అలప్పుజ: కేరళ వైద్య విభాగంలో ఘోర నిర్లక్ష్యం వెలుగు చూసింది. అలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పున్నప్ర ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల ఉష జోసెఫ్‌కుట్టి, ఐదేళ్ల క్రితం గర్భాశయ తొలగింపు (హిస్టెరెక్టమీ) శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే అప్పటి నుండి ఆమె నిరంతరం కడుపునొప్పి, మూత్రంలో రక్తం పడటం లాంటి సమస్యలతో అవస్థలు పడుతూ వస్తున్నారు. పలు ఆస్పత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. అయితే ఇటీవల ఓ యూరాలజిస్ట్ సలహా మేరకు తీయించిన ఎక్స్-రేలో అసలు విషయం బయటపడింది.
గతంలో శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్యులు పొరపాటున ఆమె కడుపులోనే పొడవైన ‘మెట్జెన్‌బామ్’ సర్జికల్ కత్తెరను వదిలేసినట్లు నిర్ధారణ అయింది. 2021 మే 10న జరిగిన ఆ సర్జరీ తర్వాత బాధితురాలు ఉష అనుభవించిన నొప్పి వర్ణనాతీతం. ఎక్స్-రేలో కత్తెర కనిపించిన విషయం తెలిశాక ఆమె గురువారం ఉదయం తిరిగి అదే మెడికల్ కాలేజీకి వెళ్లారు. అయితే, అక్కడ ఉన్న కొంతమంది వైద్యులు ఈ విషయాన్ని బయటపెట్టవద్దంటూ తమపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న ఉష కుటుంబం, ఈ ఉదంతంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తనకు ప్రాణహాని తలపెట్టిన ఆ ఆసుపత్రికి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని, అక్కడ సర్జరీ చేయించుకోవడానికి తనకు భయంగా ఉందని ఉష కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, బాధితురాలికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మెరుగైన చికిత్స కోసం ఆమెను కొచ్చిలోని అమృత ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పున్నప్ర సౌత్ గ్రామ పంచాయితీ వైస్ ప్రెసిడెంట్ కేఎఫ్ టోబియాస్ మీడియాతో మాట్లాడుతూ బాధిత నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక సామాన్య మహిళ ఐదేళ్ల పాటు ప్రాణాపాయ స్థితిలో గడపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. హరికుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ ఘటనపై తమకు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయితే అంతర్గత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి: జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు!


