ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఒకటి. రవితేజ హీరోగా నటించాడు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేశారు. వీళ్లలో డింపుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. చాన్నాళ్లుగా సినిమాలైతే చేస్తోంది గానీ సరైన బ్రేక్ రావట్లేదు. ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావుతో బంధుత్వం గురించి బయటపెట్టింది.
దాసరి నారాయణరావు గారు నాకు తాత అవుతారు. మా తాతకు ఆయన కజిన్. అయితే ఈ విషయం చాలామందికి తెలీదు. ఇన్నాళ్లు ఎందుకనో పెద్దగా చెప్పుకోలేదు. మా నానమ్మ పేరు ప్రభ. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తోనూ అప్పట్లో 'దానవీర శూరకర్ణ'లో నటించారు. అలానే మా అమ్మ, వాళ్ల అక్కచెల్లెళ్లు అందరూ నటులే. తెలుగుతో పాటు మలయాళంలోనూ మూవీస్ చేశారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ పెద్దమ్మ ఆ మాట అన్నారనే రేవంత్‌రెడ్డి కక్ష.. హరీశ్‌రావు సంచలన కామెంట్)
నానమ్మ ప్రభ.. 'కిక్' సినిమాలో రవితేజకు తల్లి పాత్ర చేసింది. ఆ టైంలోనే నా ఫొటోని దర్శకుడు సురేందర్ రెడ్డికి చూపించడంతో ఇలియానా చెల్లి పాత్ర కోసం అడిగారు. అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. ఇప్పుడే యాక్టింగ్ ఎందుకు? అని ఇంట్లో వాళ్ల వద్దనేశారు. తర్వాత చాలా బాధపడ్డారు. రవితేజతో 'ఖిలాడి' చేస్తున్నప్పుడు ఆయనకు కూడా ఈ విషయం చెప్పాను అని డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది.
విజయవాడకు చెందిన ఈమె హైదరాబాద్‌లో పెరిగింది. 'గల్ఫ్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత పలు మూవీస్, స్పెషల్ సాంగ్స్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఈమె నానమ్మ ప్రభ విషయానికొస్తే.. అప్పట్లో తెలుగులో భూమి కోసం, దానవీర శూరకర్ణ, జగన్మోహిని, లక్ష‍్మీ కళ్యాణం, కిక్ తదితర మూవీస్ చేశారు. రాఘవేంద్ర, రెబల్ చిత్రాల్లో ప్రభాస్ తల్లిగానూ ప్రభ నటించారు. అయితే ప్రభ, దాసరి నారాయణరావులతో బంధుత్వం ఉందని డింపుల్ ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది.


