సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పుర పోరు ఫలితాలతో జోష్‌లో ఉన్న అధికార కాంగ్రెస్.. మహా నగరంలోనూ వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఇదే ఊపుతో విజయం సాధించవచ్చనే ఆలోచన చేస్తున్నట్లు నగర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలనుకున్నా కనీసం ఐదారు నెలలు ఆగక తప్పని పరిస్థితులున్నాయి. అందుకు తగిన కారణాలున్నాయి. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగియగానే, కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడటంతో అవి కుదురుకునేందుకు ఆర్నెల్లు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎంత త్వరపడినా కనీసం మే నెల వరకైతే ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి.
మే ఆఖరు దాకా..
కాంగ్రెస్ ఎంత తొందర పడినా.. ఎన్నికల నిర్వహణకు ముందు ప్రీ–ఎలక్షన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు దాదాపు మూడు నెలలు పట్టనుంది. మహా నగరంలోని 300 వార్డులు మూడు కార్పొరేషన్లుగా మారడంతో.. తిరిగి వార్డు నంబర్లు మారనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వార్డుల వారీగా జనాభా, రిజర్వేషన్లు, తాజా ఓటరు జాబితా తదితర పనులు చేయాల్సి ఉంది. కొన్ని వార్డుల సరిహద్దులకు సంబంధించి మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని మున్సిపల్ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తిచేసి, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు వివిధ అంశాలను బేరీజు వేస్తే ఎంత త్వరగా చేసినా మే ఆఖరు వరకు సమయం పడుతుంది.
కొత్త కార్పొరేషన్లలో సమస్యలు
మరోవైపు.. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీఎం) బాలారిష్టాల్లో ఉన్నాయి. ఇంకా వాటి కార్యాలయాల పనులు, సిబ్బంది నియామకాలే పూర్తికాలేదు. చేయాల్సిన మౌలిక సదుపాయాల పనులు చాలా ఉన్నాయి. కొత్త కార్పొరేషన్లు జీతాలకు సైతం ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ నిధులపైనే ఆధారపడ్డాయి. ఎన్నికలు ఆలస్యమయ్యేకొద్దీ, ప్రజలు ఆశించిన సదుపాయాలు అందుబాటులోకి రాక, వ్యతిరేకత పెరిగేందుకు అవకాశముంటుంది. త్వరితంగా ఎన్నికలు జరిగితే కనీసం చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక.. బహుశా జూన్‌లో నగరంలోని మూడు బల్దియాలకు సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. జూన్ రెండో వారం వరకు పాఠశాలలకు సెలవులుంటాయి. సాధ్యమైనంత వరకు ఆలోగా ఎన్నికలకు వెళ్లే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.


