల పుణ్యమా అని తీరాన ఉన్న మడ అడవులు, చిత్తడి నేలలు మాయమై రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుతుంటే నిలువరించే వ్యవస్థలు లేవు. బ్రిటిష్ కాలంనాటి డ్రెయినేజీ వ్యవస్థ, కాంక్రీట్ నిర్మాణాలు, మరోపక్క వలసలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.నీటితో కలిసి జీవించటం అలవాటు చేసుకుంటే, అందుకనుగుణమైన జీవన విధానం అలవరుచుకుంటే ఇంత చేటు సమస్య ఉండదు. టోక్యో నగరం ఇందుకు ఉదాహరణ. అక్కడ ప్రతియేటా తుపాన్లు తప్పవు. పర్యవసానంగా వరదనీరు ముంచె త్తుతుంది. దీన్ని అధిగమించటం కోసం 2006లో ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ వరద నీటి మళ్లింపు వ్యవస్థను నిర్మించింది. నగరం కింద 50 మీటర్ల లోతులో 6.3 కిలోమీటర్ల పొడవునా భారీ టన్నెళ్లు ఏర్పరిచారు. భారీ వరద నీరు ముంచెత్తినప్పుడు అదంతా ఆ టన్నెళ్లకూ, అక్కడినుంచి అయిదు అతి పెద్ద బావుల్లోకీ... వాటినుంచి భారీ భూగర్భ ట్యాంకుల్లోకీ పోతుంది. అక్కడినుంచి శక్తిమంతమైన జెట్ ఇంజన్ పైపులతో ఆ నీటిని తోడి నగరం ఆవలి భాగంలోని ఎడొగావా నదిలోకి పంపుతారు. చైనాలోనూ స్పాంజ్ సిటీల పేరుతో నీటిని ఎప్పటికప్పుడు భూమిలోకి పంపే రంధ్రాలున్న రోడ్లు నిర్మించారు. నగరాల చుట్టూ కృత్రిమంగా చిత్తడి నేలలు ఏర్పరిచారు. ఇవన్నీ వర్షపు నీటిని పీల్చుకుని భూగర్భ జలాలుగా మారుస్తాయి. సాధారణ రోజుల్లో పిల్లలకు ఆట స్థలాలుగా, భారీ వర్షాల సమయంలో తాత్కాలిక చెరువులుగా మారే వాటర్ స్క్వేర్లు నిర్మించి రోటర్డ్యామ్ నగరాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం కాపాడుకుంది. ముంబై నగరాన్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టడం కాక, అందుబాటులోని సాంకేతికతల సాయంతో తగిన ప్రణాళికలు రచించుకుంటే అక్కడి ప్రజలకు ప్రతియేటా ఈ తిప్పలు తప్పుతాయి. మాఫియాలను నియంత్రించటం, మౌలిక సదుపాయాలు... ముఖ్యంగా రవాణాను మెరుగుపరచటం వంటివి చేస్తే నగరం కిక్కిరిసిపోయే పరిస్థితిని నివారించవచ్చు. బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల వెడల్పు పేరుతో భారీ ప్రాజెక్టులు చేపట్టి అవి ఏళ్లతరబడి కొనసాగించటంవల్ల జనజీవనం స్తంభించిపోతోంది. వర్షాకాలం ఇదంతా అనేక రెట్లు పెరుగుతోంది. ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి. -
బరితెగించిన బాబు సర్కార్
తన రాజకీయ జీవితంలో ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం అలవాటు లేనట్టే... అందలం ఎక్కినప్పుడల్లా సాధారణ పౌరులకు ఆటవిక పాలన రుచిచూపించే ఆనవాయితీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది.‘హే రామ్... సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు బాబు దుష్ట పోకడలకు అద్దం పట్టింది. గూండాలకూ, రౌడీలకూ పార్టీ ముద్రేసి మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయించటం, చివరకు బాధితుల్నే అరెస్టు చేయటం ఏపీలో మాత్రమే కనబడే వింత పోకడ. అలాగే, నిలదీస్తున్నవారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టడం, బెయిలొచ్చినపక్షంలో మళ్లీ మళ్లీ అరెస్టు చేయటం రివాజుగా మారిన తంతు. ఈమధ్య ఏకంగా పోలీసులే యమ కింకరుల పాత్ర పోషిస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు. బూడిద కూడా మిగలకుండా చేస్తున్నారు. ముగ్గురు మహిళల అనుమానాస్పద మరణాలు, ఒక దళిత యువకుడి ఆత్మహత్య ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ పోస్టు పెట్టారు. ‘ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు. అవి మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయి’ అంటూ జగన్ చేసిన నిశిత విమర్శ చాలా కీలకమైనది. ఇది చంద్రబాబు పాలన తాలూకు డీఎన్ఏ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనది ఇదే మార్కు ఏలుబడి. ఆ కాలంలో లాకప్ డెత్‌లు, ఎన్‌కౌంటర్లతోపాటు నయీంవంటి వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచిన ప్రైవేటు ముఠాలు పాల్పడిన హింసాత్మక ఉదంతాలకు అంతులేదు. వీటన్నిటి వెనకా చంద్రబాబు సర్కారు ప్రమేయం ఉందన్న ఆగ్రహానికితోడు... పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు తెగనమ్మడం, కరవుతో బక్కచిక్కిన రైతుల్ని పీడించుకు తినటంవంటి కారణాలతో 2004లో ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో గాయపడి, ఆ కట్టుతోనే ఎన్నికల ప్రచారసభల్లో తిరిగినా ఆయనకు సానుభూతి దక్కలేదు. తన నిజస్వరూపం తెలియని ఈ తరానికి తానేమిటో ఇప్పుడు ఆయనే చెప్పక చెబుతున్నారు. గతానికి మించిన అరాచకాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎంతో హేతుబద్ధంగా ప్రశ్నించే ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియోలు సైతం సహించలేని దుఃస్థితికి కూటమి సర్కారు చేరుకుంది. ఉస్మానియా యూనివర్సిటీనుంచి గోల్డ్‌మెడల్ అందుకున్న జర్నలిస్టు కేవీఆర్ అనని మాటల్ని అన్నట్టుగా చిత్రించి, ఆ నెపంతో హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఆయన ఇంటిపైబడి అరెస్టు చేశారు. వచ్చినవారు పోలీసులో,గూండాలో తెలియక ఆందోళనపడిన ఆయన భార్యను నెట్టేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. ప్రశ్న రావణ్‌ని సైతం ఈ మాదిరిగానే అరెస్టు చేసి తీసుకెళ్లారు. వరసబెట్టి నాలుగు చోట్లా బెయిల్ రావటంతో దిక్కుతోచని కూటమి సర్కారు, ఏకంగా ఉపా చట్టాన్ని ప్రయోగించింది. పోలీస్స్టేషన్లపై జనసేన పేరిట గూండాలు దాడిచేయటం మరో ప్రహసనం.సరిగ్గా రెణ్ణెల్ల క్రితం విజయవాడ పోలీసులు అరెస్టుచేసి, మాయం చేసిన సాయికృష్ణ కేసులో సర్కారీ పోకడలు మానవతకే మాయని మచ్చ. ఆ యువకుణ్ణి మే 6న అరెస్టు చేశాక అతని తల్లి పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూనేవున్నా ఒక్కరంటే ఒక్కరు పట్టించుకోలేదు. కనీసం బూడిద ఇస్తే అంతిమసంస్కారం చేసుకుంటామని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతున్నా అది అరణ్యరోదనే అయింది. పోలీస్‌స్టేషన్ డాబాపై ఎముకలు, బూడిద దొరికాయని హైకోర్టుకే కట్టుకథలు చెబుతున్నారు. సాయికృష్ణ తల్లి డీఎన్ఏతో పోల్చిచూడకుండానే ఇంత బాధ్యతారహితంగా చెప్పడం ఆశ్చర్యకరం. అతని హత్య మాత్రమే కాదు... దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్యతోపాటు మే, జూన్ నెలల్లో గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, మరో మహిళ కళావతి ఆత్మహత్య ప్రజానీకాన్ని దిగ్భ్రాంతిపరిచాయి. రాష్ట్రంలో చట్టం చట్టుబండలైన తీరుపైనా, ఈ హత్యోదంతాలపైనా సీబీఐ దర్యాప్తే సరైంది. ఈ విషయంలో న్యాయస్థానాల్లోనూ, వెలుపలా పోరాడితే తప్ప న్యాయం దక్కదు. -
వాట్సప్ జానపదం
‘తోడేలు వచ్చింది’ అని అరిచిన కుర్రాడి కథ మనకు తెలుసు. ఆ అబద్ధం మొదటిసారి ఊరిని నవ్వించింది. రెండోసారి ఊరికి అలవాటు అయ్యింది. మూడోసారి నిజంగానే తోడేలు వచ్చినప్పుడు ఊరు నిద్రపోయింది. గొర్రెలు పోయాయి. కుర్రాడి మాటకు శాశ్వతంగా విలువ పోయింది. అది జానపదం మనకు నేర్పిన మొదటి పాఠం. అబద్ధానికి కాళ్లు ఉండవు. ఉన్నా ఎక్కువ దూరం నడవవు. కానీ, ఈరోజు ఆ కుర్రాడు మనలోని ప్రతిఒక్కరి జేబులో ఉన్నాడు. ప్రతి గ్రూపులో ఉన్నాడు. ప్రతి ఫార్వర్డ్‌లో ఉన్నాడు. వాట్సాప్ ఇప్పుడు కొత్త జానపద వేదిక అయింది. కానీ ఇక్కడున్నది అమ్మమ్మ చెప్పిన కమ్మని కథ కాదు. ఇది భయం కథ, ద్వేషం కథ, అనుమానం కథ. చదివిన వెంటనే గుండె కొట్టుకునేలా చేసి చివర్లో ‘పదిమందికి పంపు’ అని ఆజ్ఞాపించే బెదిరింపు కథ. ఇది జానపదం కాదు, అబద్ధాల జానపదం.మనం సులభాన్ని ఎంచుకున్నాం. ఫలితంగా మన మెదడు అనే కండరం క్షీణించి పోతోంది. ఏది పడితే అది నమ్మే బలహీనమైన మనస్తత్త్వంగా కుంగిపోతోంది. అబద్ధాలతో భయపడేవాడు ప్రశ్నించడు. ప్రశ్నించనివాడు బానిస అవుతాడు. ఒకప్పటి జానపదం ‘భయపడకు... చివరికి మంచే గెలుస్తుంది’ అని ధైర్యం చెప్పేది. ఈ కొత్త జానపదం ‘భయపడు... నువ్వు ఒంటరివి’ అని విషం ఎక్కిస్తోంది. దీంతోపాటు డిజిటల్ ప్రపంచంలో గుర్తింపు కోసం ఆరాటపడే మానసిక పేదల బెడద ఒకటి. నిజజీవితంలో కనీసం మాట విననివాడు గ్రూపులో అడ్మిన్ కావాలని చూస్తున్నాడు. ‘నేను అందరికంటే ముందు పంపాను’ అనే చిన్న కామెంట్ కోసం ఆత్మను తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడ సత్యం కంటే స్పందన (రియాక్షన్) ముఖ్యం అయింది. ఒక అబద్ధం పదివేల లైక్స్ తెస్తే ఒక నిజం పది లైక్స్‌కు కూడా నోచుకోవడం లేదు. మనం సంఖ్యలకు అలవాటు పడ్డాం. ఆత్మగౌరవాన్ని సోషల్ మీడియా మెట్రిక్స్‌కు అమ్మేశాం.‘అబద్ధాలకోరుకు శిక్ష ఏమిటంటే అతను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు’ అని ఆఫ్రికా సామెత. ఒకసారి నమ్మకం పోతే మళ్లీ తిరిగిరాదు. అదే పడాల్సిన శిక్ష. కానీ శిక్ష అక్కడితో ఆగడం లేదు. ఈ అబద్ధాల జానపదంలో నిత్యమునకలు వేసేవాడి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. మొదట అనుమానం... తర్వాత కోపం... ఆ తర్వాత వాస్తవానికి క్రమంగా దూరమవుతాడు. ఆపై డాక్టర్ చెప్పినా, సైన్ ్స నిరూపించినా ‘వాట్సాప్‌లో వేరేగా ఉంది’ అని వాదించే మొండితనం హెచ్చురిల్లుతుంది. రాత్రులు నిద్ర పట్టదు, ఎందుకంటే మెదడు ఎప్పుడూ అలర్ట్ మోడ్‌లోనే ఉంటుంది. ఆఖరిగా నైతికత మొద్దుబారుతుంది. ‘అందరూ పంపుతున్నారు కదా’ అనే సమాధానం లోపలి గిల్ట్‌ను చంపేస్తుంది.ఒకప్పటి జానపదం మనల్ని కలిపింది. ఒకే వెన్నెల్లో రాజు కొడుకు, రైతు కొడుకు కూర్చుని ఒకే కథ విన్నారు. ఒకే పాటకు కన్నీరు పెట్టుకున్నారు. అది సమానత్వ వేదిక. కానీ ఈ అబద్ధాల జానపదం మనల్ని చీలుస్తోంది. ఒకే ఇంట్లో తండ్రి ఒక గ్రూపు, కొడుకు ఒక గ్రూపుగా విడిపోతున్నారు. ఇద్దరూ వేర్వేరు అబద్ధాలు నమ్మి పరస్పరం శత్రువులు అవుతున్నారు. ఇంతకంటే పెద్ద మానసిక, సామాజిక పతనం ఇంకేముంటుంది? దీనికి పరిష్కారం వాట్సాప్‌ను పూర్తిగా చెరిపేయడం కాదు. మన వేలుకు మెదడును అతికించడం. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవడం. భయం పుట్టించే ప్రచారాలను అక్కడికక్కడే బ్లాక్ చేయడం. లోకంలోని మంచిని స్వయంగా జానపదం చేయడం. మనిషి ఉన్నంత కాలం కథ ఉంటుంది. కథ ఉన్నంత కాలం మనిషి బతుకుతాడు. రాయి నుండి తాళపత్రానికి, తాళపత్రం నుండి పుస్తకానికి, పుస్తకం నుండి స్క్రీన్ కు వచ్చినట్లే... ఇప్పుడు ఆ కథను స్క్రీన్ నుండి మళ్లీ మనిషి గుండెల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. మనమే కొత్త కథకులం కావాలి. మానవీయ జానపదం రాయాలి. గుర్తుంచుకోండి, మీరు ఫార్వర్డ్ చేస్తున్నది కేవలం ఒక సందేశం కాదు. అది ఒక తరం మనసు, ఒక జాతి భవిష్యత్తు! బటన్ మీ చేతిలోనే ఉంది. కొత్త కథను మీరే రాయాలి! -
గేటెడ్ కమ్యూనిటీ... గ్రేటర్ రాజధాని!
ఇదొక సదవకాశం. మచిలీపట్నం టు గుంటూర్ వయా విజయవాడ క్లస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలనే ప్రతిపాదన ఇప్పుడు బలంగా ముందుకొస్తున్నది. ఆచరణాత్మ కమైన, వివేకవంతమైన ఈ ఆలోచనను విజ్ఞులైన ఆంధ్రప్రజలు ఎల్లెడలా సమర్థిస్తున్నారు. ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఇది కీలకపాత్ర పోషించిన ప్రాంతం. జాతీయోద్యమం, సామ్య వాద–హేతువాదాలు, దళిత పోరాటాలకు నాయకత్వాలను సమకూర్చిన ప్రాంతం. తెలుగు సినిమా పరిశ్రమకు నారు పోసింది ఇక్కడే. రఘుపతి వెంకయ్య నాయుడు ఇక్కడివాడే. ఆంధ్రకళా వైభవానికి బుర్రకథతో తిలకం దిద్దిన నాజర్ కూడా ఇక్కడి బిడ్డే.రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల సెంటిమెంట్లను కొనుగోలుదార్లపై ప్రయోగించడం కొత్త విషయం కాదు. అదే పద్ధతిలో అమరావతి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌ను యథేచ్ఛగా నిర్వహించుకోవడానికి వీలుగా, దాని చుట్టూ ఒక బలమైన సెంటిమెంట్‌ను ఉత్పత్తి చేయడానికి చంద్రబాబు అండ్ కో గత పదేళ్లుగా శ్రమిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ ప్రాంతంపై అల్లుకున్న భావోద్వేగాలతో పోలిస్తే సోకాల్డ్ అమరావతి సెంటిమెంట్ సముద్రంలో కాకి రెట్టతో సమానం.సెంటిమెంట్ సంగతి వదిలేసి ఆచరణీయత కోణంలో ఆలోచించినా, అమరావతి ప్రాజెక్టు భవిష్యత్తులో ఒక గుది బండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమరావతి వెంచర్లో కళ్లు చెదిరే లాభాలను ప్రమోటర్లు పిండుకునే అవకాశాలున్నందువల్లనే హితోక్తులను బాబు సర్కారు చెవికెక్కించుకోవడం లేదనేందుకు ఆధారాలున్నాయి. సొంత లాభం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పులిస్వారీ చేయి స్తున్నారని అమరావతి ప్రమోటర్లపై విమర్శలున్నాయి. మాన్యు మెంటల్ అవినీతికి అమరావతి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రతిపక్షం చాలారోజుల నుంచి ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణ నిర్హేతుకమేమీ కాదు.రాష్ట్ర విభజన తర్వాత అవశేషాంధ్రప్రదేశ్కు రాజధానిని సూచించడానికి శివరామకృష్ణన్ కమిషన్‌ను కేంద్రం నియమించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారు సభ్యులుగా ఉన్న ఈ కమిషన్ సూచనలకు పూర్తి విరుద్ధంగా బాబు సర్కార్ నిర్ణయాలు తీసుకొన్నది. పంట భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ నగర్ నిర్మాణం అవాంఛనీయమని చేసిన హెచ్చరికను ప్రభుత్వం ఖాతరు చేయలేదు.రాజధాని ప్రాంత ఎంపికలోనూ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే విమర్శలు విస్తృతంగా వినిపించాయి. ముందుగా తన అనుయాయుల చేత భూములు కొనిపించి, ఆ తర్వాత తన పిలుపు మేరకు ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించేలా చేశారు. తద్వారా మిగిలిన రైతులమీద ఒత్తిడి పెంచారు. పూలింగ్‌కు భూములు ఇస్తే బంగారంలాంటి నివాస–వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తారని ఊదరగొట్టారు. ఈ మోసపూరితమైన ఎత్తుగడతో సాగిన సమీకరణను ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ప్రతిష్ఠకు జోడించుకున్నారు.సింగపూర్ ప్రభుత్వ సహకారంతో సింగపూర్‌లాంటి నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించారు. తర్వాతి కాలంలో ఇక్కడ చంద్రబాబు అధికా రాన్ని కోల్పోయారు. అమరావతి వ్యవహారంలో ఆయనకు సహకరించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోప ణలపై జైలుపాలయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అవినీతి ద్విగుణీకృతమైందని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ప్రతిపక్షం సాక్ష్యాలను ముందు పెడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం.ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయాలు సగటున చదరపు అడుగుకు పదివేల రూపాయలట. సెక్రటేరియట్ కోసం కడు తున్న ఐకానిక్ భవనాలకైతే చదరపు అడుగు ఖర్చు 19 వేల పైచిలుకట. అదేచోట కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి కేంద్రం చేస్తున్న ఖర్చు సగటున నాలుగున్నర వేలు మాత్రమే. ఎందుకింత తేడా? ఈ లెక్కలు ముందుపెట్టి జగన్మోహన్రెడ్డి నిలదీస్తుంటే కూటమి మైకాసు రులు మైకంతో మాట్లాడుతున్నారు.జగన్ లేవనెత్తిన డజన్లకొద్దీ ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకూ స్పష్టమైన సమాధానం రాలేదు. జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడనే స్టీరియోఫోనిక్ ఎదురుదాడినే కూటమి ఆశ్రయిస్తున్నది. చదరపు అడుగుకు 19 వేల ఖర్చే మిటని జగన్ ప్రశ్నిస్తే, వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు బదులిస్తాడు. భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లను ఎందుకీయలేదని జగన్ ప్రశ్నిస్తే జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని చంద్రబాబు సమా ధానం చెబుతాడు. కూటమి నేతలు, కూటమి మీడియా అవే మాటలు వల్లిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎకరం రెండొందల కోట్లపైగా ధర పలుకుతున్న ప్రాంతాల్లో కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్ కొనుగోలుకు చదరపు అడుగుకు పది పదిహేను వేలు దాటడం లేదు. అమరావతిలో మాత్రం భూమి ఖర్చులేకుండా, ఇసుక ఫ్రీగా వచ్చినా చదరపు గజానికి 19 వేలు ఖర్చు చేయడ మేమిటి? ఎందుకింత ఖర్చవుతుందో లెక్కచెబుతూ ఎందుకు సమర్థించుకోలేకపోతున్నారు? అమరావతి వ్యథలో అవినీతి ఒక భాగమైతే అది సాధారణ ప్రజలకు అనుమతిలేని ఒక గేటెడ్ కమ్యూనిటీ కావడం మరో భాగం. పైగా దానికి ప్రజా రాజధాని అనే తోకను తగిలించడం పెద్ద జోక్.అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలుత నాలుగేళ్లు, ఇప్పుడు రెండేళ్లు కలిపి ఆరేళ్లు కూటమి అధికారంలో ఉన్నది. తాత్కాలికంగా నిర్మించిన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు తప్ప అక్కడ ఇంకే నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది కూడా ప్రభుత్వ భవనాలు, సిబ్బంది గృహ సముదాయాలు, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు మాత్రమే. ఉపాధి కల్పించే కంపెనీలేవీ అక్కడికి రాలేదు. వచ్చే అవకాశం కూడా కన్పించడం లేదు. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇప్పటికే అందించలేకపోయారు. కాగితాలపై వేసిన ప్లాట్లు కూడా చెరువుల్లో కుంటల్లో, కాలువల్లో, శ్మశానాల్లో వేశారట.నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తయినా కూడా,సాయంత్రం కాగానే నిర్మానుష్యమయ్యే మరో నయా రాయ్ పూర్ అవుతుంది తప్ప మరో విజయవాడో, గుంటూరో కాబోదు. సాధారణ మధ్యతరగతి ప్రజల నివాసానికి అవసర మయ్యే ఎకోసిస్టమ్ అందుబాటులో ఉండే ఈ నగరాలను,మంగళగిరి–తాడేపల్లిని దాటి అమరావతిలో అక్కడ పనిచేసే వాళ్లు కూడా నివసించడానికి మొగ్గు చూపకపోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న 58 వేల ఎకరాలకు తోడు మరో లక్ష ఎకరాలు సమీకరిస్తే తప్ప అమరావతి మహానగరంగా మారడం కష్టమట!రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ అభివృద్ధి చేయడానికే ఎకరాకు 2 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం తన డీపీఆర్‌లో పేర్కొన్నది. ఈ లెక్కన 3 లక్షల కోట్లు ఈ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేయాలి. ఇప్పటికే 47 వేల కోట్లు అప్పు చేశారు. 60 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. నిర్మాణ పనుల కోసం వలస వచ్చిన కార్మికులు, అక్కడి పల్లెల్లో ఉన్న ప్రజలు తప్ప అక్కడెవరూ నివసించడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గుదిబండగా మారబోతున్న ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగానే జగన్మోహన్రెడ్డి తాజాగా మావిగన్ ప్రతిపాదన చేశారు.బంగారుగుడ్డు పెట్టే బాతును పాలకులు వదులుకుంటారా? అందుకే ఎదురు దాడికీ, అసత్యాల ప్రచారానికీ పూనుకున్నారు. అమరావతి పేరు మీద చేస్తున్న ఖర్చులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు, తక్షణమే ఒక మహానగరం రాజధానిగా అందు బాటులోకి వస్తుంది. ఇందులో అమరావతి గేటెడ్ కమ్యూనిటీ కూడా భాగం కావచ్చు. సాధారణ ప్రజలకు ఎటూ అక్కడ ప్రవేశం లేనందున జూబ్లీహిల్స్‌లాంటి సంపన్న ప్రాంతంగా అమరావతి ఆవిర్భవించవచ్చు. జగన్ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన మచిలీపట్నం రేవు పనులు త్వరలో పూర్తవుతాయి. పోర్టుతో పాటు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయ వాడ–గుంటూరు రైల్వేజంక్షన్లు రాజధాని నగరంలో భాగమ వుతాయి. విశాఖకు తోడుగా మరో గ్రోత్ ఇంజిన్‌గా మావిగన్ అందుబాటులోకి వస్తుంది.మచిలీపట్నం రేవుకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నది. శాతవాహనుల కాలం నుంచే ఇక్కడినుంచి వర్తకం జరిగింది. గోల్కొండ నవాబుల కాలంలో ఇక్కడినుంచి వజ్రాలను, వస్త్రాలను ఎగుమతి చేసేవారట. హైదరాబాద్ నుంచి సూర్యా పేట, విజయవాడ మీదుగా మచిలీపట్నానికి ఆ రోజుల్లోనే రహదారిని నిర్మించారు. నాలుగొందల ఏళ్ల కిందనే ఇక్కడ డచ్చివారు వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈస్టిండియా కంపెనీ భారత్‌లో తొలి అడుగేసింది మచిలీపట్నంలోనే. మచిలీపట్నం, గుంటూరు పట్టణాల్లో స్వాతంత్య్రానికి వందేళ్ల పూర్వమే కాలేజీలు ఏర్పడ్డాయి. కృష్ణా బ్యారేజీ నిర్మాణం తర్వాత గొప్ప వ్యావసాయిక వాణిజ్య కేంద్రంగా గుంటూరు ఎదిగింది. దానికి తోడు అది ప్రఖ్యాత విద్యా కేంద్రం కూడా.దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సెంటర్లలో విజయవాడ ప్రముఖమైనది. సినీరంగ పరిశ్రమకు చాలాకాలం పాటు అది జీవనాడిగా పనిచేసింది. రాజకీయ కార్యకలాపాలకూ, పత్రికా రంగానికీ ప్రధాన కేంద్రంగా ఉంటూ చాలాకాలం పాటు మరో రాజధానిగా ఖ్యాతిగాంచిన నగరం విజయవాడ. ఇక్కడ 1924లో జరిగిన ఏఐసీసీ సమావేశంలోనే పింగళి వెంకయ్య త్రివర్ణ జాతీయ పతాకం డిజైన్‌ను మహాత్మాగాంధీకి సమర్పించారు. ఈ ప్రాంతంవాడైన కొండా వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేశారు.కృష్ణా పత్రికను స్థాపించిన ముట్నూరి కృష్ణారావు, ఆంధ్ర పత్రికను స్థాపించిన కాశీనాథుని నాగేశ్వరరావు మావిగన్ ప్రాంతంవారే. స్వాతంత్రోద్యమానికి ఆంధ్రప్రాంతాన్ని సమాయత్తం చేసిన పత్రికలవి. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావు, భవనం వెంకట్రామ్ ఏపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయ్యదేవర కాళేశ్వరరావు గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించింది విజయవాడలోనే. అంటరానితనానికి వ్యతి రేకంగా హరిజనోద్యమం కూడా ఇక్కడ ప్రారంభమైంది. చరిత్ర ప్రసిద్ధి చెందిన ‘మాలపల్లి’ నవలా రచయిత ఉన్నవ లక్ష్మీ నారాయణ ఇక్కడి వ్యక్తే.దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చల పల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో పుట్టినప్పటికీ ఆయన గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యేవారు. చండ్ర రాజేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య వంటి కమ్యూనిస్టు దిగ్గజాలకు జన్మనిచ్చింది కూడా ఈ ప్రాంతమే. హేతువాద ఉద్యమంతో ప్రజల్లో చైతన్యం నింపిన త్రిపురనేని రామస్వామి చౌదరి, రైతుబాంధవుడిగా పేరుగాంచిన ఆచార్య ఎన్జీ రంగా జన్మ స్థానం, ప్రధాన కార్యక్షేత్రం కూడా ఇదే. గత వైభవాన్ని తలపోస్తూ, సాంస్కృతిక పునరుజ్జీవానికి పిలుపునిస్తూ గేయాలు, కవితలు రాసిన కవులెందరో ఇక్కడు న్నారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అని పిలుపునిచ్చిన వేములపల్లి శ్రీకృష్ణ, ‘‘నట్టనడి సంద్రాన నావ నిలుచున్నాది. చుక్కాని పట్టరా తెలుగోడా, నావ దరిజేర్చరా మొనగాడా’’ అనే సందేశాన్నిచ్చారు. శ్రీకృష్ణ మూడుసార్లు మంగళగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ‘కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయపతాక’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గుంటూరు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘‘చెక్కు చెదరని యేనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడధ్వన్నమాయె, తిరిగి వెనుకకు మరలిచూసి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి’’ అని వేడుకున్నారు. అమరావతి గేటెడ్ కమ్యూనిటీ కోసం కృత్రిమ సెంటిమెంట్ ప్రచారం చేస్తున్న కూటమికి మావిగన్ సెంటిమెంట్‌తో పోలికా? ఆ సెంటిమెంట్‌ను విస్తరించి చెప్పా లంటే మహాగ్రంథమవుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జపాన్‌తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్‌లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్‌తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్‌తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్‌లాండ్‌లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్‌లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు. -
ప్రపంచ శక్తిగా 'యువ భారత్'
ప్రపంచ దేశాల్లో పెరిగిన ఇండియా ప్రాధాన్యం, చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్త జననాల రేటు క్షీణత వంటి కీలక అంశాలను ప్రముఖ ఆర్థికవేత్త టేలర్ కోవెన్ ఈ పాడ్‌కాస్ట్‌లో చర్చించారు. సాంకేతిక రంగంలో ఏఐ అభివృద్ధి వేగానికీ– మానవ వ్యవస్థల నెమ్మదితనానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు:సవాళ్లున్నా అవకాశాలు ఎన్నో!ఇండియా ప్రాథమికంగా లాభదాయకమైన స్థితిలో ఉంది. చైనా కోల్పోతున్న యువ జనాభా బలాన్ని ఇండియా కలిగి ఉంది. ఎంతో నైపుణ్యం ఉండి, ఇంగ్లి ష్లో మాట్లాడగలిగే సాంకేతిక రంగానికి చెందిన భారతీ యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఒక దృఢమైన శక్తిగా ఇండియా విజయం సాధించాలని అమెరికా, దాని మిత్రదేశాలు గట్టిగా కోరు కుంటున్నాయి. అయితే, మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ నిబంధనల వల్ల జరుగుతున్న జాప్యం, వందల కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన ఉపాధిని కల్పించడం వంటి పెద్ద అంతర్గత సవాళ్లను భారతదేశం ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.వృద్ధాప్య సంక్షోభంలో ‘డ్రాగన్’నేను చైనా వైపు చూసినప్పుడు, ఒకప్పుడు అద్భుతమైన వృద్ధిని సాధించి, ప్రస్తుతం అలవిమాలిన నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్న దేశం నాకు కనిపిస్తుంది. వారి భారీ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం, వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటున్న జనాభా, తీవ్రమైన రాజ కీయ కేంద్రీకరణల వల్ల వారు ఇకపై ఎవరూ ఆపలేనంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. చైనా ప్రపంచ వ్యవస్థను శాసిస్తుందని అనేవారు ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి చైనా తన ఆర్థిక ఒత్తిళ్లు, తగ్గిపోతున్న కార్మిక శక్తిని నెట్టుకురావటం అనే సమస్యలతో సతమతమవుతోంది. వారు ఒక బలమైన శక్తి అనడంలో సందేహం లేదు, కానీ వారిని ఎవరూ ఎదిరించలేనంత మహా బలవంతులుగా భావించాల్సిన అవసరమైతే లేదు.పిల్లలు వద్దనుకుంటున్నారు!విశ్వవ్యాప్తంగా జననాల రేటులో ఒక భారీ క్షీణతను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కేవలం ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు ఒక సాంస్కృతిక సమస్య కూడా. సమాజాలు మరింత సంపన్నంగా మారి, వ్యక్తు లకు మరింతగా వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తున్న కొద్దీ, పిల్ల లను కనడం వల్ల కోల్పోయే ఇతర అవకాశాలకు ప్రాధాన్యమివ్వటం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ‘ఎంపికల వల్ల వచ్చిన సంక్షోభం’. ఇది రాబోయే శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయ బోతోంది.ఏఐ వేగాన్ని అందుకోలేకున్నాం!ప్రజలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్.ఎల్.ఎం.)కు ఉన్న అద్భుతమైన తెలివితేటలను చూసి, మన జీవితా ల్లోని ప్రతిదీ రాత్రికి రాత్రే మారిపోతుందని అనుకుంటారు. కానీ వారు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏఐ ఇంకా మన ప్రస్తుత ప్రపంచంలోని భౌతిక, ప్రభుత్వ నిబంధనల పరిమితుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ కొత్త ఏఐ పని విధా నాన్ని అమలు చేయాలనుకుంటే, వారు ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల అనుమతులు, పాత సాఫ్ట్వేర్ అప్ డేట్లు, సిబ్బంది అలసత్వం వంటి వాటిని దాటుకుని రావాల్సి ఉంటుంది.‘మనసున మనసై’తేనే విలువఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా మేధోశక్తి ఉచితంగా, సులభంగా లభించే ఈ రోజుల్లో, సాధారణ ఐక్యూకి పూర్వపు గుర్తింపు, విలువ తగ్గిపోతాయి. సాంకేతిక రంగాలలో సగటు మానవుడి కంటే ఒక యంత్రం మెరుగ్గా ఆలోచించగలిగినప్పుడు, ఇక సమాజంలో అరుదైనదిగా ఏది మిగులుతుంది? నా దృష్టిలో దానికి సమాధానం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నమ్మశక్యత, విభిన్న విషయాలను సమన్వయం చేసే నైపుణ్యం, లోతైన మానవ సంబంధాలే. కంప్యూటర్ కోడింగ్ ద్వారా సృష్టించలేనివి లేదా స్క్రీన్ ద్వారా అనుకరించ లేనివి మాత్రమే భవిష్యత్తులో అత్యంత విలువైనవిగా మారుతాయి. - ఎడిటోరియల్ టీమ్ -
కొత్త అవతారంలో నరేగా!
ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా నిరుడు డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన వీబీ– జీ రాం జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకొచ్చింది. ఇది రద్దయిన ఉపాధి హామీ పథకం (నరేగా)కు సరికొత్త అవతారం. గత పథకంలోని ‘హక్కుల ప్రాతిపదిక’ను మార్చొద్దనీ, రాష్ట్రాలపై ఆర్థిక భారం పడే విధానానికి స్వస్తిచెప్పి, గతంలో మాదిరే కేంద్రమే భరించాలని పౌరసమాజ కార్యకర్తలతోపాటు కొన్ని రాష్ట్రాలు కూడా కోరాయి. అయితే నరేగా కన్నా ఇదెన్నో రెట్లు మేలని కేంద్రం చెబుతోంది. గత పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి వంద రోజుల పని దినాలకు అనుమతించగా, తాము మరో 25 రోజులు పెంచామని... కూలీల వేతనాలు పెరిగాయని, వారానికోసారి చెల్లింపులు, ఇతర సంస్కరణలు తీసుకురావటంతో అవినీతికి ఆస్కారం ఉండబోదని కేంద్రం చెబుతోంది. పాత పథకంలో ప్రతి 15 రోజులకొకసారి చెల్లించాలన్న నిబంధన ఉన్నా, బ్యాంకింగ్ సదుపాయాలు అంతంతమాత్రమే కావటంవల్ల నిరుపేద కుటుంబాలు నెలల తరబడి వేచిచూడాల్సివచ్చేది. ఈలోగా రోజులు గడవటానికి అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేసే వారు. ఇప్పుడు వారానికొకసారి వేతనాలిస్తామంటున్నా ఈ లోటుపాట్లు సరిదిద్దకపోతే నిరుపయోగమే. గ్రామీణ కూలీలకు మరో 25 రోజులు పనిదొరకటం, అందువల్ల అదనపు ఆదాయం రావటం హర్షించదగ్గది. అయితే నరేగాకింద గ్రామాల్లో సంబంధిత పక్షాల సమావేశాల నిర్ణయాల ఆధారంగా చేయించాల్సిన పనులు ఖరారయ్యేవి. తాజా చట్టం ప్రకారం అలాంటి పనులేమిటో కేంద్రం ‘వాస్తవ ప్రమాణాల’ ఆధారంగా నిర్ణయిస్తుంది. దాని కయ్యే వ్యయాన్ని కూడా అంచనా వేస్తుంది. అందులో 40 శాతాన్ని రాష్ట్రం భరిస్తే, మిగి లిన 60 శాతం నిధులు కేంద్రంనుంచి వస్తాయి. చేయించాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం ఆధారంగా వివిధ రాష్ట్రాలకు వేర్వేరు కేటాయింపులుంటాయి. కేంద్రం నిర్దేశించిన పనులకన్నా అధికంగా చేయించదల్చుకుంటే అందుకయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పాత పథకంలో నిధుల దుర్వినియోగం మాట వాస్తవం. కనబడని మనుషుల పేర్లతో కైంకర్యం చేసిన ఉదంతాలు అనేకం బయటపడ్డాయి. అందుకే హిందీ రాష్ట్రాల్లో ‘పిశాచ లబ్ధిదారుల’న్న పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న సాంకేతికత అప్పుడు లేదు. మొత్తం కాగితాలపైనే వ్యవహారాలన్నీ నడిచేవి. ఆన్లైన్ వ్యవస్థలు, డిజిటల్ చెల్లింపులు వచ్చాక ఆ బెడద తగ్గింది. ‘నరేగా’ను అవినీతి పేరుతో కొట్టిపారేయటం సరికాదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2006లో ప్రారంభమైన ఈ పథకం తొలి దశాబ్దకాలంలో దాదాపు కోటిన్నరమంది ప్రజలను దారిద్య్రంనుంచి విముక్తుల్ని చేసింది. ఇది చిన్న విషయమేం కాదు. అలాగే సగటున మహిళలకు 50 శాతం పనులు దక్కేవి. ఈ పథకంవల్ల సాగు పనులకు కూలీల కొరత వస్తున్నదన్న ఫిర్యాదులు ఉండేవి. కానీ జాతీయ గణాంకాలు మాత్రం సాగు పనులు ముమ్మరంగా ఉండే సమయంలో ‘నరేగా’కు డిమాండ్ తక్కువేనని చెబుతున్నాయి. కూలీలకు బేరమాడే శక్తి పెరిగిందనీ, వారి కూలీ రేట్లు పెరిగాయనీ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొత్త పథకంలో రాష్ట్రాలు కూడా వ్యయం భరించాల్సిరావటం ఒకరకంగా విషాదం. ‘నిధులు నిండుకుంటే హక్కులు నీరసిస్తాయ’ని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. ఈ పథ కానికి కేటాయింపుల కోసం రాష్ట్రాలు ముందుగా సంక్షేమ పథకాలకే... మహిళా సంక్షేమా నికే కోత పెడతాయి. గతంలో నిధులు లేక కాదు... అమలుపై ఆసక్తి కొరవడి అత్యధిక పేదరికం ఉండే బిహార్, ఉత్తరప్రదేశ్‌లు అతి తక్కువ నిధులు వినియోగించాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు నిధుల లేమితో చాలా రాష్ట్రాలు ఆ తోవన పోయినా ఆశ్చర్యం లేదు. మొన్న ఏప్రిల్ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బిహార్‌లతోపాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణలు నిధుల భారం మోపటాన్ని వ్యతి రేకించాయి. తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కూడా గొంతుకలిపారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయింది. ఎటూ సంక్షేమాన్ని అరకొరగా చేస్తున్నాం... దాన్ని మరింత కత్తిరిస్తే సరిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అను కుంటున్నట్టున్నారు. ఏదేమైనా ఆచరణలో వచ్చే సమస్యల్ని అధ్యయనం చేశాకైనా వీబీ– జీ రాం జీ ని మెరుగుపరచటం మేలు. -
ట్రంప్‌కు మళ్లీ భంగపాటు
చరిత్ర తెలుసుకోకుండా, తన పరిమితులేమిటో గ్రహించకుండా ఎడాపెడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు నుంచి మరోసారి చుక్కెదురైంది. అమెరికా గడ్డపై జన్మించినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వటం కుదరదంటూ నిరుడు జనవరిలో ట్రంప్ తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును మంగళవారం కొట్టేస్తూ, 6–3 మెజారిటీతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తన ఉత్తర్వును ట్రంప్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఈ కేసు వాద ప్రతివాదాల సమయంలో స్వయంగా హాజరయ్యారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా రావటం ఇదే తొలిసారి. తమ తప్పుడు నిర్ణయాలవల్ల దేశంలో అస్తవ్యస్థ స్థితిగతులు ఏర్పడినప్పుడు జనం దృష్టి మళ్లించేందుకు లేదా మిన్ను విరిగి మీద పడే అతి గొప్ప చర్యలు తీసుకుంటున్న అభిప్రాయం వారిలో కలిగించేందుకు ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తారు. అలాంటివారిలో అగ్రగణ్యుడు ట్రంప్. నిజానికి సుప్రీంకోర్టులో రిపబ్లికన్లవైపు మొగ్గుచూపే న్యాయమూర్తుల సంఖ్య అధికంగానే ఉంది. కనుకనే అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికార పరిధిని దాటుతూ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు అనుకూలంగా ఈ రెండేళ్లలోనూ తీర్పులు వెలువడ్డాయి. అయితే అనేక దేశాలపై అధిక సుంకాల విధింపు, ఇప్పుడు జన్మతః పౌరసత్వం అంశాల్లో మాత్రం ఆయన నిర్ణయాలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేక పోయింది. ఇది భవిష్యత్తులో అనేకానేక సమస్యలకు దారి తీస్తుందని గ్రహించింది. ట్రంప్ రెండో ఏలుబడి మొదలయ్యాక న్యాయమూర్తులకు పనిభారం బాగా పెరిగింది. అందుకే హేతుబద్ధత లేకుండా, బహిరంగ విచారణైనా జరపకుండా వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలున్నాయి. అక్రమ వలసల పేరుచెప్పి జాతి, భాష వంటి కారణాలతో వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తూ వందలమంది భద్రతా బలగాలు విరుచుకుపడటం, అరెస్టులు చేయటం వగైరాలను సుప్రీంకోర్టు నిర్మొహమాటంగా సమర్థించింది. ఆరోగ్య సంరక్షణ గ్రాంట్లపై కోత విధించటం, జాతి, లింగపరమైన మైనారిటీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకూ న్యాయమూర్తులు మద్దతుపలకటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆసియాలో మనతో సహా పలు దేశాల్లోనూ... యూరప్, ఆఫ్రికా ఖండ దేశాల్లోనూ జన్మతః పౌరసత్వం ఇవ్వరు. అయితే అమెరికాలో కొన్ని చారిత్రక కారణాలవల్ల ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పొందుపరిచారు. అమెరికా వలసవచ్చిన వారి తోనే నిర్మాణమైంది. అంతర్యుద్ధం ముగిసి, బానిసత్వం రద్దుకావటం వంటి పరిణామా లతో 1857లో నల్లజాతీయులు అమెరికా పౌరులు కాలేరంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. నల్లజాతీయుల్ని పీల్చిపిప్పిచేసి సంపద పెంచుకున్న అమెరికా ఇంత కృతఘ్న తతో ఉండటాన్ని ప్రశ్నిస్తూ ఆందోళనలు జరిగాక 1868లో ఈ 14వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. నల్లజాతికి చెందిన మాజీ బానిసలు, వారికి పుట్టిన సంతానం దేశ పౌరులే అవుతారని ఈ సవరణ స్పష్టం చేసింది. చైనా వలస కుటుంబానికి ఇది వర్తించబోదని ప్రభుత్వం నిరాకరించినప్పుడు అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఇక్కడి పౌరులే అవుతారని 1898లో సుప్రీంకోర్టు తెలియజేసింది. ట్రంప్ ఉత్తర్వు ఏడాదిన్నరగా లక్షలాదిమందిని అనిశ్చితిలో పడేసింది. రెండేళ్ల క్రితం అమెరికా సెన్సెస్ బ్యూరో దేశంలో 52 లక్షలమంది భారతీయులున్నారని చెప్పింది. నిరుడు వెలువడిన లెక్క ప్రకారం హెచ్–1బీ వీసాలున్నవారిలో 71 శాతం మంది భారతీయులే. వీరందరికీ తాజా తీర్పు ఊరటనిస్తుంది. అయితే గ్రీన్‌కార్డుకు దరఖాస్తుచేసి ఎదురుచూస్తున్నవారికి ఈ తీర్పువల్ల ఉపశమనం దొరకదు. అక్కడ జన్మించినవారి పిల్లలు దేశ పౌరులుగా మారినా, తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పవు. తమ వీసా దరఖాస్తుల్లో అబద్ధం చెప్పి దేశంలో ప్రవేశించినవారి ఆచూకీ తెలుసుకోవటం, వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించటం తమ ప్రాధాన్యతంటూ అమెరికా న్యాయశాఖ చెప్పటం సహజంగానే గుబులు రేపుతోంది. తీర్పు వెలువడ్డాక కూడా కొత్తగా చట్టం తీసుకొస్తానంటూ ట్రంప్ చెప్పటం ఆయన మొండివైఖరికి నిదర్శనం. ఇప్పటికైనా వివేకంతో మెలగటం, అసలైన సమస్యలపై దృష్టిసారించటం అవసరమని ఆయన గ్రహించాలి. -
డేటా సెంటర్లపై బేజారు
చార్లీ చాప్లిన్ అద్భుత దృశ్యకావ్యాల్లో ఒకటైన ‘గోల్డ్ రష్’ నిరుడు శతవసంతాలు పూర్తిచేసుకుంది. 1890ల్లో కెనడాలోని క్లోన్డైక్ ప్రాంతంలో బంగారం గనులున్నాయని వెల్లడై ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది జనం అక్కడికి పరుగులు తీయడం, పోటీపడటం కథాంశం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కృత్రిమ మేధ(ఏఐ)కి సంబంధించిన డేటా సెంటర్లలో పెట్టుబడుల్ని ఆకర్షించటానికి అలాగే పరుగులు తీస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన విశ్లేషణ డేటా సెంటర్ల సామర్థ్యం మరో నాలుగేళ్లలోనే మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువుకాటకలు, ఇతర వాతావరణ దుష్ఫలితాల కారణంగా డేటా సెంటర్ల వార్షిక ఖర్చులు 2035కు 8,100 కోట్ల డాలర్లనుంచి 2065 నాటికి 16,800 కోట్ల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహించటానికి... ఓటీటీలు, యూట్యూబ్వంటి వాటికోసం లైబ్రరీల నిర్వహణకూ, ఇతరేతర వినియోగానికీ డేటా సెంటర్లున్నాయి. ఏఐ రాకతో ఇవి మరింతగా పెరుగుతున్నాయి. డేటా సెంటర్ల విస్తరణతోపాటే వాటికి సంబంధించిన అవగాహన మొదలైంది. వాటివల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఆన్లైన్ సెర్చ్‌లతో పోలిస్తే ఏఐ ఆధారిత సెర్చ్‌లు పది రెట్లు అధిక విద్యుత్‌ను తీసుకుంటున్నా యని గణాంకాలు తేల్చాయి. ఈమధ్య విడుదలైన ఐక్యరాజ్యసమితికి చెందిన యూనివర్సిటీ అధ్యయన నివేదిక డేటా సెంటర్లను చల్లబరచడానికి బిలియన్లకొద్దీ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డేటా సెంటర్ల వల్ల తాగునీటి హక్కులకూ, వ్యవసాయానికీ తీవ్ర విఘాతం కలుగుతోందని హెచ్చరించింది. వీటిని అనుమతించే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరు లున్న ప్రాంతాలనే ఎంచుకునేలా చూడాలని సూచించింది. వినియోగిస్తున్న నీరు ఆవిరయ్యే ప్రస్తుత విధానానికి బదులు నీటి అవసరం లేని ఎయిర్ కూలింగ్, లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్వైపు మారేలా డేటా సెంటర్లపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. డేటా సెంటర్లు తాము వినియోగించే నీరు, విద్యుత్ ఎంతో... విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఎంతో తెలిపే డేటాను అందరికీ అందుబాటులో ఉంచేలా నిబంధనలు రూపొందించాలని తెలిపింది. డేటా సెంటర్లపై అక్కడక్కడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఈ సెంటర్లు పెరగటాన్ని నిరసిస్తూ ఉద్యమాలు జరగటంతో కొత్తవాటిపై కఠిన మైన ఆంక్షలు విధించారు. నెదర్లాండ్స్‌లో కూడా రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళ నలు చేశారు. దాంతో హైపర్స్కిల్ డేటాసెంటర్ల నిర్మాణాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సింగపూర్‌లో పర్యావరణహిత సెంటర్లకు పరిమితమైన అనుమతు లిస్తున్నారు. చిలీలో డేటా సెంటర్ ఏర్పాటుపై జనం తిరగబడటంతో గూగుల్ సంస్థ గాలితో చల్లబరిచే సాంకేతికత దిశగా ప్రాజెక్టును డిజైన్ చేసుకుంది. ఏడాదిలో 365 రోజులూ వేలాది సర్వర్ రాక్‌లూ, డిజిటల్ డేటాను భద్రపరిచే హార్డ్ డ్రైవ్‌లూ, నెట్వర్కింగ్ పరికరాలూ, లక్షలసంఖ్యలో యూపీఎస్‌లు పనిచేస్తుండటంవల్ల వాటిని చల్లబరచటానికి నిరంతరాయంగా నీరు అవసరమవుతుంది. భారీగా విద్యుత్ కావలసివస్తుంది. ఇక ఆ సెంటర్లలోవాడే భారీ కూలింగ్ ఫ్యాన్లు , ఇండస్ట్రియల్ ఏసీల వల్ల ఒకరకమైన ధ్వని తప్పదు. పగలు ఇతర చప్పుళ్లతో ఇది కలిసిపోయినా, రాత్రివేళల్లో మూడు నాలుగు కిలోమీటర్ల మేర ఈ ధ్వని వినబడుతుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, అమెరికాలోని వర్జీనియాలో కేవలం ఈ కారణం వల్లే స్థానికులు కోర్టులకెక్కారు. ప్రజల ఒత్తిళ్లతో ఈమధ్య కాలిఫోర్నియాలోని ఒక మున్సిపాలిటీ కొత్త డేటా సెంటర్లపై నిషేధం విధించింది. వీటన్నిటి నేపథ్యంలో నీటి అవసరం పెద్దగా లేని సాంకేతికతలు వస్తున్నాయి. ఏఐ ఆధారిత సాంకేతికత ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వినియోగించకుండా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరిస్తే, ఆ సెంటర్లు వినియోగించే పర్యావరణహిత సాంకేతికతల సమాచారాన్నీ, వాటి ఉద్గారాల పరిమాణాన్నీ ప్రజలకూ, పర్యావరణవేత్తలకూ అందుబాటులో ఉంచితే ప్రజల్లో ఉండే ఆందోళన తగ్గుతుంది. -
సెషెల్స్‌తో మరింత బంధం
కేవలం 115 చిన్న చిన్న దీవుల సమాహారం. అందులో నివసించటానికి పనికొచ్చేవి నాలుగంటే నాలుగే. జనాభా చూస్తే లక్షా 30 వేలు. దేశ భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న దేశం సెషెల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు పర్యటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యంత కీలకస్థానంలో ఉన్న ఈ ద్వీపకల్పం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంలో, హిందూమహా సముద్రంలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు సమీపంలో ఉంది. ఇది ఆసియా–ఆఫ్రికా సముద్ర మార్గాల కూడలి కనుక ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌక లన్నీ ఈ ప్రాంతంనుంచే పోవాలి. ఆ నౌకలు నిత్యం ముడిచమురు, సహజవాయు నిక్షేపాలు, ఆహారపదార్థాలు, ముడి సరుకులు మోసుకుపోతుంటాయి. ఆ దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ఏడాది మొదట్లో మన దేశం వచ్చారు. అటు తర్వాత మన దేశం అక్కడికి 250 టన్నుల ఆహార పదార్థాలు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్, ఇతరమైనవి పంపింది. దానికి కొనసాగింపుగా మోదీ జరిపిన ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాలమధ్యా 19 అంశాల్లో అంగీకారం కుదిరింది. తమవంటి ద్వీపకల్ప దేశాల ఆకాంక్షలను ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిచాటుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారత్‌పై ఆ దేశంలో ఆదరాభిమానాలున్నాయి. 1986లో అప్పటి దేశాధ్యక్షుడైన ఫ్రాన్స్ ఆల్బర్ట్ రెనే సోవియెట్ యూనియన్ పర్యటనకెళ్లినప్పుడు సెషెల్స్లో తిరుగుబాటుకు కుట్ర పన్నిన వైనంపై ముందస్తు సమా చారం అందుకున్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హుటాహుటీన నావికా దళాన్ని పంపి దాన్ని అణిచేశారు. సెషెల్స్ నిడివి చిన్నదైనా సాగరజలాల్లో దాని ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఎస్‌జెడ్) ఏకంగా 13.7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంకన్నా దాని సముద్ర వ్యాప్తి దాదాపు 3,000 రెట్లు అధికం. హిందూ మహాసముద్రంలో చైనా క్రమేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవటానికి ముత్యాల తీగ (స్ట్రింగ్ ఆఫ్ పెరెల్స్) పేరిట పాగా వేయాలని చూస్తోంది. ఆఫ్రికా తీరమైన జిబూటిలో ఇప్పటికే సైనిక స్థావరం ఏర్పాటులో బిజీగా ఉంది. కనుక ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకొనాలంటే సెషెల్స్‌తో భారత్‌కు బలమైన బంధం ఉండితీరాలి. కోస్తా రాడార్ నెట్ వర్క్ పేరిట మన దేశం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి నౌక కదలికనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అక్కడ సముద్ర దొంగల బెడద కూడా ఎక్కువే. దాంతోపాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపలవేట ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనటానికి రాడార్ నెట్ వర్క్ ఎంతగానో తోడ్పడుతున్నది. దీంతోపాటు మన దేశం డోర్నియర్ నిఘా విమానాలనూ, గస్తీ నౌకలనూ బహుమతిగా ఇచ్చింది. వాటిపై సెషెల్స్ రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చింది. 2020లో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చింది.ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా 1502లో తొలిసారి ఈ ద్వీపకల్పాన్ని సందర్శించి నప్పుడు ఇక్కడ మానవ సంచారం లేదని చెబుతారు. అటుతర్వాత 1756లో ఫ్రాన్స్ దీన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థికమంత్రి జీన్ మోరో సెషెల్స్ పేరిట ఈ ద్వీపకల్పానికి సెషెల్స్గా నామకరణం చేశారు. 1770లో ఇక్కడ వ్యవసాయ పనులకు ఫ్రాన్స్ ఆఫ్రికానుంచి భారీయెత్తున కార్మికులను తరలించింది. అప్పుడు మన దేశం నుంచి కూడా వెళ్లారు. నెపోలియన్ యుద్ధాల్లో ఒకదానిలో ఫ్రాన్స్ ఓడిపోవటంతో 1814లో ఇది బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. చివరకు 1976లో దీనికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రస్తుత సెషెల్స్ జనాభాలో 12 శాతంమంది మన దేశంనుంచి వలసవెళ్లిన గుజరాత్, తమిళనాడులకు చెందినవారే. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అవకాశం దొరికితే కాలూనడానికి చైనాతోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం శాంతియుత మండలంగా ఉండాలని మన దేశం మొదటినుంచీ కోరుకుంటోంది. ఇరు దేశాల సంబంధాలూ భద్రతకే పరిమితం కాకుండా పర్యావరణ పునరు ద్ధరణ, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్ రంగ సదుపాయాలు వగైరాలకు సైతం విస్తరించాయి. ఇరు దేశాల బాంధవ్యం మున్ముందు మరింతగా ఎదుగు తుందని మోదీ పర్యటన నిరూపించింది. -
మహాప్రయాణం
క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన గ్రీకు అంధకవి హోమర్ సృజనగా చెప్పే రెండు ఇతిహాస కావ్యాలు– ఇలియడ్, ఒడిస్సీ. ఇవి పాశ్చాత్య ప్రపంచానికి మన రామాయణ, మహాభారతాల్లాంటివి. పైగా కొనసాగింపు కథలు. ట్రోజన్ యుద్ధం, హెలెన్–పారిస్ ప్రేమ, హెక్టర్ త్యాగం, అకిలీస్ పరాక్రమం, రక్తపాతం, వినాశనాన్ని ఇలియడ్ చూపిస్తే... ఆ యుద్ధం ముగిసిన తర్వాతి కథను ఒడిస్సీ చెప్తుంది. పదేళ్లపాటు జరిగిన ఆ యుద్ధంలో గెలిచిన గ్రీకు వీరుడు, ఇతకా రాజు అయిన ఒడిస్సీస్ (దీన్నే లాటిన్లో ఉలిసేస్ అని ఉచ్ఛరిస్తారు) తిరిగి తన భార్య పెనలోపి, కొడుకు తలామకస్ దగ్గరికి చేరుకోవడానికి పదేళ్లపాటు పడిన కష్టాలే ఈ కావ్యం. ఆ కష్టాల్లో కొన్ని విధివిలాసమైతే ఇంకొన్ని స్వయంకృతం. ఇలియడ్ బాహ్య యుద్ధమైతే, ఒడిస్సీ ఒక అంతర్మథనం. ‘ధైర్యంగా ఉండు నా హృదయమా; నేనొక సైనికుడిని; ఇంతకంటే ఘోరమైన దృశ్యాలనే నేను చూశాను.’‘దేవుళ్లు మానవులకు కష్టాలను ఇస్తారు, తద్వారా రాబోయే తరాలకు చెప్పుకో వడానికి ఒక కథ మిగులుతుంది’ అంటాడు హోమర్. ఒక నాయకుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, తనను తాను తెలుసుకుంటూ గమ్యాన్ని చేరడం అనే ఇతివృత్తానికి ఒడిస్సీ శ్రేష్ఠమైన నమూనా. ఒడిస్సీస్ కేవలం శారీరక బలం గలవాడే కాదు, దుర్బేధ్య మైన ట్రాయ్‌ని, కొయ్యగుర్రం (ట్రోజన్ హార్స్) పొట్టలో సైనికులను రహస్యంగా పంపి, జిత్తులతో గెలిచినవాడు. అకిలీస్ శౌర్యం కోసం బతికితే, ఒడిస్సీస్కు బతకడమే ప్రధానం. వరాలు, శాపాలు, మాయలు, మంత్రాలతో సాగినప్పటికీ ఒడిస్సీలోని పాత్రలు కేవలం పురాణ బొమ్మలు కావు, అవి మానవ నైజానికి ప్రతీకలు. ఇందులో ఒంటికన్ను రాక్షసుడు పాలిఫేమస్ మన బకాసురుడిని గుర్తుకుతెస్తాడు. కొడుకు పసివాడుగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్లిపోయిన భర్త కోసం ఇరవై ఏళ్లు వేచి చూసే పెనలోపి పాత్రలో లక్ష్మణుడి భార్య ఊర్మిళను పోల్చుకోవచ్చు. తండ్రి పెంపకం కరవైనప్పటికీ, తల్లికి తోడుగా నిలిచి, చివరకు తండ్రితో కలిసి శత్రుసంహారం చేసే మంచి కొడుకు పాత్ర తలామకస్ది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒడిస్సీస్ లాంటివాళ్లే. ఆధునిక మానవుడు కెరీర్ అనే సంద్రంలో చిక్కుకుని, ఇంటి (ప్రశాంతత) కోసం వెతుక్కుంటున్నాడు. ఇప్పటికీ ఒడిస్సీ ప్రాసంగితకు అదే కారణం. ‘ఒక మనిషికి తన సొంత దేశం, తన తల్లిదండ్రుల కంటే మధురమైనది ఏదీ లేదు. పరాయి దేశంలో, కన్నవారికి దూరంగా ఎంతటి విలాసవంతమైన భవనంలో నివసించినప్పటికీ అవి దీనికి సాటిరావు’. ఒడిస్సీకి ఆంగ్లంలోనే అరవైకి పైగా అనువాదాలు వచ్చాయని ఒక లెక్క. దాన్ని ప్రేరణగా తీసుకుని వచ్చిన సృజన మరింత విస్తారమైనది. జేమ్స్ జాయిస్ రాసిన చైతన్య స్రవంతి నవల ‘ఉలిసేస్’ మామూలు మనుషుల మహాప్రస్థానాన్ని చెబుతుంది. ‘భువన సుందరి’గా ఇలియడ్, ‘రూపధరుడి యాత్రలు’గా ఒడిస్సీ తెలుగులోకీ వచ్చాయి. తాజాగా ఒడిస్సీని తెలుగు పాఠకులకు చేరువ చేయడానికి వేమూరి వేంకటేశ్వర రావు, వెంకట్ సిద్ధారెడ్డి కూడా ప్రయత్నించారు. ఒడిస్సీ, ఇలియడ్ ఇంతకుముందు చాలాసార్లు తెరకెక్కాయి. ఎన్నిసార్లయినా అంతే ఆసక్తిని పుట్టించాయి. ఈ కాలపు వండర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లాంటివాడు దీనిమీద ఆసక్తి కనబరచాడంటే, ప్రపంచం అంతకంటే అమితాసక్తితో జూలై 17న విడుదల కానున్న హాలీవుడ్ ఒడిస్సీ కోసం ఎదురుచూస్తోంది. ‘ఇంటర్స్టెల్లార్’లో అంతరిక్ష ప్రయాణాన్నీ, ‘ఇన్సెప్షన్’లో కలల ప్రయాణాన్నీ చూపించిన నోలన్‌కు ఒడిస్సీకంటే నప్పే కథ మరొకటి ఉండదు. స్థలకాలాలతో ముడిపెట్టి దీన్ని ఎలా చూపిస్తాడనే కుతూహలం అంతటా నెలకొంది. ఇలియడ్ ఆధారంగా వచ్చిన ట్రాయ్ (2004) సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నోలన్‌కు వచ్చిందట. కానీ అది కుదరలేదు. మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఆయన ఒడిస్సీ రూపంలో హోమర్‌కు దగ్గరయ్యాడు. తప్పిపోయిన ఇంటికి ఒడిస్సీస్ 20 ఏళ్ల తర్వాత చేరుకున్నట్టే, నోలన్ కూడా తనకు ఇష్టమైన ఈ సబ్జెక్టును చేపట్టడానికి 20 ఏళ్లు పట్టింది. ఆలస్యం అవడం అంటే ఒడిస్సీస్లా వయసు పెరగడమే; అంటే మరింత పైచూపుతో జీవితాన్ని చూడగలిగే పరిణతి రావడమే! -
ఎన్ని ఓట్లు తొలగిస్తారు సర్!
జూన్ 25వ తేదీని బీజేపీ మాదిరిగా దేశంలో మరే పార్టీ గుర్తుపెట్టుకోలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఐదు దశాబ్దాల కింద ఇందిరాగాంధి విధించిన ఎమర్జెన్సీ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా ప్రతియేటా బీజేపీ పాటిస్తున్నది. ఈయేడు కూడా బీజేపీ అగ్రనేతలంతా ఆనాటి అకృత్యాలపై ఎలుగెత్తారు. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ ‘దేశ చరిత్రలో ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింద’ని విమర్శించారు. పురాణాల్లోంచి నాలుగు సంస్కృత పంక్తులను సంగ్ర హించి ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. ‘స్వాతంత్య్రం ద్వారానే మనిషి నిజమైన సుఖాన్ని పొందుతాడు, ఉన్నతమైన విజయాలను సాధిస్తాడు. స్వేచ్ఛ ద్వారానే మనిషికి మనశ్శాంతి, సంతృప్తి లభిస్తాయి. స్వాతంత్య్రం ద్వారానే అత్యున్నత స్థితికి చేరుకోగలుగుతాము’ అని ఆయన సందేశానికి అర్థం. ప్రధాని చెప్పినట్టుగా ఎమర్జెన్సీ కాలం ఈ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమే. లక్షమందికి పైగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నెలల తరబడి నిర్బంధించిన రోజులవి! భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాణప్రదమైన పౌరహక్కులను సమస్త ప్రజానీకం సామూహికంగా కోల్పోయిన అస్వతంత్ర దినాలవి! లాకప్ చిత్రహింసలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కోటిమందికి పైగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వారిలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పీడకాలం అది. లక్షలాది నిరుపేదల ఆవాసాలను సర్కారీ బుల్డోజర్లు కర్కశంగా చిది మేసిన నిరంకుశ క్షణాలవి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేని అటు వంటి స్థితిలో మనిషికి నిజమైన సుఖసంతోషాలుండవని ప్రధానమంత్రి ప్రబోధించారు. కాకతాళీయంగా జూన్ 25 మాదిరిగానే జూన్ 24 కూడా భవిష్యత్తు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజుగా మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) కార్యక్రమం గత సంవత్సరం జూన్ 24న బిహార్‌లో ప్రారంభమైంది. ఇప్పటికి పన్నెండు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. వీరిలో ఐదు కోట్ల పైచిలుకు మందిని జాబితాల నుంచి తొలగించారు. చని పోయిన వారిని మినహాయించగా మిగిలిన వారి సంఖ్య ఇది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాల్లో 39 కోట్ల మంది ఓటర్ల పరిశీలనా కార్యక్రమం ఈ జూన్‌లో ప్రారంభమైంది. సర్ కార్యక్రమం తొలగింపు సరాసరి లెక్కన ఈ మూడో దశలో కూడా మరో పది శాతం మందిని జాబితాల నుంచి తొల గించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ అనుమానాలే నిజమైతే జర్మనీ జనాభాకు ఇంచుమించు సమాన స్థాయిలో మన దేశంలో అనర్హులుగా తేల్చిన ఓటర్ల సంఖ్య ఉంటుంది. వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? వారి అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారమవుతాయన్నది అగమ్యగోచరం. తమ అనర్హతపై బిహార్‌లో 47 లక్షలమంది, బెంగాల్లో 27 లక్షల మంది చేసుకున్న అప్పీళ్లపై ఇప్పటికీ విచారణే ప్రారంభం కాలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలదీ అదే కథ. ఈలోగా ఎన్ని కలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. వయోజను లైన భారత పౌరులందరికీ మన రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించింది. మానసిక స్థితి బాగా లేనివారు, కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్షపడినవారు, విదేశీయు లకు మాత్రమే ఓటు హక్కును తిరస్కరించే అవకాశం ఉన్నది. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్న ఐదు కోట్లమంది, ఉండే అవ కాశం ఉన్న మరో మూడు కోట్ల మందిని ఏ కేటగిరీలో చేర్చాలి?సార్వత్రిక ఓటు హక్కు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. అర్హులైన అందరినీ ఓటర్లుగా నమోదు చేసి వారి జాబితాలను తయారు చేసే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల సంఘం మీద మోపింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఓటర్లుగా నమోదయ్యే బాధ్యతను, అందుకోసం తన పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ప్రజలపైనే ప్రస్తుత ఎన్నికల సంఘం మోపింది. వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ ఆశయమైతే, అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం వైఖరి వీలై నంత ఎక్కువమందిని ఓటు హక్కుకు దూరం చేసేదిగా కనిపి స్తున్నది. రాజ్యాంగ ఆశయానికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని (1950) రూపొందించారు. దాంతోపాటు ఓటర్ల నమోదు నిబంధనావళి (1960)ని పార్లమెంట్ తయారు చేసింది.ఈ చట్టం ప్రకారం ప్రతి జనరల్ ఎలక్షన్‌కు ముందు సాధా రణ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వరకు ఈ ప్రక్రియ పరిమిత మవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక’ సవరణకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 (2) అనుమతినిస్తున్నది. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ముందుగా ఎన్నికల సంఘం పేర్కొనాలి. ఆ తర్వాత ఈసీఐ అవసరమని భావించిన ఏదైనా నియోజకవర్గంలోగానీ, నియోజకవర్గంలోని కొన్ని భాగాల్లోగానీ ప్రత్యేక సవరణ చేపట్టవచ్చునని చట్టం చెబుతున్నది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చట్టం పరిధి దాటిన వ్యవహారంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు చేపట్టే సవరణ సాధారణ సవరణగానే ఉండా లని చట్టం స్పష్టంగా పేర్కొన్నది.పెద్దసంఖ్యలో అక్షరజ్ఞానం లేనివారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కనీస డిజిటల్ పరిజ్ఞానం లేనివారు, తాత్కాలిక వలస లకు వెళ్లే శ్రమజీవులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలున్న దేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది వీలైనంత సరళంగా ఉండాలి. కానీ సాధ్యమైనంత సంక్లిష్టమైన ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్చివేసింది. 2002 ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయడం ఈ ప్రక్రియలో తొలిదశ. అందులో ఉన్న ఓటర్లకు ఇబ్బందేమీ ఉండదు. ఎన్యుమరేషన్ ఫాం నింపితే సరిపోతుంది. నలభయ్యేళ్ల లోపు వయసు వాళ్లకు అప్పట్లో ఓటు ఉండే అవకాశం లేదు కనుక వారు అప్పటి జాబితాలో ఉన్న తండ్రి పేరును, తాత పేరును వెతికి పట్టుకొని సమర్పించాలి. దాంతోపాటు మీరు మీరేనని ధ్రువీకరించే పత్రాన్ని కూడా సమర్పించాలి.2002 జాబితాలో పేరు లేక మ్యాపింగ్ కాని ఓటర్లతోపాటు అప్పటి జాబితాతో పోల్చితే స్వల్ప తేడాలు, స్పెల్లింగ్ తప్పు లున్న మ్యాపింగ్ అయినవారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నది. వారు ఈఆర్వో ముందు హాజరై తాము ఈ దేశ పౌరులమే, ఓటు హక్కుకు అర్హులమే అని నిరూపించుకోవ లసిన బాధ్యత వారిపైనే ఉన్నది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలంగాణలో 30 శాతం, ఏపీలో 24 శాతం మంది ఓటర్లకు 2002 జాబితాలో మ్యాపింగ్ జరగలేదు. అధికార యంత్రాంగం కనుక కొన్ని సెక్షన్ల ఓటర్లను తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తే మ్యాపింగ్‌లో ఎదురయ్యే చిన్నచిన్న తప్పులను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ విచక్షణాధికారాలన్నీ కేంద్రం నియమించిన ‘సూక్ష్మ పరిశీలకులకు’ సంక్రమించాయి.ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో పలురకాల వింతలు చోటు చేసుకున్నాయి. కొద్దిపాటి చరిత్ర జ్ఞానమున్న వారికి సైతం మీర్ జాఫర్ పేరు తెలియకుండా ఉంటుందా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి సహకరించి సిరాజుద్దౌలా ఓటమికి కారణమైన వ్యక్తి. ఈ ఘటన దేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అతని కుటుంబ వారసులు గత పది పదిహేను తరాలుగా ముర్షిదాబాద్‌లో నివసిస్తున్నారట! ఆ ఖాన్‌దాన్‌కు చెందిన 346 మంది ఓట్లు అనుమానితుల జాబితాలో చేరాయి. వారిప్పుడు తమ పౌర సత్వాన్ని నిరూపించుకోవడమనే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి ఉన్నది. విదేశాంగ శాఖ కార్యదర్శిగా, కామన్వెల్త్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన కృష్ణన్ శ్రీనివాసన్ పేరు 2002 జాబితాలో ఎందుకు లేదని నోటీసులిచ్చారట! ఉద్యోగ బాధ్యతలో చిరకాలం విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఈ ప్రశ్న అడగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వ్యవస్థకు ఇంగితజ్ఞానం కూడా లేదని నిరూపించే ఇటువంటి విశేషాలు పెద్దఎత్తున వెల్లడవుతున్నాయి.సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి దేశం మొత్తానికి ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలా? లేదంటే జాతీయ స్థాయితోపాటు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాలా అనే అంశంపై కూడా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఉద్యోగం, ఉపాధి అవకాశా లను వెతుక్కుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు శాశ్వత వలసలకు వెళ్లే అవకాశాలున్నందువలన రాష్ట్రాల కమిషన్లు ఈ వలస ప్రజల పట్ల వివక్ష చూపవచ్చన్న అనుమానంతో దేశమంతటికీ ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది. సార్వత్రిక ఓటు హక్కుకు ఏరకమైన అవరోధాలు రాకూడదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సభ ఆశ యానికీ, ఓటర్ల తగ్గింపే పరమావధిగా పెట్టుకున్న ప్రస్తుత ఎన్ని కల సంఘం వ్యవహార శైలికీ మధ్యన హస్తి మశకాంతరం ఎందుకేర్పడిందో చెప్పవలసిన బాధ్యత ఆ సంఘంపైనే ఉన్నది.ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు సమర్థించి ఉండవచ్చు. చట్టం పరిధిని మీరినట్టు స్పష్టంగా కనిపి స్తున్న ఎన్నికల సంఘం వ్యవహారం రాజ్యాంగబద్ధమేనని సర్వో న్నత న్యాయస్థానం అభిప్రాయపడి ఉండవచ్చు. ఆధిపత్య శక్తుల ప్రభావం వలన రాజ్యాంగ వ్యవస్థల నడుమ మంచి సమ న్వయం సమకూరి ఉండవచ్చు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు లేకుండా జాబితాలను శుద్ధి చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు మంచివే కావచ్చు. కానీ ఓటర్ల తొలగింపే ధ్యేయమన్నట్టు సాగుతున్న ఈసీ సంక్లిష్ట కార్యక్ర మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సంక్లిష్టత కారణంగా ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్నవారిలో పేదవర్గాలు, నిరక్షరాస్యులు, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండే పరిస్థితిని ఎలా అడ్డుకోగలుగుతాము? ఇప్పటికే బెంగాల్, బిహార్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాలను సంక్షేమ పథకా లకు లింక్ చేశాయి. తొలగించిన ఓటర్లందరూ లబ్ధిదారుల జాబితా నుంచి కోతకు గురికాబోతున్నారు.ఈమాత్రం హింట్ చాలదా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ చెలరేగిపోవడానికి! ఇటువంటి సావకాశం లేకుండానే అది వీలైనంతవరకు ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టింది. అమలు చేస్తున్న పథకాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్యలకు కత్తెర వేస్తున్నది. సర్ రూపంలో మరో అవకాశం తరుముకొస్తుంటే ఒడిసిపట్టకుండా ఊరుకుంటుందా? టీడీపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను క్రియాశీలకంగా రంగంలోకి దింపింది. ఎన్ని కల సంఘం తరఫున పనిచేసే బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ)తో టీడీపీ ఏజెంట్లను పూర్తిస్థాయిలో ‘మ్యాపింగ్’ చేసి నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎల్ఓల దగ్గర మాత్రమే ఉండా ల్సిన సమాచారం కూడా టీడీపీ ఏజెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. టీడీపీ బీఎల్ఏలు తమ పరిమితికి మించి ఎన్యూమ రేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని సమాచారం. కొందరు బీఎల్ఓలు అన్ని పార్టీల ఏజెంట్లకూ ఇవ్వాల్సిన హౌస్ విజిట్ సమాచారాన్ని కూటమి ఏజెంట్లకు మాత్రమే చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం బీఎల్ఏల గ్రూప్ కాల్స్‌లో అధికారులు మాట్లాడుతూ మార్గ నిర్దేశనం చేస్తున్న వ్యవహారాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి. ఇటువంటి ధోరణులకు చెక్ పెట్టే విధానంగానీ, యంత్రాంగంగానీ ఎన్నికల సంఘం దగ్గర లేదు. అసలు ఎన్నికల సంఘం నిష్పాక్షికత పైనే ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. పాస్‌పోర్టు కూడా పౌరసత్వానికి రుజువు కాదని తాజాగా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు. భారతీయ పౌరులు కానివారికి పాస్‌పోర్టు జారీ చేయరాదని పాస్‌పోర్టు చట్టం స్పష్టంగా చెబుతున్నది. చట్టం చెప్పినదానికీ, అధికారి వివరణకూ మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి? ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు ఏదీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖలు స్పష్టం చేశాయి. మరి ఓటరు జాబితాలో నమోదుకు అనర్హు లుగా మిగులుతున్న కోట్లాదిమంది పరిస్థితి ఏం కానున్నది? వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుంది? పుట్టి పెరిగిన దేశంలో పౌరసత్వం లేదని నిబంధనలు వెక్కిరి స్తుంటే స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆ ప్రజలు ఎలా అనుభవించగలరు? సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తుంటే బడుగు వర్గాల ప్రజలు సంతృప్తిగా ఎలా జీవించగలరు? ‘స్వాతంత్య్రాత్ సుఖమాప్నోతి/ స్వాతంత్య్రాల్లభతే పరమ్!’ అంటూ ప్రధాని చెప్పిన శ్లోకం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి కౌంటర్‌గా మాత్రమే పనికొస్తుందా? సర్ ఎమర్జెన్సీ మీద సెటైర్‌గా పనికిరాదా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మిస్టర్ బీస్ట్ రికార్డు!
జూన్ 12న ‘మిస్టర్ బీస్ట్’, యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్స్క్రైబర్లకు చేరుకున్న మొదటి చానల్‌గా రికార్డు సృష్టించింది. ఈ చానల్ కంటెంట్ క్రియేటర్ జేమ్స్ డొనాల్డ్సన్ సంపాదన ఏడాదికి రూ.700 కోట్లకు పైమాటే. -
పాస్పోర్టూ పనికిరాదా?
ప్రపంచంలో ఏ దేశం పాస్‌పోర్టు శక్తిమంతమైందో లెక్కేసిచెప్పే హెన్లే పాస్‌పోర్టు ఇండెక్స్ (హెచ్పీఐ)... మన పాస్‌పోర్టు 75వ స్థానంలో ఉందంటూ ఈ ఏడాది మొదట్లో నిర్ధారించింది. ‘హమ్మయ్య... నిరుటితో పోలిస్తే పదిమెట్లు పైకొచ్చాం’ అని మన పౌరులు గర్వపడి ఆర్నెల్లు కాకుండానే దానికేమీ పెద్దగా విలువలేదనీ, భారత పౌరసత్వానికి అదేమీ రుజువు కాబోదనీ మన విదేశాంగ శాఖ తేల్చిచెప్పి, ఆ సంతోషంపై నీళ్లు చల్లింది. ‘ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు... గత పుష్కరకాలంలోని నిర్ణయం కానేకాదు. 1967 నాటి పాస్‌పోర్టు చట్టమే ఆ మాట చెప్పిం’దని సెలవిస్తోంది. గత కాలపు నిర్ణయం అయినంత మాత్రాన ఏదైనా శిరోధార్యమవుతుందా... దాన్ని సమీక్షించటం, మార్చటం అసాధ్యమా అన్న ప్రశ్నలు సహజంగానే అందరిలో తలెత్తుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎన్నికల సంఘం (ఈసీ) ధర్మమా అని పౌరసత్వంపై ప్రజానీకంలో ఆందోళన బయల్దేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బిహార్‌లో మొదలై పలు రాష్ట్రాల్లో సాగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కావలసినంత కలవరపాటును సృష్టించింది.ఇంకా సృష్టిస్తోంది. పౌరులమని నిరూపించుకునే పత్రాలు సమర్పిస్తేనే ఓటు ఉంటుందనటంవల్ల పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోయారు. యూపీలో అలాంటివారు రెండు కోట్ల పైమాటే. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోవటం తక్షణ ప్రమాదమైతే... దేశంలో నివసించటం అసాధ్యమయ్యే స్థితి ఏర్పడటం మున్ముందు ఎదురయ్యే ముప్పు. ఈ దేశ పౌరులని ఈసీ నమ్మితేనే ఎవరికైనా ఓటుహక్కు లభిస్తుంది. అలాగని ఓటర్ గుర్తింపు కార్డు పౌరసత్వానికి రుజువు కాబోదని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు పాస్‌పోర్టు సైతం ఆ ఖాతాలో చేరింది.పదిహేనేళ్ల క్రితం మహారాష్ట్రలోని తెంబ్లీలో ఆధార్‌ను లాంఛనంగా ప్రారంభించి నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమనీ, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినా వుంటుందనీ అన్నారు. నిరుపేదలకు ఏ గుర్తింపు కార్డూ లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించామని కూడా చెప్పారు. తీరా సర్ ప్రక్రియ సమయంలో అది చెల్లుబాటు కాబోదని ఈసీ తేల్చి చెప్పింది. అటుపై సుప్రీంకోర్టు అనుమతించిన 12 పత్రాల్లో పాస్‌పోర్టు కూడా ఉండటం చాలామందికి ఊరటనిచ్చింది. ఇప్పుడు పాస్‌పోర్టు కూడా పౌరసత్వాన్ని నిర్ధారించటానికి పనికిరాదనటం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. అవధానాల్లో ఆశువుగా పద్యం చెప్పే అవధానికి ‘నిషిద్ధాక్షరి’ మాటున పృచ్ఛకుడు అడుగడుగునా అడ్డుతగులుతూ, ప్రతి పదంలోనూ అక్షరాలను నిషేధిస్తూ ముప్పు తిప్పలు పెడతాడు. వీటన్నిటినీ అధిగమించి ఛందోబద్ధంగా అందమైన పద్యాన్ని అల్లటం అవధాని పద సంపదకు పరీక్ష. పౌరసత్వం విషయంలో దేశ పౌరులకు ఇలాంటి పరీక్షే ఎదురవుతోంది. ఏ పత్రం దాఖలు చేద్దామనుకున్నా అది పనికిరాదని చెప్పటం తప్ప, పనికొచ్చేదేమిటో పాలకులు నిర్ధారణగా చెప్పరు. ఇందువల్ల సామాన్యుల్లో అభద్రతా భావన ఏర్పడటం తప్ప సాధిస్తున్నదేమిటి? పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 6(2)(ఏ) ఈ దేశ పౌరుడుకాని వ్యక్తికి పాస్‌పోర్టు నిరాకరించాలని స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టే వేరే దేశాలకు ప్రమాణం. దాన్నిబట్టే వీసాలు జారీ అవుతాయి. అది పనికిరాదంటే ఆ దేశాలు అడుగుపెట్టనిస్తాయా?హెచ్పీఐ ర్యాంకులు సాధారణమైనవేం కాదు. ప్రపంచంలో సింగపూర్ పాస్‌పోర్టును మొత్తం 192 దేశాలు గుర్తించి, వీసా అవసరం లేకుండానే తమ భూభాగాల్లో అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నాయి. అందువల్లే అది ప్రథమ స్థానంలో ఉంది. 187 దేశాల గుర్తింపుతో జపాన్, దక్షిణ కొరియాలు... 186 దేశాల గుర్తింపుతో స్వీడన్, యూఏఈలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అలా చూస్తే మన పాస్‌పోర్టుకు 56 దేశాల గుర్తింపు మాత్రమే ఉంది. ఇతరచోట్లకు వెళ్లాలంటే వీసా కావాలి. వారు సైతం పాస్‌పోర్టు ఆధారంగానే వీసా జారీచేస్తారు. ఇప్పుడు విదేశాంగశాఖ తకరారుతో అంతర్జాతీయంగా ఎవరైనా తలుపులు మూస్తే మన పౌరుల గతేమిటి? ఎన్నో దేశాల్లో అన్నిటికీ చెల్లుబాటయ్యే కార్డు జారీ విధానం దశాబ్దాల క్రితమే అమల్లోకొచ్చింది. మనం మాత్రం అభద్రతాభావంతో పౌరులకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్నాం. ఇది సబబేనా? -
జి రామ్ జి కేటాయింపులు..
