స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో ప్రకంపనలు సృష్టించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డజను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4న మొదలైంది. వచ్చే నెల 4తో ముగిసే ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్‌ఓ) పాత్ర కీలకమైనది. ఓటర్ల ఇళ్లకు పోయి ఓటర్ నమోదు పత్రాలు అందించటం, వెనక్కి తీసుకోవటం, అవసరమైన పత్రాలు జతచేశారో లేదో చూడటం వారి బాధ్యత. ఫలానా వ్యక్తి అర్హుడైన ఓటరో కాదో ప్రాథమికంగా తేల్చేది వీరే. అదే వారి చావుకొస్తోంది.
బిహార్‌కు భిన్నంగా ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాలు, బలవన్మరణాలు, అస్వస్థులు కావటం, భయాందోళనలతో అప్పగించిన పని వదిలి అదృశ్యం కావటం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లో బీఎల్‌ఓలకు ఈ స్థాయిలో సమస్యలున్న దాఖలా లేదు. నిజానికి అక్కడ బీఎల్‌ఓలతోనే ఓటర్లకు సమస్యలెదురైన ఉదంతాలున్నాయి. బీఎల్‌ఓలకు వెరిఫికేషన్‌లో సహకరించేందుకు పార్టీలు తమ కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్‌ఏ)గా నియమించుకునేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) అవకాశమిచ్చింది. సహజంగానే వారు పరిష్కారంలో కాక సమస్యలో భాగమవుతున్నారు. ఓటర్ల ఎదుటే బీఎల్‌ఓలతో వాదులాటలకు దిగటం, బెదిరించటం చాలాచోట్ల కనబడే దృశ్యాలు.
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ తదితర చోట్ల బీఎల్‌ఓలు ‘సర్’ ప్రక్రియలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేతికి ఎముక లేకుండా భారీ వాగ్దానాలు చేయటం, అధికారం వచ్చాక ఎగనామం పెట్టడం మన దేశంలో దశాబ్దాలుగా సాగిపోతున్న ఒక దుస్సంప్రదాయం. ఈ విషయంలో న్యాయ స్థానాలకెళ్లినా ఫలితం ఉండదు. కడుపు మండి నిలదీస్తే జైలుపాలు చేయటం, కార్య కర్తలను పంపించి దౌర్జన్యం చేయించటం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది.
ఇంత జరుగుతున్నా, ఈవీఎంలు ఏమార్చి ఓట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నా, ఎన్నికల సంఘం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అయినా ఎన్నికల వ్యవస్థపై ఉండే అచంచల విశ్వాసమే ప్రజాస్వామ్యాన్ని ఈమాత్రంగానైనా బతికిస్తోంది. ఓటు పోతే జీవచ్ఛవంతో సమానమన్న అభిప్రాయం జనంలో ప్రబలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలపాలన్నా, ఆగ్రహావేశాలు వ్యక్తంచేయాలన్నా సామాన్యు లకు ఓటును మించిన ఆయుధం మరేదీ లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.
బీఎల్‌ఓలు ఒత్తిడికి లోనవటం వెనక ఇతరేతర సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో ఓటేసే రోజునే తమ ఓటు గల్లంతైందని తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటరు తన వివరాలతోపాటు అవసరమైన పత్రాలన్నీ అందజేసిన క్షణానే అది చూచాయగా తెలిసి పోతుంది. నెల రోజుల తర్వాత పేరుందో లేదో రూఢి అవుతుంది. లేకపోవటానికి గల కారణమేమిటో అందులో ప్రస్తావిస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేడనో, మరణించా డనో, తగిన పత్రాలు అందించలేదనో వెల్లడిస్తారు.
దానిపై మళ్లీ పంచాయతీ. నమోదు సమయంలో బీఎల్‌ఏల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకపక్క, వాటిని తట్టుకోలేక ఏదైనా చేస్తే ప్రభుత్వం నుంచి చర్యలు మరోపక్క వారిని బాధిస్తున్నాయి. బీఎల్‌ఓల్లో 90 శాతం టీచర్లే. గుజరాత్ వంటిచోట్ల సాయంత్రం వరకూ విద్యాబోధనలోనూ, అటుతర్వాత రాత్రి 9వరకూ ఫీల్డ్‌లోనూ తలమునకలు కావాలి. మళ్లీ ఇంటికొచ్చి సేకరించిన పత్రాలన్నీ డిజిటల్ ఫామ్‌లోకి మార్చి పంపాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాకపోతే పై అధికారుల హెచ్చరికలు. సారాంశంలో ఓటర్ మొదలుకొని అందరికందరూ పెత్తనం చలాయించే వారే. ఈసీకి ఇవి పట్టవు. ‘సబ్ ఠీక్ హై’ అంటోంది.
గౌరవ ప్రదమైన జీవితం వెళ్లదీయదల్చుకున్నవారు ఉద్యోగాలు చేస్తారు. అందుకు జీతంతోపాటు గౌరవ మర్యాదలూ ఆశిస్తారు. కానీ అదనపు భారాలు మోపి, వెట్టి కార్మికుల కన్నా హీనంగా చూస్తూ, బెదిరింపులకు దిగటం వల్ల వారు సమాజంలో ఆత్మ గౌరవంతో బతకగలుగుతారా? పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారా? గర్భిణులనూ, 45 ఏళ్లు దాటినవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గుజరాత్‌లో ఒక ఉపాధ్యాయ సంఘం కోరినా ఫలితం లేకపోయిందట! ఈ ధోరణి సరికాదు. దీన్ని వెంటనే చక్కదిద్దటం ఈసీ, కేంద్రం బాధ్యత.


