నెదర్లాండ్స్‌పై 93 పరుగుల తేడాతో అమెరికా జయభేరి
చెన్నై: దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా ఎట్టకేలకు నెదర్లాండ్స్‌పై గెలిచి ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మోనాంక్ పటేల్ సారథ్యంలోని అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన డచ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీస్కోరు చేసింది.
ఓపెనర్లు మోనాంక్ (22 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), జహాంగీర్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో అవుటయ్యారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ సాయితేజ ముక్కామల (51 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్ రంజనే (24 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. బాస్ డి లీడె 3 వికెట్లు తీశాడు.
అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 15.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. బాస్ డి లీడె (23), కెపె్టన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (20)లు మాత్రమే రెండు పదుల స్కోరు చేయగలిగారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మీత్ సింగ్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, వాన్ షాల్‌విక్ 3 వికెట్లు, మోసిన్ 2 వికెట్లు తీశారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో అమెరికా తలపడుతుంది.