విబి–జి రామ్ జి (వికసిత్ భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్– గ్రామీణ్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.95,692 కోట్ల ప్రతిపాదిత కేటాయింపులను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ పొందాయి. -
రక్షణ వలయాలు రహస్య వ్యూహాలు
దేశాధినేతల భద్రత వెనుక ఉండే అత్యంత రహస్య వ్యూహాలు, కఠినమైన నిబంధనల గురించి మాజీ ఐబీ అధికారి యశోవర్ధన్ ఆజాద్ ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ఒబామా పర్యటన, మోదీ కాన్వాయ్ ఉల్లంఘన; రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ హత్యల వంటి కీలక ఘటనలు భారత భద్రతా వ్యవస్థల పని తీరును ఎలా మార్చిందీ వివరించారు.ముంబైలో ఒబామా పర్యటన‘‘అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముంబైని సంద ర్శించినప్పుడు, ఒక అగ్రరాజ్యంతో కలిసి భద్రతా ఏర్పా ట్లను సమన్వయం చేసుకోవడం ఎంత పెద్ద సవాలో మాకు తొలిసారి అవగాహనకు వచ్చింది. అమెరికా భద్రతా విభాగమైన ‘యూఎస్ సీక్రెట్ సర్వీస్’ పనిచేసే విధానం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. వారు తమ సొంత భారీ రక్షణ కవచం ఉన్న వాహనం ‘ద బీస్ట్’ను ముంబైకి తీసుకొచ్చారు. ఒబామా అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో వ్యూహాత్మక నియంత్రణను తామే చూసు కుంటామని పట్టుబట్టారు. ఒక ఉన్నతస్థాయి భారతీయ ఇంటెలిజెన్స్ అధికారిగా ఆ సమయంలో నాకున్న పెద్ద సవాలు ఏంటంటే... వారి కఠినమైన, వెనక్కి తగ్గని భద్రతా డిమాండ్లను నెరవేరుస్తూనే, మన దేశ సార్వభౌ మాధికారాన్ని గట్టిగా చాటడం! వారి ‘బీస్ట్’ వాహనం మన రోడ్లపై సులువుగా ప్రయాణించేలా చూస్తూనే, మన సొంత గడ్డపై భారతీయ బలగాలే ప్రధాన రక్షణ కవచంగా ఉండేలా మేము భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాం.పంజాబ్ ఫ్లైఓవర్‌పై మోదీ‘‘ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఎలా విఫలమవుతుందో మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ మీద నిలిచి పోయినప్పుడు ఏం జరిగిందో చూడాలి. అది నిఘా విభాగం వైఫల్యం కాదు. స్థానిక నిర్వహణ లోపానికి నిలువెత్తు నిదర్శనం. మేము ఒక వి.వి.ఐ.పి. రూట్‌ను ప్లాన్ చేసినప్పుడు, స్థానిక రాష్ట్ర పోలీసులు కచ్చితంగా ‘క్లియరెన్స్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు, ఒక ప్రత్యా మ్నాయ బ్యాకప్ రూట్‌ను కూడా సురక్షితంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో, నిబంధనలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. నిరసనకారులు దారిని అడ్డుకోవడానికి వీలు కలిగింది. దానివల్ల ప్రధాని ఒక వంతెనపై, కదలకుండా ఆగిపోయిన వాహనంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఎలాంటి రక్షణ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. భద్రత అనేది కేవలం కాగితంపై బాగుంటే సరిపోదని స్థానిక నిర్వహణ కూడా లోపరహి తంగా ఉండాలని ఆ ఘటన స్పష్టంగా నిరూపించింది.రాజీవ్ హత్య నేర్పిన పాఠం‘‘మన ఆధునిక భద్రతను మరింత పట్టిష్టం చేయటానికి మేము తరచూ గతంలో జరిగిన విషాదాలను పరిశీ లిస్తుంటాం. అందులో భాగంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతాన్ని మేము మైక్రోస్కోప్ కింద పెట్టి మరీ విశ్లేషించాం. ఆ నిర్దిష్ట సమయంలో ఆయన కేవలం ఒక అభ్యర్థి మాత్రమేనని, అందువల్ల ఎస్పీజీ రక్షణ వలయం ఆయనకు మునుపటిలా అందుబా టులో లేదనే విషయాన్ని ప్రజలు మర్చిపోతుంటారు. అక్కడ జరిగిన వైఫల్యం మానవ రక్షణ వలయానికి సంబంధించినది. ఆ ఒక్క ఘటనే ఆ తర్వాత నుంచీ మానవ సంబంధాలు, శారీరక సామీప్యత, ప్రవేశ నియం త్రణను నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చేలా చేసింది. వీవీఐపీకీ, ప్రజలకూ మధ్య కఠినమైన భౌతిక అడ్డంకులను అమలు చేస్తూ, మేము అందరి దృష్టిలో ‘చెడ్డవాళ్లుగా’ మారడానికి కారణం ఆ దుర్ఘటనే.ఇందిర హత్య తర్వాతే ‘ఎస్పీజీ’‘‘1984లో ప్రధాని ఇందిరా గాంధీ తన అంగరక్షకుల చేతిలోనే దారుణ హత్యకు గురైనప్పుడు, అది మన నిఘా, భద్రతా వ్యవస్థలను మూలాల నుండి కుదిపేసింది. ఆ విషాదానికి ముందు, దేశంలో వీవీఐపీల ‘అత్యంత సమీప’ రక్షణ వలయం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన దళం అంటూ ఏదీ లేదు. ఆ వ్యవస్థాగత వైఫల్యం కేవలం భౌతిక భద్రతలో జరిగిన లోపం మాత్రమే కాదు, అది ప్రధాని అంగరక్షకుల ఎంపిక పరిశీలనలో జరిగిన నిఘా లోపం కూడా. ఈ హత్య తర్వాత, దేశాధినేతను అంతర్గత ముప్పుల నుండి రక్షించడానికి కేవలం సాధారణ పోలీసు పద్ధతులు సరి పోవని గ్రహించాం. ఆ గ్రహింపే బీర్బల్ నాథ్ కమిటీ ఏర్పాటుకు, 1985లో ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్’ స్థాపనకు తక్షణ ఉత్ప్రేరకంగా మారింది. -
పగబట్టిన ప్రకృతి!
శతాబ్ద కాలంలో ఎన్నడూ చవిచూడని పెను ఉత్పాతం గురువారం (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి) వెనెజులాపై విరుచుకుపడింది. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు వచ్చిన భూకంపాలు– మొదట రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో, అటుపై 7.5 తీవ్రతతో–ఆ దేశాన్ని కాటేశాయి. వెంటవెంటనే ఇంత తీవ్రతతో భూకంపాలొస్తే జన నష్టం, ఆస్తి నష్టం అపారంగా ఉండే అవకాశాలుంటాయి. అటుపై వరసగా 30 సార్లు ప్రకంపనలు వచ్చాయంటే అదెంత భయానకమో ఊహించవచ్చు. దీంతోపాటే అమెరికాలోని కాలిఫోర్నియాలో, జపాన్‌లో సైతం భూకంపాలు రావటం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని భయపెట్టింది. వీటికితోడు కశ్మీర్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. భూ అంతర్భాగంలో ఏదో చోటు చేసుకోవటం వల్లే ఇలా జరిగిందన్న ఆందోళన కలిగినా ఇవి యాదృచ్ఛికమైనవేనని శాస్త్రవేత్తలు తేల్చారు. జపాన్‌లో ఎప్పుడూ భూకంపాల తాకిడి ఎక్కువ గనుక అక్కడ కూడా 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినా పెద్దగా నష్టం కలగలేదు. ఇక వెనెజులా భూకంపానికి సంబంధించి అధికారిక లెక్కల ప్రకారం ఇంత వరకూ మృతుల సంఖ్య వందల్లోనే ఉన్నా... శిథిలాలు తొలగించాక ఇది వేలల్లోకి చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే భూకంపాలు రావటంతో తప్పించుకునే వ్యవధి లేక చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారు. పీడ పోకుండానే పిశాచం పట్టుకున్న చందాన వెనెజులా వరస కష్టాలు ఎదుర్కొంటున్నది. ఈ ఏడాది జనవరిలో అమెరికా మెరైన్ దళాలు దాడి చేసి దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అపహరించి తమ దేశానికి తరలించాయి. ఇప్పుడు మదురోపై విచారణ ప్రహసనం నడుస్తోంది. అంతకు చాన్నాళ్ల ముందే అమెరికా ఆంక్షల చట్రంలో ఊపిరాడని దేశ ఆర్థిక వ్యవస్థ 2013 తర్వాత మరింత దెబ్బ తింది. చమురు నిల్వల్లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్న వెనెజులా అమెరికా పీడ లేకుంటే అత్యంత సంపన్నవంతమైన దేశంగా నిలిచేది. కానీ భారీ ద్రవ్యోల్బణం, అవినీతి, అమెరికా ఆర్థిక ఆంక్షల పర్యవసానంగా దాని జీడీపీ 80 శాతం పడిపోయింది. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్యూజ్ నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికా కను సన్నల్లో నడుస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న 24,000 కోట్ల డాలర్ల రుణ చెల్లింపును పునర్వ్యవస్థీకరించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను ఆ దేశం కోరింది. ఈ రెండు భూకంపాలవల్లా దేశ ఆర్థికవ్యవస్థకు దాదాపు పదివేల కోట్ల డాలర్ల వరకూ నష్టం సంభవించి ఉండొచ్చని అమెరికా భౌగోళిక సర్వే అంచనా వేస్తోంది. ఆంక్షల వల్ల దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. వంతెనలూ, రోడ్లు, ఆసుపత్రులు, విద్యుత్ గ్రిడ్లు కాలం చెల్లినవి కావటంతో అవి భూకంపం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇతరేతర విపత్తులు ముందస్తు సూచనలు అందించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడానికి వీలుగా మనిషికి కొద్దిపాటి వ్యవధినిస్తాయి. కానీ భూకంపాలు ఎలాంటి సూచనా అందించవు. ఏం జరిగిందో గ్రహించే లోగానే శిథిలాల గుట్టలతో భీతావహుల్ని చేస్తాయి. ఈసారి కొంత నయం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఉండే యాక్సెలెరోమీటర్ అనే సెన్సర్ అయిదు, పది సెకన్ల ముందు హెచ్చరించటంతో చాలామంది అప్రమత్తమై భారీ భవంతులనుంచి దూరం జరిగి ప్రాణాలు కాపాడుకున్నారు. భూకంపం బయలు దేరినప్పుడు మొదట విడుదలై శరవేగంతో విస్తరించే పీ–వేవ్స్ (ప్రాథమిక తరంగాలు)ను ఆ సెన్సర్ పసిగడుతుంది. ఒకే ప్రాంతంలో అనేక ఫోన్లు ఈ పనిచేసినప్పుడు గూగుల్ క్లౌడ్ సర్వర్‌లోని అల్గారిథమ్ వెనువెంటనే అన్ని ఫోన్లకూ హెచ్చరిక సందేశాన్ని విడుదల చేస్తుంది. ‘భూకంపాల క్రియాశీల దశ’లోకి భూమి చేరుకుని ఉండొచ్చని పదేళ్లక్రితం భూభౌతిక శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. దానిపై ఇంతవరకూ నిర్ధారణగా చెప్పిందేమీ లేదుగానీ...దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవటం మేలు. జపాన్ ఈ విషయంలో చాలా ముందంజలో ఉంది గనుక, ఇతర దేశాలు దాన్ని అనుసరించాలి. అలాగే ప్రకృతికి చేటుతెచ్చే విధానాలు కట్టిపెట్టాలి. ఉన్నంతలో పర్యావరణహిత విధానాలు అనుసరిస్తే ఇలాంటి విపత్తులకు ఆస్కారం తక్కువ ఉంటుంది. -
కేవలం విమానాలే కాదు!
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ వద్ద నమోదైన మొత్తం 2,312 మానవ సహిత వాయు వాహనాలలో ఐదింట దాదాపుగా నాలుగో వంతు విమానాలే ఉన్నాయి. మిగతావి హెలికాప్టర్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, అల్ట్రా లైట్ విమానాలు. -
బ్రిటిష్ ‘లేబర్’ గట్టెక్కేదెలా?
అధికారానికి దూరంగా దాదాపు 14 యేళ్ల సుదీర్ఘ నిరీక్షణలో గడిపిన లేబర్ పార్టీని 2024 జూలైలో విజయపథాన నడిపించి, 411 సీట్లు సాధించిపెట్టిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రెండేళ్లు తిరక్కుండా విఫల నేతగా ముద్రపడి నిష్క్రమించబోతున్నారు. ఆయన స్థానంలో పార్టీ నేతగా ఎన్నికై వచ్చేనెల 17 తర్వాత ప్రధాని పగ్గాలు చేపడతారని అందరూ భావిస్తున్న ఆండీ బర్న్‌హామ్ గురించి పార్టీలో అంచనాలు దండిగానే ఉన్నాయి. బర్న్‌హామ్ వాటిని అందుకోగలిగితే 2029లో పార్టీ మరోసారి అధికారంలోకి రాగలుగుతుంది. 1760లో పారిశ్రామిక విప్లవానికి బీజంపడిన ఉత్తర ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌కు మేయర్‌గా పనిచేసి బర్న్‌హామ్ సాధించిన ఘన విజయాలు తక్కువేమీ కాదు. 2017లో నగర బాధ్యతలు స్వీకరించాక... నాలుగు దశాబ్దాలుగా ప్రైవేటు రంగంలో ఉంటూ, నాసిరకం సేవలతో జనాన్ని ఇబ్బందులపాలుచేసిన బస్సు రవాణాను తిరిగి ప్రభుత్వ రంగ నియంత్రణలోకి తీసుకొచ్చారు. బస్సులు, ట్రామ్‌లు, సైక్లింగ్ మార్గాలను అనుసంధానిస్తూ లండన్ తరహా ‘బీ నెట్ వర్క్’ను ఏర్పాటుచేశారు. ప్రజలకు మెరుగైన, చవకైన ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. గ్రేటర్ మాంచెస్టర్‌ను యూరప్‌లోనే అత్యంత పర్యావరణహిత నగరాల్లో ఒకటిగా మార్చేందుకు కృషి చేశారు. ఈ విజయాలే ఈ నెల మొదట్లో మాంచెస్టర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన్ను ఎంపీగా నెగ్గించాయి. బర్న్‌హామ్ ప్రధాని పదవికి పోటీపడగలరని ఎవరూ అనుకోలేదు. పార్లమెంటుకొచ్చి నిండా నెల రోజులు కాకుండానే పార్టీ నాయకత్వానికి సంసిద్ధమని ఆయన ప్రకటించటం, స్టార్మర్ ప్రధాన ప్రత్యర్థిగా అంతవరకూ అనుకున్న మాజీ ఆరోగ్యమంత్రి వెస్ స్ట్రీటింగ్ బర్న్హామ్కే మద్దతిస్తున్నట్టు ప్రకటించటంతో అందరూ విస్మయపడ్డారు. నిజానికి 2024 ఎన్నికల్లో లేబర్ విజయంలో స్టార్మర్ దీక్షాదక్షతలొక్కటే పనిచేయలేదు. అప్పటికే అంతర్గత కలహాలతోవున్న కన్సర్వేటివ్ పార్టీ బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్లను ప్రధానులుగా తెచ్చినా కుదుటపడలేకపోయింది. ఈ రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఇలాంటి దశలో స్టార్మర్ పగ్గాలు చేపట్టి పార్టీని తీవ్ర వామపక్ష విధానాలనుంచి మధ్యేవాద పథానికి తీసుకొచ్చారు. గతంలో లేబర్ నేత టోనీ బ్లెయిర్ ప్రధానిగా దేశాన్ని భ్రష్టుపట్టించిన వైనం జనం మరిచేలా చేసి, తటస్థుల ఓట్లు సైతం రాబట్టారు. అయితే ఎన్నికల్లో నెగ్గటం వేరు... ప్రభుత్వాధినేతగా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించి, దేశాన్ని సంక్షోభంనుంచి గట్టెక్కించటం వేరు. ఈయూ నుంచి తప్పుకుంటే దేశం బ్రహ్మాండంగా పురోగతి సాధిస్తుందని నమ్మి పదేళ్ల క్రితం దానివైపు మొగ్గిన జనం అన్నివిధాలా నష్టపోయామని ఆలస్యంగా గ్రహించారు. తిరిగి ఈయూలో చేరాలనే స్వరాలు పెరిగాయి. ఈ విషయంలో తన వైఖరేమిటో స్టార్మర్ చెప్పలేదు.అసమానతల్నీ, దారిద్య్రాన్నీ పారదోలటానికి... జనం ఎదుర్కొంటున్న ఆవాస సమస్యను అధిగమించటానికి ఏం చేయాలన్న ప్రణాళికలకు బదులు అంతకంతకూ బలపడుతున్న తీవ్ర మితవాద పక్షం రీఫామ్ యూకే పార్టీని ఎలా ఎదుర్కొనాలన్న అంశంపైనే ఆయన దృష్టి పెట్టారు. నైజెల్ ఫరాజ్ నాయకత్వంలోని ఆ పార్టీని అనుకరించే ప్రయత్నం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని సమర్థించటం, దాన్ని ఖండిస్తూ ఉద్యమించిన పాలస్తీనా యాక్షన్ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించటం, వలసలపైనా ఆంక్షలు విధించటంలాంటివి చేశారు. ఫరాజ్ పార్టీని కాపీ కొడితేనే దాన్ని ఓడించటం సులభమన్న ఆయన తెలివితక్కువతనం లేబర్ పార్టీకి శాపంగా మారింది. ఉత్తర ఇంగ్లండ్, మిడ్లాండ్స్ వంటి కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లో లేబర్ చేతుల్లోవున్న వేలాది కౌన్సిలర్ స్థానాల్నీ, కౌన్సిళ్లనూ ఫరాజ్ పార్టీ కైవసం చేసుకుంది. జాతీయ సర్వేల్లో సైతం ఏకంగా 27 శాతం వరకూ ఓటింగ్ సాధించి లేబర్‌ను మూడో స్థానంలోకి నెట్టింది. దాంతో లేబర్ ఎంపీలంతా వణికిపోయారు. స్టార్మర్ను సాగనంపకుంటే భవిష్యత్తు శూన్యమని గ్రహించారు. నైతికత, సిద్ధాంతాలు లేకుండా గాలివాటు రాజకీయాలకు పాల్పడితే జనం మెచ్చరని స్టార్మర్ ప్రస్థానం నిరూపించింది. బర్న్‌హామ్ ఆయన్నుంచి గుణపాఠం నేర్చుకుని సమర్థ పాలన అందించగలిగితే లేబర్ కోలుకోవటం ఖాయం. -
మళ్లీ మరో విషాదం!
దేశంలో మూడు వారాలలోపే మరో ఘోరం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం మధ్యాహ్నం ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్ మంటల్లో చిక్కుకోవటంతో నలుగురు బాలికలతోపాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో అత్యధికులు 25 యేళ్ల లోపువారే. మృతుల్లో దాదాపు అందరూ కాలిన గాయాలతోకాక, దట్టమైన పొగలో చిక్కుకుని ఊపిరాడక మరణించిన వారే కావటం గమనించదగ్గది. నివాసగృహ సముదాయాలైనా, వాణిజ్యభవనాలైనా నిర్దిష్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది. భవన నిర్మాణ సమయంలోనే నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) కోసం దరఖాస్తు చేసుకోవటం, అధికారుల తనిఖీలు నిబంధనల ప్రకారం జరిగితీరాలి. ఒకసారి కాదు... భవనం పూర్తయ్యేలోగా రెండు మూడు సార్లు ఈ తనిఖీలుండాలి. అగ్నిమాపక వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా లేదా... అను కోని విపత్తు ముంచుకొచ్చినప్పుడు తప్పించుకోవటానికి అత్యవసర మార్గాలు ఏర్పాటు చేసుకున్నారా లేదా అనే అంశాలు వీటిల్లో తప్పనిసరి. ఎన్ఓసీకి చెల్లుబాటయ్యే కాలం పూర్తయినాక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ అన్ని తనిఖీలూ ఉంటాయి. ఇవన్నీ కాగితాల్లో పొందుపరిచినంతగా ఆచరణలో కనబడవు. సమస్య మూలం అక్కడేవుంది.లక్నోకూ, ఢిల్లీకీ మధ్య ఏమంత దూరం లేదు. ఢిల్లీలో ఈ నెల మొదట్లో జరిగిన రెండు విషాద ఘటనల్లో 30 మంది వరకూ మరణించారు. అనేకులు గాయపడ్డారు. మొదటి ఉదంతంలో అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. రెండో ఘటన ఒక హోటల్ మంటల్లో చిక్కుకోవటానికి సంబంధించింది. ఇవి రెండూ మూడు రోజుల వ్యవధిలో జరిగాయి. కానీ ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. ‘విషాదం చోటుచేసుకున్నది ఎక్కడో కదా... మనకేమిటి సంబంధమ’ని భావించే ధోరణి అన్ని వ్యవస్థల్లో పాతుకుపోయిన పర్యవసానంగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి తప్పడం లేదు. లక్నోలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆవాసానికే అనుమతు లున్నచోట వాణిజ్య కార్యకలాపాలు సాగుతుంటే అధికారుల్లో ఏ ఒక్కరికీ పట్టలేదు. లక్నో అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు దీన్ని కూల్చటానికి 2016లో నోటీసు లిచ్చినా రెండు నెలల తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. కారణమేమిటో ఎవరికీ తెలియదు! ఇలా ఏదో ఒక విభాగానికి సర్వాధికారాలూ ఇవ్వటం సమస్యలకు కారణ మవుతున్నది. స్థానిక పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం, విద్యుత్ శాఖ ఇంజినీర్లు, భవన నిర్మాణ నిపుణులు వగైరాలతో కమిటీ ఏర్పరిచి, నిర్దిష్ట వ్యవధిలో అది తప్పని సరిగా సమావేశమయ్యేలా... అనుమతులకూ, నిరాకరణలకూ స్పష్టమైన కారణాలు నమోదు చేసేలా ఉంటే ఇలా లోపాయికారీ వ్యవహారాలు సాగవు. కానీ మన ప్రభు త్వాలు ఆ పని చేయవు. ఘటన జరగ్గానే రావటం, సానుభూతులూ, సంతాపాలూ, ఎక్స్‌గ్రేషియా ప్రకటనలు మాత్రం రివాజు.అగ్నిప్రమాదం గురించి తెలిశాక ఏకంగా 19 అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కానీ చాలాసేపటివరకూ ప్రమాదంలో చిక్కుకున్న భవంతిలోకి వెళ్లటం శక్యం కాలేదు. ఆ భవంతికి ఇరుకైన మెట్ల దారి మినహా మరేం లేకపోవటంతో పక్క భవనాలనుంచి అప్పటికప్పుడు నిచ్చెనలు వేసి ఆ భవనంపైకి చేరుకుని పనిచేయాల్సివచ్చింది. బయటపడే మార్గం లేక వాష్‌రూంలో చేరి నలుగురు పిల్లలు కాపాడమంటూ ఫోన్లలో తమ తల్లిదండ్రులను వేడుకున్నారు. బయటకు వినపడేలా ఆర్తనాదాలు చేశారు. కానీ ఈలోగానే మృత్యుధూమం వారిని కాటేసింది.అవి నివాస భవనాలైనా, వాణిజ్య సముదాయాలైనా తొలినాళ్ల అంచనాకు మించి విద్యుత్ వినియోగం ఉంటుంది. అధిక శక్తిగల విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగటం, వాటికి అనుగుణమైన వైరింగ్ లేకపోవటంవల్ల లోడ్ ఎక్కువై షార్ట్ సర్క్యూట్ జరిగిమంటలంటుకుంటాయి. నిర్మాణానికి వాడేవన్నీ మండే స్వభావంగలవి కావటంతో మంటలు పెనువేగంతో వ్యాపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో ఒక్క ఢిల్లీలోనే ఆసుపత్రుల్లో 78 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నివాసప్రాంతాల్లో వెయ్యికిపైగా ప్రమాదాలు సంభవించాయి. లక్నో విషాదమైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించకపోతే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. -
నడకదారి ఇక పౌరుల హక్కు
నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లన్న తేడా లేకుండా ఇకపై ప్రతి రహదారికీ పాదచారులు నడవటానికి వీలుగా ఫుట్‌పాత్‌లు ఉండి తీరాలనీ, ఇందుకు సంబంధించి ఒక చట్టం తీసుకురావాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన ఆదేశం పౌరులకు ఉపశ మనం కలిగిస్తుంది. ఈ తీర్పు ప్రాముఖ్యతేమంటే... జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, దాంతోపాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లే, స్థిరపడే, కలుసుకునే స్వేచ్ఛను వాగ్దానంచేసే అధికరణం 19(1) (ఎ), (బి), (సి), (డి)లను మరింత విస్తృతీకరించటం. దీని పర్యవసానంగా రోడ్లపక్కన ఫుట్పాత్లుండటం ఇకపై పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటవుతుంది. అయితే ఈ ఆదేశాలిచ్చే ముందు అసలు ఎన్ని నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఫుట్పాత్లున్నాయో... వాటిల్లో ఎన్ని పనికొచ్చే విధంగా ఉన్నాయో గణాంకాలివ్వాలని ధర్మాసనం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతా లను ఆదేశించాల్సింది. బహుశా అలాంటి ఆదేశం ఇస్తే దీర్ఘకాలం ఎదురుచూపులు చూడటం తప్ప ఫలితం ఉండబోదని న్యాయమూర్తులు భావించి ఉంటారు. న్యాయ స్థానాలు అడిగినప్పుడు ప్రభుత్వాలు తగిన సమాచారం ఇవ్వకపోవటం, వాయిదాలు కోరటం పర్యవసానంగా దేశంలో చాలా కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్‌పాత్‌ల సంఖ్యను క్రోడీకరించినట్టు లేదు. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నిర్వహణలో ఉంటాయి. కేంద్రం తల్చుకుంటే ఈ వివరాలు సేకరించి జాతీయ స్థాయి డేటా రూపొందించగలదు. కానీ ఆ అవసరం ఉందని భావించాలి గదా! ఫుట్‌పాత్‌లు అనేవి మన దేశంలో బ్రహ్మపదార్థం లాంటివి. రోడ్డుపక్కన ఎక్కడో ఒకచోట ఇటుక, సిమెంట్, టైల్స్ శిథిలాలుంటే ఒకప్పుడు ఇక్కడ ఫుట్‌పాత్ ఉండేదని అను కోవటం తప్ప చాలాచోట్ల వాటి జాడ కనబడదు. నగరాలూ, పట్టణాల్లో రోడ్డెక్కిన పాదచారి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లటం కోసం దారిలో గోతులు, రాళ్లురప్పలూ ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకుంటూ నడవక తప్పని స్థితి. వీటి సంగతలావుంచి ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ద్విచక్రవాహనదారులు అసహనంతో ఆ నడకదారులను సైతం కాజేస్తారు. ఇక చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునేవారు సరేసరి. హైదరాబాద్‌లో మెట్రో రైల్ వచ్చాక స్టేషన్లకు అటూ ఇటూ ఫుట్‌పాత్‌లపై రెస్టారెంట్లు వెలిసి పాదచారుల్ని సవాలు చేస్తున్నాయి. తోపుడు బండి లేదా సైకిళ్లపై వ్యాపారాలు చేసుకునేవారిని అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు అదిలించటం కనబడుతుంది. కానీ మెట్రో స్టేషన్ల దగ్గరుండే రెస్టారెంట్ల జోలికి ఎవరూ వెళ్లిన దాఖలా లేదు. ఇక దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఫుట్‌పాత్‌ల సదుపాయంగల ఊళ్లు కనీసం వందల సంఖ్యలోనైనా ఉంటాయా అన్నది సందేహమే. వాటి సంగతలావుంచి దేశ రాజధాని నగరంలో 44 శాతం రోడ్లకు ఫుట్‌పాత్‌లు లేవని ఆమధ్య ఢిల్లీ ఐఐటీ నివేదిక తెలిపింది. ఉన్నచోటైనా దాదాపు 28 శాతం మాత్రమే ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) నిబంధనలకు అనుగుణమైనవని ఆ నివేదిక తేల్చిచెప్పింది. ఈ తీర్పు వెలువరించటానికి దారితీసిన కేసు విషాదకరమైనది. అయిదేళ్ల బాలుడిని అతని తండ్రి పాఠశాల సమీపంలో దించి వెళ్తుండగా హఠాత్తుగా వచ్చిన ట్యాంకర్ ఆ బాలుడిపైకి దూసుకెళ్లి ప్రాణాలు తీసింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కదిలితే ఇలాంటి విషాదాలను నివారించవచ్చు. అయితే బాధాకరమైన విషయమేమంటే... ఈ హక్కు అమల్లోకి రావాలంటే పౌరులు నెరవేర్చాల్సిన విధులు చాలా ఉంటాయి. ఫలానాచోట ఫుట్‌పాత్ లేదని సంబంధిత అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేసి, ఈ తీర్పును ఉటంకించాలి. అటు తర్వాత దాని సంగతేమైందో కనుక్కోవాలి. అవసరమైతే ఆర్టీఐని ఆశ్రయించాలి. అటు తర్వాత ఫుట్‌పాత్ లేనిచోట పరిస్థితిని తెలిపే ఫొటోతో హైకోర్టులో పిల్ దాఖలు చేయాలి. అందులో తీర్పు వెలువడటానికి దీర్ఘకాలం వేచిచూడాలి. విద్యాహక్కు చట్టం, పనిచేసే హక్కు చట్టంవంటివి ఆచరణలో ఎలా నీరుగారుతున్నాయో కనబడుతూనే ఉంది. ఏ హక్కు అమలు కావాలన్నా పౌరులంతా ఒక్కటై ఉద్యమించటమే, ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావటమే మార్గం. -
అరణ్యరోదన
మన ప్రాచీనులు అడవులను దైవంగా ఆరాధించేవారు. అడవులను జీవజాలానికి ప్రాణాధారంగా చూసేవారు. అడవులను పవిత్ర తపోభూములుగా పరిగణించేవారు. అరణ్యాల ప్రస్తావన లేని పురాణేతిహాసాలేవీ మనకు లేవు. ఉద్యాన వర్ణన లేని ప్రబంధాలేవీ మనకు లేవు. అరణ్యకాండ లేని రామాయణాన్ని, అరణ్యపర్వం లేని మహాభారతాన్ని మనం ఊహించుకోలేం. ప్రాచీన వేదర్షులు సైతం వన ప్రాశస్త్యాన్ని ప్రస్తుతించారు. ‘అంజనగంధిం సురభిం బహున్నామ కృషీవలామ్/ ప్రాహం మృగాణాం మాతరమరణ్యానిమశంసిషమ్’ అని ఋగ్వేదంలోని ‘అరణ్యాని సూక్తం’ చెబుతోంది. అంటే, అంజనంలా సుగంధభరితమైనది, అనేక జంతువులకు తల్లివంటిది అయిన అరణ్యదేవతను స్తుతిస్తున్నాను అని అర్థం. ‘దశకూప సమా వాపీ దశవాపీ సమో హ్రదః/ దశహ్రద సమః పుత్రో దశపుత్ర సమో ద్రుమః’ అని ‘పద్మపురాణం’ చెబుతోంది. అంటే, పది బావులకు సమానం ఒక చెరువు, పది చెరువులకు సమానం ఒక సరస్సు, పది సరస్సులకు సమానం ఒక పుత్రుడు, పదిమంది పుత్రులకు సమానం ఒక వృక్షం అని అర్థం. ‘అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశతింత్రిణీకం/ కపిత్థ బిల్వామలకత్రయాంచ పంచామ్రవాపీ నరకం న వశ్యేత్’– రావిచెట్టు, వేపచెట్టు, మర్రిచెట్టు ఒక్కొక్కటి చొప్పున; పది చింతచెట్లు; మూడేసి వెలగచెట్లు, మారేడుచెట్లు, ఉసిరిచెట్లు; ఐదు మామిడిచెట్లు పెంచినవాడికి నరకం ఉండదు అని స్కాందపురాణం చెబుతోంది. వేద పురాణేతిహాసాలను గమనిస్తే, ప్రాచీనులు చెట్టు చేమలతో నిండిన అడవులకు ఎంతటి విలువనిచ్చేవారో అర్థమవుతుంది.ప్రాచీనకాలంలో రాజులు కూడా అడవుల సంరక్షణను బాధ్యతగా భావించేవారు. ‘ద్రవ్యవనకర్మాంతాశ్చ ప్రయోజయేత్/ ద్రవ్యవనచ్ఛిదాం చ దండం కారయేత్’ అని కౌటిల్యుడి అర్థశాస్త్రం చెబుతోంది. అంటే, అటవీ సంపదనకు సక్రమంగా వినియోగించాలి. అక్రమంగా అడవులను నరికివేసేవారిని శిక్షించాలి అని అర్థం. కౌటిల్యుడు ‘అర్థశాస్త్రం’లో అభయవనాలు, హస్తివనాలు వంటి రకరకాల అడవుల సంరక్షణ కోసం పాటించవలసిన విధి విధానాలను వివరంగా చెప్పాడు. దాదాపు పదివేల ఏళ్ల కిందట– నాగరికతలు మొదలైన కాలంలో భూమ్మీద దాదాపు అరవై శాతం అడవులే ఉండేవి. పద్దెనిమిదో శతాబ్దిలో పారిశ్రామిక విప్లవం మొదలయ్యేంత వరకు అడవుల పరిమాణం దాదాపు ఇదే స్థాయిలో ఉండేది. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి అడవులు క్షీణించడం మొదలైంది. ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ అడవుల విస్తీర్ణాన్ని కబళించడం మొదలైంది. ఇప్పుడు భూమ్మీద దాదాపు ముప్పయి శాతం అడవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి నేటి వరకు భూమ్మీద ఉన్న అడవుల విస్తీర్ణం సగానికి సగం క్షీణించి పోయింది. ప్రస్తుత శతాబ్ది మొదలైన తొలి ఇరవై ఏళ్లలోనే ఏకంగా ఆరు శాతం మేరకు అడవులు తరిగిపోయాయి. మన దేశంలోనైతే, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సగానికి సగం అడవులు అంతరించిపోయాయి. ఒకవైపు అడవుల విస్తీర్ణం తరిగిపోతుంటే, మరోవైపు మరుభూముల విస్తీర్ణం పెరుగుతోంది. గడచిన శతాబ్ద కాలంలో సహారా ఎడారి విస్తీర్ణం పది శాతం పెరిగింది. ‘ఒక అడవిని సృష్టించడం కంటే ఒక ఎడారిని సృష్టించడం తేలిక కావడమే విచారకరం’ అన్నాడు ఇంగ్లిష్ శాస్త్రవేత్త, పర్యావరణవేత్త జేమ్స్ లవ్‌లాక్. పనులు తేలిక చేసుకోవడానికి అలవాటుపడ్డ ఆధునికులు అడవులను సృష్టించే శ్రమ తీసుకోకుండా, తేలికగా ఎడారులను సృష్టించుకుంటున్నారు. అడవులు పుడమికి ఊపిరితిత్తులు. ఆధునిక మానవులు వాటికి తూట్లు పొడుస్తున్నారు. పర్యవసానంగా భూతాపం పెరిగి, మనుషులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మనుషులకు ఊపిరాడాలన్నా, సకాలంలో వానలు కురిసి పంటలు పండాలన్నా, ఇంకా ఈ భూమ్మీద మానవాళి మరిన్ని కాలాలపాటు మనుగడ సాగించాలన్నా, మనం ఇప్పటికైనా మేలుకొని అడవులను కాపాడుకోవాలి. అడవులన్నీ నశించాక మానవాళి చేసే ఆక్రందనలు అరణ్యరోదనలే అవుతాయి. -
జై భీమ్... జై సంవిధాన్!
ఏప్రిల్ ఏడో తేదీన దేశంలోని అన్ని దినపత్రికల్లో ఒక వార్త చాలా ప్రముఖంగా రిపోర్టయింది. చిరువ్యాపారులైన తండ్రీ కొడుకులిద్దరినీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి వారి చావుకు కారణమైన తొమ్మిదిమంది తమిళనాడు పోలీసులకు మధురై హైకోర్టు బెంచ్ ఉరిశిక్ష విధించింది. మొదట ఈ కేసుపై రాష్ట్ర స్థాయి పోలీసు విచారణకు ఆదేశించారు. దానివలన ఫలితం ఉండదని భావించిన మద్రాసు హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో నిజాలు బయట కొచ్చాయి. ఉరిశిక్ష వార్త విన్న తర్వాత లాఠీ ప్రభువుల ఉత్సాహా నికి కొంతకాలమైనా కళ్లెం పడుతుందని ఎవరైనా భావిస్తారు.ఉన్నతస్థాయుల్లో పుష్కలంగా పలుకుబడి, అండదండలు ఉన్న అధికారులకు మాత్రం ఏ వార్తలు విన్నా ఎటువంటి భయాలూ ఉండవని తేలిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఉరిశిక్షల వార్త వెలువడిన ఒక్క నెలరోజుల నుంచి మరో నెల గడిచేలోగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాకీ తాండవానికి సంబంధించి నాలుగు విషాద ఉదంతాలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్న ‘పొలిటికల్ గవర్నెన్స్’ను గుర్తుచేసు కోవడం ఇక్కడ అసందర్భం కాకపోవచ్చు. అదేవిధంగా ఎన్నికలకు ముందే లోకేశ్‌బాబు రచించి, అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చిన రెడ్‌బుక్ దిశానిర్దేశం గురించి గుర్తుచేయడం కూడా అసంగతమేమీ కాదు. పొలిటికల్ గవర్నెన్స్‌కూ, రెడ్‌బుక్ సందేశవ్యాప్తికీ పోలీసుల ‘ఆఫ్ ద రికార్డు’ సేవలు అవసరమైనప్పుడు, ఉభయ కుశలోపరిగా పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డప్పుడు ఉన్నతస్థాయి సహకారం ఉంటుందని భావించడం సహజం. కూటమి గద్దెనెక్కిన కొద్దిరోజుల్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను పబ్లిగ్గా నడిరోడ్డు మీద పరిగెత్తిస్తూ కత్తులతో పొడిచి చంపారు. నో పోలీస్! అదే ఉమ్మడి జిల్లాలోని తెనాలి పట్టణంలో కొద్ది నెలల తర్వాత దళిత, మైనారిటీ యువకులను నడివీధిలో పడుకోబెట్టి సమస్త ప్రజల సమక్షంలో పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నో యాక్షన్!! థర్డ్ డిగ్రీ హింసను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ పొలిటికల్ గవర్నెన్స్ వ్యవస్థలో పరస్పర సహకారం వర్ధిల్లుతున్న వేళ న్యాయస్థానాల విధి నిషేధాలను ఎవరు ఖాతరు చేస్తారు?ఈ దేశంలోని ప్రతి పౌరునికీ జీవించే హక్కునూ, వ్యక్తిగత స్వేచ్ఛనూ, ఆత్మగౌరవంతో కూడిన జీవనయాన హక్కునూ భారత రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రసాదించింది. చట్టపర మైన విధివిధానాల ద్వారా తప్ప మరేరకంగా ఈ హక్కులో జోక్యం చేసుకునే వీలు లేదని స్పష్టం చేసింది. అయినా పెరిగిపోతున్న పోలీసుల అతి ప్రవర్తన, కస్టోడియల్ మరణాల పట్ల ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కినంతనే అతని ప్రాథమిక హక్కులు మాయమై పోవని న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. లాకప్ హింస ద్వారా వ్యక్తి జీవించే హక్కును, వ్యక్తిగత గౌర వాన్ని ధ్వంసం చేసే హక్కును లాగేసుకోవడమంటే, అనుల్లంఘనీయమైనవిగా భారత రాజ్యాంగం నిర్వచించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. కంచె చేను మేయడ మవుతుంది. రాజ్యాంగ ద్రోహమే అవుతుంది.రాజ్యాంగ వ్యవస్థను కూలదోసే లక్ష్యంతో పనిచేసే నక్స లైట్లు రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారని నిర్ణయించి రాజ్యవ్యవస్థ వారిని ఎన్కౌంటర్ హత్యలు చేసింది. మరి రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నవారే రాజ్యాంగానికి ద్రోహం తలపెడితే? ఇదిగో ఇలాంటివారే మరింత ప్రమాదకారులని న్యాయశాస్త్ర కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రు అడ్వకేట్‌గా ఉన్నకాలంలో ఈ సూత్రం మీదనే వాదించి ఒక నిస్సహాయ పేద గిరిజనుడి లాకప్ మృతికి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా నిలబెట్ట గలిగారు. సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఇతివృత్తం కూడా ఈ యథార్థ ఘటనే. చంద్రు వాదనల ఫలితంగా మృతుడి భార్యకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, నింది తులకు శిక్షపడేలా చేయగలిగింది.మే 8 నుంచి జూన్ 16 వరకు ఏపీలో జరిగిన నాలుగు పోలీస్ సంబంధిత విషాదాల తర్వాత ప్రభుత్వ పెద్దల స్పందన గానీ, ఉన్నతాధికారుల కార్యాచరణగానీ సందేహాస్పదంగానే కనిపిస్తున్నది. ఒక కేసుకు సంబంధించి విచారణ పేరుతో మార్కాపురంలో పొట్టపోసుకుంటున్న సాయికృష్ణ అనే యువకు డిని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈనెల 8న అరెస్టు చేసి విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్టు ఇప్పటి వరకు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తున్నది. కుమారుడిని స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారనే సమాచారంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నెలరోజులపాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. తన కుమారుడిని కనీసం చూపెట్టాలని కోరినా సీఐ నాగరాజు లక్ష్యపెట్టలేదు. పైగా, ‘మీవాడిని చంపేశాం, వెళ్లి ఫోటోకు దండ వేసుకో పో’ అని కూడా సీఐ అన్నారని విజయలక్ష్మి మీడియా ఎదుటే వాపోయారు. సిటీ పోలీస్ కమిషనర్ దగ్గరకీ, డీజీపీ దగ్గరికీ వెళ్లి బతిమాలుకున్నా న్యాయం జరగలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.హైకోర్టులో విజయలక్ష్మి హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈనెల 29వ తేదీ లోగా సాయికృష్ణను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఈలోగా ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్తలు, ఫొటోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీనిపై కొందరు వైసీపీ నాయకులతోపాటు మరికొందరు సామాజిక ఉద్యమ కారులు సాయికృష్ణ ఉదంతంపై గళం విప్పడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ ఈ అంశంపై మాట్లాడేందుకు సాహసించలేదు. రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్యంలో ఒక విచారణ సంఘాన్ని వేసి చేతులు దులుపుకొన్నారు.రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయికృష్ణ ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించి, ఉదంతంపై సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. విజయలక్ష్మి గతంలో మొరపెట్టుకున్నా స్పందించని కమిషనర్ వెంటనే ఆమె కుటుంబ సభ్యులను పిలి పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట! ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయలక్ష్మిని, ఆమె సోదరులను తన నివా సానికి రప్పించి న్యాయం చేస్తామని చెప్పారట! నిందితులను శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారట! సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు.ఇక్కడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయికృష్ణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నట్టయితే దానికి సీఐ ఒక్కడే బాధ్యుడవుతాడా? కిందివారికిగానీ, పైస్థాయి వారికిగానీ ఎవ రికీ తెలియకుండానే నాగరాజు హత్య చేసి శవాన్ని మాయం చేశాడా? సాయికృష్ణను అరెస్టు చేసి తీసుకొచ్చిన టాస్క్‌ఫోర్స్ విజయవాడ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్నది. కృష్ణలంక సీఐ నాగరాజు కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో రోజువారీ రొటీన్ ప్రకారం డైలీ సిచువేషన్ రిపోర్టు (డీఎస్ఆర్)ను కమిషనర్ కార్యాలయానికి (గ్రామీణ జిల్లాల్లో అయితే ఎస్పీ ఆఫీసుకు) స్టేషన్ హౌస్ ఆఫీసర్ పంపిస్తారు.అందులో ఆరోజు అరెస్టు చేసి తీసుకొచ్చిన వివరాలు కూడా ఉంటాయి. పైగా రోజుకు రెండుసార్లు కమిషనర్‌తో స్టేషన్ అధి కారులకు టెలీకాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఇందులో కమిషన ర్తో పాటు డీసీపీలు, ఏసీపీలు, సీఐలందరూ పాల్గొంటారు. ఆరోజు ఇరిగిన వ్యవహారాలన్నీ అందులో చర్చకు వస్తాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పుడు పైస్థాయి అధికారులకు సాయికృష్ణ లాకప్ వ్యవహారం తెలియకుండా ఎలా ఉంటుంది? అతను లాకప్‌లో చనిపోతే ఆ విషయం కూడా పైస్థాయి అధికారులకు ఎలా తెలియకుండాపోతుంది? ఓ దళిత యువకుడు క్రాంతికుమార్ కూడా మే 21న ఆత్మహత్య చేసు కున్నారు. ‘సీఐ నాగరాజు వేధింపులను తట్టుకోలేకపోతున్నాను. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలుస్తున్నారు. మాదిగ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా’ అని ప్రశ్నిస్తూ లైవ్‌లో ఆత్మ హత్య చేసుకున్న వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. సాయికృష్ణ మృతి, క్రాంతి కుమార్ ఆత్మహత్య దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే జరిగి ఉంటాయి. పైస్థాయి తోడ్పా టుపై ఎంత భరోసా లేకపోతే ఆ సీఐ ఇంత విచ్చలవిడిగా వ్యవ హరిస్తాడు? ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖ పరిధిలోనే విచారణ జరిపితే న్యాయం జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.నగర పోలీస్ కమిషనర్‌కు సీఐ నాగరాజు వ్యవహారం తెలిసే ఉంటుందనీ, లేకపోతే శవాన్ని మాయం చేయడంగానీ, ఇంతకాలం విషయాన్ని దాచిపెట్టడంగానీ సాధ్యం కాదనేది సహజంగా ఎవరికైనా కలిగే అభిప్రాయం. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఉదంతంపై, నాగరాజు నిర్వాకాలపై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరిగే అవకాశముంటుంది. లేకపోతే శవం దొరకలేదు కాబట్టి, లాకప్‌లో చంపారనేందుకు ఎవరూ సాక్ష్యం చెప్పలేదు కాబట్టి కేసును హుష్‌కాకి చేయరని చెప్పలేము. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఉదంతాలే కాదు, తెనాలిలో తిరుపతమ్మ అనే మహిళ తాను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధించడం వల్ల గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. మే 25న ఈ ఘటన జరిగింది. జూన్ 16న విజయనగరం జిల్లాలో కూడా మరో మహిళ అదే కారణాలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నది.చేయని నేరాలని అంగీకరించాలని బలహీన వర్గాలను వేధించడం యథేచ్ఛగా జరిగిపోతున్నది. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా ఈ ధోరణి మరింత పెచ్చరిల్లిపోతున్నది. పవర్ చేతిలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాల సభ్యులను నయానో భయానో లొంగదీసుకోవడం అధికారులకూ, నేతలకూ పెద్ద కష్టం కాకపోవచ్చు. తమకు న్యాయం జరిగిందని బాధితుల నోటితో చెప్పించినా ఆశ్చర్యపడిపోవలసిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసే ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలంటే ప్రతి లాకప్ డెత్ కథను, ప్రతి పోలీసు వేధింపు ఉదంతాన్ని జై భీమ్ కథ లాగా ముగించవలసిన అవసర మున్నది. రాజ్య వ్యవస్థను బాధ్యురాలిగా నిలబెట్టవలసిన అవసరం పౌర సమాజం మీద ఉన్నది. అప్పుడే రాజ్యాంగబద్ధ పరిపాలన సాధ్యమవుతుంది. అందుకు తొలిమెట్టుగా విజయ వాడ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిగేలా ఉద్యమించాలి. జై భీమ్, జై సంవిధాన్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అమెరికా అమిత్ర వైఖరి
ఒకసారంటూ పొరపొచ్చాలు వచ్చాక ఎంత సన్నిహిత మిత్రుల మధ్యనైనా తిరిగి సాధారణ సంబంధాలు ఏర్పడటం అంత సులభం కాదు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం తీరుతెన్నులు గమనిస్తే ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. ట్రంప్ గత 16 నెలలుగా అనుసరిస్తున్న అమిత్ర వైఖరి ఇందుకు కారణం. మిత్ర దేశాలని లేదు, ప్రత్యర్థి దేశాలని లేదు – అందరినీ ఒకే గాటన కడుతూ, ఒక దేశాధినేతకు ఉండాల్సిన కనీస ఔచిత్యాన్ని మరిచి ఇష్టానుసారం మాట్లా డటం ఆయనకు అలవాటుగా మారింది. అంతేకాదు – ఎడాపెడా అధిక సుంకాలు విధించటం, తమ సరుకుపై సుంకాలు తగ్గించాలని కోరడం వంటివి మన దేశాన్ని చీకాకు పరి చాయి. ఇలాంటì చేదు అనుభవాలు ఎన్ని ఎదురైనా మన దేశం సంయమనం పాటించింది. నిజానికి మొన్న భారత నావికులు ముగ్గుర్ని హార్మూజ్ జలసంధి వద్ద హత్య చేసిన ఉదంతంతోసహా ఈ 16 నెలల పొడవునా మన దేశం పరుషంగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. నోబెల్ శాంతి బహుమతి యావలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపాననీ, ఇద్ద రినీ తీవ్రంగా బెదిరించాననీ మాట్లాడినప్పుడు అందులో ఏమాత్రం నిజం లేదని మన దేశం చెప్పింది. ఆయన ఇలా డప్పుకొట్టుకుంటున్నప్పుడల్లా మొదట్లో ఖండిస్తూనేవచ్చింది. కానీ దీన్ని ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారని తేలాక మిన్నకుండి పోయింది. అయినా ట్రంప్‌లో ఆగ్రహావేశాలు తగ్గలేదని తాజా సమావేశం రుజువు చేసింది. మాటలకేం... ట్రంప్ చాలా మాట్లాడారు. 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం ‘మోదీ మంచిగా కనబడతారు. బాగుంటారు. దేవదూత. కానీ ‘కిల్లర్’. వాణిజ్య, వ్యాపార చర్చల్లో చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉంటారు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఎవరైనా భారత్‌వైపు కన్నెత్తి చూస్తే వాళ్ల అంతు చూస్తామని కూడా చెప్పారు. వాణిజ్య ఒప్పందం విషయంలో చాలా దగ్గరగా వచ్చేశామని కూడా అన్నారు. కానీ చేతలు చూస్తే అందుకు అనుగుణంగా లేవు. తన ఆధ్వర్యంలోని కమాండ్లలో ఒకటైన ఇండో–పసిఫిక్ కమాండ్‌కు ఆ పేరు పెట్టింది ఆయన ఏలుబడిలోని అమెరికాయే. తిరిగి ఆయనే ఎనిమిదేళ్లనాటి ఆ పేరులో భారత్నుసూచించే ‘ఇండో’ తొలగించి ఇప్పుడు యూఎస్–పసిఫిక్ కమాండ్‌గా మార్చటం, అది కూడా ఈ సమావేశానికి కొంచెం ముందుగా చేయటం యాదృచ్ఛికమేమీ కాదు. ఇటీవల యూఎస్–పసిఫిక్ కమాండ్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపటంలోనూ అమెరికా దురుద్దేశం స్పష్టమే. పాకిస్తాన్ పాలకులతో ట్రంప్‌కి ఏర్పడిన కొత్త చుట్టరికం అందరికీ తెలుసు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా దూకుడునూ, ఆధిపత్య ధోరణుల్నీ ఎదుర్కొనటానికి ఆ దేశంతో సమస్యలున్న భారత్‌ను కలుపుకోవాలని నిర్ణయించి 2007లో క్వాడ్‌కు అంకురార్పణ చేసింది అమెరికాయే. హిందూ మహా సముద్రప్రాంతంలో చైనా విస్తరణవాద వైఖరిని ఎదుర్కొనటానికి క్వాడ్, దాంతోపాటు ఇండో– పసిఫిక్ కమాండ్ తోడ్పడతాయని కూడా అప్పట్లో తెలిపింది. కానీ స్వప్రయోజనాలే తప్ప మరేమీ పట్టని అమెరికాను నమ్ముకుని ముందడుగు వేయొద్దని అనేకమంది నిపుణులు అప్పట్లోనే మన దేశాన్ని హెచ్చరించారు. ఇవాళ చైనాతో అంటకాగటానికి రెడీ అయి, ఆ కమాండ్ పేరే మార్చిన అమెరికా కీలక సమయాల్లో ఎలా ఉండగలదో సులభంగానే ఊహించుకోవచ్చు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే అందరికన్నా ముందు ఆయనతో వాణిజ్య ఒప్పందంపై చర్చించింది మనమే అయినా... మన తర్వాత వచ్చిన దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మనం కూడా బ్రిటన్, యూరోపియన్ యూని యన్ (ఈయూ), కెనడాలతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోగలిగాం. వీటిపైలాంఛనంగా సంతకాలు చేయటమే మిగిలివుంది. మనకి నచ్చని అంశాలున్నప్పుడూ, అన్యాయమైన షరతులు పెడుతున్నప్పుడూ వ్యతిరేకించటం, కొంత జాప్యం జరిగినా ఈ విషయంలో మన ప్రయోజనాల పరిరక్షణకే ప్రాముఖ్యతనివ్వటం సరైన వైఖరి. ఉత్త మాటలతో ఎవరినీ నమ్మించలేమని ట్రంప్ గ్రహించేలా చేయటం అవసరం. -
ఎట్టకేలకు శాంతి దిశగా...
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారు దిశగా తొలి అడుగు పడింది. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్లో ఈ ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఇద్దరూ పరస్పరం వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ తంతు ముగించడాన్నిబట్టే ఆ రెండు దేశాలమధ్యా ఉన్న వైషమ్యాల తీవ్రతేమిటో తెలుస్తుంది. మొదట ట్రంప్ సంతకం చేసి ఆన్లైన్లో పంపిన ఎంఓయూ నకలు తీసుకుని దానిపై పెజెష్కియాన్ సంతకం చేశారు. ఈ వారం ఆఖరులో జెనీవాలో ఈ సంతకాల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించినా, ఎందుకనో అంతా మారింది. అనుసరించిన విధానం ఏమైనా, ఇకపై పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటే అదే పదివేలని ప్రపంచ ప్రజానీకమంతా ఆరాట పడుతున్నది. తుది ఒప్పందానికి రావటం కోసం రాగల అరవై రోజుల వ్యవధిలో అమెరికా, ఇరాన్ రెండూ ఏమేం చేయాలో ఈ 14 అంశాల ఎంఓయూలో ఉంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా హార్మూజ్ ప్రతిష్ఠంభనకు తెరపడటం, అణ్వాయుధాల జోలికిపోనని ఇరాన్ హామీ ఇవ్వటం ప్రధానమైనవి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సాగించే హత్యాకాండను ఆపటంతోసహా అన్ని రకాల యుద్ధాలూ పరిసమాప్తం చేయటం, ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, ఈ ప్రాంత భాగస్వామ్య దేశాలూ 30,000 కోట్ల డాలర్ల నిధిని సమకూర్చటం, ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల తొలగింపుపై విధివిధానాలు వెల్లడించటం కూడా ఇందులో భాగమే. 30 రోజుల్లో ఇరాన్ సమీపంలోని అమెరికా నౌకలన్నీ నిష్క్రమిస్తాయనీ, యుద్ధ ప్రారంభానికి ముందున్న పరిస్థితులు పునరుద్ధరిస్తారనీ ఎంఓయూ చెబుతోంది. అయితే ఇప్పటికే 60 శాతం అభివృద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ ఏం చేయాలో ఇరు దేశాలూ చర్చించుకుంటాయి. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కయి అకారణంగా, ఏకపక్షంగా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎటు తీసుకుపోవాలో, ‘గౌరవప్రదంగా’ ఎలా బయటపడాలో దిక్కుతోచని అమెరికాకు ఇప్పుడు అన్నివిధాలా గర్వభంగమైంది. చిత్రమేమంటే... ఒకే లక్ష్యంతో ఈ ఊబిలోకి దిగిన మిత్రులు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలిద్దరికీ కొద్ది రోజుల్లోనే మార్గాలు వేరయ్యాయి. ఈ యుద్ధాన్ని తక్షణం వదుల్చుకుంటే తప్ప ఏడాది ఆఖరుకల్లా దేశంలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం ఖాయమని ట్రంప్‌కు అర్థమైతే... ఇది కొనసాగుతుంటే తప్ప ఏడాది చివరన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని నెతన్యాహూ లెక్కలేసుకున్నారు. ఆయన సమస్యేమిటో ట్రంప్‌కు తెలియకపోలేదు. కానీ మిత్రత్వం కంటే స్వీయ పీఠ సంరక్షణే ప్రధానమని ఆయన గ్రహించారు. అందుకే విధి లేని స్థితిలో ఈ ఒప్పందానికొచ్చారు. హార్మూజ్ మూతతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు మిన్నంటాయి. ద్రవ్యోల్బణం హద్దులు దాటింది. సరుకుల కొరత ఏర్పడింది. ఒబామా హయంలో ఇంతకంటే మెరుగ్గా కుదిరిన ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసిన ట్రంప్, దీనికెలా అంగీకరించారన్న కథనం ఆసక్తికరమైనది. దౌత్యంలో దేశాల అధినేతలు అవతలి పక్ష సైనిక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్థితిగతుల్ని విశ్లేషించగల నిపుణుల సాయం తీసుకుంటారని చెబుతారు. కానీ ఇరాన్ మరో అడుగు ముందుకేసి మానసిక ఆరోగ్య నిపుణుల్ని కూడా ఇందులో చేర్చిందంటున్నారు. ట్రంప్ ప్రకటనల్ని, క్షణక్షణానికి మారే ఆయన వైఖరుల్ని గమనిస్తూ ఎలా మాట్లాడితే బోధపరుచుకుని సానుకూలంగా స్పందిస్తాడో వారు సలహాలిచ్చారని దాని సారాంశం. ట్రంప్ తీరుతెన్నులు గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. తన కనుసన్నల్లో ఖరారైన ఎంఓయూ తనకి నచ్చకుంటే మళ్లీ బాంబులేయటానికి వెనకాడనని ఆయనే చెప్పటాన్ని గమనిస్తే ట్రంప్‌ను ఇరాన్ సరిగానే అంచనా వేసిందనుకోవాలి. పారిస్ వెలుపలనున్న ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్ రాచరిక ఉత్థాన పతనాలు చూసింది. ఫ్రెంచ్ విప్లవాన్నీ, దానిలోని ప్రజాస్వామిక ఆకాంక్షలనూ గమనించింది. 1783లో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్‌ల సరిహద్దు తగాదాలపై ఒడంబడికకు సాక్షిగా నిలిచింది. జర్మనీని అవమానకరమైన ఒప్పందంతో శాసించి, 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిందీ ఇక్కడే. కానీ అమెరికాకు ఇప్పుడెదురైన అవమానం స్వచ్ఛందం, స్వయంకృతం. ఇన్నింటికి వేదికైన చోట కుదిరిన ఈ ఎంఓయూను ట్రంప్ గౌరవిస్తారని ఆశించాలి. -
దాహార్తిని తీర్చే ప్రణాళికలేవి?
సంక్షోభాలు అకారణంగా రావు. అంచనాలున్నప్పుడూ, సమస్య అంతకంతకు ఉగ్ర రూపం దాలుస్తున్న వైనం కనబడుతున్నప్పుడూ మేల్కొంటే సకాలంలో వాటిని నివారించటం, అధిగమించటం వీలవుతుంది. కానీ మన పాలకుల విధానాలన్నీ దాహం వేసిన ప్పుడు బావి తవ్విన చందాన ఉంటున్నాయి. అందువల్లే ఈ వేసవిలో దేశంలోని మహా నగరాలన్నీ కనీ వినీ ఎరుగని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభాలో మన వాటా 18 శాతం. కానీ ప్రపంచ నీటి వనరుల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు నీటి వనరుల సంరక్షణ విషయంలో మొదటినుంచీ ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పనవసరం లేదు. వాతావరణ మార్పులు ఒక్కటే కాదు... భూగర్భ జలాల వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోవటం, నగర పట్టణ ప్రాంతాల్లో నీటిని కాస్తయినా పట్టింపు లేకుండా వృథా చేయటం వంటివి సైతం సమస్యను ఉగ్ర రూపం దాల్చేలా చేస్తున్నాయి. ప్రపంచం నీటి కొరత, ఎద్దడి, సంక్షోభం దశల్ని దాటి ఇప్పుడు నీటి దివాలా(పునరుత్పాదకతకు వీల్లేనివిధంగా పూర్తిగా అడుగంటడం) వరకూ వచ్చిందని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ జల, పర్యావరణ, ఆరోగ్య సంస్థ ఈమధ్య ప్రకటించింది. అయితే దీన్నుంచి తప్పించుకోవటానికి ఇప్పటికీ మార్గాలున్నాయి. గండం గట్టెక్కడానికి తోచినవిధంగా చేసుకుపోవటం బదులు పారదర్శక విధానాలు పాటించటం అవసరమని ఆ సంస్థ సూచించింది. ఒక ప్రణాళికాబద్ధంగా సహజ నీటివనరుల రీచార్జ్‌కి అనుసరించాల్సిన మార్గాలేమిటో నిర్ధారించుకోవటం, వాగులు, వంకలు, జలాశ యాలు నిండటానికి దోహదపడే కొండలు, గుట్టల్ని ప్రాణప్రదంగా కాపాడుకోవటం అవసరమని నిపుణులంటున్నారు. ప్రపంచంలో 70 శాతం జలాశయాలు క్రమేపీ క్షీణిస్తు న్నాయనీ, 400 కోట్లమంది ప్రజలు ఏడాదిలో కనీసం ఒక నెలపాటు నీటి ఎద్దడి ఎదు ర్కొంటున్నారనీ సమితి విశ్వవిద్యాలయం అంటున్నది. తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా చెన్నై, బెంగళూరులతోపాటు హైదరాబాద్ కూడా ఉంది. ఈ నీటి కొరత ప్రజారోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తోంది. 14 యేళ్లలోపున్న 80 లక్షల మంది బాలలు తాగునీటి నాణ్యత నాసిరకంగా ఉండటంవల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని సంస్థ నివేదిక చెబుతోంది. నీటి ఎద్దడిని వర్షాలు సరిగా పడకపోతే వచ్చే సమస్యగానే ఇంకా మన పాలకులు చూస్తున్నారు. కానీ సరిగా అధ్యయనం చేస్తే దీని మూలాలు మరెక్కడో ఉన్నాయని అర్థమవుతుంది. నగరాలు తమ స్థోమతకు మించి విస్తరిస్తున్నాయి. అంతో ఇంతో ఉపాధి కల్పించే సంస్థలన్నీ అక్కడే కేంద్రీకృతం కావటంతో అనివార్యంగా అందరూ నగరాల బాట పట్టాల్సివస్తోంది. కానీ మౌలిక సదుపాయాలు ఇంతమందిని తట్టుకోగల స్థాయిలో లేక సహజంగానే సంక్షోభం ముదురుతుంది. ఉన్న నీటి వనరులేమిటి... వాటి సమర్థ వినియోగానికి మార్గాలేమిటన్న అంశాలపైకాక, కొత్త వనరుల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించటం సమస్య తీవ్రతను పెంచుతోంది. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణలు, వ్యర్థ జలాల శుద్ధి అంశాల్లో ప్రభుత్వాలకు సరైన ప్రణాళికలు లేవు. వ్యర్థ జలాలు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల్లో, నదుల్లో కలుస్తున్నా పట్టకపోవటంతో చివరకు భూగర్భజలాలు కూడా కలుషితమవుతున్నాయి. వచ్చే 2030 నాటికి అందుబాటులో ఉండే నీటి లభ్యతతో పోలిస్తే రెండు రెట్లు అధిక డిమాండ్ ఉంటుందని నీతి ఆయోగ్ సంస్థ చెబుతున్న జోస్యం అందరినీ భయపెడుతోంది. మూడు నాలుగు నెలలపాటు ఉండాల్సిన రుతుపవనాలు చుట్టం చూపుగా వచ్చి పోవటం రివాజుగామారి చాన్నాళ్లవుతోంది. ఈసారి ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో సరేసరి. గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులను నింపే హిమాలయాల్లోని మంచుదిబ్బలు వేగంగా కరుగుతూ వెంటనే వరదలకూ, అటుపై నీటి కొరతకూ కారణమవుతున్నాయి. అందుకే చైనా, సింగపూర్ వంటి దేశాలు నీటి వనరుల రక్షణకూ, వాన నీటి సేకరణకూ, వ్యర్థ జలాల వినియోగానికీ అనుసరించే విధానాలను అధ్యయనం చేసి మన దగ్గర కూడా అమలు చేయాలి. నీటి వినియోగంపై సమగ్రమైన నిబంధనలకు రూపకల్పన చేయాలి. వానాకాలంలో వరదల్లో మునిగి, వేసవిలో ఎడారులుగా మారే నగరాలు మనకొద్దని ప్రతినబూనాలి. -
ఆంక్షల చట్రంలో సిరప్లు
ఎంతో జాప్యం జరిగాక భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దగ్గుకు వాడే సిరప్లు ఇకపై వైద్యుల చీటి లేకుండా అమ్మరాదని ఔషధ దుకాణాలపై ఆంక్షలు తీసుకొస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9నే వెలువడిన ఆ నోటిఫికేషన్ మంగళవారం వెలుగులోకొచ్చింది. విదేశాలతో పోలిస్తే మన వైద్య ఆరోగ్యరంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత చాలా ఎక్కువ. పట్టణాలు, నగరాల్లో ఈ సమస్య లేదు. గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా ఔషధ దుకాణాల కొరత మాత్రం ఉండదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి ఔషధాలైనా విక్రయించే అలవాటు కూడా ఎక్కువే. ఈ వెసులుబాటు ఎంత వరకూ వచ్చిందంటే చిన్న చిన్న సమస్యలకు వైద్యుల్ని ఆశ్రయించటంకన్నా మందుల దుకాణంలో సమస్య చెబితే సరిపోతుందన్న అభిప్రాయం సామాన్య జనంలో స్థిరపడింది. పేదరికంవల్ల వైద్యుల దగ్గరకెళ్లే స్థోమత లేకపోవటం కూడా ఇందుకొక కారణం. విదేశాల్లో కేవలం కొన్ని రకాల విటమిన్ మాత్రలు, జలుబు మందులు మాత్రమే చీటి లేకుండా లభిస్తాయి. యాంటీ బయోటిక్స్, కొన్ని ఇతర ఔషధాలు కావాలంటే ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయి ఉంటేనే విక్రయిస్తారు. ఇక దగ్గు మందు విషయానికొస్తే మనకు అంతర్జాతీయంగా చాలా చెడ్డపేరొచ్చింది. 2022లో పశ్చిమాఫ్రికా దేశమైన గాంబియాలో మన దేశంనుంచి దిగుమతైన దగ్గుమందు సేవించి 70 మంది చిన్నారులు మరణించారు. వీరిలో దాదాపు అందరూ మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతిన్నవారే. అదే సంవత్సరం ఉజ్బెకిస్తాన్‌లో కూడా ఈ కారణంగానే మరో 18 మంది పిల్లలు చనిపోయారు. అటుతర్వాత ఇండోనేసియా, మార్షల్ ఐలాండ్స్ వంటిచోట్ల భారతీయ దగ్గు మందుల నాణ్యతపై ప్రభుత్వాలు హెచ్చరికలు జారీచేశాయి. మన దేశంలోనూ సమస్యలు తలెత్తిన ఉదంతాలున్నాయి. నిరుడు అక్టో బర్లో మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు వాడకంవల్లే 22 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పో యారు. ఆ సిరప్‌లో డై ఇథిలీన్ గ్లైకాల్(డీఈజీ) అనే విషపూరిత పారిశ్రామిక ద్రావకం 45 శాతం ఉన్నట్టు తేలింది. వాస్తవానికి ఆ మందులో అనుమతించదగ్గ పరిమితి కేవలం 0.1 శాతం మాత్రమే. అంటే పరిమితికి మించి వందల రెట్లు ఎక్కువుందన్న మాట! మన ఔషధరంగ నియంత్రణ వ్యవస్థలు పకడ్బందీగా లేవన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్(ఎంఆర్ఎఫ్) నివేదిక ప్రకారం 2024లో దగ్గు మందుల మార్కెట్ విలువ దాదాపు 27 కోట్ల డాలర్లు కాగా, అది యేటా 9.9 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేశారు. 2035 నాటికి ఇది మూడురెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. కొత్త ఔషధాల తయారీ, దిగుమతులు, క్లినికల్ పరీక్షలు, ప్రమా ణాల రూపకల్పన కోసం మనకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఉంది. దీనికింద ఆరు జోనల్ కార్యాలయాలు, సబ్ జోనల్ కార్యాల యాలు, వీటికి అనుబంధంగా డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు ఉన్నాయి. ఇవిగాక రాష్ట్రాల స్థాయిలో ఔషధ నియంత్రణలున్నాయి. ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నా నాసిరకం మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి వైద్యసలహా లేకుండానే దుకాణదారుల దగ్గర లభ్యమవుతున్నాయంటే మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇదంతా కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం సరిగా లేకపోవటం వల్లనేనని చెబుతారు. మన దేశంలో 1,100 దగ్గుమందు ఉత్పాదక సంస్థలుండగా, తనిఖీ చేసిన 90 శాతం సంస్థల్లో నిబంధనలు ఉల్లంఘనలు కనబడ్డాయనీ, వాటిపై చర్యలు తీసుకుంటు న్నామనీ ఇటీవల డీసీజీఐ రాజీవ్ రఘువంశీ చెప్పారు. దగ్గు మందు మాత్రమే కాదు... యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మాత్రలు, గర్భస్రావ మాత్రలు, నిద్ర మాత్రలు వగైరాల విషయంలోనూ నియంత్రణలు అవసరం. వైద్యుల సలహా లేకుండా వాడటంవల్ల పౌరుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఆ సంగతి గ్రహించేలోగానే పరిస్థితి చేయిదాటుతోంది. గర్భస్రావ మాత్రలైతే మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. కనుక మొత్తంగా ఔషధ రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయటం అత్యవసరం. -
యుద్ధానికి స్వస్తి?
ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్ ధ్రువీకరించాకే ట్రంప్ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. లెబనాన్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్‌లో ట్రంప్ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్‌ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్‌పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్‌లో భారత్ వస్తున్న నౌకపై దాడి జరిగి మన నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ అంచనా. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్ పరువు మరింత దిగజారుతుంది. వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్ కాంగ్రెస్‌పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్ జూ మాట మరోమారు రుజువైంది. -
కలం చేతనే!
వేల ఏళ్ల కింద గుహగోడ మీద మనిషి బొగ్గుతో గీత గీశాడు. అది అతడి మొదటి కవిత. ఆకలి గురించి కాదు. వేట గురించి కాదు. ఆశ్చర్యం గురించి. ఆకాశం వైపు చూసి మొదటిసారి ‘ఏమిటది?’ అని అడిగిన క్షణమే ఆ గీత. ఆ ప్రశ్నే సాహిత్యమైంది. ఇవాళ అదే మనిషి ఒక తెర ముందు కూర్చున్నాడు. తెర అతన్ని అడుగుతోంది: ‘ఏం కావాలి? కథా... కవితా... వచనమా’... మనిషి కలాన్ని పక్కన పెట్టి, ఆబగా తెరతో బేరసారాలు చేస్తున్నాడు. జోలె పడుతున్నాడు. ఏఐ నా వేయి ఏనుగుల బలం అంటున్నాడు.ఏఐకి జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల జ్ఞాపకాలు దాని వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. దానికి ‘మరపు’ లేదు. కాని మనిషి రచయిత అవుతాడు ఎందుకంటే వాడు మర్చిపోతాడు. బాధను మర్చిపోవడానికి కథ రాస్తాడు. అవమానాన్ని కప్పిపుచ్చడానికి వ్యంగ్యం రాస్తాడు. తీరని ప్రేమను బతికించుకోవడానికి పద్యం రాస్తాడు. మరపు అనే ఖాళీలోనే సృజన పుడుతుంది. యంత్రానికి ఆ ఖాళీ లేదు. దానికి అంతా గుర్తుంటుంది. అందుకే అది కొత్తగా పుట్టించలేదు. ‘వాన వెనుకంజ వేసింది’ అనే వాక్యాన్ని సృష్టించలేదు – ఇంతకు ముందు రాసి ఉంటే తప్ప.మనిషి రాయడానికి బయల్దేరిన ప్రతి క్షణం భయమే. తెల్ల కాగితం భయం. మొదటి వాక్యం భయం. ‘నేను రాసింది ఎవరైనా చదువుతారా లేదా?’ అనే వణుకు. ఈ భయమే రచయితను నిజాయితీగా ఉంచుతుంది. ప్రతి పదాన్నీ తూకం వేయిస్తుంది. ఏఐకి? అది నిర్భయంగా రాస్తుంది. దానికి పరువు లేదు. పోగొట్టుకోవడానికి పేరూ లేదు. పరువు పోతుందనే భయం లేని చోట సాహిత్యం పుట్టదు. సర్కస్ పుడుతుంది. అపసాహిత్యం. అలాగని యంత్రాన్ని ద్వేషించాల్సిన పని లేదు. అది శత్రువు కాదు. ఉలి. శిల్పి చేతిలో ఉలి శిల్పాన్ని చెక్కుతుంది. పిచ్చివాడి చేతిలో పడితే నాశనం చేస్తుంది. రాత్రి రెండు గంటలకు ఒక ఆలోచన తట్టి, పదం దొరకక గోడకు తల బాదుకునే రచయితకు ఏఐ ఒక నిఘంటువు. కథ అడ్డం తిరిగినప్పుడు ‘ఇలా ముగిస్తే ఎలా ఉంటుంది?’ అని సలహా ఇచ్చే మూగ స్నేహితుడు. డెబ్బై ఏళ్ల స్త్రీ తన జ్ఞాపకాలను పుస్తకం చేయాలనుకుంటే ఆమెకు ఏఐ ఒక కార్యదర్శి. ఏ పీరియడ్ నవలో రాయాలనుకుంటే మెటీరియల్ వెతికి పెట్టే రీసెర్చ్ అసిస్టెంట్. అంతవరకే. అంతవరకు మాత్రమే. తలకిందుల తపస్సు చేసినా ఏఐకి గర్భగుడిలో ప్రవేశం లేదు. ఇవ్వరాదు. కథ పుట్టే చోటు, ఆ మొదటి స్పార్క్, ‘ఎందుకు చెప్పాలి’ అనే తపన – అది మనిషి హృదిలోనే పుట్టాలి. దాన్ని అవుట్సోర్స్ చేస్తే ఇక అతను రచయిత కాదు, చీప్ ఎడిటర్ మాత్రమే. యంత్రం రాసిన పేరాలో విషం ఉంటే, అబద్ధం ఉంటే, ఆ పాపం ప్రాంప్ట్ కొట్టిన చేతిదే. అన్నీ యంత్రమే ఇస్తే బాగుండనే తరం నేడు తయారైతే రేపటి తరానికి ‘తపన’ అనే పదానికి అర్థం తెలియదు. పదం కోసం వేటాడటం, ఒక ఉపమానం కోసం నెలలు తపించడం, ఒక ఐడియా తట్టినప్పుడు వచ్చే కన్నీరు – ఈ ఆకలిని యంత్రం తీర్చకూడదు. ఇది మనిషికే వదిలేయాలి. మనిషి పెన్ చూశాడు, టైపు మిషన్ చూశాడు, కంప్యూటర్ కీబోర్డు చూశాడు, ఇప్పుడు కృత్రిమ మేధను చూస్తున్నాడు. పరికరం మారుతుంది కానీ ఆర్తి మారదు. మారకూడదు. మనిషి గొప్పవాడు ఎందుకంటే వాడు అసంపూర్ణుడు. వాడి రాతలో తప్పులు దొర్లుతాయి. వాక్యం అసంపూర్తిగా ఆగిపోతుంది. అదే మనిషికి అందం. యంత్రం పరిపూర్ణంగా రాస్తుంది. అందుకే చప్పగా ఉంటుంది. సాంకేతిక విప్లవం రావాలి. మన వేళ్లకు సంకెళ్లు వేయకుండా మన కలలకు రెక్కలు ఇవ్వాలి. రేపు ఒక పిల్లవాడు ‘నేను రచయితను అవుతాను’ అన్నప్పుడు, వాడి చేతిలో కలంతో పాటు ఒక తెర కూడా ఉండొచ్చు. తప్పులేదు. కానీ ఆ తెర మీద వాడు చూసేది వాడి ప్రతిబింబమే కావాలి, యంత్రం నీడ కాదు. కలం ఇంకా మన చేతిలోనే ఉంది. దాని మీద వేలిముద్రలు మనవే. రక్తం మనదే. చమట మనదే. ఆ గుర్తులు చెరిగిపోని వరకు మనిషే మహనీయుడు. యంత్రం ఎప్పటికీ అతని నీడ మాత్రమే. -
ఇంత క్రూర పరిహాసమా స్వామీ!
