ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 అవకాశాలను ఐరిష్ టీమ్ సంక్లిష్టం చేసుకుంది.
ఇలాంటి తరుణంలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ శుక్రవారం వెల్లడించింది.
కాగా టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్‌లతో కలిసి గ్రూప్-బి నుంచి ఐర్లాండ్ పోటీలో దిగింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిన స్టిర్లింగ్ బృందం.. రెండో పోరులో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
గాయపడిన కెప్టెన్
కొలంబోలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగానే కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ గాయపడ్డాడు. అతడి కుడి మోకాలికి గాయమైంది. స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి పంపగా గాయం తీవ్రంగా ఉందని తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.
యువ బ్యాటర్ ఎంట్రీ
ఇక పాల్ స్టిర్లింగ్ స్థానంలో 20 ఏళ్ల బ్యాటర్ సామ్ టాపింగ్ (Sam Topping) ఐర్లాండ్ ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. స్టిర్లింగ్ స్వదేశానికి పయనం కాగా.. సామ్ భారత్‌కు చేరుకోనున్నాడు. కాగా ఐర్లాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ పోరుకు కొలంబో వేదిక.
ఇదిలా ఉంటే.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే చెరో రెండు విజయాలతో టాప్-2లో ఉన్నాయి. జింబాబ్వే చేతిలో ఆసీస్ తాజా ఓటమి ఆ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఐర్లాండ్ జట్టు (అప్‌డేటెడ్)
మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, సామ్ టాపింగ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.
చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్‌పై భజ్జీ ఆగ్రహం


