వాషింగ్టన్: అణ్వాయుధ కార్యక్రమాలు నిలిపివేసేలా ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచాలని అమెరికా నిర్ణయించింది. ఇందుకోసం భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. ఒకవైపు ఇరాన్‌తో చర్చలు జరుగుతుండగానే, మరోవైపు బలప్రయోగంతో ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడానికి పావులు కదుపుతోంది.
భారీ విమాన వాహక నౌక ‘యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలను మధ్య ప్రాచ్యానికి తరలిస్తోంది. ఇప్పటికే ‘యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్’ నౌకను అరేబియా సముద్రంలో మోహరించింది. ‘యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమానాల వాహక నౌకగా పేరుగాంచింది. వెనెజులాలో గత నెలలో జరిగిన అమెరికా సైనిక ఆపరేషన్‌లో పాలుపంచుకుంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదూరోను అమెరికా సైన్యం నిర్బంధించిన సంగతి తెలిసిందే.
ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడి?
ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వాటిని తక్షణమే నిలిపివేయాలని, ఈ విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని పట్టుబడుతోంది. తమ వద్ద అణ్వాయుధాలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ అమెరికా విశ్వసించడం లేదు. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏ క్షణమైనా దాడికి దిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య యుద్ధం మొదలైతే మధ్యప్రాచ్యంలో భారీ సంక్షోభం తప్పదని చెబుతున్నాయి.


