సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. మొత్తం 7 కార్పొరేషన్‌లలో రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో పూర్తి మెజార్టీతో ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ దక్కించుకోగా.. కొత్తగూడెం, నిజామాబాద్ పరిస్థితి ఉత్కంఠగా మారింది.
కొత్తగూడెంలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. 60 స్థానాలకు గాను కాంగ్రెస్ -22, బీఆర్ఎస్ -8, బీజేపీ -1, ఇతరులు -29 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. మరోవైపు.. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ ప్లాన్ మార్చింది. సీపీఐకి బీఆర్‌ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌తో సీపీఐ కలిసి వెళ్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇక, నిజామాబాద్ కార్పొరేషన్‌లో హంగ్ రావడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిజామాబాద్‌లో మొత్తం డివిజన్లు 60 ఉండగా.. బీజేపీ-28, కాంగ్రెస్-18, ఎంఐఎం-13, బీఆర్‌ఎస్-1 స్థానాలను దక్కించుకున్నాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొలిటికల్ సస్పెన్స్ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారింది. అయితే, ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఎంఐఎం కీలకం కావడంతో మేయర్‌గా ఆ పార్టీ మెంబర్ ఉంటారా? లేక కాంగ్రెస్ నుంచి ఎన్నుకుంటారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంటుంది.
అటు మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 60 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ -29, బీఆర్ఎస్ -15, బీజేపీ -7, ఇతరులు - 8 స్థానాల్లో విజయం సాధించారు. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు దక్కలేదు. అయితే, ఇండిపెండెంట్లు అధికార కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండటంతో మేయర్ పీఠం హస్తం పార్టీకే దక్కే చాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 66 స్థానాలకు గాను 30 సీట్లలో సొంతంగా విజయం సాధించింది. ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే మరో నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్‌బీ కార్పోరేటర్ బీజేపీలో చేరిపోయారు. దీంతో, బీజేపీ బలం 34కు చేరుకుంది. ఈరోజు లేదా రేపు మరో ఐదుగురు కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. హాంగ్ ఏర్పడ్డ 37 మున్సిపాలిటీలు , మూడు కార్పోరేషన్‌లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈనెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో ఓట్ షేర్‌పై సూచనలు చేయనున్నారు.