తిరుపతి సమీపాన నిన్న కూటమి సర్కార్ రెండేళ్ల పండుగ సభ జరిగింది. ఆ సభలో చెప్పుకోవడానికి విశేషాలు చాలానే ఉన్నాయట! సభా ప్రాంగణంలో లోకేశ్‌బాబు కలియతిరిగారట. మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముచ్చటించారట! ఆంధ్రజ్యోతి రాసింది. మూడో క్లాస్ చదువుతున్న అనిత్‌రాజ్ అనే బాలుడు ‘డిప్యూటీ సీఎంతో ఫోటో దిగాలని ఉంద’ని ఓ ప్లకార్డు పట్టుకొని వేదిక సమీపంలో నిలబడ్డాడట! అది చూసిన పవన్ కల్యాణ్ వేదికపైకి అనిత్రాజ్ను పిలిపించుకున్నారట! ఈనాడు రాసింది.వేదిక పైకి వచ్చిన అనిత్‌రాజ్ పవన్‌ను బాబాయ్ అని, చంద్రబాబును తాతయ్యా అని పిలిచాడట! లోకేశ్‌బాబును ఏమని పిలిచాడో ఈనాడు రాయలేదు. బహుశా ఆయన కలవ లేదేమో! తాతయ్యా అన్న బాలుని పిలుపుతో చంద్రబాబు ఉత్సాహం పొందినట్టున్నారు. యువత కలలను సాకారం చేసే బాధ్యత తమదేనని ఓ ట్వీట్ రువ్వారు. ఇది కూడా ఈనాడే రాసింది. మూడో క్లాసు చదివే అనిత్రాజ్కు ఎనిమిదేళ్లుంటా యేమో! ఆ సభలో తాతయ్య ప్రసంగం వినిఉండకపోవచ్చు. విన్నా అర్థం చేసుకునే వయసు కాదు.డియర్ అనిత్‌రాజ్, ఆ తాతయ్య మాటల్లో కొసరుగా విసిరిన ఓ అవశేషంలో ఎంత నమ్మకద్రోహం దాగి ఉన్నదో నీకు బోధపడకపోవచ్చు. నీకంటే పదేళ్లు పెద్దవాళ్లయిన పెద్దక్కల దగ్గర్నుంచి, అమ్మ వయసు అత్తలూ, పెద్దమ్మలూ, పిన్నమ్మల వయసువాళ్లకూ, యాభై తొమ్మిదేళ్ల లోపు వుండే అమ్మమ్మలూ, నానమ్మలకూ వేదికపైనున్న తాతయ్య తీరని ద్రోహం చేశారు. దీన్నే నయవంచన అని కూడా అంటారు. ఆ వయసువాళ్ల ఆత్మీయ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచిన తాతయ్య మీ కలలను నెరవేరుస్తారంటే నమ్మశక్యమేనా?అన్నిటికంటే పెద్ద విశేషమేమిటంటే ఈ సభకు ‘నమ్మకం’ అనే పేరు పెట్టుకున్నారు. ‘రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం’ అనే మకుటంతో మీడియాలో అడ్వరై్టజ్మెంట్లను హోరెత్తించారు. ఆ సభ వేదికపై నుంచి మాట్లాడుతూనే ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి ఆర్థిక సమస్యలున్నాయనీ, పీ–4 పథకంతో వారికి సహాయం చేస్తా మనీ ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కారు. సూపర్ సిక్స్ పథకాలకు కూటమి మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమైన ఈ ఆరు హామీలను నెరవేర్చడా నికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవని ఎన్నికల సభల్లో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.2024 జూన్ నుంచే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలుచేస్తా మని కూటమి వాగ్దానం చేసింది. రెండేళ్లు గడిచిపోయాయి. తల్లికి వందనం పథకానికి కూడా మొదటి సంవత్సరం ఎగ నామం పెట్టి, రెండో సంవత్సరం అమలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రెండేళ్లు ఆలస్యంగానైనా ‘ఆడబిడ్డ నిధి’ని అమలుచేస్తారేమోనని కోటీ ఎనభై లక్షలమంది మహిళలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై చంద్రబాబు తిరుమలేశుని సాక్షిగా చల్లనీళ్లు చల్లారు. ఏపీలో ఓటుహక్కు ఉన్న మహిళలు రెండు కోట్ల ఏడు లక్షలమంది. వీరిలో అరవై, అంతకుమించిన వయసున్నవారు 12 శాతం వరకు ఉంటారని సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. వారిని మినహాయించి సుమారు ఒక కోటి ఎనభై లక్షలమంది మహిళలకు కూటమి సర్కార్ ఇప్పటికే ఒక్కొ క్కరికి ఏటా 18 వేలు చొప్పున రెండేళ్ల నిధులు బకాయి పడింది. ఇప్పుడు మొత్తానికే పథకాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.పీ–4 పథకంతో ఆదుకుంటామనేది పచ్చి బూటకం. అసలీ పథకమే పౌరుల ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టే అమానవీయ స్వభావం గలది. తమకు దిక్కు దివాణం లేదని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలట! దయగలిగిన ధనవంతులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయం చేయా లట! ఇది అయ్యే పనేనా? పేదరికం నుంచి ప్రజలను విముక్తం చేయడం ప్రభుత్వాల బాధ్యత. నాణ్యమైన విద్యను వారికి అందజేయడం ద్వారా, అభ్యున్నతికి చేరుకునే అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు చేయాలి. వనరుల్లో వారికి తగినంత వాటా కల్పించాలి. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. అలాకాకుండా ధనవంతుల దొడ్లో పేదవాళ్లను కట్టేయ డమనేది బానిస వ్యవస్థ లక్షణం.అయినా పీ–4 విధి విధానాలకు, ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి సారూప్యత ఎక్కడున్నది! మహిళల కోసం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘చేయూత’, ‘ఆసరా’ పథకాలకు దీటుగా ప్రకటించిన పథకం ‘ఆడబిడ్డ నిధి’. ఈవిధంగా ఎన్నిక లకు ముందు నమ్మబలికి ఇప్పుడీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. మహిళల ఆత్మగౌరవానికీ, సాధికారతకూ పెద్దపీట వేస్తూ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన ‘అమ్మవొడి’ పథకానికి బదులుగా ‘తల్లికి వందనం’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలని అభిలషిస్తూ ప్రభుత్వ పాఠశాలల స్థాయినీ, బోధనా పద్ధతులనూ అనూహ్యమైన స్థాయిలో ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా మెరుగుపరిచింది జగన్ సర్కార్. జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించి విద్యార్థులందరికీ మంచి స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్, శ్రేష్ఠమైన పౌష్ఠికాహారాన్ని ఎంపిక చేసిన సంగతి పాఠకులకు విదితమే. డిజిటల్ బోర్డులు, ట్యాబ్లూ ప్రభుత్వ బడుల్లో ప్రవేశించాయి. శిథిలమైన బడి భవనాలు, విరిగిపోయిన బల్లలు, అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉండే సింగిల్ వాష్రూముల ముందట లైన్లో నిలబడే పిల్లలు, అసలు వాష్రూములే లేక బడి మానేసే ఆడపిల్లలు, తాగడానికి మురికి నీళ్లే గతి అనే పరిస్థితులను మార్చి కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో వాష్‌రూమ్‌లూ, శుభ్రమైన తాగునీరూ అందేలా జగన్ ఏర్పాట్లు చేశారు.ఒకపక్క ఇంత నాణ్యమైన విద్యకు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే ఇంగ్లీషు మీడియం బోధననూ, సీబీఎస్ఈ సిలబస్‌నూ పేద బిడ్డలకు పూర్తి ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్లు ఉండకుండా బిడ్డలను బడికి పంపేలా తల్లిని ప్రోత్సహించడం కోసం జగన్మోహన్రెడ్డి ‘అమ్మవొడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్య ద్వారా ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలనే ఒక సమగ్ర వ్యూహంలో ‘నాడు–నేడు’ ‘అమ్మవొడి’ అనేవి రెండు అవిభాజ్యమైన అంశాలు. ఈ వ్యూహంలో అమ్మది కేంద్ర స్థానం.‘అమ్మవొడి’ పథకం నేపథ్యంలో ఉన్న ఉన్నతమైన తాత్విక భూమిక ‘తల్లికి వందనం’ పథకానికి లేదు. అటువంటి ఉన్నత లక్ష్యమే ఉన్నట్లయితే ‘నాడు–నేడు’ పథకం కొనసాగి ఉండేది. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్ మోడల్ కొనసాగి ఉండేవి. ఇప్పుడివేమీ లేవు. ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చాయి. దాదాపు పది లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ లెక్కలను ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతున్నది. ఎంత మంది విద్యార్థులు చదువు మానేశారో లెక్కల్లేవు. జగన్ ప్రభుత్వం ప్రతి విద్యార్థిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ఇప్పుడు లేదు. ప్రభుత్వ బడుల పునరుజ్జీవనం, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభించాలనే ఉద్దేశంతో ‘అమ్మవొడి’ని జగన్ తీర్చిదిద్దారు. కేవలం ఎన్నికల్లో తనకు సహకరించే కార్పొరేట్ స్కూళ్ల లాబీకి కాసుల వర్షం కురిపించేలా తల్లికి వందనం పథకాన్ని కూటమి డిజైన్ చేసింది. ఇదీ తేడా!లక్ష్యం ఇంత హేయమైనది కనుకనే నీకు పదిహేను, నీకు పదిహేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలంటూ చౌకబారు ప్రచారాన్ని కూటమి చేసింది. పోనీ ముందుగా చెప్పినట్టు పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తున్నదా? జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్లలో 80 లక్షలకు పైగా విద్యార్థులుండేవారు. తల్లికి వందనం పథకానికి మాత్రం 67 లక్షల మందినే అర్హులుగా తేల్చారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ బడుల్లో చేరినవారిలో లక్షమందిని లబ్ధి దారుల జాబితా నుంచి తొలగించారు. కేంద్ర స్కాలర్షిప్ను పొందుతున్న మరో లక్షమందిని తొలగించారు. ఆధార్ సరిగా లేదనీ, అడ్రస్ సరిగా లేదనీ మూడు లక్షలమందికి మొండిచేయి చూపారు. పంచ పాండవులు – మంచం కోళ్ల సామెతలా సాగు తున్న ఈ పథకం చివరకు ఎక్కడ ఆగుతుందో చూడాలి.అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రతిపక్షం కాదు... అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవారే విమర్శిస్తున్నారు. అమరావతి ప్రయోగం డిజాస్టర్‌గా మిగలబోతున్నదనీ, పోలవరం పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయనీ నిపుణులు ఆరోపిస్తు న్నారు. డీఎస్సీ పరీక్షలో సాక్షాత్తూ ప్రభుత్వ ముఖ్యులే అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ తెరలేపి లక్షలాది మంది యువకుల కల లను కల్లలు చేశారు. వ్యవస్థల విశ్వసనీయత పట్ల యువతరంలో నమ్మకం సన్నగిల్లుతున్నది. పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట అపర సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి మరణ శాసనం అమలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫార్సుగా మార్చారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదనీ, ముగ్గురు నలు గురు పిల్లల్ని కనాలనీ బోధిస్తున్న చంద్రబాబు సామాజిక పెన్షన్లలో మాత్రం వృద్ధుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రభుత్వాంగాలన్నీ అవినీతి రోగగ్రస్థం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఓట్లకోసం ప్రజల అరచేతుల్లోకి వైకుంఠం సినిమాను ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు వారందరికీ సామూహికంగా వెన్నుపోటు పొడిచిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ సభ పెట్టడం న్యాయమా? సమాజం మీద ఇంత క్రూరమైన పరిహాసమేమిటి స్వామీ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆక్రమిత కశ్మీర్ కల్లోలం
ఎప్పుడూ జమ్మూ, కశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై గంభీరోపన్యాసాలిస్తూ, మానవ హక్కుల చాంపియన్‌గా తనను తాను చిత్రించుకునే పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా ఆక్రమిత కశ్మీర్లో నెత్తురుటేర్లు పారిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం సైన్యం కాల్పుల్లో 30 మంది మరణించారంటున్నా, వాస్తవ సంఖ్య అంతకుమించి ఉంటుందన్నది స్థానికులు చెప్పే మాట. మరో 200 మంది గాయపడ్డారు. వేలాదిమంది అరెస్టయ్యారు. ఈసారి సాగిన నిరసన ప్రదర్శన సాధారణమైంది కాదు. ముజఫరాబాద్ ప్రదర్శనలో అన్నివర్గాలకూ చెందిన లక్షన్నరమంది పాల్గొన్నారు. మతం పేరు చెప్పి, గతం పేరుచెప్పి ఎల్లకాలమూ జనాన్ని మభ్యపెట్టడం సాధ్యంకాదని పాక్ పాలకులకు ఈ నిరసనలు తెలియజెప్పాయి. తమ ప్రాంత నదుల్లో మంగళ డ్యామ్‌వంటి ప్రాజెక్టులు నిర్మించి,ఇక్కడ ఉత్పత్తయ్యే జలవిద్యుత్‌ను పంజాబ్ తదితర ప్రాంతాలకు తరలించుకుపోతూ, స్థానికులకు అరకొర సదుపాయాలు కల్పించటం విషయంలో రెండు దశాబ్దాల క్రితమే అసంతృప్తి పెల్లుబికింది. కానీ సంఘటితం కాకపోవటంవల్ల చల్లారిపోయాయి. 2023లో రావల్కోట్, ముజఫరాబాద్, మరికొన్ని ఇతర ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై కమిటీలు ఏర్పడి ఉద్యమించాయి. ప్రజల మౌలికాహారమైన గోధుమ పిండి ధర పెంచడాన్నిప్రశ్నించాయి. వీటిని ప్రభుత్వం బేఖాతరు చేసిన ఫలితంగా ఆ కమిటీ లు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్)గా ఒక్కటయ్యాయి. ఆనకట్టల కారణంగా పలువురు నిర్వాసితులవుతున్నా, వలసపోతున్నా పట్టించు కునేవారు లేరు. పోనీ అని స్థానిక ప్రజలకైనా ఒరిగేదేమీ ఉండదు. మిలిటెన్సీ ఉందన్న పేరిట భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించటం ఒక్కటే వారికి కనబడేది. అందుకేశాంతియుత పద్ధతుల్లో పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహించటం, విద్యుత్ బిల్లుల చెల్లింపు నిలిపివేయటం, సంపూర్ణ బంద్, లాంగ్‌మార్చ్ వంటివి ఈ మూడేళ్లలో ఎన్నో జరిగాయి. సైన్యం పడగనీడలో కాలక్షేపం చేసే ప్రభుత్వానికుండే అధికారాలు అంతంత మాత్రం. ఏ జవాబుదారీతనమూ లేని సైన్యానిదే పెత్తనం. అందుకే ఆక్రమిత కశ్మీర్‌కు ఎదుగూ బొదుగూ లేదు. ఆ ప్రాంత వనరుల్ని కొల్లగొట్టడానికి పాక్ పాలకులు ఒక సృజనాత్మక విధానం కనుక్కున్నారు. 53 మందితో దానికొక అసెంబ్లీ ఉంది. ఆక్రమిత కశ్మీర్‌కు ముఖ్యమంత్రి కాదు... ప్రధాని ఉంటాడు. కానీ అధికారాలన్నీ ఇస్లామాబాద్‌లో కొలువుదీరిన సైనికాధికారుల ఆధిపత్యంవుండే కశ్మీర్ కౌన్సిల్ చేతిలో ఉంటాయి. ఈసారి కేవలంఆర్థిక సమస్యలపై మాత్రమే కాదు... అసెంబ్లీ అమరికపై కూడా డిమాండ్లు బయల్దేరాయి. మొత్తం 53 స్థానాలుండగా, ‘శరణార్థుల’కు డజను కేటాయిస్తారు. మరో అయిదు మహిళలకూ... ఉలేమాలు, సాంకేతిక నిపుణులు, విదేశాల్లో స్థిరపడిన కశ్మీరీలకు ఒక్కొక్క స్థానం ఉంటాయి. ఈ ఖాతాలకింద పోయే 20 స్థానాలకూ ఎన్నికలు జరిగేదెక్కడో, నిర్వహించేదెవరో ఎవరికీ తెలియదు. వారు ఎన్నుకోవాల్సింది మాత్రం 33 మందిని.మళ్లీ ఇందులో అత్యధికులు పాక్ పాలకుల కనుసన్నల్లో నడిచేవారే ఉంటారు. చివరకు కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఉద్యమకారులు అడిగేదల్లా ‘శరణార్థుల’ డజను స్థానాలూ రద్దు చేయాలన్నదే. కానీ అలా చేస్తే స్థానికుల పెత్తనం పెరుగుతుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే జాక్ నాయకుల ఆచూకీ చెబితే 35,000 డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది. వచ్చే నెల్లో ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ప్రాంత వనరుల దోపిడీ తప్ప, వారి ఆకాంక్షల్ని నెరవేర్చడం సాధ్యపడదని ఉద్యమాలను అణిచేయటం ద్వారా పాక్ చెబుతోంది. పాలకులు వలసవాద మనస్తత్వంతో ఆప్రాంతాన్ని చెరబట్టారు తప్ప, స్థానికుల డిమాండ్లపై ఖాతరు లేదు. ఉద్యమకారులు38 కోర్కెలు ప్రభుత్వం ముందుంచారు. డజను సీట్ల కోటా రద్దుతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులకిస్తున్న ఖరీదైన కార్లు, ఉచిత విద్యుత్ తదితర రాయితీలు రద్దు చేసి, ఆ నిధులు జన సంక్షేమానికి వ్యయం చేయాలని కూడావారు కోరుతున్నారు. ఇలాగే మొండికేస్తూ పోతే ఆ ప్రాంత ప్రజల ఆగ్రహం మరింత పెరుగుతుందే తప్ప చల్లారదని పాకిస్తాన్ పాలకులు గ్రహించాలి. -
భారత నౌకలపై దాడులా?
ప్రపంచానికి పీడలా పరిణమించిన అమెరికా... భారత్ వస్తున్న నౌకలపై తన ప్రతాపాన్ని చూపటం మొదలెట్టింది. మంగళవారం ఒమన్ తీరంలో 24 మందితో వెళ్లే నౌకపై క్షిపణి ప్రయోగించటంతో ముగ్గురు నావికులు మరణించారు. వారిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పట్నాల సురేష్ అనే చీఫ్ మెరైన్ ఇంజినీర్. అంతకుముందు రోజు సైతం భారత్‌కు వస్తున్న మరో నౌకపై ఇలాగే దాడి జరగ్గా, అందరూ క్షేమంగా బయట పడగలిగారు. ఆ రెండు నౌకలూ భారత్‌కు చెందినవని తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడి చేశా రని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రెండు ఉదంతాల్లోనూ ఒమన్ సైన్యం మన నావికుల్ని ఆదుకుంది. తమ నిషేధాన్ని ధిక్కరించి ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేసి వెళ్తుండటంవల్లే దాడులు చేశామని అమెరికా సైనిక దళం పశ్చిమాసియా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కాం) అంటున్నది. ఒకపక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాణ మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతారు. మనతో వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడతారు. కానీ భారత్‌కొస్తున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తారు. అసలు రెండు దేశాల మధ్య కుదిరే వాణిజ్య లావాదేవీలపై, సంబంధం లేని మూడో దేశం ఆంక్షలు విధించటమేమిటి? మనం ఎవరి దగ్గర కొనాలో, కొనకూడదో చెప్పడానికి ట్రంప్ ఎవరు?దాడులు జరిగిన ప్రాంతం అమెరికాకు సరిహద్దేమీ కాదు. ఆ నౌకల గమనంవల్ల దానికి కలిగే ముప్పేమీ లేదు. అయినా ఖండాంతరాలు దాటి, వేల మైళ్లు ఈవలకొచ్చి విధినిషేధాలు పెట్టడం వింత కాదా? ఒక్క సెంట్‌కాం మాత్రమే కాదు... భూగోళమంతటా వేర్వేరు పేర్లతో అమెరికా పహారా కాస్తోంది. ఆఫ్రికాలో ‘ఆఫ్రికాం’, ఇండో–పసి ఫిక్‌లో ‘ఇండోపాకాం’, యూరప్‌లో ‘ఈయూకాం’, ఉత్తరమెరికాలో ‘నార్త్ కాం’ పేరిట సైన్యాల్ని దించి, క్షిపణులు గురిపెట్టి, యుద్ధ విమానాలు మోహరించి, అక్కడక్కడ అణు బాంబులు పోగేసి దేశాలపై పెత్తనం చలాయిస్తోంది. ఈ లక్షలాదిమంది సైన్యాన్ని పోషించటం కోసం అడ్డగోలు సుంకాలతో, వేరే దేశాలకు భారీనష్టం కలిగే వాణిజ్య ఒప్పందా లతో చెలరేగిపోతోంది. చిత్రమేమంటే... ఒక్కటంటే ఒక్క దేశం ‘నీకిక్కడేం పని?’ అని అమెరికాను ప్రశ్నించలేకపోతోంది. తాజా దాడుల తర్వాత మన దేశం గట్టిగా స్పందించింది. అమెరికా చార్జ్ డీ ఎఫైర్స్ జాసన్ మీక్స్‌ను పిలిపించి, ‘దౌత్యపరమైన నిరసన’ తెలిపింది. అందరూ ముక్తకంఠంతో నిరసిస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.అక్రమంగా యుద్ధానికి దిగి, శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్‌ను ట్రంప్ బెదిరి స్తున్నారు. ప్రపంచంలోనే ఎదురులేనిదని గప్పాలు కొట్టుకున్న మిలిటరీ హెలికాప్టర్ అపాచేను అది కూల్చేయటంతో గత మూడు రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చి మాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. తమ దాడి ఆత్మరక్షణ అని అమెరికా చెప్పు కోవటం సిగ్గుచేటు. ట్రంప్ వచ్చాక అమెరికా రక్షణ శాఖ పేరునే యుద్ధశాఖ అని మార్చాక, అందులో ‘ఆత్మరక్షణ’ ప్రసక్తి ఎక్కడ? అసలు తమ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల ఆవలనున్న దేశాలపై దాడులు జరుపుతూ, దానికి ఆత్మరక్షణ అని పేరెట్టడం నయవంచన కాదా? వేరేవాళ్లపై యుద్ధానికి దిగుతూ, అందుకు పర్యవసానాలుండరాదని ట్రంప్ అత్యాశకు పోతున్నారు. స్వల్పకాలంలోనే ఇరాన్ కీలక చమురు క్షేత్రాలున్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరికలు జారీచేస్తున్నారు.నాలుగో నెలలోకి ప్రవేశించిన ఈ యుద్ధంవల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడులకు వెరవకుండా ఇరాన్ దీటైన జవాబివ్వటంతో అమెరికాకు ఎటూ పాలుబోవడం లేదు. నిజంగా ట్రంప్ అంటున్నట్టు ఖర్గ్ ద్వీపం జోలికిపోతే ఇది మరింత వికటించి, పరిస్థితులు ఇంకా క్షీణిస్తాయి. దురదృష్టమేమంటే, అమెరికాకు ఎవరూ నచ్చజెప్పే స్థితి లేదు. పటిష్టమైన వ్యవస్థలున్నాయనుకున్న ఆ దేశంలోనూ ఏ ఒక్కటీ ట్రంప్‌ను నియంత్రించలేకపోతోంది. అక్కడి ప్రజల్లో కదలికవచ్చి, ట్రంప్‌పై ఒత్తిళ్లు పెరగనంతకాలం ప్రపంచం ఇలా బిక్కుబిక్కుమని బతుకీడ్చక తప్పదు. -
‘ఫిఫా’కు అమెరికా గండం!
మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్త సాకర్ అభిమానులను 39 రోజులపాటు ఊగించి, శాసించే క్రీడా సంరంభం మొదలుకాబోతోంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా) నేతృత్వంలో గురువారం అర్ధరాత్రి 12.30 దాటాక (భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే శుక్రవారం) ప్రపంచ ప్రసిద్ధ మెక్సికో సిటీ స్టేడియం(ఎస్టాడియో అజకా) వేదికగా మెక్సికో–దక్షిణాఫ్రికా జట్ల మధ్య సాగే తొలి పోరుతో ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. 96 యేళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఇలా మూడు దేశాల్లో ఈవెంట్లు నిర్వహించటం ఇదే తొలిసారి. అమెరికా, కెనడా, మెక్సికో ‘ఐక్యంగా, ఒక్కటిగా’ నినాదంతో కలిసికట్టుగా బిడ్ వేసి గెల్చుకున్నాయి. ఈసారి జట్ల సంఖ్య 32 నుంచి 48కి పెరగటంతో 104 మ్యాచ్‌లు జరుపుతున్నారు. వీటన్నిటినీ ఈ మూడు దేశాల్లోని 16 నగరాల్లో నిర్వహించనుండగా, ఇందులో 78 మ్యాచ్‌లు, కీలక ఈవెంట్లు తమ దగ్గరే ఉండేలా అమెరికా చూసుకుంది. మెక్సికో, కెనడా చెరి 13 నిర్వహిస్తాయి.‘క్రీడలు ప్రపంచాన్ని ఏకం చేస్తాయి... దేశాల మధ్య సరిహద్దులు చెరిపేస్తాయి’ అని క్రీడల నిర్వాహకులు తరచు చెప్పేదంతా బడాయి తప్ప నిజం కాదని మళ్లీ రుజువైంది. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్నట్టు ఈమధ్య శ్వేతజాతి దురహంకారాన్ని ఒళ్లంతా పులుముకుంటున్న అమెరికా, అతిగా వ్యవహరిస్తూ ఈ సంరంభాన్ని నీరుగార్చే పోకడ లకు పోతోంది. ఫిఫా రిఫరీ, సోమాలియా క్రీడాకారుడు ఒమర్ అర్టన్ ఈ సంరంభం కోసం మయామీలో దిగిన వెంటనే ఆయన్ను వెనక్కి పంపింది. ఒమర్‌కు దౌత్య వీసా కూడా ఉంది. అతను ‘జాతీయ భద్రత’కు ముప్పు తెస్తాడంటోంది అమెరికా. ఇరాన్ బృందానికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అరిజోనాలో శిక్షణ మ్యాచ్‌లు నిర్వహించుకోవాల్సిన ఆ బృందం ఈ కారణంగా మెక్సికోకు మార్చుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ జరిగే రోజున వచ్చి వెనుదిరగాలట! ఇలాంటి ఆంక్షలు సహజంగానే ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అమెరికా ఉన్మాదం అక్కడితో ఆగలేదు. మ్యాచ్‌లలో ఇరాన్ అభిమానులుగా వచ్చే వారికి సైతం వీసాలు ఎగ్గొట్టింది. షికాగో విమానాశ్రయంలో దిగిన ఇరాక్ బృందం వైస్ కెప్టెన్ ఆయమాన్ హుస్సేనీని నిర్బంధించి, ఏడుగంటలపాటు ప్రశ్నలతో వేధించి, సోదాలు జరిపి విడిచిపెట్టింది. ఆయనతో వచ్చిన బృందం ఫొటోగ్రాఫర్‌ని వెనక్కి పంపింది. సెనెగల్, మొరాకో, ఉజ్బెకిస్తాన్ బృందాల్ని దుస్తులు విప్పించి నేరగాళ్ల మాదిరిగా పరిగణించారు. 90 మంది మొరాకో అభిమానులకూ ఈ ‘మర్యాదే’ ఎదురైంది. వారి రాకపై సందేహాలున్నాయట! దక్షిణాఫ్రికా బృందం వీసాల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇంతవరకూ తేల్చలేదు. ఇప్పటికే అమెరికాలో హోటల్ గదులు రిజర్వ్ చేయించుకోవటంతో పలువురికి లక్షల డాలర్లు వృథా అయ్యాయి.చిత్రమేమంటే... ఈ క్రీడాకారులూ, వారి అభిమానుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా నేరచరిత్ర లేదు. నిజానికి ఉగ్రవాదమంటే వణికే అమెరికా ఈ దేశాలన్నిటిపైనా పలు సందర్భాల్లో దురాక్రమణలకు దిగింది. వాటిని వల్లకాళ్లుగా మార్చింది. అధినేతలను కాల్చిచంపింది. దీన్ని ఏమనాలి? చేసిందంతా చేసి దొంగే ‘దొంగ... దొంగ’ అని అరిచి నట్టు ఇప్పుడీ వికృత చర్యలేమిటి? విషాదమేమంటే ఇదంతా చూస్తూ కూడా ఫిఫా నోరుమూసుకుని కూర్చోవటం! అమెరికాలో ఫిఫా ఈవెంట్లు జరిగితే సమస్యలొస్తాయే మోనని 2017లో ఒక సందర్భంలో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను అడిగితే... ‘ఫిఫా ఏం చెప్తే అదే చెల్లుతుంది. అమెరికా మొండికేస్తే అక్కడ వేడుకలు రద్దవుతాయి’ అని గంభీరంగా చెప్పారు. ఇప్పుడు వీసా నిరాకరణలూ, వేధింపులూ ఆతిథ్యం ఇచ్చే దేశానికి సంబంధించినవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకీ పిరికితనం? 2013లో బ్రెజిల్నూ, 2022లో ఖతార్నూ వరల్డ్ కప్ ఈవెంట్లు రద్దవుతాయని బెదిరించి, ప్రత్యేక చట్టాలు చేయించినప్పుడు ఈ ‘విశాల హృదయం’ ఎటుపోయింది? దక్షిణార్ధగోళ దేశాలంటే చులకనా? అప్పట్లో ఖతార్‌లో స్వేచ్ఛ లేదంటూ నోళ్లు నొక్కుకుని నిరసన తెలిపిన జర్మనీ ఆటగాళ్లు ఈసారి అమెరికాలో ఆ సాహసం చేయగలరా? కడివెడు పాలల్లో విషపు చుక్కలా ఉన్న అమెరికా తీరుపై కళ్లుమూసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లపై అందరిలోనూ ఆసక్తిపోతుందని ఫిఫా గుర్తించాలి. -
ఇది సర్కారీ నిర్లక్ష్యం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనం సుదీర్ఘకాలం పోరాడి, ఎన్నో బలిదానాలు చేసి సాధించు కున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసి తీరాలన్న పాలకుల యావ 8 మంది కార్మికుల నిండు ప్రాణాలు తీసింది. సోమవారం సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్‌లో హఠాత్తుగా విస్ఫోటం సంభవించి, అక్కడ పనిచేస్తున్న 8 మంది క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగలగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 1,600 డిగ్రీల సెల్సియస్‌తో సలసలకాగుతున్న ఆ ఉక్కు ద్రవం... సమీపంలోని భారీ క్రేన్‌పై పడి అది పూర్తిగా దగ్ధమైందంటే దాని తీవ్రత ఎంతటిదో గ్రహించవచ్చు. ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంతో వ్యవహరించిన పర్యవసానంగా చోటుచేసుకున్న ఈ మరణాలు నిజానికి హత్యలు. దీన్ని కప్పిపుచ్చుకోవటానికే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం పడరాని పాట్లు పడ్డారు. సీఎం చంద్రబాబు పత్తాలేరు. ముందురోజు వెళ్లిన హోంమంత్రి అనిత కార్మిక కుటుంబాలను పలకరించే ధైర్యం లేక అట్నుంచి అటే పలాయనం చిత్తగించారు. లోకేశ్, పవన్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి కార్మికుల ఆగ్రహాన్ని చవిచూశారు. ‘అకటా వికటపు రాజుకు అవివేకపు మంత్రులు, చాదస్తపు పరివారం...’ అనే నానుడి మనకు ఉండనే ఉంది. అందుకు తగినట్టే కార్మిక నేతలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్ప లేక, రంకెలేస్తూ ‘మీకెందుకు... మీ ఇంట్లో ఎవరైనా పోయారా?’ అంటూ లోకేశ్ మాట్లా డిన తీరు ఆయన కుసంస్కారానికి నిదర్శనం. రెండేళ్లనుంచి మంత్రిగా ఉన్నా పవన్ అపరిపక్వతను వదుల్చుకోలేకపోతున్నారని ఆయన తీరు తేటతెల్లం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కర్మాగారాన్ని అమ్మేయాలని చూస్తే తానే అడ్డుకున్నారట. ఘటన జరిగిన కర్మాగారం ఏమిటో, అది ఎవరి అధీనంలో ఉంటుందో కూడా ఆయనకు తెలియ దన్నమాట! పైగా పోరాడదామంటే కార్మికులు కదల్లేదట!! ఇంత పెద్ద విషాద ఘటన తర్వాత, ఇలా చవకబారు మాటలు మాట్లాడటానికి ఆయనకు సిగ్గనిపించలేదు. పైగా 2021లో దీన్ని ప్రైవేటీకరించాలనుకుంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఅసెంబ్లీలో తీర్మానం చేయించి అడ్డుకుందని అదే నగరంలో కేంద్ర ఉక్కుగనుల మంత్రి హెచ్డి కుమారస్వామి చెప్పి ఇంకా 24 గంటలు గడవకుండానే అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి!ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తరఫున వచ్చినవారిపై సహజంగానే ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయి. పైగా విశాఖ ఉక్కును రక్షిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చినవారు గనుక, మీరేం చేశారని ప్రశ్నిస్తారు. ‘అప్రయోజకుడికి అహంకారం ఎక్కువన్న’ట్టు గొంతు చించుకుని దబాయిస్తే కార్మికలోకం నోరుమూసుకుని పడి ఉంటుందని లోకేశ్ అనుకుంటున్నట్టున్నారు. ఒకప్పుడు వేలమంది ఉద్యోగులతో కళకళ్లాడుతూ ఉత్పాదనలో దేశంలోనే నంబర్ వన్‌గా, నవరత్నాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా చిదిమేస్తుంటే... ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతుంటే నిలదీయటం నేరమా? ఇంతవరకూ కర్మాగారంలో 7,500 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించారు. నిపుణులైన 6,000 మందిని పనిలో నుంచి తీసేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట మరో 2,000 మందిని పంపేశారు. మరోపక్క ఉత్పాదకత పెంచాలని కార్మికుల్ని వేధిస్తున్నారు. 30 ఏళ్లనాటి బ్యాటరీలేఇంకా వినియోగిస్తుండగా, కొన్ని విడి భాగాలు పనికి రాకుండా పోయాయని చెప్పినా అరణ్యరోదనైంది. పైగా విశాఖ ఉక్కు ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉక్కు తయారీలో నాసిరకం రసాయనాలను వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత విషాద ఘటనకు ఇవన్నీ కారణమే. అందుకే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. ఇదే నగరంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనువెంటనే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున అంద జేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు విషయంలో డ్రామాలు కట్టిపెట్టి దాని ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. -
టీఎంసీ అంతర్విస్ఫోటనం!
ఎన్నికల ఫలితాలు వెలువడి పట్టుమని పాతిక రోజులు కాకుండానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి వీధుల్లో హింసతో మొదలైన ఎదురుదెబ్బలు ఇంకా ఆగలేదు. తాజాగా ఇండియా కూటమి సమావేశానికి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చిన సోమవారం నాడే ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేసి, తమదే అసలైన టీఎంసీ అనీ, ఎన్డీయేలో ఉంటామనీ స్పీకర్‌కు లేఖ రాశారు.వారి సంఖ్య 13 మాత్రమేనని పార్టీ చెబుతోంది. ఇప్పటికే టీఎంసీ శాసనసభా పక్షం చీలి, 58 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ నాయకత్వంలో వేరు కుంపటి పెట్టారు. తమనే ప్రధాన ప్రతి పక్షంగా గుర్తించమని స్పీకర్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల్లో రాజీనామాలకూ, గోడ దూకుళ్లకూ కొదవే లేదు. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న మమత ఈ అరాచకాన్ని ఆపడానికి ప్రయత్నించకపోలేదు. కానీ అదేమీ ఫలితమివ్వలేదని తాజా పరిణామాలు చెబు తున్నాయి. ఫిరాయింపులనగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ‘వైస్రాయ్ ఎపిసోడ్’ అందరికీ గుర్తొస్తుంది. కానీ ఆ జాడ్యం ‘వైస్రాయ్’ కన్నా చాలా పాతది. 1967లో హరియాణాలో గయాలాల్ అనే స్వతంత్ర శాసనసభ్యుడు వారం రోజుల వ్యవధిలో మూడు పార్టీలు మారినప్పుడు ‘ఆయా రాం... గయారాం’ అనే నానుడి మొదలైంది. ఫిరాయింపులకు ఆయన ఆద్యుడు కాకపోవచ్చుగానీ, వాటితో ఆయన పేరు శాశ్వతంగా ముడిపడి పోయింది.కానీ గత రెండు దశాబ్దాలనుంచి గుంపుగా వెళ్లి అవతలి పార్టీతో అంటకాగే ఉదంతాలు లేదా సొంత పార్టీ పెట్టుకోవడం వంటివి చోటుచేసుకున్నప్పుడల్లా... ప్రభుత్వాలు కుప్ప కూలినప్పుడల్లా ఆ పాత నానుడి పోయి, ‘వైస్రాయ్ ఎపిసోడ్’ గుర్తుకురావటం మొదలైంది. 1995లో జరిగిన ఆ ఉదంతం వెన్నుపోటుకూ, విద్రోహా నికీ, నయవంచనకూ బండగుర్తుగా మారిపోయింది.తన మామ స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా జిల్లా పర్యటనలో ఉండగా, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి రెవెన్యూ మంత్రి చంద్రబాబు తన విధేయులైన అరడజను మంది ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో పోగేసి, టీడీపీ చీలిపోయిందంటూ బ్రహ్మాండం బద్దలయిన స్థాయిలో అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుని, ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, బ్లాక్మెయిల్ చేసి ఆ సంఖ్యను పెంచుకుంటూ పోయారు.ఆయన మిత్రుడు, నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు సరేసరి... సకల వ్యవస్థలూ చంద్రబాబుకు సాగిలపడటంతో ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోయారు. కొన్ని నెలల వ్యవధిలోనే మనోవ్యధతో కన్ను మూశారు. ఇప్పటి ‘రెడ్‌బుక్’లా ఆ ఉదంతానికి బాబు పేరెట్టినట్టు లేరుగానీ... ఈనాటికీ సకల రాష్ట్రాల ఫిరాయింపుదార్లకూ అదే శిరోధార్యం. 2014లో 23 మంది ఎమ్మెల్యేలను ఖరీదు చేయటం సంగతలా ఉంచి... 2024లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారం నుంచి వైదొలగాక కొందరు ఎంపీలతో పార్టీకీ, పదవికీ రాజీనామాలు చేయించటంద్వారా మళ్లీ ఆయనే ‘నైతికత’ ముసుగులో కొత్త రకం చీడకు గేట్లు తెరిచారు. మహారాష్ట్రలో 2022లో ఫిరాయింపులతో శివసేన, ఎన్సీపీలు చతికిలబడి అప్పటి మహావికాస్ అఘాదీ(ఎంవీఏ) ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు విపక్షంలో ఉన్నా టీఎంసీకి అదే దుఃస్థితి ఎదురైంది. ఇదంతా మమత స్వీయ తప్పిదాల ఫలితమా... బీజేపీ చూపే ఆకర్షణల వల్లనా అని చర్చించటం వృథా. రెండూ నిజమే కావొచ్చు. కానీ మమత తప్పిదాలుంటే అవి ఇప్పుడే గుర్తుకురావటం, బీజేపీ ఆకర్షణలు చూపితే పార్టీ అధికారం కోల్పోయాకే ఎగబడటం వింత.గత నెల 4న వెలువడ్డ ఫలితాల్లో 45.92 శాతం ఓట్లతో, 208 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాగా... 40.68 శాతం ఓట్లు, 80 సీట్లతో తృణమూల్ అధికారం కోల్పోయింది. అంటే ఓట్లపరంగా పెద్ద వ్యత్యాసం లేదు. కానీ టీఎంసీ ఎమ్మె ల్యేలూ, ఎంపీల్లో ఎంత అభద్రతాభావం! ఈ బాపతు ఫిరాయింపుల్ని అలా గోడదూకే వారిలో లోపించిన నైతికతగా మాత్రమే చూడటం సరికాదు. ఈ వికృత ధోరణుల్ని నిలదీసే కాలంపోయి... ఘనకార్యాలుగా, ‘అపర చాణక్యం’గా అభివర్ణించే మీడియా వచ్చింది. ఇతర వ్యవస్థలూ తమకేమీ తెలియనట్టు నటిస్తున్నాయి. అందుకే ఈ గోడ దూకుళ్లు నిర్లజ్జగా సాగిపోతున్నాయి. కనుక పార్టీలు చీలిపోతే... ప్రభుత్వాలు పడిపోతే ‘యూ టూ బ్రూటస్’ అనుకుని ఆశ్చర్యపోవటం తప్ప ఎవరూ చేయగలిగింది లేదు. -
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం. -
సారం లేని సారా కథలు
‘ఈనాడు’ మీడియా అధిపతి వియ్యంకుల వారికి మరోసారి తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానాను సమర్పించిందట! వారి కాంట్రాక్టు సంస్థ పోలవరం ఎడమ కాలువ పనుల్లో రెండు ప్యాకేజీలను చేపట్టింది. కేవలం ఇరవై నెలల కింద ఖరారు చేసిన వాటి అంచనా వ్యయాన్ని 126 శాతం పెంచుతూ ఈ శుక్రవారం నాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ‘సాక్షి’ బయటపెట్టింది. అదేరోజు ఉషోదయాన ‘ఈనాడు’ మొదటి పేజీలో వడ్డించిన ఒక వార్త గమనించదగ్గది. మద్యం కేసులో త్వరలోనే జగన్‌కు ఈడీ నోటీసులిస్తుందట! విషయం లేకుండా గాలిని పోగేసి కట్టిన ఈ కక్షపూరిత కేసుపై ‘ఈనాడు’ సహా యెల్లో మీడియా వాహినంతా కూడబలుక్కొని ఏడాదిన్నర కాలంలో సృష్టించిన కాల్పనిక సాహిత్యాన్ని టన్నుల లెక్కల్లో గణించవలసి ఉంటుందేమో!చంద్రబాబుకు అవసరమైన పద్ధతిలో సమాచార ఉపచారాలు చేయడం యెల్లో మీడియా పని. బదులుగా ఆ మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు చేసిపెట్టడం బాబు సర్కార్ బాధ్యత. ఈ సహకార ధోరణి మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్నది. మద్యం కేసు పేరుతో యెల్లో మీడియా నిర్వహించిన వ్యాసంగాన్ని కాకమ్మ కథలని పిలవాలో, చిలకమ్మ పలుకులని నుడవాలో అర్థం కాని పరిస్థితి. అయితే, రాసినదాన్నే పలుమార్లు మార్చి మార్చి రాయగలిగే వారి రచనా చమత్కృతికీ, జబ్బ పుష్టికీ పాఠకులు అచ్చెరువొందడం ఖాయం. వాటిని చదివిన విభ్రమావస్థలో ఏది కుంభకోణమో, ఏది అసలు కోణమో పాఠకులు తేల్చుకోలేరనే కనికట్టు విశ్వాసం వారికి ఉండవచ్చు. కానీ, ఇంగితజ్ఞానం అనేదాన్ని రాసేవాడు విడిచేసినా చదివేవాడు కోల్పోడనే ఎరుకలేకపోవడం వారి బలహీనత.పత్రికా రంగంలో తనకు పోటీగా తయారైన ‘ఉదయం’ను దెబ్బతీయడానికి ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు ప్రారంభించిన ‘ఉదయం’ సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఆర్థిక నిర్వహణ భారం కావడంతో దాన్ని లిక్కర్ వ్యాపారస్తుడైన మాగుంట సుబ్బిరామిరెడ్డికి అప్పగించారు. లిక్కర్ వ్యాపారాన్ని నిషేధిస్తే ‘ఉదయం’ పునాదులు దెబ్బతింటాయన్న లక్ష్యంతోనే ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందనే విమర్శలు ఆ రోజుల్లోనే వినిపించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తానిచ్చిన హామీ మేరకు మద్యనిషేధాన్ని అమలు చేశారు. నాడు ‘ఈనాడు’ సహకారంతో వెన్నుపోటు వ్యూహం ద్వారా అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్‌కు మద్యనిషేధం ఇబ్బందిగా మారింది. వెంటనే ‘ఈనాడు’ రంగంలోకి దిగి ఒక సంపాదకీయాన్ని రాసిపారేసింది. ప్రజలు చైతన్యవంతులై వారంతట వారు తాగడం మానేస్తే తప్ప మద్యనిషేధాన్ని అమలు చేయడం అసాధ్యమని అందులో తేల్చేశారు. బోధివృక్ష ఛాయలో సంపాదకీయాన్ని చదివిన చంద్రబాబు తక్షణం కర్తవ్యోన్ముఖుడై మద్య నిషేధాన్ని ఎత్తిపారేశారు.ఆనాడు మొదలైన బాబు – యెల్లో మీడియా బంధం మరింత బలపడింది. ఆనాటి వెన్నుపోటు వ్యూహాలు, లిక్కర్ కథల ట్విస్టులూ నేటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న నేతను బట్టి యెల్లో మీడియా లిక్కర్ కథల్లోని ట్విస్టులను మనం స్పష్టంగా చూడవచ్చు. 2014–19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మద్యం పాలసీపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం వ్యవహరించిందనీ, ఫలితంగా 20 వేల కోట్లకు పైగా సిండికేట్ దండుకున్నదనీ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో వైసీపీ ఆరోపణలు చాలావరకు నిర్ధారణ అయ్యాయి. దర్యాప్తుల సంగతి పక్కనపెట్టి కామన్సెన్స్ను ఉపయోగించి ఆలోచించినా కూడా జరిగిన అవినీతికి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తాయి.అంతకుముందు ఆరు డిస్టిలరీలు ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మరో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. తమకు అనుమతులిచ్చి వ్యాపారాన్నిచ్చిన వారి పట్లనే సంస్థలు కృతజ్ఞతతో ఉంటాయి తప్ప ఇవ్వనివాళ్ల పట్ల ఎందుకుంటాయి? ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి బార్ల మీద వాటి వ్యాపారాన్ని బట్టి ప్రివిలేజ్ ఫీజును వసూలు చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి ఈ ప్రివిలేజ్ ఫీజు ద్వారా ఏటా 1,300 కోట్ల ఆదాయం సమకూరేది. 2015లో చంద్రబాబు సర్కార్ ఈ ఫీజును తొలగించింది. అది కూడా కేబినెట్లో పెట్టకుండా, ఆర్థిక శాఖ అనుమతి కోరకుండా చీకటి జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయం. అంటే తాము చేస్తున్న పని తప్పని తెలిసి కూడా సర్కార్ పెద్దలు ఈ ఫీజును రద్దు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆ మేరకు ప్రైవేట్ వ్యాపారులకు నాలుగేళ్లలో ఐదు వేల కోట్లకు పైగా లబ్ధి జరిగింది. ఈ వ్యవహారంలో పాలకులు అవినీతికి పాల్పడేందుకు నూటికి నూరు శాతం అవకాశాలున్నాయి. అందువల్లనే కాగ్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాన్ని నమోదు చేశారని సమాచారం. స్పష్టమైన ఆధారం కనుకనే సీఐడీ కేసు నమోదు చేసింది.3,400 లైసెన్స్డ్ లిక్కర్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. చేతులు తడపకుండానే ఇంతటి భారీ వెసులుబాటు సాధ్యం అవుతుందా? ప్రతి షాపు పరిధిలో అదనంగా పది నుంచి పదిహేను వరకు బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రం మొత్తంగా 43 వేల బెల్టు షాపులు అవతరించాయి. ఒక్కో బెల్టు షాపును ప్రాంతాన్ని బట్టి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పాడుకున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకుగాను ఒక్కో బెల్ట్ షాపులో ప్రతి క్వార్టర్ మీద అదనంగా 20 రూపాయలకు పైగా వసూలు చేశారు. విచ్చలవిడిగా మద్యాన్ని ప్రవహింపజేసి ఎమ్ఆర్పీ మీద అదనపు దోపిడీతో జనాన్ని పీడించిన ఈ విధానంలో తెలుగుదేశం పార్టీ సిండికేట్ ముఠాలు 20 వేల కోట్లకు పైగా దిగమింగాయని వైసీపీ ఆరోపించింది.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. విచ్చలవిడి మద్యం ప్రవాహానికి కళ్లెం వేసే మద్య నియంత్రణను ప్రవేశపెట్టారు. కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అధిక లాభాపేక్షతో విచ్చలవిడి అమ్మకాలకూ, కల్తీ మద్యం ప్రవాహాలకు పాల్పడకుండా ప్రైవేట్ వ్యాపారాన్ని పూర్తిగా తొలగించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. అమ్మకం వేళలను కూడా రాత్రి 9 గంటల వరకే పరిమితం చేశారు. అంతకుముందు మాదిరిగా రౌండ్ ద క్లాక్ మద్యం లభ్యమయ్యే పరిస్థితి లేదు. షాపుల సంఖ్యను కూడా 3 వేలకు పరిమితం చేశారు. అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అవకాశం ఇవ్వలేదు. బెల్ట్ షాపుల ఊసే లేకుండా చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ప్రవేశించకుండా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరుల నుంచి కార్లలో ఒక బాటిల్ అర బాటిల్ తెచ్చుకున్నా సరే లాగిపారేసే దాకా ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ వెళ్లింది. ఫలితంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే మద్య నియంత్రణను జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసింది.ఇప్పుడు లాజికల్‌గా ఆలోచిస్తే జగన్ సర్కార్ మద్యం విధానంలో అవినీతి జరిగే అవకాశం ఎక్కడున్నది? కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు. నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వ్యాపారం తగ్గిపోయిందన్న ఆనందంతో డిస్టలరీలు లంచాలిస్తాయా? విచ్చలవిడిగా షాపులకూ, పర్మిట్ రూమ్లకూ, బెల్ట్ షాపులకూ అనుమతిలిచ్చిన ప్రైవేట్ వ్యాపార విధానంలో లంచాలు వస్తాయా? నియంత్రిత ప్రభుత్వ వ్యాపారంలో లంచాలు వస్తాయా? చంద్రబాబు గత ప్రభుత్వం కొత్తగా 14 డిస్టిలరీలకు అనుమతినివ్వడమే కాదు, మద్యం బేసిక్ రేట్లను పెంచి మరీ వాటికి లబ్ధి జరిగేలా చూసింది. బేసిక్ రేటును పెంచకుండా తమ లాభాలకు కళ్లెం వేసినందుకు డిస్టిలరీలు జగన్ సర్కార్‌కు లంచాలు ముట్టజెప్పాయని అనుకోవాలా? ఇక్కడే యెల్లో మీడియా క్రియేటివిటీ విశృంఖల విహారం చేయడం మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ హెడ్‌క్వార్టర్‌లో తయారైన స్క్రిప్టునే దర్యాప్తు కోసం నియమించిన సిట్ లీక్ చేస్తుంది, యెల్లో మీడియా అచ్చేస్తున్నదని వైసీపీ ఆరోపణలు చేస్తున్నది. ఈ ఆరోపణలను విశ్వసించకుండా ఉండేందుకు తగిన కారణం కనిపించడం లేదు. ఎంపిక చేసుకున్న కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసినందువల్లనే వేలకోట్ల ధనం చేతులు మారిందని ‘సిట్’ పలుకుతున్నది. యెల్లో మీడియా కోరస్ పాడుతున్నది. జగన్ సర్కార్ జమానాలో వచ్చిన కొత్త డిస్టిలరీ లేదు. కొత్త మద్యం బ్రాండ్ కూడా లేదు. అన్నీ కూడా చంద్రబాబు సర్కార్ వారసత్వమే. బాబు పాత జమానాలో 20 డిస్టిలరీలు వుంటే అందులో కేవలం ఐదు డిస్టలరీలకే బేవరేజెస్ కార్పొరేషన్ 50 శాతానికి పైగా ఆర్డర్లు ఇచ్చిందని సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైంది. ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థలకే ఆర్డర్లు ఇవ్వడం వల్ల జగన్ హయాంలో వేల కోట్లు చేతులు మారాయన్న కథనం నిజమైతే చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే ఎక్కువ మొత్తమే కైంకర్యం అయి వుండాలి కదా! యెల్లో మీడియాకు ఈ లాజిక్‌తో పనేముంది?డిస్టిలరీలకు మద్యం ఆర్డర్లు ఇచ్చే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ వాళ్లు బెదిరించి, హింసించి తాము కోరుకున్న వారి పేర్లు చెప్పించి, ఆ పేర్లన్నింటినీ అభియోగపత్రంలోకి ఎక్కించారన్న విమర్శలు వినబడుతున్నాయి. సీఎమ్‌ఓలో కార్యదర్శిగా పనిచేసిన ధనంజయరెడ్డి, సీఎమ్‌కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప, ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన బంధువు అనివాశ్రెడ్డి, లోక్‌సభలో వైసీపీ నేత మిథున్‌రెడ్డి, వైసీపీ నాయకుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి వగైరా సుమారు యాభై మంది మరే పని లేకుండా మద్యం వ్యాపారంలో మునిగితేలారని సిట్ నమ్మమంటున్నది.ఈ కథా సరిత్సాగరంలో ఇంకా చాలా పిట్టకథలున్నాయి. ఛార్జిషీట్లో పేర్కొన్నవారు, పేర్కొనని మరికొందరి పేర్ల మీద, వారి బినామీల పేర్ల మీద ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తులున్నాయట! అంతేకాకుండా, కొన్ని వందల కోట్లతో దుబాయ్‌లో, ఆఫ్రికాలో వ్యాపారాలు జరుగుతున్నాయట! మరికొన్ని వందల కోట్లో, వేల కోట్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తరలించారట! అసలు అవినీతికే అవకాశం లేని విధానంలో ఇన్ని వేల కోట్లు ఎలా ప్రవహిస్తాయి? ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ ఎంగిలి కథలను విశ్వసిస్తుందా? ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలనలో చేతులెత్తేసి ప్రత్యర్థి వంక వేలెత్తి చూపితే జనం విశ్వసిస్తారా? అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో, చెప్పుకోవడానికి సాధించిన విజయాలు లేకనే కూటమి సర్కార్ విషప్రచారపు జోరును పెంచిందని అనుకోవలసి వస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
యుద్ధం ఉన్నట్టా... లేనట్టా?!
అయోమయాన్ని సృష్టించటానికీ, అవతలి పక్షంపై పైచేయి సాధించటానికీ ఎంతకైనా తెగించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి అమెరికన్ కాంగ్రెస్‌కు పెద్ద అబద్ధం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇరాన్‌తో శత్రుత్వాన్ని ఆపి, అక్కడున్న సేనలనువెంటనే వెనక్కి పిలిపించాలని 215–208 ఓట్ల తేడాతో బుధవారం అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించగా, ‘అసలు యుద్ధం ఎక్కడుంది? అది ఏప్రిల్ మొదటి వారంలోనే ముగిసి పోయింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అది కొనసాగుతోంది’అంటూ ట్రంప్ లేఖ రాశారు. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కై, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై మొదలు పెట్టిన దండయాత్ర ఇప్పటికీ ఆగలేదు. హార్మూజ్ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. తమ షరతులకు తలొగ్గితేనే ఒప్పందం సాధ్యమంటూ ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తీర్మానానికి కొన్ని గంటలముందు కూడా అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. కానీ ఈ ఘర్షణల్ని యుద్ధంగా పరిగణించరాదని ట్రంప్ భాష్యం చెబుతున్నారు. నిజానికి యుద్ధం ఆపాలని ప్రతినిధుల సభ ఆదేశించినంత మాత్రాన ట్రంప్కొచ్చే నష్టమేం లేదు. ఆ తీర్మానం చట్టపరంగా కీలకమైన చర్యే కావొచ్చు, కానీ ఆచరణలో అదే మంత పనికొచ్చేది కాదు. నలుగురు రిపబ్లికన్ సభ్యులు డెమాక్రాట్లతో చేయి కలపటంతో తీర్మానం ఆమోదం పొందింది. 1973లో వచ్చిన యుద్ధ అధికారాల చట్టంకిందకాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు యుద్ధంలోకి దిగితే, రెండు నెలల్లో దాన్నిముగించాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తే మరో 30 రోజులు పొడిగించటానికి అధ్యక్షుడికి వెసులుబాటుంది. కానీ అటు తర్వాత మాత్రం అసాధ్యం. ట్రంప్ రాసిన లేఖ ప్రకారం నిండా నెలకుమించి యుద్ధం సాగలేదు! కాల్పుల విరమణ అమల్లో ఉందంటే యుద్ధం లేనట్టేననీ, ‘అవసరమైన’సందర్భాల్లో చేస్తున్న దాడుల్ని యుద్ధంగా పరిగణించరాదనీ యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వాదిస్తున్నారు. తలా తోకా లేకుండా మాట్లాడటంలో ట్రంప్ సిద్ధహస్తుడు. ఒకపక్క కాంగ్రెస్ చేసిన తీర్మానం దేశభక్తి రాహిత్యమంటూనే, అదే నోటితో అదెప్పుడో ముగిసిందని చెబు తున్నారు. ఆయన తర్కం ప్రకారం యుద్ధం చేయటమే దేశభక్తి అయితే, దాన్ని నిలి పేసిన తనకూ దేశభక్తి లోపించినట్టే. ఈ వాదప్రతివాదాల మాటెలావున్నా ఇలాంటి అధ్యక్షుణ్ణి నెత్తిన పెట్టుకున్నందుకు మున్ముందు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ నెలాఖరుతో యుద్ధం వంద రోజులకు చేరుతుంది. యుద్ధం ఆగేందుకు ఇప్పటికి నాలుగుసార్లు ప్రతినిధుల సభలో డెమాక్రాట్లు తీర్మానాలు పెట్టారు. కానీ మొదటి మూడుసార్లూ అవి వీగిపోయాయి. మూడోసారి తీర్మానమైతే 212–212తో ఎటూతేలకుండా ముగిసింది. ఈసారి అది నెగ్గినా ట్రంప్ తన తర్కంతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంవల్ల ఇరాన్లో ఇంతవరకూ 3,400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. 2,900 కోట్ల డాలర్లు ఖర్చయిందని పెంటగాన్ చెబుతుండగా, ఇదంతా ముగిసేసరికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ మూర్ఖత్వం ఇలాగే కొనసాగితే అమెరికా నిండా మునగటం ఖాయం. దాంతో పాటు డాలర్‌తో ముడిపడివున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దివాలా స్థితికి చేరుకుంటాయి. ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటి ఇప్పటికే ట్రంప్ రేటింగ్ నేల చూపులు చూస్తోంది. ప్రతినిధుల సభ చేసిన తీర్మానంవంటిదే రిపబ్లికన్ల ఆధిక్యతగల సెనేట్‌లో కూడా చేస్తే అమెరికా అధ్యక్షుడి సంతకం అవసరం లేకుండానే యుద్ధం ఆపాల్సి ఉంటుంది. అయితే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు సైతం దాన్ని ట్రంప్ వీటో చేయొచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ తీర్మా నిస్తే తప్ప ఇవన్నీ పెద్దగా పనికొచ్చేవి కాదు. ఇప్పటికే మొత్తం ఓటర్లలో 64 శాతంమంది ట్రంప్ యుద్ధోన్మాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. తటస్థ ఓటర్లలో అయితే 73 శాతంమంది యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారు. ఎవరెంతగా కోరుకున్నా ట్రంప్ మాత్రం స్వీయ వినాశనంవైపే అమెరికాను తీసుకుపోతున్నారు. -
మయన్మార్‌తో చెలిమి
అనుచిత కారణాలవల్ల తరచు వార్తల్లో ఉండే మయన్మార్ నుంచి ఆ దేశాధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లయింగ్ అయిదు రోజుల పర్యటన కోసం శనివారం మన దేశం వచ్చారు. ఆయనతోపాటు వచ్చిన బృందంలో కేబినెట్ మంత్రులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. కొన్ని దశాబ్దాలక్రితం ఇలాంటి పర్యటన ఊహించలేం. ఎందుకంటే ఆ దేశం నిరంతరం సైన్యం పడగనీడలో మనుగడ సాగిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను సైన్యం బతకనీయదు. 2020లో తిరుగులేని మెజారిటీతో వరసగా రెండోసారి ఎన్నికైన ప్రజా స్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్ఎల్డీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఏడాదిలోపే సైనిక దళాలు హస్తగతం చేసుకున్నాయి. మన పొరుగును మనం ఎంచుకోలేం. అక్కడ ఎలాంటి ప్రభుత్వాలుండాలో ఆశించటం కూడా అసాధ్యం. మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మన ప్రయోజనాలు తప్ప వేరే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, అందుకోసం అక్కడి పాలకులపై ‘నైతిక ఒత్తిడి’ తీసుకురావాలనుకోవటం వృథా ప్రయాసగా, అనవసర చాదస్తంగా భావించే ధోరణి అలుముకుంది. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకొనే చైనా దశాబ్దాల క్రితమే ఈ సూత్రాన్ని నమ్మి మయన్మార్‌ను అక్కున చేర్చుకుని అన్నివిధాలా లాభపడింది.వాస్తవానికి మయన్మార్‌తో మన దేశానికి సన్నిహిత సంబంధాలుండేవి. 1951లో ఆ దేశంతో స్నేహ ఒప్పందం కుదిరింది. 1955లో మనతోపాటు అలీనోద్యమ అంకు రార్పణకు తోడ్పడిన దేశాల్లో మయన్మార్ ఒకటి. కానీ 1958లో సైనిక పాలకుల ఆగమనం తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మనమే కాదు... దాదాపు ప్రపంచ దేశాలన్నీ దానితో ‘దౌత్యపరమైన అంటరానితనాన్ని’ పాటించటం మొదలెట్టాయి. 1988లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని సైనిక పాలకులు అణిచేయటాన్ని నిరసిస్తూ సూకీకి భారత్ మద్దతు ప్రకటించింది. 1992లో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది. కానీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2002లో మళ్లీ దాంతో సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించి మాండలేలోని భారత కాన్సులేట్‌ను పునఃప్రారంభించింది. తిరిగి మళ్లీ 2014లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకొచ్చేవరకూ ఇరు దేశాల సంబంధాలూ అంతంత మాత్రమే. 2017లో మోదీ మయన్మార్‌ను సందర్శించారు.మన దేశానికి మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల పొడవునా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ (520 కి.మీ.), నాగాలాండ్ (215 కి.మీ.), మిజోరం (510 కి.మీ.), మణిపూర్ (398 కి.మీ.)ఉన్నాయి. 2021లో తిరిగి సైనిక పాలకులు అధికారం చేజిక్కించుకున్నాక మన దేశం గతంలో మాదిరి మయ న్మార్ను ఏకాకిని చేయాలనుకోలేదు. నిరంతరం సంబంధ బాంధవ్యాల్లో ఉంటే అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అది దోహదపడుతుందనీ, దాంతోపాటు సరిహద్దు భద్రత విషయంలో మన ప్రయోజనాలు నెరవేరుతాయనీ భావించింది. దానికితోడు మయ న్మార్ను దూరం చేసుకుంటే అది చైనాకు దగ్గరకావటం మినహా సాధించేదేమీ ఉండదని కూడా అనుకుంది. అందుకే కావొచ్చు... సైనిక చీఫ్ పదవి వదులుకుని, దేశాధ్యక్షుడైన రెండు నెలల్లోనే తన తొలి విదేశీ పర్యటనకు మిన్ మన దేశాన్ని ఎంచుకున్నారు. నిరుడు డిసెంబర్, ఈ ఏడాది జనవరి మధ్య జరిపిన ఎన్నికల్లో మిన్ భారీ ఓట్లతో విజయం సాధించారు. దాదాపు అన్ని విపక్షాలనూ ఎన్నికల్లో పాల్గొననీయకపోవటంవల్ల ఇది సాధ్యమైంది. ఆ సంగతలావుంచి మయన్మార్‌తో కుదిరిన ఒప్పందాలు మన దేశానికి వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా మేలుచేసేవే. అంతర్జాతీయ కరెన్సీ బదులు మన రూపాయి, మయన్మార్ క్యాట్‌లలో లావాదేవీలు జరుపుకోవాలనీ... ఇంధనం, మైనింగ్, ఆగ్రో ప్రోసెసింగ్ రంగాల్లో సహకరించుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. అలాగే నౌకా శ్రయ నిర్మాణంలో మయన్మార్‌కు తోడ్పడేందుకు అవగాహన కుదిరింది. ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపే సంస్థలకు ఆశ్రయం లభించకుండా చర్యలు తీసుకుంటామని మయన్మార్ హామీ ఇచ్చింది. వర్తమానంలో ఇరుగు పొరుగుమధ్య సర్దుబాట్లు తప్ప ‘అనవసర’ చాదస్తాలు ఉండబోవని ఈ పర్యటన నిరూపించింది. -
ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?
అన్నిచోట్లా అడుగడుగునా కనబడే అవినీతి, నిర్లక్ష్యం దేశాన్నేలే ఉన్నతాధికార వ్యవస్థలు కొలువుదీరిన ఢిల్లీలో కూడా నిక్షేపంగా కొనసాగుతున్నాయని మూడురోజుల వ్యవధిలో జరిగిన రెండు విషాద ఘటనలు రుజువు చేశాయి. శనివారం రాత్రి అయిదంతస్తుల భవంతి కూలి పోటీ పరీక్షలకు కోచింగ్ కోసం వచ్చిన అయిదుగురు విద్యార్థులతోపాటు మరో మహిళ మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. ఇది మరువకముందే బుధవారం వేకువజామున దక్షిణ ఢిల్లీలో ఒక హోటల్ మంటల్లో చిక్కుకుని 21 మంది చనిపోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందటానికి వచ్చే విదేశీయులు ఈ హోటల్లో బస చేస్తారని చెబుతున్నారు. ఈ రెండు ఉదంతాలూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) పనితీరుకు అద్దం పడతాయి. దేశంలో దాదాపు అన్నిచోట్లా నియమోల్లంఘనలు కనబడుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోని అధికార యంత్రాంగాలకూ కొదవ లేదు. కానీ ఢిల్లీలోనూ ఇదే స్థితి! పైగా ఇలాంటి ఉదంతాలు ఆ నగరానికి కొత్తగాదు. 2024లో ఒక చిన్న పిల్లల ఆసుపత్రి మంటల్లో చిక్కుకుని ఏడుగురు నవజాత శిశువులు కన్నుమూశారు. అదే ఏడాది ఒక సెల్లార్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ మహానగరంలో కాలం చెల్లిన భవంతులు కూలడం, ఏడాదికి ఒకటో రెండో అగ్నిప్రమాదాలు రివాజుగా మారడం... అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించకపోవటం దిగ్భ్రాంతికరం.ఎంసీడీ అధికారులు గుణపాఠం నేర్వకపోవడం సరే... ఢిల్లీ ప్రభుత్వం లేదా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిస్సహాయంగా మిగలటం క్షమార్హం కాదు. ముఖ్యమంత్రి రేఖా శర్మకు ఈ సమస్యలన్నీ తెలియవనుకోలేం. ఆమె మూడు దఫాలు కార్పొరేటర్‌గా పని చేశారు. 2023లో లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జవాబిస్తూ రాజధాని నగరంలో నియమాలు ఉల్లంఘించిన భవంతులు 55,000 వరకూ ఉన్నాయని తెలియజేసింది. ఆ జాబితాలోని ఎందరిపై చర్య తీసుకున్నారో, ఆ భవంతుల్ని ఏం చేశారో ఎవరికీ తెలియదు. శనివారం ప్రమాదం జరిగిన అయిదంతస్తుల భవనం కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిందే. కేవలం మూడంతస్తులకు అనుమతి ఉంటే, మరో రెండంతస్తులు వేయటమే కాక, తాజాగా మరో అంతస్తు నిర్మాణానికి పనులు చేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే బలహీనమైన పునాదులపై నాసిరకంగా నిర్మించిన ఆ భవంతిపై అదనపు భారం పడటంతో కూలిపోయిందని చెబుతున్నారు. అలాంటి భవంతి నివాసయోగ్యమైనదేనని ఎంసీడీలో ధ్రువీకరించిందెవరో తేలాలి. బంగారు భవిష్యత్తును ఆశించి రకరకాల కోచింగ్‌ల కోసమని యువత వస్తుంది. చవగ్గా లభిస్తుందన్న కారణంతో అనేకులు ఇలాంటి భవంతుల్ని ఆశ్రయిస్తారు. కిక్కిరిసిన జనావాసాలున్నచోట మంచినీరు, డ్రెయినేజి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా ఎంతో కష్టమవుతాయి. అయినా అధికార యంత్రాంగాలు మౌనంగా ఉండిపోతున్నాయి. బుధవారం మంటల్లో చిక్కుకున్న హోటల్ల్లో రాకపోకలకు కేవలం ఒకే మార్గం ఉందని చెబుతున్నారు. ఆరు గదులకే అనుమతి ఉన్న హోటల్ ఏకంగా అయిదంతస్తుల్లో ఇరవై గదులు నిర్మించింది. దీనికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేదంటున్నారు. మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే ప్రభుత్వ విధానాలు లేకపోగా, అక్రమ కట్టడాలు, కాలనీలు వెలుస్తాయి. అవి క్రమబద్ధమవుతాయి. అల్పాదాయ వర్గాలు ఏ సదుపాయాలూ లేని అలాంటి నాసిరకం భవంతుల్లో ఉండక తప్పడంలేదు. ఢిల్లీలో ప్రణాళికాబద్ధంగా లేని ప్రాంతం దాదాపు 60 శాతంమేర ఉంటుందని ఒక అంచనా. 2014లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా 1,799 కాలనీలను క్రమబద్ధం చేశారు. అటుతర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ కాలనీలను, నిర్మాణాలనూ అనుమతించ బోమన్నారు. కానీ ఈ పుష్కరకాలంలో అలాంటి మరిన్ని వందల కాలనీలు, వాణిజ్య, నివాస భవంతులు ఉనికిలోకొచ్చాయి. ఏటా వర్షాకాలానికి ముందు ఎంసీడీ తనిఖీలు సాగుతుంటాయి. అవన్నీ మొక్కుబడి వ్యవహారాలేనని ఈ ప్రమాదాలు రుజువు చేస్తు న్నాయి. భూకంప జోన్–4లో ఉన్న ఢిల్లీలో ఇకనైనా పాలకులు మేల్కొంటారా? నిర్మాణ రంగ ఇంజినీర్లతో, నిపుణులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారా? -
లెక్కల్లో దాగుడుమూతలు
గణాంకాలపై ఎందరికెన్ని ఫిర్యాదులున్నా, ఎవరెంత వేళాకోళం చేసినా ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, అమల్లోవున్న విధానాల దిద్దుబాటుకూ అవే ఆధారం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మూడు రోజుల క్రితం విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) చూస్తే మన దేశం ఏయే రంగాల్లో మెరుగుపడింది, ఇంకెన్ని రంగాల్లో సవరించుకోవాల్సిన అవసరముంది అనే విషయాలు తెలుస్తాయి. 1992–93లో విడుదల చేసిన తొలి సర్వేనుంచీ చూస్తే తాజాగా విడుదలైన సర్వే ఆరోది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే మాతా–శిశు ఆరోగ్యం, బాలల పౌష్టికాహారం, ఆరోగ్య బీమా వగైరాల్లో మన దేశం ముందడుగు వేసిందని చాటుతోంది. ఇది సమగ్రమైనదనీ, అత్యుత్తమ నాణ్యతతో కూడిన గణాంకాలు రాబట్టడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామనీ ఆ నివేదిక వివరిస్తోంది. 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించి తీరాల్సిన వాటిగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ఎంత చేరువలో ఉన్నాం... ఎంత దూరంలో ఉన్నాం అనేది తెలుసుకోవటం, తగువిధంగా సవరించుకోవటం ఈ గణాంకాల ఉద్దేశం. గత నివేదికతో పోలిస్తే ఆసుపత్రుల్లో శిశుజననాల శాతం పెరిగిందనీ(88.6 శాతం నుంచి 90.6 శాతానికి), ప్రసవానికి ముందు ఆరోగ్య పరిరక్షణ 95.9 శాతానికి చేరుకుందనీ, సంతాన సాఫల్యత రేటు స్థిరంగా 2.0 దగ్గరుందనీ, పౌష్టికాహారలోపం తగ్గిందనీ, ఏడాది–రెండేళ్లమధ్య వయసుండే పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల శాతం 87.1 శాతానికి చేరుకుందనీ నివేదిక వివరిస్తోంది. అసలు తొలి ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదికకూ, తాజా నివేదికకూ చూస్తే స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. అప్పట్లో కేవలం 40 శాతం ప్రసవాలు మాత్రమే ఆసుపత్రుల్లో జరిగేవి. అవి ఇప్పుడు 90 శాతానికి పెరగటం చిన్న విషయమేం కాదు. అయితే గణాంకాలు ఏం చెబుతున్నాయన్నది కాదు... ఏం చెప్పటం లేదన్నది ముఖ్యమని నిపుణులంటారు. ఆ కోణంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక నిరాశపరుస్తుంది. గత నివేదికకూ, ఇప్పటికీ చూసినా ఎన్నో అంశాల దాటవేత తెలుస్తుంది. గత నివేదికకు మొత్తం 131 సూచీలుంటే ఇప్పుడవి 101కి తగ్గాయి. అంటే అనేక అంశాలను ఈ సర్వే పూర్తిగా విస్మరించిందన్నమాట! శిశువులు, పిల్లల మరణాల రేటైనా, కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలైనా, హెచ్ఐవిపై అవగాహన కల్పించటమైనా ఇందులో కనబడవు. అవి సర్వే చేయదగ్గ అంశాలు కాదనిపించటంలోని సహేతుకత ఏమిటో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకే తెలియాలి. ఒకవేళ వేరే గణాంకాల కోసం విడిగా సర్వే చేసివుంటే ఆ సంగతి చెప్పాలి. 2015–16 సంవత్సరంలో విడుదలైన నాలుగో నివేదికలో వంటగ్యాస్ వినియోగం 43.8 శాతం మేర ఉంటే ఆ తదుపరి సర్వే నాటికి అది 58.6 శాతానికి పెరిగిందని వెల్లడైంది. అటు తర్వాత కేంద్రం కోట్ల సంఖ్యలో అదనపు కనెక్షన్లు మంజూరు చేసింది. దాని ప్రభావం ఎలా ఉందో చూద్దామంటే ఇప్పుడది మాయం! స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణాల సంఖ్య 10 కోట్లకు చేరుకుందని 2019లో ప్రకటించి, దాన్ని కీలకమైన ఘట్టంగా చెప్పారు. తీరా తాజా నివేదిక ప్రస్తుత స్థితి ఎలా వుందో, అటుతర్వాత మెరుగుపడిందో లేదో చెప్పకుంటే ఎలా? ఇక పిల్లల్లో, మహిళల్లో రక్తహీనత ఎలా వుందన్న ప్రశ్న కూడా ఎగిరిపోయింది. గత సర్వేలో ఈ అంశానికి సంబంధించి ఏడు సూచీలున్నాయి. అయితే ఈ నివేదికలో నేరుగా నగదు బదిలీ, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక లావాదేవీలు వగైరా అంశాలున్నాయి. మంచిదే. అంత మాత్రాన ఇతర సూచీలు తొలగించటం సరికాదు. మనం చెప్పుకోవటానికైతే జీడీపీపరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆరో స్థానంలో ఉన్నాం. కానీ మౌలికంగా మనది అల్పాదాయ వర్గాలు అధికంగా ఉండే దేశం. సంపద పంపిణీ రీత్యాచూస్తే జనాభాలో కేవలం 10 శాతంమంది దగ్గర దాదాపు 65 శాతం సంపద ఉండగా, వీరిలో కేవలం 1 శాతంమంది చేతుల్లో 40 శాతం సంపద ఉంది. అట్టడుగు 50 శాతం జనాభా చేతిలో కేవలం 6.4 శాతంమేర మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన జోక్యాలతోనే నిరుపేద వర్గాలకు వివిధ అంశాల్లో సాయం అందించటం సాధ్యమవుతుంది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు అందుకోవాలంటే మన వర్తమాన స్థితిగతుల అధ్యయనం తప్పనిసరి. దాన్ని విస్మరించటం తెలివైన పనికాదు. -
కాలాతీత బాల్యం
‘టామ్.’ జవాబు లేదు. ‘ఒరేయ్ టామ్.’ పోలీ పెద్దమ్మ పిలుపునకు ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఓ అని వినబడుతుంది. టామ్ అమెరికాలో మాత్రమే లేడుగా! వాడు ఆఫ్రికాలోనూ ఉన్నాడు, అనకాపల్లిలోనూ ఉంటాడు. అల్లరి, సాహసం కలగలిసిన ప్రతి పిల్లాడూ టామే! 1876 జూన్ 9న ‘పుట్టిన’ టామ్ సాయర్‌కు ఇప్పుడు 150 ఏళ్లు! కానీ ఆ తుంటరికి వయసనేది అయిపోతుందా? టామ్ సదాబాలుడు, సరదా బాలుడు; పోలీ పెద్దమ్మనే కాదు, సకల ప్రపంచాన్ని తన అల్లరి చేష్టలతో ఏలిన కౌబాలుడు. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ నవలను మార్క్ ట్వెయిన్ కేవలం పిల్లల కోసమే రాయలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల. ప్రపంచ సాహిత్య యవనికపై ఒక చిలిపి బాలుడి సాహసాలు ఇంతటి సుదీర్ఘ కాలం సజీవంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇంటి గోడకు సున్నం వేయడాన్ని కూడా ఒక కళగా మార్చి, ఇతరులతో పని చేయించుకునే తెలివితేటలున్న టామ్ నేటి మేనేజ్మెంట్ గురువులకు ఆది గురువు. ఈ నవల రాకముందు, అమెరికన్ సాహిత్యం ఎక్కువగా యూరోపియన్ శైలిని అనుకరిస్తూ, నీతి సూత్రాలతో నిండి ఉండేది. కానీ ట్వెయిన్ అమెరికన్ మాండలికాన్ని, సామాన్యుల భాషను సాహిత్య గౌరవ పీఠంపై కూర్చో బెట్టాడు. ‘ఆధునిక అమెరికన్ సాహిత్యం అంతా మార్క్ ట్వెయిన్ రాసిన ఒకే ఒక్క పుస్తకం నుండి పుట్టింది’ అని ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్’ (1884) నవలను కొనియాడాడు ఎర్నెస్ట్ హెమింగ్వే. ఈ నవల టామ్ సాయర్‌కు పొడిగింపు అన్నది గుర్తుంచుకుంటే దాని బీజాలు మొదటే ఉన్నాయన్నది అర్థమవుతుంది.కొన్ని కథలు రాసినా ట్వెయిన్‌కు ఇది తొలి నవల. మిసిసిపీ నది తీరాన ఉన్న హానిబాల్ గ్రామంలో గడిపిన తన సొంత బాల్య స్మృతుల నుంచే ట్వెయిన్ ఈ కథను అల్లుకున్నాడు. తనకు తెలిసిన ముగ్గురు అల్లరి పిల్లల లక్షణాలను కలిపి ‘టామ్’ను సృష్టించాడంటారు. పేరును మాత్రం లోకల్ హీరో అయిన ఒక ఫైర్‌ఫైటర్ మీదుగా స్వీకరించాడు. ట్వెయిన్‌కు అతడు స్నేహితుడు కూడా. ఇద్దరూ కలిసి సాయంత్రాలు షికార్లు కొట్టేవాళ్లు. అందరికీ ఇష్టమైన హకల్‌బెరీ ఫిన్ పాత్రనేమో తన బాల్యమిత్రుడు టామ్ బ్లాంకె¯Œ షిప్ ఆధారంగా రూపొందించాడు. ట్వెయిన్ చుట్టూ ఎందరు టాములో! సిడ్ సాయర్, బెకీ థాచర్, జడ్జ్ థాచర్, జో హార్పర్, విడో డగ్లస్, ఇంజన్ జో లాంటి పాత్రలు కూడా మరిచిపోలేనివి. సినిమాలుగా, టీవీ ప్రోగ్రాములుగా, మ్యూజి కల్సుగా అలరించిన టామ్ సాయర్, టైప్‌రైటర్ మీద రాసిన తొలి నవల అని ప్రచారంలో ఉంది. కానీ అది నిజానికి ‘లైఫ్ ఆన్ ద మిసిసిపీ’ (1883) అని మరోమాట! ఇదీ మార్క్ ట్వెయిన్దే కావడం గమనార్హం.పిల్లలు కేవలం మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు కాదు; వాళ్లు అల్లరి, భయం,సాహసం కలగలిసిన వాళ్లని ప్రపంచానికి చాటి చెప్పాడు ట్వెయిన్. ప్రకృతితో మమేకమవ్వడం, అన్వేషించడం నేటి పిల్లలు కోల్పోతున్న సహజ లక్షణాలు. చీకటి గుహల్లో నిధుల కోసం వెతికిన టామ్ మనకు ఇదే గుర్తు చేస్తాడు. నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్ఫోన్లకు బందీలైపోతున్న బాల్యానికి టామ్ సాయర్ ఒక తాళంచెవి. వందల ఏళ్లు గడిచినా, సమాజం ఎంత ఆధునీకరించబడినా మనుషుల్లోని అమాయ కత్వం, సాహస ప్రవృత్తి మారవు. అందుకే ‘టామ్ సాయర్’ కేవలం ఒక పుస్తకం కాదు, అది ప్రతి ఒక్కరి లోపల దాగి ఉన్న బాల్యానికి నిలువుటద్దం. ఈ 150వ వేడుకల సందర్భంగా మనలోని ఆ చిలిపి టామ్ సాయర్‌ను ఒకసారి నిద్రలేపుదాం! ఈ నవలను నండూరి రామమోహనరావు (1927–2011) టామ్ మన పక్కింటి పిల్లాడే అన్నంత హాయిగా తెలుగులోకి అనువదించాడు. రచయిత నామిని తన కొడుక్కు టామ్ సాయర్ అని పేరు పెట్టుకున్నాడు. టామ్ ఎంతటి తెలుగువాడో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఈ తిరుపతి టామ్ రచయితగా మారడం ఆ టామ్‌ను కన్నమార్క్ ట్వెయిన్‌కు తగిన నివాళి. -
జగన్నామ మహానాడు!
