65 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్న బామ్మ.. కారణం తెలిస్తే! | Why this woman started driving an auto rickshaw at 65 | Sakshi
Sakshi News home page

65 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్న బామ్మ.. కారణం తెలిస్తే!

Feb 17 2026 4:09 PM | Updated on Feb 17 2026 4:30 PM

Why this woman started driving an auto rickshaw at 65

వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడం అంటే..రెస్ట్‌ తీసుకునే వయసు అనే భావిస్తారు చాలామంది. ఆ వయసుకి అన్ని బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి..ఏదో ఒక కాలక్షేపంతో కాలన్ని గడిపేయడం అనుకుంటుంటారు చాలామంది పెద్దలు. కానీ ఈ మహిళ అందుకు విభిన్నం. పైగా స్వార్జితంలో ఉన్న ఆనందం, సంతృప్తి వేరు అని చెబుతోంది. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఒరిగేది ఏముండదని కొట్టిపారేస్తోంది. గ్రామీణ భారతదేశంలో వృద్ధ మహిళల ఆలోచనలకు, భావాలకు విరుద్ధంగా బతికి చూపించటమే కాదు..'సాధికారత'కు అసలైన అర్థం చెప్పింది ఈ బామ్మ. ఎవరామె అంటే..

ఆ బామ్మే..మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల మంగళ ఆజీ. రెస్ట్‌ తీసుకునే వయసులో చీరకట్టులో డ్రైవింగ్‌ చేస్తోంది. చక్కగా ఆటో వేసుకుని రైడ్‌లకు వెళ్తోంది ఈ బామ్మ. ప్రయాణికులను గమ్యస్థానాల్లో దింపుతూ..ఆదాయం గడిస్తోంది. అది కూడా చక్కగా గ్రామీణ నేపథ్యానికి చెందిన మహిళ కట్టుతీరుతో ఏ మాత్రం భయపడకుండా మహారాష్ట్రలోని రద్దీగా ఉండే రోడ్లపై రెయ్‌..రెయ్‌..మని ఆటో నడిపిస్తుండటం విశేషం. నిజానికి ఆమె నిశబ్ద ధైర్యానికి చిహ్నంగా మారింది. 

ఈ వయసులో అంత అవసరం ఏంటీ అంటే..
ఆమె చిన్నతనంలోనే వితంతువుగా మారి నలుగురి పిల్లలను ఒంటిరిగా పెంచి పెద్ద చేసింది. వారికి మంచి చదువులు చెప్పించి, తమ కాళ్లపై నిలబడే వరకు కూలి పనులు చేస్తుండేది. ప్రస్తుతం కొడుకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) డ్రైవర్‌గా పనిచేస్తుండగా, కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసింది. ఏళ్ల తరబడి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడింది. కానీ ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే..ఈ బామ్మ మంగళ ఏమంటుందో తెలిస్తే..విస్తుపోతారు. బామ్మకు షుగర్‌ కూడా ఉంది. 

అయినా సరే తన పిల్లలపై ఆర్థిక భారం పడటం ఇష్టం లేదని, తన సొంత వైద్య ఖర్చుల కోసం కష్టపడుతున్నట్లు తెలిపింది. ఇలా ఆటో డ్రైవర్‌గా ఎంతో కొంత ఆర్జించి.. తన ఖర్చులకు అలాగే తన కొడుకు కుటుంబానికి ఎంతో కొంత చేదోడువాదోడుగా ఉంటుందని చెబుతుంది.అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొంటే ఏం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోంది . 

ఎలా ఆటో నడపడం నేర్చుకుందంటే..
కొడుకు మార్గదర్శకంలో కేవలం 15 రోజుల్లో ఆటోనడపడం నేర్చేసుకుందట ఆమె. తొమ్మిదేళ్లుగా ఆటో నడుపుతు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారామె. మహారాష్ట్రలోని కరాడ్‌-ఉండేల్‌ మార్గం గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతానని చెబుతోంది ఈ బామ్మ. తనకు డ్రైవింగ్‌ అస్సలు భయం కలిగించదని, పైగా ఇతర డ్రైవర్లు తనను చాలా అర్థం చేసుకుంటారని ధీమాగా చెబుతోందామె. 

అంతేగాదు వాళ్లు ముందు ఆజీని వెళ్లనివ్వండి అని పక్కకు తొలిగి మరి దారిచ్చేస్తారని సంతోషంగా చెబుతోంది. అలాగే తన ఆటోడ్రైవర్‌ జర్నీలో సవాళ్లు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ వయసులో డ్రైవింగ్‌ చేయడం చూసి..రవాణ అధికారులు పూర్తిగా లైసెన్సింగ్‌ నిబంధనలను పాటిస్తేనే లైసెన్స్‌ మంజూరు చేస్తామని కరాఖండీగా చెప్పినట్లు తెలిపింది. తాను ఆ అధికారిక ప్రక్రియని పూర్తిచేసి మరి లైసెన్స్‌ పొందానంటోంది బామ్మ. 

సాధికారతే గౌరవం, ఆత్మగౌరవం అని మంగళ బామ్మ కథ చెబుతోంది. తరతరాల అంతరాన్ని చేధించి..వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో సైతం సామాజిక ప్రజా జీవితంలో చురుకుగా ఉండొచ్చని చెప్పింది. అనారోగ్యం అంటూ మూలన కూర్చోవడం కంటే..ఇలా ప్రజల్లో తిరిగితేనే ఇంకా ఉషారుగా ఆయురారోగ్యాలతో ఉండొచ్చని మంగళ బామ్మ కథ చెప్పకనే చెబుతోంది కదూ..! అంతేగాదు ఈ బామ్మ ధైర్యం..తన రైడ్‌ని బుక్‌చేసుకున్న ప్రయాణికులను ప్రేరేపించడమే గాక వారిలో స్థైర్యాన్ని నింపుతోంది కూడా. 

 

(చదవండి: ప్రెండ్స్‌..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement