‘బంగ్లా​’లో తారిఖ్‌ ప్రభుత్వం.. పాక్‌లో ఏం జరగనుంది? | Tarique Rahman Bangladesh PM Good or bad news for Pakistan | Sakshi
Sakshi News home page

‘బంగ్లా​’లో తారిఖ్‌ ప్రభుత్వం.. పాక్‌లో ఏం జరగనుంది?

Feb 13 2026 1:15 PM | Updated on Feb 13 2026 1:33 PM

Tarique Rahman Bangladesh PM Good or bad news for Pakistan

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత, ఆ దేశ రాజకీయాలు అనూహ్య మలుపులు  తిరిగాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్‌ రెహ్మాన్‌  ఎన్నికల్లో విజయం సాధించి, తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ పరిణామం కేవలం బంగ్లాదేశ్‌లోనే కాకుండా దక్షిణాసియా రాజకీయాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలలో సరికొత్త చర్చకు దారితీసింది.

బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్‌ రెహ్మాన్‌ బాధ్యతలు చేపట్టాక అది పాకిస్తాన్‌కు సానుకూల అంశంగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అవామీ లీగ్ హయాంలో షేక్ హసీనా ప్రభుత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ, పాకిస్తాన్‌కు దూరం పాటిస్తూ వచ్చింది. అయితే బీఎన్‌పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపడతాయని ఇస్లామాబాద్ ఆశిస్తోంది. చారిత్రక నేపథ్యం, గత అనుభవాల దృష్ట్యా తారిఖ్‌ రెహ్మాన్‌నాయకత్వం తమకు వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తుందని పాక్ అంచనా వేస్తోంది.

తారిఖ్‌ రెహ్మాన్‌ గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారత్‌పై వ్యతిరేక ధోరణిని ప్రదర్శించారనే  ఆరోపణలు ఉన్నాయి. ఆయన హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాద గ్రూపులకు మద్దతు లభించిందనే మాట కూడా వినిపించింది. ఇప్పుడు ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య, భద్రతా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే తరుణంలో పాకిస్తాన్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌ను తన వైపు తిప్పుకోవడం ద్వారా భారత్‌ను దౌత్యపరంగా ఇబ్బందులకు గురిచేయవచ్చని పాక్ యోచిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రధానమంత్రిగా అయ్యాక పాకిస్తాన్‌, చైనాల ప్రభావం బంగ్లాదేశ్‌పై పెరుగుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరత నేపథ్యంలో తారిఖ్‌ రెహ్మాన్‌ ఏ దేశానికి ప్రాధాన్యత ఇస్తారు? పాకిస్థాన్‌తో ఎంతవరకు సన్నిహితంగా ఉంటారనేది వేచి చూడాల్సిందే. 

ఇది కూడా చదవండి: మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ

Advertisement
 
Advertisement
Advertisement