కవిత్వంలోనూ, జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోతే ఆత్మలోకంలో దివాలా తీసినట్టేనని విఖ్యాత రచయిత చలం రాసిన వాక్యం చాలామంది పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రజా జీవితంలో ప్రకాశిస్తున్నామనుకుంటున్నవాళ్లు కూడా ఎథిక్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్‌ను పూర్తిగా విడిచేస్తే... పైపెచ్చు, డంబాచారపు కోతలకూ, విద్వేషపు కూత లకూ మాత్రమే అంకితమైపోతే, వారు కూడా ఆత్మలోకాల్లో పూర్తిగా దివాలా తీసినట్టే! తెలుగుదేశం పార్టీ వాళ్లు జరుపుకున్న మహానాడు తంతును చూసిన తర్వాత చలం మాట గుర్తు కొచ్చింది. మహానాడు ఆసాంతం యాంత్రికమైన అట్టహాసం తప్ప ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. కూటమి కుహరంలో భయం బయల్దేరిందనీ, ప్రమాద ఘంటారావం మొదలైందనీ మహానాడు సన్నివేశానికి తాత్ప ర్యంగా చెప్పుకోవచ్చు. మహానాడు కంటే ముందే జరిగిన కొన్ని సభల్లో చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మళ్లీ ఒకసారి పొరపాటున ప్రతిపక్షానికి ఓటేస్తారా తమ్ముళ్లూ, అలా చేయబోమని మాటివ్వండని ఆయన ప్రాధేయపడటం దేన్ని సూచిస్తున్నది? పైగా తానే అధికారంలోకి రావాలని ప్రజలంతా పూజలు చేయాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ప్రజలంతా పూజలు చేస్తే తప్ప గట్టెక్కే అవకాశం లేదా? తమ రెండేళ్ల అధికారాన్ని ‘మంచి’ పాలనగా ఎంత ప్రచారం చేసుకున్నా జనం గుర్తించడం లేదన్న శంక వారిలో బయల్దేరింది.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహానాడులో ఆయన ప్రస్తావన 98 సార్లు వస్తే, జగన్మోహన్రెడ్డి నామ స్మరణ మాత్రం 140 సార్లు వచ్చిందట! కారణమేమై ఉంటుంది? ప్రజలను మెప్పించగలిగే ఘనకార్యాలు ఈ రెండేళ్లలో ఏమీలేవా? జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తప్ప రాజకీయంగా జరుగుబాటు కావడం లేదా? డెబ్బయ్ ఆరేళ్ల వయసు, యాభయ్యేళ్ల రాజకీయ జీవితం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన నైపుణ్యం, ముఖ్యమంత్రిగా పదహారేళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. మహానాడులో ఆయన ఉపన్యాసం ఎలా ఉందో గమనించండి.ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎటువంటి ఉపన్యాసాన్ని ఆశించాలి? పైగా పార్టీ గమనాన్ని గమ్యాన్ని సమీక్షించుకునే మహా నాడు వంటి సందర్భంలో వైసీపీని గొడ్డలి పార్టీగా ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ఎక్కడిదీ గొడ్డలి? మనకు తెలిసినంతవరకు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. మరీ గొడ్డలి కథేంటి? వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో చంపారు కనుక, అది వైసీపీ పనేనని జనంతో నమ్మించాలి కనుక గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న వివేకానందరెడ్డిని వైసీపీవాళ్లే బుద్దిహీనత వల్ల చంపించారా? గొడ్డలితో తానే హత్య చేశానని చెప్పినవాడు ఎవరి కనుసన్నల్లో సంచరిస్తున్నాడు? ఏ పార్టీ నాయకులు అతనికి అండదండలిస్తున్నారు? అతనికి పోలీసు రక్షణను, కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి వీఐపీ మర్యాదలు చేస్తున్నదెవరు? అతను అరెస్టు కాకుండా కాపాడిందెవరు? వీటికి సరైన సమాధానాలు దొరికితే గొడ్డలి పార్టీ ఏదో తేలుతుంది.గొడ్డలి మార్కుతో పాటు వైసీపీ మీద ప్రచారం చేయడానికి ఇంకో ఐదారు సూచనలు కూడా చంద్రబాబు చేశారు. ఆ పార్టీ గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేయాలట! గంజాయి మీద ఉక్కు పాదం మోపడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని (ఎస్ఇబి) ఏర్పాటు చేసిందే జగన్ సర్కార్ కావడం ఇక్కడ గమనార్హం. కానీ యధార్థాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీపై నిందాప్రచారం చేయాలని బాబు ఉద్బోధించారు. వైసీపీ కోసం ఆయన ఇంకా కొన్ని బిల్‌బోర్డులు సిద్ధం చేశారు. వాటికి గట్టిగా ప్రచారం చేసిపెట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో ఒకటి వైసీపీలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నదని! బెజవాడ బ్లేడ్ బ్యాచ్ గురించి, కాల్‌మనీ – సెక్స్ రాకెట్ల వ్యవహారం వెనకున్న నాయకుల గురించి జనం ఇప్పటికే మరిచిపోయి ఉంటారని టీడీపీ అధినేత నమ్మకం కావచ్చు.సోషల్ మీడియా సైకో బ్యాచ్, ఫేక్ పబ్లిసిటీ పేటీఎం బ్యాచ్ కూడా వైసీపీ కోసం పని చేస్తున్నాయట! రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననాల కోసం కిరాయి ముఠాలను ఉసిగొలిపిన ట్రాక్ రికార్డు ఎవరికి ఉన్నదో తెలుగు ప్రజకు తెలియనిది కాదు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఈనాడు వేసిన జుగుప్సాకరమైన కార్టూన్లు ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దిగజారుడు విమర్శలు చేయడానికి అసెంబ్లీని సైతం వేదికగా ఉపయోగించుకున్న దెవరు? మెగాస్టార్ చిరంజీవి మీద, ఆయన స్థాపించిన రాజ కీయ పార్టీ మీద విషప్రచారానికి ఒడిగట్టిన ముఠా నాయకులు ఎవరు? తన తల్లిని కూడా అవమానించారని ఎవరి మీద పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా సుదీర్ఘమైనది. ఇక జగన్మోహన్రెడ్డి మీద గత పద్నాలుగేళ్లుగా అత్యంత హేయమైన ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు ప్రచా రాన్ని చేసిందెవరు? ఇప్పుడు మహానాడు వేదికను కూడా ఆ ప్రచారం కొనసాగించడానికే వినియోగించుకున్నారు. హిందూ ధర్మం మీద, ఆలయాల మీద కూడా వైసీపీ వాళ్లు దాడులు చేస్తారని చెప్పాలట! టీడీపీ కార్యకర్తలకు పార్టీ నేత ఆదేశం. ఈ ముద్ర వేయడానికి చాలాకాలం నుంచి టీడీపీ అనుబంధ విభాగాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎనభై శాతానికి పైగా హిందువులు నివసించే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే రాజకీయ పార్టీగానీ, వచ్చిన పార్టీగానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ఆలయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? కామన్సెన్స్ విషయం కదా! అది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం పదహారేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన సేవ కంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ చేసిన సేవలే ఎక్కువ. సెక్యులర్ రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో ఇటువంటి దిక్కుమాలిన చర్చ చేయాల్సి రావడమే దౌర్భాగ్యం.తెలుగుదేశం పార్టీ జగన్నామ మహానాడు ద్వారా 3–జి నాయకత్వం ప్రారంభమైందని చెప్పవచ్చు. కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలో లోకేశ్‌బాబు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలబడ్డారు. నాయకత్వ మార్పు మొదలైనట్టేనని గ్రహించిన నేతలంతా పోటీలుపడి లోకేశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. కొత్త తరంలోనైనా తెలుగుదేశం వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వస్తుందా అని చూసేవారికి ఆశాభంగమే ఎదురైంది. వ్యక్తిత్వ హనన వ్యూహంలో, లేని గొప్పలు చెప్పుకోవడంలో 2–జి కంటే 3–జి నాలుగాకులు ఎక్కువే చదివిందని తేలి పోయింది. జగన్నామ స్మరణే లోకేశ్ ప్రసంగం కూడా! అతడు అనే సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ ఒకటున్నది – ‘అక్క అంబా సిడర్ అయితే నేను బెంజ్, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది లైఫ్‌బాయ్, నేను లక్స్’ అంటుంది.అదే తరహాలో లోకేశ్‌బాబు కూడా జగన్ పార్టీది గొడ్డలి, మాది గూగుల్; జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేశాడు, నేను స్టాన్ ఫోర్డ్లో చదివాను’ అంటూ అథమస్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడు. జగన్ టెన్త్ పేపర్లు లీక్ చేసినట్టు తన కెప్పుడు కల వచ్చిందో మాత్రం చెప్పలేదు. లోకేశ్‌కు స్టాన్ ఫోర్డ్లో ఎండోమెంట్ (డొనేషన్) కోటాలో సీటొచ్చిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాటి మీద లోకేశ్స్పందించి ఉండాల్సింది. విశాఖలో అదానీ డేటా సెంటర్ కోసం అనుమతులు, భూములు ఇచ్చింది జగన్మోహన్రెడ్డి. వ్యాపార భాగస్వామిగా ఇప్పుడు గూగుల్‌ను తెచ్చుకున్నది అదానీ గ్రూప్. గూగుల్ రాకకు చంద్రబాబు – లోకేశ్‌లకు ఎటువంటి సంబంధం లేదు.సినిమాటిక్ పోలికలతో జగన్‌తో సమవుజ్జీగా నిలబడాలని లోకేశ్‌బాబు తంటాలు పడుతున్నట్టున్నారు. అదెట్లా కుదురు తుంది బాబూ... ఆత్మగౌరవం కోసం అప్పట్లో సర్వశక్తి మంతురాలైన పార్టీ అధినేత్రిని ఎదిరించి పార్టీని వదిలేసి ఒంటరిగా జనంలోకి వెళ్లి, మూడు పార్టీల కూటములను ఒక్కడిగానే ఎదురొడ్డి నిలిచిన ధీరుడు జగన్మోహన్రెడ్డి. ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ఇప్పటికీ పొత్తుల్లేకుండా జగన్‌ని ఎదిరించడమంటే గజగజ వణికి పోయే పరిస్థితి కూటమి పార్టీలది. గత పదిహేనేళ్లుగా తండ్రి చాటు బిడ్డగా పొలిటికల్ అప్రెంటిస్‌షిప్ చేసిన అదృష్టం లోకేశ్‌ది. వారసత్వంగా తండ్రి నుంచి అధికారాన్ని అందుకోవ డానికి సిద్ధపడుతున్నారాయన. జగన్ హయాంలో లక్షా ముప్పయ్ వేల సచివాలయ ఉద్యోగాల కోసం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చిన్న కంప్లెయింట్ రాకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను నియమించిన ఘటనను గుర్తు చేసుకోండి. లోకేశ్ విద్యామంత్రిగా నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మీద ఎన్ని వేలమంది ఉద్యోగార్థులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రకటి స్తున్నారో గమనించండి. ట్రాక్ రికార్డు ముఖ్యం... లక్స్ – లైఫ్ బాయ్ పోలికలు కావు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అరాచకమే విధానం
మన విద్యావిధానానికేమైంది? ‘నీట్’ పోటీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌తో మొదలై ఇప్పుడు సీబీఎస్ఈ జవాబుపత్రాల తప్పుడు మూల్యాంకనం బయటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, పోస్టుల్ని అమ్ముకున్నారనీ, అనర్హులకు దొంగ ర్యాంకులు పంచారనీ వెల్లడై ప్రభుత్వం అభాసుపాలవుతుండగానే, అక్కడ ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనం పరమ అధ్వాన్నంగా సాగిందని బట్ట బయలైంది. ‘నీట్’కు ఈసారి 22.79 లక్షలమంది పోటీపడ్డారు.వీరంతా అర్ధాకలితో మాడుతూ నెలల తరబడి పట్టణాల్లో, నగరాల్లో ఉండి కోచింగ్ సంస్థలకు వేలాది రూపాయలు అర్పించి చదువుకున్నవారు. కానీ ప్రశ్నపత్రాలు లీకై అదంతా వ్యర్థమైంది. పరీక్ష రద్దయ్యాక పలుచోట్ల నిరాశా నిస్పృహలతో అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత పన్నెండేళ్లలో 15 రాష్ట్రాల్లో 70 ప్రధాన లీక్‌లు చోటుచేసుకున్నాయని ఒక కథనం చెబుతోంది. అదే నిజమైతే ప్రశ్నపత్రాల వెల్లడి యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనివెనక పెద్ద మాఫియానే ఉండొచ్చు. బట్టబయలైనప్పుడే సమస్య అందరికీ తెలుస్తోంది. నీట్ వివాదం సద్దుమణగకముందే సీబీఎస్ఈ వంతు వచ్చింది. ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు 18 లక్షలమంది రాశారు. నిద్రాహారాలు మాని చదువుకున్న ఈ పిల్లల జవాబు పత్రాలు దిద్దటానికి ‘హైటెక్’ ఆలోచన చేసింది సంస్థ. ఆ పత్రాలను స్కాన్ చేసి వాటి డిజిటల్ ఫైళ్లను అప్లోడ్ చేసి మూల్యాంకనం చేసే విధానాన్ని అనుసరించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) అనే ఈ విధానం గురించి తొలి పరీక్షకు పదిరోజుల ముందు పాఠశాలలకు చెప్పిందంటున్నారు. ఇలాంటి కొత్త విధానంపై పాఠశాల ప్రిన్సిపాళ్లకూ, విద్యార్థులకూ అవగాహన కల్పించాలనీ, అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రత్యామ్నాయం ఆలోచించాలనీ దానికి లేకపోయింది.తీరా ఈ నెల 13న ఫలితాలు వెలువడినప్పుడు లక్షలాదిమంది విద్యార్థులు నిర్ఘాంతపోయారు. 90 శాతం వరకూ మార్కులొస్తాయని నమ్మినవారి స్కోర్ అడ్డంగా పడిపోయింది. అప్పటికే హార్వర్డ్, బ్రౌన్, యేల్, కార్నెల్ వంటి ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించినవారు బావురుమన్నారు. ఈ అరకొర మార్కులతో కనీసం ఆ విశ్వవిద్యాలయాల గేట్లు తాకే అర్హత కూడా ఉండదు మరి! సీబీఎస్ఈలో నిరుడు ఉత్తీర్ణత శాతం 88.39 అయితే, ఈసారి 85.29 శాతానికి పడిపోయింది. 90 శాతంపైగా మార్కులొచ్చినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1921లో అత్యున్నత విద్యాప్రమాణాల కోసం స్థాపించిన ఒక సంస్థ కాలక్రమంలో... అంటే 1962లో ఇప్పుడున్న రూపానికి మారింది. అక్కడ ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ తెచ్చుకుంటే ప్రపంచంలో అత్యున్నత శ్రేణి విశ్వ విద్యాలయాలు రెడ్ కార్పెట్ పరిచేంత ప్రతిష్ఠను సీబీఎస్ఈ సంపాదించుకుంది.ఆ సంస్థ ఇప్పుడెంతగా భ్రష్టుపట్టిందంటే... పాఠశాలలు మొదలై మూణ్ణెల్లు గడిచి, ఒక యూనిట్ టెస్ట్ కూడా అయినాక, మెడమీద కత్తిపెట్టి త్రిభాషా సూత్రం పేరిట హిందీ లేదా సంస్కృతం నేర్చుకుతీరాలని శాసిస్తోంది. అందుకోసం పాఠ్యపుస్తకం కూడా లేదంటే... ఆరో తరగతి పుస్తకం చదవాలంటోంది. పైగా ఆ మార్కుల్ని పట్టించుకోబోనని అభయమిస్తోంది. ఇంతకన్నా అరాచకం ఉంటుందా అని అందరూ అనుకునేలోగానే ఈ ముదనష్టపు మూల్యాంకనం వెల్లడైంది. డీఎస్సీ నిర్వాకం బయటపడ్డాక, అంతా సవ్యంగానే ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దబాయిస్తున్న తరుణంలోనే తాజాగా టెన్త్ మూల్యాంకనం అడ్డదిడ్డంగా సాగిన వైనం బయటపడింది. విద్యార్థులు రాసిన కొన్ని జవాబుల్ని పట్టించుకోకపోవటం, దిద్దినా ఆ మార్కుల్ని పరిగణించకపోవటం వంటి చిత్రాలు చోటుచేసు కున్నాయి. తెలివైన విద్యార్థులు అనుమానం వచ్చి రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తులు చేశాక ఇదంతా బయటికొచ్చింది.పాలన గాలికొదిలిన చోట ఇలాంటి అరాచకాలు జరగటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ...‘నీట్’ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఏమైంది? సీబీఎస్ఈ ఎలా ధ్వంసమైంది? పాలకులు జవాబుదారీ తనంతో వ్యవహరించటం, జరిగే తప్పులకు నైతిక బాధ్యత తీసుకోవటం తప్పనిసర య్యేలా ప్రజలు ఒత్తిళ్లు తెస్తేనే ఈ దుఃస్థితి మారుతుంది. అప్పుడే ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. లేకుంటే అవి కూడా చోద్యం చూస్తుంటాయి. -
ఆత్మస్తుతి – పరనింద
పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలన్నా, వారిని కార్యసాధన దిశగా ఉరక లెత్తించాలన్నా, ఉత్సాహపరచాలన్నా అధినేతకు ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం, తన కార్యాచరణపై స్పష్టత. అది రాజ్యమేలే పార్టీ అయితే ఇవి మాత్రమే సరిపోవు. ఆ పార్టీ ప్రభుత్వం అప్పటికే ప్రజల అభ్యున్నతికోసం చాలా చేసివుండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలోనూ, ఇప్పుడూ దేన్నీ సక్రమంగా చేసిన చరిత్ర లేదు. విశ్వసనీయత మొదటికే లేదు. అందుకే రెండురోజుల ‘హైబ్రిడ్’ మహానాడును ప్రారంభిస్తూ బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా పరనింద, స్వోత్కర్ష దండిగా ఉన్నాయి. చేసిందేమీ లేదు గనుక... చెప్పుకోవడానికేమీ మిగల్లేదు మరి! గత ఎన్నికలకు ముందు భారీ వాణిజ్య ప్రకటనలతో, ఎస్ఎంఎస్లతో, ఊరూరా ఉపన్యాసాలతో జనాన్ని ఊదరగొట్టారు! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఊరించారు. సంతకాలతో బాండ్లు రాసిచ్చారు. తీరా అమలుదగ్గరకొచ్చేసరికి అలవాటు ప్రకారం దగా చేశారు. ఆడబిడ్డ నిధి పేరిట ఆడవాళ్లందరికీ నెలకు రూ. 1,500 చొప్పున ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఆ పద్దుకింద ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 36,000. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 ఇస్తామన్న హామీ కింద ఇంతవరకూ ఒక్కొక్కరికి రావాల్సిన మొత్తం రూ. 72,000. ఈ రెండు పథకాలకూ గుండుసున్నా చుట్టగా... మిగిలినవి అరకొరగా అమలు చేస్తూ వంచిస్తున్నారు. యాభైయ్యేళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ. 4,000 చొప్పున అందిస్తామని వాగ్దానమిచ్చి, వైఎస్ జగన్ హయాంలో ఉన్న పింఛన్‌దార్లు 66,34,372 మందిలో 6,23,079 మందికి ఎగనామం పెట్టారు. ఈ రెండేళ్లలో ఒక్కొక్కరికి బకాయిపడ్డ మొత్తం రూ. 96,000. మహిళల కోసం తీసుకొస్తామన్న ఉచిత బస్సు పథకాన్ని తాత్సారం చేయటమేకాక, 16 కేటగిరీ బస్సుల్లో కేవలం అయిదింటికే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని చెబుతున్న నోటితోనే వాటిల్లో ఉచితం ఉండబోదని సెలవిస్తున్నారు. అంతేకాదు... ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఆపై 20 లక్షల మందికి కోతపెట్టి అమలు ప్రారంభించారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కోరకం మొత్తం వేస్తూ మోసగిస్తున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ అంటూనే తొలి ఏడాది మొండిచేయి చూపారు. రెండోఏడాది 53.52 లక్షలమంది రైతుల్లో 7 లక్షలమందికి కోతపెట్టి అరకొరగా అమలుచేశారు. రెండేళ్లకూ రూ. 40,000 ఇవ్వాల్సి వుండగా, రూ. 14,000తో సరిపెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం వగైరాలన్నీ ధ్వంసం చేశారు. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పర్యవసానంగా వస్తున్న సంస్థలను తమ ఖాతాలో వేసుకోవటం, ఉన్నవాటిని తరిమే యటం బాబు ‘పారిశ్రామిక విధానం’! ఇన్ని లొసుగులుండబట్టే మహానాడును ‘హైబ్రిడ్’ చేశారు. పశ్చిమాసియా యుద్ధంవల్ల పొదుపు పాటించదల్చుకుని ఈ మోడల్ తీసుకొచ్చామని పైకంటున్నా... కార్య కర్తలను ఒకచోట పోగేస్తే, తమ గంభీరోపన్యాసాలు విని ఊరుకోక క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో, జనం ఎలా ఛీకొడుతున్నారో ఏకరువుపెట్టే ప్రమాదం ఉందని గ్రహించటంవల్లే ఈ ఎత్తుగడ! కానీ తానొకటి తలిస్తే జరిగింది వేరొకటి. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షలమంది వర్చువల్‌గా పాల్గొన్నారని టీడీపీ గప్పాలు కొట్టుకుంటుండగా చాలాచోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చి ఆ పార్టీ వాలకమేమిటో బట్టబయలైంది. నియోజకవర్గానికి 7 నుంచి 10 కేంద్రాల్లో దీన్ని నిర్వహించటంవల్ల స్థానిక నేతలకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 15 లక్షలు చేతిచమురు మాత్రం వదిలింది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కోటా మరో పెద్ద దగా. జగన్ హయాంలో ‘అమ్మ ఒడి’ మొదలుకొని ఉద్యోగాలవరకూ... పంచాయతీరాజ్ సంస్థలు మొదలుకొని నామినేషన్ పనుల వరకూ అన్నిటా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చిన వైనం తండ్రీ కొడుకులు మరిచివుంటారు. నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. గాలి మాటలతో, వెన్నుపోట్లతో, రెడ్‌బుక్ పాలనతో, హద్దులెరుగని దూషణలతో బాబు సాధించేదేమీ ఉండదు. పేలవంగా ముగిసిన వర్చువల్ మహానాడు దీన్నే చాటుతోంది. -
క్వాడ్‌లో మళ్లీ చలనం
ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఆరంభంనుంచి క్వాడ్ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్‌ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్‌ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్‌లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. క్వాడ్ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు భారత్ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్‌లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. -
డీఎస్సీ స్కాంపై నోరెత్తరేం?
అధికారంలోవున్న ప్రతిసారీ పదో తరగతి మొదలుకొని ప్రభుత్వోద్యోగాల భర్తీ వరకూ జరిగే ఏ పరీక్షనూ ఎన్నడూ సక్రమంగా నిర్వహించటం చేతకాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కూడా ఆ ‘ఘనత’ సొంతం చేసుకున్నారు. డీఎస్సీ నిర్వహణలో పూర్తిగా ఫెయిలైనా ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తున్నారు. అధికారంలో కొచ్చాక తొలి సంతకం పెట్టి, నిరుడు ఆర్భాటంగా జరిపించిన డీఎస్సీ పాపాలపుట్ట బద్దలై నాలుగు రోజులవుతున్నా ఆయనగానీ, విద్యాశాఖను చూస్తున్న ఆయన కుమారుడు లోకేశ్‌గానీ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పేపర్‌లీక్ మొదలు కొని స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోవటంవరకూ ఆరోపణలు వచ్చిపడుతున్నా తండ్రీ కొడుకులు సంజా యిషీ ఇవ్వకపోవటం, చడీచప్పుడూ లేకుండా కొందరిని బాధ్యతల నుంచి తప్పించటం, ర్యాంకుల్ని పక్కనç ³డేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు... పార్టీ సంస్థాగత అంశం అంతకన్నా కాదు. జవాబు దారీతనాన్ని గుర్తెరిగి సంజాయిషీ చెప్పి తీరాల్సిన అతి ముఖ్యమైన విషయం.జీవితంలో ఏనాడైనా కష్టపడి చదివుంటే, నిజాయితీగా ఎదిగుంటే పరీక్షలంటే ఏమిటో, అభ్యర్థులుపడే ఇబ్బందులెలా ఉంటాయో తెలిసేది. దశాబ్దాలుగా అనుసరిస్తున్న నియమ నిబంధనలకు మంగళం పాడి, కాసులతో తూకంవేసి పోస్టులు భర్తీ చేశారని నిరుద్యోగులు ఆక్రోశిస్తున్నారు. డీఎస్సీ నిర్వహణలో, ఎంపికలో అనేక లోపాలున్నాయంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయిస్తే ప్రభుత్వ తీరుపై ధర్మాసనం నిరుడు అక్టోబర్‌లోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకటికన్నా ఎక్కువ ఉద్యో గాలు పొందిన వారిని ఉన్నత అర్హతగల ఉద్యోగానికి ఎంపిక చేయాలనీ, ఇది రెండు నెలల్లో పూర్తి కావాలనీ నిరుడు ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలుగల వర్తమానంలో పోటీ పరీక్షలపై లక్ష లాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. స్వస్థలాలనుంచి దూరప్రాంతాల కెళ్లి కోచింగ్ పేరిట వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తినీతినకా కష్టాలూ పడుతూ రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. తమ పిల్లలకు ఎలాగైనా అవకాశం దక్కాలంటూ తల్లిదండ్రులు కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటు న్నారు. పరీక్షలు బాగా రాశామనీ, అవకాశం వచ్చితీరుతుందనీ ఎదురుచూసే వారికి శరాఘాతంగా పోస్టులన్నీ అంగడి సరుకుగా మార్చేస్తే ఏమనాలి? పేరుకు ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకున్నా ఈసారి కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, కావాలని ఆలస్యంచేసి ఇచ్చిన ఈ కొత్త నోటిఫికేషన్ కనీవినీ ఎరుగని ‘మెగా’ద్భుతమంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా నిర్వాకం ఇలా తగలబడింది. ఈసారి ఫలితాలు పారదర్శ కంగా లేవు. కేవలం సెలెక్టయినవారి జాబితాతో సరిపెట్టారు. ఎంపికైనవారు వేరే అవకాశాలొచ్చి వెళ్లినప్పుడు, ఒకటికి మించి ఉద్యోగావకాశాలొచ్చిన వారున్నప్పుడు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎంపికైన వారికి ఫోన్లో ‘రారమ్మ’ని ఆహ్వానించటం, కొన్ని రోజులు గడిచాక రావొద్దని చెప్పడం ఒక ప్రహసనం. కొత్తగా వచ్చిన టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహిస్తూ, అందులో ఎంపిక కానివారికి చోటిచ్చి, అటుపై వారిని ‘టీచర్లు’గా ముద్రేసిన వైనం మరో చిత్రం. దేశం మొత్తం ‘నీట్’ పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నది. కానీ ఈ డీఎస్సీ కుంభకోణం ముందు అది పిపీలకం. అక్కడ ప్రశ్నపత్రాలు లీకైతే... ఇక్కడ ప్రశ్నపత్రాలు మొదలుకొని పోస్టుల భర్తీ వరకూ అడుగడుగునా అవకతవకలే. ఫోన్లలో బేరసారాలూ, స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకాలు, మహిళా అభ్యర్థులతో అసభ్య చాటింగులు పాలకుల హైన్యాన్ని చాటుతున్నాయి. జగన్ పాలనలో గ్రామ సచివాలయం మొదలుకొని ఉన్నతో ద్యోగాలవరకూ... టెన్త్ మొదలుకొని పీజీ పరీక్షలవరకూ ఎలాంటి అక్రమాలకూ తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించినప్పుడు కూటమి సర్కారుకు ఏమైంది? లోకేశ్‌ను బర్తరఫ్ చేసి, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపితే అసలు దొంగలు బయటికొస్తారు. -
చమురు ధర దిగొచ్చేదెలా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా హార్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్‌కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్‌ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్‌ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. -
సాహిత్యమూ శాస్త్రమూ
‘సహితస్య భావః సాహిత్యం’ అని సాహిత్యానికి నిర్వచనం. శబ్దార్థాల సుందర సమన్వ యమే సాహిత్యం. ‘శాసనాత్ శాస్త్రం’ అని శాస్త్రానికి నిర్వచనం. శాస్త్రం – ఏదైనా విషయాన్ని బోధించి, నియంత్రించి, మార్గనిర్దేశం చేస్తుంది. సాహిత్యం మనసును తీర్చిదిద్దు తుంది. శాస్త్రం మేధస్సుకు పదును పెడుతుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర పూరకాలు. ‘సాహిత్యం, సీతాకోక చిలుకలు– ఈ రెండు మాత్రమే మనిషికి తెలిసిన తీయని అభిరుచులు’ అన్నాడు రష్యన్– అమెరికన్ రచయిత వ్లాదిమిర్ నబొకోవ్. సాహిత్యాన్నీ, సీతాకోక చిలుకలనూ ఒకే గాటన కట్టాడంటే, అతడికి ఎంతటి సౌందర్యాభిరుచి ఉండి ఉండాలి?! సాహిత్యాన్ని యాంత్రికంగా చదవడం, సాహిత్యంలోని సమస్త ప్రక్రియలను అధ్యయనం చేయడం, సాహిత్యాన్ని గురించి అనర్గళంగా ఉపన్యాసాలు చేయడం మాత్రమే చాలదు; సాహిత్యాన్ని ఆస్వాదించగలిగే లక్షణం కూడా ఉండాలి. అదే లేకపోతే, ఎంత సాహిత్యం చదివినా దండగే! సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పండిత ప్రకాండుల్లో చాలామందికి సాహిత్యాన్ని ఆస్వాదించడం చేతకాదు. అలాంటి వారిని ఉద్దేశించే, ‘అతనికి సాహిత్యం గురించి సమస్తం తెలుసు, సాహిత్యాన్ని ఎలా ఆస్వాదించాలో తప్ప’ అని చెణుకు విసిరాడు అమెరికన్ రచయిత జోసెఫ్ కెల్లర్. సాహిత్యం మనోవ్యాపారం. సాహిత్యం మనిషికి విలువలు నేర్పుతుంది. సమాజాన్ని అర్థం చేసుకోవడం నేర్పుతుంది. జీవితం పట్ల అవగాహన పెంచుతుంది. సాహిత్యం వల్ల భాషా నైపుణ్యం మెరుగుపడుతుంది. ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగు తాయి. శాస్త్రం బుద్ధివ్యాపారం. శాస్త్రం మనిషికి తార్కికత నేర్పుతుంది. వాస్తవికతను నేర్పుతుంది. ప్రయోగాత్మక దృక్పథాన్ని అలవరుస్తుంది. సాంకేతిక పురోగతికి పునాదులు వేస్తుంది. శాస్త్ర సాహిత్యాలు పరస్పర ప్రేరకాలు కూడా!ప్రపంచ సాహిత్యాన్ని పరిశీలిస్తే, సాహిత్యం శాస్త్ర పురోగతికి ప్రేరణ కలిగించిన ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనిషి స్వేచ్ఛాపిపాసి. మనిషి ఊహలకు రెక్క లొచ్చి, ఆకాశం అంచుల వరకు విహరిస్తాయి. స్వేచ్ఛగా ఆకాశంలో విహరించడానికి మనిషికి రెక్కలుంటే బాగుండు, కనీసం రెక్కల వాహనం ఏదైనా అందుబాటులో ఉండే బాగుండు అనే ఆలోచనలు పురాణకాలం నుంచే ఉన్నాయి. రామాయణంలోని పుష్పక విమానం మనకు తెలిసినదే! గ్రీకు పురాణాల్లో డెడలస్ అనే శిల్పి, అతడి కొడుకు ఇకారస్ దురదృష్టవశాత్తు చెరసాల పాలవుతారు. బందిఖానా నుంచి తనతో పాటు తన కొడుకును తప్పించడానికి డెడలస్ పక్షి ఈకలు, తేనెటీగల మైనం ఉపయోగించి మనిషి తొడుక్కోగల రెక్కలు తయారు చేస్తాడు. పురాణకాలం నాటి ఈ ఊహలు శాస్త్ర పరిశోధన లకు ప్రేరణనిచ్చాయి. తర్వాతి కాలంలో ఇటాలియన్ బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో ద వించీ ‘ఆర్నిథాప్టర్’ అనే ఎగిరే యంత్రాన్ని రూపొందించాడు. అది పెద్దగా ఫలించ లేదు. ఆ తర్వాత అమెరికన్ ఇంజినీర్లు రైట్ సోదరులు విమానాన్ని రూపొందించి, మనిషి ఊహలకు భౌతికంగా రెక్కలివ్వడంలో కృతకృత్యులయ్యారు. సాహిత్యమే లేకుంటే, మనకు విమానాలు అందుబాటులోకి వచ్చేవేనా?!ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మనిషి చంద్రుడిపై కాలు మోపడానికి శతాబ్దం ముందే, ఆ ఊహను ఫ్రెంచ్ సాహితీవేత్త జూల్స్ వెర్న్ తన నవల ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ద మూన్’లో రాశాడు. ఇంగ్లిష్ రచయిత హెచ్‌జీ వెల్స్ అణ్వాయుధాల ముప్పును తొలి అణుబాంబు దాడికి మూడు దశాబ్దాలకు ముందే తన ‘ద వరల్డ్ సెట్ ఫ్రీ’ నవలలో ఊహించాడు.శాస్త్ర పరిణామాన్ని సాహిత్యం ఊహించడం కొత్తకాదు గాని, సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే శాస్త్ర పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఇటాలియన్ కవి డాంటే కావ్యం ‘డివైన్ కామెడీ’లో భూగర్భశాస్త్ర విశేషాల గురించి ఇటీవల వియన్నాలో జరిగిన యూరోపియన్ జియోసైన్సెస్ యూనియన్ జనరల్ అసెంబ్లీలో ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేయడం ఇందుకు ఒక తాజా ఉదాహరణ. ‘డాంటే సాహితీవేత్త మాత్రమే కాదు, భూభౌతిక శాస్త్రవేత్త కూడా!’ అని మార్షల్ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ టిమోతీ బర్బరీ ఈ పరిశోధన పత్రంలో వ్యాఖ్యానించడం విశేషం. ప్రపంచంలో శాస్త్ర సాహిత్యాల సమన్వయానికి ఇదొక ముందడుగు. -
మంటలు రేపుతున్న మనువాద కూటమి
దేశవ్యాప్తంగా విద్వేషపు నెగళ్లను ఎగదోస్తున్న మనువాద రాజకీయాల గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ సంఘ జీవనంలో అగ్గి రాజేస్తున్న నయా మనువాద రాజకీయం గురించి! ముంచుకొస్తున్న పెను ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. మనుధర్మశాస్త్రం ప్రతులను దాదాపు వందేళ్ల కిందనే అంబేడ్కర్ మహాశయుడు దహనం చేశాడని మనం చరిత్రలో చదువుకున్నాము. పుట్టుక ద్వారానే మనుషుల్లో గొప్పోళ్లూ, అల్పులూ అనే తేడాలుంటాయనే వర్ణ విభజన అది చేసింది కనుక అంబేడ్కర్ ఆ అధర్మ ‘ధర్మాన్ని’ దహనం చేశారు.పుట్టుక ఆధారంగా హెచ్చు తగ్గులుండే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను మనుస్మృతి ప్రబోధించింది. పై మెట్టు పైనున్న వారికి గొప్ప బాధ్యతలు, కింది మెట్టుపైనున్న వారికి అల్పకార్యాలనూ అప్పగించింది. విద్యాగంధాన్ని కొందరికే పరిమితం చేసింది. అన్ని వర్గాల్లోని స్త్రీలపైనా అవమానకరమైన ఆంక్షలను విధించింది. స్త్రీలకు స్వతంత్రంగా ఆలోచించే అర్హత లేదని శాసించింది. ఇటువంటి అమానవీయ భావనలతో కూడిన మనుస్మృతిని రాజ్యాంగ రచనలో ఉపయోగించుకోవా లని అప్పట్లోనే డిమాండ్ చేసినవారూ లేకపోలేదు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ఆరెస్సెస్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ దానిపై సంపాదకీయాన్ని రాసింది. ప్రాచీన భారతీయ న్యాయ సంప్రదాయాలను ముఖ్యంగా మను స్మృతిని రాజ్యాంగం విస్మరించడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ రకమైన అభ్యంతరాలను లెక్కచేయకుండా ప్రజా స్వామ్యం, పౌరహక్కులు, సర్వమానవ సమానత్వాలు పునాదు లుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినా సరే మారువేషాలతో ఏమార్చడానికి మనువాదం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడది మతం ముసుగేసుకొని ముందుకొస్తున్నది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యన ముగ్గురు పిల్లల్ని కంటే ముప్ఫై వేలిస్తా, నలుగుర్ని కంటే నలభై వేలిస్తా అని చాటింపు వేస్తున్నారు. దీనిపై పౌర సమాజం తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ సహేతుకమైన విమర్శల్లో ఎక్కువ భాగం ఆర్థికపరమైనవి. మహిళా సాధికారత కోణంలో ముందుకొచ్చిన ఒక విమర్శ ఆలోచించదగ్గది. మహిళల్ని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చంద్రబాబు పరిగణిస్తున్నారా అని కొందరు ప్రశ్నించారు. పనిచేసే వయసులో ఉన్న మహిళలు పదిహేనేళ్ల కాలాన్ని నలుగురు పిల్లల్ని కనడం వారిని పెంచడం కోసమే అంకితం చేయాలనడం ఎంతవరకు సమంజసం? మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక పదేళ్లు వెనక్కి వెళితే మహిళల పట్ల బాబు వైఖరేమిటో స్పష్టం చేసే ఉదాహరణ మనకు దొరుకుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో కలకలం సృష్టించింది. ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’’ అని ఆయన మాట్లాడారు. ఆడపిల్లతో పోల్చితే మగ పిల్లాడిని కోరుకోవడమే సహజమన్న భావన ఆయన వ్యాఖ్యల్లో ధ్వనించింది. నాటి అభిప్రాయానికి కొనసాగింపుగానే నేడు పిల్లల్ని కని పెంచే యంత్రాలుగా మహిళల్ని పరిగణించడమని అర్థం చేసుకోవాలి. ఓట్ల కోసం మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి, గెలిచిన తర్వాత తూచ్ అనడం కూడా మహిళా చైతన్యం పట్ల ఆయనకున్న చిన్న చూపునకు నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చేసి ఇప్పుడా సంస్థనే ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టే పనిలో ఉన్నారు.మహిళల విషయం మాత్రమే కాదు. దళితుల విషయంలోనూ, బలహీన వర్గాల ప్రజల విషయంలోనూ చంద్రబాబుదీ, ఆయన పార్టీదీ, కూటమిదీ అదే ధోరణి. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బహిరంగంగానే నాడు ప్రశ్నించారు. నిచ్చెనమెట్ల హిందూ సమాజంలో చివరి మెట్టుమీద దళితులు ఉంటారనీ అలా ఉండాలనే మనువాద మనోగతం వల్లనే ఆయనావిధంగా మాట్లాడగలిగారు. ఆయన పార్టీ నేత లదీ, కూటమిలోని ఇతర నేతలదీ అదే అభిప్రాయం. దెందు లూరు ఎమ్మెల్యే అప్పట్లో ఒక బహిరంగ సభ వేదికపై నుంచే ‘మీరంతా దళితులు, మీకెందుకురా రాజకీయాలు, అవన్నీ మేం చూసుకుంటాం’’ అన్న మాటల్ని కూడా మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయ’రంటూ ఈసడించుకోవడాన్ని కూడా చూశాము.ఇప్పుడీ ధోరణి మరింత ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటున్నది. సామాజిక అశాంతిని సృష్టించడానికి సన్నద్ధ మవుతున్నది. దళితులపై క్రైస్తవులనే ముద్రవేసి వారిని వేటాడే పనిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు నిమగ్న మయ్యారు. టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీతో పాటు కూటమి పార్టీల నేతలనుద్దేశించి ఆయన మాట్లా డిన ఆడియోలు బయటకొచ్చాయి. ‘‘ఎన్నికల్లో పోటీ చేయాలను కుంటున్న దళితులను ఓ కంట కనిపెట్టండి. వాళ్లు చర్చికి వెళ్తు న్నారా, దేవాలయాలకు వెళ్తున్నారా తెలుసుకునేందుకు నిఘా పెట్టండి. వాళ్ల తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరిగాయో శ్మశానాల దగ్గరికి వెళ్లి తెలుసుకోండి. వారి వివాహాలు ఏ పద్ధతిలో జరిగాయో తెలుసుకోండి...’’ ఇలా సాగుతున్నాయి ఆయన ప్రబోధాలు.ఈ రకమైన నిఘా, వారి జీవితాల్లోకి తొంగిచూడటం, వారు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడం కిందకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కోటిమందికి పైగా ఉన్న దళితులను రెండో తరగతి పౌరులకింద జమకట్టే ధోరణిగా దీన్ని భావించవలసి ఉంటుంది. మొత్తం దళిత సమాజమే తీవ్రమైన అశాంతికి లోనయ్యే పరిస్థితిని కూటమి కల్పిస్తున్నది. రఘరామ కృష్ణంరాజు తన అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ధోరణికి మాట మాత్రంగానైనా అడ్డు చెప్పే ప్రయత్నం ఏ కూటమినేతా ఇంతవరకూ చేయలేదు. దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ లుగా ప్రయోజనం పొందుతున్నారనేది రఘురామకృష్ణంరాజు అభియోగం. అందుకు వీల్లేదని చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఆయన ఉదహరిస్తున్నారు. చింతాడ ఆనంద్ కులపరంగా దళిత వర్గానికి చెందినవాడు. క్రైస్తవం స్వీకరించి పాస్టర్‌గా మారాడు. అగ్రకులానికి చెందిన వారు ఆయన్ను కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారని అత్యాచార నిరోధకచట్టం కింద కేసు పెట్టాడు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకిస్తూ క్రైస్తవ మతంలోకి మారినందువలన అత్యాచార నిరోధక చట్టం ఆనంద్‌కు వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా టెక్నికల్ తీర్పు. తన నివాస ప్రాంతంలో ఆనంద్ కులపరంగానే గుర్తింపు పొందుతున్నప్పటికీ, కులపరంగానే దూషణకు, దౌర్జ న్యానికి గురైనప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయన మతాన్నే సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకున్నది. ఆయన సామాజిక గుర్తింపును నిరాకరించింది.ఈ తీర్పును ఆధారం చేసుకొనే దళితల వేట కోసం రఘు రామ టాస్క్‌ఫోర్స్ ప్రారంభమైంది. చర్చిలో ప్రార్థనలు చేసే వారందరినీ ఈ టాస్క్‌ఫోర్స్ క్రైస్తవుల జాబితాలో వేస్తుందన్న మాట! దళితులు అత్యధిక సంఖ్యలో చర్చికి వెళ్తున్న మాట వాస్తవమే. ఇందులో దాపరికం ఏమీలేదు. అందుకు కారణాన్ని కూడా వారు చెబుతున్నారు. హిందూ సమాజంలోని పెత్తందారీ శక్తులు దళితులకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన రోజుల్లో బ్రిటిష్ వాళ్లు పెట్టిన చర్చిలు వారికి స్వాగతం పలికాయి. ఆత్మ గౌరవం కోసం, ఆరాధన కోసం వారు అక్కడకు వెళ్లడం ప్రారంభించారు. అది సంప్రదాయంగా నేటికీ కొనసాగుతున్నది. అయినా హిందూ సమాజ స్రవంతిలో ఉన్నవాళ్లు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తే చర్చికి లేని అభ్యంతరం హిందూత్వ టాస్క్ ఫోర్స్‌లకు ఎందుకు? హిందూ సమాజాంలో కొన్ని లక్షలమంది షిర్డీ సాయి మందిరాలకు వెళ్తారు. వాళ్ల మీద కూడా ఆంక్షలు పెట్టే ఆలోచన వుందా? సాయిబాబా హిందువు కాదు మరి!పెళ్లి, చావు వంటి సందర్భాల సంగతి కూడా అంతే! హిందూ పద్ధతిలో నిర్వహించడానికి ఆనాడు అయ్యవార్లు మా వాడలకు రాలేదు, ఆత్మగౌరవం కోసం ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించాము, అదే ఇప్పుడొక సంప్రదాయంగా స్థిరపడిందని దళితులు చెబుతున్నారు. హిందువుల్లో మంగళసూత్రధారణ జరిగితేనే, జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్లి. లేకుంటే కాదా? ఐదారు దశాబ్దాల కింద ఆంధ్ర ప్రాంతంలో హేతువాద, కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో కొన్నివేల స్టేజీ పెళ్లిళ్లు జరి గాయి. వాటిలో మంగళసూత్రధారణ లేదు, బ్రాహ్మణ పండి తుడూ లేడు. ఇప్పుడా పెళ్లిళ్లన్నింటినీ రద్దు చేద్దామా? మరణా నంతరం జరిగే అంత్యక్రియల్లో హిందూ సమాజంగా గుర్తించే వాళ్లలోనే అనేక తేడాలున్నాయి. శవాన్ని పూడ్చి పెట్టినవాళ్లంతా క్రైస్తవులే అనే ముద్రను ఎట్లా వేస్తారు?చర్చికి వెళ్లే వాళ్లందరి మీదా క్రైస్తవ ముద్ర వేయడం ఒక అంశం. అంతకంటే ముఖ్యమైన విషయం క్రైస్తవ మతం స్వీకరించిన దళితుల ఎస్సీ హోదాను ఎందుకు కోల్పోవాలి అన్నది. రిజర్వేషన్ల విషయంపై స్పష్టత కోసం 1950లో జారీచేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బౌద్ధంలోకి, సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఉంటుంది. కానీ, క్రైస్తవంలోకీ, ఇస్లామ్లోకీ మారిన వారికి ఈ హోదా రద్దవుతుందని ఉన్నది. దీని ఆధారంగానే ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మతాల్లో అంటరానితనం లేదు కనుక, అందులోకి మారిన వెంటనే వారి సామాజిక హోదా మాయమైపోతుందన్న అంచనాతో క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులుగా వాటిని సామాజికవేత్తలు పరిగణిస్తున్నారు.మతం మారినా షెడ్యూల్డ్ తెగల వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. వారి ఎస్టీ హోదా కొనసాగుతుంది. అగ్రకులాల వారు ఎవరైనా క్రైస్తవం స్వీకరిస్తే, వారికి ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లకు అర్హత వుంటే ఆ సౌకర్యం నిక్షేపంగా కొనసాగుతుంది. దళితులపై మాత్రమే ఈ వివక్ష ఎందుకని ఆ వర్గాల వారితోపాటు పలువురు ఇతర మేధావులు కూడా ప్రశ్నిస్తు న్నారు. 2004లో ఏర్పడిన రంగనాథ్ మిశ్రా కమిషన్ క్రైస్తవ/ ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని చెప్పింది. ఆ కమిషన్ రిపోర్టు ఆమోదానికి నోచు కోలేదు. మతం మారిన దళితులను ఎస్సీలుగా గుర్తించాలని పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది.మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చే కులం పోదు అనేది ఒక వాస్తవికత. అంతరాలతో కూడిన హిందూ సమాజంలోనే అంతర్భాగంగా వారి జీవితం కొనసాగుతున్నది తప్ప, దాన్ని విడిచిపోయే పరిస్థితి ఉండదు. ఆ సమాజంలో చివరి మెట్టు మీద నిలబడినందున లభిస్తున్న అవమానాలను భరిస్తూ, అందాల్సిన అవకాశాలకు మాత్రం దళితులే ఎందుకు దూరం కావాలనే ప్రశ్న తలెత్తుతున్నది. దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన కారంచేడు హత్యాకాండనే తీసుకుందాము. దళితులు మంచినీళ్లు తెచ్చుకునే చెరువులో అగ్రకులం వారు పశువుల్ని కడగడాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగినందుకు ‘దళితులకు ఇంత ధైర్యమా’ అనే కావరంతో అగ్రకులం వాళ్లు దాడి చేశారు. తరిమి తరిమి వేటాడారు. ఎనిమిదిమంది చనిపోయారు.చనిపోయిన వారిలో అబ్రహం, మోషా, యేషువా, వందనం వంటి క్రైస్తవ పేర్లున్నాయి. పశువులు కడగడాన్ని ప్రశ్నించిన మహిళ పేరు సువార్త. వీరికి క్రైస్తవ పేర్లున్నాయి కాబట్టి వీరి సామాజిక హోదా మారినందున తాము దాడి చేయ లేమని కులోన్మాదులు వెనక్కు పోలేదు. దళితులుగానే పరిగణించి వేటాడారు. మతం మారినా దళితుల సామాజిక హోదా మారలేదు అనడానికి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా సుప్రీం తుదితీర్పు రావలసే ఉంది. కేంద్రం నియమించిన బాలకృష్ణన్ కమిషన్ నివేదిక అందవలసే ఉన్నది. ఈలోగానే ఆనంద్ కేసులో వచ్చిన తీర్పును ఆయుధంగా చేసుకొని కోటిమందిని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టింది. ఈ అంశమే కాదు, తిరుమల లడ్డూ వివాదం దగ్గర్నుంచి కడపలోని టిప్పు సుల్తాన్ సర్కిల్ దాకా సాంఘిక విభజనను సృష్టించి మెజారిటీ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటడానికి ఈ నయా మనువాద కూటమి ప్రమాదకర క్రీడకు తెరతీసింది. ఈరోజు (శనివారం) సైతం చంద్రబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షాన్ని ఆడిపోసుకున్నారు. ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు చేశారు... రుజువులేమిటి అన్న దానితో పనిలేదు. ఒకటికి వందసార్లు చెప్పాలి. జనం పుర్రెల్లోకి కిర్రెక్కించాలి. విభజించి పాలించాలి... ఇదే ఎజెండా!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కాలుష్యంపై సమితి పోరు
వాతావరణ స్థితిగతులు మారి, పెను ముప్పు ముంచుకొస్తున్నా చాలా దేశాలు కళ్లు మూసుకున్నాయని గురువారం వాతావరణంపై జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తేటతెల్లం చేసింది. నిరుడు జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వాతావరణంపై వెలువరించిన తీర్పును సమర్థిస్తూ చేసిన తీర్మానానికి 144 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. కానీ శిలాజ ఇంధనాలతో, తప్పుడు అభివృద్ధి నమూనాలతో కాలుష్యానికి కారణమవుతున్న అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మన దేశంతోపాటు 28 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 2015 నాటి పారిస్ ఒడంబడిక వివిధ దేశాలు ఏమేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలో నిర్దేశించినా అదంతా స్వచ్ఛందంగా అమలు చేసేది మాత్రమే. కానీ తాజా తీర్మానంతో ఆ అమలు చట్టపరమైన విధిగా మారింది. అయితే దాన్ని నిర్వర్తించమని ఒత్తిడి తెచ్చేవారెవరు?వాతావరణ మార్పులకు దారితీసే విధానాలను అవలంబించటం చట్టవిరుద్ధమనీ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉద్గారాలను తగ్గించి, తన పౌరులకూ, ఇరుగు పొరుగు దేశాలకూ ముప్పు ఏర్పడకుండా చూడాల్సిన కనీస బాధ్యత ప్రతి దేశానికీ ఉంటుందనీ ఐసీజే తన తీర్పులో చెప్పింది. లాభార్జనపై మాత్రమే దృష్టి పెట్టే దేశాలవల్ల ప్రజలజీవించే హక్కు, ఆరోగ్యం, ఆహారం, ఇతరేతర జీవనప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తుచేసింది. దురదృష్టమేమంటే ఐసీజే తీర్పుల్ని పాటించితీరాలన్న నియమం లేదు. అవి కేవలం నైతికబాధ్యతను మాత్రమే గుర్తుచేస్తాయి.ఆయా దేశాల ప్రజలు తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఇతరత్రా మార్గాల్లో చర్యలకు అవకాశం లేదు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకూ ఇదే వర్తిస్తుంది. ఏడాది కాలవ్యవధిలో పాకిస్తాన్, కాంగో, ఆస్ట్రియా, మధ్య యూరొప్ దేశాల్లో భారీ వరదలు సంభవించాయి. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ ఈ స్థాయి వరదలు రాలేదని చెబుతున్నారు. అమెరికాలో కూడా మధ్య, దక్షిణ రాష్ట్రాలు రికార్డు స్థాయిలో టార్నెడోలు చవిచూశాయి. వేలాది ఇళ్లు నేలమట్టంకాగా, జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. పసిఫిక్ ద్వీపకల్ప దేశాలది తీరని వ్యథ. ముఖ్యంగా వనౌటు, తువాలు దేశాలకు ప్రకృతి వైపరీత్యాల సంగతలావుంచి అసలు తమ భూభాగమే కనుమరుగైపోతుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే అక్కడి భూగర్భ జలాలు ఉప్పగా మారి, తాగునీరు లభ్యత పడిపోయింది. వ్యవసాయం సాగక జనం వలసపోతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎల్‌నినో అన్ని దేశాలనూ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనీ, కరువుకాటకాలు, పెను వర్షాలు, వరదలు జనావాసాలను ముంచెత్తనున్నాయనీ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళానికి ఉత్తర భాగంలో ఉండటంవల్ల నార్వే, ఫిన్లాండ్, స్వీడన్వంటి స్కాండినేవియన్ దేశాలకు వేడి బెడద పెద్దగా ఉండదు. వీటికి ప్రామాణికమైన విపత్తు నిర్వహణ వ్యవస్థలుండటంవల్ల వాతావరణ మార్పుల్ని తట్టుకోగలుగుతున్నాయి. స్విట్జర్లాండ్, డెన్మార్క్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలి యాలు సైతం వాటివాటి భౌగోళిక స్థానాలవల్లా, పకడ్బందీ చర్యలవల్లా సురక్షితమే. కానీ భూతాపోన్నతి పెరిగి, ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టి, మెజారిటీ దేశాలు సంక్షోభంలో పడి ఆహారగొలుసు దెబ్బతింటే అందరికీ ప్రమాదమే.అందుకే సమస్య అందరిదీ. అయితే సమితి తీర్మానం అన్ని దేశాల వాదనలనూ పరిగణనలోకి తీసుకోవాల్సింది. శతాబ్దాలుగా పారిశ్రామికీకరణతో వాతావరణాన్ని దెబ్బతీస్తూ, ఇప్పటికీ ఎలాంటి బాధ్యతకూ సిద్ధపడని అభివృద్ధి చెందిన దేశాలనూ... హరిత ఇంధన వ్యవస్థల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వర్థమాన దేశాలనూ ఒకేగాటన కట్టడం, ఉద్గారాల తగ్గింపునకు అవసరమైన సాంకేతికతలను చవగ్గా అందించేందుకు సంసిద్ధంకాని దేశాలను పల్లెత్తు మాట అనకపోవడం తీర్మానం లోపం. అందుకే మన దేశమూ, మరికొన్ని దేశాలూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మొత్తానికి పాశ్చాత్య దేశాల్లో సైతం వాతావరణ మార్పులపై గుబులు మొదలైందని తీర్మానంపై జరిగిన ఓటింగ్ నిరూపించింది. ఎలా చూసినా ఇది మంచి పరిణామం అని చెప్పాలి. -
అగ్రజుల గుసగుసలు
రెండు సాధారణ దేశాల అధినేతలు కలిశారంటే వాణిజ్యం, వ్యాపారం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు చర్చకొస్తాయి. ఒప్పందాలు కుదురుతాయి. కానీ రెండు అగ్రదేశాలు కలిశాయంటే పైకి కనబడే వాణిజ్య, వ్యాపారాదులతోపాటు గుట్టుచప్పుడు కాకుండా కుదిరే లాలూచీలుంటాయి. వారం రోజుల వ్యవధిలో మూడు అగ్ర రాజ్యాల మధ్య మంతనాలు సాగాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకొస్తే, ఈ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు. స్వల్ప వ్యవధిలో ఇలా ఇద్దరు అగ్రరాజ్యాధినేతలు రావటంవల్ల సహజంగానే చైనా స్థాయి అమాంతం పెరిగిపోయింది. పుతిన్ వచ్చిన సందర్భం సాధారణమైనది కాదు. ఆయనే చెప్పినట్టు 54 సంవత్సరాల క్రితం ఇదేరోజున అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ ‘ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాల’ని పిలుపునిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారింది. పెట్టుబడి ఎగుమతిలో, దేశాలపై ఆర్థికంగా పట్టుబిగించటంలో, ఇరుగుపొరుగును చీకాకుపెట్టడంలో, కనిపించేదంతా తనదేనని ప్రకటించుకోవటంలో చైనా సైతం సామ్రాజ్యవాద పోకడలకు పోతోంది. మధ్యన ‘సోషల్ సామ్రాజ్యవాదం’ ముద్ర వేయించుకున్న సోవియెట్ యూనియన్ చీలికలూ, పేలికలై కుప్పకూలింది. అందులోని ప్రధాన భాగం రష్యా కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ, గత వారసత్వాన్ని కొనసాగించటానికి ఆపసోపాలు పడుతోంది. ఇక అమెరికా పోకడలు దశాబ్దాలుగా అదే బాణీలో కొనసాగుతున్నాయి.గతవారం ట్రంప్‌కు లభించిన స్వాగత సత్కారాలన్నీ పుతిన్‌కు కూడా దక్కాయి. రెడ్‌కార్పెట్ పరచడం, సైనిక వందనం, కేరింతలతో పిల్లలు అభివాదం చేయడం వంటివన్నీ కనబడ్డాయి. అయితే స్వీయ ప్రయోజనాల రక్షణలో తమకెవరూ సాటిరారని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిరూపించారు. ఏవేవో ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పటమే తప్ప చైనా వైపునుంచి గతవారం ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ఇప్పుడు పుతిన్‌కు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. ఇంధన సర ఫరా కోసం ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరిట రెండో పైప్‌లైన్ నిర్మాణానికి రష్యా సిద్ధపడినా, చైనా అందుకు సంబంధించి మరింత లోతుగా చర్చించాల్సి ఉందంటూ వాయిదా వేసింది. కాకపోతే తైవాన్ విషయంలో ట్రంప్‌కు ‘రెడ్‌లైన్’ హెచ్చరిక జారీ అయిన పద్ధతిలో పుతిన్కుఎలాంటి భంగపాటు కలగలేదు. ఎవరికి వారు అవతలివారిని వేలెత్తి చూపడమే తప్ప, తమ తప్పులెరగరని ట్రంప్, పుతిన్‌ల పర్యటనలు నిరూపించాయి. హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన, ఇరాన్ యుద్ధం విషయంలో గతవారం అమెరికా, చైనాలు ‘ఏకాభిప్రాయం’ ప్రకటిస్తే... ఇప్పుడు చైనా, రష్యాలు సైతం అలాంటి స్వరమే వినిపిస్తున్నాయి. ‘ఏకపక్ష వ్యవహారశైలి, ఆధిపత్యవాద ధోరణులు’ ఉండరాదని కోరాయి. ప్రపంచం ఆటవిక న్యాయంలోకి దిగజారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తంచేశాయి. తరచిచూస్తే ఈ మూడు దేశాలూ జంకూ గొంకూ లేకుండా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. అయినా గంభీరస్వరాలతో హితవు పలికే సాహసం చేస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజులా అధ్యక్షుణ్ణి భార్యా సమేతంగా చీకటిచాటున అపహరించుకు పోయింది. ఇరాన్ అగ్రనేతను ఇజ్రాయెల్‌తో కలిసి హత్య చేసింది. క్యూబాను కబళించటానికి కత్తులు నూరుతోంది. రష్యా నాలు గేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దురాక్రమణకు దిగకపోయినా ఆసియా ఖండ దేశాల్లో చైనా కండబల ప్రదర్శన తక్కువేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్‌కు చైనా అవసరమే ఎక్కువుంది. ఉక్రెయిన్ను తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగి, అది తీవ్రంగా దెబ్బతింది. పుతిన్ స్వీయభద్రతే ప్రమాదంలో పడింది. రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్... ‘రష్యా తలపెట్టిన మే 9 విక్టరీ పెరేడ్ సజావుగా సాగటానికే’ దీనికి అంగీకరించామంటూ ఎద్దేవా చేసింది. దానికితోడు 2008 తర్వాత తొలిసారి ట్యాంకులు, క్షిపణులు లేకుండా ఆ పెరేడ్ హడావుడిగా ముగిసింది. మొత్తానికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ రెండు దేశాల మాదిరిగా తనపై ఇంకా దురాక్రమణదారు ముద్రపడనందువల్లే ఈమాత్రం ప్రతిష్ఠయినా దక్కుతున్నదని చైనా గ్రహించి సవ్యంగా వ్యవహరిస్తే అదే పదివేలు! -
స్వాగతించదగిన తీర్పు
బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కల బెడద మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించినప్పుడు ఉదాసీనంగా ఉండటం రాజ్యానికి సాధ్యంకాదని మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలకూ, జంతు ప్రేమికులకూ కళ్లు తెరిపించాలి. మనిషి ప్రాణమా, శునకాల ప్రాణమా... ఏది ప్రధానం అనే సమస్య తలెత్తినప్పుడు మానవ జీవితమే సర్వోన్నతమైనదనీ, జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణం ఈ విషయంలోనూ వర్తిస్తుందనీ ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పడం గమనించ దగ్గది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనలు సవ్యంగా అమలైతే ఈ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలు నిరాసక్తంగా, నిర్లిప్తంగా ఉండిపోయాయి. దాని పర్యవసానమే తాజా తీర్పు. గ్రామాలు, పట్టణాలు, నగరాలన్న తేడా లేకుండా జనావాసాలన్నిటా శునకాలు తారసపడతాయి. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, క్రీడా మైదానాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మతపరమైన ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు... ఒకటేమిటి ఎక్కడికెళ్లినా వీధికుక్కల బెడద తప్పడం లేదు. అవి సవ్యంగానే ఉన్నాయా, ప్రమాదకరమైన జబ్బులతో ఉన్నాయా అని ఆరా తీసేవారుండరు. వాటి నియంత్రణ కర్తవ్యమని భావించే యంత్రాంగం ఎక్కడా కనబడదు. అలాగని వాటిని బంధించి, అత్యంత క్రూరంగా చంపటం కూడా పరిష్కారం కాదు. అనుకోని దురదృష్ట కర సంఘటన జరిగినప్పుడు మున్సిపల్ సిబ్బంది కుక్కలవేట మొదలెట్టడం, సద్దుమణి గాక ఊరుకోవటం రివాజుగా మారింది. మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకున్నప్పుడూ, ఎవరైనా వాటిని విషాహారంతో చంపినప్పుడూ జంతు ప్రేమికులు రంగప్రవేశం చేసి కేసులు పెడతారు. ఎల్లకాలమూ ఇదిలా కొనసాగుతూనే పోవటం సరికాదు. ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడితీరాలి.కుక్కల బెడదవల్ల ఎదురయ్యే సమస్యలు తక్కువేమీ కాదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో దాదాపు 8 కోట్ల వీధికుక్కలున్నాయి. ఏటా కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది తొలి త్రైమా సికంలో దాదాపు లక్షన్నర కేసులు నమోదైనట్టు అంచనా. తమిళనాడు, కర్ణాటకల్లో ఈ సంఖ్య 4.5 లక్షలవరకూ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రేబిస్ వ్యాధిబారినపడి దేశ వ్యాప్తంగా ఏటా 20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరో ఆశ్చర్యకరమైన విష యమేమంటే... ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవించే కుక్కకాటు మరణాల్లో మన దేశం వాటా 36 శాతం. అందుకే ప్రమాదకర కుక్కలకు కారుణ్యమరణం ప్రసాదించ వచ్చనీ,అంత ప్రమాదంలేని వాటిని జనావాసాలనుంచి తొలగించాలనీ తీర్పు స్పష్టం చేసింది.కుక్కకాట్లవల్ల సామాన్యులకూ, ప్రభుత్వాలకూ కూడా ఆర్థికభారం తప్పడంలేదు. బాధితులకిచ్చే పీఈపీ వాక్సిన్లకూ, ఇంజక్షన్లకూ ప్రభుత్వాలు వందలకోట్లు వ్యయం చేస్తున్నాయి. అయినా వీటి లభ్యత సరిగా లేదు. బాధితుల్లో అత్యధికులు రెక్కాడితేగానీ డొక్కాడని సాధారణ జనం. చిన్నా చితకా వ్యాపారాల కోసమో, ఉపాధికోసమో వెళ్లే వారు, చెత్త ఏరుకుని జీవించేవారు. వీరంతా పనులు మానుకుని ఆస్పత్రులచుట్టూ తిరుగుతున్నారు. పాశ్చాత్య దేశాలు వీధికుక్కల్ని నియంత్రించి, వాటి బెడద లేకుండా చేయగలిగినప్పుడు మన దేశంలో ఎందుకు సాధ్యపడదు? ఏబీసీ నిబంధనలు పాటించని ప్రభుత్వ విభాగాలను జంతు ప్రేమికులో, మరొకరో నిలదీయరు. అది తమ బాధ్యతగా భావించరు. సమస్య ఉగ్రరూపందాల్చాక చర్యలు మొదలైతే మాత్రం ఆందోళనకు దిగుతారు. వీధికుక్కల్ని జనావాసాలనుంచి షెల్టర్లకు తరలించాలని నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చినప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. రాజ్యాంగంలోని 51ఏ (జి) అధికరణం మూగజీవాలపట్ల కారుణ్యంతో మెలగాలని చెబుతోంది. దాన్ని పాటిచాల్సిందే. కానీ మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగితే పట్టనట్టు ఉండకూడదు. సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పు ప్రభుత్వాల కర్తవ్యాన్ని గుర్తుచేయటమేకాక,అవి విఫలమైన పక్షంలో ఎలాంటి చర్యలుండాలో సూచించింది. అందుకే ఇది ఆహ్వానించదగ్గ తీర్పు. -
తీరికూర్చుని త్రిభాషా సూత్రం
దేశంలో హిందీ భాషకు ఆధిపత్య స్థానం కల్పించాలనుకుంటున్న ప్రతిసారీ దక్షిణాదిలో... ముఖ్యంగా తమిళనాడులో వివాదం తలెత్తుతుండగా కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) కొత్త ఎత్తుగడతో ఆ భాషను ప్రతిష్ఠించదల్చుకున్నట్టు కనబడుతోంది. అందువల్లే శుక్రవారంనాటి ఆ సంస్థ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా జారీ చేసినట్టు చెబుతున్న ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవడం తప్పనిసరి. అందులో ఒకటి విదేశీ భాష. మిగిలిన రెండూ ‘స్థానిక భాషలు’. త్రిభాషా సూత్రంగా పిలిచే ఈ విధానం వాస్తవానికి కొఠారీ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రూపొందిన జాతీయ విద్యావిధానం–1968 నాటిదే. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలో ఉన్నా ఏదోవంకన హిందీని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం రివాజైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలా రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తున్నా, తమిళనాడు మాత్రం తమిళంతోపాటు ఇంగ్లిష్ బోధన ఉండే ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంది. విద్యార్థి దశలో వివిధ భాషలపట్ల ఆసక్తి, అనురక్తి పెంచి ప్రోత్సహించటంలో తప్పేం లేదు. కానీ ఆ వంకన ఒక భాష ఆధిపత్యాన్ని నెలకొల్పుదామనుకోవటమే సమస్య. ఇప్పటికైతే తల్లిదండ్రులు విద్యాసంవత్సరం మొదలై రెండునెలలు గడిచాక హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పునరాలోచన చేయకుంటే ఇది భాషా వివాదంగా మారినా మారొచ్చు. వచ్చే జూలైనుంచి అమల్లోకి రాబోతున్న ఈ విధానం సమస్యాత్మకమైనది. అన్నిటా ఇప్పటికే భాగంగా మారిన ఇంగ్లిష్‌ను ఇది ‘విదేశీ భాష’ గా గుర్తిస్తోంది. మన ప్రభుత్వాల ఉత్తరప్రత్యుత్తరాలు, జీవోలు, చట్టాలు... అన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు మొదలుకొని తీర్పులవరకూ దాని వాడకం విస్తృతం. ఇక ఐఐటీ, ఐఐఎంలాంటి ఉన్నతశ్రేణి సంస్థల్లో చెప్పనవసరం లేదు. ఉన్నత చదువులకైనా, ఉద్యోగావకాశాలకైనా అదొక తప్పనిసరి అవసరం. ఈ దశలో ఇంగ్లిష్‌ను ‘విదేశీభాష’గా గుర్తించటం వల్ల మన విద్యార్థులు జర్మన్, ఫ్రెంచ్, జాపనీస్, కొరియన్ వంటి భాషలు నేర్చు కొనే అవకాశాన్ని కోల్పోతారు. ప్రపంచవ్యాప్తంగావున్న తీవ్ర పోటీ పర్యవసానంగా ఉద్యో గార్థులు వారి వారి రంగాల్లో నైపుణ్యం సాధిస్తే సరిపోదు. ఇంటర్వ్యూల్లో దాన్ని సమర్థ వంతంగా వ్యక్తం చేయగలగాలి. ఏ ఉత్పత్తికైనా ప్రపంచవ్యాప్త మార్కెట్ ఏర్పడిన వర్తమానంలో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాష వస్తేనే ప్రాముఖ్యత. కానీ సీబీఎస్ఈ తీరుతో ఇంగ్లిష్ విడనాడితేనే మరో విదేశీ భాష సాధ్యం.ఉత్తరాదిన త్రిభాషా సూత్రం ఎంచక్కా అమలవుతోంది. వారు హిందీతోపాటు సంస్కృతాన్ని ‘స్థానిక భాష’గా నేర్చుకుంటారు. ‘విదేశీ భాష’గా ఇంగ్లిష్ ఉండనే ఉంది! దక్షిణాదిన మాత్రం స్థానిక భాషతోపాటు ఎంచుకోవటానికి హిందీ లేదా సంస్కృతం ఉంటాయి. సినిమాల ప్రభావంవల్ల సహజంగా అత్యధికులు హిందీని ఎంచుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలు హిందీకి దాదాపు అలవాటుపడినట్టే... అటువైపువారు సైతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఒరియావంటి భాషల్లో ఏదో ఒకటి నేర్చుకోవటం తప్పనిసరి చేస్తే వివక్ష కనబడేది కాదు. పైగా ఇటువైపువారికి ఉత్తరాదిన ఉద్యోగావ కాశాలు లభించేవి. కానీ ఆ పని చేయరు.తొమ్మిదో తరగతికి వర్తింపజేస్తూ తీసుకొచ్చిన ఈ నిర్ణయం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. 6 నుంచి 8వ తరగతి వరకూ వేరే విధంగా చదివినవారు ఇప్పుడు హఠాత్తుగా సంస్కృతమో, హిందీయో నేర్చుకుతీరాలి. అసలు పాఠ్యపుస్తకాలే లేని ప్రస్తుత స్థితిలో, కీలక మలుపు అనదగిన పదో తరగతినాటికి పిల్లలంతా ఆ భాషల్లో ప్రావీణ్యత సాధించటం సాధ్యమేనా? ఇప్పటికే ఒక యూనిట్ టెస్ట్ కూడా పూర్తయింది. ‘ప్రస్తుతానికి’ తొమ్మిదో తరగతివారికి ఆరో తరగతి పాఠ్యపుస్తకం వినియోగించాలనీ, టీచర్లుండరు గనుక రిటైరైనవారి సేవలను వినియోగించుకోవాలనీ సీబీఎస్ఈ చెబుతోంది. ‘ఎలా రాసినా...’ ఆ మార్కుల్ని పట్టించుకోబోమన్న సన్నాయి నొక్కులు అదనం. కానీ అన్నిటా 90 శాతంపైగా సాధించిన విద్యార్థి మార్కుల జాబితాలో ఇదొక దిష్టిచుక్కగా మిగలదా? సీబీఎస్ఈ ఇంతకూ ఏం సాధించదల్చుకుంది? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. -
‘అధిక సంతాన’ వ్యామోహం!
చెప్పడానికేం లేనప్పుడూ, సంజాయిషీ ఇవ్వడానికి మాటలు దొరకనప్పుడూ ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ప్రజలను గందరగోళపరచడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటైన విద్య. తిరుమల లడ్డూ మొదలుకొని అనేకానేక అంశాలపై సృష్టించిన వివాదాలు నీరుగారి, తన కుట్రలు బయటపడ్డాక ఇక సూపర్ సిక్స్ హామీల గురించీ, ఇతరత్రా వాగ్దానాల గురించీ ఏదో ఒకటి చెప్పకతప్పని స్థితి ఎదురైంది. అందుకే ఎక్కువమంది పిల్లల్ని కనండంటూ ఆయన ఊదరగొడుతున్నారు. దాన్నెవరూ పట్టించుకున్న దాఖలా లేకపోవటంతో తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో అధిక సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఏమేం చేయబోతున్నదో ఏకరువు పెట్టారు. మూడో బిడ్డను కంటే రూ. 30,000, నాలుగో బిడ్డను కంటే రూ. 40,000 ఇస్తామని ప్రకటించారు. ఈ సొమ్మును పురిటి మంచం దగ్గరకే తీసుకొచ్చి ముట్టజెబుతారట! దీన్ని ప్రకటించేముందు ఎన్నికల హామీల అతీ గతీ ఏమైందో నిజాయితీగా చెబితే బాగుండేది. కనీసం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికీ ఏడాదికి రూ. 15,000 చొప్పున ఇస్తానన్న ‘తల్లికి వందనం’ ఏమైందో... కుటుంబంలో ఎందరు మహిళలుంటే అందరికీ నెలకు రూ. 1,500 చొప్పున అందిస్తానన్న ‘ఆడబిడ్డ నిధి’ ఎటుపోయిందో...‘కల్యాణ లక్ష్మి’ ఎంత ఘనంగా అమలవుతున్నదో బాబు చెప్పాల్సింది. గత వాగ్దానాలకే దిక్కూ మొక్కూలేని తరుణంలో కొత్త రాగం మొదలెట్టారు. వాస్తవానికి ‘అధిక సంతానం’ ఆలోచన బాబు పుర్రెకు పుట్టిన బుద్ధికాదు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనీ, అందువల్ల దక్షిణాది నష్టపోతుందనీ తెలిశాక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా అనేకులు ఆందోళనపడి, అధిక సంతానాన్ని కనమంటూ బహిరంగ సభల్లో చెప్పడం మొదలెట్టారు. కానీ అంతటితో ఆగితే వారికీ, బాబుకూ తేడా ఏముంటుంది? అందుకే ఈ నజరానాలు! నిజానికి కేంద్రంలో ఎన్డీయే సర్కారు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన ప్రస్తుత స్థితిలో నియోజకవర్గాల పునర్విభజనకు ఎంచుకున్న ప్రాతిపదిక విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు. కానీ అలాంటి దుస్సాహసం చేస్తే కొంప కొల్లేరవుతుందని భయపడ్డారు. అలాగని లోలోన రగులుతున్న అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. ఈలోగా గతంలో ఇచ్చిన విచ్చలవిడి హామీలు శాపాలై వెంటాడుతున్నాయి. వీటినుంచి తప్పించుకోవాలంటే ‘అధిక సంతానమే’ ఏకైక మార్గమని బాబుకు తోచినట్టుంది. గండం గడిచేందుకు అవసరార్థం ఏదో ఒకటి మాట్లాడటం మొదటినుంచీ ఆయనకు అలవాటే. 2024 ఎన్నికల్లో మరోసారి ఓటమి తప్పదని గ్రహించాక ఆదరా బాదరాగా ఎన్డీయే పంచన చేరారు. అప్పటికీ విజయంపై గ్యారెంటీ లేకపోవటంతో ఎన్నికల సంఘం(ఈసీ) ప్రాపకంతో కావాల్సినవన్నీ చేసుకున్నారు. మరోపక్క మోసపూరిత హామీలతో మోతెక్కించారు. ఇక పోలింగ్ రోజున ఈవీఎంల ప్రహసనం, దొంగ ఓట్ల జాతర సరేసరి. ఎన్ని చేసినా...ఇచ్చిన వాగ్దానాల మాటేమిటన్న ప్రశ్న ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అందుకే ఈ అధిక సంతానం ప్రచారం!ఇటీవల కాగ్ విడుదల చేసిన తాత్కాలిక లెక్కలు ఏపీ సర్కారు నిర్వాకాన్ని రోడ్డుకీడ్చాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధంటూ బాబు చెప్పినవన్నీ ఉత్త డొల్ల మాటలని తేల్చిచెప్పాయి. 10.75 శాతం వృద్ధి రేటు అంటూ బాబు చెప్పిందే నిజమైతే పన్ను రాబడులు 3.22 శాతం పడిపోవటమేమిటి? సంపద సృష్టి మాట దేవుడెరుగు... ఉన్న సంపదంతా ఊడ్చుకుపోతోందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఏ భరోసాతో పిల్లల్ని కంటారు? ఈ సంక్షోభకాలంలో సర్కారు ఒక్క దఫా ఇచ్చే డబ్బు ఏమూలకు సరిపోతుంది? ఎన్నాళ్లొస్తుంది? ఈ విషయంలో ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ సూటిగా నిలదీస్తే ఇంతవరకూ జవాబు లేదు. కనీసం పిల్లల సంక్షేమానికీ, వారి ఆరోగ్యరక్షణకూ, పౌష్టికాహారానికీ, విద్యకూ, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకూ సంబంధించిన పథకాలు ప్రకటిస్తే వేరుగా ఉండేది. సందుసందునా బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతున్న రాష్ట్రంలో కుటుంబాలు ఏ భరోసాతో పిల్లల్ని కనాలి? అరకొర ఆదాయంతో సగటు ఇల్లాళ్లు కంటతడి పెడుతుంటే ఎందుకీ మతిలేని మాటలు?! -
ఆమ్ రస్
బహదూర్షా జఫర్‌తో కలిసి మీర్జా గాలిబ్ తోట షికారుకు బయలుదేరాడు. తోటంటే మామిడి తోటే. అది విరగ కాసి ఉంది. మీర్జా గాలిబ్ ప్రతి పండునూ కళ్లు చికిలించి మరీ చూస్తూ ఉన్నాడు. అతని పోబడి కాసేపు పరికించి ‘ఏమిటయ్యా మీర్జా, అలా చూస్తున్నావు’ అన్నాడు జఫర్. ‘జహాపనా! ప్రతి పండు మీద తినేవాడి పేరు ఉంటుందని అంటారు. నా పేరు రాసిన పండ్లు ఏవై ఉంటాయా అని వెతుకుతున్నా’ అన్నాడు మీర్జా. జఫర్ ముచ్చటగా నవ్వి ఆ సాయంత్రం మీర్జా ఇంటికి బుట్టల కొద్ది పండ్లు పంపాడు. పేరుకు మహాకవి మీర్జా గాలిబ్... తియ్యటి మామిడి కోసం తన కవిత్వం మొత్తం ఖుర్బాన్ చేయమన్నా చేస్తాడు.బాబర్ ఇండియా మీదకు దండెత్తి వచ్చాక ‘నేను నా నేలన తిన్న తియ్యటి ద్రాక్ష ఏదీ? ఆ మధుర కర్బూజా ఫలము ఎక్కడ?’ అని ఏడ్చినంత పని చేశాడు. ‘ఊరుకో స్వామీ’ అని ఇక్కడి స్థానికులు మామిడి పండు కోసి పెట్టారు. తర్వాత బాబర్ ‘సరైన మామిడి దొరకాలేగానీ దాని అబ్బలాంటి కాయ మరేదీ లేదు’ అని బాబర్ నామాలో రాసుకున్నాడు. సరే. ‘నూర్జహాన్’ పేరు మీదే ఒక పండు అంకితం చేయబడింది. అక్బర్ మహాశయుడైతే మామిడికి దాసుడు. బిహార్‌లోని దర్భంగా దగ్గర లక్ష మామిడి చెట్లతో తోట వేశాడు. దాని పేరు ‘లఖీ బాగ్’. మొఘలులతో పని జరగాలంటే మామిడి పండ్ల బుట్ట ఇస్తే సరి అనే నానుడి ఉండేది. అందుకే అమీర్ ఖుస్రో మామిడిని ‘ఫఖర్–ఏ–గుల్షన్’... ‘తోటలకు గర్వకారణం’ అని కీర్తించాడు. కర్నూలు జిల్లా బనగాన పల్లిలో నవాబులు తమ మామిడి తోటలన్నీ శోధించి శ్రేష్ఠమైన ‘బేనిషాన్’ వెరైటీని వృద్ధి చేసి రైతులకు మొక్కలు ధారాళంగా పంచారు. ఇవాళ తింటున్న బంగినపల్లి తీపికి మొదలు అక్కడ ఉంది.మామిడి మనదే. ఆరు వేల ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ఈశాన్య భారతంలో పుట్టి బౌద్ధ సన్యాసుల వల్ల, పర్షియన్ వర్తకుల వల్ల, పోర్చుగీసు వాళ్ల వల్ల ప్రపంచానికి పాకింది. ఇవాళ ఏ దేశంలో మామిడి ఉన్నా దాని వేరు మనదే. వేదాల్లో ‘ఆమ్ర’ అని ప్రస్తావన ఉందట. భూమి చుట్టడానికి బదులు తన చుట్టూ తిరిగిన వినాయకుణ్ణి మెచ్చి శివుడు మామిడి పండును బహుమతిగా ఇచ్చాడట. అంటే అది జ్ఞానఫలం. ఇక బుద్ధునికి ఆమ్రపాలి తన మామిడి తోట దానం చేయడం విదితమే. జైన మహావీరుడు 30 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ‘జ్ఞాతృఖండ వనం’ అనే మామిడితోటలో దీక్ష తీసుకున్నాడు. వినోదానికేం కొదవ? రాయలవారి తల్లికి మామిడి పండ్లు దానం చేయాలని ఉండే దట. అది తీరకనే పోయేసరికి ‘ప్రాయశ్చిత్తంగా బంగారు మామిడిపండ్లు ఇస్తేనే స్వర్గప్రాప్తి’ అని హఠాయించిన వారికి తెనాలి రామలింగడు ఇనుప కడ్డీలతో వాతబడి చేశాడని జనశ్రుతి. 2000 ఏళ్ల క్రితమే తెలుగునేలకు మామిడిగాలి సోకినా రాయలవారి కాలానికి మామిడి ఛాయ స్థిరపడింది. రాయలవారే స్వయంగా తోటలు పెంచాడు. ఆముక్తమాల్యదలో మామిడి చివురు ప్రస్తావన చేశాడు.మామిడి పండ్లు వచ్చేది ఎందుకంటే జీవితం కాసింత రసభరితం చేసుకోండయ్యా అని గుర్తు చేయడానికి. ఎండ ఉదయాన కుటుంబంతో అల్పాహారానికి కూచుని చద్దన్నంలో మామిడి రసం జుర్రుకుంటూ, వేడివేడి పూరీలను మామిడి రసంలో ముంచు కుంటూ, సువర్ణకాంతిలో మెరిసే మామిడి ముక్కల మెరుపుతో ముఖాన్ని శోభిస్తూ, జిహ్వకు స్వర్గం అందడం అంటే ఏమిటో అనుభవిస్తూ బతుకును కాస్త రుచిమధురం చేసుకోమని చెప్తుంది మామిడి కాలం. కానీ ఏమిటి చేయడం! మంచి కాయలన్నీ విదేశా లకు పంపి, కల్మష కాయలన్నీ బజారున ఒంపారు. చిన్నప్పుడు తిన్న మేలిమి రకాలెన్నో శ్రీమంతుల డైనింగ్ టేబుల్స్‌కు పరిమితమయ్యాయి. ఇటు తీపి రుచికి నోచుకోక... అటు బతుకు బాదరబందీలో కుదురు దొరక్క... రుచీ పచీ లేక మిగిలాం. గడ్డి కప్పి, మగ్గబెట్టి, వెతికి వెతికి అందుకుని తిన్న చిన్నప్పటి జ్ఞాపకం ఏమైంది?లోకాన మంచిగాని, మామిడి రుచిగాని బహు కొద్ది. అందువల్ల దొరికిన ప్రతి లిప్తను జుర్రుకోమని ఉద్బోధించే ఈ కాలానికి నమస్కరించుకుంటూ అందుకోండొక మిగలపండిన మామిడిపండు. పిల్లలకు ఇవ్వండి. మామిడి బాల్యమే తియ్యని బాల్యం. -
మెదళ్లలోకి విషపు విత్తులు!
