సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యులర్ విడుదల చేసింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యుల అర్హతలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది.
ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదు అని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు. మున్సిపల్ ఎన్నికల అమలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపిణీ చేసింది.
అలాగే, మేయర్-చైర్మెన్ ఎన్నికపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎం యాక్ట్-2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి Form-II నోటీసు కలెక్టర్లు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 16వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. మున్నిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈనెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాల్టీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్.. కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దాదాపు 40 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ పెరిగింది. దీంతో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 16న ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందచేయాలని తెలిపింది. ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. డిక్లరేషన్ నమూనాను ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ పంపించింది.
బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని.. ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేట్, టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఎస్‌ఈసీ తెలిపింది.
మరోవైపు.. ఎన్నికల్లో విజేతలను ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. పలు చోట్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నారు.


