2026 టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్‌లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్‌కీపర్-బ్యాటర్ బ్రెండన్ టేలర్ హామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్‌లో (ఒమన్) టేలర్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతను మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
బ్యాటింగ్ సమయంలో టేలర్ కుడి కాలి హామ్‌స్ట్రింగ్‌తో ఇబ్బంది పడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలుత గాయం చిన్నదే అనుకున్నా, వైద్య పరీక్షల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తేలింది. దీంతో టేలర్ మెగా టోర్నీలో కొనసాగలేడని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టేలర్ స్థానాన్ని బెన్ కర్రన్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.
చరిత్రాత్మక ఆటగాడు
టేలర్‌కు ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ లేని ఓ ప్రత్యేకత ఉంది. అతను 0మొదటి టీ20 ప్రపంచకప్ (2007), ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఆడిన ఏకైక ఆటగాడు. 40 ఏళ్ల వయసులోనూ టేలర్ జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆయన లేని లోటు జింబాబ్వేకు ఎదురుదెబ్బ అవుతుంది.
కాగా, ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4), బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్‌షా (65), మ్యాక్స్‌వెల్ (31) విఫలయత్నం చేశారు.