రక్షణరంగ పరికరాల దిగుమతుల్లో నంబర్ వన్ అనే అపఖ్యాతిని వదిలించుకొని స్వావలంబన వైపు పయనించవలసిన పరిస్థితి భారత్‌కు ఏర్పడింది. ఆత్మ నిర్భర భారత్ ప్రణాళిక కింద ఇందుకోసం భారత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించింది. ఎడాపెడా 718 పారిశ్రామిక లైసెన్స్‌లను వారికి జారీ చేసింది. భారత పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ చొరవ తీసుకొని 14 రాష్ట్రాల్లో అరవైకి పైగా భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా రక్షణ ప్రాజెక్టుల కోసం కేంద్రం సరళీకరించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీఎత్తున రెండు డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను రక్షణరంగ పెట్టుబడుల కోసం ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి – కర్నూలు ప్రాంతం కూడా ఒకటి!పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్సీఏ) ప్రాజెక్టుకు నిన్న (శుక్రవారం) కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి మాట్లాడుతూ త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలనూ, సాంకేతికతనూ ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్టు ప్రకటించారని ‘ఈనాడు’ రాసింది. అతిథిగా వచ్చారు కనుక ముఖప్రీతికోసం ఆమాత్రం మాట్లాడి ఉండొచ్చు కూడా! రక్షణ పరికరాల ఉత్పత్తుల కోసం కుదుర్చుకున్న ఎమ్ఓయూల్లో సింహభాగాన్ని తన సొంత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కే మళ్లించుకున్నామని ఆయన ఇక్కడ చెప్పలేరు కదా? పనిలో పనిగా తమ ఎన్డీయే కూటమిలో రెండో పెద్దపార్టీగా ఉన్న టీడీపీ అధినేతపై కూడా సభా మర్యాదను పాటిస్తూ కొన్ని పొగడ్తలు కురిపించారు.రక్షణమంత్రే స్వయంగా వీరతాడు వేస్తే చంద్రబాబు రెచ్చిపోకుండా ఉంటారా? అదే ఊపులో మాట్లాడుతూ ఇరవై మూడు నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాననీ, ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వీటివల్ల లభిస్తాయనీ పునరుద్ఘాటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఇదే పాటను ప్రతిచోట పదేపదే పాడుతున్నారు. ఈమధ్యనే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ తాను కల్పించిన ఉద్యోగాల సంఖ్యను కూడా 23 లక్షల కోట్లుగా చెప్పుకున్నారు. ఆ యాంకర్‌కు పాపం మూర్ఛ వచ్చినంత పనైంది. కానీ, యాంకర్ ఇబ్బందిని గమనించే స్థితిలో బాబుగారు లేరు. ఆయన పాడాలనుకున్న పాటను పూర్తిగా పాడేశారు. పుట్టపర్తి సభలో చంద్రబాబు వదిలేసిన భాగాన్ని యువనేత లోకేశ్‌బాబు పూర్తి చేశారు.పుట్టపర్తికి వచ్చి పంచ్ డైలాగ్ కొట్టకుండా నేను వెళ్లలేనని లోకేశ్ వెల్లడించారు. పంచ్ డైలాగ్లపై పేటెంట్ హక్కు సినిమాల్లో మామయ్యదీ, రాజకీయాల్లో తనదీ అనే నమ్మకం కావచ్చు. ఇంతకీ ఆ పంచ్ డైలాగ్ ఏమిటంటే, ‘‘వైసీపీది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్. మనది ఫైటర్‌జెట్ బ్యాక్‌గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా రాజా’’. ఇందులో ఉన్న పంచ్ ఏమిటని వెతకాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి ఆత్మతృప్తి వారిది. తాను మునిగింది గంగ... తాను వలచింది రంభ... తాను విసిరింది పంచ్... అంతే! ఈ సభలో ఆత్మస్తుతి భాగాన్ని చంద్రబాబు తీసుకుంటే, పరనింద భాగాన్ని చినబాబు తీసుకున్నారు. ఆ మరుసటి రోజు శనివారం నాడు శ్రీకాకుళంలో జరిగిన స్వచ్ఛాంధ్ర సభలో ఈ రెండు భాగాలనూ చంద్రబాబే స్వీకరించారు. ఆయన చెప్పిన ప్రకారం 2019–24 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగైందట! అందులో పావు భాగాన్ని ఎత్తేసరికి 23 నెలల కాలం గడిచిపోయిందట! ఈ లెక్కన మిగిలిన మూడేళ్లలో మిగిలిన చెత్తను ఎత్తే కార్యక్రమమే సరిపోతుంది. ఇంకో ఐదేళ్ల్లకు గెలిపిస్తే సంపద సృష్టికార్యం అప్పుడు మొదలవుతుంది కాబోలు!ఈ ఆత్మస్తుతి, పరనింద అనే రెండంచెల తెలుగుదేశం విధానం కేవలం యథాలాప రాజకీయ విన్యాసం మాత్రమే కాదు. ఇది వ్యూహాత్మకంగా, ఆలోచించి రూపొందించిన ఒక రకమైన కుతర్కం. ఈ కుతర్కాన్ని వ్యాప్తం చేయడంకోసం ఆ పార్టీ ప్రత్యేకమైన పదజాలాన్ని కూడా రూపొందించింది. ఈ పదజాలంతో తనను బ్రాండింగ్ చేసుకోవడంతోపాటు విపక్ష వైసీపీని కూడా బ్రాండింగ్ చేసే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నది. యెల్లో మీడియాగా అపకీర్తి మూటగట్టుకున్న సంప్ర దాయ మీడియాతోపాటు వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన యూ–ట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా సైన్యం టీడీపీ బ్రాండింగ్ బాజాను ముందుకు తీసుకొనిపోవడానికి ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయి. ఈ బ్రాండింగ్ భజంత్రీల జుగల్బందీ లెక్క ప్రకారం తెలుగుదేశం అంటే అభివృద్ధి. వైసీపీ అంటే విధ్వంసం. ఎలా అని ప్రశ్నించడం అమాయకత్వం. తర్కానికి నిలబడుతుందా అనే మీమాంసతో కూడా పనిలేదు. ఈ పద జాలాన్ని ఒక ప్రభంజనంలా ప్రచారంలో పెట్టి జనం మెదళ్లలోకి ఎక్కించడమే వారి ఉద్యమం.ఇవాళ్టి శ్రీకాకుళం సభలో కూడా చంద్రబాబు అదే పని చేశారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ అని మరోసారి చెప్పారు. 2024లో నరకాసుర పాలన అంతమైన తర్వాత మీరంతా దీపావళి పండుగ చేసుకున్నారా లేదా అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చేతులు ఎత్తించుకున్నారు. టీడీపీ చేస్తున్న ఈ విష ప్రచారాన్ని డిగ్రీలు మెడలో వేసుకున్న పలువురు అజ్ఞానులు సైతం నమ్మడం అనేది వర్తమాన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విషాదం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందన్న సామెత ఉండనే ఉన్నది కదా! ప్రచార హోరులో కొట్టుకొని పోకుండా ఏరకంగా మీరు అభివృద్ధికి రోల్ మోడలో సెలవీయండని చంద్రబాబును, ఆయన పార్టీని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. వాస్తవ గణాంకాలను తులనాత్మకంగా అధ్యయనం చేయవలసిన అగత్యం ఏర్పడింది.1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచే ‘నిజమైన’ అభివృద్ధి దేశంలో పట్టాలెక్కిందని మన పెట్టుబడి దారీ ఆర్థికవేత్తలు, మన మేధావులు చెబుతున్నారు. అప్పటి నుంచే లెక్కలోకి తీసుకుంటే ఈ 35 సంవత్సరాల కాలంలో ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 16 సంవత్సరాలపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఇప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నది. అడవులతో నిండిన మధ్య భారత్, కొండలకు నెలవైన ఈశాన్య భారత్, హిమశ్రేణుల ఉత్తర భారత్ ప్రాంతాలు కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ను వెక్కిరిస్తున్నాయి. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రానిది 18వ స్థానం. మానవాభివృద్ధి సూచికల్లో 26వ స్థానం (28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో). నిరుద్యోగిత రేటులో జాతీయ సగటును ఆంధ్రప్రదేశ్ తలదన్నింది. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం దేశంలో సగటు నిరుద్యోగిత శాతం 5.2. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అది 8.2 శాతం. ప్రజల సగటు ఆయుర్దాయంలో ఈ రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నది. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు మాసాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని జీఎస్టీ వసూళ్ల లెక్కలే తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు చేయడంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిందనీ, అప్పుకోసం ప్రతి మంగళవారం దేహీ అని యాచించకపోతే పూట గడవని స్థితిలోకి రాష్ట్రం దిగజారిందనీ కూడా అధికారిక గణాంకాలే కుండబద్దలు కొడుతున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన విధ్వంస పాలన ఎట్లా అయింది? ఈ ఆరోపణకు ఉన్న ఆధారాలేమిటి? పేదా–ధనిక వివక్ష లేకుండా, కులమతాల తేడా చూడకుండా ఈ నేలమీద పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య లభించాలని జగన్ మోహన్‌రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్న మాట వాస్తవం కాదా? నాడు – నేడు పేరుతో 35 వేల పాఠశాలలకు పునర్వికాసాన్ని సంకల్పించి, అందులో సగానికి పైగా పూర్తిచేసి, పిల్లలకు మంచి యూనిఫామ్‌ను కూడా ప్రభుత్వమే సమకూర్చి, పోషకాహారాన్ని అందివ్వలేదా? డ్రాపవుట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టి, ఇంగ్లిషు మీడియంలో బోధనను ప్రారంభించి, సీబీఎస్ఈ సిలబస్ పాఠాలు చెప్పించలేదా! ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యా ర్థులకు ట్యాబ్‌లను అందజేసి, డిజిటల్ బోధనకు అంకురార్పణ చేసింది జగన్ సర్కార్ కాదా? అంతర్జాతీయ స్థాయి ఐబి సిలబస్‌ను సైతం సర్కార్ బడి పిల్లలకు సమకూర్చేందుకు సన్నాహాలు చేసింది జగన్మోహన్రెడ్డి కాదా?టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ యజ్ఞం భగ్నమైందని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామ చావడిలో నిలబడి అడిగినా చెబుతారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలంటే చందాలు వసూలు చేయాలని ఈమధ్యనే ముఖ్యమంత్రి సెలవిచ్చారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని కూడా గతంలోనే ఆయన చెప్పిన మాటను కూడా గుర్తు చేసుకోవాలి. సర్కార్ బడి చదువులను చారిటీ పద్దు కిందకు మార్చడమంటే పేద పిల్లలను నాణ్యమైన చదువుకు దూరం చేయడమే. పేదరికం నుంచి ఆ కుటుంబాల విముక్త మార్గాన్ని మూసివేయడమే! చదువే ప్రపంచాన్ని మార్చే పదునైన ఆయుధమని అంబేడ్కర్, పూలే, నారాయణ గురు వంటి వేగుచుక్కలే కాదు, మండేలా వంటి ఆఫ్రికన్ సూరీడు కూడా అదే మాట చెప్పారు.చంద్రబాబు ఫిలాసఫీ ప్రకారం నాణ్యమైన విద్య ప్రైవేట్ స్కూళ్లలో చదువు కొనుగోలు చేసే పిల్లలకే దక్కాలి. సర్కార్ బడుల గడప దాటలేని పేద పిల్లలు చీప్ లేబర్‌గా మార్కెట్లో నిలబడిపోవాలి. పేదరిక నిర్మూలనపై కూడా చంద్రబాబు ఆలోచనలు వక్రమార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. సంపన్నులైన వారు కొన్ని పేద కుటుంబాలను చేరదీసి వారిని ఆదుకోవాలట! పేదరికం నుంచి విముక్తి పొందడం రాజ్యాంగబద్ధమైన హక్కనీ, అది ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యతనీ ఆయన గుర్తించడం లేదు. మరోసారి నెల్సన్ మండేలాను గుర్తు చేసుకుందాము. ‘‘పేదరిక నిర్మూలన అనేది చారిటీ కాదు, అదొక ప్రాథమిక న్యాయం. పేదరికం సహజంగా ఏర్పడేది కాదు, రుద్దబడేది. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి జరిగిన పోరాటాలు ఎంత పవిత్రమో, పేదరిక విముక్త పోరాటాలు కూడా అంతే పవిత్ర’’ మని మండేలా చెప్పారు. ప్రాథమిక విద్యే కాదు, ఉన్నత విద్య విషయంలోనూ జగన్ చేపట్టిన సహజ న్యాయ సూత్రాలను చంద్రబాబు తలకిందులు చేశారు. పేదలందరికీ చదువు, వైద్యం సులభంగా అందడం కోసం ఆయన ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం వెంపర్లాడుతున్నది. విద్యారంగం, వైద్యరంగం మాత్రమే కాదు, ప్రతి రంగంలో ఈ ఇద్దరు నేతలు అవలంబించిన విధానాలు ఇదే పద్ధతిలో కొనసాగాయి. సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం జగన్ విధానాలకు చోదక శక్తులైతే, ప్రైవేటుకు పెద్దపీట, ప్రచార పటాటోపం చంద్రబాబు పాలనను నడిపి స్తున్నాయి. ఈ విధానాల ఫలితంగా లక్షలాది జీవితాలు సాధికా రతకు, ఆత్మగౌరవానికి దూరమవుతున్నాయి. గిట్టుబాటు ధరల్లేక, గింజలు కొనే నాథుడు లేక లక్షలాదిమంది రైతన్నలు అలో లక్ష్మణా అని అలమటిస్తున్నారు. ఇది కదా సామాజిక విధ్వంసం అంటే? దీన్నే కదా విధ్వంస పాలన అనాలి?వైసీపీ గొడ్డలి పార్టీ ఎలా అయింది? టీడీపీ కార్యాలయాల మీద శాంతి కపోతాలు ఎప్పటినుంచి ఎగురుతున్నాయి? జగన్ పాలనతో పోలిస్తే శాంతిభద్రతల పరిస్థితి ఇప్పుడు భేషుగ్గా ఉందని ఏ లెక్కలు తేల్చాయి? హత్యలు ఆగిపోయాయా? అత్యాచారాలు ఆసలే లేవా? అపహరణలు ఆగిపోయాయా? గంజాయి ఈ రాష్ట్రం సరిహద్దుల్లోకే రావడం లేదా? విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశమే లేక పల్లెలు పట్టణాలన్నీ ప్రశాంతంగా నిద్రిస్తున్నాయా? కుల మత భేదాలూ కలహాలు లేకుండా ఆకివీడు నుంచి కడప దాకా అన్ని వర్గాల ప్రజలు భుజాల మీద చేతులు వేసుకొని భాయిభాయి అంటూ సంచరించే విధంగా ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా? ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, గణాంకాలను చూపకుండా, కేవలం పదజాలపు మాయాజాలంతో జనం మెదళ్లలో విషపు విత్తులు నాటితే, ప్రజలను విభజించి పాలించాలనుకుంటే అది రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎల్లకాలం సాగదు. చరిత్ర మిమ్మల్ని ప్రజా కంటకులుగా అభిశంసిస్తుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అస్పష్ట ‘శిఖరాగ్రం’!
దశాబ్దకాలంగా ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక, ఇంధన రంగాల్లో పరస్పరం తలపడుతూ, వాటితోపాటే ఒకదానిపై మరొకటి అవిశ్వాసాన్ని దండిగా పెంచుకున్న రెండు అగ్ర రాజ్యాలు చర్చలకు సిద్ధపడ్డాయంటే ప్రపంచం చాలా ఆశిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం బీజింగ్ చేరుకున్నప్పుడు ఆయనకు లభించిన స్వాగత సత్కారాలు గమనించినా, శిఖరాగ్ర సమావేశం జరిగిన గురు, శుక్రవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు చూసినా అంతా సవ్యంగా ముగిసిందని అనిపిస్తుంది. ట్రంప్‌తో వచ్చిన ప్రతినిధి బృందం సామాన్యమైనది కాదు.భిన్నరంగాల్లో ప్రపంచాన్నేలుతున్న దిగ్గజ సంస్థల చీఫ్‌లు 16 మంది ఆ బృందంలో ఉన్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్‌ల సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్లతోపాటు ఎన్విడియా, క్వాల్కామ్, బ్లాక్‌రాక్, గోల్డ్‌మాన్ శాక్స్, బోయింగ్, మెటా సంస్థల సీఈఓలు వారిలో కొందరు. చైనాతో అద్భుతమైన ఒప్పందాలు కుదిరాయనీ, అవి ఇరు దేశాలకూ ఎంతో గొప్పవనీ ట్రంప్ ప్రకటించినా ఆ ఒప్పందాల వైనమేమిటో ఎవరికీ తెలియదు.బోయింగ్ సంస్థకు చెందిన 200 జెట్ విమానాలు వెంటనే, భవిష్యత్తులో మరో 750 కొనడానికి చైనా అంగీకరించిందనీ... అలాగే వందలకోట్ల డాలర్ల విలువైన సోయాబీన్స్ కొనుగోలు చేయడానికి కూడా ఒప్పుకున్నదనీ ట్రంప్ చివరిలో వివరించారు. కానీ అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ రాలేదు. లిఖితపూర్వక ఒప్పందాలు కుదిరిన దాఖలా లేదు. ప్రాథమిక చర్చలవరకూ జరిగి ఉంటాయన్నది దౌత్యరంగ నిపుణుల అభిప్రాయం. ఇరు దేశాలమధ్యా సాగిన సుంకాల యుద్ధం సామాన్యమైనది కాదు. ట్రంప్ సుంకాలు ప్రకటించిన ప్పుడల్లా చైనా దీటుగా స్పందించి ప్రతీకార సుంకాలు విధిస్తూ పోయింది. అరుదైన ఖనిజాల ఎగుమతుల్ని చైనా నిలిపేయటంతో అమెరికా విలవిల్లా డింది. ఇక కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం రెండూ హోరాహోరీ పోటీ పడుతున్నాయి. ఎన్విడియా అత్యాధునిక చిప్‌లు కావాలని చైనా కోరుతుండగా భద్రతా కారణాల రీత్యా కుదరదన్నది అమెరికా వాదన. బహుశా చైనా ఆశలు ఈడేరకపోవటంవల్ల... కొన్ని అంశాల్లో పట్టు సడలించటానికి అమెరికా నిరాకరించటంవల్ల ఒప్పందాలపై ప్రాథమిక చర్చలే సాగాయని అనుకోవాలి. కనీసం వచ్చే సెప్టెంబర్‌లో షీ అమెరికా పర్యటన నాటికైనా స్పష్టత వస్తే మంచిదే.ప్రపంచం మునుపటి తీరుగా లేదని మాత్రం ట్రంప్‌కు అర్థమై ఉంటుంది. ఎందుకంటే తైవాన్ విషయంలో తమకంటూ ఒక ‘రెడ్‌లైన్’ ఉన్నదని షీ జిన్‌పింగ్ నిర్మొహ మాటంగా చెప్పారని మీడియా అంటున్నది. అయితే తైవాన్‌పై గత వైఖరే కొనసాగుతుందని ట్రంప్‌తో వచ్చిన అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో చెప్పటం మినహా మరేదీ బయటకు రాలేదు. తమ సొంతమని చైనా చెబుతున్న తైవాన్ను స్వతంత్ర, స్వయంపాలిత, ప్రజాస్వామిక దేశంగా మనుగడ సాగించనీయాలన్నది అమెరికా వాదన.1979 నుంచి దానితో సంబంధాలు నెరపుతున్నా అవన్నీ ‘అనధికారమైనవి’. కానీ తైవాన్‌కు ఆయుధ విక్రయం జరపాలని ఇటీవల అమెరికా అనుకోవటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఈ ‘రెడ్‌లైన్’ హెచ్చరిక. ఇక ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధివద్ద ఉద్రిక్తతలపైనా ఇరు దేశాలూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్టు పైకి అంటున్నా వాటిపైనా స్పష్టత లేదు. ఈ పర్యటన తర్వాత హార్మూజ్ వద్ద సామరస్యత ఏర్పడు తుందేమో చూడాలి.దౌత్య పరిభాషలో మర్యాదపూర్వకమైన పదాలు చాలా ఉంటాయి. అందులో రెండు దేశాలమధ్యా కుదిరిందని చెబుతున్న విజన్ కొత్తది. ‘నిర్మాణాత్మక వ్యూహాత్మక స్థిరత్వం’ అనే ఈ విజన్ అర్థం ‘పూర్తిగా స్నేహితులం కాలేకపోయినా, శత్రువులుగా మారి యుద్ధా నికి దిగొద్దు’ అన్నదే. సారాంశంలో పూర్వపు సోవియెట్ అధినేత కృశ్చేవ్ బోధించిన ‘శాంతియుత పోటీ’ వంటిది. నిజానికి ట్రంప్ పర్యటన ఆంతర్యం ఇదే. తమతో సరి సమాన స్థాయికి ఎదిగిన చైనాతో ఇరాన్, తైవాన్ ల విషయంలో స్పర్థ రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. ఆ పరిమితుల్లో చూస్తే ట్రంప్ పర్యటన విజయవంతమైందను కోవాలి. కానీ ట్రంప్ ఏలుబడిలో అమెరికా ఏ మేరకు ఒదిగి ఉంటుంది... చైనా ఏ స్థాయి వరకూ తగ్గివున్నట్టు కనబడుతుందన్నది రానున్న కాలమే చెబుతుంది. -
కేరళ కిరీటం సతీశన్‌కు...
పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత కేరళ ప్రజలు మెచ్చి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటానికి కాంగ్రెస్ పదిరోజుల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఎట్టకేలకు వడస్సేరి దామోదరన్ సతీశన్‌కు ఆ పదవి కట్టబెట్టాలని గురు వారం నిర్ణయించింది. ఈ కాంగ్రెస్ మార్కు కథ అన్నిచోట్లా ఉండేదే. కాకపోతే ఆ పార్టీకి మెజారిటీ లభించే రాష్ట్రాలు కుంచించుకుపోతుండటంవల్ల ఇటీవలి కాలంలో ఆ సంగతి ఎవరికీ పెద్దగా తెలియకుండాపోయింది. కేరళలో సతీశన్‌తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. వారి మధ్య తీవ్ర పోటీ ఉంది. అంతేకాదు... కేరళలో వారి ఇళ్ల దగ్గర గత పది రోజులుగా సాగుతున్న హడావుడికి అంతూ పొంతూ లేదు. ఏ క్షణంలోనైనా తమ నాయకుణ్ణి అధిష్టానం ఎంపిక చేస్తుందని ఆ నాయకుల్ని సమర్థిస్తున్న పార్టీ కార్య కర్తలు రాత్రింబగళ్లు ఆశగా ఎదురుచూశారు. బెదిరింపులు, ఆగ్రహ ప్రకటనలు సరేసరి. అందుకే ఎంపికలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని చెప్పడం, శాసనసభాపక్షం తీర్మానం ఆమోదించటం రివాజు. అయితే మెజారిటీ సభ్యుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న మెలిక ఎప్పుడూ ఉంటుంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63 స్థానాలు లభించగా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమికి మొత్తంగా 102 వచ్చాయి. ఇలా భారీ స్థాయిలో జనం ఆమోదముద్ర ఉన్నా, కూటమి పక్షాలు ఆ అంశాన్ని త్వరగా పూర్తిచేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా పార్టీ అధిష్టానం అడుగు ముందుకేయలేక పోయిందంటే సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏఐసీసీ నాయకుడిగా తనకున్న పలుకుబడితో అధికశాతం మందికి కేసీ వేణుగోపాల్ టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు విడివిడిగా భేటీ అయినప్పుడు 47 మంది ఆయన వైపే మొగ్గారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంతమంది ఆయన వెనకుండటం చిన్న విషయం కాదు. అయితే మిత్ర పక్షాలు, ముఖ్యంగా ఐయూఎంఎల్ మరో నాయకుడు వీడీ సతీశన్‌కు ఇవ్వాలని సూచించాయి. మొన్నటివరకూ విపక్ష నేతగా ఉండటంవల్ల ఆ పార్టీలతో ఏర్పడిన సాన్నిహిత్యం సతీశన్‌కు పనికొచ్చినట్టుంది. రమేష్ చెన్నితలకు మద్దతు పలికినవారి సంఖ్య స్వల్పం. ఎన్నికలొస్తే ఓటమిపాలవుతామన్న బెరుకుకన్నా, గెలిస్తే ఎవరిని ఎలా ఒప్పించా లన్న చింత పార్టీ అధినాయకత్వానికి అధికం. ఇందుకు తనను తానే నిందించుకోవాలి. రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషిచేస్తూ, ప్రజానీకంలో పట్టు సాధించిన వారంటే నాయకత్వానికి భయం. అందుకే వారికి సమాంతరంగా మరొకరిని ప్రోత్సహించటం అలవాటు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల ముఠా కక్షలు ముదిరి పార్టీ చీలికదాకా పోయింది. కాంగ్రెస్‌లో ఎప్పటికీ తనకు భవిష్యత్తు ఉండబోదన్న నిర్వేదంతో ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిజానికి కేరళ విషయంలో జరిగినంత జాప్యం గతంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి చోట్ల లేదు. ఆ రాష్ట్రాల్లో కూడా సీఎం కుర్చీ కోసం నాయకులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు బయటికొచ్చాయి. అయితే పార్టీలోని యువతరం ఎక్కువగా సతీశన్వైపే మొగ్గింది. కొందరు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించిన నేతలపై చర్య తీసుకోవటంలో సతీశన్ వెనకాడకపోవటం, ఫలానా కులంవారూ, మతంవారూ దూరమవుతారని ఎందరుచెప్పినా వినకపోవడం యువతను ఆకర్షించింది. మంత్రిగా అనుభవం లేకున్నా నిజాయితీ, మంచి చదువరి కావటం, మేధోపరమైన అంశాలు చర్చించటంవంటివి సతీశన్కున్న అదనపు అర్హతలు. యూడీఎఫ్‌కు వందకుమించి స్థానాలు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాలు కూటమికి ఉత్సాహాన్నిచ్చింది. కాంగ్రెస్‌లో నాయకత్వం దక్కితే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవటానికి భిన్న వర్గాలను ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆకాంక్షలు తీర్చాలి. ఆ విషయంలో సతీశన్ ఏ మేరకు విజయం సాధిస్తారన్నది మున్ముందు తెలుస్తుంది. -
తడబడని తొలి అడుగులు
తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి అంచనాలకూ దొరకని రీతిలో ప్రారంభమై రెండేళ్ల పాటు దాన్నే కొనసాగించి చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన టీవీకే ఏలుబడి మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 144 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 22 మంది, అయిదుగురు తటస్థంగా ఉండి పోయారు. డీఎంకే, డీఎండీకే, పీఎంకే, బీజేపీలు వాకౌట్ చేశాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం మొదలుకొని సమావేశం పొడవునా విజయ్ వ్యవహరించిన తీరు, విశ్వాస తీర్మానంపై చర్చకు జవాబిస్తూ చేసిన ప్రసంగం విమర్శలకు తావీయకుండా ముగియటం గమనించదగ్గది. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పటం మద్దతుగా నిలిచిన వామపక్షాలకూ, వీసీకేకూ ఊరటనిచ్చివుంటుంది. విజయ్ అణుకువతో, ఆవేశానికి తావీయని రీతిలో ఉంటూనే చేయదల్చుకున్నది చేస్తారని ఈ సమావేశం రుజువుచేసింది. వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఓఎస్డీగా నియమించటాన్ని మిత్రపక్షం వీసీకే విశ్వాస తీర్మానం సమయంలో నిలదీసి నప్పుడు విజయ్ భేషజానికి పోకుండా వెంటనే ఆ నియామకాన్ని పునస్సమీక్షిస్తానని ప్రకటించారు. ఆ వెంటనే దాన్ని రద్దుచేసినట్టు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ప్రార్థనాస్థలాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు వగైరాలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండొచ్చన్న నిబంధనను 500 మీటర్లకు సవరించటం, అది వెంటనే అమల్లో కొచ్చి పదులకొద్దీ దుకాణాలు మూతబడటం కూడా జనం మెచ్చే చర్య.విజయ్ రాక ఇప్పటికే ప్రధాన కూటములు, పార్టీల్లో ఊహించని ప్రకంపనలకు దారి తీసింది. దాదాపు ఆరు దశాబ్దాల చరిత్రగల ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు జనం ఆదరణ కరవై దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఎన్నో సంక్షోభాల్ని తట్టుకుని నిలబడ్డ డీఎంకే–కాంగ్రెస్ కూటమి చెల్లాచెదురైంది. అందలం కోసం ఆత్రపడి కాంగ్రెస్ డీఎంకే చెలిమిని వదులుకు పోయిందిగానీ సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు అదే కూటమిలో కొనసాగుతూనే విజయ్‌కి మద్దతివ్వక తప్పని స్థితికి చేరుకున్నాయి. అన్నాడీఎంకే చీలి ఆ పార్టీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది మాజీ మంత్రి షణ్ముగం ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు, మాజీ సీఎం పళనిస్వామికి షాకిచ్చారు. దాంతో టీవీకేకు చిన్న పార్టీల అవసరం నిజానికి ఇప్పటికే తీరిపోయింది. ఎవరిది అసలైన అన్నాడీఎంకే అనే అంశం తేలేసరికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎక్కడా టీవీకే లేదా వ్యక్తిగతంగా విజయ్ ఆరోపణలు ఎదుర్కొనలేదు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడకుండానే, గట్టి హామీలు ఇవ్వకుండానే అన్నాడీఎంకే చీలిపోయిందంటే ఎవరూ నమ్మరు. కానీ అదెక్కడా ప్రచారంలోకి రాకపోవటం విజయ్ వ్యూహచతురతకు నిదర్శనం. ద్రవిడ పార్టీలను ఎలాగైనా బలహీనపరచాలని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకూ చేయని ప్రయత్నమంటూ లేదు. కాంగ్రెస్, బీజేపీలతో అవసరార్థం పొత్తు కుదుర్చుకుంటూనే వాటిని జనానికి చేరువ కానీయకుండా చేయటంలో అన్నాడీఎంకే, డీఎంకేలు ఇన్నాళ్లూ విజయం సాధించాయి. కానీ పార్టీకి ద్రవిడ నామం లేకుండా వచ్చిన విజయ్ సునాయాసంగా ఆ రెండు పక్షాలనూ మట్టికరిపించారు. అలాగని పెరియార్ రామస్వామి వంటివారిని ఉపేక్షించ కుండా నివాళులర్పించారు. ఆయన ఒకరకంగా రాష్ట్ర రాజకీయాల్లో మూడోపక్షానికి అవకాశం ఉన్నదని నిరూపించారు. విజయ్ సినిమా ఇతివృత్తాలు కథానాయకుడు తనకెదురయ్యే అవరోధాలను ఎదుర్కొనటం అనే అంశం చుట్టూ తిరుగుతాయి. చివరగా హీరో విజయం సాధించటంతో అవి ముగుస్తాయి. గత వారం రోజుల పరిణామాలు సైతం అదే ఒరవడిలో వెళ్లాయి. నాటకీయత లేకుండా సాధ్యమైనంత తక్కువ మాట్లాడటం, చేయదల్చుకున్నది తక్షణం చేయటం ఆయనలో కనబడే ప్రత్యేక లక్షణం. దీన్నే కొనసాగిస్తే, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనబడిన జనాకర్షణ కాస్తా త్వరలోనే దృఢమైన పునాదిగా మారి, రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుంది. -
జీరో మార్కుల ‘నీట్’!
ఉన్న ఊరునూ, అయినవాళ్లనూ వదిలి వేలాది రూపాయలు వెచ్చించి పట్టణాలు, నగరాలకొచ్చి రాత్రింబగళ్ల ధ్యాసే లేకుండా, తిండితిప్పలు పట్టించుకోకుండా ‘నీట్’ పోటీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకోవటంలో తలమునకలైన లక్షలాదిమంది విద్యార్థులు మరోసారి దగా పడ్డారు. ఈ నెల 3న దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీకయిందంటూ ఆ పరీక్ష కాస్తా మంగళవారం రద్దుచేశారు. విద్యార్థులు ఈ వేసవిలో మళ్లీ తిప్పలుపడాలి... కోచింగ్ కోసం మరోసారి అవస్థలు పడాలి. పోటీ పరీక్ష రాశాక ఫలితాలకన్నా ముందు లీకయిందనే వార్తలొస్తాయేమో, మళ్లీ రాయకతప్పదేమోనని కంగారుపడేంతగా ఆ వ్యవస్థను నిర్వాహకులు భ్రష్టుపట్టించారు. పదే పదే ప్రశ్నపత్రాలు లీకవుతున్నా అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత! ఒకసారి జరిగిందంటే అనుకోకుండా జరిగిందిలే అని సర్దిచెప్పుకోవచ్చు. ఈసారి తగిన కట్టుదిట్టాలు చేస్తారని సరిపెట్టుకోవచ్చు. ప్రతియేటా ఇదే ప్రహసనమైతే ఏమనాలి? విద్యార్థులకు సక్రమంగా పరీక్షలు నిర్వహించటంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి ఎప్పుడూ సున్నా మార్కులే వస్తున్నాయి.ఈసారి 22 లక్షలమందిపైగా ‘నీట్’ యూజీ పరీక్ష రాశారు. పరీక్ష రోజున దేశ వ్యాప్తంగా జరిగే హడావుడికి అంతులేదు. తనిఖీ పేరిట గేటువద్ద నిర్వహించే శల్య పరీక్షలతోపాటు ఆడపిల్లల ముక్కుపుడకలు, దుద్దులు మొదలుకొని పట్టాలవరకూ అన్నీ తీయించిగానీ లోపలికి పంపరు. ఒకటి రెండు నిమిషాలు లేటయ్యారని వెనక్కిపంపడం షరా మామూలు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, 5జీ జామర్ల ఆర్భాటం సరేసరి. పరీక్షార్థుల లేత ముఖాల్లో కనబడే ఆదుర్దా, వారికి తల్లిదండ్రులిచ్చే భరోసా చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారన్న వేదన కలుగుతుంది. మారుమూల అడవుల్లో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో సమాచారం రాబట్టుకునేంత సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అడుగడుగునా నిఘా నీడలు పరుచుకున్నాయని అర్థమ య్యేంతగా నిశితమైన చూపులు వెన్నాడుతుంటాయి. కానీ వాట్సాప్ మాధ్యమంలో వేలాదిమందికి ప్రశ్నపత్రం అందినా 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కచోటా వెనువెంటనే ఏ ప్రభుత్వా నికీ ఉప్పందలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అత్యధిక శాతంమంది హాజరయ్యే పరీక్షల్లో ఒకటైన ‘నీట్’ను స్వచ్ఛంగా, నిర్దుష్టంగా, అవినీతిరహితంగా నిర్వహించుకోలేక పోవటం ఎంత నామర్దా! మంచికో చెడుకో ప్రజాస్వామ్యంలో ‘మెరిట్’కుండే ప్రాధాన్యత, దానికుండే గౌరవా దరాలు అపారం. ‘పుట్టకవల్లే ప్రతిభ’ అనే భావన నిరాకరించి, డబ్బుకొద్దీ చదువన్న వాదన తిరస్కరించి అందరికీ సమానావకాశాలు కల్పించటం మంచిదే. కానీ కోచింగ్ పేరిట డబ్బులు దండుకునే వ్యవస్థ వచ్చిపడింది. హాజరైనవారిలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేయటానికి చిక్కుముడులతో ప్రశ్నలుంటాయి. ఉండే సీట్లు తక్కువ, ఆశించే పిల్లలు ఎక్కువమంది ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని సరిపెట్టుకున్నా... పరీక్ష నిర్వాహకులకూ, ప్రభుత్వాలకూ పరువుప్రతిష్ఠలపై పట్టింపు ఉండొద్దా? సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకుందామన్న తాపత్రయం కలగొద్దా? దేశవ్యాప్తంగా దాదాపు 400 మెడికల్ కళాశాలలు నిర్వహించే 40 వరకూ ప్రవేశపరీక్షలు రాయటం, అందుకోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిరావటం సమస్యాత్మకమవుతున్నదని 2016లో ‘నీట్’ తెచ్చి నప్పుడు చెప్పారు. వివిధ పరీక్షలకు వేర్వేరుగా సంసిద్ధం కావటంకన్నా ఒక్క పరీక్షతో ముగుస్తుందని అనేకులు సంతోషించారు. పైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ఏర్పడే సంస్థ నిర్వహించే పరీక్ష పకడ్బందీగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ జరుగుతున్నదేమిటి? ఎప్పుడు చూసినా లీకులు, మోసాలు, అవకతవకలు! పరీక్షకు పక్షంరోజులముందే ‘ఊహాజనితమైనవ’న్న పేరిట 410 ప్రశ్నలు రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో చక్కర్లుకొట్టాయనీ, అటుతర్వాత దేశమంతా వ్యాపించాయనీ వస్తున్న వార్తలు నిజమైతే అంతకన్నా ఘోరం మరొకటుండదు. విద్యారంగంలో మాఫియా ముఠాల ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి తెలుస్తుంది. లక్షలాదిమంది జీవితాకాంక్షలను చిదిమేసే లీకుల్ని అరికట్టి తీరాలన్న సంకల్పం ఇప్పటికైనా పాలకుల్లో కలిగితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదు. -
పొదుపు కాలం
ఎన్నికల హోరు సద్దుమణిగి, రాష్ట్రాలన్నిటా ప్రభుత్వాల ఏర్పాటు పూర్తికావస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ పౌరులనుద్దేశించి ఒక హెచ్చరిక లాంటి హితోపదేశం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పర్యవసానంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించటానికి కోవిడ్ కాలంలో అనుసరించిన పొదుపు చర్యలు తప్పనిసరంటూ పౌరులకు సూచించారు. ఆయన చెప్పినవాటిల్లో వర్క్ ఫ్రం హోం, ప్రజారవాణా వ్యవస్థల వినియోగం, ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల నిలిపివేత, విదేశీ ప్రయాణాలు మానుకోవటం, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించటం వంటివి ఉన్నాయి. ఇందులో చాలా వరకూ పాటించదగ్గవే. దీనికితోడు ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు మూసేస్తారు. సోమవారం వెల్లడైన వివరాలనుబట్టి చమురు సంస్థలు రోజూ రూ. 1,700 కోట్లు నష్టపోతున్నాయని తెలుస్తోంది. గత పది రోజుల్లో మొత్తంగా నష్టాలు రూ. లక్ష కోట్ల మేర ఉన్నాయనీ దాని సారాంశం. నిజానికి ఎన్నికల ప్రచారపర్వం మధ్యలో మోదీ ఒకసారి చూచాయగా పరిస్థితి తీవ్రతను చెప్పారు. కానీ ఎన్నికల అనంతరం పెట్రో ధరలు భారీగా పెరుగుతాయనీ, పర్యవసానంగా అన్ని సరుకుల ధరవరలూ ఆకాశాన్నంటుతాయనీ విపక్షాలు ప్రచారం చేయటంతో బీజేపీ బెంబేలుపడి ఇక దాని జోలికిపోలేదు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను బెంబేలెత్తిస్తోంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్, అమెరికాలు దిగ్బంధించటంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. మన దేశం మాత్రమే వీటన్నిటికీ అతీతంగా మనుగడ సాగిస్తుందనీ, మన ఆర్థిక వ్యవస్థ అన్నిటినీ తట్టుకోగలదనీ భావించటం అమాయకత్వం. చైనా మొదలుకొని ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక తదితర దేశాలు ఇప్పటికే రక రకాల చర్యలు అమల్లోకి తెచ్చాయి. చమురు ఎగుమతులన్నీ ఆపేయాలని దేశంలోని చమురుశుద్ధి కర్మాగారాలను చైనా ఆదేశించటంతోపాటు పెట్రో ధరల్ని కూడా పెంచింది. జెట్ ఇంధనం ధరలు పెరగటంతో అక్కడి ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు సర్వీసుల్ని నిలి పేశాయి. ఫిలిప్పీన్స్ మార్చిలోనే జాతీయ ఆత్యయిక స్థితిని ప్రకటించింది. వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని ప్రకటించింది. ఆస్ట్రేలియాలో కొన్ని రాష్ట్రాలు ప్రజా రవాణా వ్యవస్థను ఉచిత సర్వీసుగా మార్చటం లేదా టికెట్ ధరలు తగ్గించటం వంటి చర్యలు తీసుకున్నాయి. సొంత వాహనాల వాడకం తగ్గించటమే దీని ఉద్దేశం. శ్రీలంక కూడా వారానికి నాలుగు రోజుల పనివిధానం ప్రకటించి, వారానికి ఒకరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించటంతోపాటు ఇంధనంపై రేషన్ విధించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్, అమెరికా పంతాలకు పోవటంతో 1,500 నౌకలు నిలిచిపోయాయి. అందులో మన నౌకలు 13 వరకూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ ప్రతిపా దనల్ని అమెరికా తోసిపుచ్చడంతో యుద్ధం ఇప్పట్లో సద్దుమణుగుతుందన్న ఆశ అడుగంటింది. ఉన్నకొద్దీ పరిస్థితి ముదరవచ్చు. అందుకే ప్రధాని చెప్పిన పొదుపు చర్యలు తక్షణ కర్తవ్యం. అయితే ఈ ఆచరణ ప్రభుత్వాలపరంగా మొదలుకావాలి. ఆర్భాటాల్లేకుండా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ ముగించటం, సాధ్యమైనంతవరకూ ప్రత్యేక విమానాల వాడకం ఆపేయటం, సీఎంలు, మంత్రుల కాన్వాయ్‌లలో పదులకొద్దీ వాహనాల వినియోగం వంటివి విరమించుకోవాలి. ఇక ఏపీ వరకూ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల నివాసాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వారాంతంలో ప్రత్యేక విమానాల్లో వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి దుబారా అవసరమా? మన దిగుమతుల్లో బంగారం, చమురు సింహభాగం ఆక్రమిస్తాయి. 2025–26లో బంగారం దిగుమతుల విలువ 7,200 కోట్ల డాలర్లు. మనకు అవసరమైన చమురులో 90 శాతంమేర దిగుమతి చేసుకుంటున్నాం. మొన్న ఏప్రిల్ 24కు మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 69,000 కోట్ల డాలర్లయితే, ఒక్క వారంలో అంటే... ఈనెల 1 నాటికి అందులో 779 కోట్ల డాలర్లమేర హరించుకుపోయాయి. ఇదే వరస కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. అయితే ఏమేరకు పొదుపు అవసరమనేది కూడా చూసుకోవాలి. అది మితిమీరినా ఆర్థికవ్యవస్థకు చేటు తప్పదు. కనుక సమతుల్యత అత్యవసరం. -
చక్రభ్రమణం
ఆశ, నిరాశ, దురాశ, అత్యాశ... ఓహ్, ఆశకెన్ని రూపాలో! అవన్నీ మనిషిలోనే ఉన్నాయి, మనిషిని శాసిస్తూనే ఉన్నాయి; మనిషి చరిత్రను కొత్త మలుపు తిప్పుతూనే ఉన్నాయి. మనిషిలోని దురాశ హఠాత్తుగా యుద్ధవిధ్వంసాలవైపు నడిపిస్తుంది; అదే మనిషిని తిరిగి నిరాశ ఆవహిస్తుంది, అందులోంచి మళ్ళీ ఆశ మొలకెత్తుతుంది. ఇలా ఆశ,నిరాశ, దురాశ, అత్యాశల చక్రం తిరుగుతూనే ఉంటుంది. తన నిరాశను, ఆశతో జయించే ప్రయత్నంలో ఆ నిరాశకు కారణమైన వ్యక్తిని కడతేర్చడం, తిరిగి అవతలి పక్షాన్ని నిరాశ లోకి నెడుతుంది. ఏ యుద్ధంలోనైనా జరిగేది అదే. ఒకరి ఆశ, ఇంకొకరికి నిరాశ! సీతను కోల్పోయి శోకంలో మునిగిన అంతటి రామునిలోనూ ఆశాభావం నింపే బాధ్యతను తమ్ముడు లక్ష్మణుడు తీసుకున్నాడు. ‘ఉత్సాహమే బలం, ఉత్సాహవంతుడికి లోకంలో సాధించలేనిదేమీలే’ దన్నాడు. అలా మేలుకున్న ఆశతో రాముడు సాధించిన విజయం, అవతల మండోదరితో సహా రావణుని పరివారం మొత్తాన్ని శోక, నిరాశల్లో ముంచింది. అంతిమంగా జరిగింది, శోకనైరాశ్యాలు చోటు మారడమే. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందీ అదే. అయితే, తన ఆశావిజయం ధర్మరాజు శేషజీవితాన్ని శోకమయం చేసింది తప్ప ఊరటనివ్వలేదని, అదే మహాభారతం చెబుతోంది. రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన జీవనకల్లోలం మహాకవి శ్రీశ్రీని నిరాశలోకి తోసింది; ‘నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా/మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా/దారుణద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా/ బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా’ అన్న సందేహాల సందోహంలోకి నెట్టింది; ‘బతుకు వృథా, చదువు వృథా, కవిత వృథా; లేదు సుఖం, చేదువిషం జీవఫలం’ అంటూ ‘చేదుపాట’ పాడించింది. అంతలోనే ఆశ పుంజుకుని మరో ప్రపంచ మహావిష్కారం దిశగా మరో ప్రస్థానం ప్రారంభించింది. తొమ్మిది దశాబ్దాలు కావస్తున్నా, ఆ మరోప్రస్థాన గమ్యం చూపు మేరలో లేదు. జీవఫలం చేదువిషం నింపుతూనే ఉంది; దురాశ వికటించి మనిషి ప్రపంచాన్ని యుద్ధవిలయాలవైపు నడిపిస్తూనే ఉన్నాడు. ‘కాలం బందీ అయి నెత్తురోడే/ కాలం కాని ఈ కాలాల్లో కొంచెం వేచి ఉండు/ ఈ మురుగు ప్రవాహాన్ని ఇప్పుడే ఆపలేవు/ నెమ్మదిగా, నిశ్శబ్దంగా, సహనంగా/ రహస్యంగా, ధైర్యంగా, నమ్మకంగా/ మిగిలి ఉండు, వేచి ఉండు/ తప్పులను లెక్కించి లెక్కించి/ వెక్కి వెక్కి ఏడ్చి ఏమి లాభం/లే, చావులేని నూతన స్వప్నాన్ని పిలువు’ (విమల) అంటూ, ఊపిరి కడంటుతున్న ఆశకు శ్వాసపోసే కవియత్నం ఇప్పటికీ నిరవధికమవుతూనే ఉంది. ఆశల కాగడా పుచ్చుకుని నైరాశ్యపు చీకటిని తరించడానికి మనిషి స్థలకాలాలకు అతీతంగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కవి, కథకులెందరో అక్షరాల నేలలో ఆశల సేద్యం చేస్తూనే ఉన్నారు. ఓ.హెన్రీ ‘చివరి ఆకు’ కథ గుర్తుందా! ఓ దారుణ శీతర్తువులో తీవ్రంగా జబ్బుపడిన జాన్సీ అనే ఒక యువచిత్రకారిణి తన గది కిటికీ లోంచి ఓ గోడమీద పాకిన లతనే చూస్తూ, రోజురోజుకూ రాలిపోయే దాని ఆకులతో తన రోజుల్ని ముడిపెట్టుకుని ఆందోళన చెందుతుంది. చివరికి ఒక్క ఆకు మాత్రమే మిగులుతుంది. అంతలో పెద్ద గాలివాన వచ్చి వెలుస్తుంది. ఆశ్చర్యం, మరునాడు చూసేసరికి ఆకు అలాగే ఉంటుంది; దాంతో ఆమె జీవనోత్సాహాన్ని పుంజుకుంటుంది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, బెయిర్మన్ అనే ఓ వృద్ధ కళాకారుడు, జాన్సీలో జీవితాశ రగిలించే బాధ్యతను మీద వేసుకుని ఆ గోడమీద వాస్తవికత ఉట్టిపడే ఒక ఆకుబొమ్మ చిత్రిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను గాలివాన ప్రభావానికి గురై జబ్బుపడి మరణించడం– కథ తిరిగిన ఓ విషాదకరమైన మలుపు. మోడువారిన చెట్లు చిగురించడం; వసంతం వెంటే గ్రీష్మం అడుగుపెట్టడం చూపించి ఆశ, నిరాశల చక్రభ్రమణం ప్రకృతిలోనే ఉందికదా, మనిషి ఎంత అనవచ్చు. కానీ ఎన్ని రంగాలలో మనిషి ప్రకృతిపై జయకేతనం ఎగురవేయడం లేదు! ఈ చక్రభ్రమణాన్ని ఛేదించలేడా? రేపటికి వాయిదా వేయకుండా ఈ రోజే ఈ ప్రపంచాన్ని పూర్తిగా ఆశావహం చేయలేడా?! -
కోల్‌కతా టూ చెన్నయ్!
బెంగాల్ విజయంతో బీజేపీ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం పూర్తయినట్టే. జాతీయోద్యమ కాలంలో సమున్నతంగా రెపరెప లాడిన సాంస్కృతిక పతాకం బెంగాల్! ‘ఇవాళ బెంగాల్ ఏమని ఆలోచిస్తుందో రేపు మిగతా భారతదేశం అదే ఆలోచిస్తుంద’ని గోపాలకృష్ణ గోఖలే చేసిన ప్రశంస చరిత్ర ప్రసిద్ధమైనది. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం కూడా బెంగాలే. బీజేపీ తీవ్రంగా ద్వేషించే కమ్యూనిస్టు భావ జాలానికి దేశంలో ఒక దిక్సూచి మాదిరిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు బెంగాల్ నిలబడింది. అటువంటి బెంగాల్లో అఖండ విజయాన్ని సాధించినందున ఆ విజయానందం బీజేపీ శ్రేణుల్లో తొణికిసలాడుతున్నది. సువేందు అధికారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేదికపైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాలీ ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఎన్డీఏ దిగ్గజాలతో పాటు, ఆ కూటమికి చెందిన అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ పర్వదినంగా మార్చారు.బెంగాల్ సరే, బీజేపీది చారిత్రాత్మకమైన విజయమే. మరి ఒక్క సీటే గెలిచిన తమిళనాడులో ఏ ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ హైటెన్షన్ డ్రామాను నడిపించింది? అత్యధిక సంఖ్యా బలం కలిగిన విజయ్ ఐదు రోజులపాటు గవర్నర్ కటాక్షం కోసం ఎందుకు నిరీక్షించవలసి వచ్చింది? ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పక్షం నేతను గవర్నర్ ఆహ్వానించాలనీ, శాసనసభ వేదికపై బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నీయాలనీ గతంలో సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. మెజారిటీ బలపరీక్ష జరగాల్సింది శాసనసభలో తప్ప, రాజ్‌భవన్ (లోక్ భవన్)లో కాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా, పూంఛీ కమిషన్లు కూడా ఇదే మాటను చెప్పాయి. సంప్రదాయాలు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి. 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 161 స్థానాలను గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. 140 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. లోక్‌సభలో మెజారిటీ సీట్ల కంటే బీజేపీకి 111 సీట్లు తక్కువున్నాయి. అయినప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ బీజేపీ నేత వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. దేశ ఆర్థిక గమనాన్నే ఒక మలుపు తిప్పిన పీవీ నరసింహారావు కూడా మైనారిటీ ప్రభుత్వాన్నే చాలా కాలంపాటు నడిపారు. 240 సీట్లే గెలిచిన కాంగ్రెస్ పార్టీ 1991లో పెద్ద పార్టీగా అవతరించడంతో, మెజారిటీకి 32 సీట్లు తక్కువ ఉన్న ప్పటికీ నాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ప్రభుత్వ ఏర్పాటుకు పి.వి. నరసింహారావును ఆహ్వానించారు. 2018లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప కూడా ఇదే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి, ప్రస్తుత తమిళనాడు తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు ఎందుకింత ధర్మం మీమాంస ఏర్పడిందో, ఎందుకు విజయ్ను పడిగాపులు పడేలా చేశారో తెలుసుకోవడం అసాధ్యమేమీ కాదు.బెంగాల్ మాదిరిగానే తమిళనాడు కూడా ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన రాష్ట్రం. వర్తమాన చరిత్రలో ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో ముందంజలో ఉన్న ఘనత దానిది. సంప్రదాయాలూ– హేతుబద్ధమైన ఆలోచనలూ సహజీవనం చేసే గతిశీలత కలిగిన ప్రాంతం. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బీజేపీకి అడుగు మోపే అవకాశం చాలా కాలంగా చిక్కడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీ అన్నాడీఎంకేను లొంగదీసుకుని ఎన్డీఏ కూటమిలో చేర్చు కున్నా కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రావడం లేదు. ఇప్పుడు రెండు ద్రవిడ పార్టీలను వెనక్కు నెట్టి దళపతి విజయ్ అత్యధిక స్థానాలు సాధించడంతో తమిళ రాజకీయాలు బీజేపీకి మరింత పజిల్‌గా మారాయి.పూర్తి మెజారిటీకి కేవలం 10 సీట్లు మాత్రమే తక్కువ గెలిచిన విజయ్, గవర్నర్ నిర్ణయం కోసం ఐదు రోజులుగా నిరీ క్షించవలసి వచ్చింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మద్దతు తర్వాత పూర్తి మెజారిటీకి కేవలం ఒకే ఒక్క సీటు తక్కువున్నప్ప టికీ, మూడుసార్లు గవర్నర్‌ను విజయ్ కలిసి శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు నాలుగోసారి శనివారం సాయంత్రం 121 మంది మద్దతుదారుల జాబితాతో, వివిధ పార్టీల మద్దతు లేఖలతో కలిసిన తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అనుమతి లభించింది. బీజేపీ వ్యూహం ప్రకారమే గవర్నర్ ఈ నాటకాన్ని నడిపారనే అభిప్రాయం జనసామాన్యంలో సహజంగానే వ్యాపించింది. తమిళగ వెట్రి కళగం (విజయ్ పార్టీ)తో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తొలుత ఆ పార్టీ నాయకుడు పళని స్వామి ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాద నతో ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి స్టాలిన్ అంగీకరించలేదని తెలుస్తున్నది. బీజేపీ ఆశీస్సులు లేకుండా పళని స్వామి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని ఊహించలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ సహకారం లేకుండా రాజ కీయాలు నడపడం అంత తేలిక కాదని విజయ్ గ్రహించడం కోసమే బీజేపీ ఈ సాగదీత డ్రామాను నడిపించినట్టు కూడా మరో వాదన ఉన్నది.పళని స్వామి ప్రయత్నాలేమో గానీ, ఆయన పార్టీకే ఎసరు పెట్టే పరిణామాలు శనివారం నాడు జరిగాయి. ఆయన నిర్వ హించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు గైర్హాజర య్యారు. అన్నాడీఎంకేలో మరో సీనియర్ నాయకుడు ఆర్వీ షణ్ముగం నాయకత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు సమావేశ మయ్యారనే వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీలో మెజారిటీ నిరూ పించుకునే అవకాశం విజయ్కిస్తే అన్నాడీఎంకేకు ఉన్న 47 మందిలో మెజారిటీ సభ్యులు విజయ్‌కు అనుకూలంగా ఓటేస్తా రనే ఆంతరంగిక సమాచారం బీజేపీకి ఉన్నందువల్లనే అటువంటి పరిస్థితి రానీయకుండానే ఈ తాత్సారాన్ని గవర్నర్ కొన సాగించారనే అభిప్రాయం ఉన్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసమే ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతు న్నామనే డ్రామాను పళని స్వామి నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.అన్నాడీఎంకేను అవమానకర పరిస్థితి నుంచి గట్టెక్కించ డానికి గవర్నర్ ద్వారా బీజేపీ సేఫ్ గేమ్ ఆడితే మరో రకమైన పాజిటివ్ గేమ్‌ను డీఎంకే నడిపించింది. డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టాలిన్‌తో మాట మాత్రమైనా చెప్పకుండానే విజయ్‌కు మద్దతు ప్రకటించి కూటమి ధర్మాన్ని గంగలో కలిపింది. నిజానికి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టాలిన్ వ్యతిరేకం కాదు. పెద్ద పార్టీగా గెలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని గవర్నర్‌కు కూడా సూచించారు. అయితే ఈ వ్యవహారాన్ని భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి స్టాలిన్ ప్రయత్నించారు. స్టాలిన్‌తో సంబంధం లేకుండా విజయ్‌కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసు కున్నారు. మరోసారి మిత్రద్రోహానికి పాల్పడిన అపకీర్తిని కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకున్నది.స్టాలిన్ సలహా మేరకే సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూ ఎంఎల్ పార్టీలు ఒకరి తర్వాత మరొకరు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వంలో అన్నాడీఎంకే ఏ రూపంలోనూ భాగస్వామి కాకుండా ఉండేందుకే స్టాలిన్ ఈ ఎత్తుగడను అవలంబించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ వీసీకేకు కీలక పదవి లభించేలా పావులు కదిపి పరోక్షంగా తన పలుకుబడిని కొనసాగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉన్నది. వీసీకే ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నదనే వార్తలు కూడా శనివారం వెలువడ్డాయి. అయితే చివరకు బేషరతుగానే వీసీకే మద్దతు లేఖను సమర్పించింది. లోపాయికారి షరతులు ఏమైనా ఉన్నాయేమో తెలి యదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలస్యంగానైనా విజయ్‌కు లైన్ క్లియర్ అయింది.ప్రస్తుతానికైతే తమిళనాడులో బీజేపీ పాచిక పారినట్టు కనిపించడం లేదు. అన్నాడీఎంకేను ముందు పెట్టుకొని వేసిన ఎత్తులు స్టాలిన్ అప్రమత్తత వల్ల ఫలించలేదు. ఇకముందు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. పదేళ్లపాటు విరామమెరుగని పోరాటం చేసి బెంగాల్‌ను గెలుచుకున్న బీజేపీ తమిళనాడుపై ఆశలు వదులుకుంటుందని భావించలేము. శనివారం కోల్‌కతాలో జరిగిన సువేందు ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సోమవారం నాడు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళుతున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తున్నది. సరిగ్గా వెయ్యేళ్ల కింద భారత్ పైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ భద్రపరిచిన అపార ధనరాశిని కొల్లగొట్టాడని చరిత్ర చెబుతున్నది. మహమ్మదీయ దాడులు ఈ ఆలయంపై పలుమార్లు జరిగాయని కూడా చరిత్ర లిఖించింది.మత దురహంకారాలు, విద్వేషాలు చెలరేగిన మధ్య యుగాల నాటి పరిస్థితికి సోమనాథ్ ఆలయ విధ్వంసం ఒక ప్రతీక. ఈ గజనీల లక్ష్యం కేవలం సంపద లూటీ మాత్రమే కాదనీ, ప్రజల విశ్వాసాలను దెబ్బతీయటం కూడా వాటి ధ్యేయ మనీ అల్బెరూనీ అనే పర్షియన్ పండితుడు తన రచనల్లో విశ్లే షించాడు. ఇదంతా వెయ్యేళ్లనాటి మాట. మతమౌఢ్యాలు రాజ్య మేలిన నాటి పరిస్థితి. ఈ వెయ్యేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశం లౌకిక రాజ్యాంగాన్ని రచించుకున్నది. ఈ నేపథ్యంలో సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకొని దేశవ్యాప్తంగా అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ ప్రకటనలను గుప్పించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే సోమనాథ్ ఆలయానికి హిందూ సమాజంలో విశిష్ట స్థానం ఉన్నది.దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా సోమనాథ్ ప్రసిద్ధి చెందింది. బెంగాల్లో విజయం అనే ఒక చారిత్రకమైన మైలురాయిని బీజేపీ దాటిన వెంటనే సోమనాథ్ ఆలయ సందర్భం రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ జాతీయతను, మతాన్ని కలగా పులగం చేసే బీజేపీ రాజకీయ వ్యూహానికి ఉపకరించే విధంగానే ఈ సందర్భాన్ని బీజేపీ మలుచుకుంటున్నది. రాజ్యాంగ లౌకిక స్వభావాన్ని బలహీనపరచడంతో పాటు తన సైద్ధాంతిక విరో ధులైన కమ్యూనిస్టుల భావజాలాన్ని కూడా తుడిచేశామన్న ఆనందం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 డెడ్‌లైన్ పెట్టి మరీ బుల్లెట్ కమ్యూనిస్టులను అణచివేశామనీ, కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో బ్యాలెట్ కమ్యూనిస్టులు కూడా అంతరించినట్టేననీ వారు భావిస్తున్నారు. ప్రధాని కూడా తన మనోగతాన్ని దాచుకోలేదు. ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఫలితంగానే ప్రపంచంలోనూ, దేశంలోనూ, అడవుల్లోనూ కమ్యూనిస్టులు అంతరించారని మొన్నటి విజయోత్సవ సభలో ప్రకటించారు. బహుశా ఈ సంగతి డోనాల్డ్ ట్రంప్‌కు తెలిసినట్టు లేదు. మమ్దానీ వంటి సోషల్ డెమోక్రాట్లను చూసి కూడా కమ్యూనిస్టులున్నారని ఆయన కంగారు పడుతున్నారు. కోల్ కతా, చెన్నయ్ నగరాల్లో శనివారం నాడు ఆవిష్కృతమైన రెండు సన్నివేశాలు బీజేపీ రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నాయి. కోల్‌కతాలో అంతా అంగరంగ వైభోగం. చెన్నయ్‌లో విజేతకు ఆఖరి నిమిషం దాకా అంతులేని టెన్షన్. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విజయారోహణలో ట్విస్టులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రివాజుకు భిన్నంగా ప్రధాన ద్రవిడ పార్టీలు రెండింటినీ రెండంకెలకు పరిమితం చేసి, రాజకీయ తెరపైకి విజేతగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్‌కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో చివరి నిమిషంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత అనుకున్నా వీసీకే, ఐయూఎంఎల్ లేఖలు రాలేదని అంటున్నారు.దాంతో విజయ్ వరసగా మూడోరోజు గవర్నర్‌ని కలిసినా ఫలితం లేకపోయింది.సొంతంగా 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తామని అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ప్రకటించగా, తాజాగా రెండేసి స్థానాలున్న సీపీఐ, సీపీఎంలు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం కాగా, రెండుచోట్లనుంచి గెలిచిన విజయ్ ఎటూ ఒక స్థానం నుంచి తప్పుకోవాలి గనుక టీవీకే నికర బలం 107. రాజీనామా చేసే స్థానం తమకిస్తేనే లేఖ ఇస్తామని వీసీకే పట్టుబట్టగా, ఐయూఎంఎల్ అసలు లేఖే ఇవ్వలేదంటున్నారు. ఈ అంకెల ఆట ఎలావున్నా, ఆర్లేకర్ తీరు సంప్రదాయాలకు విరుద్ధం. ఈనెల 6న విజయ్ తొలిసారి గవర్నర్‌ను కలిసినప్పుడే ఆ వ్యవహారం ముగియాల్సి ఉండగా ఎందుకనో దీన్నింకా సాగదీస్తున్నారు.ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ‘ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాద’ని తెలిపింది. ఉన్నవాటిలో మెజారిటీ పొందిన పక్షమేదో గమనించుకుని ఆహ్వానించటం, బల నిరూపణకు గడువీయడం తప్ప గవర్నర్‌కు మరే ప్రత్యామ్నాయమూ లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఎలా చూసినా ధర్మం కాదు. ఇది అనవసర అపోహలు, అనుమానాలకు తావిచ్చింది. కేంద్రం రాష్ట్రంలో అస్థిరత కోరుకుంటున్నదనీ, రాష్ట్రపతి పాలన విధిస్తారనీ వదంతులు వ్యాపించాయి. కొన్ని గంటలపాటు డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలుస్తాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అలా కలిసినా ఆ పక్షాలు విజయ్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం ఉండదు.ఈ ఊహాగానాలకు తావిచ్చేలా జాప్యం చేయటం అవసరమా? బలనిరూపణలో విఫలమైతే విజయ్ సర్కారు తప్పుకోవాల్సిరావొచ్చు. దానివల్ల కలిగే కష్టనష్టాలు ఆయన చూసుకుంటారు. ఆ పరిస్థితి ఏర్పడితే టీవీకే తర్వాత స్థానంలోవున్న పార్టీని ఆహ్వానించాలి.అంతేతప్ప లోక్‌భవన్‌లో లెక్కలు వేస్తూ కూర్చోవటం సరికాదు. విజయ్ తమ లేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ కూడా ఇవ్వటమే సమస్య తెచ్చిందని కొందరు వాదిస్తు న్నారు. ప్రజల మనోభీష్టం నెరవేర్చేందుకు సాంకేతికపరమైన అంశాలు అభ్యంతరం కావటం సరికాదు.పొరుగునున్న కర్ణాటకలో కొన్నేళ్లక్రితం బీజేపీకి తక్కువ స్థానాలొ చ్చినా మెజారిటీ స్థానాలున్నాయి గనుక దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ నిర్ణయాన్నెవరూ తప్పుబట్టలేదు. సర్కారియా కమిషన్ సైతం 1988నాటి నివేదికలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటములనూ, లేనట్టయితే ఉన్న పక్షాల్లో అత్యధిక స్థానాలొ చ్చిన పార్టీనీ పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ రెండేళ్లలో విజయ్ సాధించిన రాజకీయ అనుభవం సంగతేమోగానీ... ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయనకది దండిగానే దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరు జుగుప్సాకరంగావుంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమికి నాయ కత్వం వహిస్తూ తన భాగస్వామ్యపక్షం తమిళనాట ఓడిపోగానే చేతులు దులుపుకొని బయటకు పోవటం ఏం నీతి? అందువల్ల విజయ్‌కి వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, విపక్ష కూటమికి అది చేటు తెస్తుంది. కనీసం సహ భాగస్వామ్యపక్షాలు డీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎంలనైనా సంప్రదిస్తే మర్యాదగా ఉండేది.చివరకు సీపీఐ, సీపీఎం వచ్చి చేరాయిగానీ... రాజ్యాంగసంక్షో¿¶ నివారణకే ఆ పనిచేశాయి. ఆ మాత్రం వేచిచూడాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా, భవిష్యత్తు ఎన్నికలన్నిటికీ ఈ కొత్త పొత్తు వర్తిస్తుందని ప్రకటించి కాంగ్రెస్ మరింత చులకనైంది. ఒంటరిగా బరిలోదిగి తన సత్తాతో జనాభిమానం చూరగొని మెజారిటీ స్థానాలు పొందిన విజయ్‌కి అవకాశమీయకుండా మీనమేషాలు లెక్కించటం సరికాదు. అది అప్రజాస్వామికం. అన్ని అడ్డంకులూ తొలగి ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రజాభీష్టం నెరవేరుతుందని ఆశించాలి. -
కల్లోల కాలంలో శిఖరాగ్రం!
ప్రపంచం పెనుసంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో శుక్రవారం ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఏసియాన్) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు గురువారం ఏసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న వారంతా ఈ సంక్షోభ స్థితి గురించీ, దాన్ని అధిగమించటానికి గల మార్గాల గురించీ స్థూలంగా చర్చించారు. అమెరికా అనుసరిస్తున్న వైఖరి కారణంగా పశ్చిమాసియాలో ప్రతిష్టంభన ఏర్పడి, ఇంధన సంక్షోభం చుట్టుముడుతోంది. ఈ సంస్థలోని 11 సభ్య దేశాలూ ఇంధన దిగుమతులపై ఆధారపడినవే. ఈ ప్రతిష్టంభన వల్ల ఆహార సరఫరా మార్గాలు సైతం మూసుకుపోయాయి. వీటి జనాభా మొత్తంగా 70 కోట్లు. సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతోపాటు ఆహార పదార్థాల, సరుకుల లభ్యత గణనీయంగా పడిపోతుందనీ, ప్రాణావసర ఔషధాలు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతారనీ ఆసియాన్ దేశాలు భయాందోళనలు చెందుతున్నాయి. అర్థరహితమైన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో తన తొలి ఏలుబడిలోనే డోనాల్డ్ ట్రంప్ స్వీయరక్షణ చర్యలు మొదలెట్టారు. రెండోసారి దాన్ని మరింత ముమ్మరం చేయటంతో పాటు స్వపర భేదం లేకుండా అదనపు సుంకాలతో ప్రపంచ దేశాలన్నిటినీ బెంబేలెత్తించారు. దాన్ని తట్టుకోవటం ఎలాగన్న మీమాంసలో అందరూ పడిన తరుణంలో గ్రీన్ ల్యాండ్ సొంతం చేసుకుంటామనీ, కెనడాను విలీనం చేసుకుంటామనీ బెదిరింపులు ప్రారంభించారు. కెనడాలో నిరుడు ఎన్నికల తర్వాత ప్రధానిగా వచ్చిన మార్క్ కెర్నీ ‘త్వరలోనే మా 51వ రాష్ట్ర గవర్నర్ అవుతారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక వెనెజులా వ్యవహారం అత్యంత దారుణమైనది. ఆ దేశాధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అపహరించి తీసుకొచ్చి అమెరికాలో తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి విచారిస్తు న్నారు. ఇక ఇరాన్‌పై 68 రోజుల క్రితం అకారణంగా యుద్ధానికి దిగారు.ఇరాన్‌కు ఒకే ఒక పేజీలో తాజా ప్రతిపాదనలు పంపామనీ, దానిపై ఆ దేశం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలుంటాయనీ అమెరికా చెబుతోంది. ఇది కేవలం ఏసియాన్ శిఖరాగ్ర సదస్సును దృష్టిలో ఉంచుకుని, దాన్ని మభ్యపెట్టేందుకు సాగిస్తున్న కపట నాటకమా లేక చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నమా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ తాజా ప్రతిపాదనలన్నీ ఒబామా హయాంలో 2015 జూలైలో ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ’ పేరిట ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని అంశాలకు దగ్గరగా ఉన్నాయంటున్నారు. గత ఏలుబడిలో అది పనికిమాలిన ఒప్పందమంటూ బుట్టదాఖలా చేసింది ట్రంపే. సుదీర్ఘ ప్రతిష్టంభన వల్ల ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా దివాలా తీస్తుందన్న భయంతో కాళ్లబేరానికొస్తే మంచిదే. ఏసియాన్ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3,80,000 కోట్ల డాలర్లు. ఇది కాస్తా దిగజారడం మొదలైందంటే... పొదుపు చర్యల అమలు తప్పనిసరైతే ఎక్కడి కక్కడ ప్రజాగ్రహం వెల్లువెత్తి ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చాన్నాళ్లుగా ఫిలిప్పీన్స్ ప్రాంతీయ చమురు పంపకం ప్రతిపాదన చేస్తోంది. అన్ని ఆర్థిక వ్యవస్థలూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి గనుక ఇలాంటి సహకారం సంక్షోభాన్ని నివారిస్తుందన్నది ఆ ప్రతిపాదన సారాంశం. కానీ పశ్చిమాసియాలో తిరిగి ప్రశాంతత నెలకొనడం తప్ప మరేదీ పరిష్కారం కాదు. మిగిలినవన్నీ తాత్కాలిక ఉపశ మనాలే. దీర్ఘకాలం కొనసాగించటానికి పనికొచ్చేవి కాదు. అమెరికా చాటున అణిగి మణిగి ఉండే పాత రోజులు అంతరించాయనీ, గట్టిగా నిలబడి స్వరం పెంచితేనే ఏదో మేరకు ఆ దేశం దిగొస్తుందనీ ఏసియాన్ గుర్తించాలి. అదే సమయంలో ఆహారం,ఇంధనం, వాణిజ్యం అంశాల్లో ఇతర ప్రాంతీయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి. వాటి సహకారం పొందాలి. తమ వంతు సాయం అందించాలి. ఏసియాన్‌తో భారత్ వాణిజ్యం సరిగా లేదు. ఆ దేశాలనుంచి వచ్చే దిగుమతులతో పోలిస్తే, అక్కడికి మన ఎగుమతులు చాలా తక్కువున్నాయి. ఈ వాణిజ్యలోటు 2023 నాటికి 4,400 కోట్ల డాలర్లుంది. ఇలాంటి లోటుపాట్లన్నిటినీ సరిచేసుకుంటేనే ఏసియాన్ అన్ని రకాల సంక్షోభాలనూ దృఢంగా ఎదుర్కొనగలుగుతుందని శుక్రవారం జరగబోయే దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు గుర్తించాల్సి ఉంది. -
నివ్వెరపరిచే ఆదేశాలు!
కొన్ని ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వింటున్నది నిజమేనా అనిపిస్తాయి. ఒరిస్సా హైకోర్టు కొన్ని బెయిల్ దరఖాస్తుల విషయంలో వెలువరించిన ఆదేశాలు అటువంటివే. నిరుడు ఏప్రిల్–సెప్టెంబర్ల మధ్య ఆ హైకోర్టు 50 బెయిల్ దరఖాస్తుల్ని అంగీకరించింది. కానీ అందుకు సంబంధించి విధించిన షరతులు అందరినీ నివ్వెరపరిచాయి. ఆ నిందితులంతా రెండు నెలలపాటు పోలీస్స్టేషన్లు, గుడులు, ఆసుపత్రులు, గ్రామీణ రహదారులు, చెరువులు ప్రతిరోజూ ఉదయం మూడు గంటలపాటు శుభ్రం చేయాలన్నది వాటి సారాంశం. మైనింగ్ కార్యకలాపాలు నిలిపేయాలంటూ ఉద్యమించిన వారితోపాటు దొంగతనం, హత్య తదితర క్రిమినల్ కేసుల్లో ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. నిందితుల్లో అత్యధికులు దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవారు కావటం గమనించదగ్గది. ఇలాంటి పారిశుద్ధ్య పనుల కేటాయింపులో న్యాయమూర్తి కులం కోణాన్ని మించి చూడలేకపోయారని ఈ బెయిల్ ఆదేశాలు తేటతెల్లం చేస్తున్నాయి. సాధారణంగా సామాజిక ఉద్యమకారులెవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి ఉదంతాలు న్యాయస్థానం దృష్టికి పోతాయి. కానీ ‘ఆర్టికల్ 14’ అనే డిజిటల్ మీడియాలో గత నెల 27న వచ్చిన కథనాలను సర్వోన్నత న్యాయస్థానం తనంత తానే గమనించటం, ఆ షరతులు చెల్లబోవని వెనువెంటనే ఉత్తర్వులీయటం కొంతలో కొంత ఊరట. ‘కులం పునాదుల మీద మీరు దేన్నీ సాధించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు. ఒక నీతినీ నిర్మించలేరు’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. వచ్చే ఏడాదితో మన దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుని ఎనభైయ్యేళ్లవుతుంది. కానీ దళితులకు, ఇతర అట్టడుగు వర్గాలకూ అడుగడుగునా కులవివక్ష ఎదురవుతూనే ఉంది. కేలండర్లు మారుతున్నా, సాంకేతికత విస్తరించి అభివృద్ధి జరుగుతున్నా ఆ మనస్తత్వం మారటం లేదు. కుల వివక్ష, దానిపేరిట సాగుతున్న హింస దేశాభివృద్ధికే ఆటంకంగా ఉన్నదనీ, అది మనుషులను వేరు చేస్తోందనీ, మనసుల్ని సంకుచితపరుస్తోందనీ స్వామి వివేకానంద ఏనాడో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మార్పు ఎక్కడ?ఇతర వ్యవస్థల్లో ఇలాంటి జాడ్యాలు కనబడినప్పుడు సరిదిద్దాల్సిన న్యాయవ్యవస్థ సైతం ఆ తానులో ముక్కగా మారితే...? ఒరిస్సా హైకోర్టు ఆదేశాలు చూసి రాయగడ అదనపు సెషన్స్ న్యాయస్థానం, మరో ఆరు కింది కోర్టులు ఈ మాదిరి ఆదేశాలే జారీ చేశాయి. ‘ఒడిశా న్యాయవ్యవస్థ వ్యక్తీకరించిన ఈ తిరోగమన మనస్తత్వం మమ్మల్నెంతో కలవరపరుస్తోంది. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించటమేకాక నిందితుల గౌరవాన్ని దెబ్బతీసే చర్య’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జయ్మాలా బాగ్చీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్మొహమాటంగా తెలిపింది. విచారణకు ముందే నేరం చేసినట్టు నిర్ణయానికొచ్చి ‘శిక్షించటం’ అమల్లోవున్న చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.బాక్సైట్ మైనింగ్ కోసం వేదాంత గ్రూప్ సంస్థలకు రాయగడ, కలహండి జిల్లాల్లో ఇచ్చిన లీజులవల్ల తూర్పు కనుమల్లోని 1560.40 హెక్టార్ల అటవీభూమి నాశనం కాబోతోంది. రెండు జిల్లాల్లోని రెండు గ్రామాలు అదృశ్యమవుతాయి. ఆదివాసీ, దళిత వర్గాలు ఈ లీజుల రద్దుకు 2023 నుంచి ఉద్యమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సైతం విశాఖ ఏజెన్సీలో ఇలాగే లీజుకీయటం, ఉద్యమాలు చెలరేగటం ఎవరూ మరిచిపోరు. అటు తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేసింది. ప్రకృతి విధ్వంసానికి దారితీసే, స్థానికుల జీవికను దెబ్బతీసే ఇలాంటి చర్యను ఒడిశా సర్కారు విరమించుకోకపోగా, ఉద్యమకారుల్ని నిర్బంధిస్తోంది. సకాలంలో జోక్యం చేసుకోకుండా వ్యవస్థలు నిర్లిప్తంగా మిగిలితే ఉద్యమాలు హింసాత్మక రూపం ధరిస్తాయి. వాటిని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్యగా పరిగణించి అణచ టానికి చూస్తాయి. నక్సలైటు ఉద్యమాల తీవ్రత, పర్యవసానాలు చూశాకైనా ఈ పోకడలు మానుకొని, స్థానికుల ఆకాంక్షల్ని గౌరవించే సంస్కృతిని వ్యవస్థలు అలవర్చుకోవాలి. ఈ విషయంలో ఒరిస్సా హైకోర్టు తీరు ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యపట్ల సుప్రీంకోర్టు ప్రదర్శించిన అప్రమత్తత, దిద్దుబాటు చర్యలు నిస్సహాయ పౌరులకు వ్యవస్థలపట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. -
దీదీ ధిక్కార స్వరం!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విలక్షణ నాయకురాలు. పదిహేనేళ్లపాటు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పాలించి తొలిసారి ఓటమి చవిచూసిన ఆమె దీన్ని తేలిగ్గా వదలదల్చుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ‘ఎన్నికల సంఘం(ఈసీ) ఆసరాతో మా గెలుపు కొల్లగొట్టారు. మేం ఓడిపోలేదు. కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేద’ని ఆమె బాంబు పేల్చారు. ఆమె అయిదేళ్ల పదవీకాలం ఎటూ ఈ నెల ఏడుతో ముగుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఈలోగానే ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా... లేక గడువు ముగిశాక ఆమెను సచివాలయంలోకి రాకుండా అడ్డుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఓడిపోయినవారు ప్రత్యర్థి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేసే ప్రత్యా మ్నాయం ఉంటుంది. అవన్నీ తేలటానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. సీనియర్ నాయకు రాలు గనుక ఇవన్నీ ఆమెకు సంపూర్ణంగా తెలిసే ఉంటాయి. కానీ అక్కడితో ఆగిపోతే ఆమెకూ, ఇతర నాయకులకూ తేడా ఉండేది కాదు. వైదొలగక తప్పదని తెలిసినా తగినంత రచ్చచేసి నిష్క్రమించటం ఆమె ఎత్తుగడ కావొచ్చు. యూత్ కాంగ్రెస్ నాయకు రాలిగా పనిచేసినప్పటినుంచి మమత స్ట్రీట్ ఫైటర్. వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వంపై సాగిస్తున్న పోరాటంలో పార్టీనుంచి సరైన సహకారం అందటం లేదన్న ఏకైక కారణంతో ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. సొంతంగా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఆ తర్వాత ఆమెదంతా అలుపెరగని పోరాట చరిత్ర.ఇంత రగడకు ఏకైక కారణం ఎన్నికల సంఘం(ఈసీ). స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో అమలైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాక కూడా ఇతర రాష్ట్రాల్లోనైనా సజావుగా పూర్తి చేయాలన్న ఇంగిత జ్ఞానం ఆ సంస్థకు లేకపోయింది. బెంగాల్లో దాన్ని మరింత అధ్వాన్నం చేసింది. తొలగింపు ల్లోనూ, చేర్పింపుల్లోనూ అవకతవకలకు అంతూ దరీ లేకుండా పోయింది. ఫాం–7 కింద ఊరూ పేరూలేని వారు దాఖలు చేసిన ఫిర్యాదుల్ని ఆసరా చేసుకుని తాఖీదులు పంపడం, కావలసిన పత్రాలన్నీ ఇచ్చాక నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ కాలేదంటూ తొలగించటం వంటివి చోటుచేసుకున్నాయి. పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా ‘తార్కిక వ్యత్యాసం’ పేరిట అనర్హులుగా జమేయటం మరో దాష్టీకం. ఏతావాతా 91 లక్షలమంది ఓటర్లు మాయమయ్యారు. పైగా ఏడు లక్షలమంది రహస్యంగా వచ్చిచేరారని మమత ఆరోపిస్తున్నారు. అజ్యుడికేషన్లో మాత్రం కేవలం 1,607 మందికి మాత్రమే ఓటుహక్కు పునరుద్ధరించారు. మిగిలిన లక్షలాది దరఖాస్తులు తేలడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓటుహక్కు ప్రసాదించే సంస్థ అనే ముద్రనుంచి దాన్ని తొలగించటమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థగా ఈసీ పరివర్తన చెందటంలో మతలబేమిటి?సర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా గత నెల 13న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, ఓటర్ల జాబితాల్లో భారీస్థాయి తొలగింపులు జరిగితే అది ఎన్నికల ఫలితాలపై ‘గణనీయమైన ప్రభావం’ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలో ఆలోచిస్తామని కూడా చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎటూ విపక్షాలు సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం ఉంది. విచారకరమైన సంగతేమంటే... ఈ ఎన్నికల్లో తానూ ఒక అభ్యర్థినే అన్నట్టు ఈసీ ప్రవర్తించింది. వచ్చిన కేంద్ర పరిశీలకులు సైతం అందుకు తగినట్టే ఉన్నారు. మరి ‘ఓట్ చోరీ’ ఆరోపణలు రావటంలో వింతేముంది?ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటి ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఇంతవరకూ ఈసీ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులకు అతీ గతీ లేదు. నిమిషానికి నలుగురు చొప్పున ఓటేయటం గురించీ, సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేయటం గురించీ పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు ప్రశ్నిస్తుంటే మన్నుతిన్న పాములా కూర్చుంది. ఏ సంస్థా ఇంత సిగ్గుమాలినతనాన్ని ప్రదర్శించిన వైనం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. కనీసం ఇప్పుడు సర్ ప్రారంభించబోయే రాష్ట్రాల్లోనైనా సక్రమంగా ప్రవర్తించటం ఈసీ నేర్చుకోవాలి. లేనట్టయితే అక్కడ కూడా ఇలాంటి ఛీత్కారాలే ఎదురవుతాయి. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
అందమైన నివాసం
మనిషికి ఆకాశంలోకి ఎగరాలన్న కాంక్ష పుట్టించేది పక్షి కాదు, తారలు కూడా కాదు, చదమామ! కథలు వినాలన్న ఆసక్తి పుట్టించడంలో నానమ్మ పాత్ర ఎంతో చందమామదీ అంతే. చందమామే ఒక కథ. ఒక కవిత కూడా. ఒక అందమైన స్త్రీ ఎలాంటి కవితావేశాన్ని కలిగిస్తుందో, నిండు చందమామ అలాంటి భావావేశాన్ని పుట్టిస్తుంది. అందుకే చందమామను తన అక్షరాల్లోకి ఒడిసిపట్టని భావకవులు ఉండరు. అసలు ఏ కవికైనా తన తొలి కవితకు సరంజామా ఇవ్వగలిగేది చందమామ కాక ఇంకేమిటి? అది మనిషికి ఎంత దూరమో అంత దగ్గర. ఈ నట్టనడి ఎండల్లో చంద్రుడి తలంపే మనకు చల్లని గొడుగు. ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అని తిలక్ అన్నప్పుడు ఈ వాక్యానికి అందం అందమైన ఆడపిల్లల వల్లే రాలేదు; వాళ్లు వెన్నెల్లో ఆడుకోవడం వల్ల వచ్చింది. చంద్రుడిని తలుచుకుంటేనే ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ఒక రహస్యోద్వేగం. అని మనిషిని మెలకువలోంచి కలల్లోకి మేలుకొలిపే మార్మిక మంత్రదండం. ఒంటరి ప్రయాణీకుడికి చందమామే దారి దీపం. అనంత చీకటిమయ ఆకాశాన్ని సజీవ మూర్తిగా నిలబెట్టేది దానికి రెండో కన్నుగా ఉండే చందమామే. పౌర్ణమికి దినదిన ప్రవర్ధమానమవుతూ, అమవసకు అంతా కోల్పోయినట్టవుతూ మనిషి జీవిత చక్రాన్ని ఇది గుర్తుచేస్తుంది. అన్ని మతాల్లోనూ, సంస్కృతుల్లోనూ చంద్రుడి చుట్టూ ముడివడి ఎన్నో పండుగలున్నాయి. అసలు శరదృతువులో పౌర్ణమిని చూడటమే ఒక పండుగ!చైనా భావకవితోద్యమానికి మార్గదర్శిగా చెప్పే లీ తై–పో క్రీ.శ. 699–705 ప్రాంతంలో జన్మించాడు. పదేళ్లకే కన్ఫ్యూసియస్ పుస్తకాలన్నీ చదివేశాడు. దేశమంతా తిరిగాడు. రాజప్రాసాదాల్లోనూ జీవించాడు, గుహల్లోనూ నిద్రించాడు. మద్యం, మగువ, కవిత్వం ఆయనకు ప్రాణాధారం. వెనుక సంచీలో పుస్తకాలు, అంగీ మడతలో గుప్తంగా పిడిబాకు, అరచేతిలో సిద్ధంగా కవిత– ఇదీ ఆయన వేషం. ఒకరోజు తాగిన మత్తులో సరస్సులోని చంద్రుడి బింబాన్ని కౌగిలించుకోబోయి మరణించాడని చెబుతారు. ఎలాంటి భావకవి! ర్యోకన్ తైగు అనే జెన్ గురువు గుడిసెలోకి ఒక దొంగ వచ్చాడట. తన దుస్తులు సహా దొంగకు ఒలిచి ఇచ్చేశాడు గురువు. దొంగ వెళ్లిపోయిన తర్వాత, ఒంటి మీద నూలుపోగైనా లేకుండా నిండుగా వెలుగుతున్న చందమామను కిటికీలోంచి చూస్తూ కూర్చున్న గురువు, అంతటి అందమామను దొంగకు ఇవ్వలేకపోయినందుకు నొచ్చుకున్నాడట! దొంగలు మన దగ్గరినుంచి ఎత్తుకెళ్లలేనిది మన విద్య, వివేకాలనే కాదు, మనకున్న చందమామను కూడా! ఒక్క చంద్రుడుని నిండుగా ఆనందించగలిగే హృదయముంటే ఎన్ని పూటల భోజనానికి పడే ఆరాటం తప్పుతుంది! ఇటాలో కాల్వీనో కథా ప్రపంచంలోనైతే చందమామ మీదికి నిచ్చెన వేసుకుని ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. అక్కడి మీగడ చిక్కదనపు పాలను లోడుకోవచ్చు. దానికి చేయవలసిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే!గ్రీకు ప్రకృతి దేవత మీదుగా నామకరణం చేసి, చంద్రుడి మీదకు ‘నాసా’ పంపిన వ్యోమనౌక ఆర్టెమిస్–2 ఏప్రిల్ 1–11 వరకు తిరుగాడి భూమ్మీదకు తిరిగొచ్చింది. భూమి నుంచి అంతరిక్షంలోకి సుదూరం పయనించి గతంలోని ‘అపోలో’ రికార్డును ఇది బద్దలుకొట్టింది. అన్నట్టూ అపోలో, ఆర్టెమిస్ గ్రీకు పురాణంలో కవల సోదరీమణులు. మొదలైనప్పటినుంచీ తిరిగొచ్చేదాకా 6,95,081 మైళ్లు ప్రయాణించిన ఆర్టెమిస్–2 అంతరిక్షంలోకి సుదూరంగా వెళ్లే వ్యోమగాములకు అవసరమైన వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదోనని నిర్ధారించేందుకు ఉద్దేశించినది. వస్తూవస్తూ సాక్ష్యంగా కొన్ని ఫొటోలను తెచ్చింది. వాటిని చూస్తే, చంద్రుడి మీద వెన్నెల మీగడలు ఏమీ లేవని తెలియడం ఒకింత కాల్పనిక నిరాశ. ఇది మామూలు భూమిలానే ఉందని తెలియడం ఒక వాస్తవం. కానీ చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలంగా నివసించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు కావడం సాంకేతిక సంభ్రమం. -
బెంగాల్లో ‘ఎగ్జిట్’ డెమోక్రసీ?
బెంగాల్‌ను గెలవడానికి బీజేపీ వాళ్లు సర్వశక్తుల్నీ ధారపోశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మమతా బెనర్జీ చేస్తున్న వాదన అరణ్య రోదనగా మారిపోయింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్వైజర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తప్పనిసరిగా నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక తాఖీదును పంపించింది. ఈ తాఖీదు బెంగాల్‌కు మాత్రమే వర్తిస్తుందట! తృణమూల్ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 2023లో ఇటువంటి నిబంధనను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. లెక్కింపు కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ఉద్యోగుల్ని నియమించాలన్నది ఆ నిబంధన. ఇది దేశవ్యాప్తంగా అమల్లోనే ఉన్నది. దీనికి అదనంగా ఒక సూపర్వైజర్ను కూడా విధిగా కేంద్ర ఉద్యోగినే నియమించాలని బెంగాల్ కోసం మరో ఆదేశం జారీ అయింది.ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తృణమూల్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. అక్కడ దానికి ఓదార్పు దొరకలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లింది. శనివారం నాడు సుప్రీంకోర్టు కూడా పిటీషన్‌ను డిస్మిస్ చేసింది. ఎన్నికల సంఘం విధివిధానాల్లో జోక్యం చేసుకోకూడదన్న యాంత్రిక వైఖరికి అనుగుణంగా న్యాయవ్యవస్థ స్పందించింది. అంతే తప్ప పిటీషనర్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని భావించాలి. ఒక నిర్దిష్ట సమయంలో అప్పటి సమాజంలోని ఆధిపత్య శక్తుల భావజాలం ప్రభావం అన్ని వ్యవస్థల మీదా అంతో ఇంతో పడుతుందేమో. అటువంటి సందర్భాల్లో ఆయా వ్యవస్థల్లో సృజనశీలత స్థానాన్ని యాంత్రికత ఆక్రమించవచ్చు. ఆరాధనా మందిరం మారితే దళితుల ఎస్సీ హోదా పోతుందని ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇదే కోణంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. జస్టిస్ కృష్ణయ్యర్, ఓ. చిన్నపరెడ్డి, హెచ్ఆర్ ఖన్నా, పిఎన్ భగవతి వంటి న్యాయమూర్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు.ఇప్పుడు ప్రణయ్‌రాయ్ వంటి జర్నలిస్టులు, యోగేంద్ర యాదవ్ వంటి సెఫాలజిస్టులు కూడా గుర్తుకొస్తున్నారు. దేశ మీడియా రంగంలో టీవీ వార్తల శకం ప్రారంభమైన తర్వాత ఆ తొలితరం అందించిన ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత సూపర్ హిట్ అయ్యేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వ్యవస్థలకు లొంగని నిక్కచ్చితనం, కచ్చితత్వం నాటి సెఫాలజీని ముందుకు నడిపించాయి. మీడియా రంగాన్ని ఆధిపత్య శక్తులు తమ ఉక్కు పిడికిట్లోకి తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రణయ్‌రాయ్ వంటి వాళ్లు తాము స్థాపించిన సంస్థల నుంచే నిస్సహాయంగా బయటకు నడవాల్సి వచ్చిన విషాద దృశ్యాలను చూడవలసి వచ్చింది. అయినా, ప్రణయ్రాయ్లోని పాత్రికేయుడు ఓడిపోలేదు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో డెబ్బయ్ ఆరేళ్ల ‘ఆ యువకుడు’ ఒక సాధారణ క్షేత్రస్థాయి రిపోర్టర్ మాదిరిగా సెల్‌ఫోన్ చేతిలో పట్టుకొని ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాలకు సోషల్ మీడియాలో వేలాదిమంది జేజేలు పలికారు.మీడియా రంగం విస్తరించింది. టెక్నాలజీ పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజాభిప్రాయాన్ని మదింపు వేయడంలో మరింత కచ్చితత్వం ఉండే అవకాశాలు ఇప్పుడే ఎక్కువున్నాయి. కానీ ఆధిపత్య శక్తుల ఆదేశాల మేరకు మీడియా సంస్థలు రాజీపడుతున్నాయనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఫలితంగా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సక్సెస్ రేట్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడున్న సర్వే సంస్థల్లో ‘యాక్సిస్ మై ఇండియా’కు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ. ఈ సంస్థ ‘ఇండియా టుడే’తో కలిసి తన సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే. బెంగాల్ రెండో దశ పోలింగ్ పూర్తికాగానే అన్ని ఛానెళ్ళు, అన్ని సర్వే సంస్థలూ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే కూడా యాక్సిస్ మై ఇండియా చేసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దేశంలో ఇంకే సర్వే సంస్థ గానీ, మీడియా సంస్థగానీ ఊహించని విధంగా తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచే అవకాశముందని ప్రకటించి యాక్సిస్ మై ఇండియా సంచలనం సృష్టించింది. ఒక్క బెంగాల్ ఎగ్జిట్ పోల్‌ను మాత్రం మరుసటి రోజుకు వాయిదా వేశారు.మరుసటి రోజు కూడా ఆశాభంగమే మిగిలింది. బెంగాల్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించబోవడం లేదని సర్వే సంస్థ ఎమ్డీ ప్రదీప్ గుప్తా ప్రకటించారు. ఇదొక అనూహ్యమైన పరిణామం. బెంగాల్‌పై అస్త్రసన్యాసానికి ఆయన చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇదే అసలు కారణమైతే ముందురోజే ఈ సంగతిని చెప్పి ఉండవచ్చు. తొలిదశ ఎన్నికలు అంతకు వారం రోజుల ముందే జరిగాయి. తొలిదశ జరిగిన ప్రాంతంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పి రెండో దశలో చెప్పకుండా ఉన్నారా? తాము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మాట్లాడినందువల్ల ఎవరికీ చిక్కని విధంగా తమిళనాడు నాడి తమకు చిక్కిందని చెప్పుకున్న యాక్సిస్ మై ఇండియా, కీలకమైన బెంగాల్ నాడిని ఎందుకు పట్టుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఎవరి ఒత్తిడికో లొంగి ప్రదీప్ గుప్తా బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకుండా దాచారనే అభిప్రాయం బలపడుతున్నది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఒక సంస్థ ఎగ్జిట్ ఫలితాలను ఆపేసినంత మాత్రాన ఆ ‘బలమైన’ పార్టీకి కలిగే లాభం ఏముంటుంది? ప్రజాభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు కౌంటింగ్ రోజు వెలువడే అవకాశముంటుందా?.. ఉంటే, ఎలా సాధ్యం?ఒక్క బెంగాల్‌కు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లు కూడా కేంద్ర సిబ్బందే ఎందుకు కావాల్సి వచ్చిందో? ఒక్క బెంగాల్ ప్రజల నాడిని పసిగట్టడంలోనే తన అశక్తతను ఆఖరి నిమిషంలో మాత్రమే ప్రదీప్ గుప్తా ఎందుకు వ్యక్తం చేశారో? ఒక్క బెంగాల్లోనే ‘సర్’ కార్యక్రమంతో 91 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయో? తమ పేరు తొలగింపును పునఃపరిశీలించాలని దరఖాస్తులు పెట్టుకున్న లక్షలాది మందిలో కేవలం వెయ్యిమందికి మాత్రమే ఊరట లభించడానికి కారణమేమిటో? ఎన్నికలు ముగిసిన తర్వాతనే మిగిలిన దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పడమేమిటో? ఇటువంటి పలు సందేహాలు తలెత్తడం సహజం. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్లో గెలిచి తీరాల్సిందేనని బీజేపీ చేస్తున్న విశ్వప్రయత్నాల్లో ఇవన్నీ భాగమని తృణమూల్ భావిస్తున్నది. బెంగాల్ గెలుపునకు బీజేపీ ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యాన్ని ఆపాదించుకుంటున్నది. ఇటీవలనే అధికారం చేపట్టిన బిహార్‌కు తోడు బెంగాల్‌ను కూడా గెలుచుకుంటే ఆర్యావర్త కాషాయీకరణ పూర్తవుతుంది. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్ గెలుపుతో ఈ చారిత్రక పరిణామం పూర్తవుతుంది. ఇక మిగిలేది దక్షిణాపథమే.కొన్ని వర్తమాన కీలక పరిణామాలు చారిత్రక సందర్భాలను స్ఫురణకు తెస్తాయి. పోలికలు కనిపిస్తాయి. పద్దెనిమిదో శతాబ్దం ఉత్తరార్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సేనలు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడంతో భారత్‌లో ఇంగ్లిష్ పాలనకు తొలి అడుగు పడింది. బెంగాల్లో గెలిస్తే ఆర్యావర్త కాషాయీకరణలో బీజేపీ తుది అడుగు పూర్తవుతుంది. బలీయమైన బెంగాల్ నవాబును ఓడించడానికి ఈస్టిండియా కంపెనీ సేనాని రాబర్ట్ క్లైవ్ మోసపూరితమైన ఎత్తుగడలు వేశాడనీ, అతని సుపీరియర్ ఆయుధ టెక్నాలజీ కూడా అందుకు తోడ్పడిందనీ చరిత్ర చెబుతున్నది. బెంగాల్లో గెలవడానికి బీజేపీ కూడా మోసపూరితమైన ఎత్తుగడలు వేస్తున్నదని తృణమూల్ ఆరోపిస్తున్నది. ఆరోపణల్లో ఎంతో కొంత నిజముండదని చెప్పలేము. అంతమాత్రాన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేనేళ్లు బెంగాల్‌ను పవిత్రంగా పరిపాలించిందని కూడా చెప్పలేము. గూండా గ్యాంగులు, అరాచక శక్తులు పాలక పార్టీ నీడలో వ్యవస్థీకృత రూపం దాల్చాయనీ, ఎన్నికల సందర్భాల్లో అవి పార్టీ తరఫున పని చేస్తున్నాయన్న విమర్శల్లో నిజం లేకపోలేదు.అరాచక శక్తులు రాజకీయ సైన్యంగా పనిచేయడం మమతా బెనర్జీతోనే ప్రారంభం కాలేదు. నక్సల్బరీ అలజడి సద్దుమణుగుతున్న కాలంలో డెబ్బయ్యవ దశకం తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్ రే హయాంలోనే ఈ రౌడీ రాజకీయ ముఠాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అన్నిరకాల వామపక్ష శక్తుల మీద, ముఖ్యంగా సీపీఎం శ్రేణుల మీద దాడులకు ఈ ముఠాలను ప్రేరేపించేవారు. సీపీఎం అగ్రనాయకుడు జ్యోతిబసు మీద కూడా ఆ రోజుల్లో హత్యాప్రయత్నం జరిగింది. ముప్పయ్ నాలుగేళ్లపాటు నిరాటంకంగా సాగిన వామపక్ష కూటమి పాలనలో కూడా రౌడీ ముఠాలను రాజకీయ అవసరాలకు వాడుకున్నారనే విమర్శ ఉన్నది. కాకపోతే, సమర్ధవంతంగా భూసంస్కరణలు అమలు చేయడం, పాలనా వికేంద్రీకరణ, అవినీతి రాహిత్యం, నాయకత్వ నిరాడంబరత వంటి కారణాల వలన ఈ వ్యవహారం పెద్దగా వివాదాస్పదం కాలేదు. మమతా బెనర్జీ పాలన మళ్లీ సిద్ధార్ధ శంకర్ రే వారసత్వాన్ని స్వీకరించిందనే విమర్శలున్నాయి.మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనంలో ఉన్నది. కాకపోతే బెంగాల్‌ను గెలవాలనే ‘చారిత్రక కర్తవ్యం’ ఊపులో బీజేపీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, డజన్లకొద్దీ కేంద్ర మంత్రులూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోహరించడం, బెంగాల్‌పై యుద్ధం మాదిరిగా ఎన్నికల ప్రచారాన్ని మార్చడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘బెంగాలీ అస్మిత’ (బెంగాల్ ఆత్మగౌరవం) ను ముందుకు తోసింది. బెంగాలీ అస్మితపై హిందూ పరిచయ్ (హిందూ భావజాలం)తో దాడి చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేసింది. తమ భాషా సంస్కృతులకు బెంగాలీలు, తమిళులు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనకు తెలిసిన విషయమే. తమ పార్టీ బెంగాలీ బెటాలియన్‌తోనే మమతపై ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాడి ఉంటే మమత ఖాయంగా ఓడిపోయేదేమో! కానీ వ్యవస్థల మాటున నిలబడి అప్రజాస్వామిక పద్ధతులతో, మోసపూరితమైన ఎత్తుగడలతో బెంగాలీ అస్మితను ఒకవేళ గెలిస్తే, ఇకముందు దేశ భవిష్యత్తు ఎటువంటి దారిలో పయనిస్తుందోనన్నదే ప్రజాస్వామ్య శక్తుల ఆందోళన!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్షరాలా నిప్పుల కొలిమి
ప్రతియేటా ఇంచుమించు మే నెల మొదటి వారానికిగానీ ఉగ్రరూపం దాల్చని మార్తాండుడు ఈసారి ఫిబ్రవరి నెలాఖరునాటికే చెలరేగడం మొదలెట్టాడు. ముందే రావటం, దీర్ఘకాలం తిష్టవేయటం కొన్నాళ్లుగా కనబడుతున్నా ఈ స్థాయిలో ఎండలు మండిపోవటం ఇదే తొలిసారి. మన దేశంలో రుతువులు గతి తప్పి చాన్నాళ్లయింది. గతంలో పొద్దుటిపూట ఒక రకం, రాత్రికి మరో రకం వాతావరణం దర్శనమిచ్చేవి. ఎంత ఎండాకాలమైనా రాత్రికి ఎటునుంచో వచ్చి చల్లని గాలులు తాకేవి. సేదతీర్చేవి. ఇప్పుడు రాత్రింబగళ్లు తేడా లేదు. వేడిగాలుల వెనకే హఠాత్తుగా వాతావరణం మారి, జల్లులు మొదలై వడగళ్లు పడటం రివాజుగా మారింది. అటు తర్వాత కాసేపటికే ఉక్కబోత మొదలవుతోంది. ప్రకృతికి సంబంధించినంతవరకూ ఉత్తర దక్షిణాలన్న తేడా... మధ్య, పశ్చిమ భారత్లన్న వ్యత్యాసం లేదు. వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నదాన్నిబట్టి ప్రస్తుతం 23 రాష్ట్రాలకు వడగాడ్పుల తాకిడి ఉంది. అందులో డజనుకుపైగా తీవ్ర వడగాడ్పులను చవిచూస్తున్నాయి.వందలాది నగరాలు భరించలేనంత ఉక్కబోతతో విలవిల్లాడుతున్నాయి. అయితే దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలూ ఇప్పటికైతే ఈ సమస్యకు దూరంగా ఉంటున్నాయి. కానీ పర్యావరణంలో వస్తున్న మార్పుల పర్యవసానంగా భవిష్యత్తులో ఇవి సైతం భానుడి ప్రతాపాన్ని చవిచూడకతప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలకన్నా కనీసం 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువుంటే, అది వరసగా రెండ్రోజులు కొనసాగితే వడగాడ్పులు వీస్తున్నట్టు లెక్కేస్తారు. అది 7 డిగ్రీల సెల్సియస్‌కి మించి పెరిగితే తీవ్ర వడగాడ్పులుగా పరిగణిస్తారు. ఒక ప్రాంతం మైదానమా, కొండలతో ఉందా అనే అంశాన్ని కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. బొంబాయి ఐఐటీ ఇటీవల చేసిన అధ్యయనంలో గంగా–సింధు మైదానం (ఉత్తర భారతం)లో వేడిగాలులకు స్థానిక నేలలు, ఇతర వాతావరణ పరిస్థితులు కారణమని తేల్చింది. వెలుపలినుంచి వచ్చే వేడిగాలులే ఇందుకు దోహదపడుతున్నాయన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత పెరగడంతో వేడిగాలులు భూ ఉపరితలానికి దగ్గరగా ఉండిపోతున్నాయి. నగరాల్లోని కాంక్రీట్ కట్టడాలు, తారురోడ్లు పగలంతా తీవ్ర ఉష్ణోగ్రతను స్వీకరించి, రాత్రికి సైతం సెగలు కక్కుతూనేవుంటున్నాయి. అందుకే ఇంతచేటు తీవ్రత!వరదలు, తుపానులు, భూకంపాల్లాగే వడగాడ్పులు కూడా ప్రకృతి వైపరీత్యమే. కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు. వడగాడ్పులవల్ల ఏటా వందలాది మరణాలు సంభవిస్తున్నా, ఆ విధంగా లెక్కేయటానికి తగిన విధానం రూపొందలేదు. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్ లేదా అంతకన్నా ఎక్కువకు చేరి, శరీరంలో చెమట పట్టడం ఆగిపోయి చర్మం పొడిబారి ఎర్రగా మారితే, స్పృహ కోల్పోవటం లేదా మతిస్థిమితం తప్పడం, మూర్ఛరావడం వంటివి కనబడితే వడగాడ్పు మరణమని చెబుతారు.వీటికితోడు బాధితుడున్న ప్రాంతంలో వడగాలుల హెచ్చరిక ఉందా, అతను మరణించటానికి ముందు ఎండలో పనిచేశాడా లేదా అనేవి కూడా చూస్తారు. ఆ తర్వాతే వడగాడ్పు మరణంగా నిర్ధారిస్తారు. గుండెజబ్బు వగైరాలున్నా, వృద్ధాప్యంలో ఉన్నా ఆ జాబితాలో లెక్కేయరు. ఈ విషయంలో ప్రభుత్వాల వైఖరి మారాలి. వేసవిలో మరణాల రేటు గత కొన్నేళ్లలో ఎలావుందో చూసే విధానాన్ని అంతర్జాతీయంగా అనుసరిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు ఆ కొలమానాన్ని తీసుకోవటం లేదు?పదహారో ఆర్థిక సంఘం నిరుడు ఇచ్చిన నివేదికలో వడగాడ్పుల్ని, పిడుగుపాటుల్ని కూడా ప్రకృతి విపత్తులుగా పరిగణించాలని కోరింది. చాలా రాష్ట్రాలు ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాయి. అలా లెక్కేస్తే అందుకు సంబంధించిన నిధుల్ని సహాయ కార్యక్రమాల కోసం వ్యయం చేయటానికి, బాధితులకు తక్షణ సాయం అందించటానికి వీలవుతుంది. వడగాడ్పులున్న ప్రాంతాల్లో భవన నిర్మాణం, సాగుపనుల సమయాలను మార్చటానికి, విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళల్ని సవరించటానికి వీలవుతుంది. అందుకే ప్రభుత్వాలు తక్షణం కదలాలి. అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. జనం ప్రాణాలు కాపాడాలి. -
బీటలువారిన ఒపెక్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటి తలిస్తే జరిగేది ఎప్పుడూ మరోటి. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తే అది నాలుగురోజుల్లో పాదాక్రాంతమవుతుందని అంచనావేసుకుని ప్రారంభించిన యుద్ధం కాస్తా వికటించి ఆయన ఆ ఊబిలో కూరుకుపోయారు. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియని తరుణంలో పశ్చిమాసియాలో ఆయన ఉద్దేశించని పరిణామం సంభవించింది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. దాన్నుంచి మాత్రమే కాదు... 2016లో ఏర్పడిన ‘ఒపెక్ ప్లస్’నుంచి కూడా వైదొలగనున్నట్టు తెలిపింది. ఒపెక్‌లో సభ్యత్వం తీసుకోని రష్యావంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఈ గ్రూప్ ఏర్పడింది. ఒపెక్ ప్రపంచ చమురు ఉత్పత్తుల పరిమాణాన్నీ, ఎగుమతుల్నీ, వాటి ధరల్నీ నిర్దేశిస్తున్న కీలక సంస్థ. ప్రపంచ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులు దానిపైనే ఆధారపడతాయి. ప్రపంచ పెట్రో ఉత్పత్తుల్లో ఒపెక్ వాటా మూడోవంతుకన్నా ఎక్కువ. ఒపెక్ నుంచి తప్పుకోవాలన్న యూఏఈ ఆలోచన చాలా పాతది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ ఇరాన్ యుద్ధంతో అది తుది నిర్ణయానికొచ్చింది.ఒపెక్ సంస్థ ఆవిర్భావానికీ, విస్తరణకూ పాశ్చాత్య బహుళజాతి సంస్థల నిర్వాకం కారణం. చమురు దేశాలు ఎంత ఉత్పత్తి చేయాలో, ఏ ధర నిర్ణయించాలో అవి నిర్దేశించేవి. వాటి చెప్పుచేతల్లో ఉండటం ఇక సాధ్యంకాదన్న నిర్ణయానికొచ్చిన చమురు దేశాలు 1960 సెప్టెంబర్‌లో బాగ్దాద్‌లో సమావేశమై ఒపెక్ ఏర్పాటుకు తీర్మానించాయి. ఇరాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనెజులా దేశాలు ఇందులో భాగస్వాములు. 1967లో యూఏఈ చేరింది. 1973లో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ తదితర దేశాల వైఖరిపై ఆగ్రహించిన ఒపెక్... చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ, ఆ దేశాలకు ఎగుమతుల్ని నిషేధించింది. దాంతో పెను సంక్షోభం ఏర్పడింది. అనంతరకాలంలో ఈ దేశాలన్నీ అమెరికాకు సాగిలబడ్డాయి. అది వేరే కథ!ఒపెక్‌లో రాజుకుంటున్న అసంతృప్తికి సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఒక కారణం. ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలో అదే నిర్ణయించటంవల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని సభ్యదేశాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. అందుకే 2019లో ఖతార్, ఆ మరుసటి ఏడాది ఈక్వెడార్, 2024లో అంగోలా సంస్థనుంచి వైదొలగాయి. ఆ వరసలో యూఏఈ నాలుగో దేశం. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి ఉత్పత్తిని నియంత్రించుకుంటూ, అది కోరుకున్న ధరలో ఉండేలా చూసుకోవటం ఒపెక్ అలవాటు. తన తొలి ఏలుబడిలో ఒపెక్ దేశాలపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. చమురు ధరలు పెంచుతూ ప్రపంచ ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే 2020లో కోవిడ్ సమయంలో పాతాళానికి పడిపోయిన చమురు ధరలతో దివాలా స్థితికి చేరిన అమెరికన్ సంస్థల్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిని తగ్గించమని ఒపెక్‌ను వేడుకున్నది కూడా ఆయనే. సౌదీ తీరుపై యూఏఈ ఆగ్రహంతో ఉండటానికి కారణం ఉంది. అది ప్రస్తుతం రోజుకు 35 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. తనకున్న సామర్థ్యంతో అంతకన్నా ఎక్కువ చేయగలిగినా, సౌదీ అరేబియా నిర్దేశిస్తున్న కోటా ఆటంకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా దాన్ని 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలంటే తప్పుకోవటమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈలోగా ఇరాన్ యుద్ధం దాని సమస్యల్ని పెంచింది. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల్లో ఆ దేశమే అధికంగా నష్టపోయింది. కనుకనే ఈ బాదరబందీని వదుల్చుకోవాలని నిర్ణయించుకుంది. పర్యవసానంగా వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మూడు శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా, దీర్ఘకాలంలోగానీ దాని అసలు ప్రభావం కనబడదు. యూఏఈ మిత్రదేశంగా భారత్‌కు ఈ పరిణామం లాభదాయకమే. కానీ ఒపెక్ ఎలాంటి ఆంక్షలు పెడుతుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్టు కనబడిన గల్ఫ్, ఒపెక్ బీటలువారుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. ఇరాన్ పాదాక్రాంతం మాటేమో గానీ... అమెరికాకు మున్ముందు ఇది సమస్యాత్మకం. -
ముగిసిన ఎన్నికల రణం
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్‌లో ఎన్నికలుంటాయని గత నెల 16న ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది మొదలు అలుముకున్న ఒక రకమైన యుద్ధ వాతావరణం పరిసమాప్తమైంది. పశ్చిమ బెంగాల్లో బుధవారం ముగిసిన రెండో దశ పోలింగ్‌లో అనుకున్నట్టే భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. సాయంత్రానికల్లా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలవరకూ చూస్తే దాదాపు అన్ని సర్వే సంస్థలూ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం ఖాయమని తెలిపాయి. తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతూనే డీఎంకే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని అయిదు సంస్థల్లో మూడు అంచనా వేయగా, ఒక సంస్థ అన్నాడీఎంకే–బీజేపీ కూటమివైపు మొగ్గింది. బెంగాల్లో తృణమూల్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయని సర్వేలు తేల్చాయి. ఆరు సంస్థల్లో రెండు తృణమూల్‌వైపు, మిగిలిన సంస్థలు బీజేపీవైపు మొగ్గాయి. వాస్తవ ఫలితాలకు ఇవి ఏమేరకు దగ్గరగా ఉంటాయన్నది వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతగానీ తెలియదు. పోలింగ్ వరకూ చూస్తే మిగిలినచోట్ల దాదాపు ప్రశాంతంగానే ముగిసినా పశ్చిమ బెంగాల్ ఎప్పటిలాగే తనదైన ముద్ర మిగిల్చింది. రెండు దశల్లోనూ హింసాత్మక ఘటనలు తప్పలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన హింస చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. కావొచ్చు... కానీ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో దాదాపు రెండున్నర లక్షలమంది బలగాలను మోహరించటం, ముఖ్యంగా రెండో దశ పోలింగ్ జరిగిన దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భద్రతా బలగాలు అతిగా ప్రవర్తించిన తీరు సబబు కాదు. ఒకరి హింసకు మరొకరి హింస ప్రత్యామ్నాయం కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట ఏకంగా 91 లక్షలమంది ఓటర్ల పేర్లు గల్లంతు కావటం, ఎక్కడెక్కడికో పనుల కోసం వలసపోయినవారు తిరిగొచ్చి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా తగిన పత్రాలు సంపాదించలేకపోవటం, దాఖలు చేసినవారు సైతం భంగపడటం ఎందరినో కలవరపెట్టింది. చివరకు తొలి దశలో 139 మంది, మలి దశలో 1,468 మంది మాత్రమే న్యాయసమీక్షలో ఓటుహక్కు పొందారు. ఇక ఈసీ వివాదాస్పద పాత్ర సరేసరి. ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించటం కోసం తాను తటస్థంగా వ్యవహరించాలన్న సంగతిని అది మరిచింది. ఈ ఎన్నికల బరిలో తానూ ఉన్నానన్నట్టు వ్యవహరించింది. నిజానికి 2024 ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఈ పోకడలు కనబడ్డాయి. అధికారుల బదిలీలు మొదలుకొని అనేక అంశాల్లో విపక్షం చెప్పినట్టల్లా ఈసీ ఆడిందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు బెంగాల్లో అది మరింత బాహాటంగా జరిగింది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన ఒకరిద్దరు బెదిరింపు ధోర ణిలో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. అందులో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’గా మీడియా చెబుతున్న యూపీకి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఏ అభ్యర్థి అయినా సక్రమంగా వ్యవహరించకపోతే, డబ్బు పంచుతుంటే లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చట్టం అనుమతించిన మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బహిరంగ సవాళ్లు దేనికి? ఇది మంచి సందేశాన్ని పంపదు. ఇతరచోట్ల గణనీయమైన విజయాలు సాధిస్తున్నా... బీజేపీకి మాతృసంస్థ అనదగ్గ జనసంఘ్‌కు నారూ నీరూ పోసిన స్వర్గీయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన బెంగాల్లో అది సాధించలేకపోతున్నామని మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్‌పేయి ఒక దశలో ఆవేదన వ్యక్తం చేశారంటారు. ఆయన తొలినాళ్లలో ముఖర్జీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనైనా అదెంతవరకూ సాకారమవుతుందన్న విషయంలో ఎవరి అంచనాలు వారివి. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న ముఖ్యమంత్రి మమతకు దీటుగా నిలబడగల స్థానిక నాయకులు ఇంతవరకూ బీజేపీకి తారసపడలేదు. అందుకే ప్రచార బాధ్యతల్ని స్వయంగా నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మోయాల్సివచ్చింది. అక్కడొచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాలక, విపక్షాల వ్యూహాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపగలవనటంలో సందేహం లేదు. -
ఫిరాయింపులు... ప్రశ్నలు!
ఆప్ నుంచి నిష్క్రమించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన ఎంపీల బృందం బీజేపీలో విలీనం కావడాన్ని గుర్తిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకోవటంతో ఫిరాయింపుల చట్టం ప్రహసనప్రాయమని మరోసారి తేలిపోయింది. బహుశా ఎన్నికల ముంగిట్లోవున్న పంజాబ్‌లో రేపో మాపో ఆప్ ప్రభుత్వానికీ ఇలాంటి గండం తప్పకపోవచ్చు. ఆప్ పుట్టుక, ఎదుగుదల భిన్నమైనవి. 2011–12 మధ్య దేశంలో హోరెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన కొద్దిమంది రాజకీయేతర నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ఆయన మాదిరే పూర్వాశ్రమంలో ఉన్నతోద్యోగ వర్గంలో, భిన్న సామాజిక రంగాల్లో పనిచేసి కొన్ని ఆదర్శాలు నమ్మి వచ్చినవారు చాలామంది ఉన్నారు. ఆదర్శాల్లో పుట్టి, వైవిధ్యాలతో ఎదిగి, స్వల్పకాలంలోనే మధ్యతరగతిలో పాతుకుపోయిన ఆ పార్టీ అచిరకాలంలోనే సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ సారథుల్లో భిన్నాంశాలపై అప్పటికే ఉన్న మౌలిక విభేదాలు పలు నిష్క్రమణలకు దారితీశాయి. శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, అడ్మిరల్ రాందాస్ వంటి లబ్ధప్రతిష్టులైనవారిని కీలక పదవులనుంచి తప్పించారు. కొందరు వారికై వారు తప్పుకున్నారు. అటు తర్వాత మధ్యలో అడపా దడపా ఒకరిద్దరు నేతలు నిష్క్రమించినా ఇప్పుడు రాఘవ్ చడ్డా కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. ఒక సమస్య విషయంలో పార్టీ వైఖరితో ఏకీభావం లేనప్పుడూ, దాని సిద్ధాంతాలు దారితప్పుతున్నాయనుకున్నప్పుడూ బయటకుపోతే ఎవరూ తప్పుబట్టరు. కానీ పెద్ద మాటలు మాట్లాడుతూ, గంభీరమైన ఉపన్యాసాలిస్తూ కాస్తయినా నైతికత పాటించాలన్న స్పృహ లేనివారిని జనం చీదరించుకుంటారు. ఒక సాధారణ గుమాస్తా సంస్థ నుంచి తప్పుకుంటే మూణ్ణెల్ల నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఉంటుంది. లేకుంటే సంస్థలు వాటి పద్ధతిలో అవి చర్య తీసుకుంటాయి. ప్రజానీకం సమస్యల్ని చర్చిస్తూ వారి సంక్షేమానికీ, భద్రతకూ అవసరమైన చట్టాలు తీసుకొచ్చే కర్తవ్యంలో నిమగ్నమై ఉండాల్సినవారికి మాత్రం ఏ నిబంధనా ఉండొద్దా? వారి ప్రవర్తన నలుగురికీ ఆదర్శప్రాయం కావొద్దా?రాజీవ్ గాంధీ హయాంలో 1985లో ఈ ఫిరాయింపుల జాడ్యాన్ని వదిలిస్తామంటూ 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగంలో పదో షెడ్యూల్ చేర్చారు. కానీ అది ఎందుకూ కొరగాకుండా పోయిందని తేలిన చాన్నాళ్ల తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ వచ్చింది. అందులో కేవలం లెజిస్లేచర్ పార్టీలో మూడింట రెండొంతుల మంది తప్పుకుని వేరే పార్టీలో విలీనమైతే సరిపోదనీ, ఆ చీలిక, విలీనం పార్టీ స్థాయిలో కూడా కనబడాలనీ నిర్దేశించింది. దురదృష్టమేమంటే... ఈ ప్రాతిపదికన ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని మన న్యాయస్థానాలు తీర్పులిచ్చిన సందర్భాలు లేవు. ఫిరాయింపు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని సభాధ్యక్షుల దగ్గర ఫిర్యాదులైతే దాఖలవుతున్నాయి. కానీ వాటిపై వేగంగా నిర్ణయం తీసుకున్న ఉదంతాలు లేవు. సుప్రీంకోర్టు గడువు విధించటంతో తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ బీఆర్ఎస్ వినతుల్ని ఆయన తోసిపుచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభలోనూ, ఏపీ అసెంబ్లీలోనూ చేసిన ఫిర్యాదులు తేలకుండానే ఆ సభల పదవీకాలం ముగిసిపోయింది. ఫిరాయించటానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోవటం నేతలకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఏపీలో ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు ఏకంగా అయిదేళ్లకు మించి గడువున్న ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి పోయారు. ఆ తర్వాత వారిలో కొందరు బీజేపీ, టీడీపీల పంచన ‘ఎన్నికయ్యారు’. నైతిక విలువలు లేకపోవటమే పెద్ద అర్హతగా మారిన వర్తమానంలో ఇలాంటి వెర్రిమొర్రి పోకడలు కనబడటం వింతేం కాదు. రాఘవ్ చడ్డా నిష్క్రమించదల్చుకున్నప్పటి నుంచీ మధ్యతరగతి పెను సమస్యలుగా భావించేవాటిని సభలో ప్రస్తావించటం, వాటిల్లో కొత్తేం లేకపోయినా అవి వైరల్ కావటం వెనకున్న సారాంశం చాలామంది గ్రహించకపోలేదు. ఏదేమైనా ఫిరాయింపులకు కళ్లెం పడనంత కాలమూ, ఈ గోడ దూకుళ్లు ఆగనంత కాలమూ మన ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండదు. -
ఏపీలో ‘పెట్రో’ కటకట!
స్వోత్కర్షలకూ, చేదు వాస్తవాలకూ మధ్య తేడా ఎంత ఉంటుందో తెలియజెప్పే వైనమిది. ‘మా రాష్ట్రానికి రండి... పెట్టుబడులు పెట్టండి. మా సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా మీరే తెలుసుకోండి’ అంటూ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నగరంలో జరిగిన ఒక అవార్డుల ఉత్సవంలో గప్పాలు కొట్టుకున్న క్షణానికే రాష్ట్రం మొత్తం ఇంధన కొరతతో అల్లాడిపోయింది. అన్ని జిల్లాల్లోనూ బంకులముందు ఆ రోజు ఉదయానికే ‘నో స్టాక్’ బోర్డులు ప్రత్యక్షమై జనం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెట్రోల్, డీజిల్ దొరక్క వేలాది ట్రావెల్ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు రోడ్లపై నిలిచాయి. అనేకచోట్ల ట్రాఫిక్ స్తంభించిందని సమాచారం. వందలాదిమంది పిల్లలు, వృద్ధులు ఎటూపోలేక మండుటెండల్లో మలమలమాడారు. ఇప్పటికీ మారిందేమీ లేదు. ఇంత జరిగినా ఇదేమిటని ఆరా తీసే నాథుడు కరువయ్యాడు. కొందరు మంత్రులు పాలనలో పాఠాలు నేర్చుకొస్తామని దేశాలు పట్టిపోయారు. ముఖ్యమంత్రి అగమేఘాలపై మరో రాష్ట్రానికి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్క రాష్ట్రంలో అస్వస్థత నుంచి కోలుకుంటున్నారు. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తిగత విషాదంలో ఉన్నారు. మామూలు సమయాల్లో సర్వజ్ఞ సింగభూపాలుడి మాదిరి సకల శాఖల్లోనూ పెత్తనం చేసే ‘రెడ్‌బుక్’ మంత్రి లోకేశ్ మాత్రం ఆచూకీ లేకుండాపోయారు! రాష్ట్రంలో సంస్కరణల సంగతలావుంచి, పాలన ఎంత ముదనష్టంగా మారిందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా! సామాజిక మాధ్యమాలు తిరగేస్తే, చానెళ్లు వీక్షిస్తే ఈ అరాచకాన్ని అరక్షణంలో ‘స్వయంగా’ తెలుసుకునే సౌలభ్యం ఉండగా... ఎంత తెలివితక్కువవారైనా అందుకోసం పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వదుల్చుకునే సాహసం చేస్తారా?అధికారంలోకి రావడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా అరాచకానికి తెరలేపి, ఇప్పటికీ దాన్ని వదలకుండా కొనసాగిస్తున్న ఘనులకు ఇంధన కొరతపై కనీస జ్ఞానం కరువైందంటే దిగ్భ్రాంతికరం. ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం అధికారులతో చర్చించారనీ, మూడు రోజుల ముందే సమస్య వచ్చిపడుతోందని తెలిసినా పట్టించుకోలేదేమని ప్రశ్నించారనీ మీడియాలో కథనాలు ప్రత్యక్షమయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం ఏం జరుగుతున్నదో స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పుకునే సీఎంకు ఇలా ప్రశ్నించటానికి సిగ్గుండాలి. వారు విఫలమయ్యారు సరే... కానీ తనలోని ‘హైటెక్ నిపుణుడు’ ఏమైనట్టు? పోనీ ఈ సమీక్ష తర్వాతైనా పరిస్థితి మారిందా? లేదే!సమస్య మూలాలపై సీఎం మొదలుకొని ఎవరికీ సరైన అవగాహన లేదని వారి మాటలు చూస్తే అర్థమవుతుంది. మూడు రోజుల కిందటే సమస్య ఉందని బాబు అంటే... రాష్ట్రంలో కావలసినంత స్టాక్ ఉందని మంత్రి నాదెండ్ల చెబుతున్నారు! కేవలం వదంతులవల్ల జనం ఒక్కసారిగా రావటంతో ‘సరఫరా లోపం’ ఏర్పడిందని కొట్టిపారేస్తున్నారు. ఎవర్ని నమ్మాలి? వీరి అయోమయం కారణంగా సాధారణ జనం మాత్రమే కాదు... రైతులు సైతం అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం, రవాణా, ఆక్వా రంగాలు కూడా డీజిల్ లభించక గుడ్లు తేలేస్తున్నాయి. కోల్డ్ స్టోరేజిలు సరేసరి. ఉత్పత్తులు నాశనమై, రైతులు నష్టపోతే ఈ పాలకులకు వారిని ఆదుకునేపాటి ఉదారతైనా ఉండదు. నిజానికి ఏపీ మెరుగైన స్థితిలో ఉండాలి. కర్ణాటకలోని పాదూరు, మంగళూర్లతో పాటు విశాఖలో కూడా వ్యూహాత్మక చమురు నిల్వలుంటాయి. విశాఖకు 13 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అంతర్జాతీయంగా సమస్యలొచ్చినా ఈ నిల్వలవల్ల పదిరోజులపాటు దేశం నిశ్చింతగా ఉండొచ్చంటారు. ఇక విశాఖ చమురు శుద్ధి కర్మాగారానికి రోజుకు 3 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉంది. అంటే ఏడాదికి కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నులు. పైగా మాది ‘డబుల్ ఇంజన్ సర్కార’ని చెప్పుకుంటారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు వీరి దయాదాక్షిణ్యాలపైనే సాగుతోంది. మరి ఏ రాష్ట్రంలోనూ లేని కొరత ఏపీకే ఎందుకొచ్చినట్టు? పాలన మరిచి అరాచకాన్నే నమ్ముకుంటే, స్వోత్కర్షలకూ, స్తోత్రపాఠాలకూ అలవాటుపడితే జరిగేది ఇదే. ఈ బాపతు పాలకుల్ని ఏం చేయాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో జనం గ్రహిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. -
ఉబుసుపోని పనులు
ఉబుసుపోని మనుషులు రకరకాల పనులు చేస్తారు. ఉబుసుపోని పనులకు అర్థం, పరమార్థం ఉండవు. ఉబుసుపోని మనుషులు నలుగురూ ఒకే చోటుకు చేరితే పోసుకోలు కబుర్లతో కాలక్షేపం చేస్తారు. కుదిరితే చతుర్ముఖ పారాయణాన్ని ప్రారంభిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉబుసుపోని మనుషులు– అభిరుచి మేరకు పుస్తక పఠనంలోనో, కళాసాధనలోనో నిమగ్నమవుతారు. అంతటి అభిరుచులేవీ లేకుంటే, ఊరకే పడక్కుర్చీలో కూర్చునో, మంచంమీద వాలిపోయో పగటికలలు కంటారు. ఉబుసుపోని మనుషులకు పొరపాటున అదృష్టం బాగుండని అర్భక శ్రోతలెవరైనా దొరికితే, ఆవకాయ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల వరకు అనర్గళంగా ప్రసంగించి, మేధాప్రదర్శన చేస్తారు. ఉబుసుపోని మనుషులు ఇది చేస్తారు, అది చేయరని నియమాలేమీ లేవు. ఉబుసుపోని సందర్భాల్లో మనుషులు తమ బుద్ధికి తోచిన పనులు చేస్తారు.ఉబుసుపోనితనం, దానివల్ల కలిగే విసుగు మనిషిని కుదురుగా ఉండనివ్వవు. రోజులు రొడ్డగొట్టుడుగా మారిపోయినప్పుడు; దినచర్యలో మార్పు లేనప్పుడు; జీవితంలో ఉత్తేజం లోపించినప్పుడు; బతుకు బొత్తిగా నిరర్థకంగా మారిపోయిందని అనిపించినప్పుడు– మనిషికి ఉబుసుపోనితనం ఏర్పడుతుంది. దానివల్ల విసుగు పుడుతుంది. విరామ సమయాలను అర్థవంతంగా గడపలేని దుఃస్థితి తటస్థిస్తుంది. విశ్రాంతి మనశ్శాంతిని ఇవ్వలేని పరిస్థితి వాటిల్లుతుంది. ఉబుసుపోనితనం గురించి తత్త్వవేత్తలు, మనస్తత్త్వవేత్తలు, సాహితీవేత్తలు అనేక నిర్వచనాలను ఇచ్చారు. కొందరు ఉబుసుపోనితనంలోని సానుకూలతలను చూశారు. ఇంకొందరు ఉబుసుపోనితనాన్ని బూచిలా చూశారు. ఆధునిక మానసికశాస్త్ర పరిశోధకులు ఉబుసుపోనితనం మీద ఇప్పటికీ పరిశోధనలు సాగిస్తున్నారు. ‘ఉబుసుపోనితనం నైతికవాదులకు ఒక గడ్డు సమస్య. నిజానికి లోకంలో జరిగే సగానికి సగం పాపాలు ఉబుసుపోనితనం పట్ల భయం వల్ల జరిగేవే’ అన్నాడు ఇంగ్లిష్ తత్త్వవేత్త బెర్ట్రాండ్ రసల్. ‘ఉబుసుపోనితనం: కోరికల కోసం కోరిక’ అన్నాడు సుప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్. ‘ఉబుసుపోనితనం– అనుభవం గుడ్డు పెట్టే కలల పక్షి’ అన్నాడు జర్మన్ తత్త్వవేత్త వాల్టర్ బెంజమిన్. ‘ఉబుసుపోనితనం మీద కాస్తంత దృష్టి పెడితే, అది నమ్మశక్యం కానంత ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నాడు అమెరికన్ వైద్య నిపుణుడు జాన్ కాబత్జిన్. బహుశా, ఈ మేధావులంతా తమ తమ జీవితాల్లోని ఉబుసుపోనితనంతోనే ఇన్నిన్ని పరిశోధనలు సాగించి ఉంటారు. ఉబుసుపోని స్థితిలో ఖాళీగా ఉన్న మనిషి బుర్రను ‘దయ్యాల కార్ఖానా’తో పోల్చాడు ఇంగ్లిష్ రచయిత జాన్ బున్యన్. ఉబుసుపోని ఖాళీ సమయాన్ని పనికిమాలిన సమయంగా చాలామంది పరిగణిస్తారు. కానీ, ఉబుసుపోనితనానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది ఆధునిక మనస్తత్త్వ శాస్త్రం. ఉబుసుపోని స్థితిలోనే మనిషిలోని సృజనాత్మకత రెక్కలు తొడుక్కుంటుందని ఇంగ్లండ్‌లోని సెంట్రల్ లాంకషీర్ వర్సిటీకి చెందిన మనస్తత్త్వ శాస్త్రవేత్తలు శాండీ మాన్, రెబెక్కా కాడ్మన్ కనుగొన్నారు. ఉబుసుపోని స్థితిలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సహా పలు అద్భుత ఆవిష్కరణలు చేశాడని చెబుతారు. ‘మనిషిలోని జిజ్ఞాసకు, సృజనశీలతకు ఉబుసుపోనితనమే ఉత్ప్రేరకం’ అని ‘యాపిల్’ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెబుతుండేవాడు. ఉబుసుపోనితనం గురించి డేనిష్ తత్త్వవేత్త సోరెన్ కీర్కగార్డ్ దాదాపు రెండు శతాబ్దాల కిందటే ‘ద పవర్ ఆఫ్ నథింగ్నెస్’లో చర్చించాడు. ఇందులో ఆయన ‘ఉబుసుపోనితనం అన్ని దుర్మార్గాలకూ మూలం’ అని అభిప్రాయపడ్డాడు.ఉబుసుపోనితనంతో చాలామంది అర్థంలేని పనులు చేస్తుంటారు. అక్కడక్కడా కొందరు అనర్థకరమైన పనులు కూడా చేస్తుంటారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో మాటినా అనే ఇరవై రెండేళ్ల ఉబుసుపోని కుర్రాడు ఏమీ తోచక అడవికి నిప్పుపెట్టి, కార్చిచ్చును రగిల్చాడు. ఉబుసుపోనితనం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. అంతమాత్రాన ఉబుసుపోనితనం అనర్థాలకు హేతువు అని నిర్ధారణకు రావడం మాత్రం నిర్హేతుకమే అవుతుంది. ఉబుసుపోనితనమే లేకుంటే, ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఉండేవేనా?! -
రాజకీయ కవితావేశం!
అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకకాలంలో వచ్చేనెల నుంచి బీజేపీ పరిపాలించబోతున్నదని ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ఇప్పటికే అంగ (బిహార్), కళింగ (ఒడిషా) రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలివిడత పోలింగ్ జరిగిన వంగ (బెంగాల్) రాష్ట్రంలో కూడా తాము అధి కారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తుపూర్వం కాలంలో తూర్పు భారతాన ప్రవర్ధిల్లిన మూడు ముఖ్య రాజ్యాలను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ఆయనీ వ్యాఖ్యానం చేసి ఉంటారు. కళింగ యుద్ధంలో రక్తపుటే రులు పారించిన అనంతరం అశోక చక్రవర్తి తన దండయాత్రలకు స్వస్తిపలికి బౌద్ధ ధర్మ బోధనకు అంకితమయ్యారు. రికార్డు స్థాయిలో ఓట్ల వరద పారించిన వంగ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే రాష్ట్రాలపై బీజేపీ దండయాత్రలు ముగిసిపోతాయా? అటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్పవచ్చు.దక్షిణ భారతావని ఇంకా కాషాయ ఛత్రఛాయలోకి పూర్తిగా చేరనేలేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ గెలుస్తూ, ఓడుతూ వస్తున్నది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ కూటమిలో బీజేపీ జూనియర్ భాగస్వామి మాత్రమే. పైగా ఆ కూటమి గెలిచే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఏపీ కూటమి సర్కార్‌లో కూడా బీజేపీది చిన్న వాటానే. తొలిదశలో పోలింగ్ జరిగిన కేరళం ఈసారి కూడా బీజేపీకి కొరుకుడు పడలేదని వార్తలొస్తున్నాయి. మహా అయితే ఒకటి రెండు సీట్లు గెలవవచ్చనే అభిప్రాయం వినబడుతున్నది. బీజేపీ టార్గెట్ లిస్ట్‌లో అంగ వంగ కళింగల తర్వాత త్రిలింగ రాష్ట్రమున్నదనే వార్తలు చాలాకాలంగా వినిపి స్తున్నాయి. తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై ఉన్న రకరకాల వాదనల్లో త్రిలింగ వాదన కూడా ఒకటి కావడం తెలిసిన విషయమే.దక్షిణాన తెలంగాణతో పాటు, ఉత్తరాన పంజాబ్ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్‌లో బీజేపీ ఆపరేషన్ నిన్ననే బయటపడింది. అక్కడి పాలక పక్షమైన ఆప్ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉన్నది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈరోజు (శనివారం) కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికీ, బీజేపీ తెలంగాణ వ్యూహానికీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానెళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్‌గా కవర్ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌తో రాజకీయ విరోధంతోపాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లకోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్‌పై పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని చంద్రబాబు కరకట్ట నివాసానికి పరుగు పెట్టవలసి వచ్చింది. మధ్యవర్తుల మంత్రాంగంతో ఆ కేసు అప్పటితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జరిగిన అవమానాన్ని మరిచిపోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా రాహుల్ గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కర్ణాటక, గుజరాత్ ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్రెడ్డిని ఇరుకున పెట్టడం కోసం ఆయన చెల్లెలు షర్మిల ఆశలను అవకాశంగా తీసుకొని తొలుత తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేయించి, కేసీఆర్‌ను నానాతిట్లు తిట్టించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రతిష్ఠించారనీ, జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్ కూతురు తండ్రితో విభేదించి సొంతంగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్ సర్కార్ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నదని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కవితకు మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఇవే లక్షణాలు కేటీఆర్‌లో కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబం నుంచి ఇంతమంది సమర్థులైన నాయకులు రావడం కేసీఆర్‌కు లాభమా నష్టమా అనేసంగతి తేలవలసి ఉన్నది.ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించ వలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనుక రహస్య ఎజెండా ఉన్నదా, ఆమె వెనుక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయడం అనవసరం. అటువంటివేమైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకొస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని ఆమె విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్లెం వేయగలరా? ప్రతి పక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షం మనమే, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రక టించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్ ఎవరో అర్థమవుతున్నది. పాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతుండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి! ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన ఐదు ప్రధాన హామీలకు ఆమె ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం,ఒక్క నోటిఫికేషన్‌తో యువకులకు నాలుగు లక్షల ఉద్యోగాలు,అందులో ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సబ్బండ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయడం... ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు హామీలు. బీజేపీని రిమోట్ కంట్రోల్‌తో నడిపించే ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే. వారి గురువు గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ తెలుగు అనువాదం పేరు పాంచజన్యం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఫినిష్ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచ జన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది.ఐదు హామీలూ ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏరకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్ఎస్ అధ్యక్షురాలిపై ఉంటుంది. రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి కేసీఆర్ పథకాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వాటి కంటే మిన్నగా ఏరక మైన ప్రతిపాదనను ఆమె ముందుకు తీసుకొని వస్తారో ఎదురు చూడవలసి ఉన్నది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీ లతోపాటు, ఎస్టీ, బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగు తున్నారు. విశారదన్ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయ నినాదం సార్థకమవుతుంది. ఇటువంటి ఎన్నో సవాళ్లకు వెరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘డిజిటల్’ కేసులో పరిహారం!
జేబులు కొట్టడం, దారి దోపిడీలు చేయడం, దొంగతనాలకు పాల్పడటం, నమ్మించి మోసగించటం... ఇవన్నీ పాతకాలపు నాటు పద్ధతులు. 2016లో పెద్దనోట్ల రద్దుతర్వాత దేశంలో ఆన్లైన్ చెల్లింపులు మొదలై వీటన్నిటినీ మరపించేలా కొత్త కొత్తదోపిడీ విధానాలు రంగప్రవేశం చేస్తున్నాయి. అందులో తాజాగా వచ్చిచేరిన ‘డిజిటల్ అరెస్టు’ వీటన్నిటినీ తలదన్నింది. ఈ మార్గాల్లో పౌరులు కోల్పోతున్న సొమ్ము వందల్లోంచి వేలల్లోకి... అక్కడి నుంచి లక్షలు దాటి ఇప్పుడు కోట్లాది రూపాయలకుచేరటంతో మన వ్యవస్థల్లో చలనం వచ్చినట్టుంది. అందుకే కావొచ్చు... ఇటీవల రిజర్వ్ బ్యాంకు స్వతంత్ర ప్రతినిధి (ఆంబుడ్స్మన్) ఈ తరహాలో రూ. 22.93 కోట్లు పోగొట్టుకున్న నరేష్చంద్ర అనే బాధితుడికి కోటీ 31 లక్షల పరిహారం చెల్లించాలని అయిదు బ్యాంకుల్ని ఆదేశించింది. ఆన్లైన్ లావాదేవీల్లో లక్షలాది రూపాయలు నష్టపోతున్న బాధితులు తమ మూర్ఖత్వాన్నీ, తెలివితక్కువతనాన్నీ తిట్టుకుని రోదిస్తు న్నారు. ‘డిజిటల్ అరెస్టు’లో రూ. 8 కోట్లు కోల్పోయిన ఉదంతంలో పంజాబ్ మాజీ ఐజీ అమర్‌సింగ్ చాహల్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఫిర్యాదులిచ్చినా తిరిగి రాబట్టుకునే సొమ్ము అంతంతమాత్రంగానే ఉంటున్నది. సైబర్ క్రైమ్ విభాగాలకు ఫిర్యాదు చేయ టానికి వెళ్తే ‘ఆ మాత్రం తెలియదా?’ అంటూ ఎదురయ్యే చీవాట్లను భరించటంఅదనపు కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంబుడ్స్మన్ నిర్ణయం బాధితులకు ఉపశమనంకలిగిస్తుంది. ఈ మోసాలు పౌరులకు పెద్ద తలనొప్పిగా మారాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే ‘మన్ కీ బాత్’లో ‘డిజిటల్ అరెస్టు’ మోసాల గురించి ప్రస్తావించాక, మీడియాలో రిజర్వ్ బ్యాంకు తరఫున భారీ ప్రకటనలివ్వటం మొదలైనాక జనంలో ఏదోమేరకు చైతన్యం వచ్చిన సంగతి వాస్తవమే. అయితే ఇంకా మోసపోయేవారిసంఖ్య తగ్గటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోసాల కారణంగా జనం రూ. 34,771 కోట్లు కోల్పోయారని రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం ‘డిజిటల్ అరెస్టు’ల వాటాయే రూ. 1,900 కోట్లు ఉంది. 2022లో 10.29లక్షలున్న కేసులు 2024 నాటికి 22.68 లక్షలకు చేరాయి. గత మూడేళ్లలో జనం నుంచి మాయగాళ్లు కొట్టేసిన సొమ్ము 1.25 లక్షల కోట్లు! సిబ్బంది కొరత మాటెలావున్నా, పోలీసు విభాగాల్లో సైబర్ నేరాల దర్యాప్తు, ఆచూకీ రాబట్టడం వగైరాల్లో చాలామందికి పకడ్బందీ శిక్షణ లేదు. ఈ మాదిరి నేరాలకు పాల్పడేవారు వేరే రాష్ట్రాలకూ, వేరే దేశాలకూచెందినవారు కావటం, దర్యాప్తు చేయటానికి పెద్ద ఆటంకంగా మారింది.నియంత్రణ వ్యవస్థలు ఈ మోసాలను అరికట్టడానికి కొత్త ఉపకరణాలు కనుక్కొనే లోగానే నేరగాళ్లు ఏఐతో, ఇతరేతర మార్గాల్లో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం, 2023 నాటి డేటా పరిరక్షణ చట్టం వంటివి మధ్యస్తంగా ఉండే సంస్థలపై బాధ్యత మోపాయి. కానీ ఆచరణలో పెద్దగా ప్రయోజనం లేదు.ఆంబుడ్స్మన్ నిర్ణయం ఈ నేరాలను అరికట్టడంలో ముందడుగు. అసలు ఖాతాదార్లకు తెలియకుండా దొంగసొమ్ము రాకపోకలకు నేరగాళ్లు వాడుకునే ‘మ్యూల్ అకౌంట్ల’ పనిబట్టేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయ్యాయి. బ్యాంకుల నిష్క్రియాపరత్వం కావొచ్చు... సిబ్బంది కుమ్మక్కుకావటం వల్ల కావొచ్చు ఇవిఇన్నాళ్లూ నిర్నిరోధంగా సాగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నేరగాళ్లకు సహకరించేబ్యాంకు సిబ్బందిని పోలీసులు ఈమధ్యే అరెస్టు చేశారు. ఈ మార్గంలోనే ఆంబుడ్స్మన్ సైతం ఖాతాదారు వివరాలు సేకరించటానికి, ద్రవ్య అక్రమ చలామణిని అరికట్టడానికి ఉన్న నిబంధనల్ని పాటించటంలో అలసత్వం ప్రదర్శించినందుకు నరేష్చంద్ర కేసులో పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే దీంతో ఆయన సంతృప్తిపడదల్చుకోలేదు. రిజర్వ్‌బ్యాంకు మార్గదర్శకాలు పాటించని ఆ బ్యాంకులనుంచి తాను కోల్పోయిన మొత్తం రూ. 22.93 కోట్లు ఇవ్వటంతోపాటు నష్టపరిహారం, వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్ పన్నుకయ్యే ఖర్చుతో సహా వెనక్కి ఇప్పించాలని నరేష్చంద్ర పోరాడతానంటున్నారు. ఆన్లైన్ మోసాల్లో బాధితులుగా మారుతున్నవారు పోలీసు కేసులు పెట్టడంతోపాటు, బ్యాంకుల అలసత్వం ఉన్నపక్షంలో వాటిపై కూడా న్యాయపోరాటం చేయటానికినరేష్చంద్ర కేసు స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. -
మణిపూర్ చక్కబడేదెన్నడు?
మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగి మూడేళ్లు కావస్తున్నా అక్కడింకా పరిస్థితులు చక్కబడలేదని తాజా ఉదంతాలు నిరూపిస్తున్నాయి. 2023 మే నెలలో హింసకు దారితీసిన వదంతులే ఇప్పటికీ ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి. బీరేన్ సింగ్ నాయ కత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. అది ఏడాది కొనసాగాక మొన్న ఫిబ్రవరిలో ఆ పార్టీకి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ ఆధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ పరస్పర అపనమ్మకం, జాతి విద్వేషాలు ఆగిందిలేదు. వందలాదిమంది ఆయుధాలు ధరించి గుంపులుగా బయల్దేరి ఊళ్లమీద పడి నిర్విచక్షణగా హత్యాకాండకు, అత్యాచారాలకు పాల్పడటం, ప్రార్థనా స్థలాలు, ఆవాసాలు తగలబెట్టడం ఇప్పుడు లేక పోవచ్చుగానీ... అవతలి పక్షంపై ఆగ్రహావేశాలు తగ్గలేదు. తరచుగా నిరసన ప్రదర్శనలు జరగటం, రహదారులను స్తంభింపజేయటం ఆగలేదు. కేంద్ర బలగాల సంఖ్యను పెంచటం, నిరంతర పహారా వంటివి హింసాత్మక ఉదంతాలను గణనీయంగా కట్టడి చేశాయి. కానీ ఇప్పటికీ విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలూ, తప్పుడు సమాచారం వ్యాప్తిలోనే ఉన్నాయి. ఈ నెల మొదటివారంలో ఒక ఇంటిపై బాంబుపడి ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ఆ బాంబు కుకీలు నివసిస్తున్న ప్రాంతంనుంచి వచ్చిపడిందనీ, వారికి భద్రతా బలగాలు కొమ్ముకాస్తున్నా యనీ ప్రచారం వెల్లువెత్తడంతో జనం ఒక సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేశారు. అటుగా వాహనంలో వెళ్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన అధికారిని గుంపు చుట్టుముట్టి దౌర్జన్యం చేసింది. ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు రక్షించగలిగాయి. మొన్న మంగళవారం ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ముఖ్య మంత్రిని ఆందోళనకారులు అడ్డుకున్నప్పుడు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు హెలికాప్టర్ తెప్పించుకుని అక్కడినుంచి ఆయన బయటపడాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మాజీ సైనికుడితో సహా ఇద్దరు నాగా జాతీయుల్ని మిలిటెంట్లు హతమార్చారు. మూడేళ్ల క్రితం మెయితీలకూ, కుకీలకూ మధ్య వైరం హింసకు దారితీయగా ఇప్పుడు మెయితీల గురి నాగాలపై కూడా పడింది. ఒక పద్ధతి ప్రకారం వదంతులు వ్యాప్తిచేయటం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ఇంకా ఆగలేదు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే... ఆ వదంతుల్ని ఖండిస్తూ పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఉద్రిక్తతల్ని ఆపటంలో అవి పెద్దగా ఉపయోగపడటం లేదు. గతంలో బీరేన్ సింగ్ ప్రభుత్వ హయాంలో మెయితీలకు చెందిన సాయుధ మిలిటెంట్ సంస్థ ఆరంబాయ్ టెంగోల్ను చూసీచూడనట్టు వదిలేశారు. కుకీల ‘దురాక్రమణల్ని’ అడ్డుకునే పేరిట ఏర్పడిన ఆ సంస్థ కుకీలకూ, నాగాలకూ మాత్రమే కాదు, వారిని ప్రశ్నించే మెయితీలకు సైతం పెద్ద బెడదగా పరిణమించింది. బెదిరించటం, దౌర్జన్యం చేయటం, బలవంతంగా వసూళ్లకు పాల్పడటం ఆ సంస్థకు నిత్యకృత్యమైంది. మూడేళ్లనాటి ఉదంతాలతో పోలిస్తే హింసాత్మక ఘటనలు తగ్గివుండొచ్చు. కానీ ఇప్పటికీ సమాజం చీలికలు, పేలికలుగా ఉంది. మెయితీలూ, కుకీలూ ఒకరి ప్రాంతంలోకి ఒకరు వెళ్లలేకపోతున్నారు. పనిచేయగలిగిన సత్తావుండి అది దొరుకుతుందన్న భరోసా ఉన్నచోటకు పోలేకపోవటం, పై చదువులకు అర్హతలున్నా ఊరు కదల్లేక పోవటంకన్నా మించిన హింస ఏం ఉంటుంది? పరిమిత వనరులు, ఉపాధి లేమి, భిన్న తెగలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటంవంటి కారణాలవల్లే అసంతృప్తి అవధులు దాటుతోంది.యువతకు ఉపాధి కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, వారికి మెరుగైన అవకాశాలు రావటానికి తగిన ప్రణాళికలు రూపకల్పన చేయటంవంటి ప్రయత్నాలు ఎక్కడా కనబడవు. కనుకనే మిలిటెంట్ సంస్థల ఆధిపత్యం సాగుతోంది. మౌలిక సమస్యల్ని పరిష్కరించలేని రాజకీయ నేతలు ఓట్లు రాబట్టుకోవటానికి మాత్రం ఆయా తెగల్ని శాసించగల మిలిటెంటు సంస్థలకు సహకరిస్తున్నారు. ఇది కొనసాగినంత కాలమూ మణిపూర్ నెత్తురోడుతూనే ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిస్తేనే ఆ రాష్ట్రం తెరిపిన పడుతుంది. -
కీలక పోరుకు సిద్ధం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ల భవితవ్యాన్ని తేల్చబోయే పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్లో గురువారం తొలి దఫాలో 152 స్థానాలకు పోలింగ్ జరగబోతుండగా, ఈ నెల 29న మరో 142 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తమిళనాట మాత్రం మొత్తం 234 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ పూర్తవుతుంది. తమిళనాడులో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పర్వం ఎప్పుడూ ప్రశాంతమే. బెంగాల్లో మాత్రం మహోద్రిక్త వాతావరణమే అలుముకుంటుంది. పార్టీల వైరం సరేగానీ... ఎన్నికల సంఘం(ఈసీ) సైతం ఈ ఉద్రిక్తతలకు దోహదపడటం కొత్త పరిణామం. జనం తమవెంటే ఉన్నారా లేదా... వ్యూహం, ఎత్తుగడలూ కుదిరాయా లేదా అని పార్టీలు ఆత్ర పడటం సహజం. సాధారణ జనంలో సైతం కాబోయే విజేతలెవరు, పరాజితులెవరన్న ఆత్రుత ఉండితీరుతుంది. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను లోపరహితంగా పూర్తిచేద్దామన్న ఆత్రుత ఈసీలో లేకుండా పోయింది. అందువల్లే బెంగాల్లో 91 లక్షలమంది, తమిళనాడులో 70 లక్షలమంది ఓటర్లలో ఈసారి ఓటు వేయగలమా లేదా అన్న ఆందోళన ఏర్పడింది. బెంగాల్లో ట్రిబ్యునళ్లలో అప్పీల్ దాఖలు చేసి విజయం సాధించినవారికి ఓటేసే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఇంత తక్కువ వ్యవధిలో ఎందరికి ఆ వరం దక్కుతుందో అనుమానమే. ‘స్వచ్ఛమైన’ ఎన్నికల జాబితాతో పోలింగ్ జరిపితీరాలన్న ఈసీ దృఢ నిశ్చయాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు. అందుకోసం ‘సర్’ తీసుకొచ్చారు. కానీ పోలింగ్ తేదీలు ప్రకటించే నాటికి సైతం ఒక కొలిక్కి రాకపోవటం, సాధారణ జనం నానా హైరానా పడటం ఈసీ అసమర్థతకు అద్దం పట్టింది. పోలింగ్‌కు 48 గంటల ముందు కూడా ఓటుహక్కు ఉంటుందో, ఊడుతుందో తెలియనివారు అనేకులు. ఓటర్లకూ, వారి తల్లిదండ్రులకూ వయసు వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ లేదా 50 ఏళ్లకు మించి ఉంటే... ఒకే జంటకు ఆరుగురు, అంతకన్నా ఎక్కువమంది సంతానం ఉంటే... ఇంగ్లిష్‌లో ఉన్న పాత రికార్డుల్లోని పేర్లకూ, ఇప్పుడు నమోదైన పేర్లకూ మధ్య అక్షరం తేడా ఉంటే... ఓటరు వయసుకూ, వారి తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ వయసులకూ మధ్య 40 ఏళ్లకన్నా తక్కువుంటే ఈసీ వాడిన క్రమసూత్ర పద్ధతి (అల్గోరిథిమ్) పొరపాటుగా పరిగణించింది. ఇది మానవ తప్పిదమైనా ఎప్పుడూ లేనట్టు ‘తార్కిక విరుద్ధత’ అనే కొత్త విధానంతో ఈ పేర్లన్నిటినీ తొలగించారు. చాలా ఆలస్యంగా వెల్లడికావటంవల్ల అనేకులు ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించలేకపోయారు. ఇలాంటివారు ఎన్ని లక్షలమందో తీరిగ్గా వెల్లడవుతుంది. అప్పటికల్లా పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది!ఆంధ్రప్రదేశ్‌లో 2024లో యథేచ్ఛగా సాగిన ఎన్నికల వైపరీత్యాల గురించి వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకూ ఈసీ నుంచి ఉలుకూ పలుకూ లేదు. లోక్‌సభకూ, అసెంబ్లీకీ ఒకేసారి జరిగిన పోలింగ్‌లో నిమిషానికి నలుగురు ఓటేశారన్నా దానికి పట్టదు. కానీ తగుదునమ్మా అంటూ మొన్న బిహార్‌లో, ఇప్పుడు ఎన్నికలు జరిగిన, జరగబోతున్న రాష్ట్రాల్లో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా పేరుతో ‘సర్’ ప్రక్రియ మొదలెట్టింది. ఏపీ విషయంలో ఈ ‘స్వచ్ఛ సంకల్పం’ ఏ గంగలో కలిసినట్టు? తమిళనాట చాలా దశాబ్దాల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకేలకు సినీ హీరో విజయ్ నెలకొల్పిన టీవీకే పార్టీ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఇందువల్ల ఎవరి లెక్క తారుమారువుతుందన్నది చూడాల్సి ఉంది. ఆయన సభలకు భారీయెత్తున జనం రావటం గమనించదగింది. బెంగాల్లో రెండు దశాబ్దాలనాడు భూసేకరణ విధానంపై పోరాడి ఏకంగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికే ఎసరు తెచ్చిన నందిగ్రామ్ ఇప్పుడు కొత్త దోవ తొక్కటం గమనార్హం. ఆనాడు మొత్తం సమాజానికి జరిగిన అన్యాయంపై ఒక్కటై ప్రశ్నించిన నందిగ్రామ్ ఇవాళ ఏ దేవుడు గొప్ప – రాముడా, జగన్నాథుడా అనే అంశం చుట్టూ తిరుగుతోంది. తొలి దశ పోలింగ్‌లో ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ రామనామాన్ని, టీఎంసీ తన ఆధ్వర్యంలో నిర్మాణమైన జగన్నాథ్ ఆలయాన్ని తెగ ప్రచారం చేశాయి. ఏదేమైనా పోలింగ్ ప్రశాంతంగా ముగియాలని అందరూ కోరుకుంటారు. -
ద.కొరియాకు దగ్గరగా...
ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకున్నప్పుడు మన దేశంలో విదేశీ అధినేతల పర్యటనలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. దానికితోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సృష్టించిన అనిశ్చితి సరేసరి. ఇలాంటి వాతావరణంలో ఆదివారం భారత్‌కొచ్చి మూడు రోజులు పర్యటించి వెళ్లిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌కు ఇది అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ పర్యటనకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఆ మాటెలా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరు దేశాల మధ్యా ప్రస్తుతం ఉన్న 2,700 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి 5,000 కోట్ల డాలర్లకు చేర్చాలని అధినేతలిద్దరూ సంకల్పించారు. ఇందుకోసం 2010లో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)ను మరింత విస్తృతపరచాలని నిర్ణయించారు. భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో దక్షిణ కొరియా అయిదో స్థానంలో ఉంది. మ్యూంగ్ తనతోపాటు 200 మంది వ్యాపార వేత్తలూ, సీఈవోలతో కూడిన భారీ ప్రతినిధి బృందాన్ని వెంట బెట్టుకుని వచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), రక్షణ, షిప్పింగ్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, క్రీడలు, సాంస్కృతిక రంగం వగైరాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్యా సాంస్కృతిక బంధానికి ఎంతో చరిత్ర ఉందంటారు. క్రీస్తుశకం 48లో అయోధ్యకు చెందిన యువతి హియోహాంగ్కు అప్పటి కొరియా రాజు సురోతో వివాహమైందని 13వ శతాబ్దంనాటి ఒక బౌద్ధ సన్యాసి రచించిన పుస్తకంలో ఉంది.అందులో ప్రస్తావించిన ‘అయుత’ ఇప్పటి అయోధ్య అయివుంటుందని అనేకులు భావిస్తారు. కొరియా చరిత్రలో ఆమె యువరాణి సురిరత్నగా నమోదైంది. అయోధ్యలో సరయూ నది ఒడ్డున రాణి హియోహాంగ్ స్మృతిలో ఒక పార్క్ నిర్మించారు. 2019లో ఆమె స్మారకార్థం రెండు దేశాలూ కలిసి ఒక స్టాంపు విడుదల చేశాయి. నాలుగో శతాబ్దంలో బౌద్ధం ఆ దేశంలో ప్రవేశించింది. 1973లో తొలిసారి దౌత్య సంబంధాలు ఏర్పడినా... అంతకు చాన్నాళ్లముందే 1950–53 నాటి కొరియా యుద్ధకాలంలో మన దేశంనుంచి వైద్య బృందాలు అక్కడికెళ్లి పనిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిశాక తొలిసారి 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆ దేశంలో పర్యటించారు. ప్రత్యేకించి ఎలాంటి కారణాలూ లేకపోయినా 2018లో అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–యీ తర్వాత దౌత్య సంబంధాల్లో స్తబ్ధత ఆవరించింది. అప్పుడూ, అంతకుముందూ కుదిరిన ఒప్పందాలు ఆచరణలో కొనసాగుతున్నా ఇరు దేశాల వాణిజ్య లోటుపై మన దేశానికి కొంత అసంతృప్తి ఉంది. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 2,700 కోట్ల డాలర్లున్నా, అక్కడినుంచి మనకొచ్చే దిగుమతుల విలువ దాదాపు 2,100 కోట్ల డాలర్లు. మన ఎగుమతుల విలువ 600 కోట్ల డాలర్లు మించదు. ఇందులో సమతౌల్యత సాధించాలని మన దేశం ఎప్పటినుంచో భావిస్తోంది. ఆరోగ్య కారణాలు చూపి, చీడపీడలు చూపి మన సాగు ఉత్పత్తులను దక్షిణ కొరియా అడ్డుకుంటోంది. నౌకా నిర్మాణంలో దక్షిణ కొరియా సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరుంది. పర్యావరణ హితమైన, అత్యాధునిక నౌకల నిర్మాణంలో, ఇతర నౌకాసంబంధ కార్యకలాపాల్లో మన దేశానికి సహకరించేందుకు అంగీకరించింది. నౌకాశ్రయాలను సాంకేతికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లటంతోపాటు ఓడల మరమ్మతుకు, అతి పెద్ద ఓడల నిర్మాణానికి తోడ్పడే భారీ డ్రై డాక్ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది. రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. విమాన విధ్వంసక ఫిరంగులు, క్షిపణి వ్యవస్థలు ఇక్కడే అభివృద్ధిపరచడానికి, అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతల్ని బదిలీ చేయటానికి దక్షిణ కొరియా అంగీకరించింది. యుద్ధక్షేత్రంలో చురుగ్గా కదిలి, శత్రుసైన్యాన్ని దీటుగా ఎదుర్కొనగలిగే సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ కె9 వజ్ర కొరియా సహకారంతోనే ఇక్కడ ఉత్పత్త వుతోంది. ఇవిగాక సెమీ కండక్టర్లు, ఫార్మా, జౌళి, ఐటీ రంగాలకు సైతం సహకారం విస్తరించటానికి సంకల్పించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో భిన్న రంగాల్లో మరింత దగ్గరయ్యేందుకు దక్షిణ కొరియా అధినేత పర్యటన దోహదపడుతుంది. -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్‌ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్‌ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్‌కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
నీటి గుడి
కాశీలోని ఒక ముసలామెకు రోజులు ముగిశాయి. యమభటులు వచ్చి ‘అవా... బయలుదేరు...’ అంటే ఆమె అందుకే కాచుకుని ఉన్నట్టు ఒకటీ అరా వస్తువులు ముల్లె కట్టుకొని ‘పదండి నాయనా’... అని కదలబోయింది. విష్ణుభటులు ప్రత్యక్షమయ్యారు. ‘మీరెందుకు వచ్చారు’ అన్నారు యమభటులు ఆశ్చర్యపోయి. ‘ఈ అవ్వ మా కేండేటు. స్వర్గానికి పిల్చకపోవడానికి వచ్చాము’ అన్నారు. ‘అంత ఘనకార్యం ఏం చేసిందీ అవ్వ. కొంపదీసి యజ్ఞాలుగానీ చేసిందా’ అన్నారు యమభటులు. ‘అంతకు మించే చేసింది. అవ్వకు కొడుకూ బిడ్డా ఎవరూ లేరు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి ఈ కాశీలో చలివేంద్రం పెట్టింది. ఇక్కడ రోజూ వచ్చే భక్తులు, బైరాగులు ఈమె పెట్టిన కుండల్లోని నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నారు. ఒక్క దప్పిక తీరిస్తే నూరు అశ్వమేధ యాగాల పుణ్యం. మరి ఈమె పుణ్యం లెక్కవేయడానికి మీ చిత్రగుప్తుడి చిట్టాపద్దులు సరిపోతాయా’ అని అవ్వను పల్లకీ ఎక్కించి, పూలవానలో స్వర్గలోకానికి తోడ్కొని వెళ్లారు. ఈ ఎండల్లో వినదగ్గ కథే ఇది.అదేమిటో యుగాలు గడిచినా రంతిదేవుణ్ణి తలదన్నే ఉదారపురుషుడే కానరావడం లేదు. దానాలకు అన్నీ పోగా 48 రోజులు ఉపవాసం ఉన్న రంతిదేవుడికి కొంత జావా, కొన్ని నీళ్లు దక్కాయి. జావ తాగబోతే ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘ఆకలి’ అన్నాడు. ఇచ్చేశాడు. నీళ్లు తాగబోతుంటే ఒక శూద్రుడు వచ్చి ‘దప్పిక’ అన్నాడు. ఇచ్చేశాడు. పాత్రలో ఉన్న చివరి నీటి చుక్కలను తాగుదామనుకునేలోపు ఒక పంచముడు వచ్చి ‘అయ్యా... దప్పికతో చచ్చేలా ఉన్నాను’ అనంటే ఆ చివరి నీటి చుక్కలతో పంచముడి పెదవులు తడిపాడు. అప్పుడు ఆగలేక విష్ణువు ప్రత్యక్షమై ‘నీ త్యాగం ముందు నా వైకుంఠం దిగదుడుపు’ అన్నాడు. ‘నీకేం కావాలో కోరుకో’ అనీ అన్నాడు. ‘నాకేం వద్దు. ఈ లోకంలో ఎవరినీ దప్పికతో ఉంచొద్దు’ అన్నాడు రంతిదేవుడు. ‘తథాస్తు’ అన్నాడు విష్ణువు. ఈ భగభగమండే ఎండల్లో అలా రోడ్డు మీద వెళితే ఈ ‘తథాస్తు’ ఏ మేరకు సిద్ధించిందో తెలుస్తుంది.పనుల మీద ఊరుగాని ఊరుకు వస్తారు చాలామంది. ఉన్న ఊళ్లోనే రెక్కాడితేగాని డొక్కాడని బతుకుకై బయలుదేరుతారు చాలామంది. జనుల ఆకలి తీర్చడానికి తిండి బుట్టలు వీపున కట్టుకుని తిరిగేవారు వేలమంది. ఇక ఈ దేశంలో కోట్ల మందికి ట్రంకు రోడ్డే ఆఫీసు, మెయిన్‌రోడ్డే షాపు. కాసింత చెట్టు నీడ కూడా దొరకని ఈ పొడవైన, నిర్దాక్షిణ్యమైన, నల్లటి రోడ్డు మీద వేసవిలో బతుకులు వెళ్లమార్చే వారంతా ఉష్ణాన్ని తట్టుకోగలరేమోగానీ దప్పికను తట్టుకోగలరా? ఏం కావాలి వీరికి? మన మనసు చల్లదనం. అది మన చేత పెట్టించే చలివేంద్రం. తడి గుడ్డ కట్టిన, చూడగానే ప్రాణం లేచి వచ్చే చల్లని మంచినీరు!‘అప ఏవ ససర్జాదౌ’ స్మృతివాక్యం. అంటే ‘పరమాత్ముడు మొదట నీరు సృష్టించాడు’. నారము– నీరును, ఆయనము– నివాసము చేసుకున్నవాడు నారాయణుడు. ‘నీటిలో రుచిని నేను’ అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. నీళ్లతో సేవ చేయడమంటే దేవునికి పూజ చేయడమే. ‘పానీయం పరమం దానం’. నీటిదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. పామరులు ఈ మాటనే ‘కుండలో నీళ్లు పోస్తే పుణ్యం వాగు పారినట్టు’ అన్నారు. ‘దాహం అన్నవాడికి లేదనకు. లక్ష్మి ఇల్లు కదలుతుంది’ అని హెచ్చరించారు. ఉత్తర భారతాన ‘ప్యావూ’ అని పిలిచే చలివేంద్రాల సంస్కృతి ఉంది. ఇంటి బయట, వీధి చివర ఎవరో అజ్ఞాతవ్యక్తులు పెద్ద పెద్ద రజాయిలు పెట్టి నీళ్లు నింపుతుంటారు. ఎండన పడి వెళ్లేవాళ్లంతా తాగుతుంటారు. అజ్ఞాతంగా ఎందుకు? దప్పిక తీర్చి చెప్పుకోకూడదు. దప్పిక తీర్చామని అహానికి పోకూడదు. దప్పిక తీరినవారు ఫలానా వారికి రుణపడ్డామని అనుకోకూడదు. నీరు దైవసొత్తు. మనిషి సృష్టించింది కాదు. దైవసొత్తును మరో మనిషికి చేరవేయడంలో మన ఘనకార్యం ఏముంది? మరైతే మన దేశంలో చలివేంద్రాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? కేరళ. గతంలో తెలుగునాట ఎండలు వస్తే పోటీలు పడి చలివేంద్రాలు పెట్టేవారు. ఇప్పుడు రీల్స్ చూడటంలో పడి బిజీగా ఉంటున్నారు. గ్లాసెడు నీరు ముంచి ఇచ్చి పోగేసుకునే సంతృప్తికి కౌంటింగ్ మెషీన్ లేదని వీరికి తెలిసేదెలా? ఎండాకాలంలో పుణ్యయాత్రలకు రెడీ అవుతుంటారు చాలామంది. మంచిదే. కాని మన ఇంటి ముందే ఒక గుడి కట్టే వీలుండే ఈ కాలాన్ని మిస్ చేసుకోవద్దు. నీటి గుడి కట్టండి. నీరున్న కుండలో దేవుడు ఉన్నాడు! -
ఎక్కాల్సిన రైలు ఎప్పుడొస్తుంది?
131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రతిపాదించిందని ప్రతిపక్షం ఆరోపించింది. నిజమే కావచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనతో కలిపేయడం వెనుక రాజకీయ కుట్ర దాగున్నదని ప్రతిపక్షం విమర్శించింది. ఇది కూడా నిజమే కావచ్చు. నియోజకవర్గాల పెంపును అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో పెంచుతామని ప్రధాని ఇచ్చిన హామీ బిల్లులో లేకపోవడం మోసపూరిత చర్యగా విపక్షం అభివర్ణించింది. అలా అనుమానించడంలో కూడా తప్పు లేదు. కనుక రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందివ్వకుండా అది వీగిపోయేలా చేసింది. అయితే బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్షం సాధించిన ఘనకార్యమేమిటన్నదే అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోతున్నది.మన దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా సందర్భాల్లో పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటూ తమ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులుగా పురుషులతో సమానస్థాయిలో రాణించగలుగుతున్నారు. చారిత్రక కారణాల వలన ఆర్థిక స్వాతంత్య్రంలో గానీ, వనరుల అజమాయిషీలో గానీ పురుషులతో పోలిస్తే వారు పోటీ పడలేరు. విస్తృత ప్రజా సంబంధాలను నెరపడంలో కూడా కుటుంబ బాధ్యతలు, సామాజిక బంధనాల వల్ల పురుషుల కంటే వెనకబడుతున్నారు. ఫలితంగా పురుష పుంగవులతో పోటీపడి గౌరవ ప్రదమైన సంఖ్యలో చట్టసభలకు ఎన్నిక కాలేకపోతున్నారు. సగం జనాభాకు ప్రాతినిధ్యం వహించేవారి ప్రాతినిధ్యం పది నుంచి పదిహేను శాతం దాటడం లేదు. వారిలో కూడా తండ్రి చాటు బిడ్డలు, భర్త నీడలోని భార్యలే ఎక్కువ!ఆందోళనకరమైన ఈ అసమానతను అధిగమించాలంటే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అవసరమనే ప్రతిపాదన చాలాకాలం కిందనే రాజకీయ వేదికపైకి వచ్చింది. ముప్ఫయ్ సంవత్సరాల కిందట 1996లో మహిళా బిల్లు తన ప్రయాణానికి సిద్ధమై స్టేషన్లో కూర్చున్నది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అని అభ్యుదయ కవి ఆరుద్ర చెప్పిన మాట మహిళా బిల్లులో నిజమైంది. రాజకీయ నేతలు కుంటిసాకులు చెప్పకుండా అప్పుడే ఆమోదించి వుంటే చట్టసభల్లో మూడో వంతు మహిళలు మూడు దశాబ్దాల కిందనే ప్రవేశించి ఉండే వారు. బహుశా వారిలో చాలామంది రంగంలోంచి తప్పుకొని రెండో తరానికి మార్గమిచ్చి ఉండేవారు. నిజంగానే ఒక తరం మహిళలు ఎక్కాల్సిన రైలు వారి జీవితకాలం లేటయ్యింది.ఇంకో మూడేళ్లలో రెండో తరం ఎక్కడానికి అవకాశం ఉందను కున్న రైలును స్టేషన్‌కు చేరకముందే ప్రతిపక్షం చైన్ లాగి నిలిపే సింది. అది ఎప్పటికొస్తుందో!డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేయడమేమిటని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ప్రారంభ మైన జనగణన పూర్తయిన తర్వాత, ఆ నివేదికను ప్రచురించిన తర్వాత రాజ్యాంగ విధిగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నది. ఈ ప్రక్రియ ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850 వరకు పెంచాలని కేంద్రం భావిస్తున్నది. కనుక ఆ నిష్పత్తి ప్రకారమే మహిళా సీట్లను పెంచి తాజా జనగణనతో సంబంధం లేకుండా 2011 లెక్క ప్రకారమే పునర్విభజన చేయడానికి బిల్లును రూపొందించినట్టు కేంద్రం చెబుతున్నది. అయితే తాజా జనగణన ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేప థ్యంలో దాని రిపోర్టు వచ్చేవరకు ఆగకుండా ఆదరాబాదరాగా పదిహేనేళ్ల కిందటి లెక్కలతో డీలిమిటేషన్ చేపట్టవలసిన అవసరమేమిటన్నది హేతుబద్ధమైన ప్రశ్న. ఇప్పుడున్న 543 సీట్లలోనే మహిళలకు మూడో వంతు కేటాయించి అమలు చేయడానికి దానికోసం ప్రత్యేక చట్టం చేయడానికి ఉన్న అభ్యంతరమేమిటో, రాజ్యాంగపరమైన అవాంతరాలేమిటో అర్థం కాని ప్రశ్న. కేంద్రం కూడా ఈ సందేహాలను తీర్చలేదు.డీలిమిటేషన్ ప్రక్రియ పట్ల ప్రతిపక్షాలకు అభ్యంతరాలు న్నాయి. కానీ, రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం పదేళ్ల కోసారి జరిగే ప్రతి జనగణన తర్వాత చట్టసభల స్థానాలను పునర్విభజన చేయడానికి పార్లమెంట్ ఒక అథారిటీని నియమించవలసి ఉన్నది. అట్లాగే 170వ అధికరణం ప్రకారం రాష్ట్రాల్లో కూడా! 1971 దాకా ఈ పద్ధతే కొనసాగింది. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతున్నదనే వాదన ముందుకొచ్చింది. దాంతో 1976లో అప్పటికి ఉన్న సీట్ల గరిష్ఠ సంఖ్యను స్తంభిం పచేసేలా చట్ట సవరణ జరిగింది. మొదట 2002 వరకు, ఆ తర్వాత 2026 వరకు ఈ గరిష్ఠ పరిమితిని విధించడం జరిగింది. ఈ పరిమితికి లోబడే ఇప్పటివరకు జరిగిన పునర్విభజనలన్నీ మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితమయ్యాయి.చట్టసభల్లో సీట్ల సంఖ్యను స్థిరీకరించి యాభై ఐదేళ్లు గడిచిపోయాయి కనుక ఇప్పుడు సీట్ల సంఖ్యను పెంచుతామని ఎన్డీఏ సర్కార్ చెబుతున్నది. రాజ్యాంగ నిబంధన కూడా పదేళ్ల కోసారి జరిగే జనగణన తర్వాత సీట్ల పునఃపంపిణీ జరగాలని ఆదేశిస్తున్నది. జనాభా పెరిగితే సీట్ల సంఖ్య పెరగాలని రాజ్యాంగంలో లేకపోవచ్చు. కానీ ఎక్కువమంది ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడమే 82 అధికరణం అంత స్సూత్రం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించి ఎన్నాళ్లిలా గరిష్ఠ సంఖ్యను స్తంభింపజేయగలరు? మల్కాజిగిరి లోక్‌సభ నియో జకవర్గంలో 38 లక్షలమంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి ఎన్ని కైన ప్రజాప్రతినిధి ఎంతమందికి అందుబాటులో ఉండగలరు? అసలీ సీట్ల పెంపును విపక్షం ఎందుకు వ్యతిరేకిస్తున్నది?డీలిమిటేషన్ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి పక్ష కూటమి చెప్పడం లేదు. పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నది. డీలిమిటేషన్ జరిగే ప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు కొంత లాభం జరుగుతుందనే అపోహ రాజకీయ పార్టీల్లో ఉన్నది. ఎన్నికల సమయంలో ఏ గాలీ లేకపోతే కొద్దిమేరకు ఇది ఉపయోగపడవచ్చేమో! కానీ పాజిటివ్ లేదా నెగెటివ్ ధోరణులు బలంగా ఉన్నప్పుడు ఇదేమీ ఉపకరించదు. అయినా ఈ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు బాహాటంగా అంగీకరించవు కనుక స్పష్టాస్పష్టమైన కొన్ని భావనలను వారు ముందుకు తెస్తున్నారు. అభ్యంతరాల్లో ముఖ్యమైనది... కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుచేసిన రాష్ట్రాలు జనాభా లెక్క ప్రకారం జరిగే పునర్విభజనలో నష్టపోతాయి. యాభయ్యేళ్ల తర్వాత కూడా ఇదే వాదన. ఈ వాదన ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అంటే హిందీ రాష్ట్రాలకు లాభం, హిందీయేతర రాష్ట్రాలకు నష్టం. దీనికితోడు నార్త్ – సౌత్ వాదన. దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి, హిందీభాషను బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. బీజేపీ సర్కార్‌కు హిందీ – హిందూ ఎజెండా ఉన్నదనే సంగతిని ఎవరూ దాచలేరు. ఆ పార్టీ గత కొంతకాలంగా తన ఎజెండాను బలంగా జనంలోకి తీసుకొనిపోతున్నది. దేశంలోనే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి నిలబడలేకపోతున్నది. అసమర్థ నాయకత్వం ఆ పార్టీ పాలిటి శనిగా దాపురించింది. బీజేపీ ఎజెండాను ఎదిరించే ప్రాంతీయ పార్టీలు కొన్ని సమర్థంగా నిలబడగలుగుతున్నాయి.ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకత. మహిళా రిజర్వేషన్లు దేశ ప్రజల చిరకాల వాంఛితం. ఇప్పుడు ప్రారంభమైన జనగణన ముగిసి తుది రిపోర్టు 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని చెబు తున్నారు. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్‌ను వేయాలి. అది తన రిపోర్టును ఇవ్వటానికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ సమయాన్ని ఎప్పుడూ తీసుకోలేదు. కేంద్రంలోనూ, రాష్ట్రా ల్లోనూ ఇప్పుడు సీట్ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో మరింత ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. అంటే 2033 కంటే ముందు ఈ ప్రక్రియ పూర్తికాదు. 2029 ఎన్నికల నాటికే ముందుకు తెస్తామని ఎన్డీఏ సర్కార్ చెప్పిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఇంకో ఐదేళ్లు వెనక్కు పోతాయి.ఇప్పుడు ప్రతిపక్షం కోరుకుంటున్నదేమిటి? ఐదేళ్ల తర్వాత రాజ్యాంగబద్ధ ప్రక్రియ ప్రకారం జరిగే డీలిమిటేషన్ వారి అభీష్టానికి అనుగుణంగా జరుగుతుందా? 2028లో మోదీ ప్రభుత్వమే ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించడానికీ, దాని విధివిధానాలు రూపొందించడానికీ పార్లమెంట్లో సాధారణ మెజారిటీ చాలు. అప్పుడు మోదీ మనస్సులో ప్రతిపక్షం ఆశిస్తున్న మార్పేమైనా వస్తుందా? ‘ఇదే బిల్లులో జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం వంతున సీట్లను పెంపుదల చేసే విషయాన్ని బిల్లులో పొందుపరుస్తాం... ఓ గంట టైమివ్వండ’ని అమిత్ షా సభలో అడిగినప్పుడు ప్రతి పక్షాలు ముక్తకంఠంతో ఎందుకు అంగీకరించలేదు? గంట కాదు, రెండు గంటలు కాదు రేపటి వరకైనా సరే, మార్చి తీసుకురమ్మని ఎందుకు కోరలేదు? అలా స్పందించి ఉంటే ఎన్డీఏ సర్కార్ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయేది కదా! ఇప్పుడు ప్రతి పక్షాల చిత్తశుద్ధిపైనే ప్రజలకు అనుమానాలు కలిగేలా వ్యవహరించారు.ఇక్కడ 50 శాతం సీట్ల చొప్పున పెంపుదల అనేది ఏ ప్రాతిపదికపై చేస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వ ప్రాతిపదిక ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాయే ప్రాతిపదిక కావాలి. అందుకే పదేళ్లకోసారి జరిగే జనగణన అనంతరం అందుకు అనుగుణంగా సీట్ల పునఃపంపిణీ చేయాలని రాజ్యాంగంలో 82వ అధికరణం ఆదేశించింది. దాంతో నిమిత్తం లేకుండా 50 శాతం సీట్ల సమాన పెంపు అంశం న్యాయసమీక్షకు నిలబడుతుందా అన్నది కూడా సందేహాస్పదమే. లోక్‌సభ అనేది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది తప్ప ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించదు.లోక్‌సభ అనే పేరులోనే ‘హౌస్ ఆఫ్ ద పీపుల్’ అనే అర్థం ఉన్నది. రాజ్యసభను మాత్రం ‘కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్’ అంటారు. రాష్ట్రాల లెజిస్లేటర్లే దాని సభ్యుల్ని ఎన్నుకుంటారు. శాసన ప్రక్రియలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కుండా ఉండాలంటే రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేయవచ్చు. న్యాయ సమీక్షకు ఇది లోబడే ఉంటుంది. కొన్ని దేశాల్లోని ఎగువ సభల్లో రాష్ట్రాల జనాభాలతో నిమిత్తం లేకుండా సమాన సంఖ్యలో ప్రాతినిధ్యం ఇప్పటికే ఉన్నది. కొన్ని ప్రాంతాలకు నష్టం కలిగించగల రాజ్యాంగ సవరణలను ఎగువ సభలు అడ్డుకోగలవు కూడా! అసలు విషయాలను పక్కదారి పట్టించి సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షం సాధించిందే మిటి! మహిళల మూడు దశాబ్దాల నిరీక్షణను మరో పదేళ్లు పొడిగించడం తప్ప!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చారిత్రక తప్పిదం
ఎప్పటిలాగే మహిళలు ఓడిపోయారు. వారికి లోక్‌సభలో, శాసనసభల్లో 33 శాతం కోటా కల్పించాలన్న ప్రయత్నం మరోసారి వీగిపోయింది. ఈసారి నియోజకవర్గాల పునర్వి భజనకూ, మహిళల కోటాకూ ముడిపెట్టడం అందుకు ప్రధాన కారణ మైంది. ఈ వ్యవహారం అంత తేలిగ్గా గట్టెక్కేది కాదని అందరూ భావిస్తూనే వచ్చారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచటం, శాసనసభల్లోనూ గణనీయంగా సీట్లు పెంచటమే లక్ష్యంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. అయితే ఈ పునర్విభజన అనంతరం మహిళలకు కోటా లభిస్తుందన్న మెలిక పెట్టడంవల్లే తాము వ్యతిరేకించక తప్పలేదని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న 543 స్థానాల్లోనే 33 శాతం కోటా కల్పించటంలో కేంద్రానికి అభ్యంతరమేమిటన్నది వాటి ప్రశ్న. ఏమైతేనేం శుక్రవారంనాటి రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించాల్సి ఉండగా... బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటువేశారు. దీంతో ముడిపడివున్న మరో రెండు బిల్లుల్ని కేంద్రం ఉపసంహరించుకుంది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక 2023 సెప్టెంబర్‌లో మహిళా కోటా బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతగా ఏకాభిప్రాయం సాధించాక కూడా ఆ మరుసటి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అది అమలు కాలేదు!జనాభా లెక్కల సేకరణ ముగిసి, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగించాకే కోటా అమలు వీలవుతుందని అప్పట్లో కేంద్రం తెలిపింది. జనాభా లెక్కల వ్యవహారం తేలేసరికి 2029 కూడా దాటొచ్చన్న సంశయాలున్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజనను తేల్చాలనీ, దానికి అనుగుణంగా మహిళల కోటాకు కూడా వీలు కల్పించాలనీ పునరాలోచన చేసి తాజా బిల్లుల్ని రూపొందించింది. అదేమిటో... మహిళల కోటాకు ఏదోక రూపంలో ఎప్పుడూ అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని ప్రభుత్వం, అటుతర్వాత ఐకె గుజ్రాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేశాయి. వాజ్‌పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వమైతే వరసగా 1998 మొదలుకొని 2003 వరకూ నాలుగుసార్లు కోటా బిల్లుకు ప్రయత్నం చేసింది. ఇక యూపీయే ప్రభుత్వం 2008, 2010ల్లో ప్రయత్నించింది. కానీ ప్రతిసారీ బిల్లు ప్రతుల్ని చించేయటం, కూటమి నుంచి తప్పుకుంటామని బెదిరించటం వగైరాలతో అన్ని రకాల ప్రయత్నాలూ వీగిపోయాయి. అయితే అప్పు డొచ్చిన డిమాండ్లు న్యాయమైనవి. ఎస్పీ, బీఎస్పీ వంటివి ‘కోటాలో కోటా’ ఇచ్చితీరా లని అడ్డుకున్నాయి. స్వాతంత్య్రంవచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా ఓబీసీలకు చట్టసభల్లో కోటా లేదని, మహిళల విషయంలోనైనా ఆ సంగతి తేల్చి తీరాలని ఆ పక్షాలు కోరాయి. ఈసారి పునర్విభజన ప్రక్రియ మహిళల కోటా విషయంలో సైంధవ పాత్ర పోషించింది. గతంతో పోలిస్తే మన దేశంలో మహిళలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఎంతో రాణిస్తున్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ వారి పాత్ర గణనీయంగా పెరిగింది. కానీ మన చట్టసభల్లో ఇదెక్కడా ప్రతిబింబించకపోవటం సిగ్గనిపించదా? జనాభాలో సగం ఉన్నా కనీసం మూడోవంతు ఇవ్వటానికి కూడా సంసిద్ధత చూపకపోవటం మన ప్రజా స్వామ్యం తీరుతెన్నుల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. మనతో పోలిస్తే ఎంతో వెనకబడిన దేశాలు సైతం ఈ విషయంలో విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నాయి. ఇరుపక్షాలూ దీన్నెక్కడా పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలా కనబడదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో అధికారంలోకొచ్చాక అన్నిచోట్లా మహిళల ప్రాధాన్యాన్ని పెంచింది. అమ్మ ఒడి మొదలుకొని ఇళ్లస్థలాలపంపిణీ వరకూ... సచివాలయ ఉద్యోగాలు మొదలుకొని పంచాయతీరాజ్ సంస్థలవరకూ అన్నిచోట్లా మహిళలకు 50 శాతం కోటా ఉండేలా చూసింది. ఆఖరికి నామినేషన్ల పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ దాన్నే పాటించింది. కొన్ని సందర్భాల్లో ఆ శాతంకన్నా అధికంగానే ఇచ్చింది. చిత్తశుద్ధివుంటే చట్టం వచ్చేలోగానే చేయగలిగినంతా చేయొచ్చని నిరూపించింది. ఏదేమైనా శుక్రవారంనాటి పరిణామాలు విచారకరమైనవి. అటు మహిళల కోటాకూ, ఇటు దక్షిణాది రాష్ట్రాలకూ తమ పోకడలవల్ల ఒరిగిందేమీ లేదని విపక్షాలు గుర్తించటం మంచిది. -
రుతుపవనాల దగా?
ఒక్కోసారి కష్టాలు కూడబలుక్కుని వస్తాయంటారు. అసలే అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాలతో ఏటికి ఎదురీదుతున్న ప్రపంచంపై ఈసారి ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడుతోంది. రాగల కాలంలో వాతావరణ పరిస్థితుల గురించి భారత వాతావరణ విభాగం(ఐఎండీ), ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన అంచనాలు భయపెడుతున్నాయి. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్ర జలాల్లో అత్యంత తీవ్రమైన ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరగటంతోపాటు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించగా, మన దేశంలో రుతుపవనాలు బలహీనపడి సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ సైతం ఇదేవిధంగా చెబుతోంది. వైద్య పరిభాష మాదిరే వాతావరణానికి సంబంధించిన పరిభాష కూడా సామాన్యులకు కొరుకుడు పడదు. ‘సాధారణంకన్నా తక్కువ’ వర్షపాతం ఉంటుందంటే– తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడతాయని. మన దేశంలో 60 శాతంమంది రైతులు ఖరీఫ్ సీజన్లో పూర్తిగా రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడతారు. శాస్త్రవేత్తల అంచనా నిజమైతే ఇప్పటికే అనేకచోట్ల వడగళ్లుపడి, వర్షాలు కురిసి నష్టపోయిన రైతులకు ఇది సహజంగానే గోరుచుట్టుపై రోకటి పోటువంటి దవుతుంది. ఒకప్పుడు ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం మూడురోజులముందే వాన ఎక్కడెక్కడ పడే అవకాశం ఉన్నదో, దాని తీవ్రత ఎలావుంటుందో అంచనా వేస్తున్నారు. తుపాన్లు, ఉప్పెనలు, సునామీలు వంటివి ముందస్తుగా పసిగట్టి వాటివల్ల కలిగే నష్టాన్ని కనిష్ఠ స్థాయికి ఉంచగలుగుతున్నారు. అలాగని అన్నీ కచ్చితంగా చెప్పటం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రకృతిని అంచనా వేయటం జూదంలాంటిది. అది అర్థమైనట్టే కనబడుతుంది. తీరా కొన్ని సందర్భాల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అలాగని ఏమరుపాటుతో ఉంటే ముంచేస్తుంది. అందుకే సమస్యలొస్తాయన్న అంచనాలతో ముందస్తు చర్యలు ఎప్పుడూ తప్పనిసరవుతాయి.అయితే ప్రస్తుత అంచనాలు ప్రాథమికమైనవి. వచ్చే నెలాఖరు నాటికి మరికొంత స్పష్టత వస్తుంది. ఎల్ నినో ఏర్పడటానికీ, రుతుపవనాలు బలహీనపడటానికీ మధ్య బలమైన సంబంధం ఉంది. గత 70 ఏళ్లలో 17 సార్లు ఎల్ నినో ఏర్పడితే అయిదుసార్లు సాధారణం లేదా అంతకన్నా ఎక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన సంవత్సరాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. గ్రామీణ భారతంలో మెజారిటీ ప్రజానీకం వ్యవసా యంపై ఆధారపడతారు. అందువల్లే వర్షాలుపడక కరువుకాటకాలు ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌వంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో వానలు లేకపోవడం లేదా అకాల వర్షాలు పడటం కారణంగా పంటలు దెబ్బతిన్నాయిగానీ... దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా వర్షపాతం బాగానే ఉంది. సాగు దిగుబడి పెరిగింది. ఆహార ధరలు అదుపులో ఉన్నాయి. అందువల్లే రిజర్వ్‌బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించింది. కానీ ఇదంతా తారుమారైతే ఆహార ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీరేట్లు మళ్లీ పైపైకి పోతాయి. నిజానికి ఇరాన్ యుద్ధంవల్ల ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. మన దేశానికి సంబంధించి కేవలం ఎల్ నినో ఒక్కటే నిర్ణాయక శక్తి కాదు. హిందూమహాసముద్రంలో పశ్చిమ(ఆఫ్రికా వైపు), తూర్పు(ఇండొనేసియా వైపు) ప్రాంతాలమధ్య ఉండే ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల అనుకూల, ప్రతికూల, తటస్థ ద్విధ్రువ (డైపోల్) స్థితులు ఏర్పడవచ్చు. అనుకూల స్థితి ఎల్ నినోవల్ల ముందుకు కదల్లేని రుతుపవనాలకు బలం చేకూర్చి భారత్ వైపు వచ్చేలా చేస్తుంది. మిగిలిన రెండూ అందుకు భిన్నమైన ఫలితాలనిస్తాయి. దానికితోడు యురేసియా ప్రాంతంలో ఈసారి మంచుకవచం తక్కువుందంటున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాలు మెరుగ్గానే ఉంటాయనుకోవచ్చు. ఏదేమైనా ఈసారి రుతుపవనాలపై ఏ ప్రభావాలు బలంగా పనిచేస్తాయో, వాటి ఫలితాలెలా ఉంటాయో పెద్ద సస్పెన్స్. అంతా సవ్యంగా ఉండాలని కోరుకోవటం మినహా ఎవరైనా చేయగలిగిందేమీ లేదు. -
బిహార్‌కు బీజేపీ సారథ్యం!
మండల్ రాజకీయాలకు పుట్టిల్లుగా మారి, రెండున్నర దశాబ్దాలుగా జాతీయ రాజకీయ పక్షాలకు నిలువనీడ లేకుండా పోయిన బిహార్‌లో బుధవారం తొలిసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ నాయకుడు సమ్రాట్ చౌధరి నేతృత్వంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం కొన్నేళ్ల క్రితం ఊహించని పరిణామం. అయితే కింగ్‌మేకర్‌గా లేదా జూనియర్ భాగస్వామిగా జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వాల్లో కొనసాగుతూ వచ్చిన బీజేపీ... ఎంతో సహనంతో, ఓపికతో సుదీర్ఘకాలం ఈ రోజు కోసం వేచిచూసింది. ఆఖరికి 2020లోనూ, నిరుడు జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీ(యూ)కు మించి స్థానాలొ చ్చినా సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా ఉండిపోయింది. ఎలా ఒప్పించిందో, ఏం చేసిందో... ఆర్నెల్లు కాకుండానే ఆయన్ను రాజ్యసభకు పంపి, ఆ పదవి కైవసం చేసుకుంది. అసలు నిరుడు నవంబర్‌లో జరిగిన బిహార్ ఎన్నికల సందర్భంలోనే ఈసారి నితీశ్‌ను సీఎం పదవినుంచి తప్పించి, బీజేపీయే పగ్గాలు చేపడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది విజయావకాశాలను దెబ్బతీయొచ్చన్న ఉద్దేశంతో రెండు పార్టీలూ కొట్టిపారేశాయి. బహుశా తనను తప్పిస్తారని నితీశ్ కూడా ఊహించివుండరు. ఎందుకంటే కుమారుడికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ ఆయన ఫిబ్రవరిలో బీజేపీ అగ్రనేతలను కలిసి పట్టుబట్టారు. చివరికి తానే ఆ సీటు తీసుకుని, సీఎం పదవి బీజేపీకి అప్పగించాలని నితీశ్ నిర్ణయించటంతో కుమారుడితోపాటు పార్టీ అగ్ర నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగారు. పదకొండేళ్లనాడు అప్పటి పార్టీ నేత జితన్‌రాం మాంఝీని తొమ్మిది నెలలపాటు సీఎం పదవిలో కూర్చోబెట్టడం మినహా దాదాపు 21 ఏళ్లపాటు బిహార్ ఏలికగా నితీశ్ కొనసాగారు. మధ్యలో కూటములు మార్చినా, జనం మాత్రం ఆయన వెనకే దృఢంగా నిలబడ్డారు. మునుపటితో పోలిస్తే పార్టీ అధినేతగా నితీశ్ అంత ఆత్మవిశ్వాసంతో లేరని స్థానిక మీడియా చెబుతూవచ్చింది. ఇది వయసు పైబడటంవల్లనా, పార్టీలోని అంతఃకలహాలా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వారివి. మండల్ రాజకీయాలు బలంగా వేళ్లూను కున్న రాష్ట్రాన్ని జాతీయపక్షం చేతుల్లో పెట్టడంపైనా నితీశ్‌పై విమర్శలొచ్చాయి. కానీ బీజేపీ ఆ రాజకీయాలకు భంగం వాటిల్లకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ తరహాలో బిహార్‌లో కూడా ఆదినుంచీ సంఘ్ పరివార్‌ను నమ్ముకున్నవారికే పగ్గాలు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా అధిష్టానం వాటిని అంగీకరించలేదు. మొదటి నుంచీ పార్టీలో కొనసాగినవారిని కాదని, ఎనిమిదేళ్లనాడు వచ్చిన సమ్రాట్వైపే మొగ్గు చూపటానికి కారణం ఆయన బాగా వెనకబడిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన వారు కావటమే. బిహార్ ప్రత్యేక పరిస్థితులరీత్యా ఇది తప్పదని అధిష్టానం భావించింది. లాలూ సతీమణి రబ్డీదేవి ప్రభుత్వంలో ఉంటూ 26 యేళ్ల క్రితం బీజేపీ కారణంగానే మంత్రి పదవి పోగొట్టుకున్న సమ్రాట్... 2018లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు... కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయంటారు. కానీ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నా ఎదగటం కష్టమే. తనేంటో నిరూపించుకోవాలి. పార్టీ నాయకత్వానికి నమ్మకం కలిగించాలి. ఆ పని సమ్రాట్ సమర్థవంతంగా చేయబట్టే ఇవాళ సీఎం పదవి అందుకో గలిగారు. యాదవేతర కులాల్లో పట్టు సంపాదించుకోవాలన్న బీజేపీ వ్యూహానికి ఆయన సమర్థత, కులం తోడ్పడ్డాయి.అయితే బిహార్‌కు సమస్యలు తక్కువేం లేవు. ఇప్పటికీ అది దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయిందంటూ ఎంత గొప్పలుపోయినా బిహార్‌లో రోడ్లు, ఆరోగ్యరంగం, విద్యారంగం సక్రమంగా లేవు. లాలూ హయాంతో పోలిస్తే మెరుగ్గానే ఉండొచ్చుగానీ... శాంతిభద్రతలు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదంటారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శకత, జవాబుదారీతనం తన ప్రాముఖ్యతలని ప్రమాణస్వీకారం చేశాక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సమ్రాట్ ప్రకటించటం గమనిస్తే ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో ఆయన సక్రమంగానే గుర్తించారని అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ నేతృత్వంలో బిహార్ పయనం ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
మళ్లీ యుద్ధ మేఘాలు!
చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్‌లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. ట్రంప్ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. ఇతర దేశాల సహకారంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్‌లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్‌లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్‌కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్‌తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
హంగేరిలో కొత్త గాలి
పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచం నలుమూలల నుంచీ దుర్వార్తలే వింటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇది మరో పిడుగుపాటు. పదహారేళ్లుగా హంగేరిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న కన్సర్వేటివ్ జాతీయవాది, ప్రధాని విక్టర్ ఒర్బాన్ ఘోరంగా ఓటమిపాలయ్యారు. 199 స్థానాలున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఫిడెస్కి కేవలం 55 స్థానాలు మాత్రమే రాగా, ఆయన్నుంచి విడిపోయి, మధ్యేవాద మితవాద పక్షం టీసా పార్టీని స్థాపించిన పీటర్ మాజార్కు అనూహ్యంగా 138 స్థానాలు లభించాయి. తీవ్ర మితవాద పక్షం అవర్ హోంల్యాండ్‌కు 6 దక్కాయి. తుది ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్న ఒర్బాన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఆయనపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్వతంత్ర సర్వే సంస్థలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. టీసా పార్టీ దాదాపు 6 శాతం పాయింట్ల ఆధిక్యత తెచ్చుకుంటేనే కనీసం సాధారణ మెజారిటీ కూడా అసాధ్యమని కొన్ని మీడియా సంస్థలు చెప్పగా... అధికార పార్టీకన్నా టీసా పది పాయింట్లు వెనకబడివుందని ప్రభుత్వ అనుకూల మీడియా ఢంకా బజాయించింది. ఈ ఎన్నికల సందర్భంగా హంగేరి ఏమాత్రం పొంతనలేని రెండు భిన్న ప్రపంచాలు చూసింది. అధికారపక్షం వైపు మొగ్గే ప్రపంచం ఒర్బాన్ మరో నాలుగేళ్లు ఏలబోతున్నారంటూ మోత మోగించింది. అందులో మీడియా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ, ‘సాధారణ పౌరులూ’ ఉన్నారు. అటు పీటర్ మజార్‌ను సమర్థించే ప్రపంచం అందుకు భిన్నమైన విశ్లేషణలు చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ‘నిజమైన ప్రపంచం’ అయివుంటుందని అందరికీ తెలుసు. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత ‘నకిలీ ప్రపంచం’ బట్టబయలైంది. ఒర్బాన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా దేశదేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఒర్బాన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు... ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్ ఆయన స్ఫూర్తితోనే మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఒర్బాన్కు ట్రంప్, పుతిన్ సన్నిహితులు. వారిద్దరి మాదిరే ఈయూతో వైరం. ఒర్బాన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అవసరం. వారు– ఈయూ, కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు, దాత జార్జి సోరోస్– ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావన కూ. విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఒర్బాన్ పదహారేళ్లపాటు నమ్మించగలిగారు. ‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీసా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఒర్బాన్ అనుకూలురతో నిండివున్నాయి. ఆర్థిక సంస్థలూ, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఈయూ నుంచి బయటికొస్తేనే సకల సమస్యలూ పరిష్కారమవుతాయని ఆయన చెప్పిన మాటలు విశ్వసించబట్టే ఆర్థికంగా అధోగతిలోవున్నా జనం నమ్మారు. ఒర్బాన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి. నిరుద్యోగం పదేళ్ల రికార్డును అధిగమించింది. నిరుడు ఆర్థిక వృద్ధి 0.4 శాతం. కొన్నేళ్లుగా కష్టాల్లోవున్న పోలెండ్ సైతం 3.6 వృద్ధి రేటు సాధించగా... బల్గేరియా, రుమేనియా సైతం మెరుగ్గా ఉన్నాయి. ఇక అవినీతిలో హంగేరిది అగ్రస్థానం. ఇరాన్ శాంతి చర్చలకన్నా ముందు, ఒర్బాన్ గెలుపుకోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హంగేరి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇరాన్ శాంతి చర్చల మాదిరే, ఒర్బాన్ కూడా కుప్పకూలారు. ఆయన ఓటమితో ఈయూ దేశాలు పండగ చేసుకుంటున్నాయి. హంగేరి ప్రజలు తమతోనే ఉన్నారని సంబరపడుతున్నాయి. కానీ అధోగతిలోవున్న హంగేరికి అందరూ ఆపన్న హస్తం అందించటం అత్యవసరం. -
హద్దులెరుగని జ్ఞానం
‘మాకు గోడలు లేవు, గోడలు పడగొట్టడమే మా పని’ అంటాడు శ్రీశ్రీ. మానవ జీవనప్రస్థానం గోడలు లేని దశ నుంచి గోడలు కట్టుకునే దశకు చేరుకుని ప్రస్తుతానికి అక్కడే స్థిరపడింది. గోడలు లేని దశ గురించిన స్పృహ మనిషిలో అంతరించి గోడలు కట్టుకోవడమే స్వాభావికమూ, స్థిరమూ, సత్యమనే భావన బలపడింది. గోడలు కట్టుకో వడం రకరకాల రూపాలలో జరుగుతుంది. వర్ణం, కులం, ప్రాంతం, దేశం, భాష మొదలైనవి కొన్ని మాత్రమే! దేశాల విషయానికి వస్తే, గోడలను సరిహద్దుల పేరుతో పిలుచుకుంటాం. కానీ, ప్రకృతినే గమనిస్తే, సరిహద్దులు లేనిదే ప్రకృతి అనీ, సరిహద్దులు గీసు కోవడం వికృతి అనీ ఇట్టే బోధపడుతుంది. భూమి, నీరు, వెలుగు, గాలి, ఆకాశమనే పంచ భూతాలు సరిహద్దులనెరుగవు; ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరాఘాటంగా వ్యాపిస్తాయి. మొదట్లో మనిషి కూడా అలా వ్యాపించినవాడే. కాలగతిలో సరిహద్దులు నిర్మించు కోవడానికి అలవాటుపడ్డాడు. ఆ విధంగా సరిహద్దులు లేని దశ నుంచి సరిహద్దుల దశకు చేరుకోవడం మనిషి భౌతిక, బౌద్ధిక వికాసంలో మెరుపులీనే మైలురాయి కావడం విచిత్రం; అదే అతని చరిత్రలో ఒక విరోధాభాస. అదే సమయంలో, తన మేధనూ, మేధాగతమైన జ్ఞానాన్నీ సరిహద్దులను దాటించి పరస్పరం పంచుకున్న, పంచుకుంటున్న అనుభవమూ మనిషికి ఉంది. అయినాసరే, తనే కల్పించుకున్న కృత్రిమ సరి హద్దులే నిజమని నమ్మి ఆ ఇరుకులో కూరుకుపోవడమే అతనిలోని వైరుద్ధ్యం. ‘జ్ఞాన’మనే మాటనే తీసుకోండి. తెలుగులో ఎరుక, తెలివి, తెలివిడి మొదలైన పర్యాయపదాలు ఉన్నప్పటికీ, వాటికన్నా ఎక్కువగా జ్ఞానమనే మాటే ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానికి ఈ మాట నేటి మనదేశపు సరిహద్దులకు బయట ఆరువేల సంవత్స రాల క్రితం మాట్లాడిన ప్రోటో–ఇండో యూరోపియన్ భాష నుంచి పుట్టింది. వ్యుత్పత్తి పదనిఘంటువు ప్రకారం, ‘తెలుసుకోవడ’మనే అర్థమిచ్చే ‘గ్నో’ అనే ప్రోటో–ఇండో యూరోపియన్ మూలపదం నుంచి ‘టు నో’, ‘నాలెడ్జ్’, ‘ఎకనాలెడ్జ్’, ‘కాగ్నిషన్’, ‘డయో గ్నొసిస్’, ‘ఇగ్నొరెంట్’, ‘ఇగ్నోర్’, ‘నొబిలిటీ’ వంటి మాటలు రూపొందాయి. ఇదే సంస్కృతంలో ‘జ్ఞ’గా మారి ‘జ్ఞాన’మనే మాటను పుట్టించింది. పర్షియన్ల అవెస్తాలో జ్ఞానమనే అర్థంలో ‘జయింతి’గా, ఓల్డ్ చర్చి స్లవోనిక్లో గుర్తించడమనే అర్థంలో ‘జ్ఞన్టి’గా, తెలుసుకోవడమనే అర్థంలో రష్యన్లో ‘నాట్’గా, గ్రీకులో ‘నాత్స్’గా, తెలిసినదనే అర్థంలో ఐరిష్లో ‘గనాత్’గా మారింది. అలాగే, అతి ప్రాచీనకాలం నుంచీ, ఆధునిక కాలం వరకూ జ్ఞానప్రసారం కూడా అన్ని రకాల సరిహద్దులనూ దాటి జరుగుతూనే ఉంది. మనదేశానికి సంబంధించే చెప్పు కుంటే, సున్నాను, జ్యోతిశ్శాస్త్రాన్ని ఇచ్చిన ఆర్యభట్టు; శస్త్రచికిత్సలో మార్గదర్శి అయిన సుశ్రుతుడు, రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రసిద్ధుడైన సీవీ రామన్ మొదలుకొని – ప్రాచీన గ్రీసుకు చెంది, తర్కాన్ని, శాస్త్రవిజ్ఞానాన్ని ఇచ్చిన అరిస్టాటిల్; క్షేత్రగణితాన్ని ఇచ్చిన పైథాగరస్; వైద్యశాస్త్రాన్ని ఇచ్చిన హిపోక్రటెస్ – యునైటెడ్ కింగ్డమ్కు చెంది, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, కలన గణితా(కేల్క్యులస్)న్ని ఇచ్చిన న్యూటన్, పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చాల్స్ డార్విన్, కంప్యూటింగ్‌ను ఇచ్చిన అలాన్ ట్యూరింగ్– జర్మనీకి చెంది, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఇచ్చిన మాక్స్ ప్లాంక్ వరకూ, సరిహద్దులకు అతీతంగా యావత్ప్రపంచ దీప స్తంభాలుగా నిలిచి జ్ఞానకాంతిని విశ్వవ్యాప్తం చేసిన మేధాభాస్కరులు ఎందరెందరో! అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫలితాలు, పరికరాలతో సహా అన్ని రంగాలలో అన్ని దేశాలవారూ ప్రసాదించిన జ్ఞానభిక్షను అందుకుంటూ, పంచుకుంటూ జీవితాన్ని అన్నివిధాలా తేజోవంతం చేసుకుంటూనే; అనేకానేక సరిహద్దుల సంకెళ్ళతో తనను తాను బంధించుకుంటూ సరిహద్దులెరుగని ప్రాపంచిక జ్ఞానానుభవాన్ని గుర్తించలేక పోవడమూ మనిషికే చెల్లింది. ప్రకృతి మరే జీవజాలానికీ ఇవ్వని వరాలను మనిషి కిచ్చింది; కానీ వాటికి తనవైన శాపాలను జోడించుకుంటూ జీవితాన్ని ముళ్ళకంపగా మార్చుకునే అవివేకతలో కూడా మనిషికి మరే జీవీ సాటిరాదు. ప్రకృతి గీసిన హద్దుల్లో జీవించడమే తప్ప స్వయంగా హద్దులు గీసుకోవడం చేతకాని జీవులే మనిషి కన్నా సుఖంగా జీవిస్తున్నాయనిపిస్తుంది. సరిహద్దులెరుగని వసుధైక భావన దిశగా మనిషి పునఃప్రస్థానం ఇంకా ఎప్పటికి?! -
కొత్త ప్రపంచం వైపు అడుగులు?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ నినాదం ఆచరణలో తల్లకిందులు కాబోయే కాలం తరుముకొస్తున్నదా? ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అమెరికా సూపర్ పవర్ హోదాను అనుభవిస్తూనే ఉన్నది. అమెరికా ఆజ్ఞలు ఖండాంతరాల్లో ఇంకా చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మధ్యతరగతి యువతీ యువకులకు అమెరికా ఒక ఆశల పందిరిగా దర్శనమిస్తూనే ఉన్నది. తానా అంటే తందానా అనేందుకు పాకిస్తాన్ వంటి తొత్తు దేశాలు కూడా అమెరికాకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికా అతి పెద్ద వాటాదారుగానే కొనసాగుతున్నది. దాని మిలిటరీ బడ్జెట్ ఒక్కటే భారతదేశపు మొత్తం బడ్జెట్‌కు రెట్టింపు.అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు లేవనే వాదన బలంగా వినిపిస్తున్నది. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికా డాలర్ పెత్తనం కారణంగా 39 ట్రిలియన్ డాలర్ల అప్పును అది మేనేజ్ చేయగలుగుతున్నది. కానీ డాలర్ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బ్రిక్స్’ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి చేరితే అమెరికాకు గడ్డు కాలమే! ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడి ఫలితాలు ప్రమాదకరమైన ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్‌ను ‘విముక్తం’ చేయకుండా, ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చకుండా యుద్ధం నుంచి తప్పుకొంటే డాలర్ పెత్తనానికి పునాది వంటి పెట్రో డాలర్ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు. యుద్ధం కొనసాగిస్తే రోజులూ, నెలల్లో అది ముగిసే అవకాశం లేదు. మోయలేని భారంగా మారుతుంది.వాణిజ్య రంగంలో ట్రంప్ స్వీయ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. దేశాల వారీగా వాణిజ్య లోటును సవరించుకునే పేరుతో ఎడాపెడా ట్యారిఫ్‌లు విధిస్తూ పోతున్నారు. ఈ చర్యలు అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తాయని నిపుణులు చెబు తున్న మాటలను ఆయన చెవికెక్కించుకోవడం లేదు. ట్యారిఫ్ దాడులతో ఆయన అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక గమనాన్ని సంపూర్ణంగా మార్చే సామర్థ్యం గల ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చైనా భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రేస్‌లో రెండు దేశాల మధ్య దూరం పెద్దగా లేదు. త్వరలో చైనావాళ్లు అమెరికాను ఓవర్టేక్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.దౌత్యపరంగా కూడా ట్రంప్ దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికాకు కుడిభుజంగా ఉంటున్న ‘నాటో’ కూటమిని ఆయన స్వయంగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గ్రీన్‌ల్యాండ్ రచ్చ, క్యూబాకు బెదిరింపులు, వెనుజువేలా అధ్యక్షుని కిడ్నాప్ వంటివన్నీ అంత ర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చాయి. యుద్ధరంగంలో వస్తున్న సాంకేతికపరమైన మార్పులు అమెరికా భారీ మిలిటరీని కలవరపెడుతున్నాయి. చౌకరకం డ్రోన్లు, సైబర్ తంత్రాలు, ఉపగ్రహ విధ్వంసక దాడులు పైచేయి సాధిస్తున్నాయి. ఇరాన్ ఘర్షణలో ఈ పరి ణామం అనుభవంలోకి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలు అల్లాడించాయి.ఈ రకమైన పరిణామాలన్నీ అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యా నికి క్రమక్రమంగా ఎసరు పెట్టే స్వభావం కలిగినవే! కాకపోతే ఈ క్రమాన్ని ఇరాన్ యుద్ధం వేగిరపరిచిందనే అంచనాలు వెలు వడుతున్నాయి. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నికోలస్ స్పీక్‌మాన్ ప్రతి పాదించిన రిమ్‌ల్యాండ్ థియరీని గుర్తుచేస్తున్నారు. యూరే షియా ప్రధాన భూభాగానికి అంచు మాదిరిగా ఉండే తీర ప్రాంతాన్ని ‘రిమ్‌ల్యాండ్’ అన్నారు. స్పీక్‌మాన్ లెక్క ప్రకారం పశ్చిమ యూరప్ నుంచి మొదలుకుని పశ్చిమాసియా, దక్షిణా సియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలు ఈ రిమ్‌ల్యాండ్ పరిధిలోకి వస్తాయి. ఇరవయ్యో శతాబ్దం అట్లాంటిక్ దేశాలదైతే, ఇరవై ఒకటో శతాబ్దం మాత్రం ఈ రిమ్ల్యాండ్దేననీ, ఈ ప్రాంతంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారిదే ప్రపంచాధిపత్య మని ఆయన ప్రతిపాదించారు.తర్వాత కాలంలోని అమెరికన్ అంతర్జాతీయ నిపుణులు రిమ్‌ల్యాండ్ థియరీ నుంచి పశ్చిమ యూరప్‌ను తొలగించి ఆఫ్రికా కొమ్ము దగ్గర నుంచి అరబ్ ద్వీపకల్పం, పర్షియా పీఠ భూమి, భారత ఉపఖండం మీదుగా తూర్పున చైనా కోస్తా ప్రాంతం దాకా, ఆగ్నేయంగా ఇండోనేషియా ద్వీప సముదాయం దాకా ఈ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. కైరో నుంచి జకార్తా దాకా అనవచ్చు. లేదా ఎర్ర సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం (తూర్పు), జావా సముద్రం (ఆగ్నేయం) దాకా అని కూడా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంత మని కూడా పిలవవచ్చు. ‘ఇది ఇండియన్ ఓషన్ సెంచరీ’ అని పిలవడంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులకు ఏకాభి ప్రాయం ఉన్నది.యూరప్ దేశాల వలసల వేటలకు ముందు ఈ ప్రాంత వాణిజ్యాన్ని భారత్, చైనాలు శాసించాయి. భూమార్గం ద్వారా యూరేషియా ప్రాంతాలలో చైనా వర్తకం జరిగితే సముద్రమార్గ వాణిజ్యంలో భారత్ ఆధిపత్యం వహించింది. భారత నావికా దళాలు ఆగ్నేయాసియా దేశాల్లో హిందూ సామ్రాజ్యాలను నెల కొల్పిన చరిత్ర మనకు తెలిసిందే. హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు పెట్రోలియం తెచ్చుకుంటున్నాం కానీ, పూర్వకాలంలో ఎక్కువగా అరబ్బీ గుర్రాలను ఇక్కడినుంచే తీసుకొచ్చేవారట! ప్రాచీన తెలుగు సాహిత్యంలో హురుమంజి (హార్మూజ్) ప్రస్తా వన చాలా సందర్భాల్లో వచ్చిందని చెబుతున్నారు.అత్యధిక జనాభా, అందులోనూ యువతరం, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, విస్తారంగా సహజ వన రులు, ప్రపంచ వాణిజ్యంలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యం దృష్ట్యా ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని అమెరికా విదేశాంగ నిపుణులు ప్రత్యేక దృష్టితోనే చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆధిపత్యాన్ని కోల్పోతే ప్రపంచాధిపత్యానికి కూడా నూకలు చెల్లినట్టే అనే అవగాహన వారికి మొదటి నుంచి ఉన్నది. అందుకే డిగోగార్షియా దీవిలో అతిపెద్ద మిలిటరీ స్థావ రాన్ని అమెరికా ఏర్పాటు చేసుకున్నది. వివిధ దేశాల్లో ఉన్న స్థావరాల కంటే ఇది చాలా పెద్దది. ముఖ్యంగా పశ్చిమాసియా వ్యవహారాలను అదుపు చేయడం దీని బాధ్యత. తూర్పున ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన బలిష్ఠమైన సప్తమ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) చాలాకాలం నుంచే మోహరించింది. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి అమెరికాకు గట్టి పోటీనే ఎదురుకానున్నది. ఇరాన్ యుద్ధ ఫలి తంగా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును కోల్పోతే ఒక సరికొత్త నూతన అధ్యాయానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది.ఇరాన్‌పై ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మహా విధ్వంసకరమైన దాడికి ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఎందుకింత హఠాత్తుగా ఒడిగట్టిందో అమెరికా అధికార వర్గాలే అర్థం చేసుకోలేకపోతు న్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లను ఏ ప్రయోజనాన్ని ఆశించి తగ లేస్తున్నారని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఆరు వారాల యుద్ధం తర్వాత ఈరోజు (శనివారం) పాకిస్తాన్లో ఇరాన్ – అమెరికాలు చర్చలకు ఉపక్రమించాయి. ఆరు వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేముంది? అలీ ఖమేనీని, ఉన్నత స్థానాల్లోని మరి కొందరినీ హతం చేశారు. కానీ పాలనా వ్యవస్థ మారలేదు. ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చడమన్నది అమెరికా పెట్టుకున్న ప్రధానమైన మూడు యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అది నెరవేరలేదు.అణుశుద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం మరో లక్ష్యం. అదీ నెరవేరలేదు. పైగా ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాలను సమకూర్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నదని ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త థియోడర్ పోస్టల్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు టెలివిజన్లు శనివారం నాడు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. హార్మూజ్ మార్గాన్ని ఇరాన్ చెర నుంచి విముక్తి చేస్తామని పలికిన బీరాలు కూడా నీరుగారిపోయాయి. ఇరాన్ దర్జాగా తన కరెన్సీలో టోల్ వసూలు చేసుకుంటున్నది. చివరికి చర్చల ప్రారంభానికి ముందు కూడా ట్రంప్ తన హూంకరింపులను ఆపలేదు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే భారీ విధ్వంసం ఉంటుందనీ, నౌకల్లోకి ఆయుధాలను లోడ్ చేస్తున్నామనీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అదేదో తెలుగు సినిమాలో ‘రమణా లోడెత్తాలిరా, టోల్గేట్ పడుతుందీ’ అనే పాపులర్ డైలాగ్ ఉంటుంది.ఆరు వారాల్లో ట్రంప్ రకరకాల మాటలు విన్నవారికి అదే గుర్తొస్తుంది. నాలుగైదు రోజుల కింద ‘ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోందం’టూ ట్రంప్ చేసిన హెచ్చరికపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగరికతలను అంతం చేసే విప రీత బుద్ధి ఏమిటని ప్రశ్నించారు. పర్షియా (ఇరాన్) చరిత్రలో ప్రసిద్ధుడెన సైరస్ ది గ్రేట్ చక్రవర్తి ఆదర్శాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించిన థామస్ జెఫర్సన్ ప్రకటించారు. 2500 సంవత్సరాలకు పూర్వం సైరస్ ది గ్రేట్ బాబిలోన్‌ను జయించినప్పుడు అక్కడి బానిస లందరికీ, అలాగే ఖైదీలకూ విముక్తి ప్రసాదించారు. వీరిలో పెక్కుమంది యూదులు. తన సామ్రాజ్యంలో మత స్వేచ్ఛనూ, జాతి సమానత్వాన్నీ ఆ రోజుల్లోనే ప్రబోధించారు. అటువంటి నాగరికతను ట్రంప్ అంతం చేయడానికి సిద్ధమయ్యాడు.పాక్‌లో ప్రారంభమైన చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాకు మెసెంజర్‌గా ప్రారంభ మైన పాకిస్తాన్ పాత్ర చర్చల్లో మధ్యవర్తి స్థాయికి మారింది. ఇరాన్ ఇప్పటికీ పాక్‌ను పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధంలో అమెరికాతో పాటు భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్‌కు చర్చల్లో ఏ పాత్రా లేదు. పాకిస్తాన్ మిలిటరీ అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్‌పై ట్రంప్‌కు అవ్యాజమైన అనురాగం ఉన్నది. ట్రంప్ శాంతికాముకతకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మునీర్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తిని ఇరాన్ మధ్య వర్తిగా అంగీకరించడానికి చైనా సలహానే కారణమనే అభిప్రాయం ఉన్నది.పేరుకు పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా అన్ని వ్యవహారాలూ మునీర్ చేతుల మీదుగానే నడిచిపోతున్నాయి. మరో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మాదిరిగా పాక్ పాలనా పగ్గాలను అందిపుచ్చుకోవాలని మునీర్ ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా, చైనాల సహకారం ఉన్నది కనుక అతని కోరిక నెరవేరే అవకాశం ఉండవచ్చు. భారత్‌పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తి మునీర్. కశ్మీర్ కోసం వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామన్న భుట్టో మాటల్ని పదేపదే వల్లెవేస్తుంటాడు. ఆయన ఏర్పాట్లతో జరుగుతున్న చర్చల ఫలితంపై ఆయనకే ఆసక్తి లేదు. ప్రజల్లో తన ప్రతిష్ఠ పెరగడం, అమెరికా ఆజ్ఞలు పాటించడమే ఆయనకు కావాల్సింది! పరస్పర విరుద్ధమైన డిమాండ్లపై కాలయాపన కోసమే రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయన్న అభిప్రాయం ఉన్నది.ఇరాన్‌కు లోపాయకారీ సహాయం చేయడం తప్ప యుద్ధం విషయంలో చైనా బహిరంగంగా మాట్లాడడం లేదు. శత్రువు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నప్పుడు, అందులో తలదూర్చ వద్దనేది యుద్ధనీతి. తప్పిదం ఫలితాన్ని శత్రువు అనుభవిస్తాడు. ఇంకో నెలరోజుల్లో ట్రంప్ – షీ జిన్‌పింగ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ లోపల ఇరాన్ యుద్ధంలో చేతులు కాల్చుకొని బలహీనపడే ట్రంప్ తన ఎదురుగా కూర్చుంటే గట్టిగా బేరమాడే శక్తి షీకి లభిస్తుంది. చైనా వాళ్లకు వ్యాపార కిటుకులు బాగా తెలుసు. ట్రంప్ ఇరాన్ యుద్ధంలో నిజంగానే చేతులు కాల్చుకుంటే ఇరాన్ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతుంది. ఇప్పటికే రిమ్‌ల్యాండ్ తూర్పున ఉన్న చైనా ఒక బలమైన శక్తి. దృఢమైన నాయకత్వం ఉంటే భారత్ కూడా ప్రభావ శీల శక్తిగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం జరిగి, బహుముఖీన ఒప్పందాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈ మరక పోయేదెలా?
నిరుడు మార్చిలో కోట్లాది రూపాయల కరెన్సీ కట్టలు తగలబడిన ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన ఢిల్లీ హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ శుక్రవారం ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రాజీనామాను ఆమోదిస్తే జస్టిస్ వర్మకు రిటైర్మెంట్ ప్రయోజ నాలు, పెన్షన్ యథావిధిగా వస్తాయి. ఈ ఉదంతం జరిగినప్పటి నుంచీ ఆయన వితండ వాదం చేశారు. కరెన్సీ కట్టలు కాలిన ఉదంతం జరిగింది న్యాయమూర్తుల నివాసప్రాంగణంలోని తన ఇంటికి వెలుపలవున్న స్టోర్ రూంలోననీ, అందరూ వచ్చిపోయే చోట ఉన్న సొమ్ము తనదేనని ఎలా చెబుతారనీ ప్రశ్నించారు. రాజీనామా చేసి నిష్క్రమించటం ఉత్తమమని సహచర న్యాయమూర్తులు చెప్పినా ఆయన అంగీకరించలేదు. అభిశంసన వరకూ వెళ్తే ఆయనతోపాటు మొత్తం న్యాయవ్యవస్థపైనే చర్చ జరుగుతుందనీ, ఇది వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలపై ప్రభావం చూపుతుందనీ చెప్పినా ఆయన తలకెక్కలేదు. పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ మొదలైన దశలో జస్టిస్ వర్మ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలనదగ్గ మూడు వ్యవస్థలు – కార్యనిర్వాహకవర్గం, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు సమానమైనవని చెబుతారు. కానీ మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు మాత్రమే ఆ మూడింటి పరిధులనూ నిర్ణయించగల అధికారాన్నిచ్చింది. తనకు దఖలుపరిచిన బరువుబాధ్యతలకు తగ్గట్టుగా న్యాయవ్యవస్థ ఉండటంలేదన్న విమర్శలు, ఆరోపణలు చాన్నాళ్ల నుంచి ఉన్నాయి. అవి కేవలం బయటి నుంచి మాత్రమే కాదు... లోపలి నుంచీ వస్తున్నాయి. మొన్న ఫిబ్రవరి నెలాఖరున లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ జవాబిస్తూ గత పదేళ్ల కాలంలో సిట్టింగ్ జడ్జీలపై సుప్రీంకోర్టుకు 8,630 ఫిర్యాదులందాయని తెలిపింది. కానీ అతి స్వల్ప కేసుల్లో మాత్రమే అంతర్గత కమిటీల ద్వారా విచారణలు జరిగాయి. తీవ్ర ఆరోపణలొచ్చిన కేసుల్లో అనేకం కనీసం నామమాత్ర విచారణ వరకూ పోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆరేళ్ల క్రితం కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా అప్పటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, న్యాయవ్యవస్థలోని అవినీతిపై గతంలో తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారనీ, వారిలో సర్వీసులో ఉండగా మాట్లాడినవారు ఇద్దరనీ ధర్మాసనానికి చెప్పారు. డబ్బు తీసుకోవటం ఒక్కటే అవినీతి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆశ్రిత పక్షపాతం, హోదా దుర్వినియోగం, విచక్షణాయుత అధికారాన్ని స్వప్రయో జనాలకు వినియోగించుకోవటం వగైరాలు సైతం దాని కిందికే వస్తాయి. రైతులకు రావాల్సిన బ్యాంకు రుణాలను ఒక చక్కెర కర్మాగారం దారిమళ్లించి సొంతానికి వాడు కున్న కేసులో 2010లో సీబీఐ దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పుడు అందులో జస్టిస్ వర్మ ఆ సంస్థ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదో నిందితుడిగా ఉన్నారు. తర్వాత కాలంలో ఆ కేసు ముందుకు సాగలేదు. ఆయనపైనా చర్యలు లేకుండా పోయాయి. ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ విశ్వహిందూ పరిషత్ సదస్సుకు పోయి మతతత్వ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలనీ, వివరణ ఇవ్వాలనీ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానించింది.కానీ అవేమీ జరగలేదు. గతంలో అరడజను మంది న్యాయమూర్తులపై ఆరోపణ లొచ్చాయి. వారిలో ఒకరిద్దరిపై అభిశంసన వరకూ వెళ్లింది. విధాన సంబంధమైనసంక్లిష్టతల వల్ల ఆ ప్రక్రియ వీగిపోయింది. కొందరు తమంత తామే రాజీనామా చేసి వెళ్లటంతో నిలిచిపోయాయి. ఇలాంటి ఉదంతాలన్నీ న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేస్తాయి. తీర్పునిచ్చే స్థానంలో ఉండటం వల్ల న్యాయమూర్తులపై దురుద్దేశంతో ఆరోపణలు చేసేవారు కూడా ఉంటారు. ఆ బెడద నుంచి వారిని కాపాడటానికి కట్టుదిట్టమైన చట్టాలు అవసరమే. కానీ అవినీతిపరులకు అవి కవచంగా ఉపయోగపడే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫిర్యాదులను స్వీకరించి, దర్యాప్తు చేయించి నిజా నిజాలను నిర్ధారించటానికి సర్వస్వతంత్రమైన వ్యవస్థ ఒకటి అవసరం. ఆ దిశగా ప్రయత్నిస్తేనే అవినీతి జాడ్యం అంతమవుతుంది. -
‘కాల్పుల విరమణ’కు తూట్లు!
ప్రపంచమంతా ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురుచూసిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకుండానే ముగిసిపోయే ప్రమాదం కనబడుతోంది. తీవ్ర వైషమ్యాలతో కాలుదువ్వుకునే వైరిపక్షాలు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. అందుకే ఒప్పందం కుదిరాక కూడా అక్కడక్కడ పరస్పర దాడులు తప్పవు. కానీ పశ్చిమాసియా పరిస్థితి కాస్త భిన్నమైనది. కాల్పుల విరమణపై తొలుత అమెరికా, ఆ తర్వాత ఇరాన్ ధ్రువీకరించాక, మధ్యవర్తి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటన చేశారు. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ కూడా ఒప్పందాన్ని అంగీక రిస్తున్నట్టు తెలిపింది. కానీ 24 గంటలు గడవకుండానే అందరిదీ తలోమాట అయింది. మధ్యవర్తి పాత్ర పోషించే దేశం దృఢమైన స్వరం వినిపించగలగాలి. అవసరమైతేశాసించగలగాలి. కానీ అమెరికా అప్పులపై ఆధారపడే పాక్ ఆ పని చేయగలదా? ఘర్షణలు నివారించిన ఖ్యాతిని కూడా ‘త్యాగం’ చేసి, తెరవెనకుండి పాకిస్తాన్ ద్వారా కథ నడిపిస్తున్న చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ మాదిరి డ్రామాలకు సాహసించేవి కాదు. అసలు పశ్చిమాసియాకు సంబంధించి ఏ ఒప్పందం కుదరాలన్నా అమెరికాను సంతృప్తిపరిస్తే సరిపోదు. ఆ దేశం ఒకటి కాదు... రెండు! అవిభాజ్య కవలల మాదిరిగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఒప్పుకుంటే తప్ప ఏదీ సాధ్యపడదు. ఒక్కోసారి ఆ రెండూ కావాలని భిన్న స్వరాలు వినిపిస్తాయి. దీన్ని వ్యూహం అనాలో, చవకబారు ఎత్తుగడగా భావించాలో ఎవరికీ తెలియదు. అమెరికా అవునంటుంది... కాసేపటికి ఇజ్రాయెల్ కాదంటుంది. పర్యవసానంగా అనుకున్నది అమలుకాక అవతలి పక్షం అయోమయంలో పడుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకమయ్యాక ఆయన అల్లుడు జేర్డ్ కుష్నెర్ ద్వారా ఇజ్రాయెల్‌కు చుట్టరికం కలవడంతో పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. అందుకే వైట్‌హౌస్‌లో, ట్రంప్‌కు బాగా దగ్గరగావుండే వ్యక్తుల్లో కలకలం మొదలైంది. ఇప్పుడు తోకే కుక్కను ఆడిస్తోందన్న రీతిలో వ్యవహారం ముదిరింది. కనుకనే ఒప్పందంపై తొలుత ప్రకటించిన ట్రంప్ లెబనాన్‌పై దాడులు సాగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అటు తర్వాత ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన లేదని బుకాయించటం మొదలుపెట్టారు. ఇరాన్ 10 అంశాల ముసాయిదా కొత్తదేమీ కాదు. దురాక్రమణకు ముందే ఇరాన్ దాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో అది ట్రంప్‌కు నచ్చలేదు. ఇక ఇరాన్ ఎంతకూ లొంగకపోవటం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో కొంపమునుగుతుందని అర్థమై అది ఆచరణయోగ్యమేనని అంగీకరించక తప్పలేదు. తన కూటమిలోని ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయరాదంటున్న ట్రంప్... ఆ దేశానికి మద్దతుగా నిలబడిన లెబనాన్‌లో మాత్రం ఇజ్రాయెల్ ఊచకోత కొనసాగించటం సబబేనంటున్నారు. ఇది మర్కట తర్కం కాదా? కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఉత్సవం చేసుకుంటున్న జనంపై పది నిమిషాలపాటు ఏకధాటిగా సాగించిన కాల్పుల్లో 250 మందికిపైగా మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాక అంతవరకూ 119 డాలర్లుగావున్న బ్యారెల్ ముడి చమురు ధర 94 డాలర్లకు చేరింది. కానీ ఇజ్రాయెల్ హంతక దాడులతో అదికాస్తా మళ్లీ 97కు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కపట నాటకాలు కట్టిపెడితే తప్ప ప్రపంచం ప్రశాంతంగా మనుగడ సాగించలేదు. అది జరగాలంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచం సంక్షోభం అంచుల్లో ఉంది. ఇరాన్ ఇప్పటికే యుద్ధంవల్ల సమస్తం కోల్పోయింది. 3,000 మంది పౌరులు మరణించగా, లక్షలాది జనావాసాలు శిథిలాలుగా మారాయి. మౌలిక సదుపాయాలన్నీ ధ్వంస మయ్యాయి. ఇరాన్ శక్తిమేరకు ప్రతీకార దాడులు చేస్తూ దురాక్రమణకు దిగిన ఆ రెండు దేశాలతోపాటు, వాటికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలను సైతం దెబ్బతీయగలిగింది. పశ్చిమాసియాలో ఇంతకుమించి మరేం జరగకూడదకునే దేశాలు ఇక తటస్థ అవతారాలు చాలించి నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్ని లోటుపాట్లున్నా ఈ ఒప్పందం కొనసాగేలా చూడాలి. శుక్రవారం జరిగే చర్చలు ఫలవంతం కావాలి. లేనట్టయితే చరిత్ర క్షమించదు. -
‘తాత్కాలిక సంధి’ దశ!
నలభై రోజులుగా ఇరాన్ పౌరుల్ని భీతావహుల్ని చేస్తూ, ప్రపంచాన్ని సైతం అల్లకల్లోల పరుస్తున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచింది. రెండు వారాలపాటు కాల్పుల విరమణ పాటించటానికి అమెరికా, ఇరాన్‌లు అంగీకరించటంతోపాటు దాన్ని పూర్తిస్థాయి విరమణగా మార్చటానికి వీలుగా పరస్పరం చర్చించుకోవాలని నిర్ణయించాయి. పాకిస్తాన్ దౌత్యం వల్లే అంతా సాధ్యపడినట్టు కనిపిస్తున్నా ఇరాన్‌ను బలంగా ప్రభావితం చేయగల చైనా జోక్యమే ఫలించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరుపక్షాల మధ్యా శుక్రవారం జరగబోయే చర్చల ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేయటం అంత సులభం కాదు. ఎందుకంటే, చర్చలకు ప్రాతిపదికగా అమెరికా విడుదల చేసిన 15 అంశాలకూ, ఇరాన్ ప్రతిపాదిస్తున్న 10 అంశాలకూ మధ్య చాలా విషయాల్లో పొసగటం లేదు. భూమిలో పాతిపెట్టిన 60 శాతం శుద్ధిచేసిన 440.9 గ్రాముల యురేనియంను ఇరాన్ తవ్వి తీయాల్సిందేనని అమెరికా కోరుతుండగా, ఆ విషయంలో రాజీపడబోమంటున్నది ఇరాన్. తమపై ఇన్నేళ్లుగా విధిస్తూవచ్చిన మౌలిక ఆంక్షలనూ, సెకండరీ ఆంక్షలనూ ఎత్తి వేయాలనీ, పశ్చిమాసియా నుంచి అమెరికా సేనలు వైదొలగాలనీ, స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని వెనక్కివ్వాలనీ, శాంతి ఒప్పందానికి భద్రతామండలి గ్యారెంటీ ఉండాలనీ ఇరాన్ కోరుతోంది. కాల్పుల విరమణలో లెబనాన్‌పై దాడుల్ని నిలిపేయటం భాగమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెబుతుండగా, అమెరికా తాజా వైఖరిని అంగీక రిస్తూనే ఇజ్రాయెల్ ఆ దాడులు ఆగబోవంటున్నది. రెండుపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అవి ఘర్షణలకు దారితీయటం అసాధారణమేమీ కాదు. ఆ ఘర్షణలు తెచ్చే తీవ్ర ఉద్రిక్తతల వల్ల సంధి కుదరటం ఓ పట్టాన సాధ్యపడదు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడి ఏడెనిమిది గంటలు గడిచినా పశ్చిమాసియాలో క్షిపణి దాడులు, బాంబుల మోతలు ఆగకపోవటం ఇందుకు తార్కాణం. కొన్ని దేశాలు మధ్యవర్తి పాత్ర పోషిస్తేనే, ఘర్షణల్లోని నిరర్థకతను వైరి దేశాలకు గుర్తుచేసి ఒప్పిస్తేనే ఆ దిశగా అడుగులు పడతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పెను మారణహోమాన్ని సృష్టిస్తాననీ, ఇరాన్ నాగరికత మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాననీ ట్రంప్ చేసిన హెచ్చరిక చర్చలకు దారులు పరిచింది. యుద్ధనేరాల్లో అగ్రభాగాన ఉండే ‘మారణహోమం’ బెదిరింపు చర్చల సాధనంగా మారటం అత్యంత ప్రమాదకర పరిణామం. ఇవాళ ఇరాన్‌కి ఎదురైన పరిస్థితే రేపన్నరోజు వేరే దేశాలకూ ఎదురుకావొచ్చు. తాను వేరే దేశాధ్యక్షుణ్ణి అపహరించవచ్చు... కానీ ఇరాన్ మాత్రం ఆత్మరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది ట్రంప్ నీతి. అమెరికాతో దాదాపు సమవుజ్జీలుగా ఉండి కూడా చైనా, రష్యాలు అమెరికా వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండించలేకపోయాయి. భద్రతా మండలిలో ఒత్తిడి చేయలేకపోయాయి. ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు అమెరికా సాయం చేస్తున్నది గనుక తాము ఇరాన్‌కు సహకరిస్తున్నామని మాత్రం రష్యా చెప్పింది. బాధిత దేశంగా తనను తాను చిత్రించుకుంటూ రెండేళ్ల పాటు గాజాను ఇజ్రాయెల్ వల్లకాడు చేస్తున్నా నోరు మెదపని దేశాలు... ఇరాన్ విషయంలోనూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయాయి. అన్ని మర్యాదలూ మంటగలిపి, మతి చలించినట్టు ప్రవర్తిస్తున్న ట్రంప్ ఇరాన్‌పై అణ్వస్త్ర దాడికి తెగబడతారన్న భయంతోనే చివరి నిమిషంలో చైనా కదిలింది. అది నచ్చజెప్పనట్టయితే ఇరాన్ అంగుళమైనా వెనక్కి తగ్గేది కాదు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ తమను ప్రాథేయపడిందని అమెరికా యుద్ధశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్వోత్కర్షకు పోతున్నారు. ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా అసహనంగా ఉన్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నారు. కానీ ట్రిగ్గర్పైన వేళ్లతోనే ఈ ఒడంబడికకు సిద్ధపడ్డామనీ, శత్రువు వైపు చిన్న పొరపాటు జరిగినా సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటిస్తామనీ ఇరాన్ ప్రకటించింది. కనుక ఈ స్వల్పకాల శాంతిపై ఎవరూ భరోసా పెట్టుకోనవసరం లేదు. ఏ క్షణంలోనైనా అది నీటి బుడగలా మటుమాయం కావొచ్చు. ఇంటా బయటా పెద్ద వినాశకారిగా పరిణమించిన ట్రంప్‌ను అభిశంసన ద్వారా అమెరికా సాగనంపే వరకూ శాంతి, సంధి వంటివి క్షణభంగురాలు! -
‘తొలగింపుల’ జాతర!
పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న జరగబోయే తొలి దశ పోలింగ్‌కు సంబంధించి తాజాగా 27 లక్షల 17 వేలమంది ఓటర్లు జాబితాల నుంచి కనుమరుగైనట్టు సోమవారం అర్ధరాత్రి దాటాక ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన తుది జాబితా వెల్లడిస్తోంది. దీంతో ఇప్పటివరకూ జాబితాల్లో పేర్లు లేనివారి సంఖ్య దాదాపు 91 లక్షలకు చేరింది. రెండో దశకు సంబంధించి తొలగింపులు కూడా కలుపుకొంటే ఇది కోటికన్నా ఎక్కువే ఉండొచ్చు. న్యాయ నిర్ణయ పరిధి (అజ్యుడికేషన్) ప్రక్రియ గత నెలలో మొదలయ్యాక ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ఇది. సహజంగానే ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షీదాబాద్‌లో అత్యధికుల పేర్లు తొలగించారు. అక్కడ అజ్యుడికేషన్ పరిధిలోకెళ్లిన 11,01,145 మందిలో 4,55,137 మంది అనర్హులుగా తేలారు. ‘స్వచ్ఛమైన’ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలన్న దృఢ నిశ్చయంతోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు శ్రీకారం చుట్టామని బిహార్‌లో ఏరివేతలు మొదలెట్టినప్పుడే ఈసీ చెప్పింది. ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా ఆ ప్రక్రియకు పట్టే సమయంపై అంచనా ఉండాలి. అది లేకపోబట్టే లక్షలాదిమంది ఓటర్లు ఈసారి ఓటింగ్‌కు దూరం కాబోతున్నారు. వారి అప్పీళ్లపై ట్రిబ్యునళ్ల విచారణ జరుగు తోంది. వారిలో విశ్వసనీయమైన ఓటర్లుగా నిర్ధారణయ్యేవారు కూడా ఉండొచ్చు. కానీ 2031 అసెంబ్లీ ఎన్నికలకు తప్ప వారు ఓట్లేయటం సాధ్యపడదు. న్యాయ నిర్ణయ ప్రక్రియకు సమయం పడుతుంది గనుక అంతవరకూ ఓటర్ల జాబితాలను ఆపటం సాధ్యపడదని సోమవారం సుప్రీంకోర్టు చెప్పటంతో అలాంటి ఓటర్లకు ప్రస్తుతానికి తలుపులు మూసుకుపోయాయి. ఈ నెల 23న పోలింగ్ జరగబోయే 152 నియోజక వర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదలైంది. 29న రెండో దశలో 142 నియోజకవర్గాల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించిన జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలవుతుంది. వ్యవధి తక్కువున్న తరుణంలో సుదీర్ఘ సమయం పట్టే ఇంత పెద్ద ప్రక్రియను ఒక అంచనా లేకుండా ఈసీ చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుబట్టకపోవచ్చు గానీ, సాధారణ పౌరుల దృష్టిలో ఈసీది దోషమే అవుతుంది. ఎందుకంటే వారు బాధితులు. నిజానికి బిహార్ ‘సర్’ బెంగాల్‌తో పోలిస్తే ఎంతో మెరుగు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే తొలగింపులు పూర్తికావటం వల్ల ఫామ్–6 ద్వారా తిరిగి జాబితాలోకెక్కడానికి చాలామందికి అవకాశం వచ్చింది. బెంగాల్లో ఆ అదృష్టం దక్కలేదు. తమ పేరుందనుకునే లోగానే ఎవరో ఫామ్–7 కింద ఫిర్యాదు చేశారన్న కారణంతో ఓటర్లకు తాఖీదులు పోయాయి. పనులన్నీ మానుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అనుమానమే. నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడినా, పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా అనర్హులుగా జమవేయటం పెను సమస్యగా మారింది. తాజా జాబితాలో పేర్లు లేని వారిలో అనేకులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని బావురు మంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దయెత్తున అందజేసే ఫామ్–7 పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా తొలగింపులు చేపడుతున్నారన్న ఆరోపణలు వాస్తవం అనటానికి ఒక బీజేపీ నాయకురాలి పేరిట దాఖలైన ఫిర్యాదులే తార్కాణం. ఆ సంగతే తనకు తెలియదని ఆమె చెప్పటం గమనించదగ్గ అంశం.ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారి సమస్య ఎన్నికల్లో ఓటేయలేకపోవటం మాత్రమే అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన దొంగ ఓటర్ల జాతర మాదిరి ఉదంతాల్లో తప్ప చాలా సందర్భాల్లో పోలింగ్ 65 శాతానికి మించదు. కానీ ఈ ‘సర్’ వల్ల గల్లంతైన వారికి భవిష్యత్తులో కష్టాలు చుట్టుముడతాయి. వారి పౌరసత్వమే సంశయాస్పదంగా మారి దేశం నుంచి గెంటేసే ప్రమాదం ఏర్పడుతుంది. బెంగాల్లో పార్టీల మధ్య ఉన్న కలహాలు సాధారణ ఓటర్ల భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఈసీ సక్రమంగా వ్యవహ రించివుంటే, ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటే సమస్యలు తలెత్తేవి కాదు. ఆ సంస్థ చేతగానితనం సామాన్యుల బతుకుల్ని అయోమయంలోకి నెట్టింది. -
ప్రమాదపుటంచుల్లో దేశాలు
ఇజ్రాయెల్‌తో కలిసి ఏకపక్షంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించింది మొదలు అది ఇవాళో, రేపో పూర్తికాబోతున్నదని చెప్పడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటైపోయింది. తాజాగా ప్రకటించిన సోమవారం డెడ్‌లైన్ కూడా ఆ ప్రస్తావనే లేకుండా ముగిసిపోయింది. కావలసినట్టుగా కథనాలను వండివార్చిపెట్టే ఒక వార్తాసంస్థ ద్వారా మాత్రం అమెరికా, ఇరాన్‌లు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ‘ఇస్లామాబాద్ ఒడంబడిక’ కుదుర్చుకున్నాయనీ, రెండంచెల ఈ పథకంలో తక్షణ కాల్పుల విరమణ, అనంతరం కుదరబోయే సమగ్ర ఒప్పందం భాగమనీ సోమవారం లీక్ వదిలారు. కాల్పుల విరమణ 45 రోజులపాటు అమల్లో ఉంటుందని కూడా ఆ కథనం చెబుతోంది. కానీ 38వ రోజుకూడా యథావిధిగా దాడులు జరిగి, ఇరాన్‌కు చెందిన ఒక సహజవాయు క్షేత్రం ధ్వంసమైంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్‌లోని సమస్త మౌలిక సదుపాయాలనూ మంగళవారం ధ్వంసం చేయబోతున్నానని ట్రంప్ ప్రకటించినా అటునుంచి రాజీ స్వరం వినబడలేదు. పైపెచ్చు ఆయన వ్యాఖ్యలు తూగుతప్పిన మాటలని ఇరాన్ ప్రతిస్పందించింది. ‘మీ ప్రతిపాదనను పరిశీలించటానికి తగిన సమయం తీసుకుంటాం. ఈలోగా ఏ ఒత్తిడికీ లొంగేది లేదు. హార్మూజ్‌ను తెరిచేదిలేద’ ని కటువుగా సమాధానమిచ్చింది.నిఘా సంస్థలూ, రక్షణ దళాల ముఖ్యులూ హెచ్చరిస్తున్నా యుద్ధానికి కాలుదువ్విన ట్రంప్ దాన్నుంచి బయటపడే మార్గం కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఏ విధంగా చూసినా బలాబలాల విషయంలో తమతో సరిపోలని ఇరాన్ వంటి ఒక చిన్న దేశాన్ని పోరాడక తప్పని స్థితిలోకి నెట్టడం ద్వారా ప్రచార యుద్ధంలో దానిదే పైచేయి అయ్యేలా చూసిన ఘనత ట్రంప్‌కే దక్కుతుంది. సమవుజ్జీలు కాని ఇద్దరి మధ్య పోరు జరుగు తున్నప్పుడు సహజంగా బలహీనుడికే సహానుభూతి దక్కుతుందన్న ఇంగిత జ్ఞానం ఆయన మరిచారు. విద్యుదుత్పాదన ప్లాంట్లు, రోడ్లు, వంతెనలు, నిర్లవణీకరణ ప్లాంట్లు మంగళవారం ధ్వంసం చేస్తామనటం అంటే యుద్ధనేరాలకు పాల్పడతానని చెప్పడమే! అమెరికా అధ్యక్షుడొకరు ఇలా బాహాటంగా ప్రకటించటం మునుపెన్నడూ లేదు. యుద్ధంవల్ల పౌరజీవితాలకు నష్టం వాటిల్లకూడదని, వారి ప్రాణాలకు ముప్పు రాకూడదని జెనీవా ఒప్పందాలూ, హేగ్ ఒడంబడికలూ, న్యూరెంబర్గ్ నియమాలూ, ఐక్యరాజ్యసమితి అధికారిక పత్రమూ ఘోషిస్తున్నాయి. ట్రంప్ వర్తమాన స్థితి నియంత్రణ లేని ట్రెడ్మిల్ ఎక్కిన మనిషిని పోలి ఉంది. అది నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది, దిగటానికి ప్రయత్నిస్తే బొక్కబోర్లాపడే ప్రమాదం ఉంటుంది. యూదు జాతీయుడైన ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నెర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కుమ్మక్కై ఇరాన్ రెండ్రోజులకే పాదాక్రాంతమవుతుందని ట్రంప్‌ను నమ్మించిన పర్యవసానమే ఈ యుద్ధమని ‘మాగా’ శిబిరంలో అందరికీ తెలుసు. అమె రికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మొదలుకొని ‘మాగా’ సిద్ధాంతవేత్త స్టీవ్ బేనన్ వరకూ అందరిలోనూ వైట్‌హౌస్‌ను ‘ఇజ్రాయెల్ లాబీ’ శాసిస్తోందన్న ఆగ్రహావేశాలున్నాయి. ట్రంప్ బలమైన మద్దతుదారు చార్లీ కిర్క్ హత్య ఇలాంటి గొడవల పర్యవసానమేనని వదంతులున్నాయి. దానిపై దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో ‘మాగా’ మద్దతు దారు, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నిష్క్రమించాల్సి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో పడినందువల్లే యుద్ధంలో పాలుపంచుకోవాలంటూ యూరప్ దేశాలపై ట్రంప్ ఒత్తిళ్లు తెచ్చారు. అవి ఫలించకపోవటంతో శాపనార్థాలు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్క 70వ దశకంలో తప్ప ప్రపంచానికెప్పుడూ ఈ స్థాయిలో ‘ఆయిల్ షాక్’ తగల్లేదు. అసలే ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే లోటు బడ్జెట్లుండే కాలం గతించి, అవి రివాజుగా మారిన ఈ వర్తమానంలో ‘పులి మీద పుట్ర’లా ట్రంప్ తీసుకొచ్చిన ఈ యుద్ధంతో... ఇజ్రాయెల్, అమెరికాలను గుడ్డిగా సమర్థించే దేశాలు సైతం కష్టాల్లో కూరుకుపోయాయి. సగటు లోటు జీడీపీలో 2 శాతం మించని దేశాల్లో ఇప్పుడది 20 శాతానికి ఎగబాకే ముప్పు ముంచుకొస్తోంది. ఈ దశలో కూడా ట్రంప్ కళ్లు తెరవకపోతే ప్రపంచం మరింత సంక్షోభంలో పడుతుంది. -
విప్లవ స్వరూపాలు
ఆంధ్ర పంచకావ్యాలలో వసుచరిత్ర ఒకటి. ఇందులో తెలుగు పద్యరచన పరాకాష్ట పొందినదని చెబుతారు. 16వ శతాబ్దానికి చెందిన రామరాజ భూషణుడు ఈ కావ్యకర్త. ఈయనకే భట్టుమూర్తి అని మరోపేరు. ఆ పేరుతో నరస భూపాలీయం రచించాడు. రామరాయల ఆశ్రయంతో రామరాజ భూషణుడయ్యాడు. ఈయన చిత్రకవితా నిపుణుడు కూడా. అష్టావధానానికీ ఈయనే మూల పురుషుడని పెద్దల మాట. పదము, క్రమము, ఘన, జట మొదలైన అష్ట విధాలుగా వేద పండితులు వేదావధానము చేస్తున్నప్పుడు, తానూ ఆ ప్రజ్ఞను చూపాలని ఉత్సాహపడి, ద్విజుడు కానందువల్ల సాహిత్యపరంగా ఆ ప్రక్రియను అవలంబించాడట.ఇంగ్లీషు చదువుకుంటే ‘స్వధర్మభ్రంశం తటస్థిస్తుందన్న’ భయం ఉన్న ఇంట్లో జన్మించాడు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆ ఇంగ్లీషు నేర్చుకోలేనందుకు ఎంతో బాధపడతాడు కూడా. కానీ ఆ ఇంగ్లీషు ఆహార్యాన్ని ఆనందంగా స్వీకరించాడు. అప్పట్లో చదువుకున్న కొంతమంది అబ్బాయిలు పిలకలు కత్తిరించుకొని క్రాపింగ్ చేయించుకోవడం మొదలుపెట్టారు. వారిని చూసి శ్రీపాదకూ అలాంటి కోరిక కలిగింది. ఒకరోజు క్షురకుడి దగ్గరకు వెళ్లి పిలకను పూర్తిగా కత్తిరించి క్రాపింగ్ చేయించుకున్నాడు. ఇంటికి రాగానే తండ్రి గమనించాడు. తలపై పిలక కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయి ‘అయ్యో! పిలక కత్తిరించేశావా?’ అన్నాడట. కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక సంస్కర్త, సూతపురాణం కర్త త్రిపురనేని రామస్వామి తన పేరు చివరి ‘చౌదరి’ అనే కులచిహ్నాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు. కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో పుచ్చలపల్లి సుందరయ్య తన పేరులో రెడ్డిని తొలగించుకోవడమే కాకుండా, ఉద్యమ జీవితానికి పూర్తిగా అంకితమవ్వాలనే నిర్ణయంతో సంతానం లేకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. అలా సంతానం లేకుండా ఉండే నిర్ణయాన్ని ఆయన భార్య లీల కూడా అంగీకరించారు. 1942లో భూస్వామ్య సమాజంలోని స్త్రీల జీవితంలోని ఉక్కపోతనూ, వాళ్ల మధ్య ఏర్పడే అనివార్య సాన్నిహిత్యాన్నీ చూపిన ‘లిహాఫ్’ కథ రాసిన ఇస్మత్ చుగ్తాయి లాహోర్ కోర్టు మెట్లు ఎక్కడానికీ వెనుకాడలేదు.అదంతా పెద్ద మనుషుల కాలం. పెద్ద త్యాగాలకు సమాజాలు సిద్ధపడిన కాలం. పెద్ద పోరాటాలకు తగినంత దృఢ సంకల్పం ఉన్న కాలం. ముందు సమాజం, ఆ తర్వాతే నేను అనుకున్న కాలం. మనుషులు అలాంటి విలువల్ని నెత్తిన పెట్టుకున్న సత్యకాలం. ఇప్పుడు కాలం మారింది. విలువలు అలాగే ఉన్నాయి కానీ వాటి మీద అభిప్రాయాలు మారిపోయినై. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అనే వ్యవహారం సరిగ్గా సరిపోయే కాలం. కానీ ఎంత శుద్ధి చేసినా పోని మురికిలా సంఘంలో సమస్యలు చాలానే ఉన్నాయి. ఈ కాలానికి తగినట్టుగా, చిన్న చిన్న విప్లవాలు ఇప్పటి అవసరమని చెబుతాడు ఒక కథలో ఉణుదుర్తి సుధాకర్. కాలనీ పార్కులో మూత్రం పోయించే కుక్క యజమానిని నిలదీయడం, పెద్ద శబ్దంతో అపరాత్రి మోగే మైకు మీద ఫిర్యాదు చేయడం, సైలెన్సర్ తొలగించిన బైకును అడ్డుకోవడం, పొగ చిమ్మకుంటూ పోతున్న ఆటోను ఫొటో తీయడం, సీట్లో లేని ఉద్యోగిని ప్రశ్నించడం, ఆహార కల్తీ మీద ఉప్పందించడం, నోటీసు ఇవ్వకుండా ఇంటిమీదికొచ్చే బుల్డోజర్కు ఎదురునిలవడం... అన్నీ చిన్న చిన్న విప్లవాలు. పెద్ద త్యాగాలు చేయకుండానే చిన్న మార్పునైనా సాధ్యం చేసే విప్లవాలు. 2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేస్తామన్న మాటకు గడువు దాటిపోయింది. సాంకేతికంగా అది అంతమైపోయిందా? రూపం మార్చుకుంటుందా? ఆ మనుషులు ఇంకే దారుల్లో వ్యక్తమవుతారు? సిద్ధాంత ఆచరణలు రూపు మార్చుకుంటాయేమోగానీ సమస్యలు ఉన్నంతవరకూ ప్రజాగ్రహం ఉంటూనే ఉంటుంది. ప్రజాగ్రహం ఉన్నచోట ఏదో ఒక చిరు విప్లవం మొలుస్తూనే ఉంటుంది. తార్కిక హేతువుకు అందినంతవరకూ, వద్దన్నది వదలకుండా చేయడం కూడా విప్లవమే. సంక్షుభిత కల్లోల సమయాల్లో సాటివాడి మీద కరుణ చూపడం కూడా మేలైన విప్లవ చర్యే! -
ఆచరణ పథమా? అవినీతి మార్గమా?
అమరావతి అనే పేరుతో ఒక ఎమోషనల్ డ్రామాను రక్తి కట్టించడానికి చంద్రబాబు ప్రభుత్వం చెమటోడ్చి పనిచేస్తున్నది. ఇప్పుడు మాత్రమే కాదు, ఈ పాలక కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించింది. అప్పటి జగన్ ప్రభుత్వం పాలనాపరమైన విజయాలను మసకబార్చడానికి ‘అమరావతి’ పేరుతో, శోకరస ప్రధానమైన ఇతివృత్తంతో ప్రదర్శించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతిపై కురుస్తున్న ప్రశ్నల వర్షాన్ని తప్పించుకోవడానికీ, పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించ డానికీ, అదే నాటకంలో మరిన్ని భావోద్వేగాలను దట్టించడానికి తీవ్రంగా ప్రయత్నించారు.రాష్ట్ర విభజన జరిగిన పన్నెండేళ్ల తర్వాత, ప్రధానమంత్రిని రెండుసార్లు రప్పించి శంకుస్థాపన చేసిన తర్వాత... అమరావతే రాజధాని అంటూ మరోమారు అసెంబ్లీ తీర్మానం ఎందుకు? అసెంబ్లీలో అంతర్భాగమైన ఎగువ సభను ఉపేక్షించి ‘అర్ధాంగీ కారం’తోనే పార్లమెంట్‌కు పంపడానికి వేగిరపడిందెందుకు? రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోని అంశమేనని గతంలోనే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన తర్వాత... ఈ విషయంలో అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడమనేది చాలా సహజమైన క్రతువు.కేంద్రంలో ఉన్నది కూడా కూటమి సర్కారే కనుక మొహ మాటం కొద్దీ ఏపీ రాష్ట్ర విభజన (సవరణ) బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి సహకరించింది. ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానా నికి విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు వ్యవహరించరు... ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప! అయినా, సమాజ్‌వాది సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ అమరావతి ఎంపికపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొద్దిపాటి ఖర్చుతోనే సహజసిద్ధంగా ఎదిగే అవకాశమున్న విశాఖను వదిలి అమరావతి పేరుతో మోయలేని భారాన్ని ఎంచుకోవడం పట్ల విస్మయాన్ని ప్రకటించారు.ఈమాత్రం తతంగానికి శత్రురాజ్యం మీద యుద్ధం చేసి గెలిచినంత హడావిడి చేసింది చంద్రబాబు సర్కార్. ‘కట్టండి తోరణాలు, ఎత్తండి జెండాలు, చేయండి ఉత్సవాలు’ అంటూ కిందిస్థాయి కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అయితే ఆ స్థాయిలో కేడర్ స్పందించలేదన్న సంగతి ఇక్కడ మనకు అనవసరం. అది వారి ఆంతరంగిక విషయం. ‘అమరా వతి ఇక శాశ్వత రాజధాని. దాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ చంద్రబాబు మాట్లాడారు. దేశంలోని సమస్త పార్టీలూ ఒక్క తాటిపై నిలిచి అమరావతికి మద్దతు తెలిపాయని చెబుతూ ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని బాబు తప్పుబట్టారు.ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నామని ఉభయ సభల్లో వైసీపీ సభ్యులు చెప్పారు. అమరావతిని వ్యతిరేకిస్తున్నా మని చెప్పలేదు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులో పెట్టలేకపోయినా అప్పటి ప్రధాని ప్రభుత్వం తరఫున ఏపీకి ‘ప్రత్యేక హోదా’ను హామీ ఇచ్చారు. ఆ ‘ప్రత్యేక హోదా’ అనేది ఏపీకి సంజీవని వంటిదని జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయ పడ్డారు. మొన్న పార్లమెంట్ ఆమోదించిన బిల్లు 2014 నాటి విభజన చట్టానికి సవరణ కనుక ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది?వైసీపీ సభ్యులు అదే ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను బిల్లులో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. రాజధాని భూసమీకరణకు సహకరించిన రైతుల గురించి బిల్లులో ఎందుకు లేదని అడిగారు. ఇంకెన్నాళ్లకు వారికి న్యాయం జరుగు తుందని కడిగేశారు. రాజధాని నిర్మాణ పనుల పేరుతో ఆమో దించిన టెండర్లలో కనిపిస్తున్న కనీవినీ ఎరుగని అవినీతి వ్యవహారాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఢిల్లీలో చదరపు అడుగుకు నాలుగు వేలున్న నిర్మాణ వ్యయం అమరావతిలో పన్నెండు వేలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను గతంలో పలుమార్లు స్వయంగా ప్రతిపక్ష నేత కూడా వేసినా, ప్రభుత్వం స్పందించలేదు.ఈ అవినీతిని ఎత్తిచూపకుండా పార్లమెంట్లో అమరావతి బిల్లుకు మద్దతునిస్తే రాష్ట్ర సర్కార్‌కు క్లీన్చిట్ ఇచ్చినట్టు కాదా? బేషరతుగా బిల్లుకు మద్దతునిచ్చి ఉంటే ప్రతిపక్ష బాధ్యతలో వైసీపీ విఫలమైనట్టు భావించవలసి వచ్చేది. అందుకే సవరణ బిల్లును ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఒక సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామాగా మార్చి ప్రచారం చేయడానికి కూటమి పార్టీల నేతలు, యెల్లో మీడియా వారు వీరకంకణాలు ధరించారు. అమరావతి నిర్మాణాన్నీ, అభివృద్ధినీ వైసీపీ అడ్డుకుంటున్నదని ప్రచార సంరంభాన్ని ప్రారంభించారు. రాజధాని పేరుతో ఎంత విచ్చలవిడిగా అవినీతి చెలరేగినా ప్రశ్నించ కూడదా? ప్రత్యేక హోదా డిమాండ్‌కు పాలక కూటమి మంగళం పాడితే ప్రతిపక్షం కూడా కోరస్ పాడాలా? చట్టబద్ధత అనేది అమరావతికి మాత్రమే ఉండాలా? అందుకోసం భూములిచ్చిన రైతులకు చట్టపరమైన రక్షణ అవసరం లేదా?... ఇవి కదా ఇప్పుడు చర్చ జరగవలసిన ప్రధానాంశాలు!అసలీ చట్టబద్ధత అనేదే పెద్ద బోగస్. దీన్నేమీ రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చలేదు కదా, మార్చకుండా ఉండ టానికి? చట్ట సవరణ కోసం ఏపీ శాసనసభ ఎంత సులభంగా మొన్న తీర్మానం చేసిందో, కావాలనుకుంటే ఇంకో ప్రభుత్వం అంతే సులభంగా ఇంకో తీర్మానాన్ని కూడా చేసి కేంద్రానికి పంపించగలదు. తమకిచ్చిన హామీలు నెరవేరక, చూపెట్టిన రంగుల చిత్రాలు నిజం కాక నిరాశతో ఉన్న రైతులను మరి కొంతకాలం మభ్యపెట్టడానికీ, రెండో విడత భూసేకరణకు సిద్ధపడని రైతులను బుజ్జగించడానికీ, నిర్మాణ పనుల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాల నుంచి దృష్టి మళ్లించడానికీ పన్నిన వ్యూహం తప్ప ఈ చట్టసవరణకు ఇంతకు మించిన ప్రాధాన్యంలేదు.విభజన చట్టం సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, ముఖ్యమంత్రి తన ఆనందాన్నీ, ప్రతిపక్షం మీద ఆక్రోశాన్నీ వెలిబుచ్చుతున్న సందర్భంలో ఒక కీలకమైన అంశం ఆయన మాటల్లోంచి దొర్లిపడింది. ‘రాజధాని నిర్మాణం నిరంతర ప్రక్రియ, ఒక్కరోజులో పూర్తయ్యేది కాద’ని చంద్రబాబు చెప్పారు. రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మాణం కాలేదన్న నానుడి చంద్రబాబు దాకా చేరేసరికి శతాబ్దాల కాలం పట్టిందన్నమాట! ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్ ఇంజన్ లాంటి నగరంగా అమరావతిని నిర్మించాలన్నది తన లక్ష్యమని కూడా ఆయన పలుమార్లు చెప్పారు. రెండో విడత, మూడో విడత భూసమీకరణ సంగతిని పక్కన పెడదాం. మొదటి విడత 50 వేల ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకే బాబు లెక్క ప్రకారం లక్ష కోట్లు కావాలి.ఇప్పటివరకు రాజధాని పేరుతో చేసిన రూ. 47 వేల కోట్ల అప్పుల్లో చాలాభాగం ఐకానిక్ బిల్డింగ్‌ల ఖాతాల్లోకి మళ్లింది. తొలివిడత మౌలిక వసతులను పూర్తిచేయడానికి ఇంకెన్ని వేల కోట్లు కావాలి? ఎప్పటికి సమకూరాలి? ఓ దశాబ్దానికో, రెండు దశాబ్దాలకో మౌలిక వసతుల్ని, ప్రభుత్వ భవనాలను, ప్రైవేట్ సంస్థల భవనాలను పూర్తి చేసినా, జనసమ్మర్దం నివసించే నగరంగా మారే అవకాశాలు అమరావతికి చాలా తక్కు వని నిపుణులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్ పూర్గానో, మలేసియాలోని పుత్రజయగానో చీకటి పడగానే నిర్మానుష్య నగరంగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని సాధికారికంగా వివరిస్తున్నారు. ఇటువంటి నగరం ఎన్ని తరాలు గడిస్తే గ్రోత్ ఇంజన్‌గా ఎదగగలుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.ఈ నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను పరిశీలించాలి. హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైన కారణంగా మిగిలిన ప్రాంతాలు వెనుక బడ్డాయనీ, విభజిత రాష్ట్రంలో అటువంటి పొరపాటు చేయ వద్దనీ రాజధానిపై కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు పాలనా వికేంద్రీ కరణ కూడా ప్రజాస్వామ్యం బలపడేందుకు దోహదపడుతుంది. దీనితోపాటు మరో ముఖ్యమైన విషయం– రాష్ట్రాభివృద్ధికి దోహదపడే గ్రోత్ ఇంజన్ లాంటి నగరం కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలో అంతర్లీనంగా ఉన్నది.విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. షిప్‌యార్డ్, తూర్పు నావికాదళం, స్టీల్ ఫ్యాక్టరీ వగైరాల ఏర్పాటుతో కాస్మొ పాలిటన్ స్వరూపాన్ని సంతరించుకున్నది. బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒరిస్సాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది. తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలో విశాఖను గ్రోత్ ఇంజన్‌గా అందుబాటులోకి తీసుకొని రావచ్చు. దాంతో పాటు కర్నూలు న్యాయ రాజధాని విషయం కూడా!మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో కర్నూలులో రాజధాని ఏర్పాట యింది. మూడేళ్ల తర్వాత రాయలసీమ ప్రాంతం తన రాజధాని హోదాను త్యాగం చేసి దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పా టుకు శ్రీకారం చుట్టింది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విచ్ఛిన్నమై పాత ఆంధ్ర రాష్ట్రమే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. న్యాయం ప్రకారం రాయలసీమ తన పాత హోదాను అడిగి తీసుకోవాలి. కనీసం హైకోర్టునైనా అక్కడ ఏర్పాటు చేయడం సముచితమన్న ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతి పాదన తీసుకొచ్చారు. దీన్ని మూడు ముక్కల ఆటంటూ టీడీపీకి ఉన్న ప్రచార బలంతో, మీడియా దన్నుతో అవహేళన చేసి, ప్రజలను ఏమార్చారు.ఇప్పుడు అమరావతి నిర్మాణం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నది. రాజధాని నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాదనే గ్రహింపు కూడా చంద్రబాబుకు ఉన్నది. కొన్ని దశాబ్దాలు గడిచినా అది గ్రోత్ ఇంజన్ మాదిరిగా ఉపయోగపడే అవకా శాలు తక్కువే. అయినా ఇతరేతర కారణాలేవో ఆయన్ను అమరావతి చుట్టే తిప్పుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రగతి కోసం తక్కువ కాలంలో గ్రోత్ ఇంజన్‌గా అందుబాటులోకి వచ్చే మరో ప్రత్యామ్నాయ సూచన కూడా జగన్ చేశారు. మచిలీ పట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని గ్రోత్ కారిడార్‌గా ప్రకటించ వచ్చని సూచించారు. ఇందుకోసం ఆయన ఉపయోగించిన ‘మావిగన్’ పేరు నచ్చకపోతే ఇంకే పేరైనా పెట్టుకోవచ్చని కూడా అన్నారు.తక్షణమే యాభై లక్షల జనాభా గల నగరంగా ఇది అవతరిస్తుంది. మచిలీపట్నం పోర్టు, దేశంలో ప్రముఖమైన విజయవాడ రైల్వే జంక్షన్, గన్నవరం అంతర్జాతీయ విమానా శ్రయం రెడీమేడ్‌గా అందుబాటులోకి వస్తాయి. అమరావతికి రెండో విడత భూ సమీకరణ అవసరముండదు. తొలి విడత సమీకరించిన భూమిలోనే కేటాయింపులు పోగా మిగిలిన భూమి అమ్మకాలతోనే ఈ కారిడార్‌లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయవచ్చు. మచిలీపట్నం రాష్ట్రంలోని తొలి మునిసిపా లిటీల్లో ఒకటి. నిజాంల కాలంలోనే హైదరాబాద్ నుంచి బందరు రేవుకు రహదారి నిర్మాణం (ప్రస్తుత ఎన్‌హెచ్ 65) జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే ఏకైక రేవుపట్టణం కూడా మచిలీపట్నమే! ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు పెద్దఎత్తున ప్రారంభించడానికి తక్షణం ఉపయోగ పడే ప్రాంతం. రాష్ట్ర పురోగతికి ఆచరణాత్మకమైన మార్గాన్ని అనుసరించాలనుకుంటే ఈ ప్రతిపాదనను పరిశీలించవచ్చు. అసాధ్యమైన అమరావతి బాటనే ఎంచుకుంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పోలీసుల అత్యుత్సాహం
మన దేశానికి సంబంధించినంతవరకూ అధికారం దైవదత్తమేమీ కాదు. అదిరాజ్యాంగం ద్వారా సమకూడిన బాధ్యత. అధికారమైనా, విధులైనా నిర్వర్తించేవారు ఈ సంగతి మరిస్తే దేశంలో అరాచకం రాజ్యమేలుతుంది. పాలకులు మొదలు సామాన్య ప్రభుత్వోద్యోగి వరకూ అందరూ దీన్ని పాటించి తీరాల్సిందే. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు ఈమధ్య వరసబెట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొందరు యువకుల్ని ‘నేరగాళ్లు’గా చిత్రిస్తూ వారిని తాళ్లతోకట్టి పబ్లిగ్గా నడిరోడ్లపై నడిపిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో మోకాళ్లపై పాకించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి తమ ఘనకార్యాలను చాటుతున్నారు. ఈ ‘పేరుప్రఖ్యాతులు’ చూసి ఆ రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా కొందరు ఇలాంటి పనులకే దిగారు. పోలీసుల మతిమాలిన చేష్టలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటి వైపరీత్యాలు తక్కువేం కాదు. తెనాలిలో నిరుడు మే నెలలో దళిత వర్గాల యువకులు ముగ్గుర్ని నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోది హింసించారు. ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పడానికి వారి దగ్గర సమాధానాలు సిద్ధంగా ఉంటాయి. కోడిని కోశారని కేసు పెట్టవచ్చు... గ్రహస్థితి బాగో లేకపోతే డ్రగ్స్ విక్రయిస్తున్నారని అభాండం వేయొచ్చు. ఆ ఉదంతాన్ని నిరసిస్తూగుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయినా ఆ మాదిరి ఘటనలు ఆగింది లేదు. ఆ మరుసటి నెలలో నెల్లూరు పోలీసులు సైతం మరో అయిదుగురు యువకులను నడిరోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు.చేతిలో లాఠీ ఉంటే చాలు... తాము సర్వం సహాధికారులమన్నట్టు ప్రవర్తించే పోలీ సుల తీరు గర్హనీయమైనది. ఉద్యోగులకైనా, సాధారణ పౌరులకైనా చట్టాలు, రాజ్యాంగం ఒక్కలాగే వర్తిస్తాయి. అధికారంలో ఉన్నవారు తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా తీసుకునే ఏ చర్య అయినా వాటికి లోబడే ఉంటుంది. పోలీసులు సభ్యసమాజ పోకడలకు విరుద్ధంగా పోకూడదని షీలాబార్సే దాఖలు చేసిన ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. డీకే బసు కేసులో సైతం నిందితులతో ఎలా మెలగాలో నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. అసలు పోలీసు మాన్యువల్స్లోనే నిందితులతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలున్నాయి. సాధారణ పౌరుల విషయంలో చిన్న చిన్న అంశాల్లో కూడా చెలరేగిపోయేపోలీ సులు... బడా బాబులు పెద్ద నేరాలు చేసినప్పుడు మాత్రం ‘శవాసనం’ వేసిన చందాన మిన్నకుండిపోతారు. ఏపీలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ, బలవంతంగా అబార్షన్ చేయించాడనీ ఒక మహిళా ప్రభుత్వోద్యోగి ఆరోపిస్తే నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. పైగా ఆమె బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఎదురు కేసులు పెట్టారు. మరో మహిళా మంత్రి పీఏపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయినా జరిగింది శూన్యం. 60వ దశకంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ నారాయణ్ ముల్లా పోలీసులుసంఘటిత నేరగాళ్ల గుంపుగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. వినడానికి అవి కటువుగా ఉన్నా, ఆయనన్నది నిజమే అన్నట్టు ప్రవర్తించే పోలీసులకు మన దేశంలో ఎప్పుడూ కొదవలేదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఇష్టానుసారం ప్రవర్తించటానికి లేదు. ఒక వ్యక్తి నిజంగా తప్పుచేసినా వారి చర్యను న్యాయస్థానంలో నిరూపించి తగిన శిక్ష పడేలా చూడటమే పోలీసుల కర్తవ్యం. ప్రతి నేరానికీ గతంలో ఐపీసీలోనూ, ఇప్పుడు భారతీయ న్యాయసంహితలోనూ నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. నేరగాళ్లు సిగ్గుపడేలా చేయటమనే శిక్ష ఎక్కడా లేదు. తెనాలి ఉదంతంలో విచిత్రమేమంటే... ఒక పోలీసు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా అతగాడి సహోద్యోగులు శిక్ష అమలు చేశారు. మరి న్యాయస్థానాలెందుకున్నట్టు? చవకబారు సినిమాలు చూసి, ‘రెడ్‌బుక్’ రాజ్యాంగంలో ఏదైనా చెల్లుతుందనుకుని చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఈ బాపతు అత్యుత్సాహపరులు ఏదో ఒకరోజు చట్టానికి చిక్కక తప్పదు. -
ఆగిపోయిన ‘ఆంక్షల’ బిల్లు
దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నివిధాల కలిసొస్తుందో వివరించటానికి దాన్ని సమర్థించేవారు అనేకానేక కారణాలు ఏకరువు పెడతారు. కానీ ఆ ప్రతిపాదన వెనకున్న అసలు కారణమేమిటో బుధవారం హఠాత్తుగా లోక్‌సభలో ఆగిపోయిన విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు చెప్పకనే చెబుతోంది. ఎన్నికల బెడద వల్ల తమకిష్టమైనవి అమలుచేయటం అసాధ్యం కావటమే ఆ అసలు కారణం. ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని మరింత కఠినం చేస్తూ తీసుకురాదల్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్, సీపీఎంలు కేరళ ఎన్నికల సభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నందువల్ల తాత్కాలికంగా ఆపామని బుధవారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. క్రైస్తవ ఓటర్లు గణనీ యంగావున్న కేరళలో తమ పార్టీ ప్రాబల్యం పెరిగిందని బీజేపీ భావిస్తోంది. ఆ మత విశ్వాసాలను అనుసరించే స్వచ్ఛంద సేవాసంస్థ (ఎన్జీవో)ల కార్యకలాపాలు కూడా అక్కడ ఎక్కువే. కనుక ఈ బిల్లుపై చర్చ జరిగితే అది నష్టం తెస్తుందని పాలకపక్షం భావించినట్టు కనబడుతోంది. కేవలం ‘దుష్ప్రచారం’ వల్లనే తాత్కాలికంగా ఆపామన్న కారణం సహేతుకంగా లేదు. సాగు చట్టాల బిల్లు మొదలుకొని లేబర్ కోడ్, నిన్న మొన్నటి జీరాం జీ వరకూ ఇలాంటి ‘దుష్ప్రచారా’నికి కొదవలేదు. కానీ అవి ఆగింది లేదు.అందరినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా, అంకిత భావంతో పనిచేసే ఎన్జీవోలున్నట్టే... పేరు ప్రతిష్ఠల కోసం, సాధారణ జనాన్ని ప్రభా వితం చేయటం కోసం పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి. యూరప్‌లో ఎక్కడో మారు మూల పుట్టి మన దేశంలో అట్టడుగు వర్గాలకు ఎన్నదగిన సేవలందించిన మదర్ థెరీసాను ఆ వర్గాల ప్రజలు ‘అమ్మ’గా పిల్చుకున్నారు. అలాగే ఎప్పుడూ కరవు వాతబడే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో దాదాపు అరవైయ్యేళ్లుగా నిరుపేద ప్రజానీకానికి భిన్నరంగాల్లో విశేష సేవలందిçస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఖ్యాతి అందరికీ తెలుసు. ఇదే ఎఫ్సీఆర్ఏ కింద నిరుడు ఏప్రిల్‌లో కేంద్రం ఆ సంస్థ అనుమ తులు నిలిపివేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పల్లె నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు సాగించింది. ప్రధానికి లక్ష పోస్టు కార్డులు పంపే ఉద్యమాన్ని చేపట్టింది. చివరకు గత నెలాఖరున అనుమతులు పునరుద్ధరించారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును ఇప్పుడంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది గానీ... దాన్ని మొదట తెచ్చిందీ, కాలానుగుణంగా కఠినతరం చేసిందీ ఆ పార్టీ ప్రభుత్వాలే. 1976లో ఎమర్జెన్సీ చీకటిచాటున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకు విదేశీ శక్తుల్ని కారణంగా చూపారు. దాన్ని 2010లో మరింత కఠినతరం చేసింది కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే. రష్యా సహకారంతో పూర్తికావస్తున్న కూదంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఇక ఎన్డీయే సర్కారు వచ్చాక 2016, 2018, 2020లలో ఆ చట్టానికి సవరణలొచ్చాయి. అయినా సరిపోలేదని భావించి ఈ బిల్లు తెచ్చారు. ముఖ్యంగా లైసెన్స్ రద్దయిన సంస్థల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే అధికారం కేంద్రా నికిచ్చేలా సెక్షన్ 15కి చేసిన సవరణే వివాదాస్పదంగా మారింది. దానిపై సంబంధిత వర్గాలతో, పార్టీలతో చర్చించి వారిలో ఉన్నాయంటున్న అపోహలను తొలగించ టానికి ఎలాంటి ప్రయత్నం జరగకుండానే బిల్లు తీసుకురావటమే సమస్య అయింది.ఎఫ్సీఆర్ఏకు 2020 సవరణల అనంతరం ఎన్జీవోలకు విరాళాలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపేణా రూ. 16,490 కోట్లురాగా, 2019–20నాటికి అది కాస్తా రూ. 2,190 కోట్లకు పడిపోయింది. ఒక అంచనా ప్రకారం గత నెలాఖరు నాటికి 21,933 ఎన్జీవోల లైసెన్సులు రద్దయ్యాయి. ప్రభుత్వాలనుంచి సాయం అందని అనేక వర్గాలు ఈ సంస్థల ద్వారా లీగల్ ఎయిడ్, వైద్యసాయం, విద్య, మౌలిక సదుపాయాలు పొందుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ పారదర్శకంగా ఉండాల్సిందే. ప్రమాదకర సంస్థలని రుజువైతే వాటి కార్యకలాపాలు నిలిపేయటం కూడా తప్పు కాదు. కానీ అన్నిటినీ ఒకే గాటనకట్టి పీక నొక్కాలనుకోవటం మాత్రం సహేతుకం కాదు. -
ఒంటరి మానవుడు ట్రంప్!
ఇరాన్‌తో యుద్ధం ముగిసే సమయానికి అమెరికా సర్వభ్రష్టమయ్యే సూచనలు కనబడు తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సలహాను శిరసావహించి యుద్ధంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయనతో చెడినట్టు కథనాలొస్తున్నాయి. గత ఏలుబడిలోనూ, రెండోసారి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా నాటోను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమను బహిరంగంగా దూషిస్తున్నా మౌనంగా ఉండిపోయిన దేశాలు, ఆయన మాట విని ఇరాన్‌తో అనవసర కయ్యానికి దిగదల్చు కోలేదని గత నెల రోజులుగా వాటి ప్రవర్తన చెబుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని బద్దలు కొడదాం రమ్మని పిలుపునిస్తే ఎవరూ కదలకపోగా... దీంతో మాకేమిటి సంబంధమని స్పెయిన్ నిలదీసింది. మొదట్లో సిద్ధపడినట్టే కనిపించిన జర్మనీ, ఫ్రాన్స్ చివరకు మౌనం పాటించాయి. డీగోగార్షియా సైనిక స్థావరాన్ని ఇవ్వబోమని యుద్ధం తొలినాళ్లలో తిరస్కరించిన బ్రిటన్ అటుతర్వాత అంగీకరించినా, ఇప్పుడు అది సైతం యుద్ధ నౌకలను పంపేదిలేదని చెబుతోంది. సైనిక విమానాలు ఇంధనం నింపు కోవటానికి అనుమతించబోమని ఇటలీ చెప్పగా, ఇజ్రాయెల్‌కు ఆయుధాలతో వెళ్లే విమా నాలను తమ గగనతలంలోకి రానీయబోమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇలా ఎవరికి వారు మొహం చాటేస్తుండగా నాటో నుంచి తప్పుకోవటం తప్ప దిక్కులేదని ట్రంప్ భావించ టంలో ఆశ్చర్యం లేదు.నాటో ఆవిర్భవించి 77 యేళ్లు కావస్తోంది. స్థాపిత ఉద్దేశాలు మరిచి ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల అమెరికా ప్రయోజనాలు నెరవేర్చటానికి ముందుకురికిన ఆ సంస్థ వల్ల గతమంతా నెత్తుటితో తడిసింది. ఇన్ని దశాబ్దాల్లోనూ చోటుచేసుకున్న యుద్ధాల చిట్టా తీస్తే చాలావరకూ నాటోయే దోషిగా తేలుతుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి ముప్పు ముంచుకురాబోతున్నదని బెదిరి స్థాపించిన ఈ కూటమికి ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ వైపునుంచి బెడద ఏర్పడింది లేదు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అప్పటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వార్సా కూటమిని రద్దుచేశాం గనుక, నాటోను కూడా రద్దు చేయమని కోరగా అందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు అంగీకరించలేదు. కనీసం దాన్లో తమను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదించినా అవి తిరస్కరించాయి. పైపెచ్చు నాటోను ‘ఒక్క అంగుళం’ కూడా విస్తరించబోమని, రష్యా సరిహద్దు దేశాలను చేర్చుకునేది లేదని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించాయి.ప్రపంచంలో పనికిమాలిన సంస్థ ఏమైనా ఉన్నదంటే అది నాటోయే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక దాన్ని శాంతిస్థాపక సంస్థగా మారిస్తే ప్రపంచంలో సహజ వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి సైనిక వ్యయానికయ్యే ఖర్చంతా ఆదా అయి అవిద్య, నిరు ద్యోగం, అధిక ధరలు, ప్రాణాంతక వ్యాధులు సమసిపోయేవి. ఐక్యరాజ్యసమితికయ్యే వార్షిక వ్యయంతో పోలిస్తే నాటో ఖర్చు 400 రెట్లు ఎక్కువ! ఇందులో అత్యధిక శాతం సొమ్ము మారణాయుధాలకూ, సైనిక స్థావరాల నిర్వహణకూ ఖర్చవుతుంది. నాటో పేరు చెప్పి వివిధ యూరప్ దేశాల్లో తిష్టవేసిన సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్యే దాదాపు 20 లక్షలు! మిగిలిన దేశాలకు చెందినవారి సంఖ్య అందులో సగం కూడా ఉండదు. నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ చెబుతున్న కబుర్లు ఉత్త బడాయి మాటలు. అదే అమలైతే ఇంటిదారిపట్టిన లక్షలాదిమంది సైనికుల్ని పోషించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిల బడుతుంది. అది సజావుగా సాగాలంటే, డాలర్ పచ్చగా కళకళలాడాలంటే ప్రపంచంలో ఏదో మూల మారణాయుధం పేలాల్సిందే!‘ఒక దశ దాటాక యుద్ధంలో నీకు ఆసక్తి లేకపోయినా, యుద్ధానికి నీపై ఆసక్తి తగ్గదు’ అని రష్యా విప్లవ సారథుల్లో ఒకరైన మార్క్సిస్టు సిద్ధాంతకర్త ట్రాట్సీ్క అంటాడు. కొరివితో తలగోక్కున్న చందంగా ఇరాన్‌పై అనవసర యుద్ధానికి దిగిన ట్రంప్‌కు దాన్నుంచి బయటపడటం ఎలాగో తెలియటం లేదు. అయినా రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ మార్కెట్లను మాయజేయటం కోసం యుద్ధ విరమణ తథ్యమంటూ ప్రకటించటానికి ఆయన అలవాటుపడ్డారు. ఆ మాటెలా ఉన్నా ట్రంప్ బెదిరింపు నిజమై నాటో కనుమరుగైతే ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. -
నేపాల్‌లో మారిందేమిటి?!
తిరుగుబాటు గాలి ఒకచోట పుట్టి చప్పున చల్లారిపోదు. అది సమస్య ఉన్నచోటకల్లా పోయి నిప్పు రాజేస్తుంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమానికి జడిసి పాలకులు పదవులూ, ప్యాలెస్‌లూ వదిలి నిష్క్రమించిన తరహాలోనే బంగ్లాదేశ్‌లో కూడా యువజనం ధాటికి 2024 ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి హుటాహుటీన న్యూఢిల్లీకి చేరుకుని ఆశ్రయం తీసుకోక తప్పలేదు. ఈ రెండింటినీ చూసి కావొచ్చు... నేపాల్‌లో సైతం జెన్ జీ తరం నిరుడు సెప్టెంబర్‌లో అధికార పీఠాలను కదిలించారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భిన్నంగా యువతరం రాజకీయాల్లోకొచ్చి విజయం సాధించారు. ప్రముఖ ర్యాపర్, కఠ్మాండు మేయర్ బాలేంద్ర షా ప్రధాని అయ్యారు. ఆయనతోపాటు అనేక కొత్త ముఖాలు పార్లమెంటులోకి అడుగుపెట్టాయి. ఆ రకంగా నేపాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కానీ మాజీ ప్రధాని, సీపీఎన్(యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలిని శుక్రవారం అరెస్టు చేయడాన్ని గమనిస్తే శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మాదిరి కాకుండా గత పాలకుల్ని వేధించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతోంది. శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను నిరుడు అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసిన సంగతి నిజమే అయినా, ఆ వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. బంగ్లాదేశ్‌లో అయితే వేధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కొత్త ప్రధాని తారిక్ రెహ్మాన్ ప్రకటించి ఇంతవరకూ విపక్ష నేతల జోలికి పోలేదు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికీ భారత్‌ను కోరుతున్న మాట వాస్తవమే అయినా, అదే పనిగా పేచీకి దిగే ఉద్దేశం ప్రస్తుతానికైతే దానికి ఉన్నట్టు కనబడదు. నేపాల్‌లో నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన నిరసనోద్యమంలో 77 మంది ప్రాణాలు బలిగొన్న భద్రతా బలగాల కాల్పులకు కారణమన్న కేసులో శర్మ ఓలిని, అప్పటి హోంమంత్రి రమేష్ లేఖక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన నేపాల్ కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక కోర్టు మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్ కార్కీ నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నిజానికి ఆ కమిషన్ ఓలి అపరాధాన్ని నిర్ధారించలేదు. కానీ కాల్పులను ఆయనగానీ, లేఖక్గానీ ఆపలేకపోయారని తెలిపింది. నేపాల్‌లో ఉద్యమకాలంలో జరిగిన హింస తక్కువేమీ కాదు. పార్లమెంటు ఆవరణలో, కోర్టుల్లో గుంపులు జొరబడి విధ్వంసానికి దిగాయి. 65 మంది రాజకీయ నాయకుల, పలు వ్యాపారవేత్తల ఇళ్లు, అన్ని పార్టీల కార్యాలయాలు, జైళ్లు ఉద్యమకారుల ధాటికి దెబ్బతిన్నాయి. అలాంటి సందర్భాల్లో ఏ దేశంలోనైనా భద్రతాదళాలు మౌనంగా ఉండగలవా? అయితే ప్రదర్శకులను చెదరగొట్టే ఉద్దేశంతోకాక వారి ప్రాణాలు తీయ టానికే కాల్పులు జరిపారన్న ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి కారకుల్ని శిక్షించాల్సిందే. కానీ కక్ష తీర్చుకోవటమే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. రిపబ్లిక్ గా ఏర్పడ్డాక నేపాల్‌లో జరిగిన పరిణామాలకు అన్ని పార్టీల నేతలూ బాధ్యులే. రాచరికాన్ని ప్రజలెందుకు తరిమికొట్టారో గ్రహించక ఫిరాయింపులతో ప్రభుత్వాలను పడగొట్టడం, అవినీతికి పాల్పడటం అక్కడి నాయకులకు రివాజయింది. వీటన్నిటినీ చూసి తీవ్రంగా కలతచెందబట్టే జెన్ జీ తరం జూలు విదిల్చింది. అదొక్కటే కారణం కాదు. యువత ఉపాధి లేమితో తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. కొలువులు దొరక్క నైరాశ్యంలో కూరుకుపోతోంది. ఇక ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఆర్థిక వ్యత్యాసాలు సరేసరి. అత్యధిక శాతం యువత పిడికెడు మెతుకుల కోసం భారత్ సహా పలు దేశాలకు వలసపోవటం, ఎంతోకొంత మిగిల్చి కుటుంబాలకు పంపటం మామూలే. అలా పంపుతున్న డబ్బే నేపాల్ జీడీపీలో అధిక శాతం ఆక్రమిస్తోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. తయారీరంగ పరిశ్రమలపైనా, ఇతర ప్రాజెక్టులపైనా దృష్టి కేంద్రీకరిస్తే తమ పిల్లలు ఇక్కడే స్థిరపడటానికి అవకాశం ఉంటుందని అనేకులు ఎదురు చూస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవటానికి బదులు కక్ష రాజకీయాలతోనే పాలనకు శ్రీకారం చుట్టి తాను గత పాలకులకు భిన్నమేమీ కాదని బాలేంద్ర షా నిరూపించారు. తిరుగుబాటు స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది. -
యుద్ధంపై రణభేరి!
రాత్రింబగళ్లు నిప్పులు కురుస్తున్నా భూగోళంపైనున్న జనారణ్యాలన్నీ నిశ్చలన చిత్రాలై నిర్లిప్తంగా ఉండిపోతున్నాయన్న నిరాశ సర్వత్రా ఆవరించిన తరుణంలో అమెరికా వ్యాప్తంగా శనివారం ఒక మానవ మహాసముద్రం పోటెత్తింది. దశాబ్దాలనాటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ర్యాలీలను తలపిస్తూ, అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెలన్న వ్యత్యాసం లేకుండా– అమెరికాలోని అన్ని వర్గాలూ ఏకమై 3,300 నిరసన ప్రదర్శనలు నిర్వహించి ముక్తకంఠంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటా, బయటా తన అరాచకంతో ప్రజాస్వామ్యానికీ, మానవతకూ మహాపచారం చేస్తున్నారని ప్రదర్శకులు మండిపడ్డారంటే ఏడాది పాలనలో వారెంత విసిగిపోయారో అర్థమవుతుంది. ఖర్గ్ ద్వీపాన్ని బుగ్గి చేస్తానని, ఇరాన్ ఇంధన క్షేత్రాలకూ, విద్యుదుత్పాదన ప్లాంట్లకూ నిప్పెడతాననీ ట్రంప్ బెదిరిస్తున్న తరుణంలో ‘నో కింగ్స్’ పేరిట ఇంత పెద్దయెత్తున నిరసనలు ఎగిసిపడటం అసాధారణం. ఉత్తర ధ్రువప్రాంత అలస్కాలో కేవలం 3,000 మంది జనాభా నివసించే కోట్జెబు మొదలుకొని కరేబియన్ ద్వీపంలోని ప్యూర్టోరికో... న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో తదితర మహా నగరాల వరకూ ప్రదర్శకులు భారీయెత్తున పాల్గొనగా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం ‘నో కింగ్స్’ ర్యాలీలు జరిగాయి. ‘నో కింగ్స్’ ఒక్క ట్రంప్ పైన మాత్రమే కాదు... ఆయనకు అపరిమితమైన అధికా రాలు కట్టబెట్టిన, చట్టపరమైన రక్షణలిచ్చిన వ్యవస్థలన్నిటిపైనా మోగించిన రణభేరి. అధికారం అహంకరించినప్పుడూ, న్యాయం సైతం దానితో కుమ్మక్కయినప్పుడూ నడి వీధులే న్యాయస్థానాలవుతాయి. శనివారంనాటి నిరసనల సారాంశం అదే. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై శతాబ్దాల క్రితం పోరాడి నిర్మించుకున్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కలిసి మరో ‘రాజు’ను ప్రతిష్ఠించటానికి పూనుకోవడంపై ‘నో కింగ్స్’ ఒక తిరుగుబాటు. స్వదేశంలో నియంతగా మారిన పాలకుడు ప్రపంచానికి సైతం శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నదని ట్రంప్ పోకడలు చాటుతున్నాయి. నియంతృత్వం రాజ్యమేలేచోట అరాచకాలు పెరిగినప్పుడు మౌనప్రేక్షకులుగా మిగిలే సాధారణ జనంలో సైతం ఆలోచనలు రేకెత్తించడానికీ, కార్యోన్ముఖుల్ని చేయటానికీ ఈ నిరసనలు పుట్టు కొస్తాయి. రిపబ్లికన్ల ఆధిక్యతగల రాష్ట్రాలూ, ‘మాగా’ ఉద్యమ ప్రాబల్యంగల ప్రాంతాలూ సైతం ఈసారి నిరసనలతో హోరెత్తటం గమనించదగ్గది. జనహననం కోసం పశ్చిమాసియాకు ట్రంప్ తరలించిన మెరైన్ల తల్లులు కూడా ఇందులో పాల్గొన్నారు. నెలక్రితంతో పోలిస్తే... వారం రోజులుగా ఇరాన్ ప్రతిదాడుల సంఖ్య తగ్గిందనీ, రోజుకు 30 మించటం లేదనీ అంటున్నారు. కానీ అవి నేరుగా లక్ష్యాన్ని గురి చూస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ప్రత్యర్థి పక్షాలు నిలువరిస్తున్నా అది కిందపడుతూ పదుల బాంబులై పేలటం, జననష్టంతోపాటు ఆస్తి నష్టం తీసుకురావటం కనబడుతూనే ఉంది. ఎదురుదాడుల క్రమంలోనే అంచనాలు పదు నెక్కించుకుని, నిఘా కార్యకలాపాలను సమన్వయపరుచుకుని ఇరాన్ దళాలు వ్యవహ రిస్తున్నాయని ఇది తేటతెల్లం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్‌లో లక్షలాదిమంది పౌరులు ఇప్పటికీ బాంబు షెల్టర్లలో తలదాచుకొనక తప్పని స్థితి ఉంది. ప్రత్యర్థి పక్షాల ప్రాంతాల్లో ఒకసారంటూ అస్థిర పరిస్థితుల్నీ, అభద్రతా భావాన్నీ తీసుకొచ్చాక దాడుల సంఖ్య గణించదగ్గది కాదు. గత జూన్‌లో 12 రోజుల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ విశ్రమించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తోంది. వారి జీవికను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై యుద్ధం ఆపకుండా, హార్మూజ్ జలసంధి మాత్రం ప్రశాంతంగా ఉండాలనీ, ఇంధన రవాణా నిరాటంకంగా జరగాలనీ ట్రంప్ కోరుకోవటం దురాశ. ఇంధన ధరలు మిన్నంటితే తన కొలువుకు ఎసరొస్తుందన్న ఏకైక భయంతోనే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఆయన వేలాదిమంది మెరైన్లను మోహరించారు. అమెరికా ప్రజల అభీష్టమేమిటో తెలిసింది గనుక ఇకనైనా ట్రంప్ తన దుష్ట పోకడలకు స్వస్తి చెప్పాలి. -
తిరోగాముల పురోగమనం
మన దేశానికి గల ఘనతలు ఎన్నైనా చెప్పుకోవచ్చు; సనాతన సంప్రదాయ పరంపరను ఎంతైనా కొనియాడుకోవచ్చు. అలాగని గతవైభవ సంకీర్తనలతోనే కాలం వెళ్లబుచ్చడం ఏమాత్రం వివేకమున్న పని కాదు. వర్తమానంలో చెప్పుకోదగినది ఏదీ లేనప్పుడు; భవితవ్యం అగమ్యగోచర అయోమయంగా మారినప్పుడు బుద్ధి పనిచేయక చాలామంది తమ గత వైభవాన్ని పదే పదే చెప్పుకుంటూ తన్మయంలో మునిగిపోతుంటారు. వర్తమా నంలోని వేగాన్ని అందుకోలేక, భవితవ్యంలోని అభివృద్ధిని అంచనా వేయలేక ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వలపోస్తూ ఉంటారు. ఇలాంటి వారిది తిరుగులేని తిరోగమన ధోరణి.గత వైభవ స్తోత్రాలు వల్లించేవారు దాదాపు అన్ని రంగాల్లోనూ ఉంటారు కాని, పదవులకు శాశ్వతంగా దూరమైన రాజకీయ నాయకుల్లోను; తెరమరుగైపోయిన సినీ ప్రముఖుల్లోను; పాఠకులు పట్టించుకోని రచయితలు, కవులలోను; ఆధ్యాత్మిక ప్రవచన కర్తల్లోను తిరోగమనవాదులు ఎక్కువగా కనిపిస్తారు. బహిరంగ వేదికల మీద మైకులు దొరికితే వీరి వాగ్ధారకు మాత్రమే కాదు, వాగ్దాష్టీకాలకు కూడా అంతు ఉండదు. ఇటీవలి కాలంలో ఇలాంటి వాగ్దాష్టీకాల ఉదంతాలే వార్తలకెక్కుతున్నాయి; ప్రసార మాధ్యమాల కార్యక్రమాల్లో ప్రధాన చర్చాంశాలవుతున్నాయి; సామాజిక మాధ్యమాల్లో రణగొణలవు తున్నాయి.గత వైభవ గాథలను మితిమీరి ఊదరగొడుతుంటే, జనాలకు విసుగు పుడుతుంది. ఒక్కసారి చరిత్రను తరచి చూసుకుంటే, ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ ఎందుకన్నాడో ఎవరికైనా సులువుగానే బోధపడుతుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకోని వర్తమానానికి భవిష్యత్తు ఉండదు. గతంతో పోల్చి చూసు కున్నప్పుడు వర్తమానం సాధించే ఎలాంటి పురోగతినైనా స్వాగతించాల్సిందే! గతంలో జరిగిన పొరపాట్లకు వర్తమానంలో జరిగే ఎలాంటి దిద్దుబాటునైనా హర్షించాల్సిందే! సమీప గతం పట్ల ఎరుక కలిగిన సామాన్య ప్రజానీకం వర్తమానంలో చోటుచేసుకునే ఎలాంటి సానుకూలతనైనా ఆమోదిస్తుంది. కాని, తిరోగాములకు వర్తమాన సానుకూలతలు ఇనుపగుగ్గిళ్లలా మింగుడుపడవు. తమ ఘనతకు ఎక్కడ భంగం వాటిల్లుతుందోననే భయంతో నోటికి పని చెబుతారు. ఏ వేదిక దొరికినా, సమయ సందర్భాలతో, ఉచితానుచితాలతో నిమిత్తం లేకుండా తమ లోలోపలి అక్కసునంతా వెళ్లగక్కుతారు.జనాభాలో తిరోగాములు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్లేమీ కాదు. పురాణకాలంలోని పురాతన రాజ్యాలలోనూ ఇలాంటి కురచబుద్ధుల తిరోగాములు ఉండే వారు. వీళ్లు నిత్యదుఃఖితులు. ఇలాంటి వాళ్ల గురించే ‘ఈర్షా్యళు ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశంకితః/ పరభాగ్యోపజీవీ చ షడతే నిత్యదుఃఖితాః’ అని విదురనీతి చెబుతుంది. ఇతరుల పట్ల ఈర్ష్యపడేవారు; ఇతరులను నిష్కారణంగా అసహ్యించు కునే వారు; నిత్యం అసంతృప్తితో రగిలిపోయేవారు; ఉత్తపుణ్యానికే కోపంతో చిర్రుబుర్రు లాడేవారు; ప్రతి విషయాన్నీ అనుమానించేవారు; ఇతరుల భాగ్యంపై ఆధారపడి జీవించే పరాన్నభుక్కుల వంటివారు నిత్యం దుఃఖంతోనే కొట్టుమిట్టాడుతుంటారు.అంతటితోనే ఆగరు. తమ పరిసరాల్లోని మనుషుల సంతోషాన్ని కూడా హరించేస్తారు. సామాజిక వేదికలను అధిరోహిస్తే, యావత్ సమాజంలోని సుఖశాంతులకే భంగం కలిగిస్తారు. ‘వివేక తిరోగమనే మూర్ఖత్వ పురోగమనం’ అని రష్యన్ రచయిత తామెర్లాన్ కుజ్గోవ్ ఇలాంటి బాపతు తిరోగాముల గురించే వ్యాఖ్యానించాడు. సమాజానికి చేటు కలిగించే తిరోగాములను కనీసం సామాజిక వేదికలకు దూరంగా ఉంచడం మంచిది. లేకుంటే, వాళ్లు మూర్ఖత్వ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తారు. వారి కృషిని సమాజం భరించలేదు. ఇటీవలే ప్రభుత్వ బిరుదాంకితుడైన ఒక ప్రవచనకర్త ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు పోషకాహారంగా గుడ్లు పెట్టడం మీద నోరుపారేసుకుని కలకలం రేపిన ఉదంతం ఈ కృషికి తాజా ఉదాహరణ. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం పురోగామి సమాజం బాధ్యత. -
సూపర్ ‘పవర్‌గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్‌ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్‌పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్‌గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్‌కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్‌ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్‌ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్‌కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్‌ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్‌కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్‌ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్‌కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్‌లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్‌తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్‌తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్‌కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్‌తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్‌లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్‌కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘మాయ’ఫెస్టోలు!
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మానిఫెస్టోలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమసల్యపై వాటి వైఖరిని తేటతెల్లం చేయాలి. ఆ క్రమంలో వాగ్దానాలుంటే ఉండొచ్చు. కానీ చాలా పార్టీలకు గెలుపే లక్ష్యంగా అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయచేసి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరేమీ ఉండటం లేదు. ఈమధ్యే సుప్రీంకోర్టు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి పార్టీలు చేసే వాగ్దానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తాయన్నది. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనంత కాలమూ వాటిలో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయటం ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది. నిజానికి అతిగా వాగ్దానాలు చేయటం ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీయడం కిందికి వస్తుంది. అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మానిఫెస్టో గత రికార్డులను తలదన్నింది. అందులో 2.22 కోట్లమందికి ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంచడం, వ్యవసాయ రుణాల మాఫీ, అన్ని కుటుంబాలకూ ‘కారుణ్య భత్యం’ కింద రూ. 10,000 చొప్పున ఇవ్వటం, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం వగైరాలున్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే రెండు దఫాలుగా 1.31 కోట్లమంది మహిళల ఖాతాల్లోకి రూ. 8,000 చొప్పున బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకొచ్చాక నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.జన సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే వాగ్దానాలకూ, సహేతుకత లేని ఉచితాలకూ వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికల ముందు వాగ్దాన కర్ణులుగా మారడం, తీరా అధికారం రాగానే వాటిని మరిచి, ప్రశ్నించినవారిని బెదిరించటం అలవాటైపోయింది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లుగా బాహాటంగా కనబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. 2011లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా చేసిన వాగ్దానాలు వేలంపాటల్ని తలపించాయి. ఇక 2014లో మరోసారి ఏపీలో చంద్రబాబు మహా వాగ్దాన కర్ణుడి అవతారం ఎత్తారు. ఆ హామీల గురించి అడిగేవారు ఎక్కువవుతుండటంతో అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే మేనిఫెస్టోను కాస్తా పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల గతి ఎలావుందో కనబడుతూనే ఉంది. ఇందుకుభిన్నంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మానిఫెస్టో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు సంగతి అందరికీ గుర్తుండేలా సెక్రటేరియట్లో ప్రముఖంగా కనబడేలా అమర్చారు. ఫలితంగా 99 శాతం హామీలు నెరవేరాయి. సంక్షేమ రాజ్యంలో పేదవర్గాలకు విద్య, వైద్యం, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం రాజ్యం కర్తవ్యం. అందుకే వాటిని నెరవేరుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. వీటితోపాటు ఆ వర్గాలు స్వశక్తిపై ఎదిగేందుకు అనువైన పథకాల రూపకల్పన వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ మానిఫెస్టోలంటే వేలం వెర్రిగా మారింది. కలర్ టీవీలు, గ్రైండర్లు ఇస్తామనటం నుంచి ఏకంగా రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంచిపెడ తామనే వరకూ వచ్చింది. గెలిచి అధికారంలోకొచ్చాక ఇవ్వలేకపోతే లేదా ఏవో సాకులు చూపి కొంతమందికే పరిమితం చేస్తే వీటిని న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న ధైర్యమే పార్టీలకు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే సాహసాన్నిస్తోంది.పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలను నమ్మడం ‘న్యాయబద్ధమైన ఆశ’గా పరిగణించలేమనీ, కనుక వాటిని నెరవేర్చాలని ప్రభుత్వాలను ఆదేశించటం సాధ్యం కాదనీ 1995లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 2013లో తమిళనాడుకు చెందిన పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ వాగ్దానాలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీకి మానిఫెస్టో హామీలను అమలు చేయాలంటూ ఆదేశాలివ్వజాల మని తెలిపింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అటుతర్వాత అవి రూపొందినా రాజకీయ పక్షాలపై వాటి ప్రభావం శూన్యం. కనుక మోసగాళ్లెవరో, నిజాయితీపరులెవరో... ఎవరు జవాబుదారీ తనంతో ఉంటారో గ్రహించటం ప్రజల కర్తవ్యం. -
నిర్లక్ష్యం తెచ్చిన విషాదమిది!
రోడ్డు ప్రమాదాలను నివారిస్తామనీ, సురక్షిత ప్రయాణానికి అనువైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం చెప్పే కబుర్లు ఉత్త గాలి మాటలేనని ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం గ్రామ సమీపంలో గురువారం వేకువజామున 5.40 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో జరిగిన ఈ విషాదంలో 14 మంది చనిపోగా, మరో 20 మంది వరకూ గాయపడ్డారని చెబుతున్నారు. మరికొంతసేపట్లో గమ్యస్థానం చేరతామని ప్రయాణికులు అనుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాల్లో తేలిపోతున్నట్టుగా పరుగులెత్తే ప్రైవేటు బస్సులను పాలకులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఆ వాహనాలకు ఫిట్నెస్ ఉందా? నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న వ్యక్తికి అసలు లైసెన్సుందా? రహదారి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే సంగతులులేవీ వారికి అక్కరలేదు. వాహనం సక్రమంగా లేదని బస్సెక్కినప్పటి నుంచి తాము చెబుతూనే వచ్చామనీ, చివరకు స్టీరింగ్ మొండికేయటంతో ప్రమాదం జరిగిందనీ ప్రయాణికులంటున్న మాట! ఇన్ని వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఏ ఒక్క అధికారి బస్సును గమనించలేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.దాదాపు రెండేళ్లనుంచి హింస, దౌర్జన్యాలు, అక్రమ కేసులు మినహా ఏపీలో మరేదీ సక్రమంగా చేయడం రాని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం ఎంతటిదో ఈ ప్రమాదం తేటతెల్లం చేసింది. ప్రమాదం జరిగాక ఏదోరకంగా బయటపడిన ప్రయాణికులు తేరు కోవటానికే కొంత సమయం పట్టింది. ఆ తర్వాత 108 వాహనానికి డజనుసార్లకు పైగా ఫోన్ చేస్తే గానీ ఎవరి నుంచీ స్పందన లేదు. వేకువజాము వేళకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు వేగంగా వస్తుంటాయి. ఆ సమయంలో భారీ వాహనాలు సైతం అదే రహదారిపై వెళ్లటం ప్రమాదాలకు దారి తీయదా? ముఖ్యంగా క్వారీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలుంటాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉండే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయటం, వేగాన్ని నియంత్రించటం కోసం స్పీడ్గన్ల నిరంతర పర్యవేక్షణ అవసరం. ప్రమాదకరమైన మలుపులున్నచోట చాలా ముందుగానే హెచ్చరిక బోర్డులు అమర్చాలి. ఏవీ సక్రమంగా లేనప్పుడు ఇలాంటి ఉదంతాలను ప్రమాదాలుగా భావించ గలమా? క్వారీ వాహనాలు ట్రాఫిక్ అధికంగా ఉండే సమయంలో జాతీయ రహదార్లపైకి రాకుండా కట్టడి విధించే నిబంధనలున్నాయి. క్వారీలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే పని చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అంత వేకువజామున భారీ లోడ్ వాహనం ఎలా వచ్చింది? అంటే రాత్రంతా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయన్న మాట! స్థానికంగా జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధి కారులంతా ఉంటారు. కానీ ఏం లాభం? జిల్లాల పరిధి పెద్దగా ఉంటే పర్యవేక్షణ కష్ట మవుతుందని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసింది. అయినా ప్రజలకు దిక్కూ మొక్కూ లేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు సిగ్గు పడాలి. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నదో క్షణంలో తెలిసే టెక్నాలజీ వాడుతున్నా నని ఆయన స్వోత్కర్షలకు పోతుంటారు. కానీ ఈ లోటుపాట్ల విషయం మాత్రం ఆయనకు తెలియదు! వైద్యవిద్యలో పేదవర్గాల పిల్లలకు అవకాశాలు రావాలనీ, అదే సమయంలో ప్రజ లకు మెరుగైన, ప్రామాణికమైన వైద్య సదుపాయాలు అందాలనీ భావించి జగన్ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలల్లో మార్కాపురం కాలేజీ కూడా ఒకటి. అందులో ఏడెనిమిది కాలేజీలు ప్రారంభం కాగా, తుది దశలో వున్న వాటిలో మార్కాపురం కాలేజీ కూడా ఉంది. ఈలోగా కూటమి సర్కారు వచ్చిపడి దాన్ని కాస్తా పక్కన పెట్టింది. పర్యవసానంగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు రాలేదు. అది అందుబాటులోకి వచ్చివుంటే బస్సు ప్రమాదం బారినపడిన వారిలో మరికొందరి ప్రాణాలు నిలబడేవి. తమ నిర్వాకంతో బాధిత కుటుంబాలకు చేసిన నష్టంతో పోలిస్తే, ప్రకటించిన పరిహారం రూ. 5 లక్షలు ఏ మూలకు? ప్రభుత్వ చేతగాని తనం, నిర్లక్ష్యం ఇంతమంది మరణానికి దారి తీశాయని బాబు ఇప్పటికైనా గుర్తిస్తారా? -
మహిళల కోటాపై కదలిక
వచ్చే నెలలో జనగణన తొలి దశ ప్రారంభం కాబోతుండగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, అందరూ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలకు సంబంధించిన పనులు ప్రారంభం కావాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ఈ రెండింటికీ 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాస్తవానికి 2023లో మహిళా కోటా బిల్లును ఆమోదించినప్పుడు ఆ మరుసటి సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలకే దాన్ని వర్తింపజేయాలని విపక్షాలు కోరాయి. కానీ 2026 జనగణనకు ముందుగా ఇది సాధ్యంకాదని అప్పట్లో కేంద్రం చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజనకూ దీన్నే కారణంగా చూపింది. ఈ హఠాత్ పునరా లోచనకు గల కారణమేమిటో కేంద్రం వివరించలేదు. అలాగే మహిళల కోటా నిర్ణయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్నది కూడా చెప్పలేదు. వీటికి సంబంధించిన విధి విధానాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియపై రాజకీయ పక్షాల మధ్య స్పర్థలున్నా మహిళల కోటా విషయంలో అన్ని పక్షాలూ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. అయినా ఆ చట్టం అమలు వాయిదా పడింది.కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ, మనకన్నా వెనకబడివున్న దేశాలూ కూడా మహిళలకు దశాబ్దాల క్రితమే చట్టసభల్లో కోటా ఇచ్చి గౌరవించాయి. రువాండాలో రాజ్యాంగం ప్రకారం 30 శాతం కాగా, ఆచరణలో దాదాపు 64 శాతం మంది మహిళలున్నారు. క్యూబాలో 55.7 శాతం, ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, బొలివియా, మెక్సికోల్లో 50 శాతంవరకూ రిజర్వేషన్లున్నాయి. నేపాల్‌లో 33 శాతం కోటా అమలవుతోంది. మన ఎంపీల్లో మహిళలు 14 శాతం మించిలేరు. ఈ గణాంకాలు గమనిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఈ ఏడాది జనగణన ప్రక్రియ మొదలైనా, తుది గణాంకాలకు ఏడాది పడుతుంది. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్నా జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు కోటా దక్కలేదు. ఇంకా ఆలస్యం చేయొద్దనుకోవటం మంచి నిర్ణయమే. అయితే నియోజకవర్గాల పునర్విభజన వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయించటమే ఇందుకు కారణం. 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవటంవల్ల లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ 816కు ఎగబాకుతాయనీ, ఇందులో 273 స్థానాలు మహిళలకు లభిస్తాయనీ ఒక అంచనా. 2029 సార్వత్రిక ఎన్నికలకు దీన్ని వర్తింపజేస్తారు. తెలంగాణలో ఇప్పుడున్న 17 ఎంపీ స్థానాలు 26కు... 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగు తాయంటున్నారు. ఏపీకి ఇప్పుడున్న 25 ఎంపీ స్థానాలు దాదాపు 38కి, ప్రస్తుత 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరుతాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన మహిళలు చదువుల్లో, వృత్తి ఉద్యోగాల్లో ముందుండటం, కుటుంబ నియంత్రణ వంటి కారణాలవల్ల జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్‌కన్నా కొంత ఎక్కువ కాగా... ఆరు దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు అధికం. జనాభా ప్రాతిపదిక కాక, రాష్ట్రాల్లోని స్థానాలపై కొంత శాతం అధికంగా సీట్లిచ్చే విధానం ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సూచిస్తున్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ అధికరణానికి ఇది విరుద్ధం. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. కానీ జనాభారీత్యా యూపీ ఓటరు ఓటుకుండే విలువకన్నా తమిళనాడు లేదా కేరళ ఓటరు విలువ ఎక్కువుంది. ఈ వ్యత్యాసం కొనసాగనీయటం సమర్థనీయ మేనా అన్న సందేహం తలెత్తుతుంది.ప్రతి జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా, ఇందులో ఇమిడివున్న సమస్యలను పసిగట్టి గత పాలకులందరూ వాయిదాల్లో గడిపారు. 2000 సంవత్సరం వరకూ స్తంభింపజేస్తూ 1976లో... దాన్ని 2026 వరకూ పొడిగిస్తూ 2001లో రాజ్యాంగ సవరణలు తెచ్చారు. మొత్తానికి ఈ భారం ప్రస్తుత పాలకులపై పడింది. ఎవరికీ అన్యాయం జరగకుండా, ఉత్తర–దక్షిణాల వ్యత్యాసం రాకుండా సమస్యను పరిష్కరించగలిగితే దేశ సమైక్యతకు అది దోహదపడుతుంది. -
సంక్షోభ సమయం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగానే ఉండబోతున్నదనీ, అది దీర్ఘకాలం కొనసాగుతుందనీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సంకేతాలు సహజంగానే అందరినీ కలవరపెడతాయి. ఆయన సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఆరేళ్ల క్రితం కోవిడ్ రోజుల నాటి పరిస్థితులతో వర్తమాన స్థితిని పోల్చారంటే దేశం మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 23 రోజుల క్రితం ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటన తర్వాత ఆగిన సంకేతాలు కనబడినా, యుద్ధ విరమణ ఉండబోదన్న ఇజ్రాయెల్ తీరు చూస్తే అందరిలోనూ సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు... అటు ఇరాన్ సైతం అమెరికాతో చర్చించలేదని చెబుతోంది. చివరకు అదేమవుతుందన్న సంగతలా ఉంచితే, ఇప్పటికే ప్రపంచంతోపాటు మనమూ సంక్షోభంలో చిక్కుకుపోయామని తెలుస్తూనే ఉంది. క్షణక్షణం మాట మార్చే ట్రంప్‌ను ఇరాన్‌తోపాటు ప్రపంచ ప్రజానీకం కూడా పెద్దగా విశ్వసించలేదుగానీ... స్టాక్ మార్కెట్లు మాత్రం నమ్మదల్చుకున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. మార్కెట్లన్నీ మంగళవారం ఉత్సాహంతో ఉరకలెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కానీ ఈ ధోరణి దీర్ఘకాలం కొనసాగటం అనుమానమే. యుద్ధంపై కేంద్రం నుంచి వెలువడిన ఈ తొలి ప్రకటన సాధారణ జనంలో కొద్ది రోజులుగా ఉన్న భయాందోళనలు నిర్హేతుకం కాదని సూచిస్తోంది. ఆర్థిక, జాతీయ భద్రతా రంగాలతోపాటు మానవతారంగంలోనూ పెను సవాళ్లను ఎదుర్కొనబోతున్నామని ప్రధాని చెబుతున్నారు. మన ఆర్థిక ప్రగతికి ప్రధానంగా తోడ్పడే చమురు, సహజవాయువుల్లో సింహభాగం పశ్చిమాసియా నుంచే రావాలి. ఆ ప్రాంతం మామూలు స్థితికి చేరేదాకా ఆ రెండు దిగుమతులపైనా అనిశ్చితి కొనసాగుతుంది. గల్ఫ్ దేశాల్లో భిన్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కోటిమంది భారతీయుల్లో 3 లక్షల మంది ఇప్పటికే వెనక్కొచ్చారు. ఇరాన్ ప్రతిదాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవటం వల్ల అవి గడ్డు పరిస్థితుల్లో పడ్డాయి. జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. తమ గ్యాస్ ఉత్పాదక క్షేత్రాన్ని చక్కదిద్దటానికి చాలా ఏళ్లు పట్టవచ్చని ఖతార్ అంటున్నది. కనుక గల్ఫ్‌లో ఉపాధి కల్పన మళ్లీ పట్టాలెక్కడం అంత సులభం కాదు. గల్ఫ్ సంక్షోభంతో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన స్థాయిలో ఎరువులు అందుతాయా అన్న సందేహాలున్నాయి. సాగుకు లోటురానీయబోమని మోదీ హామీ ఇవ్వడం అందుకే. ఆయన చెబుతున్న ప్రకారం కొన్ని శక్తులు ఈ సంక్షోభాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయి. అది ఆంతరంగిక భద్రతపై ప్రభావం చూపుతుంది. దేశం ఐక్యంగా ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు. సాధారణ సమయాల్లో పెద్దగా చర్చకు రాని విదేశాంగ విధానం సంక్షోభ కాలంలో ముందుకొస్తుంది. మనది మోదీ వ్యక్తిగత విధానంగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తమ కాలంలో ఎప్పుడూ ఇలా లేదని కూడా చెబుతున్నారు. కానీ నాటి ద్విధ్రువ ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అప్పుడు అలీన విధానం అని చెప్పుకున్నామేగానీ సోవియెట్‌కు సన్నిహితంగా మెలిగాం. అప్పట్లో అమెరికాపై దూకుడు ప్రదర్శించటం అందులో భాగమే. నిజంగా తటస్థంగా ఉన్నట్టయితే హంగేరీ (1956), జెకొస్లోవేకియా(1968), అఫ్గాన్(1979)లపై సోవియెట్ దురాక్రమణకు దిగినప్పుడు ఖండించి ఉండేవాళ్లం. మారిన పరిస్థితుల్లో భిన్న దేశాలపై వేర్వేరు అంశాల్లో ఆధారపడి ఉన్నామన్నది కాదనలేని సత్యం. నిజానికి అన్ని దేశాల పరిస్థితీ అదే. చైనా, రష్యాలు ఇరాన్‌కు గట్టి మద్దతుదార్లుగా నిలిచినా ఆపత్సమయంలో అవి తటస్థంగానే ఉండిపోక తప్పలేదు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయటాన్ని చూపి, కనీసం రష్యా ఇరాన్‌కు నిఘా సమాచారాన్ని ఇచ్చింది. పరిస్థితులు మున్ముందు మరింత సంక్లిష్టంగా మారినా మారొచ్చు. ఈలోగా మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే మెరుగైన విదేశాంగ విధానం రూపుదిద్దుకుంటే మంచిది. -
ట్రంప్‌కు జ్ఞానోదయం!
‘నీ గురించి నీకు తెలిసి, శత్రువు గురించి కూడా తెలిస్తే వంద యుద్ధాల్లోనైనా ఓటమి ఉండదు. నీ గురించి నీకు తెలిసినా, శత్రువు గురించి తెలియకపోతే మాత్రం ప్రతి విజయం తర్వాతా ఒక ఓటమి తప్పదు’ అంటాడు పురాతన చైనా యుద్ధరంగ నిపుణుడు సన్–జూ. శత్రువు గురించి తెలియటం సంగతలా ఉంచి తన గురించి తనకే తెలియని అయోమయంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గెలుపు రమ్మంటే ఎలా వస్తుంది? ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సాగుతున్న చర్చలు ఫలప్రదమయ్యే దశకు చేరాయని ఒమన్‌తో పాటు సాక్షాత్తూ అమెరికా ప్రతినిధి బృందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే గత నెల 28న ఉన్నట్టుండి ఇరాన్‌పై యుద్ధ ప్రకటన చేసిన దుస్సాహసి ట్రంప్. తీరా ఇరాన్‌తో రెండురోజులుగా చర్చలు సాగుతున్నాయని, అందు వల్ల యుద్ధానికి అయిదు రోజుల విరామం ఇవ్వదల్చుకున్నామని సోమవారం ఆయన ప్రకటించారు. హార్మూజ్ దిగ్బంధాన్ని 48 గంటల్లో ముగించకపోతే ఇరాన్ మౌలిక సదుపాయ వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తామని శనివారం ప్రకటించిన ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకోవటం ఆశ్చర్యకర పరిణామం.ఇరాన్ మతాచార్యుడు అలీ ఖమేనీని హతమార్చటంతో మొదలుపెట్టి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గత 23 రోజులుగా నరమేధానికి పాల్పడ్డాయి. అన్నిటికన్నా అత్యంత ఘోరమైన ఉదంతం– పసిపిల్లలు చదువుకుంటున్న బడిపై క్షిపణి దాడి చేసి 170 మంది ప్రాణాలు తీయడం. ఇక్కడితో ఆగలేదు. ఆ రెండు దేశాలూ క్షిపణులతో పెనువిధ్వంసాన్ని సృష్టించాయి. కొన్ని లక్షల జనావాసాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ త్వరలోనే దాసోహం అంటుందని యుద్ధభేరి మోగించే ముందు అవి అంచనా వేసుకున్నాయి. అసలు ఇరాన్ అమ్ములపొదిలో ఆయుధాలేమిటన్న విషయంలోనే వాటికి స్పష్టత లేదు. అది అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకెళ్తున్నదని చెప్పిన కారణం బూటకం. అదే నిజమైతే, అసలు దాని జోలికెళ్లడానికే వణికేవారు. ఉత్తర కొరియాను ఏం చేయగలుగుతున్నారు? అసలు ఇరాన్ దగ్గర 4,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులున్నాయన్న సంగతి అది గురిచూసి కొట్టేదాకా తెలియదు. పశ్చిమాసియా కొరివితో తలగోక్కోవటం ట్రంప్‌తోనే మొదలు కాలేదు. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహమ్మద్ మొసాదిఘా ప్రభుత్వాన్ని బ్రిటన్‌తో కుట్రపన్ని పడగొట్టిన ఘనుడు నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్. ఆ దురంతం తర్వాత ఇరాన్ ప్రజలతో అమెరికాకు సత్సంబంధాలు లేవు. మొసదిఘా స్థానంలో వచ్చిన మహమ్మద్ రెజా షా పహ్లావి 25 ఏళ్ల పాటు ఇరాన్ సంపద దోచిపెట్టగా 1979లో ఆ నియంతను జనం తరిమికొట్టారు. నాటి అమెరికా అధినేత జిమ్మి కార్టర్ తమవారిని చెర నుంచి విడిపించటానికి చేసిన యత్నం బెడిసికొట్టింది. ఇక ఇరాక్‌లో 2003లో జార్జి బుష్... 2011లో లిబియా, సిరియాల్లో ఒబామా తలలు బొప్పికట్టించుకున్నారు. పశ్చిమాసియాలో ఏకైక పెత్తందారుగా ఆవిర్భవించాలన్న ఇజ్రాయెల్ కల చాలా పాతది. గత అధ్యక్షులంతా దీన్ని తోసిపుచ్చగా తొలిసారి ట్రంప్ తన సలహాదారుల మాటనూ, నిఘా వర్గాల హెచ్చరికలనూ బేఖాతరుచేసి ఈ దుస్సాహసానికి దిగారు. పర్యవసానంగా అమెరికా కల్పిస్తామంటున్న భద్రత ఉత్త డొల్ల అని గల్ఫ్ దేశాలు గ్రహించాయి. చరిత్రలో ట్రంప్‌కు సాటిరాగల ఒకే ఒకడు నెపోలియన్ బోనపార్టే. యూరొప్ను జయించి, రష్యాను సైతం దురాక్రమించాలని 1812లో వెళ్లిన నెపోలియన్ అక్కడి భౌగోళిక స్థితిగతులపై అంచనా లేక ఏకంగా 6 లక్షలమంది సైన్యాన్ని కోల్పోయాడు. అతడి పతనానికి అదే నాంది. ఇంతకూ తాజా ప్రకటనకైనా ట్రంప్ కట్టుబడతారా లేదా అన్నది చెప్పలేం. ఇరాన్ మాత్రం ససేమిరా అంటున్నది. అక్కడ నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తుడిచి పెట్టడంవల్ల ఈ దుఃస్థితి ఏర్పడింది. అయినా ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు దిగడానికి ఇరాన్ సిద్ధపడాలి. ఆ దిశగా మధ్యవర్తులు ప్రయత్నించాలి. అటు ట్రంప్ భేషజాలు కట్టిపెట్టాలి. ఇరాన్ దాడుల్లో నష్టపోయిన గల్ఫ్ దేశాలకు నష్టపరిహారం చెల్లించటంతో పాటు, ఇరాన్‌కు కలిగిన నష్టాన్ని కూడా భర్తీ చేస్తేనే ఆ దేశాన్ని ఒప్పించటం సాధ్యమని గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన తెలివి తెచ్చుకోవాలి.


